188. నూట ఎనుబది ఎనిమిదవ అధ్యాయము
అంబ స్త్రీగా పుట్టి శిఖండి పేరుతో కుమారునిగా పెరుగుట.
దుర్యోధన ఉవాచ
కథం శిఖండీ గాంగేయ కన్యా భూత్వా పురా తదా।
పురుషోఽభూద్ యుథిశ్రేష్ఠ తన్మే బ్రూహి పితామహ॥ 1
దుర్యోధనుడు అడుగుతున్నాడు. "సమరశ్రేష్ఠుడవైన పితామహా! గాంగేయా! శిఖండి మొదట కన్యగా ఉండి, తరువాత పురుషుడుగా ఎలా మారాడు? నాకు చెప్పు. (1)
భీష్మ ఉవాచ
భార్యా తు తస్య రాజేంద్ర ద్రుపదస్య మహీపతేః।
మహిషీ దయితా హ్యాసీత్ అపుత్రా చ విశాంపతే॥ 2
భీష్ముడు చెప్తున్నాడు - రాజా! ద్రుపద మహారాజునకు ప్రియభార్య అయిన పట్టమహిషికి పుత్రులు లేరు. (2)
ఏతస్మిన్నేవ కాలే తు ద్రుపదో వై మహీపతిః।
అపత్యార్థే మహారాజ తోషయామాస శంకరమ్॥ 3
మహారాజా! ఇదే సమయంలో ద్రుపదమహారాజు సంతానం కోసం శంకరుని సంతోష పరిచాడు. (3)
అస్మద్వధార్థం నిశ్చిత్య తపో ఘోరం సమాస్థితః।
ఋతే కన్యాం మహాదేవ పుత్రో మే స్యాదితి బ్రువన్॥ 4
భగవన్ పుత్రమిచ్ఛామి భీష్మం ప్రతిచికీర్షయా।
ఇత్యుక్తో దేవదేవేన స్త్రీపుమాంస్తే భవిష్యతి॥ 5
నివర్తస్వ మహీపాల నైతజ్జాత్వన్యథాభవేత్।
నన్ను చంపాలని నిశ్చయించుకొని, "మహాదేవా! కన్యకాక పుత్రుడే నాకు కావాలి" అంటూ ఘోరమైన తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన అతనితో "భగవాన్! భీష్మునిపై ప్రతీకారం తీర్చుకోవడానికి పుత్రుని కోరుకొంటున్నాను" అన్నాడు. అంత దేవదేవుడు "మహీపాలా! నీకు మొదట స్త్రీ పుట్టి తరువాత పురుషునిగా మారుతుంది. వెళ్లు. ఇది తప్పక జరుగుతుంది. అన్యథా కానేరదు." (4,5 1/2)
స తు గత్వా చ నగరం భార్యామిదమువాచ హ॥ 6
కృతో యత్నో మహాదేవః తపసాఽఽరాధితో మయా।
కన్యా భూత్వా పుమాన్ భావీ ఇతి చోక్తోఽస్మి శంభునా॥ 7
పునః పునర్వాచ్యమానః దిష్టమిత్యబ్రవీచ్ఛివః।
న త దన్యచ్చ భవితా భవితవ్యం హి తత్ తథా॥ 8
అతడు నగరానికి వెళ్లి భార్యతో ఇదంతా చెప్పాడు. "నేను చాలా ప్రయత్నించి మహాదేవుని ఆరాధించాను. శంభుడు "కన్య పుట్టి తదనంతరం పురుషుడవుతాడ"ని చెప్పాడు. నేను పదే పదే యాచించినప్పటికి" ఇదే ఇచ్చాను అది మరోలా జరుగదు. భవితవ్యం అలా ఉంది" అన్నాడు.(6-8)
తతః సా నియతా భూత్వా ఋతుకాలే మనస్వినీ।
పత్నీ ద్రుపదరాజస్య ద్రుపదం ప్రవివేశ హ॥ 9
లేభే గర్భం యథాకాలం విధిదృష్టేన కర్మణా।
పార్షతస్య మహీపాల యథా మాం నారదోఽబ్రవీత్॥ 10
తతో దధార సా దేవీ గర్భం రాజీవలోచనా।
అంతట మనస్విని అయిన ద్రుపదమహారాజు భార్య నియమవతియై ఋతుకాలంలో ద్రుపదుని కలిసింది. శాస్త్రోక్తమైన కర్మ చేయడం ద్వారా ద్రుపదుని భార్య గర్భం దాల్చింది. రాజా! నారదుడు నాకు చెప్పిన రీతిగానే విధ్యుక్త శుభకర్మలతో ఆమె యథాకాలంగా గర్భం మోసింది. (9,10 1/2)
