168. నూట అరువది ఎనిమిదవ అధ్యాయము

భీష్మ కర్ణ సంవాదము.

భీష్మ ఉవాచ
అచలో వృషకశ్చైవ సహితౌ భ్రాతరావుభౌ।
రథౌ తవ దురాధర్షౌ శత్రూన్ విధ్వంసయిష్యతి॥ 1
భీష్ముడు చెబుతున్నాడు. అచలుడు వృషకుడు కలిసి ఉండే సోదరులు. వారు దుర్ధర్షులయిన రథికులు. వారు నీ శత్రువులను ధ్వంసం చేస్తారు. (1)
బలవంతౌ నరవ్యాఘ్రౌ దృఢక్రోధౌ ప్రహారిణౌ।
గాంధారముఖ్యౌ తరుణౌ దర్శనీయౌ మహాబలౌ॥ 2
వీరు గాంధార దేశ ప్రధాన వీరుల్లో పరాక్రమం, బలం కలవారు. గట్టి కోపం కలవారు. శత్రువులను కొట్టడంలో నిపుణులు. యువకులు. చూడముచ్చట అయిన వారు. (2)
సఖా తే దయితో నిత్యం య ఏష రణకర్కశః।
ఉత్సాహయతి రాజంస్త్వాం విగ్రహే పాండవైః సహ॥ 3
పరుషః కత్థనో నీచః కర్ణో వైకర్తనస్తవ।
మంత్రీ నేతా చ బంధుశ్చ మానీ చాత్యంతముచ్ఛ్రితః॥ 4
రాజా! మీ ప్రియ స్నేహితుడయిన కర్ణుడు నిన్ను పాండవులతో యుద్ధం కోసం ప్రోత్సహిస్తాడు. రణరంగంలో క్రూరత్వం చూపుతాడు. బాగా కటువుగా మాట్లాడుతూ ఆత్మప్రశంస చేసుకుంటాడు. అతడు నీచుడు. ఆ కర్ణుడు నీకు మంత్రి, నాయకుడు, బంధువు. ఆ అభిమానవంతుడు నీ ఆశ్రయాన్ని పొంది మిక్కిలి ఉన్నతిని పొందాడు. (3,4)
ఏష నైవ రథః కర్ణః న చాప్యతిరథో రణే।
వియుక్తః కవచే నైవ సహజేన విచేతనః॥ 5
కుండలాభ్యాం చ దివ్యాభ్యాం వియుక్తః సతతం ఘృణీ।
అభిశాపాచ్చ రామస్య బ్రాహ్మణస్య చ భాషణాత్॥ 6
కరణానాం వియోగాచ్చ తేన మేఽర్ధరథో మతః।
నైష ఫాల్గున మాసాద్య పునర్జీవన్ విమోక్ష్యతే॥ 7
ఈ కర్ణుడు యుద్ధభూమిలో అతిరథుడు. రథికుడు అని చెప్పడానికి యోగ్యుడు కాడు. ఈ మూర్ఖుడు తన సహజ కవచకుండాలు లేనివాడయ్యాడు. ఇతరుల పట్ల సదా దయతో ఉంటాడు. పరశురాముని శాపంవల్ల, బ్రాహ్మణుని శాపం వల్ల, విజయాన్ని సాధించే ఉపకరణాలు పోవడంవల్ల నాదృష్టిలో కర్ణుడు అర్ధరథుడు, అర్జునునితో ఎదిరించి ఇతడు బ్రతికి బయటపడడు. (5,6,7)
వి॥సం॥ ఘృణీ = నిందించేవాడు(నీల) దయాలువు ఇతడు బ్రాహ్మణుని ఆవును చంపాడు. అతడీతనిని శపించాడు(అర్జు) కరణానాం వియోగాచ్చ = కవచం బాణం మొదలయినవి పోవడం వల్ల ఇతడర్ధరథుడు(అర్జు)బ్రాహ్మణుడు తన కుమారుని చంపడం వల్ల నీ చక్రం రణంలో నేలలో క్రుంగుతుందని శపించాడు. (సర్వ)
