179. నూట డెబ్బదితొమ్మిదవ అధ్యాయము
పరశురామునితో భీష్ముని యుద్ధము ప్రారంభమగుట.
భీష్మ ఉవాచ
తమహం స్మయన్నివ రణే ప్రత్యభాషం వ్యవస్థితమ్।
భూమిష్ఠం నోత్సహే యోద్ధుం భవంతం రథమాస్థితః॥ 1
భీష్ముడన్నాడు - రణభూమిలో యుద్ధం కోసం నిలబడి ఉన్న పరశురామునితో "గర్వించినట్లుగా రథమెక్కిన నేను భూమిపై నిలిచి ఉన్న మీతో యుద్ధం చేయడానికి ఇష్టపడను" అన్నాను. (1)
ఆరోహ స్యందనం వీర కవచం చ మహాభుజ।
బధాన సమరే రామ యది యోద్ధుం మయేచ్ఛసి॥ 2
మహాభుజుడవైన రామా! యుద్ధంలో నాతో తలపడాలంటే రథం ఎక్కు.. కవచం తొడుక్కో. (2)
తతో మామబ్రవీద్ రామః స్మయమానో రణాజిరే।
రథో మే మేదినీ భీష్మ వాహా వేదాః సదశ్వవత్॥ 3
సూతశ్చ మాతరిశ్వా వై కవచం వేదమాతరః
సుసంవీతో రణే తాభిః యోత్స్యేఽహం కురునందన॥ 4
అప్పుడు ఆ రణభూమిలో పరశురాముడు చిరునవ్వు నవ్వుతూ నాతో ఇలా అన్నాడు. "కురునందనా! భీష్మా! నాకు భూమే రథం. ఉత్తమమైన గుర్రాలవంటి వేదాలే వాహనాలు. వాయువే సారథి. గాయత్రి, సావిత్రి, సరస్వతి అనే వేదమాతలే నాకు కవచం, వీటన్నిటితో కూడి సురక్షితుడనై యుద్ధం చేస్తాను." (3,4)
ఏవం బ్రువాణో గాంధారే రామో మాం సత్యవిక్రమః।
శరవ్రాతేన మహతా సర్వతః ప్రత్యవారయత్॥ 5
గాంధారీనందనా! ఇలా అంటూనే సత్యపరాక్రముడైన ఆ రాముడు గొప్ప శరపరంపరలతో నన్ను అన్నివైపుల నుండి కమ్మేశాడు. (5)
తతోఽపశ్యం జామదగ్న్యం రథమధ్యే వ్యవస్థితమ్।
సర్వాయుధవరే శ్రీమత్యద్భుతోపమదర్శనే॥ 6
అప్పుడు సమస్త ఆయుధాలతో ప్రకాశిస్తూ సాటిలేని రీతిగా రథమథ్యంలో గోచరించే పరశు రాముడిని చూశాను. (6)
మనసా విహితే పుణ్యే విస్తీర్ణే నగరోపమే।
దివ్యాశ్వయుజి సంనద్ధే కాంచనేన విభూషితే॥ 7
ఆ రథం నగరంలో పోల్చదగిన వైశాల్యం కలిగి ఉంది. ఆ పుణ్యరథం అతని మనసు చేత సృష్టించబడింది. అది దివ్యమైన అశ్వాలతో స్వర్ణాలంకారాలతో సంసిద్ధమై ఉంది. (7)
కవచేన మహాబాహో సోమార్కకృతలక్ష్మణా।
ధనుర్ధరో బద్ధతూణః బద్ధగోధాంగుళీత్రవాన్॥ 8
మహాబాహూ! అతడు చంద్రసూర్య చిహ్నాలు గల కవచాన్ని ధరించాడు. ధనుస్సు ధరించాడు. వీపున అమ్ములపొది కట్టుకున్నాడు. చేతివ్రేళ్లకు రక్షణగా ఉడుము చర్మంతో చేసిన తొడుగు తొడుగుకున్నాడు. (8)
సారథ్యం కృతవాంస్తత్ర యుయుత్సోరకృతవ్రణః।
సఖా వేదవిదత్యంతం దయితో భార్గవస్య హ॥ 9
యుద్ధోత్సాహం కల భార్గవునికి అత్యంతం ఇష్టుడు, సఖుడు అయిన అకృతవ్రణుడు సారథిగా ఉన్నాడు. (9)
ఆహ్వాయానః స మాం యుద్ధే మనో హర్షయతీవ మే।
పునః పునరభిక్రోశన్ అభియాహీతి భార్గవః॥ 10
