178. నూటడెబ్బది ఎనిమిదవ అధ్యాయము

భీష్మ పరశురాములు యుద్ధమునకు సిద్ధమై కురుక్షేత్రము చేరుట.

భీష్మ ఉవాచ
ఏవముక్తస్తదా రామః జహి భీష్మమితి ప్రభో।
ఉవాచ రుదతీం కన్యాం చోదయంతీం పునః పునః॥ 1
కాశ్యే న కామం గృహ్ణామి శస్త్రం వై వరవర్ణిని।
ఋతే బ్రహ్మవిదాం హేతోః కమన్యత్ కరవాణి తే॥ 2
భీష్ముడు చెప్తున్నాడు: రాజా! ఈ రీతిగా "భీష్ముడిని చంపండి" అని పదే పదే ప్రేరేపిస్తూ ఏడుస్తూ ఉన్న ఆ కన్యతో పరశురాముడు అప్పుడు ఇలా అన్నాడు. "కాశీరాజ పుత్రీ! సుందరీ! వేదవేత్తలైన వారి గురించి తప్ప నేను ఇచ్ఛానుసారంగా శస్త్రం పట్టడానికి ఎంతమాత్రం అంగీకరించను. ఇది కాక ఇంకేం చేయగలను నీకు? (1-2)
వాచా భీష్మశ్చ సాల్వశ్చ మమ రాజ్ఞి వశానుగౌ।
భవిష్యతోఽనవద్యాంగి తత్ కరిష్యామి మా శుచః॥ 3
రాకుమారీ! భీష్ముడు, సాల్వుడు కూడా నా మాట వింటారు. నేను నీపని నెరవేరుస్తాను. ఏడవకు. (3)
న తు శస్త్రం గ్రహీష్యామి కథంచిదపి భామిని।
ఋతే నియోగాద్ విప్రాణామ్ ఏష మే సమయః కృతః॥ 4
సుందరీ! బ్రాహ్మణుల ఆజ్ఞ లేనిదే నేను ఏ రీతిగా కూడా ఆయుధం పట్టను. ఇది నా నియమం. (4)
అంబోవాచ
మమ దుఃఖం భగవతా వ్యపనేయం యతస్తతః।
తచ్చ భీష్మప్రసూతం మే తం జహీశ్వర మాచిరమ్॥ 5
అంబ అన్నది. ప్రభూ! న దుఃఖాన్ని ఏదో ఒకరకంగా మీరే పోగొట్టాలి. అదికూడా భీష్మునివల్లనే కలిగింది. కాబట్టి అతనిని చంపండి. ఆలస్యం చేయకండి. (5)
రామ ఉవాచ
కాశికన్యే పునర్ బ్రూహి భీష్మస్తే చరణావుభౌ।
శిరసా వందనార్హోఽపి గ్రహీష్యతి గిరా మమ॥ 6
పరశురాముడు అన్నాడు. కాశిరాజ పుత్రీ! బాగా ఆలోచించుకొని చెప్పు. అందరికీ వందనీయుడైనా భీష్ముడు నామాటమీద నీపాదాలు పట్టుకొంటాడు. (6)
అంబోవాచ
జహి భీష్మం రణే రామ గర్జంతమసురం యథా।
సమాహూతో రణే రామ మమ చేదిచ్ఛసి ప్రియమ్॥
ప్రతిశ్రుతం చ యదపి తత్ సత్యం కర్తుమర్హసి॥ 7
అంబ అన్నది. రామా! నీవు నాకు సంతోషం కలిగించాలంటే భీష్ముడిని యుద్ధానికి పిలు. ఆ యుద్ధంలో గర్జిస్తున్న రాక్షసుడిలా ఉన్న భీష్ముడిని చంపు. నీవు చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకో. (7)
భీష్మ ఉవాచ
తయోః సంపదతోరేవం రాజన్ రామాంబయోస్తదా।
ఋషిః పరమధర్మాత్మా ఇదం వచనమబ్రవీత్॥ 8
భీష్ముడు చెప్పాడు. ఈ విధంగా అంబా పరశురాములు సంభాషించుకుంటూ ఉండగా పరమధర్మాత్ముడైన ఋషి అకృతవ్రణుడు ఇలా అన్నాడు. (8)
శరణాగతాం మహాబాహో కన్యాం న త్యక్తుమర్హసి।
యది భీష్మో రణే రామ రామ సమాహూతస్త్వయా మృధే॥ 9
నిర్జితోఽస్మీతి వా బ్రూయాత్ కుర్యాద్ వా వచనం తవ7.
