189. నూట ఎనుబదితొమ్మిదవ అధ్యాయము

శిఖండి వివాహము - ఆమె స్త్రీ అని తెలిసి మామ కోపించుట.

భీష్మ ఉవాచ
చకార యత్నం ద్రుపదః సుతాయాః సర్వకర్మసు।
తతో లేఖ్యాదిషు తథా శిల్పేషు చ పరంతప॥ 1
భీష్ముడు చెప్తున్నాడు - అనంతరం ద్రుపదుడు తన కుమార్తెకు చిత్రలేఖనాది విషయాల్లోను, శిల్పకార్యాదులలోను అన్ని విషయాలూ నేర్పడానికి ప్రయత్నం చేశాడు. (1)
ఇష్వస్త్రే చైవ రాజేంద్ర ద్రోణశిష్యో బభూవ హ।
తస్య మాతా మహారాజ రాజానం వరవర్ణినీ॥ 2
చోదయామాస భార్యార్థం కన్యాయాః పుత్రవత్ తదా।
తతస్తాం పార్షతో దృష్ట్వా కన్యాం సంప్రాప్తయౌవనామ్।
స్త్రియం మత్వా తతశ్చింతాం ప్రపేదే సహ భార్యయా॥ 3
రాజేంద్రా! ధనుర్విద్యకోసం శిఖండి ద్రోణునికి శిష్యుడయ్యాడు. మహారాజా! సుందరీరత్నం అయిన అతని తల్లి పుత్రుని వంటి ఆ కూతురికి భార్యను తెమ్మని రాజును ప్రేరేపించసాగింది. అంత ద్రుపదుడు యుక్తవయస్కురాలయిన ఆ కన్యను చూచి ఇంకా స్త్రీగానే ఉందని (శివుడు చెప్పినట్లు పురుషుడు కాలేదని) భార్యతో కలిసి చింతించసాగాడు. (2-3)
ద్రుపద ఉవాచ
కన్యా మమేయం సంప్రాప్తా యౌవనం శోకవర్ధినీ।
మయా ప్రచ్ఛాదితా చేయం వచనాత్ శూలపాణినః॥ 4
ద్రుపదుడంటున్నాడు - దేవీ! నా ఈ కూతురు సంప్రాప్తయౌవనురాలై నాకు శోకాన్ని మరింత పెంచుతోంది. భవవంతుడైన శూలపాణి మాటల వలన ఈమెను నేను మరుగుపరిచాను. (4)
భార్యోవాచ
న తన్మిథ్యా మహారాజ భవిష్యతి కథంచన।
త్రైలోక్యకర్తా కస్మాద్ధి వృథా వక్తుమిహార్హతి॥ 5
యది తే రోచతే రాజన్ వక్ష్యామి శృణు మే వచః।
శ్రుత్వేదానీం ప్రపద్యేథాః స్వాం మతిం పృషతాత్మజ॥ 6
భార్య ఇలా అంది. - మహారాజా! అది ఎన్నటికీ మిథ్య కాబోదు. ముల్లోకాలు సృష్టించగలిగిన శివుడు ఎందుకు వ్యర్థమైన మాటలు చెపుతాడు? రాజా! నీకు ఇష్టమయితే నేను చెప్పేది విను. పృషతనందనా! ఇప్పుడు అది విని నీ బుద్ధికి తోచినట్లుగా గ్రహించు. (5-6)
క్రియతామస్య యత్నేన విధివద్ దారసంగ్రహః।
భవితా తద్వచః సత్యమితి మే నిశ్చితా మతిః॥ 7
ఇతనికి ప్రయత్నం చేసి శాస్త్రోక్తంగా భార్యను తీసుకురావాలి. ఆ శివుడు చెప్పిన మాటలు తప్పక నిజం అవుతాయని నా నిశ్చితాభిప్రాయం. (7)
తతస్తౌ నిశ్చయం కృత్వా తస్మిన్ కార్యేఽథ దంపతీ।