పదే పదే యుద్ధానికి రమ్మని నన్ను ఆహ్వానించే ఆ భార్గవరాముడు నాకు సంతోషాన్ని కలిగిస్తున్నట్లున్నాడు. (10)
తమాదిత్యమివోద్యంతమ్ అనాధృష్యం మహాబలమ్।
క్షత్రియాంతకరం రామమ్ ఏకమేకః సమాసదమ్॥ 11
ఉదయిస్తున్న సూర్యుడిలా ప్రకాశించే అజేయుడూ బలవంతుడూ, క్షత్రియాంతకుడూ అయిన రాముడు ఒంటరిగా వచ్చాడు. కనుక నేనూ ఒంటరిగానే బయలుదేరాడు. (11)
తతోఽహం బాణపాతేషు త్రిషు వాహాన్ నిగృహ్య వై।
అవతీర్య ధనుర్న్యస్య పదాతిరృషిసత్తమమ్॥ 12
అబ్యాగచ్ఛం తదా రామమ్ అర్చిష్యన్ ద్విజసత్తమమ్।
అభివాద్య చైనం విధివత్ అబ్రవం వాక్యముత్తమమ్॥ 13
మూడు బాణాలు నామీద పడగానే గుర్రాలను నిలిపి, ధనుస్సు దించి, రథాన్నుండి దిగి ఋషిసత్తముడైన బ్రాహ్మణ శ్రేష్ఠుడైన పరశురాముడిని సమీపించి, గౌరవిస్తూ విధిపూర్వకంగా నమస్కరించి, మంచిమాటలతో ఇలా అన్నాను. (12,13)
యోత్స్యే త్వయా రణే రామ సదృశేనాధికేన వా।
గురుణా ధర్మశీలేన జయమాశాస్వ మే విభో॥ 14
రామా! నాతో సమానుడవో, అధికుడవో, గురువైన ధర్మశీలుడవైన నీతో యుద్ధం చేయాలని సిద్ధపడుతున్నాను. ప్రభూ! నాకు జయం కలగాలని ఆశీర్వదించు. (14)
రామ ఉవాచ
ఏవమేతత్ కురుశ్రేష్ఠ కర్తవ్యం భూతిమిచ్ఛతా।
ధర్మో హ్యేష మహాబాహో విశిష్టైః సహ యుధ్యతామ్॥ 15
పరశురాముడు అన్నాడు.
కురువంశ శ్రేష్ఠుడా! అభివృద్ధిని కోరుకునేవారు ఇలాగే చేయాలి. మహాబాహూ! జాతిచేత, గుణం చేత అధికుకులైన విశిష్టులతో యుద్ధం చేయాలనుకునే వారికి ఇది ధర్మం. (15)
శపేయం త్వాం న చేదేవమ్ ఆగచ్చేథా విశాంపతే।
యుధ్యస్వ త్వం రణే యత్తః ధైర్యమాలంబ్య కౌరవ॥ 16
రాజా! నీవు ఈ విధంగా రాకుంటే నిన్ను శపించి ఉండేవాడిని. కురువంశీయుడా! ధైర్యం చిక్కబట్టుకొని యుద్ధం చెయ్యి. (16)
న తు తే జయమాశాసే త్వాం విజేతు మహం స్థితః।
గచ్ఛ యుధ్యస్వ ధర్మేణ ప్రీతోఽస్మి చరితేన తే॥ 17
నిన్ను జయించడానికే నేను ఇక్కడ నిలిచాను. కనుక నీకు జయం కలగాలని ఆశీర్వదించలేను. వెళ్లు. ధర్మబద్ధంగా యుద్ధం చెయ్యి. నీ నడవడికకు నేను ప్రీతి చెందాను. (17)
తతోఽహం తం నమస్కృత్య రథమారుహ్య సత్వరః।
ప్రాధ్మాపయం రణే శంఖం పునర్హేమపరిష్కృతమ్॥ 18
అప్పుడు నేను ఆయనకు నమస్కరించి, త్వరగా రథం ఎక్కి, బంగారు శంఖాన్ని పూరించాను. (18)
తతో యుద్ధం సమభవత్ మమ తస్య చ భారత।
దివసాన్ సుబహూన్ రాజన్ పరస్పరజిగీషయా॥ 19
అప్పుడు నాకు ఆయనకు మధ్య పరస్పర జయకాంక్షతో చాలా రోజులు యుద్ధం జరిగింది. (19)
స మే తస్మిన్ రణే పూర్వం ప్రాహరత్ కంకపత్రిభిః।
షష్ట్యా శతైశ్చ నవభిః శరాణాం నతపర్వణామ్॥ 20
అతడు ఆ యుద్ధంలో గద్దరెక్కలతో అలంకరించిన వంగిన కణుపులు కల తొమ్మిది వందల అరవై బాణాలతో ముందుగా నన్ను కొట్టాడు. (20)