కృతమస్యాభవేత్ కార్యం కన్యాయా భృగునందన॥ 10
భృగునందనా! రామా! మహాబాహూ! నిన్ను శరణుకోరి వచ్చిన ఈ కన్యను విడిచిపెట్టతగదు. భీష్ముడిని నీవు యుద్ధానికి పిలిచినపుడు అతడు వచ్చి "యుద్ధంలో నీ చేతిలో ఓడిపోయా" నని చెప్పాలి. లేదా నీ మాట పాటించాలి. అప్పుడే ఈ అమ్మాయి కార్యం నెరవేరుతుంది. (9-10)
వాక్యం సత్యం చ తే వీర భవిష్యతి కృతం విభో।
ఇయం చాపి ప్రతిజ్ఞా తే తదా రామ మహామునే॥ 11
ఇయం వై క్షత్రియాన్ సర్వాన్ బ్రాహ్మణేషు ప్రతిశ్రుతా।
బ్రాహ్మణః క్షత్రియో వైశ్యః శూద్రశ్చైవ రణే యది॥ 12
బ్రహ్మద్విడ్ భవితా తం వై హనిష్యామీతి భార్గవ।
శరణార్థే ప్రపన్నానాం భీతానాం శరణార్థినామ్॥ 13
న శక్ష్యామి పరిత్యాగం కర్తుం జీవన్ కథంచన।
యశ్చ కృత్స్నం రణే క్షత్రం విజేష్యతి సమాగతమ్॥ 14
దీప్తాత్మానమహం తం చ హనిష్యామీతి భార్గవ।
రామా! అప్పుడు నీవాడిన మాట కూడా నిజమవుతుంది. మహామునీ! క్షత్రియులందరిని జయించిన పిమ్మట బ్రాహ్మణుల మధ్య నీవు చేసిన ప్రతిజ్ఞ ఇది. "బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్రులెవరైనా సరే బ్రాహ్మణ ద్వేషి అయితే అతనిని యుద్ధంలో చంపుతాను. భయంతో శరణుకోరి వచ్చిన శరణార్థులను నేను బ్రతికి ఉండగా ఏవిధంగానూ వదిలివేయను. మూకుమ్మడిగా కూడివచ్చిన క్షత్రియులందరినీ జయించి పరాక్రమంతో వెలిగిపోయేవాడిని కూడా యుద్ధంలో చంపుతాను". (11-14 1/2)
స ఏవం విజయీ రామ భీష్మః కురుకులోద్వహః।
తేన యుధ్యస్వ సంగ్రామే సమేత్య భృగునందన॥ 15
పరశురామా! కురుకుల భారాన్ని వహిస్తున్న భీష్ముడు ఇలా క్షత్రియులందరినీ జయించి ఉన్నాడు. కాబట్టి భృగునందనా! యుద్ధంలో అతనినెదుర్కొని పోరు సలుపు. (15)
రామ ఉవాచ
స్మరామ్యహం పూర్వకృతాం ప్రతిజ్ఞామృషిసత్తమ।
తథైవ చ చరిష్యామి యథా సామ్నైవ లప్స్యతే॥ 16
పరశురాముడన్నాడు - ఋషిపుంగవా! పూర్వం నేను చేసిన ప్రతిజ్ఞ జ్ఞాపకం ఉంది. అయినా సామోపాయం చేతనే కార్యం సానుకూలపడేలా ప్రయత్నం చేస్తాను. (16)
కార్యమేతన్మహద్ బ్రహ్మన్ కాశికన్యామనోగతమ్।
గమిష్యామి స్వయం తత్ర కన్యామాదాయ యత్ర సః॥ 17
బ్రాహ్మణుడా! ఈ కాశీకన్య అంబ మనసులో కోరుకొన్న పని చాలా గొప్పది. కాబట్టి ఈమెను తీసుకుని స్వయంగా నేను భీష్ముని దగ్గరకు వెడతాను. (17)
యది భీష్మో రణశ్లాఘీ న కరిష్యతి మే వచః।
హనిష్యామ్యేనముద్రిక్తమ్ ఇతి మే నిశ్చితా మతిః॥ 18
భీష్ముడు కనుక యుద్ధానికే మొగ్గు చూపి, నా మాట పాటించకపోతే గర్వియైన అతనిని చంపాలని నా నిశ్చయం. (18)
న హి బాణా మయోత్సృష్టాః సజ్జంతీహ శరీరిణామ్।
కాయేషు విదితం తుభ్యం పురా క్షత్రియసాంగరే॥ 19
నేను విడిచిన బాణాలు శత్రువుల శరీరాలలో గ్రుచ్చుకొని ఉండిపోవు. (చీల్చుకొని బయటకు వస్తాయని అర్థం) ఈ సంగతి పూర్వం క్షత్రియులతో జరిగిన యుద్ధంలోనే మీకు తెలుసు. (19)
ఏవముక్త్వా తతో రామః సహ తైర్బ్రహ్మవాదిభిః।
ప్రయాణాయ మతిం కృత్వా సముత్తస్థౌ మహాతపాః॥ 20
ఇలా అని మహాతపస్వి అయిన రాముడు ఆ బ్రహ్మవాదులతో కలిసి ప్రయాణమవ్వాలని తలచి అందుకు సన్నద్ధుడయ్యాడు. (20)
తతస్తే తాముషిత్వా తు రజనీం తత్ర తాపసాః।
హుతాగ్నయో జప్తజప్యాః ప్రతస్థుర్మజ్జిఘాంసయా॥ 21
అంతట ఆ తాపసులందరూ అక్కడే ఆ రాత్రి గడిపి, తెల్లవారగానే అగ్ని కార్యాలు, గాయత్రీ జపాలు చేసికొని నన్ను చంపాలనే కోరికతో బయలుదేరారు. (21)
అభ్యగచ్ఛత్ తతో రామః సహ తైర్బ్రహ్మవాదిభిః।
కురుక్షేత్రం మహారాజ కన్యయా సహ భారత॥ 22
