187. నూట ఎనుబది యేడవ అధ్యాయము

అంబ మహాదేవుని వరము పొంది, చితాగ్నిలో ప్రవేశించుట.

భీష్మ ఉవాచ
తతస్తే తాపసా స్సర్వే తపసే ధృతనిశ్చయామ్।
దృష్ట్వా న్యవర్తయంస్తాత కిం కార్యమితి చాబ్రువన్॥ 1
భీష్ముడు చెప్తున్నాడు - అప్పుడు ఆ జన్మలో కూడా తపస్సు చేయాలనే దృఢనిశ్చయం కల ఆమెను చూచి తపస్వి జనులందరూ ఆమెను వారించారు. "నీవు ఏం చేయాలనుకుంటున్నావు" అని అడిగారు. (1)
వి॥సం॥ 'తపసే ధృతనిశ్చయామ్' తపస్సు చేయాలనే దృడనిశ్చయం పూర్వజన్మస్మరణ వలన కలిగినది.(సర్వ)
తానువాచ తతః కన్యా తపోవృద్ధానృషీంస్తదా।
నిరాకృతాస్మి భీష్మేణ భ్రంశితా పతిధర్మతః॥ 2
అంతట ఆ కన్య తపోవృద్ధులైన ఆ ఋషులతో అప్పుడిలా అంది. "భీష్ముని చేత తిరస్కరించబడి, పతిధర్మం నుండి తొలగింపబడ్డాను(పతి లేనిదాననయ్యాను). (2)
వధార్థం తస్య దీక్షా మే న లోకార్థం తపోధనాః।
నిహత్య భీష్మం గచ్ఛేయం శాంతిమిత్యేవ నిశ్చయః॥ 3
తపోధనులారా! అతనిని వధించడానికే ఈ దీక్ష గాని లోకం కోసం కాదు. భీష్ముడిని చంపితేనే శాంతి కలుగుతుంది అని నా నిశ్చయం. (3)
యతృతే దుఃఖవసతిమ్ ఇమాం ప్రాప్తాస్మి శాశ్వతీమ్।
పతిలోకాద్ విహీనా చ నైవ స్త్రీ న పుమానిహ॥ 4
నాహత్వా యుధి గాంగేయం నివర్తిష్యే తపోధనాః।
ఏష మే హృషి సంకల్పః యదిదం కథితం మయా॥ 5
తపస్వులారా! ఎవరి కారణంగా నేను శాశ్వతంగా ఇలాంటి కష్టస్థితిని పొందానో, పతిలోకం లేనిదానవై అటు స్త్రీని కాకుండా, పురుషుడినీ కాకుండా అయ్యానో ఆ భీష్ముడిని యుద్ధంలో చంపకుండా వెనక్కి తిరగను. ఇది నా హృదయంలో పుట్టిన సంకల్పం. అదే మీకు నేను చెప్పాను. (4,5)
స్త్రీభావే పరినిర్విణ్ణా పుంస్త్వార్థే కృతనిశ్చయా।
భీష్మే ప్రతిచికీర్షామి నాస్మి వార్యేతి వై పునః॥ 6
స్త్రీత్వంపై విరక్తి కలిగింది. పుంస్త్వం పొందాలని కృత నిశ్చయంతో ఉన్నాను. భీష్మునిపై పగ తీర్చుకుంటాను. మీరు నన్ను వారించలేరు. (6)
వి॥సం॥ 'నాస్మి వార్యా' - నివారించడానికి నేను యోగ్యురాలను కాను. (లక్షా)
తాం దేవో దర్శమాయాస శూలపాణిరుమాపతిః।
మధ్యే తేషాం మహర్షీణాం స్వేన రూపేణ తాపసీమ్॥ 7
ఆ మహర్షులమధ్యనుండి శూలపాణి, ఉమాపతి అయిన శంకరుడు స్వస్వరూపంతో తపస్వి అయిన ఆమెకు ప్రత్యక్షం అయ్యాడు. (7)
ఛంద్యమానా వరేణాథ సా వవ్రే మత్పరాజయమ్।
హనిష్యసీతి తాం దేవః ప్రత్యువాచ మనస్వినీమ్॥ 8
వరం కోరుకోమని అడిగిన పిమ్మట ఆమె నా పరాజయాన్ని కోరుకొంది. శంకరుడు ఆ మనస్వినితో "భీష్ముని చంపగలవు" అని పలికాడు. (8)
తతః సా పునరేవాథ కన్యా రుద్రమువాచ హ।
ఉపపద్యేత కథం దేవ స్త్రియా యుధి జయో మమ॥ 9
అప్పుడామె తిరిగి రుద్రుని ఇలా అడిగింది. "దేవా! స్త్రీనైన నాకు యుద్ధంలో జయం ఎలా సమకూడుతుంది. (9)
స్త్రీభావేన చ మే గాఢం మనః శాంతముమాపతే।
