177. నూటడెబ్బది యేడవ అధ్యాయము

అకృతవ్రణుడు, పరశురాముడు అంబతో సంభాషించుట.

అకృతవ్రణ ఉవాచ
దుఃఖద్వయమిదం భద్రే కతరస్య చికీర్షసి।
ప్రతికర్తవ్యమబలే తత్ త్వం వత్సే వదస్వ మే॥ 1
అమ్మాయీ! నీకిప్పుడు రెండు దుఃఖ కారణాలున్నాయి. (ఒకటి సాళ్వుడు, రెండు భీష్ముడు - వలన కలిగినవి) ఈ రెండిటిలో దేనికి ప్రతీకారం చేయదలచుకున్నావు? అది నాకు నీవు చెప్పు. (1)
వి।సం॥ 'దుఃఖద్వయం' అంటే దుఃఖం కలిగించే కారణాలు రెండు భీష్మసాల్వుల రూపంలో, లేదా నీకు భర్త లేకపోవడం, నీ శత్రువును వధించడం - అనే తాపసులయొక్క రెండు దుఃఖాలు, లేదా ఇద్దరినీ భ్రష్టులను చేయడం - వధించడం - అనే రెండు దుఃఖాలు(కష్టాలు) (నీల)
యది సౌభపతిర్భద్రే నియోక్తవ్యో మతస్తవ।
నియోక్ష్యతి మహాత్మా స రామస్త్వద్ధితకామ్యయా॥ 2
అమ్మా! నీకిష్టమయితే మహాత్ముడయిన ఆ రాముడు నీ మేలుకోరి సౌభపతి అయిన సాల్వుని నిన్ను పెళ్లి చేసుకోమని ఆజ్ఞాపించగలడు. (2)
అథాపగేయం భీష్మం త్వం రామేణేచ్ఛసి ధీమతా।
రణే వినిర్జితం ద్రష్టుం కుర్యాత్ తదపి భార్గవః॥ 3
అలా కాకుండా ధీమంతుడయిన రాముడు గంగా సుతుడయిన భీష్ముని యుద్ధంలో ఓడించడం చూడాలని నీవు కోరుకుంటే, అదికూడా భార్గవరాముడు చేయగలడు. (3)
వి॥సం॥ సత్యప్రతిజ్ఞుడైన భీష్ముడిని జయించినంత మాత్రం చేత నీకు మేలు కలుగదని చెప్పే ఉద్దేశంతో 'అథ' (అలా కాకుండా) అని ప్రారంభించాడు(నీల)
సృంజయస్య వచః శ్రుత్వా తవ చైవ శుచిస్మితే।
యదత్ర తే భృశం కార్యం తదద్యైవ విచింత్యతామ్॥ 4
సృంజయవంశీకుడయిన హోత్రవాహనుని మాటలు చెవినిడి, నీ మనసులోని అభిప్రాయాన్ని కూడా పరిగణించుకొని ఇప్పుడు ఏది తప్పనిసరిగా చేయాలో అది ఇప్పుడే నిశ్చయించుకో. (4)
అంబోవాచ
అపనీతాస్మి భీష్మేణ భగవన్నవిజానతా।
నాభిజానాతి మే భీష్మః బ్రహ్మన్ సాల్వగతం మనః॥ 5
అంబ అన్నది - భగవన్! నా మనసు సాల్వుని వశం అయిందని భీష్ముడెరుగడు. తెలియకుండానే అతడు నన్ను ఎత్తుకొని వచ్చాడు. (5)
ఏతద్ విచార్య మనసా భవానేతద్ వినిశ్చయమ్।
విచినోతు యథాన్యాయం విధానం క్రియతాం తథా॥ 6
ఇది కూడా మనసులో ఉంచుకొని మీరే ఏమి చేయాలో నిశ్చయించండి. ఎలా న్యాయమో అలా ప్రతీకారం చేయండి. (6)
భీష్మే వా కురుశార్దూలే సాల్వరాజోఽథవా పునః।
ఉభయోరేవ బ్రహ్మన్ యుక్తం యత్ తత్ సమాచర॥ 7