భరతవంశోద్భవా! మహారాజా! పిమ్మట రాముడు ఆ బ్రహ్మజ్ఞానులందరితో కలిసి అంబను వెంటపెట్టుకొని కురుక్షేత్రానికి చేరాడు. (22)
న్యవిశంత తతః సర్వే పరిగృహ్య సరస్వతీమ్।
తాపసాస్తే మహాత్మానః భృగుశ్రేష్ఠ పురస్కృతాః॥ 23
మహాత్ములయిన ఆ తాపసులందరూ భృగుశ్రేష్ఠుడయిన పరశురాముని ముందుంచుకుని సరస్వతీ నదీ తీరంలో విడిది చేశారు. (23)
భీష్మ ఉవాచ
తతస్తృతీయే దివసే సందిదేశ వ్యవస్థితః।
కురు ప్రియం స మే రాజన్ ప్రాప్తోఽస్మీతి మహావ్రతః॥ 24
భీష్ముడు చెప్తున్నాడు. అనంతరం మూడో రోజున హస్తినాపురం బయట ఒకచోట ఉండి, ఆ పరశురాముడు "రాజా! నేను వచ్చాను. నాకు ప్రియమైనది చేయి" అని సందేశం పంపించాడు. (24)
తమాగతమహం శ్రుత్వా విషయాంతం మహాబలమ్।
అభ్యగచ్ఛం జవేనాశు ప్రీత్యా తేజోనిధిం ప్రభుమ్॥ 25
తేజోనిధి, మహాబలవంతుడు, ప్రభువు అయిన ఆ రాముడు రాజ్యం పొలిమేరలలోకి వచ్చాడని విని నేను హర్షంతో శీఘ్రంగా వెంటనే అక్కడికి వెళ్లాను. (25)
గాం పురస్కృత్య రాజేంద్ర బ్రాహ్మణైః పరివారితః।
ఋత్విగ్భిర్దేవకల్పైశ్చ తథైవ చ పురోహితైః॥ 26
రాజేంద్రా! ముందు గోవు నడుస్తూ ఉండగా బ్రాహ్మణులందరూ పరివేష్టించగా దేవతాసమానులయిన ఋత్విక్కులతోను, పురోహితులతోను కలిసి వెళ్లాను. (26)
స మామభిగతం దృష్ట్వా జామదగ్న్యః ప్రతాపవాన్।
ప్రతిజగ్రాహ తాం పూజాం వచనం చేదమబ్రవీత్॥ 27
పరాక్రమశాలి అయిన జమదగ్ని కుమారుడు రాముడు సమీపించిన నన్ను చూసి, నేను చేసిన సత్కారాన్ని స్వీకరించి ఇలా అన్నాడు. (27)
రామ ఉవాచ
భీష్మ కాం బుద్ధిమాస్స్థాయ కాశిరాజసుతా తదా।
అకామేన త్వయానీతా పునశ్పైవ విసర్జితా॥ 28
రాముడన్నాడు - భీష్ముడా! ఆ నాడు ఏ ఉద్దేశ్యంతో కాశీరాజుకూతురు అంబను భార్యగా చేసుకోవాలనే కోరిక లేకుండానే తీసుకొనివచ్చావు? మళ్లీ ఆమెను ఎందుకు వదిలిపెట్టేశావు? (28)
విభ్రంశితా త్వయా హీయం ధర్మాదాస్తే యశస్వినీ।
పరామృష్టాం త్వయా హీమాం కో హి గంతుమిహార్హతి॥ 29
ఈ కీర్తిశాలిని నీ చేతనే ధర్మభ్రష్టురాలు అయింది. నీవు స్పృశించిన ఈమెను ఎవరు చేపడతారు? (29)
వి॥సం॥ భ్రష్టురాలు - అనగా ఇహపరలోకాలకు రెండింటికీ చెడినది అని అర్థం. (అర్జు) (సర్వ)
ప్రత్యాఖ్యాతా హి సాల్వేన త్వయానీతేతి భారత।
తస్మాదిమాం మన్నియోగాత్ ప్రతిగృహ్ణీష్వ భారత॥ 30
భారతా! నీచేత అపహరింపబడింది అనే కారణంగానే సాల్వుడీమెను తిరస్కరించాడు. కాబట్టి నా ఆదేశం మేరకు ఈమెను తిరిగి గ్రహించు. (30)
స్వధర్మం పురుషవ్యాఘ్ర రాజపుత్రీ లభత్వియమ్।
న యుక్తస్త్వవమానోఽయం రాజ్ఞాం కర్తుం త్వయానఘ॥ 31
పురుషసింహమా! ఈ రాజపుత్రి తన ధర్మాన్ని తాను ఆచరించగలగాలి. నీవయినా రాజులందరినీ ఇలా అవమాన పరచడం తగని పని. (31)
తతస్తం వై విమనసమ్ ఉదీక్ష్యాహమథాబ్రువమ్।
నాహమేనాం పునర్దద్యాం బ్రహ్మన్ భ్రాత్రే కథంచన॥ 32
అప్పుడతడు క్రోధావిష్టుడై ఉండడం చూసి నేను ఇలా అన్నాను. బ్రహ్మర్షీ! నేను నా తమ్ముడికి ఈమెను ఇచ్చి ఎలాగూ వివాహం చేయలేను. (32)
సాల్వస్యాహమితి ప్రాహ పురా మామేవ భార్గవ।
మయా చైవాభ్యనుజ్ఞాతా గతేయం నగరం ప్రతి॥ 33
భార్గవరామా! పూర్వమే తాను సాళ్వునిదానను అని నాతో చెప్పింది. నేను కూడా అనుమతించాను. ఆమె సాళ్వుని నగరానికి వెళ్లింది. (33)
న భయాన్నాప్యనుక్రోశాత్ నార్థలోభాన్న కామ్యయా।
క్షాత్రం ధర్మమహం జహ్యామ్ ఇతి మే వ్రతమాహితమ్॥ 34
"భయంచేత కాని, దయచేతకాని, ధనలోభం చేతగాని, ఇష్టంకోసం కాని నేను క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టను" అని నేను వ్రతం పూనాను. (34)
అథ మామబ్రవీద్ రామః క్రోధపర్యాకులేక్షణః।
