167. నూట అరువది యేడవ అధ్యాయము

కౌరవ రథాతిరథ సంఖ్యానము - 3.

భీష్మ ఉవాచ
శకునిర్మాతులస్తే ఽసౌ రథ ఏకో నరాధిప।
ప్రయుజ్య పాండవైర్వైరం యోత్స్యతే వాత్ర సంశయః॥ 1
భీష్ముడంటున్నాడు. నరేశ్వరా! మీ మేనమామ శకుని కూడా ఒక రథికుడు. ఇతడు పాండవులతో వైరం పెట్టుకుని యుద్ధం చేస్తాడు. దీనిలో సందేహమ్ లేదు. (1)
ఏతస్య సేనా దుర్ధర్షా సమరే ప్రతియాయినః।
వికృతాయుధ భూయిష్ఠా వాయువేగసమా జవే॥ 2
రణరంగంలో ఎదురుదాడి చేసే శకుని సైన్యం బెదిరింపరానిది. ఈ సేన వాయువేగం కలది. వివిధ ఆకారాలు కల అనేక ఆయుధాలీ సైన్యానికి ఉన్నాయి. (2)
వి॥సం॥ వికృతాయుధభూయిష్ఠా! = నానా విధములయిన ఆయుధములతో భూయిష్ఠమైనది(నీల0
సైన్యాః అని పాఠాంతరం = సేనతో కూడినవారు(సర్వ)
ద్రోణపుత్రో మహేష్వాసః సర్వా నేవాతిధన్వినః।
సమరే చిత్రయోధీ చ దృఢాస్త్రశ్చ మహారథః॥ 3
మహాధనుర్ధరుడైన ద్రోణకుమారుడు అశ్వత్థామ ధనుర్ధరులందరి కంటె గొప్పవాడు. అతడు విచిత్రంగా యుద్ధం చేస్తాడు. దృఢమయిన అస్త్రసంపదకల అశ్వత్థామ మహారథుడు. (3)
ఏతస్య హి మహారాజ యథా గాండీవధన్వనః।
శరాసనవినిర్ముక్తాః సంసక్తా యాంతి సాయకాః॥ 4
మహారాజా! గాండీవధారి అయిన అర్జునునివలె ఇతని ధనుస్సు నుండి వెలువడిన బాణాలు ఒక దానికొకటి తగులుతూ ముందుకు దూసుకుపోతాయి. (4)
వి॥సం॥ సంసక్తాః = అన్యోన్యం తగుల్కొన్నవి (అర్జు)
నైష శక్యో మయా వీరః సంఖ్యాతుం రథసత్తమః।
నిర్దహేదపి లోకాంస్త్రీన్ ఇచ్ఛన్నేష మహారథః॥ 5
రథికులలో శ్రేష్ఠుడైన ఈ వీరపురుషుని మహత్త్వాన్ని లెక్కించడం శక్యం కాదు. ఇతడు అనుకుంటే ముల్లోకాలను దగ్ధం చేయగలడు. (5)
క్రోధ స్తేజశ్చ తపసా సంభృతోఽ శ్రమవాసినామ్।
ద్రోణే నానుగృహీతశ్చ దివ్యైరస్త్రైరుదారధీః॥ 6
ఇతనికి క్రోధమూ, తేజస్సూ, మహర్షులకు యోగ్యమయిన తపస్సూ కూడా ఉన్నాయి. ఇతని బుద్ధి ఉదారం. ద్రోణాచార్యుడు సంపుర్ణంగా దివ్యాస్త్ర జ్ఞానాన్నిచ్చి ఇతనిపై గొప్ప అనుగ్రహం చూపాడు. (6)
వి॥సం॥ సంభృతః + ఆశ్రమవాసినామ్ అని పూర్వరూపం ఆర్షం. ఆశ్రమ వాసులయిన ఋషుల యొక్క క్రోధతేజస్సుల సముదాయ రూపము నితడు తపస్సుచే సంపాదించాడని భావం (నీల)