బ్రాహ్మణోత్తమా! కురుశ్రేష్ఠుడయిన భీష్ముని పట్ల గాని, సాల్వరాజు పట్లగాని, లేదా ఇద్దరిపట్లగాని ఏదియుక్తమో అది చేయండి. (7)
నివేదితం మయా హ్యేతద్ దుఃఖమూలం యథాతథమ్।
విధానం తత్ర భగవన్ కర్తుమర్హసి యుక్తితః॥ 8
దేవా! నా ఈ దుఃఖానికి మూలమైన విషయాన్ని యథాతథంగా మీకు నివేదించాను. ఈ విషయంలో మీరు యుక్తిగా(న్యాయంగా) ప్రతీకారం చేయగలరు. (8)
అకృతవ్రణ ఉవాచ
ఉపపన్నమిదం భద్రే యదేవం వరవర్ణిని।
ధర్మం ప్రతి వచో బ్రూయాః శృణు చేదం వచో మమ॥ 9
అప్పుడు అకృతవ్రణుడన్నాడు - అమ్మయీ! నీవు చెప్పినదంతా ధర్మబద్ధంగా ఉచితంగా ఉంది. నేను చెప్పేది కూడా విను. (9)
యది త్వామాపగేయో వై న నయేద్ గజసాహ్వయమ్।
సాలస్త్వాం శిరసా భీరు గృహ్ణీయాద్ రామచోదితః॥ 10
పిరికిదానా! ఆ గంగాసుతుడు నిన్ను కరినగరానికి తీసుకుపోకపోతే, సాల్వుడు నిన్ను పరశురాముని మాట తలదాల్చి స్వీకరించేవాడు. (10)
తేన త్వం నిర్జితా భద్రే యస్మాన్నీతాసి భావిని।
సంశయః సాల్వరాజస్య తేన త్వయి సుమధ్యమే॥ 11
భద్రే భీష్ముడు నిన్ను జయించి తీసుకొని వెళ్లడం వల్లనే సాల్వరాజుకు నీమీద సంశయం కలిగింది. (11)
భీష్మః పురుషమానీ చ జితకాశీ తథైవ చ।
తస్మాత్ ప్రతిక్రియా యుక్తా భీష్మే కారయితుం తవ॥ 12
భీష్ముడు ధర్మపురుషార్థం పట్ల పట్టుదల గలవాడు. అంతేకాదు. జయకాంక్ష కలవాడు కూడా. కాబట్టి నీవు భీష్మునిపట్ల ప్రతీకారం తీర్చుకోవడమే యుక్తం. (12)
అంబోవాచ
మమాప్యేష సదా బ్రహ్మన్ హృది కామోఽభివర్తతే।
ఘాతయేయం యది రణే భీష్మమిత్యేవ నిత్యదా॥ 13
భీష్మం వా సాల్వరాజం వా యం వా దోషేణ గచ్ఛసి।
ప్రశాధి తం మహాబాహో యత్కృతేహం సుదుఃఖితా॥ 14
బ్రాహ్మణోత్తమా! నాకు కూడా మనసులో ఇదే కోరిక ఎప్పుడూ ఉంది. భీష్ముడిని యుద్ధంలో చంపించాలని ఎప్పుడూ అనుకుంటున్నాను. మహాబాహూ! భీష్ముడయినా, సాల్వరాజయినా దోషం చేసినవాడు, ఎవరివల్ల నేనింత దుఃఖం అనుభవిస్తున్నానో వాడిని శాసించు. (13-14)
భీష్మ ఉవాచ
ఏవం కథయతామేవ తేషాం స దివసో గతః।
రాత్రిశ్చ భరతశ్రేష్ఠ సుఖశీతోష్ణమారుతా॥ 15
భరతవంశశ్రేష్ఠుడా! వాళ్లు ఇలా మాట్లాడుకొంటూ ఉండగానే ఆ పగలు గడచిపోయింది. రాత్రికూడా సుఖకరమై నులి వెచ్చని, చల్లని గాలులతో గడిచిపోయింది. (15)
తతో రామః ప్రాదురాసీత్ ప్రజ్వలన్నివ తేససా।
శిష్యైః పరివృతో రాజన్ జటాచీరధరో మునిః॥ 16
రాజా! అప్పుడు శిష్యులతో కూడి, నారచీరలు, జడలు ధరించిన ముని ఆ భార్గవరాముడు తన తేజస్సుతో ప్రకాశిస్తూ ప్రత్యక్షమయ్యాడు. (16)