న కరిష్యసి చేద్ తద్ వాక్యం మే నరపుంగవ॥ 35
హనిష్యామి సహామాత్యం త్వామద్యేతి పునః పునః।
అంతట క్రోధం నిండిన చూపులతో రాముడు నన్నుద్దేశించి ఇలా అన్నాడు. "నరశ్రేష్ఠుడా! నా ఈ మాటను నీవు పాటించకపోతే మంత్రిసహితంగా ఇప్పుడే నిన్ను చంపగలను" అని పదే పదే అన్నాడు. (35 1/2)
సంరంభాదబ్రవీద్ రామః క్రోధపర్యాకులేక్షణః॥ 36
తమహం గీర్భిరిష్టాభిః పునః పునరరిందమ।
అయాచం భృగుశార్దూలం న చైవ ప్రశశామ సః॥ 37
శత్రుసూదనా! కోపం నిండిన చూపులతో క్రోధావిష్టుడైన్ రాముడు ఇలా అనగానే నేను మరల మరల ఆ భృగువంశశ్రేష్ఠుని అనునయ వాక్యాలతో యాచించాను. అయినా అతడు చల్లబడలేదు. (36-37)
ప్రణమ్య తమహం మూర్థ్నా భూయో బ్రాహ్మణసత్తమమ్।
ఇష్వస్త్రం మమ బాలస్య భవతైవ చతుర్విధమ్।
ఉపదిష్టం మహాబాహో శిష్యోఽస్మి తవ భార్గవ॥ 39
ఆ బ్రాహ్మణోత్తమునికి మరల శిరసు వంచి నమస్కరించి మీరు నాతో యుద్ధం చేయాలని కోరుకోవడానికి కారణమేమిటి? మహాబాహూ! భార్గవరామా! బాలుడినైన నాకు చతుర్విధములైన శస్త్రాస్త్రములూ మీరే ఉపదేశించారు. నేను మీకు శిష్యుడిని అన్నాను. (38-39)
వి॥సం॥ చతుర్విధములు - నాల్గురకములు: 1. శరప్రయోగం. 2. శరసంధానం. 3. మంత్రప్రయోగం. 4. మంత్రోపసంహారం. (లక్షా)
తతో మామబ్రవీద్ రామః క్రోధసంరక్తలోచనః।
జానీషే మామ్ గురుం భీష్మ గృహ్ణాసీమాం న చైవ హ॥ 40
సుతాం కాశ్యస్య కౌరవ్య మత్ప్రియార్థం మహామతే।
న హి తే విద్యతే శాంతిః అన్యథా కురునందన॥ 41
కోపంతో ఎర్రబడిన కళ్లతో భార్గవరాముడప్పుడు నాతో అన్నాడు - మహామతీ! భీష్ముడా! నన్ను గురువుగా గుర్తిస్తున్నావు. కాని కాశీ రాజకన్యను నా ప్రీతికోసం స్వీకరించవు. కురునందనా! నీకు మరొక విధంగా (ఈమెను స్వీకరించక) శాంతి లభించదు. (40-41)
గృహాణేమాం మహాబాహో రక్షస్వ కులమాత్మనః।
త్వయా విభ్రంశితా హీయం భర్తారం నాధిగచ్ఛతి॥ 42
మహాబాహూ! ఈమెను స్వీకరించి నీ వంశాన్ని రక్షించుకో. ఈమె నీచేతనే భ్రష్టురాలయింది. భర్తను పొందలేకపోతోంది. (42)
తథా బ్రువంతం తమహం రామం పరపురంజయమ్।
నైతదేవం పునర్భావి బ్రహ్మర్షే కిం శ్రమేణ తే॥ 43
అలా అంటున్న ఆ శత్రుపురంజయుడయిన రాముడిని చూచి" బ్రహ్మర్షీ ఇది మళ్లీ జరిగే పని కాదు. మీకు శ్రమ ఎందుకు? (43)
గురుత్వం త్వయి సంప్రేక్ష్య జామదగ్న్య పురాతనమ్।
ప్రసాదయే త్వాం భగవన్ త్యక్తైషా తు పురా మయా॥ 44
జమదగ్నినందనా! భగవన్ పురాతనమైన మీ గురుత్వాన్ని చూసి నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఈమెను నేను పూర్వమే విడిచిపెట్టాను. (44)
కో జాతు పరభావాం హి నారీం వ్యాలీమివ స్థితామ్।
వాసయేత్ గృహే జానన్ స్త్రీణాం దోషో మహాత్యయః॥ 45
పరపురుషునియందు అనురాగం కలిగి ఆడుపాములాగ ఉన్నటువంటి స్త్రీని తెలిసి తెలిసి ఎవరు ఇంటిలో ఉంచుకొంటారు? స్త్రీలయొక్క ఈ దోషం గొప్ప అనర్థం కలిగిస్తుంది. (45)
న భయాద్ వాసవస్యాపి ధర్మం జహ్యాం మహావ్రత।
ప్రసీద మా వా యద్ వా తే కార్యం తత్ కురు మా చిరమ్॥ 46
మహావ్రతా! ఇంద్రునివలన భయంతోనైనా సరే నేను ధర్మాన్ని విడువను. నాపట్ల అనుగ్రహించినా మానినా సరే. నీవు చేయదలచుకొన్నది వెంటనే చేయి. (46)
అయం చాపి విశుద్ధాత్మన్ పురాణే శ్రూయతే విభో।
మరుత్తేన మహాబుద్ధే గీతః శ్లోకో మహాత్మనా॥ 47
"గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః।
ఉత్పథప్రతిపన్నస్య పరిత్యాగో విధీయతే"॥ 48
