185. నూట యెనుబదిఅయిదవ అధ్యాయము
భీష్మపరశురాముల యుద్ధసమాప్తి.
భీష్మ ఉవాచ
తతో హలహలాశబ్దః దివి రాజన్ మహానభూత్।
ప్రస్వాపం భీష్మ మా స్రాక్షీః ఇతి కౌరవనందన॥ 1
భీష్ముడు చెప్తున్నాడు - కౌరవనందనా! రాజా! అప్పుడు ఆకాశంలో "భీష్మా! ప్రస్వాపనాస్త్రం ప్రయోగించకు" అంటూ గొప్ప కోలాహలం పుట్టింది. (1)
అయుంజమేవ చైవాహం తదస్త్రం భృగునందనే।
ప్రస్వాపం మాం ప్రయుంజానం నారదో వాక్యమబ్రవీత్॥ 2
అయినా ఆ అస్త్రాన్ని భార్గవరామునిపై ఎక్కుపెట్టాను. అలా ప్రస్వాపనాస్త్రాన్ని ప్రయోగించ బోతున్న నన్ను చూసి నారదుడు ఇలా అన్నాడు. (2)
ఏతే వియతి కౌరవ్య దివి దేవగణాః స్థితాః।
తే త్వాం నివారయంత్యద్య ప్రస్వాపం మా ప్రయోజయ॥ 3
కౌరవ్యా! ఇరుగో, ఆకాశంలో దేవతలందరూ నిలుచుని ఉన్నారు. వారంతా నిన్ను ఇప్పుడు వారిస్తున్నారు. కనుక ప్రస్వాపనాస్త్రం ప్రయోగించకు. (3)
రామస్తపస్వీ బ్రహ్మణ్యః బ్రాహ్మణశ్చ గురుశ్చ తే।
తస్యావమానం కౌరవ్య మా స్మ కార్షీః కథంచన॥ 4
కౌరవ్య! రాముడు తపస్వీ, బ్రహ్మజ్ఞుఉ, పైగా బ్రాహ్మణుడు. ఆపై నీకు గురువు కూడా. అతనిని ఏ విధంగానూ అవమానపరచకు. (4)
తతోఽపశ్యం దివిష్ఠాన్ వై తానష్టౌ బ్రహ్మవాదినః।
తే మాం స్మయంతో రాజేంద్ర శనకైరిదమబ్రువన్॥ 5
రాజేంద్రా! ఆ తరువాత ఆకాశంలో నిలిచిఉన్న ఆ ఎనమండుగురు బ్రహ్మవాదులను చూశాను. వారు నవ్వుతూ నాతో మెల్లగా ఇలా అన్నారు. (5)
యథాహ భరతశ్రేష్ఠ నారదస్తత్ తథా కురు।
ఏతద్ధి పరమం శ్రేయః లోకానాం భరతర్షభ॥ 6
భరతశ్రేష్ఠా! నారదుడు ఎలా చెప్పాడో అలాగే చేయి. అదే లోకాలకు మిక్కిలి శ్రేయస్సు సుమా! (6)
తతశ్చ ప్రతిసంహృత్య తదస్త్రం స్వాపనం మహత్।
బ్రహ్మాస్త్రం దీపయాంచక్రే తస్మిన్ యుధి యథావిధి॥ 7
అని చెప్పగా అప్పుడు గొప్పదైన ఆ ప్రస్వాపనాస్త్రాన్ని ఉపసంహరించి, ఆ యుద్ధంలో యథావిధిగా బ్రహ్మాస్త్రాన్నే వెలుగొంద చేశాను. (7)
తతో రామో హృషితో రాజసింహ
దృష్ట్వా తదస్త్రం వినివర్తితం వై।
జితోఽస్మి భీష్మేణ సుమందబుద్ధిః
ఇత్యేవ వాక్యం సహసా వ్యముంచత్॥ 8
రాజసింహా! అప్పుడు ఆ అస్త్రం నివర్తింపబడడం చూసి సంతోషించిన రాముడు "మిక్కిలి మందబుద్ధినైన నేను భీష్మునిచేత ఓడింపబడ్డాను." అన్నాడు. (8)
తతోఽపశ్యత్ పితరం జామదగ్న్యః
పితుస్తథా పితరం చాస్య మాన్యమ్।
తే తత్ర చైనం పరివార్య తస్థుః
ఊచుశ్పైనం సాంత్వపూర్వం తదానీమ్॥ 9
అప్పుడు అక్కడ పరశురాముడు తన తండ్రి జమదగ్నిని; అతనికి మన్నింపదగిన అతని తండ్రి ఋచీకుని చూశాడు. వారంతా అక్కడే అతని చుట్టూ నిలిచి అనునయ పూర్వకంగా అతనిని ఉద్దేశించి ఇలా అన్నారు. (9)
