186. నూట ఎనుబది ఆరవ అధ్యాయము
అంబ కఠోరతపము చేయుట.
రామ ఉవాచ
ప్రత్యక్షమేతల్లోకానాం సర్వేషామేవ భామిని।
యథాశక్త్యా మయా యుద్ధం కృతం వై పౌరుషం పరమ్॥ 1
పరశురాముడు అంటున్నాడు - సుందరీ! నేను నా శక్తి కొద్ది యుద్ధం చేశానని, గొప్ప పౌరుషం చూపించాననే విషయం లోకులందరూ ప్రత్యక్షంగా గమనించారు. (1)
న చైవమపి శక్నోమి భీష్మం శస్త్రభృతాం వరమ్।
విశేషయితుమత్యర్థమ్ ఉత్తమాస్త్రాణి దర్శయన్॥ 2
ఉత్తమమైన అస్త్రాలను ఎక్కువగా ప్రయోగించినప్పటికి ఆయుధధారులలో శ్రేష్ఠుడైన భీష్ముని మించడానికి నేను సమర్థుడిని కాలేదు. (2)
ఏషా మే పరమా శక్తిః ఏతన్మే పరమం బలమ్।
యథేష్టం గమ్యతాం భద్రే కిమన్యద్ వా కరోమి తే॥ 3
అమ్మాయీ! నా శక్తీ, బలమూ, ఇంత మాత్రమే. నీవు నీ ఇష్టమైన చోటికి వెళ్లవచ్చు. నీ కోసం ఇంక ఏమి చేయమంటావు? (3)
భీష్మమేవ ప్రపద్యస్వ న తేఽన్యా విద్యతే గతిః।
నిర్జితోహ్యస్మి భీష్మేణ మహాస్త్రాణి ప్రముంచతా॥ 4
ఇక భీష్ముడినే శరణు పొందు. ఇక నీవు వేరే గతిలేదు. మహాస్త్రాలు ప్రయోగించి భీష్ముడు నన్ను జయించాడు. (4)
ఏవముక్త్వా తతో రామః వినిఃశ్వస్య మహామనాః।
తూష్ణీమాసీత్ తతః కన్యా ప్రోవాచ భృగునందనమ్॥ 5
గొప్ప మనసు కల ఆ రాముడు ఇలా చెప్పి దీర్ఘంగా నిట్టూర్చి ఊరకుండిపోయాడు. అప్పుడు ఆ కాశిరాజు కన్య భృగునందనునితో ఇలా అంది. (5)
భగవన్నేవమేవైతత్ యథాహ భగవాంస్తథా।
అజేయో యుధి భీష్మోఽయం అపి దేవైరుదారధీః॥ 6
భగవన్! మీరు చెప్పినట్లుగానే ఇదంతా ఇంతే. ఉదారబుద్ధి అయిన భీష్ముని యుద్ధంలో దేవతలు కూడా జయించలేరు. (6)
యథాశక్తి యథోత్సాహం మమ కార్యం కృతం త్వయా।
అనివార్యం రణే వీర్యమ్ అస్త్రాణి వివిధాని చ॥ 7
మీ శక్తిని అనుసరించి ఉత్సాహం ఉన్నంతవరకు మీరు నా కార్యాన్ని నిర్వర్తించారు. యుద్ధంలో అనివార్యమైన పరాక్రమాన్ని ప్రదర్శించారు. వివిధ అస్త్రాలను ప్రయోగించారు. (7)
న చైవ శక్యతే యుద్ధే విశేషయితుమంతతః।
న చాహమేనం యాస్యామి పునర్భీష్మం కథంచన॥ 8
అయినా చివరికి వచ్చేసరికి యుద్ధంలో భీష్ముని మించిపోవడానికి మీకు శక్తి చాలలేదు. నేను తిరిగి ఎలాగూ (ఎట్టి పరిస్థితులలోను) ఈ భీష్ముని వద్దకు వెళ్లను. (8)
గమిష్యామి తు తత్రాహం యత్ర భీష్మం తపోధన।
సమరే పాతయిష్యామి స్వయమేవ భృగూద్వహ॥ 9
భృగువంశ శ్రేష్ఠా! తపోధనా! స్వయంగా నేను యుద్ధంలో భీష్ముని పడగొట్టగలిగే స్థాయికి చేరే చోటికే వెళ్తాను. (9)
ఏవముక్త్వా యయౌ కన్యా రోషవ్యాకులలోచనా।
తాపస్యే ధృతసంకల్పా సా మే చింతయతీ వధమ్॥ 10
ఇలా అని ఆ కన్య అంబ రోషం నిండిన కళ్లతో వధించడం గూర్చే ఆలోచిస్తూ తపస్సు చేయాలనే స్థిరసంకల్పంతో అక్కడి నుండి బయలుదేరింది. (10)
తతో మహేంద్రం సహ తైః మునిభిర్భృగుసత్తమః।