విశుద్ధహృదయుడవు, బుద్ధిమంతుడవు అయిన రామా! మహాత్ముడైన మరుత్తుడు చెప్పిన శ్లోకంలోని ఈ విషయం కూడా పురాణంలో వినబడుతూ ఉంది. కార్యా-కార్యాలు తెలియక చెడుమార్గంలో నడుస్తున్న అహంకార పూరితుడైన వాడు గురువు అయినా విడిచిపెట్టేయాలి. (47-48)
స త్వం గురురితి ప్రేమ్ణా మయా సమ్మానితో భృశమ్।
గురువృత్తిం న జానీషే తస్మాద్ యోత్స్యామి వై త్వయా॥ 49
గురువని నిన్ను ప్రేమతో ఎంతో గౌరవించాను. అట్టి నీవు గురుధర్మాన్ని తెలుసుకోలేకపోయావు. కాబట్టి నీతో యుద్ధం చేస్తాను. (49)
గురుం న హన్యాం సమరే బ్రాహ్మణం చ విశేషతః।
విశేషతస్తపోవృద్ధమ్ ఏవం క్షాంతం మయా తవ॥ 50
గురువును యుద్ధంలో చంపను. పైగా బ్రాహ్మణుడవు. విశేషించి తపస్సులో పండిపోయిన వాడవు. కనుక ఇంతవరకు నిన్ను సహించాను. (50)
ఉద్యతేషుమథో దృష్ట్వా బ్రాహ్మణం క్షత్రబంధువత్।
యో హన్యాత్ సమరే క్రుద్ధం యుధ్యంతమపలాయినమ్॥ 51
బ్రహ్మహత్యా న తస్య స్యాత్ ఇతి ధర్మేషు నిశ్చయః।
క్షత్రియాణాం స్థితో ధర్మే క్షత్రియోఽస్మి తపోధన॥ 52
బ్రాహ్మణుడై ఉండి క్షత్రియునిలాగ యుద్ధంలో ధనుర్బాణాలు ఎక్కుపెట్టి క్రోధంతో వెన్ను చూపకుండా యుద్ధం చేస్తూ ఉంటే, అతనిని సంహరించిన వాడికి బ్రహ్మహత్యా దోషం అంటదని ధర్మశాస్త్రాల నిశ్చయంగా చెప్తున్నాయి. తపోధనా! నేను క్షత్రియుడిని క్షత్రధర్మంలో ఉన్నవాడిని. (51-52)
యో యథా వర్తతే యస్మిన్ తస్మిన్నేవ ప్రవర్తయన్।
నాధర్మం సమవాప్నోతి న చాశ్రేయశ్చ విందతి॥ 53
ఎవరు ఎవరిపట్ల ఎలా ప్రవర్తిస్తారో, వారి పట్ల అలానే ప్రవర్తించడం అధర్మం కాబోదు. అందువల్ల అనర్థం కలగబోదు. (53)
వి॥సం॥ ఎవరైనా ప్రీతితోగాని ద్వేషంతోగాని ప్రవర్తిస్తే వారిపట్ల అలాగే ప్రీతిని గాని ద్వేషాన్నిగాని చూపడం అధర్మం కాదు. (నీల) మేలు కోరేవాడిపట్ల మేలును, కీడుకోరేవాడిపట్ల కీడును చేయడం(అర్జు)
అర్థే వా యది వా ధర్మే సమర్థో దేశకాలవిత్।
అర్థసంశయమాపన్నః శ్రేయాన్నిఃసంశయో నరః॥ 54
అర్థాన్నిగాని(ప్రయోజనం) ధర్మాన్నిగాని సాధించగల సమర్థుడు, దేశకాలా లెరిగినవాడై అర్థవిషయమై సంశయం పొందినపుడు నిస్సంశయమైన ధర్మాన్ని ఆచరించి శ్రేష్ఠుడవుతాడు. (54)
వి॥సం॥ 'అర్థం' అంటే గురువాక్యాన్ని పాటించడం ద్వారా భార్యను పొందడం. ధర్మం అంటే గురు వాక్యాన్ని ధిక్కరించి తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడం. ఈ రెండింటిలో అర్థాన్ని సంశయించి, నిస్సంశయంగా ధర్మాన్ని పాటిస్తేనే శ్రేష్ఠుడవుతాడు. (నీల)
యస్మాత్ సంశయతేఽప్యర్థేఽ యథాన్యాయం ప్రవర్తసే।
తస్మాద్ యోత్స్యామి సహితః త్వయా రామ మహాహవే॥ 55
రామా! సంశయింపదగిన విషయంలో కూడా న్యాయాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తున్నావు. కాబట్టి మహాయుద్ధంలో నీతో ఎదిరించి పోరాడతాను. (55)
వి. సంశయింపదగిన విషయం - అంబను స్వీకరించవచ్చునా? కూడదా? అనేది.
పశ్య మే బాహువీర్యం చ విక్రమం చాతిమానుషమ్।
ఏవం గతేఽపి తు మయా యచ్ఛక్యం భృగునందన॥ 56
తత్ కరిష్యే కురుక్షేత్రే యోత్స్యే విప్ర త్వయా సహ।
ద్వంద్వే రామ యథేష్టం మే సజ్జీభవ మహాద్యుతే॥ 57
భృగునందనా! బాణాలు సంధించడంలో నా బాహుబలాన్ని అతి మానుషమైన పరాక్రమాన్ని చూడు. ఈ స్థితిలో కూడా నా చేతనైనది నేను చేస్తాను. విప్రుడా! కురుక్షేత్రంలో నీతోయుద్ధం చేస్తాను. రామా! తేజశ్శాలీ! నాకిష్టమైన రీతిగా నీవు సిద్ధపడు. (56-57)
వి॥సం॥ "ఏవంగతేఽపి" ఇలా నీవు ఉన్నప్పటికీ (నీల); తెలిసి ఉన్నప్పటికీ (అర్జు); ఇలాంటి నీతో(సర్వ)
తత్ర త్వం నిహతో రామ మయా శరశతార్దితః।
ప్రాప్స్యసే నిర్జితాంల్లోకాన్ శస్త్రపూతో మహారణే॥ 58