వరయాంచక్రతుః కన్యాం దశార్ణాధిపతేః సుతామ్॥ 8
ఆ పని జరిపించాలని ఆ దంపతులిద్దరూ నిశ్చయించుకొని, దశార్ణదేశపురాజు కూతురును తమ కొడుకుకి కన్యగా వరించారు. (8)
తతో రాజా ద్రుపదో రాజసింహః
సర్వాన్ రాజ్ఞః కులతః సంనిశామ్య।
దాశార్ణకస్య నృపతేస్తనూజాం
శిఖండినే వరయామాస దారాన్॥ 9
అనంతరం రాజసింహుడైన ద్రుపదుడు సమస్త రాజుల కులగోత్రాలను తెలుసుకొని దశార్ణరాజు కూతురిని శిఖండికి భార్యగా ఎంపికచేశాడు. (9)
హిరణ్యవర్మేతి నృపః యోఽసౌ దాశార్ణకః స్మృతః।
స చ ప్రాదాన్మహీపాలః కన్యాం తస్మై శిఖండినే॥ 10
దశార్ణదేశానికి హిరణ్యవర్మ అనే రాజున్నాడు. ఆ మహీపాలుడు శిఖండికి తన కన్యను ఇచ్చాడు. (10)
స చ రాజా దశార్ణేషు మహానాసీత్ సుదుర్జయః।
హిరణ్యవర్మా దుర్ధర్షః మహాసేనో మహామనాః॥ 11
దశార్ణదేశపు రాజు హిరణ్యవర్మ ఎవరికీ జయింపశక్యం కానివాడు. దుర్ధర్షుడు. చాలా సైన్యం కల మహా మనస్వి. (11)
కృతే వివాహే తు తదా సా కన్యా రాజసత్తమ।
యౌవనం సమనుప్రాప్తా సా చ కన్యా శిఖండినీ॥ 12
కృతదారః శిఖండీ చ కాంపిల్యం పునరాగమత్।
తతః సా వేద తాం కన్యాం కంచిత్ కాలం స్త్రియం కిల॥ 13
రాజోత్తమా! ఆ హిరణ్యవర్మ కూతురు యుక్తవయస్కురాలు అయింది. శిఖండిని కూడా యౌవనవతి అయింది. వివాహం అయిన తరువాత భార్యను తీసుకుని శిఖండి కాంపిల్యపురానికి తిరిగి వచ్చాడు. అప్పుడు కొంతకాలానికి ఆ రాకుమారి ఆ కన్యను స్త్రీగా తెలుసుకొంది. (12-13)
హిరణ్యవర్మణః కన్యా జ్ఞాత్వా తాం తు శిఖండినీమ్।
ధాత్రీణాం చ సఖీనాం చ వ్రీడమానా న్యవేదయత్।
కన్యాం పంచాలరాజస్య సుతాం తాం వై శిఖండినీమ్॥ 14
హిరణ్యవర్మ యొక్క కూతురు శిఖండిని గూర్చి తెలిసికొని, సిగ్గు పడుతూ తన దాదులకు, చెలికత్తెలకు "పాంచాల రాజుయొక్క కూతురు శిఖండి స్త్రీయే కాని పురుషుడు కా" దని చెప్పింది. (14)
తతస్తా రాజసార్దూల ధాత్ర్యో దాశార్ణికాస్తదా।
జగ్మురార్తిం పరాం ప్రేష్యాః ప్రేషయామాసురేవ చ॥ 15
రాజసింహమా! అప్పుడు ఆ దశార్ణదేశం నుండి వచ్చిన దాదులు దాసీలు చాలా దిగులు చెంది తగ్గవారిని ఎంచి దశార్ణరాజు దగ్గరకు పంపారు. (15)
తతో దశార్ణాధిపతేః ప్రేష్యాః సర్వా న్యవేదయన్।
విప్రలంభం యథావృత్తం స చ చుక్రోధ పార్థివః॥ 16