యథాఽఽగతం తథా సోఽగాత్ మాముపామంత్ర్య భారత॥ 11
భారతా! పిమ్మట పరశురాముడు ఆ మునులందరితో కలిసి నన్ను వీడ్కొని ఎలా వచ్చాడో అలాగే మహేంద్ర పర్వతానికి వెళ్లిపోయాడు. (11)
తతో రథం సమారుహ్య స్తూయమానో ద్విజాతిభిః।
ప్రవిశ్య నగరం మాత్రే సత్యవత్యై న్యవేదయమ్॥ 12
యథావృత్తం మహారాజ సా చ మాం ప్రత్యనందత।
పురుషాంశ్చాదిశం ప్రాజ్ఞాన్ కన్యావృత్తాంతకర్మణి॥ 13
నేను కూడా రథం ఎక్కి బ్రాహ్మణులంతా కీర్తిస్తూ ఉండగా నగరాన్ని ప్రవేశించి తల్లి సత్యవతికి జరిగిన విషయమంతా నివేదించాను. మహారాజా! ఆమె కూడా నన్ను అభినందించింది. అంబ వృత్తాంతాన్ని తెలిసికొనే పనికి ప్రాజ్ఞాలను నియోగించాను. (12,13)
దివసే దివసే హ్యస్యాః గతిజల్పితచేష్టితమ్।
ప్రత్యాహరంశ్చ మే యుక్తాః స్థితాః ప్రియహితే సదా॥ 14
ఎల్లప్పుడూ నాకు ఇష్టులుగా, హితులుగా ఉంటూ వారు ప్రతిదినం ఆమె ఎక్కడకు వెళ్తోందో, ఏమి మాట్లాడుతోందో, ఏమి చేస్తోందో వచ్చి నాకు తెలుపసాగారు. (14)
యదైవ హి వనం ప్రాయాత్ సా కన్యా తపసే ధృతా।
తదైవ వ్యథితో దీనో గతచేతా ఇవాభవమ్॥ 15
ఆ అంబ తపస్సు చేయడానికి నిశ్చయించుకొని వనానికి వెళ్లిన రోజే నేను దీనుడిలా వ్యథితుడిలా చైతన్యం లేనివాడిలా అయిపోయాను. (15)
న హి మాం క్షత్రియః కశ్చిత్ వీర్యేణ వ్యజయద్ యుధి।
ఋతే బ్రహ్మవిదస్తాత తపసా సంశితవ్రతాత్॥ 16
నాయనా! తపస్సు చేత, నియమ వ్రతాలు పాటించే బ్రహ్మవేత్త అయిన పరశురాముడు తప్ప వేరే ఏ క్షత్రియుడూ యుద్ధంలో పరాక్రమంతో నన్ను జయించలేదు. (16)
అపి చైతన్మయా రాజన్ నారదేఽపి నివేదితమ్।
వ్యాసే చైవ తథా కార్యం తౌ చోభౌ మామవోచతామ్॥ 17
న విషాదస్త్వయా కార్యః భీష్మ కాశిసుతాం ప్రతి।
దైవం పురుషకారేణ కో నివర్తితుముత్సహేత్॥ 18
రాజా! ఈ సంగతిని నేను నారదమహర్షికి, వ్యాసునికి కూడా నివేదించాను. వారిద్దరూ నాతో "భీష్మా! కాశీరాజు కూతురి విషయమై నీవు ఏమీ విషాద పడనక్కరలేదు. విధి నిర్ణయాన్ని పురుష ప్రయత్నంతో మరల్చడానికి ఎవరు ఉత్సహిస్తారు?" అన్నారు. (17,18)
సా కన్యా తు మహారాజ ప్రవిశ్యాశ్రమమండలమ్।
యమునాతీరమాశ్రిత్య తపస్తేపేఽతిమానుషమ్॥ 19
మహారాజా! ఆ అంబ ఆశ్రమభూములను చేరుకొని, యమునా తీరంలో ఉండి అతిమానుషమైన తపస్సు చేయసాగింది. (19)
నిరాహారా కృశా రుక్షా జటిలా మలపంకినీ।
షణ్మాసాన్ వాయుభక్షా చ స్థాణుభూతా తపోధనా॥ 20
ఆమె ఆహారం మానివేసి కృశించిపోయింది. ఎండిపోయింది. జుట్టు జడలు కట్టింది. శరీరం మాలిన్యంతో నిండిపోయింది. ఆ తపస్విని ఆరునెలల పాటు వాయుభక్షణ చేసింది. కట్టెలా మారింది. (20)
యమునాజలమాశ్రిత్య సంవత్సరమథాపరమ్।
ఉదవాసం నిరాహారా పారయామాస భావినీ॥ 21
ఆ శుభాంగి ఆ తరువాత ఏడాదిపాటు యమునానదీ జల మధ్యంలో నిరాహారంగా కాలం గడిపింది. (21)
