169. నూట అరువది తొమ్మిదవ అధ్యాయము
పాండవ పక్షమున రథాతిరథ సంఖ్యానము.
భీష్మ ఉవాచ
ఏతే రథాస్తవాఖ్యాతాః తథైవాతిరథా నృప।
యే చాప్యర్ధరథా రాజన్ పాండవానా మతః శృణు॥ 1
భీష్ముడు చెప్పాడు. నరేశ్వరా! వీరు నీ పక్షంలో రథికులు, అతిరథులు, అర్ధరథులు. రాజా! ఇపుడు నీవు పాండవ పక్షంలో రథికులు మొదలయినవారి వర్ణనం విను. (1)
యది కౌతూహలం తేఽద్య పాండవానాం బలే నృప।
రథసంఖ్యాం శృణుష్వ త్వం సహైభి ర్వసుధాధిపైః॥ 2
నరేశా! పాండవసైన్యం విషయంలో నీ మనస్సులో కుతూహలం ఉంటే ఈ భూపాలురతో కూడా రథికుల సంఖ్య విను. (2)
స్వయం రాజా రథోదారః పాండవః కుంతినందనః।
అగ్నివత్ సమరే తాత చరిష్యతి న సంశయః॥ 3
నాయనా! యుధిష్ఠిరుడు శ్రేష్ఠుడయిన రథికుడు. ఆయన సమరభూమిలో అగ్నితో సమానంగా అన్ని దిక్కులా సంచరిస్తాడు. సందేహం లేదు. (3)
భీమసేనస్తు రాజేంద్ర రథోఽష్టగుణసమ్మితః।
న తస్యాస్తి సమో యుద్ధే గదయా సాయకైరపి॥ 4
నాగాయుతబలో మానీ తేజసా న స మానుషః।
రాజేంద్రా! భీమసేనుడు ఎనిమిమంది రథికులతో సమానుడు. గదతో, బాణాలతో చేసే యుద్ధంలో అతనితో సమానుడు మరొకడు లేడు. అతనికి పదివేల యేనుగుల బలం ఉంది. బాగా అభిమానవంతుడు. అలౌకిక తేజస్సు కలవాడు. (4 1/2)
మాద్రీపుత్రౌ చ రథినౌ ద్వావేవ పురుషర్షభౌ॥ 5
అశ్వినా వివ రూపేణ తేజసా చ సమన్వితౌ।
మాద్రి ఇద్దరు కుమారులు అశ్వినీ కుమారులతో సమమైన రూపమూ, తేజస్సూ కలవారు. వారు పురుషశ్రేష్ఠులయిన రథికులు. (5 1/2)
ఏతే చమూముపగతాః స్మరంతః క్లేశముత్తమమ్॥ 6
రుద్రవత్ ప్రచరిష్యంతి తత్ర మే నాస్తి సంశయః।
ఈ నలుగురు సోదరులూ తమకు కలిగిన గొప్ప కష్టాలను తలచుకుంటూ మీ సైన్యంలో రుద్రునితో సమానంగా సంచరిస్తారు. సందేహం లేదు. (6 1/2)
సర్వఏవ మహాత్మానః శాలస్తంభా ఇవోద్గతాః॥ 7
ప్రాదేశేనాధికాః పుంభిః అన్యైస్తే చ ప్రమాణతః।
మహాత్ములయిన పాండవులందరూ సాలవృక్ష స్తంభంవలె ఎత్తయినవారు. ఇతర పురుషులకంటె వారొక జూనెడు ఎక్కువ. (7 1/2)
సింహ సంహననాః సర్వే పాండుపుత్రా మహాబలాః॥ 8
చరితబ్రహ్మచర్యాశ్చ సర్వే తాత తపస్వినః।
హ్రీమంతః పురుషవ్యాఘ్రాః వ్యాఘ్రా ఇవ బలోత్కటాః॥ 9
పాండవులందరూ సింహం వంటి శరీరమూ, బలమూ కలవారు. నాయనా! వారందరూ బ్రహ్మచర్యవ్రతాన్ని పాలించారు. సింహంతో సమాన పరాక్రమం కలిగిన పాండవులు తపస్సు, వినయమూ కలవారు. పెద్దపులులవలె అత్యధిక బలం కలవారు. (8,9)
జవే ప్రహారే సమ్మర్దే సర్వ ఏవాతిమానుషాః।
సర్వైర్జితా మహీపాలాః దిగ్జయే భరతర్షభ॥ 10
భరతశ్రేష్ఠుడా! వేగంలో, కొట్టడంలో, యుద్ధంలో, అమానుషశక్తి కలవారు. వారందరూ దిగ్విజయ సమయంలో చాలామంది రాజులను జయించారు. (10)
న చైషాం పురుషాః కేచిత్ ఆయుధాని గదాః శరాన్।