ధనుష్పాణిరదీనాత్మా ఖడ్గంఊ, ధరించి, ధీరుడై, రజోగుణరహితుడై సృంజయవంశానికి చెందిన ఆ హోత్టవాహనుని సమీపించాడు. (17)
తతస్తం తాపసా దృష్ట్వా స చ రాజా మహాతపాః।
తస్థుః ప్రాంజలయో రాజన్ సా చ కన్యా తపస్వినీ॥ 18
అంతట అక్కడున్న మునులు, మహాతపస్వి అయిన ఆ రాజు, తాపసవేషంతో ఉన్న ఆ అంబ అందరూ అంజలి ఘటించి లేచి నిల్చున్నారు. (18)
పూజయామాసురవ్యగ్రాః మధుపర్కేణ భార్గవమ్।
అర్చితశ్చ యథాన్యాయం నిషసాద సహైవ తైః॥ 19
తతః పూర్వవ్యతీతాని కథయంతౌ స్మ తావుభౌ।
ఆసాతాం జామదగ్న్యశ్చ సృంజయశ్పైవ భారత॥ 20
భారత! జమదగ్నికొడుకు పరశురాముడు, సృంజయ వంశపురాజు హోత్రవాహనుడు ఇద్దరూ గడిచిపోయిన సంగతులను గూర్చి ముచ్చటించుకొంటూ కూర్చున్నారు. (20)
తథా కథాంతే రాజర్షిః భృగుశ్రేష్ఠం మహాబలమ్।
ఉవాచ మధురం కాలే రామం వచనమర్థవత్॥ 21
ఆ మాటలు ముగిశాక రాజర్షి హోత్రవాహనుడు భృగువంశశ్రేష్ఠుడూ మహాబలవంతుడూ అయిన పరశురామునితో ఆ సమయంలో మధురంగా అర్థవంతంగా ఇలా అన్నాడు. (21)
రామేయం మమ దౌహిత్రీ కాశిరాజసుతా ప్రభో।
అస్యాః శృణు యథాతత్త్వం కార్యం కార్యవిశారద॥ 22
ప్రభూ! రామా! ఈమె నా మనుమరాలు. కాశీరాజు కూతురు. కార్యకుశలుడా! ఈమె కార్యం ఏమిటో, విషయమంతా ఈమె ద్వారానే విను. (22)
పరమం కథ్యతాం చేతి తాం రామః ప్రత్యభాషత।
తతః సాభ్యగమద్ రామం జ్వలంతమివ పావకమ్॥ 23
తతోఽభివాద్య చరణౌ రామస్య శిరసా శుభౌ।
స్పృష్ట్వా పద్మదలాభాభ్యాం పాణిభ్యామగ్రతః స్థితా॥ 24
సరే, చెప్పు' అన్నాడు పరశురాముడు. వెంటనే ఆమె అగ్నిలా జ్వలిస్తున్న రాముడిని సమీపించింది. అతని శుభకరమైన పాదాలమీద తలవాల్చి తామరరేకులవంటి చేతులతో స్పృశీంచి నమస్కరించి ఎదుట నిలిచింది. (24)
వి॥సం॥ 'పరమం' - అంటే నీవు అనుకొన్నది నాకు చెప్పవలసినది" అని అర్థం (నీల)
రురోద సా శోకవతీ బాష్పవ్యాకులలోచనా।
ప్రపేదే శరణం చైవ శరణ్యం భృగునందనమ్॥ 25
నీళ్లు నిండిన కళ్లతో, దుఃఖంతో, ఏడుస్తూ ఆమె శరణుకోరదగిన ఆ పరశురాముని శరణు వేడింది. (25)
రామ ఉవాచ
యథా త్వం సృంజయస్యాస్య తథా మే త్వం నృపాత్మజే।
బ్రూహి యత్ తే మనోదుఃఖం కరిష్యే వచనం తవ॥ 26
రాముడిలా అన్నాడు. రాకుమారీ! నీవు సృంజయునికి ఎలాగో నాకూ అలాగే (మనుమరాలివి). నీ మనసులోని బాధ ఏమిటో చెప్పు. నీ మాట నెరవేరుస్తాను. (26)