తతోఽబ్రవీత్ పునర్ద్రోణః సర్వశస్త్రభృతాం వరః।
ఏవమేతద్ యదాత్థ త్వం న మిథ్యాస్తి కదాచన॥ 8
ఇది విని సర్వశస్త్రధారులలో శ్రేష్ఠుడయిన ద్రోణాచార్యుడు కూడా "మీరు చెప్పేది నిజం. మీ అభిప్రాయం ఎపుడూ మిథ్య కాదు" అన్నాడు. (8)
రణే రణేఽభిమానీ చ విముఖ శ్చాపి దృశ్యతే।
ఘృణీ కర్ణః ప్రమాదీ చ తేన మేఽర్ధరథో మతః॥ 9
ఇతనికి ప్రత్యేక యుద్ధంలో అభిమానం చాలా ఉంది. కాని ఆ రణాన్నుండి వెనక్కి వెళ్ళిపోవడం కూడా కద్దు. దయగలవాడు. పొరపడేవాడు అయిన కర్ణుడు నా అభిప్రాయంలో అర్ధరథుడే. (9)
వి॥సం॥ ప్రమాదీ = తాను కల్పించిన మాట కూడ మరచిపోతాడు. (నీల) ఏకాగ్రత లేనివాడు(అర్జు)
ఏతచ్ఛ్రుత్వా తు రాధేయః క్రోధాదుత్ఫాల్య లోచనే।
ఉవాచ భీష్మం రాధేయః తుదన్ వాగ్భిః ప్రతోదవత్॥ 10
ఇది విని రాధానందనుడయిన కర్ణుడు కన్నులు క్రోధంతో పెద్దవి చేసి చూస్తూ ముల్లు కర్రతో కొట్టినట్లు మాటలతో పొడుస్తూ భీష్మునితో ఇలా అన్నాడు. (10)
పితామహ యథేష్టం మాం వాక్శరైరుపకృంతసి।
అనాగసం సదా ద్వేషాద్ ఏవ మేవ పదే పదే॥ 11
తాతా! నేను నీకే అపకారమూ చేయలేదు. అయినా నేనంటే ద్వేషం చేత ఇదే విధంగా అడుగడుగునా నీ ఇష్టం వచ్చినట్లు నన్ను మాట లనే బాణాలతో పొడుస్తున్నావు. (11)
మర్షయామి చ తత్సర్వం దుర్యోధనకృతేన వై।
త్వం తు మాం మన్యసే మందం యథా కాపురుషం తథా॥ 12
నేను దుర్యోధనుని కారణంగా అదంతా సహిస్తున్నాను. కాని నీవు నన్ను మూర్ఖునితోను, నీచునితోని సమంగా భావిస్తున్నావు. (12)
భవా నర్ధరథో మహ్యం మతో వై నాత్ర సంశయః।
సర్వస్య జగతశ్చైవ గాంగేయో న మృషా వదేత్॥ 13
నన్ను అర్ధ రథుడని నీ అభిప్రాయం చెప్పావు. గంగా నందనుడు అసత్యం చెప్పడు కాబట్టి లోకం అంతా నిస్సందేహంగా ఈ అభిప్రాయమే నమ్ముతుంది. (13)
కురూణామహితో నిత్యం న చ రాజావబుధ్యతే।
కో హి నామ సమానేషు రాజసూదారకర్మసు॥ 14
తేజోవధమిమం కుర్యాద్ విభేదయిషురాహవే।
యథా త్వం గుణవిద్వేషాద్ అపరాగం చికీర్ణసి॥ 15
నీవు కౌరవులకెప్పుడూ అహితమే చేస్తున్నావు. కాని దుర్యోధనుడు ఈ విషయం గ్రహించడం లేదు. నీవు నా గుణాలను ద్వేషిస్తున్న కారణంగా రాజులకు నాపై విరక్తి కలిగించాలని అనుకుంటున్నావు. ఈ ప్రయత్నం నీవు తప్ప మరెవరు చెయ్యగలరు? (14)