విషహన్తి సదా కర్తుమ్ అధిజ్యాన్యపి కౌరవ॥ 11
ఉద్యంతుం వా గదా గుర్వీః శరాన్ వా క్షేప్తుమాహవే।
జవే లక్ష్యస్య హరణే భోజ్యే పాంసువికర్షణే॥ 12
బాలైరపి భవంతస్తైః సర్వ ఏవ విశేషితాః।
కురునందనా! వీరి ఆయుధాల, గదల, బాణాల దెబ్బలను ఎవరూ సహించలేరు. వారి ధనుస్సులను ఇతరులెక్కు పెట్టలేరు. యుద్ధంలో వారి బరువైన గదలను ఇతరులు ఎత్తలేరు. వారి బాణాలను ఇతరులు ప్రయోగించ లేరు. వేగంగా పరుగుపెట్టడం, లక్ష్యాని భేదించడం, తినడం, త్రాగడం, ధూళిలో ఆడడం మొదలయిన వాటి విషయంలో బాల్యంలో కూడా వారు మిమ్మల్ని ఓడించేవారు. (10,11,12 1/2)
ఏత త్సైన్యం సమాసాద్య సర్వ ఏవ బలోత్కటాః॥ 13
విధ్వంసయిష్యంతి రణే మాస్మ తై స్సహ సంగమః।
ఈ సైన్యాన్ని పొంది వారు మిక్కిలి బలవంతు లయ్యారు. రణంలో వారు మీ సైన్యాన్ని ధ్వంసం చేస్తారు. వారితో నీకు రణరంగంలో ముఖాముఖియుద్ధం కలుగకూడదని నేను కోరుకుంటాను. (13 1/2)
ఏకైకశస్తే సమ్మర్దే హన్యుః సర్వాన్ మహీక్షితః॥ 14
ప్రత్యక్షం తవ రాజేంద్ర రాజసూయే యథాభవత్।
వారొక్కక్కరు యుద్ధంలో రాజుల నందరినీ చంపగలరు. రాజేంద్రా! రాజసూయయాగంలో జరిగినదంతా నీ కళ్లతో చూశావు గదా! (14 1/2)
ద్రౌపద్యాశ్చ పరిక్లేశం ద్యూతే చ పరుషా గిరః॥ 15
తే స్మరంతశ్చ సంగ్రామే చరిష్యంతి చ రుద్రవత్।
ద్యూతక్రీడా సమయంలో ద్రౌపదికి గొప్ప కష్టం కలిగించడం, పాండవుల గురించి కఠోరంగా మాట్లాడడం అవన్నీ గుర్తుంచుకొని వారు సంగ్రామరంగంలో రుద్రునివలె సంచరిస్తారు. (15 1/2)
లోహితాక్షో గుడాకేశః నారాయణసహాయవాన్॥ 16
ఉభయోః సేనయోర్వీరః రథో నాస్తీతి తాదృశః।
ఎర్రటికళ్ళు కలిగి నిద్రను జయించిన అర్జునునికి స్నేహితుడు నారాయణుడు. కౌరవ పాండవుల సైన్యాలు రెంటిలోను అర్జునునితో సమానుడైన రథికుడు మరియొకడు లేడు. (16 1/2)
న హి దేవేషు సర్వేషు నాసురేషూరగేషు చ॥ 17
రాక్షసే ష్వథ యక్షేషు నరేషు కుత ఏవ తు।
భూతోఽథవా భవిష్యో వా రథః కశ్చిన్మయా శ్రుతః॥ 18
దేవతలందరిలోను, అసురులలోను, నాగులలోను, రాక్షసులలోను, యక్షులలోను కూడా అర్జునునితో సమానుడు లేడు. మనుష్యులలో ఎలా ఉంటాడు? భూత భవిష్యకాలాల్లో ఇలాంటి రథికుని గురించి నేను వినను. (17,18)
సమాయుక్తో మహారాజ రథః పార్థస్య ధీమతః।
వాసుదేవ శ్చ సంయంతా యోద్ధా చైవ ధనంజయః॥ 19
మహారాజా! బుద్ధిమంతుడైన అర్జునుని రథం పూన్చబడింది. భగవంతుడైన శ్రీకృష్ణుడతని సారథి. యుద్ధకుశలుడైన ధనంజయుడు రథికుడు. (19)
గాండీవం చ ధనుర్దివ్యం తే చాశ్వా వాతరంహసః।
అభేద్యం కవచం దివ్యమ్ అక్షయ్యౌ చ మహేషుధీ॥ 20
దివ్యమయిన గాండీవం ధనుస్సు. వాయు వేగం కలవి గుఱ్ఱాలు, భేదింపరాని దివ్య కవచం, అక్షయమయిన బాణాలతో నిండినవి రెండు అమ్ములపొదులు. (20)