అంబోవాచ
భగవన్ శరణం త్వాద్య ప్రపన్నాస్మి మహావ్రతమ్।
శోకపంకార్ణవాన్మగ్నాం ఘోరాదుద్ధర మాం విభో॥ 27
అంబ అన్నది. ప్రభూ! మహనియమవంతుడవైన నిన్ను ఇప్పుడు శరణు పొందుతున్నాను. ఘోరమైన శోకమనే ఊబిలో మునిగిపోతున్న నన్ను ఉద్ధరించు. (27)
భీష్మ ఉవాచ
తస్యాశ్చ దృష్ట్వా రూపం చ వపుశ్చాభినవం పునః।
సౌకుమార్యం పరం చైవ రామశ్చింతాపరోఽభవత్॥ 28
కిమియం వక్ష్యతీత్యేవం విమమర్శ భృగూద్వహః।
ఇతి దధ్యౌ చిరం రామః కృపయాభిపరిప్లుతః॥ 29
భీష్ముడిలా చెప్పాడు - ఆమె రూపాన్ని, లేతదైన శరీరాన్ని, మిక్కిలి సౌకుమార్యాన్ని చూసి పరశురాముడు చింతా క్రాంతుడయ్యాడు. ఈమె ఏం చెపుతుందా అని అనుకోసాగాడు. దయతో కరిగిపోయిన అతడు చాలాసేపు అలాగే ఉండిపోయాడు. (28-29)
కథ్యతామితి సా భూయః రామేణోక్తా శుచిస్మితా।
సర్వమేవ యథాతత్త్వం కథయామాప భార్గవే॥ 30
చెప్పవలసిందని మళ్లీ రాముడు అడగగానే ఆమె సర్వవృత్తాంతాన్ని ఉన్నది ఉన్నట్లుగ రామునికి నివేదించింది. (30)
తచ్ఛ్రుత్వా జామదగ్న్యస్తు రాజపుత్ర్యా వచస్తదా।
ఉవాచ తాం వరారోహాం నిశ్చిత్యార్థవినిశ్చయమ్॥ 31
రాకుమారి అంబ చెప్పిన ఆ మాటలు విని పరశురాముడు చేయగల కార్యాన్ని నిశ్చయించి ఆ సుందరాంగితో ఇలా అన్నాడు. (31)
రామ ఉవచ
ప్రేషయిష్యామి భీష్మాయ కురుశ్రేష్ఠాయ భామిని।
కరిష్యతి వచో మహ్యం శ్రుత్వా చ స నరాధిపః॥ 32
రాముడంటున్నాడు - సుందరీ! కురుశ్రేష్ఠుడు అయిన భీష్ముని దగ్గరకు నిన్ను పంపుతాను. ఆ రాజు నా మాట విని తప్పక పాటిస్తాడు. (32)
న చేత్ కరిష్యతి వచః మయోక్తం జాహ్నవీసుతః।
ధక్ష్యామ్యహం రణే భద్రే సామాత్యం శస్త్రత్ఱ్జసా॥ 33
భద్రా! గంగాసుతుడు నేను చెప్పింది చేయకపోతే యుద్ధంలో నా శస్త్రతేజస్సుతో అతనిని మంత్రిసహితంగా కాల్చివేస్తాను. (33)
అథవా తే మతిస్తత్ర రాజపుత్రి న వర్తతే।
యావచ్ఛాల్వపతిం వీరం యోజయామ్యత్ర కర్మణి॥ 34
రాజపుత్రీ! ఒకవేళ ఇది నీకు ఇష్టం లేకపోతే ముందే వీరుడైన సాల్వుడిని ఈ పని చేయమని నియోగిస్తాను. (34)
అంబోవాచ
విసర్జితాహం భీష్మేణ శ్రుత్వైవ భృగునందన।
సాల్వరాజగతం భావం మమ పూర్వం మనీషితమ్॥ 35
అంబ అన్నది - భృగునందన! నా మనసు సాల్వరాజునందు లగ్నమైందని పూర్వమే అతనిని కోరుకున్నానని విన్నవెంటనే భీష్ముడు నన్ను వదిలివేశాడు. (35)
సౌభరాజముపేత్యాహమ్ అవోచం దుర్వచం వచః।