రామా! అక్కడ నీవు నా వందల కొద్దీ బాణాల చేత పీడింపబడి, చనిపోయి, మహారణంలో శస్త్రాల చేత పవిత్రుడవై దివ్యలోకాలను పొందుతావు. (58)
స గచ్ఛ వినివర్తస్వ కురుక్షేత్రం రణప్రియ।
తత్రైష్యామి మహాబాహో యుద్ధాయ త్వాం తపోధన॥ 59
తపోధనా! యుద్ధప్రియా! మహాబాహూ! వెనుతిరుగు. కురుక్షేత్రానికి వెళ్లు. అక్కడే యుద్ధం కోసం నిన్ను కలుసుకుంటాను. (59)
అపి యత్ర త్వయా రామ కృతం శౌచం పురా పితుః।
తత్రాహమపి హత్వా త్వాం శౌచం కర్తాస్మి భార్గవ॥ 60
భార్గవరామా! పూర్వం నీ తండ్రి శౌచం పొందిన చోటనే (తండ్రి మరణిస్తే ఆ ఆశౌచాన్నుండి రాజుల రక్త తర్పణం ద్వారా శుచి అయ్యాడు) నేను కూడా నిన్ను చంపాక శుచి అవుతాను. (60)
వి॥సం॥ పరశురాముడు - తండ్రి మరణించాక రాజులందరినీ చంపి, కురుక్షేత్రంలో రక్తతర్పణం విడిచి శుచిఅయ్యాడు. గురువుకూడా తండ్రి వంటి వాడే కాబట్టి భీష్ముడు తాను కూడా గురువును చంపాక అక్కడే తర్పణం వదిలి శుచి అవుతా నంటున్నాడు. (నీల)
తత్ర రామ సమాగచ్ఛ త్వరితం యుద్ధదుర్మద।
వ్యపనేష్యామి తే దర్పం పౌరాణం బ్రాహ్మణబ్రువ॥ 61
బ్రాహ్మణుడవనిపించుకుంటున్న యుద్ధదుర్మదుడవైన రామా! అక్కడికి వెంటనే రా. పూర్వం గడించుకున్న నీ దర్పాన్నంతటినీ పోగొడతాను. (61)
యచ్చాపి కథ్యసే రామ బహుశః పరిషత్సు వై।
నిర్జితాః క్షత్రియా లోకే మయైకేనేతి
తచ్ఛృణు॥ 62
రామా! అనేక సభలలో "నేను ఒక్కడినే లోకంలోని క్షత్రియులందరినీ సంహరించాను. అని చెప్పుకుంటున్నావు. దానికి సమాధానం విను. (62)
న తదా జాతవాన్ భీష్మః క్షత్రియో వాపి మద్విధః।
పశ్చాజ్జాతాని తేజాంసి తృణేషు జ్వలితం త్వయా॥ 63
అప్పుడు భీష్ముడు లేదా నావంటి క్షత్రియుడు పుట్టి ఉండలేదు. తరువాత వీరులు పుట్టారు. నీవు గడ్డిపరకలలో మండావు. (గడ్డి పరకలవంటి రాజులను చంపగలిగావు) (63)
యస్తే యుద్ధమయం దర్పం కామం చ వ్యపనాశయేత్।
సోహం జాతో మహాబాహో భీష్మః పరపురంజయః।
వ్యపనేష్యామి తే దర్పం యుద్ధే రామ న సంశయః॥ 64
మహాబాహూ! నీ యుద్ధ సంబంధమైన దర్పాన్ని, కోరికను పోగొట్టగలిగిన శత్రుపురంజయుడైన భీష్ముడిని నేను పుట్టాను. రామా! యుద్ధంలో నీ దర్పాన్ని నాశనం చేస్తాను. సందేహం లేదు. (64)
భీష్మ ఉవాచ
తతో మామబ్రవీద్ రామః ప్రహసన్నివ భారత।
దిష్ట్యా భీష్మ మయా సార్థం యోద్ధుమిచ్ఛసి సంగరే॥ 65
భరతవంశీయుడా! అప్పుడు రాముడు పరిహాసపూర్వకంగా నాతో ఇలా అన్నాడు. భీష్మా! అదృష్టంకొద్దీ యుద్ధంలో నాతో తలపడా లనుకొంటున్నావు. (65)
అయం గచ్ఛామి కౌరవ్య కురుక్షేత్రం త్వయా సహ।
భాషితం తే కరిష్యామి తత్రాగచ్ఛ పరంతప॥ 66
తత్ర త్వాం నిహతం మాతా మయా శరశతాచితమ్।
జాహ్నవీ పశ్యతాం భీష్మ గృధ్రకంకబలాశనమ్॥ 67
కురునందన! ఇదిగో! నీతో కలిసి కురుక్షేత్రానికి వెళ్తున్నాను. అక్కడికి రా. నీ మాట నెరవేరుస్తాను. అక్కడ నాచేత చచ్చి వందలకొద్దీ బాణాలు గుచ్చుకుని కాకులకు గ్రద్దలకు ఆహారమయ్యే నిన్ను నీ తల్లి గంగాదేవి చూస్తుందిలే. (66-67)
కృపణం త్వామభిప్రేక్ష్య సిద్ధచారణసేవితా।
మయా వినిహతం దేవీ రోదతామద్య పార్థివ॥ 68
రాజా! సిద్ధుల చేత చారణులచేత సేవింపబడే ఆ గంగాదేవి దీనుడవై నాచేత చచ్చిన నిన్ను చూసి ఏడ్చునుగాక! (68)
అతదర్హా మహాభాగా భగీరథసుతానఘా।
యా త్వామజీజనన్మందం యుద్ధకాముకమాతురమ్॥ 69
మహాభాగురాలు, పాపరహిత అయిన భాగీరథి దీనికి అర్హురాలు కాకపోయినప్పటికి(ఇలాంటి దుఃఖం పొందడానికి) నీలాంటి యుద్ధకాముకుడ్ని, తొందర పాటు కలవాడిని కన్నందుకు తప్పదు. (69)
ఏహి గచ్ఛ మయా భీష్మ యుద్ధకాముక దుర్మద।