శీర్ణపర్ణేన చైకేన పారయామాస సా పరమ్।
సంవత్సరం తీవ్రకోపా పాదాంగుష్ఠాగ్రధిష్ఠితా॥ 22
తీవ్రకోపం కలిగిన ఆమె ఆపై సంవత్సరం పాటు కాలిబొటన వేలిపై నిలబడి తపస్సు చేస్తూ రాలిన ఆకులతోనే గడిపింది. (22)
ఏవం ద్వాదశవర్షాణి తాపయామాస రోదసీ।
నివర్త్యమానాపి చ సా జ్ఞాతిభిర్నైవ శక్యతే॥ 23
ఇలా పన్నెండేళ్లపాటు భూమ్యాకాశాల నడిమిభాగాన్నం తటినీ తపింపచేసింది. బంధువులు నచ్చచెప్పినా ఆమెను మరలించడం వారికి శక్యం కాలేదు. (23)
తతోఽగమద్ వత్సభూమిం సిద్ధచారణసేవితామ్।
ఆశ్రమం పుణ్యశీలానాం తాపసానాం మహాత్మనామ్॥ 24
తత్ర పుణ్యేషు తీర్థేషు సాఽప్లుతాంగీ దివానిశమ్।
వ్యచరత్ కాశికన్యా సా యథాకామవిచారిణీ॥ 25
తరువాత ఆమె సిద్ధులు, చారణులు సేవించే, పుణ్యాత్ములు మహాత్ములు అయిన తపస్వుల ఆశ్రమాలున్న వత్సదేశానికి చేరింది. అక్కడ పుణ్య తీర్థాల్లో స్నానమాచరిస్తూ రాత్రింబవళ్లు ఇచ్చవచ్చిన చోట తిరగసాగింది. (24,25)
నందాశ్రమే మహారాజ తథోలూకాశ్రమే శుభే।
చ్యవనస్యాశ్రమే చైవ బ్రహ్మణః స్థాన ఏవ చ॥ 26
ప్రయాగే దేవయజనే దేవారణ్యేషు చైవ హ।
భోగవత్యాం మహారాజ కౌశికస్యాశ్రమే తథా॥ 27
మాండవ్యస్యాశ్రమే రాజన్ దిలీపస్యాశ్రమే తథా।
రామహ్రదే చ కౌరవ్య పైలగర్గస్య చాశ్రమే॥ 28
ఏతేషు తీర్థేషు తదా కాశికన్యా విశాంపతే।
ఆప్లావయత గాత్రాణి వ్రతమాస్థాయ దుష్కరమ్॥ 29
మహారాజా! శుభంకరమైన నందాశ్రమం, ఉలూకశ్రమం, చ్యవనాశ్రమం, బ్రహ్మస్థానం, దేవతలు యజ్ఞం చేసిన ప్రయాగ, దేవారణ్యాలు, భోగవతి, కాశి కాశ్రమం, మాండవ్యుని ఆశ్రమం, దిలీపుని ఆశ్రమం, రామహ్రదం, పైలగర్గాశ్రమం - ఈ అన్ని తీర్థాలలో ఆ కాశీరాజకన్య కఠిన నియమాలతో స్నానం చేసింది. (26-29)
తామబ్రవీచ్చ కౌరవ్య మమ మాతా జలే స్థితా।
కిమర్థం క్లిశ్యసే భద్రే తథ్యమేవ వదస్వ మే॥ 30
కురువంశీయుడా! ఆ నీటిలో ఉన్న నా తల్లి గంగ ఆమెను "భద్రా! శరీరాన్ని ఎందుకిలా కృశింప చేసుకుంటున్నావు? నిజం చెప్పు నాకు" అని అడిగింది. (30)
సైనామథాబ్రవీద్ రాజన్ కృతాంజలిరనిందితా।
భీష్మేణ సమరే రామః నిర్జితశ్చారులోచనే॥ 31
కోఽన్యస్తముత్సహేజ్జేతుమ్ ఉద్యతేషుం మహీపతిః।
సాహం భీష్మవినాశాయ తపస్తప్స్యే సుదారుణమ్॥ 32
అంతట అనిందిత అయిన ఆమె అంజలి ఘటించి గంగతో ఇలా అంది. "చారులోచనా! పరశురాముడు యుద్ధంలో భీష్ముని చేతిలో ఓడిపోయాడు. బాణం ఎక్కుపెట్టి నిలిచిన అతనిని జయించడానికి ఏరాజు ఉత్సాహం చూపుతాడు? కనుక నేను భీష్ముని నాశనం చేయడానికి దారుణమైన తపస్సు చేస్తున్నాను. (31,32)
విచరామి మహీం దేవి యథా హన్యామహం నృపమ్।
ఏతద్ వ్రతఫలం దేవి పరమస్మిన్ యథా హి మే॥ 33