న చ మాం ప్రత్యగృహ్ణాత్ స చారిత్ర్యపరిశంకితః॥ 36
సౌభరాజు సాల్వుని దగ్గరకు వెళ్లి నేను చెప్పరాని రీతిలో (సిగ్గుపడే విధంగా) అనేక విధాలుగా చెప్పాను. అయినా అతడు నా శీలాన్ని శంకించి నన్ను తిరస్కరించాడు. (36)
ఏతత్ సర్వం వినిశ్చిత్య స్వబుద్ధ్యా భృగునందన।
యదత్రౌపయికం కార్యం తచ్చింతయితుమర్హసి॥ 37
భృగునందనా! ఇదంతా మీకు మీరుగా ఆలోచించి ఇప్పుడు ఏది యుక్తమో అది చేయవలసిందిగా కోరుతున్నాను. (37)
మమ తు వ్యసనస్యాస్య భీష్మో మూలం మహావ్రతః।
యేనాహం వశమానీతా సముత్ క్షిప్య బలాత్ తదా॥ 38
మహామునీ! నా ఈ దుఃఖానికి భీష్ముడే కారణం. అతడు నన్ను బలవంతంగా తీసుకొనివచ్చి తన వశం చేసుకున్నాడు. (38)
భీష్మం జహి మహాబాహో యత్కృతే దుఃఖమీదృశమ్।
ప్రాప్తాహం భృగుశార్దూల చరామ్యప్రియముత్తమమ్॥ 39
మహాబాహూ! ఎవరివల్ల నేనింతటి దుఃఖం పొందానో, ఇలా ఏమాత్రం ఇష్టం లేని పరిస్థితులలో తిరగవలసి వచ్చిందో ఆ భీష్ముడిని చంపండి. (39)
స హి లుబ్ధశ్చ నీచశ్చ జితకాశీ చ భార్గవ।
తస్మాత్ ప్రతిక్రియా కర్తుం యుక్తా తస్మై త్వయానఘ॥ 40
పుణ్యాత్ముడవైన పరశురామా! ఆ భీష్ముడు లోభి, నీచుడు, జయకాంక్ష కలవాడు. కాబట్టి అతనిమీదే మీరు ప్రతీకారం చేయడం యుక్తంగా ఉంటుంది. (40)
వి॥సం॥ అంబ ఉద్దేశ్యం - భీష్ముడు తనను అపహరించాడు కాబట్టి లోభి. తన అంగీకారం స్వయంగా తీసుకోలేదు కాబట్టి నీచుడు. కాముకుడు కాని వాడు కన్యాపహరణం చేయడం దోషమని భావం. (నీల)
ఏష మే క్రియమాణాయాః భారతే న తదా విభో।
అభవద్ధృది సంకల్పః ఘాతయేయం మహావ్రతమ్॥ 41
భీష్ముడు నన్ను ఇలా చేసినప్పటినుండి, ఆ నియమశీలుడిని చంపాలనే ఉద్దేశం నా మనసులో కలిగింది. (41)
వి॥సం॥ 'క్రియమాణాయాః' అనే దానికి "కృ హింసాయాం' స్వాదిః - అనే అర్థంలో నన్ను బలవంతంగా అపహరించి హింసించినప్పటి నుండి అని అర్థం. (నీల)
తస్మాత్ కామం మమాద్యేమం రామ సంపాదయానఘ।
జహి భీష్మం మహాబాహో యథా వృత్రం పురందరః॥ 42
కాబట్టి రామా! నా ఈ కోరికను ఇప్పుడు తీర్చు. మహాబాహూ! ఇంద్రుడు వృత్రాసురుడిని చంపినట్లుగా భీష్ముడిని నీవు వధించు. (42)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి రామాంబాసంవాదే సప్తసప్తత్యధికశతతమోఽధ్యాయః॥ 177
ఇది శ్రీ మాహాభారతమున ఉద్యోగపర్వమున అంబోపాఖ్యాన పర్వమను ఉపపర్వమున పరశురామ - అంబాసంవాదమను నూటడెబ్బది ఏడవ అధ్యాయము. (177)