అస్త్రగ్రామశ్చ మాహేంద్రః రౌద్రః కౌబేర ఏవ చ।
యామ్యశ్చ వారుణ శ్చైవ గదాశ్చోగ్రప్రదర్శనాః॥ 21
మాహేంద్రం, రౌద్రం, కౌబేరం, యామ్యం, వారుణం అనే అస్త్రాలు అతని రథంలో ఉన్నాయి. భయంకరంగా కనబడే గద కూడా ఉంది. (21)
వజ్రాదీని చ ముఖ్యాని నానాప్రహరణాని చ।
దానవానాం సహస్రాణి హిరణ్యపురవాసినామ్॥ 22
హతాన్యేకరథేనాజౌ కస్తస్య సదృశో రథః।
శ్రేష్టములయిన వజ్రాది ఆయుధాలు అతని రథంలో ఉన్నాయి. అర్జునుడు యుద్ధంలో ఒక్క రథంతోనే హిరణ్యపురంలో నివసించే వేల దానవులను సంహరించాడు. అతనితో సమాన రథికుడెవడున్నాడు. (22 1/2)
ఏష హన్యాద్ధి సంరంభీ బలవాన్ సత్యవిక్రమః॥ 23
తవ సేనాం మహాబాహుః స్వాం చైవ పరిపాలయన్।
బలవంతుడై సత్య పరాక్రముడై గొప్ప బాహువులు కల అర్జునుడు తన సైన్యాన్ని రక్షించుకొంటూ నీ సైన్యాన్ని కోపంతో సంహరిస్తాడు. (23 1/2)
అహం చైనం ప్రత్యుదియామ్ ఆచార్యో వా ధనంజయమ్।
న తృతీయోఽస్తే రాజేంద్ర సేనయోరుభయో రపి।
య ఏవం శరవర్షాణి వర్షంతముదియాద్ రథీ॥ 25
నేను కాని ద్రోణాచార్యుడుగాని యుద్ధం చేసే ధనంజయుని ఎదిరించగలం. రాజేంద్రా బాణవర్షాన్ని కురిపించే అర్జునుని ఎదిరించగల మూడవ వాడెవడూ రెండు సేనల్లోనూ లేడు. (24,25)
జీమూత ఇవ ఘర్మాంతే మహావాతసమీరతః।
సమాయుక్తస్తు కౌంతేయో వాసుదేవసహాయవాన్।
తరుణశ్చ కృతీ చైవ జీర్ణావావాముభావపి॥ 26
గ్రీష్మ ఋతువు చివర ప్రచండ వాయువుచే ప్రేరేపింపబడిన మహామేఘం వలె శ్రీకృష్ణ సహితుడైన అర్జునుడు యుద్ధానికి సిద్ధం అయ్యాడు. అతడు అస్త్రముల నెరిగినవాడు, యువకుడు. మీ పక్షాన మేమిద్దరం వృద్ధులమయ్యాము. (26)
వైశంపాయన ఉవాచ
ఏత చ్ఛ్రుత్వా తు భీష్మస్య రాజ్ఞాం దధ్వంసిరే తదా।
కాంచనాంగదినః పీనాః భుజాశ్చందనరూషితాః॥ 27
మనోభిః సహ సంవేగైః సంస్మృత్య చ పురాతనమ్।
సామర్థ్యం పాండవేయానాం యథా ప్రత్యక్షదర్శనాత్॥ 28
వైశంపాయనుడు చెప్పాడు. జనమేజయా! భీష్ముని యీ వచనాలను విని రాజులు పాండవుల మునుపటి బలపరాక్రమాలను గుర్తుకు తెచ్చుకున్నారు. రాజులు బంగారు భుజకీర్తులతో అలంకరింపబడి చందనం పూసుకున్నవారి భుజాలూ, మనస్సూ కూడా పాండవుల బలపరాక్రమాలను ప్రత్యక్షంగా చూడడం చేత శిథిలమయినట్లు శిథిలమయ్యాయి. (27,28)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణీ రథాతిరథసంఖ్యాన పర్వణి పాండవ రథాతిరథసంఖ్యాయాం ఏకోనసప్తత్యధిక శతతమోఽధ్యాయః ॥ 169 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున రథాతిరథసంఖ్యానపర్వమను ఉపపర్వమున రథికులను, అతిరథులను లెక్కపెట్టుట అను నూట అరువది తొమ్మిదవ ఆధ్యాయము. (169)