ఇపుడు యుద్ధానికి సమయం వచ్చింది. సమానస్థాయి రాజు లొకచోట సమకూడారు. ఈ పరిస్థితిలో పరస్పరం భేదం కలిగించాలని మనపక్షంలో యోధులకు ఉత్సాహం, తేజస్సు నశించేలా మరెవరు చేస్తారు? (15)
వి॥సం॥ విభేదయిషుః = భేదోపాయాన్ని చేయదలచినవాడవు (నీల) అర్ధరథుడు మొదలయిన మాటలచే రాజులకు వైముఖ్యాన్ని కలిగించ దలచినవాడవు (అర్జు) మన పక్షం బాగా ఉండడం చేత, దీని బలాన్ని గ్రహించి, ప్రతిపక్షంలో వారి దౌర్బల్యం తెలుసుకోవడం చేత వారు ధర్మరాజుని వదిలివేస్తారనేది జరుగవచ్చు. కాబట్టి భేదం కలిగించదలచినవాడు భీష్ముడు. ఇతడు అతి మోహంవల్ల నాకంటె అర్జునుని సుగుణాలను అధికంగా నిర్దేశించాడు కనుక ఇలా భావించవలసి వస్తోంది.(సర్వ)
న హయనై ర్న పలితైః న విత్తై ర్న చ బంధుభిః।
మహారథత్వం సంఖ్యాతుం శక్యం క్షత్రస్య కౌరవ॥ 16
కౌరవ! కేవలం పెద్ద వయస్సు చేత, జుట్టు నెరవడం చేత, ఎక్కువ డబ్బు సంపాదించడం చేత, ఎక్కువ బంధువులుండడం చేత ఏ క్షత్రియునీ మహారథునిగా లెక్కించలేము. (16)
బలజ్యేష్ఠం స్మృతం క్షత్రం మంత్రజ్యేష్ఠా ద్విజాతయః।
ధనజ్యేష్ఠాః స్మృతా వైశ్యాః శూద్రాస్తు వయసాధికాః॥ 17
క్షత్రియజాతిలో బలం కలవారు అధికులు. బ్రాహ్మణులలో వేదమంత్ర జ్ఞానం అధికమయినవారు అధికులు. వైశ్యులలో అధిక ధనం కలవారు, శూద్రులలో ఎక్కువ వయస్సు కలవారు శ్రేష్ఠులు. (17)
యథేచ్ఛకం స్వయం బ్రూయాః రథానతిరథాంస్తథా।
కామద్వేష సమాయుక్తః మోహాత్ ప్రకురుతే భవాన్॥ 18
నీవు రాగద్వేషాలతో నిండినవాడవు. కాబట్టి మోహవశంచేత నీకు తోచినట్లు రథికులను, అతిరథులను విభాగం చేస్తున్నావు. (18)
వి॥సం॥ ప్రకురుతే = భేదాన్ని కలిగిస్తున్నావు(నీల)
మోహాత్ = విపరీత జ్ఞానం వల్ల(వ్యత్యస్తమయిన జ్ఞానం వల్ల) ఇలా చేస్తున్నావు. (అర్జు)
దుర్యోధన మహాబాహో! సాధు సమ్యగవేక్ష్యతామ్।
త్యజ్యతాం దుష్టభావోఽయం భీష్మః కిల్బిషకృత్ తవ॥ 19
మహాబాహూ! దుర్యోధనా! నీవు బాగా విచారించి చూడు. ఈ భీష్ముడు దుష్టభావం కలవాడు. అతడు నీ కపకారం చేస్తున్నాడు. నీ వీతనిని ఇపుడే వదిలివెయ్యి. (19)
భిన్నా హి సేనా నృపతే దుఃసంధేయా భవత్యుత।
మౌలా హి పురుషవ్యాఘ్ర కిము నానాసముత్ధితాః॥ 20