చత్వారస్తేన మే వాహాః సూతశ్పైవ విశాంపతే।
ప్రతిరుద్ధాస్తథైవాహం సమరే దంశితః స్థితః ॥ 21
రాజా! నా నాలుగు గుర్రాలను సూతుడిని కూడా అతడు నిలువరించాడు. అయినా నేను యుద్ధంలో కవచాన్ని ధరించి నిలిచే ఉన్నాను. (21)
నమస్కృత్య చ దేవేభ్యః బ్రాహ్మణేభ్యో విశేషతః।
తమహం స్మయన్నివ రణే ప్రత్యభాషం వ్యవస్థితమ్॥ 22
దేవతలకు విశేషించి బ్రాహ్మణులకు నమస్కరించి, యుద్ధభూమిలో నిలిచి ఉన్న పరశు రాముని చూసి నవ్వుతున్నట్లుగా ఇలా అన్నాను. (22)
ఆచార్యతా మానితా మే నిర్మర్యాదే హ్యపి త్వయి।
భూయశ్చ శృణు మే బ్రహ్మన్ సంపదం ధర్మసంగ్రహే॥ 23
బ్రాహ్మణోత్తమా! నీవు మర్యాదను ఉల్లంఘించినప్పటికీ నీ గురుత్వాన్ని నేను అంగీకరిస్తున్నాను. ధర్మసంగ్రహ విషయంలో నా ప్రతిజ్ఞా వాక్యాన్ని విను. (23)
యే తే వేదాః శరీరస్థాః బ్రాహ్మణ్యం యచ్చ తే మహత్।
తపశ్చ తే మహత్ తప్తం న తేభ్యః ప్రహరామ్యహమ్॥ 24
నీ శరీరగతమైన వేదాల మీదగాని, గొప్పదైన నీ బ్రాహ్మణ్యం మీదగాని, గొప్పగా చేసిన నీ తపస్సు మీద గాని నేను దాడి చేయను. (24)
ప్రహరే క్షత్రధర్మస్య యం రామ త్వం సమాశ్రితః।
బ్రాహ్మణః క్షత్రియత్వం హి యాతి శస్త్రసముద్యమాత్॥ 25
రామా! నీవు ఆశ్రయించిన క్షత్రియ ధర్మం మీద బాణ ప్రహారం చేస్తాను. బ్రాహ్మణుడు శస్త్రాలను ధరించడం ద్వారా క్షత్రియుడవుతాడు. (25)
పశ్య మే ధనుషో వీర్యం పశ్య బాహ్వోర్బలం మమ।
ఏష తే కార్ముకం వీర ఛినద్మి నిశితేషుణా॥ 26
నా వింటి పరాక్రమం, నా బాహుబలం చూడు. ఇదిగో వీరుడా! వాడి బాణంతో నీ ధనుస్సును ఖండిస్తున్నాను. (26)
తస్యాహం నిశితం భల్లం చిక్షేప భరతర్షభ।
తేనాస్య ధనుషః కోటిం ఛిత్త్వా భూమావపాతయమ్॥ 27
భరతశ్రేష్ఠుడా! అలా అని ఒక వాడియైన భల్లాన్ని అతనిపై వదిలాను. దానితో అతని వింటి కొప్పు తెగి భూమిమీద పడింది. (27)
తథైవ చ పృషత్కానాం శతాని నతపర్వణామ్।
చిక్షేప కంకపత్రాణాం జామదగ్న్యరథం ప్రతి॥ 28
అలాగే వంగిన కణుపులూ, కంకపత్రాలూ కల బాణాలను నూరింటిని పరశురాముని రథంపై ప్రయోగించాను. (28)
కాయే విషక్తాస్తు తదా వాయునా సముదీరితాః।
చేలుః క్షరంతో రుధిరం నాగా ఇవ చ తే శరాః॥ 29
అప్పుడు విషంతో కూడిన ఆ బాణాలు గాలిలో ఎగురుతున్న పాములవలె వచ్చి రక్తాన్ని స్రవింపచేస్తూ అతని శరీరంలో గుచ్చుకున్నాయి. (29)
క్షతజోక్షితసర్వాంగః క్షరన్ స రుధిరం రణే।
బభౌ రామస్తదా రాజన్ మేరుర్ధాతుమివోత్సృజన్॥ 30