గృహాణ సర్వం కౌరవ్ట రథాది భరతర్షభ॥ 70
భరతపుంగవా! కురునందనా! యుద్ధకాంక్షా ద్ర్మదా! భీష్మా! రా! నాతో యుద్ధానికి, నీ రథాది సామగ్రినంతటినీ తెచ్చుకో. (70)
ఇతి బ్రువాణం తమహం రామం పరపురంజయమ్।
ప్రణమ్య శిరసా రామమ్ ఏవమస్త్విత్యథాబ్రువమ్॥ 71
ఇలా అంటున్న శత్రుపురంజయుడైన ఆ రాముడిని చూసి నేను శిరసువంచి నమస్కరించి రామా! "ఏవమస్తు" (అలాగే అగుగాక) అని పలికాను. (71)
ఏవముక్త్వా యయౌ రామః కురుక్షేత్రం యుయుత్సయా।
ప్రవిశ్య నగరం చాహం సత్యవత్యై న్యవేదయమ్॥ 72
ఇలా చెప్పిన రాముడు యుద్ధం చేయాలనే కోరికతో కురుక్షేత్రానికి బయల్దేరాడు. నేను కూడా నగరానికి వెళ్లి సత్యవతికి విషయాన్ని నివేదించాను. (72)
తతః కృతస్వస్త్యయనః మాత్రా చ ప్రతినందితః।
ద్విజాతీన్ వాచ్య పుణ్యాహం స్వస్తి చైవ మహాద్యుతే॥ 73
రథమాస్థాయ రుచిరం రాజతం పాండురైర్హయైః।
సూపస్కరం స్వధిష్ఠానం వైయాఘ్రపరివారణమ్॥ 74
ఉపపన్నం మహాశస్త్రైః సర్వోపకరణాన్వితమ్।
తత్కులీనేన వీరేణ హయశాస్త్రవిదా రణే॥ 75
యత్తుం సూతేన శిష్టేన బహుశో దృష్టకర్మణా।
మహాతేజస్వీ! అప్పుడు తల్లి స్వస్త్వయనం చేయించి నన్ను అభినందించింది. బ్రాహ్మణులు పుణ్యాహస్వస్తివాచనాలు చేశారు. తెల్లని గుర్రాలతో ప్రకాశించే అందమైన రథం సిద్ధమయింది. అందులో ఖడ్గం, చక్రం ఉన్నాయి. వ్యాఘ్రచర్మం కప్పబడి ఉంది. గొప్ప ఆయుధాలు, సమస్త ఉపకరణాలతో నిండి ఉంది. యుద్ధంలో అనేక పర్యాయాలు పరీక్షింపబడిన, అశ్వ శాస్త్రవేత్త అయిన, విశిష్టుడు, కులీనుడు, వీరుడు అయిన సూతుడు నియమితుడయ్యాడు. (73-75 1/2)
దంశితః పాండురేణాహం కవచేన వపుష్మతా॥ 76
పాండురం కార్ముకం గృహ్య ప్రాయాం భరతసత్తమ।
భరతవీరుడా! శరీరాన్ని ఆవరించిన తెల్లని కవచం ధరించి, తెల్లని ధనుస్సు పట్టుకొని నేను యుద్ధయాత్రకు బయలుదేరాను. (76)
పాండురేణాతపత్రేణ ధ్రియమాణేన మూర్ధని॥ 77
పాండురైశ్చాపి వ్యజనైః వీజ్యమానో నరాధిప।
శుక్లవాసాః సితోష్ణీషః సర్వశుక్లవిభూషణః॥ 78
రాజా! తెల్లని ఛత్రం శిరసుపై వెలుగొందుతూ ఉండగా, తెల్లని చామరాలతో వీచబడుతూ, తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని శిరస్త్రాణం ధరించి, తెల్లని ఆభరణాలన్నీ ధరించి బయల్దేరాను. (77-78)
స్తూయమానో జయాశీర్భిః నిష్క్రమ్య గజసాహ్వయాత్।
కురుక్షేత్రం రణక్షేత్రమ్ ఉపాయాం భరతర్షభ॥ 79
భరతవీరా! జయాశీస్సులతో ప్రశంసిస్తూండగా కరిపురాన్నుండి వెలువడి, రణభూమి అయిన కురుక్షేత్రాన్ని చేరుకున్నాను. (79)
తే హయాశ్చోదితాస్తేన సూతేన పరమాహవే।
అవహన్ మాం భృశం రాజన్ మనోమారుతరంహసః॥ 80
రాజా! గాలితో, మనసుతో సమానమైన వేగం కల గుర్రాలు సూతుడు తోలగానే నన్ను సరిగ్గా యుద్ధరంగానికి కొనిపోయాయి. (80)
గత్వాహం తత్ కురుక్షేత్రం స చ రామః ప్రతాపవాన్।
యుద్ధాయ సహసా రాజన్ పరాక్రాంతౌ పరస్పరమ్॥ 81
అప్పుడు నేను, ప్రతాపవంతుడయిన రాముడు కురుక్షేత్రానికి చేరుకొని పరస్పరం యుద్ధానికి వెంటనే పరాక్రమించాం. (81)
తతః సందర్శనేఽతిష్ఠం రామస్యాతితపస్వినః।
ప్రగృహ్య శంఖప్రవరం తతః ప్రాథమముత్తమమ్॥ 82
అప్పుడు మిక్కిలి తపోనిష్ఠకల ఆ రాముని ఎదుట నిలబడి నేను శ్రేష్ఠమయిన శంఖాన్ని పట్టుకొని ఊదాను. (82)
తతస్తత్ర ద్విజా రాజన్ తాపసాశ్చ వనౌకసః।
అపశ్యంత రణం దివ్యం దేవాః సేంద్రగణాస్తదా॥ 83
రాజా! ఆ సమయంలో బ్రాహ్మణులు, తాపసులు, అరణ్యవాసులు, ఇంద్ర సహితమైన దేవగణాలు దివ్యమైన ఆ యుద్ధాన్ని చూడసాగారు. (83)
తతో దివ్యాని మాల్యాని ప్రాదురాసంస్తతస్తతః।