తాం స రాజా ప్రియాం భార్యాం ద్రుపదః కురునందన॥ 11
పుత్రస్నేహాన్మహాబాహుః సుఖం పర్యచరత్ తదా।
సర్వానభిప్రాయకృతాన్ భార్యాలభత కౌరవ॥ 12
కురునందనా! మహాబాహువైన ద్రుపదుడు పుత్రుని మీది మమకారంతో ప్రియభార్య అయిన ఆమెకు సుఖంగా ఉండేలా పరిచరించాడు. కౌరవా! ఆమె కోరిన కోరికలన్నీ తీర్చాడు. (11,12)
అపుత్రస్య సతో రాజ్ఞః ద్రుపదస్య మహీపతేః।
యథాకాలం తు సా దేవీ మహిషీ ద్రుపదస్య హ॥ 13
కన్యాం ప్రవరరూపాం తు ప్రాజాయత నరాధిప।
నరాధిపా! అపుత్రకుడైన ద్రుపదమహారాజునకు యథాకాలంలో అతని పట్టమహిషి చక్కని రూపం కల కన్యను ప్రసవించింది. (13 1/2)
అపుత్రస్య తు రాజ్ఞః సా ద్రుపదస్య మనస్వినీ॥ 14
ఖ్యాపయామాస రాజేంద్ర పుత్రో హ్యేష మమేతి వై।
రాజేంద్రా! అపుత్రకుడైన ద్రుపద మహారాజు యొక్క మనస్విని అయిన భార్య "వీడు నా కొడుకు" అని చాటింది. (14 1/2)
తతః స రాజా ద్రుపదః ప్రచ్ఛన్నాయా నరాధిప॥ 15
పుత్రవత్ పుత్రకార్యాణి సర్వాణి సమకారయత్।
రక్షణం చైవ మంత్రస్య మహిషీ ద్రుపదస్య సా।
చకార సర్వయత్నేన బ్రువాణా పుత్ర ఇత్యుత।
న చ తాం వేద నగరే కశ్చిదన్యత్ర పార్షతాత్॥ 17
నరాధిపా! తరువాత ఆ రాజు ద్రుపదుడు రహస్యం దాచిపెట్టి ఆ కన్యకు పుత్రునిలాగే పుత్రకార్యాలన్నీ జరిపించాడు. ఆ ద్రుపదుని పట్టమహిషికూడా పుత్రుడే అని చెప్తూ రహస్యాన్ని రక్షించడానికి సమస్త ప్రయత్నాలూ చేసింది. ద్రుపదునికి తప్పించి ఈ విషయం నగరంలో ఎవరికీ తెలియదు. (15 17)
శ్రద్దధానో హి తద్వాక్యం దేవస్యాచ్యుతతేజసః।
ఛాదయామాస తాం కన్యాం పుమానితి చ సో బ్రవీత్॥ 18
అక్షీణమైన తేజస్సుగల దేవదేవుని ఆ వాక్యం పట్ల నమ్మకం కలిగి ఆ కన్యను పురుషునిగానే చెప్తూ అతడు దాచిపెట్టాడు. (18)
జాతకర్మాణి సర్వాణి కారయామాస పార్థివః।
పుంవద్విధాన యుక్తాని శిఖండీతి చ తాం విదుః॥ 19
ఆమెకు జాతకర్మలన్నీ పురుషునికి చేయదగినట్లే ఆ రాజు చేయించాడు. ఆమె శిఖండిగా అందరికీ తెలిసింది. (19)
అహమేకస్తు చారేణ వచనాన్నారదస్య చ।
జ్ఞాతవాన్ దేవవాక్యేన అంబాయాస్తపసా తథా॥ 20
నేను చారుని ద్వారా, నారదుని మాటల వలన దేవవాక్యం వలన అలాగే అంబ యొక్క తపస్సు వలన ఈ విషయం (శిఖండి కన్యగా పుట్టిందనే విషయం) తెలుసుకున్నాను. (20)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి శిఖండ్యుత్పత్తౌ అష్టాశీత్యధికశతతమోఽధ్యాయః॥ 188 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున అంబోపాఖ్యాన పర్వమను ఉపపర్వమున శిఖండి పుట్టుట అను నూట ఎనుబది ఎనిమిదవ అధ్యాయము. (188)