రాజా! అప్పుడు గాయాలనుండి కారుతున్న రక్తంతో తడిసిన, అవయవాలతో ఆ రాముడు యుద్ధంలో ధాతు జలాన్ని విడుస్తున్న మేరు పర్వతంలా ప్రకాశించాడు. (30)
హేమంతాంతేఽశోక ఇవ రక్తస్తబకమండితః।
బభౌ రామస్తథా రాజన్ ప్రపుల్ల ఇవ కింశుకః॥ 31
రాజా! వసంతఋతువులో ఎఱ్ఱని పూలగుత్తులతో ప్రకాశించే అశోకవృక్షంలాగ, పూచిన మోదుగు చెట్టులాగ ఆ రాముడు ప్రకాశించాడు. (31)
తతోఽన్యద్ ధనురాదాయ రామః క్రోధసమన్వితః।
హేమపుంఖాన్ సునిశితాన్ శరాంస్తాన్ హి వవర్ష సః॥ 32
వెంటనే రాముడు క్రోధంతో ఇంకొక వింటిని తీసుకొని బంగారు పిడులు గల వాడి బాణాలను వర్షించాడు. (32)
తే సమాసాద్య మాం రౌద్రా బహుధా మర్మభేదినః।
అకంపయన్ మహావేగాః సర్పానలవిషోపమాః॥ 33
ఆ బాణాలు అన్నీ భయంకరంగా నన్ను తాకి మర్మస్థానాలు ఛేదించాయి. అవి సర్పాల్లాగా, అగ్నిలాగా, విషంలాగా, నన్ను కంపింపచేశాయి. (33)
తమహం సమవష్టభ్య పునరాత్మానమాహవే।
శతసంఖ్యైః శరైః క్రుద్ధః తదా రామమవాకిరమ్॥ 34
అప్పుడు యుద్ధరంగంలో నన్ను నేను నిలద్రొక్కుకొని క్రోధంతో పరశురాముడిపై వందలసంఖ్యలో బాణాలు కురిపించాయి. (34)
స తైరగ్న్యర్కసంకాశైః శరైరాశీవిషోపమైః।
శితైరభ్యర్దితో రామః మందచేతా ఇవాభవత్॥ 35
అగ్నివలె సూర్యుడివలె ప్రకాశిస్తున్నా విషసర్పాలవంటి వందల బాణాలతో పీడింపబడి పరశురాముడు నిశ్చేతనుడు అయిపోయాడు. (35)
తతోఽహం కృపయాఽవిష్టః విష్టభ్యాత్మానమాత్మనా।
ధిగ్ధిగిత్యబ్రువం యుద్ధం క్షత్రధర్మం చ భారత॥ 36
భారతా! నాకు జాలి కలిగి నాకు నేను ధైర్యం తెచ్చుకొని క్షత్రియ ధర్మమైన యుద్ధాన్ని 'ఛీ ఛీ' అని నిందించుకున్నాను. (36)
అసకృచ్చాబ్రువం రాజన్ శోకవేగపరిప్లుతః।
అహో బత కృతం పాపం మయేదం క్షత్రధర్మణా॥ 37
గురుర్ద్విజాతిర్ధర్మాత్మా యదేవం పీడితః శరైః।
రాజా! శోకావేగంతో "గురువు, బ్రాహ్మణుడు, ధర్మాత్ముడు ఇలా బాణాలతో పీడింపబడిననాడే. క్షత్రధర్మాన్ని ఆచరిస్తున్న నేను ఎంత పాపం చేస్తున్నాను" అని పదే పదే అనుకోసాగాను. (37)
తతో న ప్రాహరం భూయః జామదగ్న్యాయ భారత॥ 38
అథావతాప్య పృథివీం పూషా దివససంక్షయే।
జగామాస్తం సహస్రాంశుఃతతో యుద్ధముపారమత్॥ 39
భారతా! ఆపై నేను మళ్లీ జమదగ్ని కుమారుడిపై బాణాలు వేయలేదు. సహస్రాంశుడైన సూర్యుడు భూమిని తపింపచేసి, పగలు గడిచిపోవడంతో అస్తమించాడు. దానితో యుద్ధం ఆగింది. (38,39)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి రామభీష్మయుద్ధే ఏకోనాశీత్యధికశతతమోఽధ్యాయః॥ 179
ఇది శ్రీ మాహాభారతమున ఉద్యోగపర్వమున అంబోపాఖ్యాన పర్వమన పర్వము అను ఉపపర్వమున పరశురామ భీష్ముల యుద్ధము అను నూట డెబ్బదితొమ్మిదవ అధ్యాయము. (179)