పితర ఉవాచ
మా స్మైవం సాహసం తాత పునః కార్షీః కథంచన।
భీష్మేణ సంయుగం గంతుం క్షత్రియేణ విశేషతః॥ 10
పితరులు అన్నారు - తండ్రీ! ఎన్నడూ తిరిగి ఇలాంటి సాహసం చేయకు. భీష్మునితో అందునా క్షత్రియునితో యుద్ధం చేయడం మంచిది కాదు. (10)
క్షత్రియస్య తు ధర్మోఽయం యద్ యుద్ధం భృగునందన।
స్వాధ్యాయో వ్రతచర్యాథ బ్రాహ్మణానాం పరం ధనమ్॥ 11
భృగునందనా! ఈ యుద్ధం అనేది క్షత్రియుని యొక్క ధర్మం. బ్రాహ్మణునికైతే స్వాధ్యాయం, వ్రతానుష్ఠానం పరమమైన ధనం. (11)
ఇదం నిమిత్తే కస్మింశ్చిత్ అస్మాభిః ప్రాగుదాహృతమ్।
శస్త్రధారణమత్యుగ్రం తచ్చాకార్యం కృతం త్వయా॥ 12
పూర్వం ఒకసారి ఇదే విషయమై నీకు మేము చెప్పి ఉన్నాము. ఆ శస్త్రధారణమనే అతిభయంకరమైన అకృత్యాన్ని నీవు చేశావు. (12)
వత్స పర్యాప్తమేతావద్ భీష్మేణ సహ సంయుగే।
విమర్దస్తే మహాబాహో వ్యపయాహి రణాదితః॥ 13
వత్సా! మహాబాహూ! భీష్మునితో చేసిన యుద్ధంలో ఇంతవరకు నీవు చేసిన విధ్వంసక కార్యం చాలు. ఇకనైనా యుద్ధం నుండి తొలగిపో. (13)
పర్యాప్తమేతద్ భద్రం తే తవ కార్ముకధారణమ్।
విసర్జయైతద్ దుర్ధర్ష తపస్తప్యస్వ భార్గవ॥ 14
ఏష భీష్మః శాంతనవః దేవైః సర్వైర్నివారితః।
నివర్తస్వ రణాదస్మాత్ ఇతి చైవ ప్రసాదితః॥ 15
రామేణ సహ మా యోత్సీః గురుణేతి పునః పునః।
న హి రామో రణే జేతుం త్వయా న్యాయ్యః కురూద్వహ॥ 16
మానం కురుష్వ గాంగేయ బ్రాహ్మణస్య రణాజిరే।
భార్గవా! నీకు శుభమగుగాక! ఎదురులేని వీరుడా! నీవు ఇంతవరకు విల్లు ఎక్కుపెట్టింది చాలు. ఇక దానిని విడిచిపెట్టు. తపస్సు చేసుకో. దేవతలందరూ ఈ భీష్ముని కూడా నివారించారు. ఈ యుద్ధం నుండి విరమించు మని వారు అతనిని అనునయించారు. నీ గురువైన పరశురాముడితో యుద్ధం చేయకు. కురువంశశ్రేష్ఠ! రాముడిని యుద్ధంలో జయించడం నీకు న్యాయం కాదు. గాంగేయా! యుద్ధ భూమిలో ఆ బ్రాహ్మణుని గౌరవించు. అని పదే పదే చెప్పారు. (14-16 1/2)
వయం తు గురవస్తుభ్యం తస్మాత్ త్వాం వారయామహే॥ 17
భీష్మో వసూనామన్యతమో దిష్ట్యా జీవసి పుత్రక।
నాయనా! మేము నీ పెద్దలం(తాత తండ్రులం) కాబట్టే నిన్ని వారిస్తున్నాం. భీష్ముడు వసువులలో ఒకడు. అదృష్టం కొద్దీ జీవించి ఉన్నావు. (17 1/2)
గాంగేయః శాంతనోః పుత్రః వసురేష మహాయశాః॥ 18
కథం శక్యస్త్వయా జేతుం నివర్తస్వేహ భార్గవ।
భార్గవా! గంగాసుతుడు, శంతనుపుత్రుడు అయిన ఈ కీర్తిశాలి వసువు సుమా! నీవు ఎలా జయించగలుగుతావు? కాబట్టి ఇక్కడినుండి తొలగిపో. (18 1/2)
అర్జునః పాండవశ్రేష్ఠః పురందరసుతో బలీ॥ 19