దేవీ! ఆ రాజును చంపటానికే భూమి మీది ఈ పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతున్నాను. భగవతీ! ఈ లోకంలో నా పరమమైన వ్రతఫలం ఇదే సుమా!" (33)
తతోఽబ్రవీత్ సాగరగా జిహ్మం చరసి భావిని।
నైష కామోఽనవద్యాంగి శక్యః ప్రాప్తుం త్వయాబలే॥ 34
అంతట సాగరగామిని అయిన గంగ ఇలా అంది. "భావిని! కుటిలంగా ప్రవర్తిస్తున్నావు. అబలా! ఈ కోరిక తీర్చుకోవడం నీకు శక్యం కాదు. (34)
యది భీష్మవినాశాయ కాశ్యే చరసి వై వ్రతమ్।
వ్రతస్థా చ శరీరం త్వం యది నామ విమోక్ష్యసి॥ 35
నదీ భవిష్యసి శుభే కుటిలా వార్షికోదకా।
దుస్తీర్థా న తు విజ్ఞేయా వార్షికీ నాష్టమాసికీ॥ 36
కాశీరాజ పుత్రీ! నీవు భీష్ముని వినాశం కోరుకునే ఈ వ్రతం ఆచరిస్తున్నట్లయితే, ఆ వ్రతంలో ఉండగానే నీవు శరీరం విడిచి ఒక నదిగా మారుతావు. అది కూడా వంకర టింకరగా ప్రవహించేది, కేవలం వర్షపునీటితో నిండేది, స్నానానికి దిగడానికి దుష్కరంగా ఉండేది అవుతుంది. వర్షాకాలపు నదిగా మాత్రమే నిన్ను గుర్తిస్తావు. మిగతా ఎనిమిది నెలలు ఎవరికీ నీ జాడ తెలియదు. (35,36)
భీమగ్రాహవతీ ఘోరా సర్వభూతభయంకరీ।
ఏవముక్త్వా తతో రాజన్ కాశికన్యాం న్యవర్తత॥ 37
మాతా మమ మహాభాగా స్మయమానేవ భావినీ।
కదాచిదష్టమే మాసి కదాచిద్ దశమే తథా।
న ప్రాశ్నీతోదకమపి పునః సా వరవర్ణినీ॥ 38
క్రూరమైన మొసళ్లతో ఘోరమై సర్వప్రాణులకూ భయంకరంగా ఉంటుంది. "రాజా! ఇలా కాశిరాజకన్యతో పలికి మహాభాగురాలు నా తల్లి గంగాదేవి చిరునవ్వు నవ్వుతూ మరలిపోయింది." తిరిగి ఆసుందరాంగి కొన్నిసార్లు ఎనిమిదినెలల వరకు కొన్నిసార్లు పదినెలల వరకు నీళ్లు కూడా త్రాగకుండా తపస్సు చేసింది. (37,38)
సా వత్సభూమిం కౌరవ్య తీర్థలోభాత్ తతస్తుతః।
పతితా పరిధావంతీ పునః కాశిపతేః సుతా॥ 39
కురువంశీయుడా! కాశీరాజు కూతురు మళ్లీ మళ్లీ తీర్థాలాడాలనే లోభంతో వత్సభూమిలో అటుఇటు తిరుగుతూ పడిపోయింది. (39)
సా నదీ వత్సభూమ్యాం తు ప్రథితాంబేది భారత।
వార్షికీ గ్రాహబహులా దుస్తీర్థా కుటిలా తథా॥ 40
భారతా! వత్సభూమిలో ఆ నది 'అంబ' అనే పేరుతో ప్రసిద్ధిపొందింది. అది వర్షాకాలంలో మాత్రమే ఉంటుంది.
మొసళ్లతో నిండి ఉండి, దిగడానికి కష్టంగా ఉంటుంది. మెలికలు తిరుగుతూ ప్రవహిస్తూ ఉంటుంది. (40)
సా కన్యా తపసా తేన దేహార్దేన వ్యజాయత।
నదీ చ రాజన్ వత్సేషు కన్యా చైవాభవత్ తదా॥ 41
రాజా! రాజకన్య అంబ తపోబలం చేత వత్సరాజ్యంలో అర్ధశరీరంతో నదిగా వెలసింది. అర్ధ శరీరంతో కన్యగా పుట్టింది. (41)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యాన పర్వణి అంబాతపస్యాయాం షడశీత్యధికశతతమోఽధ్యాయః॥ 186 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున అంబోపాఖ్యాన పర్వమను ఉపపర్వమున
అంబ తపస్సు చేయుట అను నూట ఎనుబది ఆరవ అధ్యాయము (186)