ప్రతిశ్రుతశ్చ భూతేశ త్వయా భీష్మపరాజయః॥ 10
ఉమాపతీ! భూతేశా! స్త్రీభావంతో నా మనసు, గాఢమైన శాంతత్వాన్ని పొంది ఉంది. నీవు భీష్మ పరాజయాన్ని వాగ్దానం చేశావు. (10)
వి॥సం॥ శాంతం - శౌర్య ధర్మ రహితమని అర్థం.(శౌర్యగుణం లేనిది) (నీల0
యథా స సత్యో భవతి తథా కురు వృషధ్వజ।
యథా హన్యాం సమాగమ్య భీష్మం శాంతనవం యుధి॥ 11
వృషధ్వజా! ఈ వరం నిజం అయ్యేలా చెయ్యి. శంతనుని కుమారుడైన భీష్ముడిని యుద్ధంలో ఎదుర్కొని చంపగలిగేలా చెయ్యి. (11)
తామువాచ మహాదేవః కన్యాం కిల వృషధ్వజః।
న మే వాగవృతం ప్రాహ సత్యం భద్రే భవిష్యతి॥ 12
వృషధ్వజుడైన మహాదేవుడు ఆ కన్యతో ఇలా అన్నాడు. నా మాట ఎప్పుడూ పొల్లుపోదు. నిజంగానే జరుగుతుంది. (12)
హనిష్యసి రణే భీష్మం పురుషత్వం చ లప్స్యసే।
స్మరిష్యసి చ తత్ సర్వం దేహమన్యం గతా సతీ॥ 13
యుద్ధంలో భీష్ముని చంపుతావు. అందుకోసం పురుషత్వాన్ని కూడా పొందుతావు. దేహాంతరం పొందినప్పటికీ(మరుచటి జన్మలో కూడా) జరిగినదంతా స్మరించగలుగుతావు. (13)
ద్రుపదస్య కులే జాతా భవిష్యసి మహారథః।
శీఘ్రాస్త్రశ్చిత్రయోధీ చ భవిష్యసి సుసమ్మతః॥ 14
ద్రుపదుని వంశంలో పుట్టి మహారథుడవు అవుతావు. శీఘ్రంగా అస్త్రాలు ప్రయోగిస్తూ అందరి మెప్పు పొంది చిత్రమైన యుద్ధం చేసేవాడవు అవుతావు. (14)
యథోక్తమేవ కల్యాణి సర్వమేతత్ భవిష్యతి।
భవిష్యసి పుమాన్ పశ్చాత్ కస్మాచ్చిత్కాలపర్యయాత్॥ 15
కల్యాణీ! అంతా చెప్పినట్లుగానే జరుగుతుంది. (ముందు కన్యగానే పుట్టినా) తరువాత కొంతకాలం గడిచాక పురుషుడవు అవుతావు. (15)
ఏవముక్త్వా మహాదేవః కపర్దీ వృషభధ్వజః।
పశ్యతామేవ విప్రాణాం తత్రైవాంతరధీయత॥ 16
జటాజూటధారి వృషధ్వజుడు అయిన ఆ మహా దేవుడు ఇలా చెప్పి, ఆ విప్రులందరూ చూస్తుండగానే అక్కడే అంతర్థానమయ్యాడు. (16)
తతః సా పశ్యతాం తేషాం మహర్షీణామనిందితా।
సమాహృత్య వనాత్ తస్మాత్ కాష్ఠాని వరవర్ణినీ॥ 17
చితాం కృత్వా సుమహతీం ప్రదాయ చ హుతాశనమ్।
ప్రదీప్తేఽగ్నౌ మహారాజ రోషదీప్తేన చేతసా॥ 18
ఉక్త్వా భీష్మవధాయేతి ప్రవివేశ హుతాశనమ్
జ్యేష్ఠా కాశిసుతా రాజన్ యమునామభీతో నదీమ్॥ 19
మహారాజా! అనిందితురాలయిన ఆ అంబ ఆ మహర్షులు అందరూ చూస్తూండగా ఆ వనం నుండి కట్టెలు తీసికొనివచ్చి గొప్ప చితిని పేర్చి అగ్నిని రగుల్కొల్పింది. యమునాద్వీపంలో ప్రజ్వరిల్లుతున్న ఆ అగ్నిలో రోషపూరితమైన మనస్సుతో ఆ కాశీరాజు పెద్దకూతురు "భీష్మవధకోసం" అని అంటూ అగ్నిప్రవేశం చేసింది. (17-19)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి అంబాహుతాశన ప్రవేశే సప్తాశీత్యధికశతతమోఽధ్యాయః॥ 187 ॥
శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున అంబోపాఖ్యాన పర్వమను ఉపపర్వమున అంబ అగ్నిప్రవేశము అను నూట ఎనుబది ఏడవ అధ్యాయము. (187)