నరః ప్రజాపతిర్వీరః పూర్వదేవః సనాతనః।
సవ్యసాచీతి విఖ్యాతః త్రిషు లోకేషు వీర్యవాన్।
భీష్మమృత్యుర్యథాకాలం విహితో వై స్వయంభువా॥ 20
దేవతలందరిలో పూర్వుడు, సనాతనుడు, ప్రజాపతి, వీరుడు అయిన నరుడు ఇంద్రసుతుడు, బలవంతుడు అయిన అర్జునుడుగా పుట్టి త్రిలోక వీరుడై సవ్యసాచి అని ప్రఖ్యాతి చెంది కాలాసుసారంగా భీష్ముని మృతికి కారకుడవుతాడని బ్రహ్మ విధించాడు. (19,20)
భీష్మ ఉవాచ
ఏవముక్తః స పితృభిః పితౄన్ రామోఽబ్రవీదిదమ్।
నాహం యుధి నివర్తేయమ్ ఇతి మే వ్రతమాహితమ్॥ 21
భీష్ముడు చెప్తున్నాడు - ఇలా చెప్పిన పితరులతో రాముడిలా అన్నాడు - నేను యుద్ధంలో వెనుకడుగు వేయను. ఇది నా వ్రతం. (21)
న నివర్తితపూర్వశ్చ కదాచిత్ రణమూర్ధని।
నివర్త్యతామాపగేయః కామం యుద్ధాత్ పితామహాః॥ 22
న త్వహం వినివర్తిష్యే యుద్ధాదస్మాత్ కథంచన।
పితామహులారా! ఇంతకు పూర్వం కూడా ఎప్పుడూ యుద్ధభూమినుండి వెనక్కి తిరగలేదు. మీకు కోరిక ఉంటే గాంగేయుని యుద్ధంనుండి మరల్చండి. ఏవిధంగానూ నేను ఈ యుద్ధం నుండి మరలను. (22 1/2)
తతస్తే మునయో రాజన్ ఋచీకప్రముఖాస్తదా॥ 23
నారదేనైవ సహితాః సమాగమ్యేదమబ్రువన్।
నివర్తస్వ రణాత్ తాత మానయస్చ ద్విజోత్తమమ్॥ 24
రాజా! అప్పుడు ఋచీకుడు మొదలైన మునులు నారదునితో సహా వచ్చి నాతో ఇలా అన్నారు. నాయనా! యుద్ధాన్ని మాను. ఆ బ్రాహ్మణోత్తముని గౌరవించు. (23,24)
ఇత్యవోచమహం తాంశ్చ క్షత్రధర్మవ్యపేక్షయా।
మమ వ్రతమిదం లోకే నాహం యుద్ధాత్ కదాచన॥ 25
విముఖో వినివర్తేయం పృష్ఠతోఽభ్యాహతః శరైః।
నాహం లోభాన్న కార్పణ్యాత్ న భయాన్నార్థకారణాత్॥ 26
త్యజేయం శాశ్వతం ధర్మమ్ ఇతి మే నిశ్చితా మతిః।
క్షత్రియ ధర్మాపేక్షతో నేను వారినుద్దేశించి ఇలా అన్నాను. ఈ లోకంలో నాకొక వ్రతం ఉంది. యుద్ధవిముఖుడనై వెనుక బాణాలు తగులుతూంటే యుద్ధం నుండి ఎప్పుడూ మరలిపోను. లోభం వల్ల కాని; దైన్యం వల్ల కాని, భయం వల్లకాని; ధనం కోసం గాని శాశ్వతమైన ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టనని నా దృఢనిశ్చయం. (25,26)
తతస్తే మునయః సర్వే నారదప్రముఖా నృప॥ 27
భాగీరథీ చ మే మాతా రణమధ్యం ప్రపేదిరే।
తథైవాత్తశరో ధన్వీ తథైవ దృఢనిశ్చయః।
స్థిరోఽహమాహవే యోద్ధుం తతస్తే రామమబ్రువన్॥ 28
సమేత్య సహితా భూయః సమరే భృగునందనమ్।
రాజా! తరువాత నారదాది మునులందరూ, నాతల్లి భాగీరథి యుద్ధరంగమధ్యంలోకి ప్రవేశించారు. నేను అలాగే విల్లెక్కుపెట్టి బాణం చేత పుచ్చుకొని అదే దృఢనిశ్చయంతో యుద్ధ రంగంలో యుద్ధం చేయడానికి స్థిరంగా నిలుచుని ఉన్నాను. అప్పుడు వారంతా మళ్లీ ఒక్కుమ్మడిగా కలిసి భార్గవరాముని సమీపించి అతనితో ఇలా అన్నారు. (27,28 1/2)