దశార్ణాధిపతి యొక్క దాసీలు జరిగిన మోసాన్ని యథాతథంగా వివరించారు. అది విని ఆ రాజుకు కోపం వచ్చింది. (16)
శిఖండ్యపి మహారాజ పుంవద్ రాజకులే తదా।
విజహార ముదా యుక్తః స్త్రీత్వం నైవాతిరోచయన్॥ 17
మహారాజా! శిఖండి కూడా పురుషుడిలాగే రాజవంశంలో సంతోషంగా తిరుగుతున్నాడు. కాని అతనికి స్త్రీత్వం ఏమాత్రం రుచించడంలేదు. (17)
తతః కతిపయాహస్య తచ్ఛ్రుత్వా భరతర్షభ।
హిరణ్యవర్మా రాజేంద్ర రోషాధార్తిం జగామ హ॥ 18
భరతశ్రేష్ఠా! రాజోత్తమా! తరువాత కొన్నాళ్లకు ఈ సంగతి విన్న హిరణ్యవర్మ క్రోధావేశం పొందాడు. (18)
తతో దాశార్ణకో రాజా తీవ్రకోపసమన్వితః
దూతం ప్రస్థాపయామాస ద్రుపదస్య నివేశనమ్॥ 19
తీవ్రమైన కోపంతో దాశార్ణరాజు ద్రుపదుని యొక్క భవనానికి ఒక దూతను పంపాడు. (19)
తతో ద్రుపదమాసాద్య దూతః కాంచనవర్మణః।
ఏక ఏకాంతముత్సార్య రహో వచనమబ్రవీత్॥ 20
ఆ హిరణ్యవర్మయొక్క దూత ఒక్కడే ద్రుపదుని దగ్గరకు వచ్చి అందరినీ బయటకు పంపి ఏకాంతంలో రహస్యంగా అతనితో ఇలా అన్నాడు. (20)
దాశార్ణరాజో రాజన్ త్వామ్ ఇదం వచనమబ్రవీత్।
అభిషంగాత్ ప్రకుపితః విప్రలబ్ధస్త్వయానఘ॥ 21
రాజా! అనఘా, వివాహసంబంధంలో నీచేత మోసగింపబడి ఎంతో కుపితుడైన దాశార్ణరాజు నీతో ఇలా చెప్పమన్నాడు. (21)
వి॥సం। 'అభిషంగః' అంటే "వివాహసంబంధం' అని (అర్జు) 'పరాభవం' అని (నీల) అర్థాలు చెప్పారు.
అవమన్యసే మాం నృపతే నూనం దుర్మంత్రితం తవ।
యన్మే కన్యాం స్వకన్యార్థే మోహాద్ యాచితవానసి॥ 22
తస్యాద్య విప్రలంభస్య ఫలం ప్రాప్నుహి దుర్మతే।
ఏష త్వాం సజనామాత్యమ్ ఉద్ధరామి స్థిరో భవ॥ 23
రాజా! నా కూతురిని నీ కూతురి కోసం మూర్ఖంగా యాచించావు. నన్ను అవమానపరిచావు. ఇది తప్పకుండా నీ కుతంత్రమే. దుర్మతీ! మోసానికి తగ్గ ఫలాన్ని అనుభవించు. ఇదిగో నిన్ను నీ ప్రజలతో, అమాత్యులతో సహితంగా పెల్లగించివేస్తాను. స్థిరచిత్తుడవై ఉండు. (22-23)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి హిరణ్యవర్మదూతాగమనే ఏకోననవత్యధికశతతమోఽధ్యాయః॥ 189 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున అంబోపాఖ్యాన పర్వము అను ఉపపర్వమున హిరణ్యవర్మ యొక్క దూత వచ్చుట అను నూట ఎనుబది తొమ్మిదవ తొమ్మిదవ అధ్యాయము. (189)