వాదిత్రాని చ దివ్యాని మేఘవృందాని చైవ హ॥ 84
అప్పుడు దివ్యమైన మాలలు అక్కడక్కడ వెలిశాయి. దివ్యవాద్యాలు మ్రోగాయి. మేఘపంక్తులు కనిపించాయి. (84)
తతస్తే తాపసాః సర్వే భార్గవస్యానుయాయినః।
ప్రేక్షకాః సమపద్యంత పరివార్య రణాజిరమ్॥ 85
భార్గవరాముని అనుయాయులైన ఆ తాపసులందరూ యుద్ధభూమిని ఆవరించి ప్రేక్షకులయ్యారు. (85)
తతో మామబ్రవీద్ దేవీ సర్వభూతహితైషిణీ।
మాతా స్వరూపిణీ రాజన్ కిమిదం తే చికీర్షితమ్॥ 86
రాజా! సమస్తప్రాణులకు మేలు చేయగోరీ దేవి నా తల్లి గంగ స్వరూపంతో వచ్చి "నాయనా! ఏమి చేయాలనుకుంటున్నావు?" అని నన్నడిగింది.(86)
గత్వాహం జామదగ్న్యం తు ప్రయాచిష్యే కురూద్వహ।
భీష్మేణ సహ మా యోత్సీః శిష్యేణేతి పునః పునః॥ 87
కురువంశోత్తమా! నేను జమదగ్ని సుతుడయిన రాముని వద్దకు వెళ్లి నీ శిష్యుడయిన భీష్మునితో యుద్ధం చేయవద్దని పదే పదే యాచిస్తాను" అని అన్నది. (87)
మామైవం పుత్ర నిర్బంధం కురు విప్రేణ పార్థివ।
జామదగ్న్యేన సమరే యోద్ధుమిత్యేవ భర్త్సయత్॥ 88
"నాయనా! ఇలాంటి పంతం పట్టకు, జమదగ్నిసుతునితో యుద్ధం చేయాలని కోరుకోకు" అని నిందించసాగింది. (88)
కిన్న వై క్షత్రియహణః హరతుల్యపరాక్రమః।
విదితః పుత్ర రామస్తే యతస్తం యోద్ఢ్Hఉమిచ్ఛసి॥ 89
ఆ రాముడు రుద్రునితో సమానమైన పరాక్రమం గలవాడు. క్షత్రియ సంహారకుడు. ఇది నీవెరిగినదే కదా! అతనితో యుద్ధం ఎందుకు చేయాలనుకుంటున్నావు? (89)
తతోఽహమబ్రువం దేవీమ్ అభివాద్య కృతాంజలిః।
సర్వం తద్ భరతశ్రేష్ఠ యథావృత్తం స్వయంవరే॥ 90
భరతశ్రేష్ఠుడా! అప్పుడు నేను ఆ దేవికి మొక్కి దోసిలొగ్గి స్వయంవరంలో జరిగినదంతా యథాతథంగా చెప్పాను. (90)
యథా చ రామో రాజేంద్ర మయా పూర్వం ప్రచోదితః।
కాశిరాజసుతాయాశ్చ యథాకర్మ పురాతనమ్॥ 91
రాజేంద్రా! నేను ఇంతకు ముందు పరశురామునితో మాట్లాడిన మాటలు, కాశీరాజు కూతురు చేసిన పని అంతా విశదంగా చెప్పాను. (91)
తతః సా రామమభ్యేత్య జననీ మే మహానదీ।
మదర్థం తమృషిం వీక్ష్య క్షమయామాస భార్గవమ్॥ 92
అంతట నా తల్లి అయిన ఆ మహానది గంగ పరశురాముని సమీపించి, అతడిని చూసి నాకోసం క్షమించమని వేడుకుంది. (92)
భీష్మేణ సహ మా యోత్సీః శిష్యేణేతి వచోబ్రవీత్।
స చ తామాహ యాచంతీం భీష్మమేవ నివర్తయ।
న చ మే కురుతే కామమ్ ఇత్యహం తముపాగమమ్॥ 93
"నీ శిష్యుడైన భీష్మునితో యుద్ధం చేయకు" అని చెప్పింది. అతడు కూడా అలా ప్రార్థించిన ఆమెతో "భీష్ముడిని మరల్చు. అతడు నేను కోరినట్లు చేయలేదు. కాబట్టి అతడితో పోరుకు సిద్ధమయ్యాను" అన్నాడు. (93)
వైశంపాయన ఉవాచ
తతో గంగా సుతస్నేహాద్ భీష్మం పునరుపాగమత్।
న చాస్యాశ్చాకరోద్ వాక్యం క్రోధపర్యాకులేక్షణః॥ 94
వైశంపాయనుడు అన్నాడు - అప్పుడు గంగాదేవి పుత్రవాత్సల్యంతో మళ్లీ భీష్ముడి దగ్గరకు వచ్చింది. కాని కోపంతో నిండిన కళ్లతోఉన్న ఆ భీష్ముడు కూడా ఆమె వాక్యాన్ని పాటించలేదు. (94)
అథాదృశ్యత ధర్మాత్మా భృగుశ్రేష్ఠో మహాతపాః।
ఆహ్వయామాస చ తదా యుద్ధాయ ద్విజసత్తమః॥ 95
అంతలోనే ధర్మాత్ముడు, మహాతపస్వి, బ్రాహ్మణోత్తముడు అయిన భృగువంశరాముడు యుద్ధానికి పిలుస్తూ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. (95)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి పరశురామభీష్మయోః కురుక్షేత్రావతరణే అష్టసప్తత్యధికశతతమోఽధ్యాయః॥ 178
ఇది శ్రీ మాహాభారతమున ఉద్యోగపర్వమున అంబోపాఖ్యాన పర్వమను ఉపపర్వమున భీష్మపరశురాములు యుద్ధమునకు కురుక్షేత్రమును చేరుట అను నూటడెబ్బది ఎనిమిదవ అధ్యాయము. (178)