రాజా! పురుషశ్రేష్ఠుడా! ఒకసారి సైన్యంలో భేదం కలిగితే మరల కలపడం కష్టం. ఆ స్థితిలో మూలబలంతో సైనికులు కూడా తొలగిపోతారు. వేరు వేరు చోట్ల ఉండే సైనికులు ఒక పని చేయడం కోసం ఒక చోట కలిసిన సందర్భంలో వారిలో భేదం కలిగితే వారాపైన కలవడం చాలా కష్టమని వేరే చెప్పేదేమిటి? (20)
వి॥సం॥ మౌలాఃపారంపర్యంగా ఉన్న యోధులు(నీల) నానా సముత్థితాః = అనేక విధములయిన ప్రయత్నం కలవారు (అర్జు) మౌలాః = ధనమూలంగా లభించినవారు.(సర్వ)
ఏషాం ద్వైధం సముత్పన్నం యోధానాం యుధి భారత।
తేజోవధో నః క్రియతే ప్రత్యక్షేణ విశేషతః॥ 21
ఈ యుద్ధపరిస్థితిలో యోధులలో భేదం పుట్టింది. మన తేజస్సు ఉత్సాహమూ దెబ్బతింటున్నాయి. విశేషించి మన ఎదుటనే. (21)
రథానాం క్వచ విజ్ఞానం క్వ చ భీష్మోల్పఽచేతనః।
అహమావారయిష్యామి పాండవానామనీకినీమ్॥ 22
రథికులను తెలుసుకొనే జ్ఞానం ఎక్కడ? అల్పబుద్ధి అయిన భీష్ముడెక్కడ? నేను ఒంటరిగా పాండవుల సైన్యాన్ని అడ్డగిస్తాను. (22)
ఆసాద్య మా మమోఘేషుం గమిష్యంతి దిశో దశ।
పాండవాః సహపంచాలాః శార్దూలం వృషభా ఇవ॥ 23
నా బాణం అమోఘం. పెద్దపులిని చూసి ఎద్దులు పారిపోయినట్లు పాండవులూ, ద్రుపదుడూ నన్ను చూసి పది దిక్కులకూ పారిపోతారు. (23)
క్వ చ యుద్ధం విమర్దోవా మంత్రే సువ్యాహృతాని చ।
క్వ చ భీష్మో గతవయాః మందాత్మా కాలచోదితః॥ 24
యుద్ధమెక్కడ! సంఘర్షణ మెక్కడ! మంత్రాలోచనలో మంచి మాటలు మాట్లాడట మెక్కడ? వయస్సు చెల్లినవాడు, మందబుద్ధి, కాలంచే ప్రేరేపింపబడిన భీష్ముడెక్కడ? (24)
వి॥సం॥ క్వచ = అనే కాకు ప్రశ్న చేత యుద్ధమందు వృద్ధుడు, అశక్తుడు కనుక, మంత్రాలోచనమందు వృద్ధుడు, బుద్ధిబలం తగ్గడం వల్ల అయోగ్యుడు అని భావం(నీల)
ఏకాకీ స్పర్ధతే నిత్యం సర్వేణ జగతా సహ।
న చాన్యం పురుషం కంచిత్ మన్యతే మోఘదర్శనః॥ 23
ఇతడు ఒంటరివాడయి ప్రపంచమంతటితోనూ పోటీ పడుతున్నాడు. తన వ్యర్థదృష్టిచేత మరొకణ్ణి ఎవనినీ పురుషునిగా భావించడం లేదు. (25)
శ్రోతవ్యం ఖలు వృద్ధానామ్ ఇతి శాస్త్రనిదర్శనమ్।
న త్వేన హ్యతివృద్ధానాం పునర్బాలా హి తే మతాః॥ 26
పెద్దల మాటలు వినాలని శాస్త్రం ఆదేశం గదా! కాని బాగా వృద్ధుల మాటలు పాటించరాదు. వారిని బాలురగా భావించాలి. (26)
అహ మేకో హవిష్యామి పాండవానామనీకినీమ్8.