నావనీతం హి హృదయం విప్రాణాం శామ్య, భార్గవ॥ 29
రామ రామ నివర్తస్వ యుద్ధాదస్మాద్ ద్విజోత్తమ।
అవధ్యో వై త్వయా భీష్మః త్వం చ భీష్మస్య భార్గవ॥ 30
భార్గవా! బ్రాహ్మణోత్తమా! రామా! విప్రుల మనసు నవనీతం లాంటిది. శాంతించు, రామా! ఈ యుద్ధాన్నుండి విరమించు. నీవు భీష్ముడినీ చంపలేవు. భీష్ముడు నిన్నూ చంపలేడు. (29,30)
ఏవం బ్రువంతస్తే సర్వే ప్రతిరుధ్య రణాజిరమ్।
న్యాసయాంచక్రిరే శస్త్రం పితరో భృగునందనమ్॥ 31
ఇలా అంటూ ఆ పితరులందరూ రణ భూమిలో రాముని అడ్డగించి శస్త్రన్యాసం చేయించారు. (31)
తతోఽహం పునరేవాథ తానష్టౌ బ్రహ్మవాదినః।
అద్రాక్షం దీప్యమానాన్ వై గ్రహానష్టావివోదితాన్॥ 32
అప్పుడు నేను మళ్లీ ఆ ఎనమండుగురు బ్రహ్మవాదులను చూశాను. వారు ఆకాశంలో ఎనిమిది గ్రహాలు పుట్టినట్లు ఉన్నారు. (32)
తే మాం సప్రణయం వాక్యమ్ అబ్రువన్ సమరే స్థితమ్।
ప్రైహి రామం మహాబాహో గురుం లోకహితం కురు॥ 33
వారంతా యుద్ధభూమిలో నిల్చున్న నాతో ప్రేమగా ఇలా అన్నారు. "మహాబాహూ! గురువైన రాముడి వద్దకు వెళ్లు. లోకహితం చెయ్యి." (33)
దృష్ట్వా నివర్తితం రామం సుహృద్వాక్యేన తేన వై।
లోకానాం చ హితం కుర్వన్ అహమప్యాదదే వచః॥ 34
మిత్రవాక్యం చేత యుద్ధంనుండి మరలిన పరశురాముడిని చూచి లోకహితం చేయాలని నేను కూడా వారి మాటను ఆదరించాను. (34)
తతోఽహం రామమాసాద్య వవందే భృశవిక్షతః।
రామశ్చాభ్యుత్స్మయన్ ప్రేమ్ణా మామువాచ మహాతపాః॥ 35
అపుడు బాగా గాయపడి ఉన్న నేను రాముడి వద్దకు వెళ్లి నమస్కరించాను. మహాతపస్వి అయిన రాముడు కూడా చిరునవ్వు నవ్వుతూ ప్రేమగా నాతో ఇలా అన్నాడు. (35)
త్వత్సమో నాస్తి లోకేఽస్మిన్ క్షత్రియః పృథివీచరః।
గమ్యతాం భీష్మ యుద్ధేఽస్మిన్ తోషితోఽహం భృశం త్వయా॥ 36
భీష్మా! ఈ లోకంలో నీతో సమానమైన క్షత్రియుడు లేడు. వెళ్లు. ఈ యుద్ధంలో నీ వలన నేను మిక్కిలి సంతోషం పొందాను." (36)
మమ చైవ సమక్షం తాం కన్యామాహూయ భార్గవః।
ఉక్తవాన్ దీనయా వాచా మధ్యే తేషాం మహాత్మనామ్॥ 37
భార్గవరాముడు నా సమక్షంలోనే ఆ కాశిరాజు కన్యను పిలిచి ఆ మహాత్ముల మధ్య దీనవాక్యాలతో ఇలా అన్నాడు. (37)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యాన పర్వణి యుద్ధవృత్తౌ పంచాశీత్యధికశతతమోఽధ్యాయః॥ 185
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున అంబోపాఖ్యాన పర్వమను ఉపపర్వమున యుద్ధము నుండి మరలుట అను నూట ఎనుబది ఐదవ అధ్యాయము. (185)