సుయుద్ధే రాజశార్దూల యశో భీష్మం గమిష్యతి॥ 27
నృపశ్రేష్ఠా! నేనీ యుద్ధంలో ఒక్కడనే పాండవుల సైన్యాన్ని చంపుతాను. కానీ కీర్తిం మాత్రం భీష్ముడికి దక్కుతుంది. (27)
కృత స్పేనాపతి స్త్వేష త్వయా భీష్మో నరాధిప।
సేనాపతౌ యశోగంతా న తు యోథాన్ కథంచన॥ 28
నరేశ్వరా! నీవీ భీష్ముని సేనాపతిగా చేశావు. విజయకీర్తి యీ సేనాపతికే లభిస్తుంది. యోధుల కేవిధంగానూ లభించదు. (28)
వి॥సం॥ నీవు శత్రునాశం చేస్తే ఆ కీర్తి భీష్ముని కెందుకు లభిస్తుందనే ప్రశ్నకు జవాబుగా కర్ణుడిలా చెబుతున్నాడు. (నీల)
నాహం జీవతి గాంగేయే యోత్స్యే రాజన్ కథంచన।
హతే భీష్మేతు యోద్ధాస్మి సర్వైరేవ మహారథైః॥ 29
రాజా! కాబట్టి భీష్ముడు బ్రతికి ఉండగా నేను ఏ విధంగానూ యుద్ధం చేయను. భీష్ముడు మరణించిన తర్వాత మహారథులందరితోనూ యుద్ధం చేస్తాను. (29)
భీష్మ ఉవాచ
సముద్యతోఽయం భారో మే సుమహాన్ సాగరోపమః।
ధార్తరాష్ట్రస్య సంగ్రామే వర్షపూగాభిచింతితః॥ 30
తస్మిన్నభ్యాగతే కాలే ప్రతప్తే లోమహర్షణే।
మిథో భేదో న మే కార్యః తేన జీవసి సూతజ॥ 31
అపుడు భీష్ముడు ఇలా అన్నాడు. సూతకుమారా! ఈ యుద్ధంలో సముద్రమంత పెద్దభారం దుర్యోధనుడిది. అది నా భుజాల మీద కెత్తబడింది. దీని కోసం నేను చాలా సంవత్సరాల నుండి చింతిస్తున్నాను. మనసుకు సంతాపాన్ని, ఒడలికి గగుర్పాటు కలిగించే ఆ సమయం వచ్చి ఉంది. ఈ సమయంలో నేను పరస్పర భేదాన్ని కలిగించకూడదు. అందుచేత నీవు బ్రతికిపోయావు. (30,31)
న హ్యహం త్వద్య విక్రమ్య స్థవిరోఽపి శిశోస్తవ।
యుద్ధశ్రద్ధా మహం ఛింద్యాం జీవితస్య చ సూతజ॥ 32
సూత పుత్రా! లేకపోతే నేను వృద్ధుణ్ణయినా బాలుడవయిన నీకు యుద్ధ విషయంలో శ్రద్ధను, జీవితంపై ఆసక్తిని ఒకసారే నరికివేసేవాడను. (32)
వి॥సం॥ భేదం కలుగుతుందనే భయంవల్లనే నేను నిన్ను చంపడం లేదని భావం(నీల)
జామదగ్న్యేన రామేణ మహాస్త్రాణి విముంచతా।
న మే వ్యథా కృతా కాచిత్ త్వం తు మే కిం కరిష్యసి॥ 33
జమదగ్ని కుమారుడయిన పరశురాముడు నా పై పెద్ద పెద్ద అస్త్రాలు ప్రయోగించాడు. అవి కూడా నాకు బాధను కలిగించలేకపోయాయి. నన్ను నీవేం చేయగలవు? (33)
కామం నైతత్ ప్రశంసంతి సంతః స్వబలసంస్తవమ్।
వక్ష్యామి తు త్వాం సంతప్తః నిహీనకులపాంసన॥ 34
నీచ వంశజుడా! సత్పురుషులు ఎవరూ తమ బలాన్ని పొగడుకోవడం మంచిదని భావించరు. అయినా నీ వ్యవహారం చేత సంతాపాన్ని పొంది నా గొప్పదనం చెబుతున్నాను. (34)
వి॥సం॥ 'తు' నిశ్చయాన్ని తెలుపుతుంది. (అర్జున)
సమేతం పార్థివం క్షత్రం కాశిరాజస్వయంవరే।
నిర్జిత్యైకరథేనైవ యాః కన్యా స్తరసా హృతాః॥ 35
కాశిరాజు జరిపించిన స్వయంవరసభకు భూమండలం లోని రాజులందరూ ఒకచోట చేరారు. నేనొక్క డనే ఒక రథంపై ఉండి, వారందరినీ ఓడించి కాశిరాజు పుత్రికను శీఘ్రంగా తీసుకువచ్చాను. (35)
వి॥సం॥ పార్థివం = భూమికి ప్రభువులయినవారి సమూహం (అర్జున)
ఈదృశానాం సహస్రాణి విశిష్టానామథో పునః।
మయైకేన నిరస్తాని ససైన్యాని రణాజిరే॥ 36
ఇటువంటివారు, ఇంతకంటే గొప్పవారు అయిన రాజులను, వేలమందినీ, వారి సైన్యాలనూ నేను ఒంటరిగా రణరంగంలో ఓడించాను. (36)
త్వాం ప్రాప్య వైరపురుషం కురూణామనయో మహాన్।
ఉపస్థితో వినాశాయ యతస్వ పురుషో భవ॥ 37
నీవు రూపం ధరించిన శత్రుత్వానివి. నీ మూలంగా కురువంశానికి వినాశరూపమయిన గొప్ప అన్యాయం జరుగనుంది. నీ విపుడు కురువంశ రక్షణకు నడుంబిగించి నీ మగతనం చూపించు. (37)
యుద్ధ్యస్య సమరే పార్థం యేన విస్పర్ధసే సహ।
ద్రక్ష్యామి త్వాం వినిర్ముక్తమ్ అస్మాద్ యుద్ధాత్ సుదుర్మనాః॥ 38
దుర్బుద్ధీ! నీవు ఎల్లప్పుడూ పోటీపడే అర్జునునితో యుద్ధం చెయ్యి. (నీవీ యుద్ధాన్నుండి తప్పించు కొంటునట్లు నాకు కనబడుతోంది.) తల త్రిప్పడానికి కూడా సమయం దొరకని యీ యుద్ధాన్నుండి నీవు ఎలా తప్పుకుంటావో నేను చూస్తాను. (38)
తమువాచ తతో రాజా ధార్తరాష్ట్రః ప్రతాపవాన్।
మాం సమీక్ష్యస్య గాంగేయ కార్యం హి మహదుద్యతమ్॥ 39
తరువాత ప్రతాపవంతుడైన దుర్యోధనుడు భీష్మునితో ఇలా అన్నాడు "గంగానందనా! తమరు నన్ను చూడండి. ఇపుడు చాలా గొప్ప పని వచ్చి పడింది. (39)
చింత్యతామిదమేకాగ్రం మమ నిశ్శ్రేయసం పరమ్।
ఉభావపి భవంతౌ మే మహత్ కర్మ కరిష్యతః॥ 40
మీరు ఏకాగ్రచిత్తులై నాకు పరమ శుభం కలిగే విషయం ఆలోచించండి. మీరూ, కర్ణుడూ ఇద్దరూ నా గొప్పకార్యాన్ని నెరవేర్చండి. (40)
భూయశ్చ శ్రోతుమిచ్ఛామి పరేషాం రథసత్తమాన్।
యేవై చాతిరథాస్తత్ర యేచైవ రథయూథపాః॥ 41
ఇపుడు నేను మరల శత్రుపక్షంలో ఉండే రథికుల, అతిరథికుల, రథయూథపతుల పరిచయం వినాలని కోరుతున్నాను. (41)
బలాబలమమిత్రాణాం శ్రోతు మిచ్ఛామి కౌరవ।
ప్రభాతాయాం రజన్యాం వై ఇదం యుద్ధం భవిష్యతి॥ 42
కురునందనా! శత్రువుల బలాన్ని బలహీనతను వినాలని నా కోరిక. ఈ రాత్రి తెల్లవారగానే, రేపు ప్రాతఃకాలంలో ఈ యుద్ధం ప్రారంభమవుతుంది గదా! (42)
వి॥సం॥ భీష్మద్రోణులు సమర్థులయినా పాండవులను చంపరు. కర్ణుడు భీమాదులను చంపడానికి శక్తుడయినా కుంతికి వరమివ్వడం వల్ల వారినతడు చంపడు.
కర్ణుని చేత అర్జునుడు జయింపడు కాబట్టి పాండవులకే జయం అని రథికులు మొదలయిన వారిని పరిగణించడం వల్ల తెలిసిన తాత్పర్యం. (నీల)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణీ రథాతిరథసంఖ్యాన పర్వణి భీష్మకర్ణసంవాదే అష్టషష్ట్యధిక శతతమోఽధ్యాయః ॥ 168 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున రథాతిరథసంఖ్యాన పర్వమను ఉపపర్వమున భీష్మకర్ణసంవాదము అను నూట అరువది ఎనిమిదవ ఆధ్యాయము. (168)