దోష స్త్వస్య మహనేకః యేనైవ భరతర్షభ।
న మే రథో నాతిరథో మతః పార్థివసత్తమ॥ 7
భరతశ్రేష్ఠ! నృపశిరోమణీ! ఇతనిలో ఒక గొప్పదోషం ఉంది. కాబట్టి ఇతనిని అతిరథుడని కాని, రథికుడని గాని నేను భావించను. (7)
జీవితం ప్రియమత్యర్థమ్ ఆయుష్కామః సదా ద్విజః।
న హ్యస్య సదృశః కశ్చిద్ ఉభయోః సేనయో రపి॥ 8
ఈ బ్రాహ్మణునికి తన జీవితం చాలా ఇష్టం. ఇతడెప్పుడూ దీర్ఘాయుష్మంతుడు కావాలని కోరతాడు. (ఇదే ఇతని దోషం) రెండు సేనలలో నిజానికి ఇతనితో సమానుడయిన శక్తిశాలి ఎవడూ లేడు. (8)
వి॥సం॥ జీవితం = ప్రాణములు; అశ్వత్థామకు ప్రాణములు ప్రియమని భావం. ప్రాణాలు హరించే యుద్ధానికి అశ్వత్థామ పరాఙ్ముఖుడని భావం. జీవితం ప్రాణాలు. వాటిని కలిగి ఉండే కాలం ఆయువు(సర్వ)
హన్యా దేకరథేనైవ దేవానామపి వాహినీమ్।
వపుష్మాంస్తలఘోషేణ స్ఫోటయేదపి పర్వతాన్॥ 9
అతడు ఒక్కరథంతో దేవతల సైన్యాన్ని గూడా సంహరించగలడు. దృఢశరీరంకల ఇతడు ఒక్క చఱుపుతో పర్వతాలను సయితం పగులగొట్టగలడు. (9)
అసంఖ్యేయగుణో వీరః ప్రహర్తా దారుణద్యుతిః।
దండపాణి రివాసహ్యః కాలవత్ ప్రచరిష్యతి॥ 10
ఈ వీరునిలో లెక్కించలేనన్ని గుణాలున్నాయి. ఇతడు కొట్టడంలో నేర్పరి. భయంకర తేజస్సు కలవాడు. దండాన్ని ధరించిన యమునితో సమానంగా సహింపరాకుండా యుద్ధభూమిలో సంచరిస్తాడు. (10)
యుగాంతాగ్నిసమః క్రోధాత్ సింహగ్రీవో మహాద్యుతిః।
ఏష భారతయుద్ధస్య పృష్ఠం సంశమయిష్యతి॥ 11
కోపంలో ఇతడు ప్రళయకాలాగ్నితో సమానుడు. ఇతనిది సింహం మెడ, మహాతేజస్వి అయిన అశ్వత్థామ యుద్ధంలో మిగిలిన భాగాన్ని పూర్తిగా శమింపజేస్తాడు. (11)
వి॥సం॥ పృష్ఠమ్ = మిగిలిన సైన్యభాగం(నీల)
సింహక్లీభః అని పాఠాంతరం = శూరుడు కాబట్టి సింహమని, జీవిత ప్రియుడు కాబట్టి క్లీబుడని(నపుంసకుడని) అన్నారు(అర్జు)
సింహః = శక్తి కలవాడు, క్లీబః = భయపడినవాడు. పృష్ఠమ్ = వెనుకభాగం, సంశమయిష్యతి = నడుపుతాడు. జీవితప్రియుడు కాబట్టి వెనుక సైన్యాన్ని నడుపుతాడని భావం. (అర్జు)
పితాత్వస్య మహాతేజాః వృద్ధోఽపి యువభిర్వరః।
రణే కర్మ మహత్ కర్తా అత్ర మే నాస్తి సంశయః॥ 12
అశ్వత్థామ తండ్రి ద్రోణాచార్యుడు గొప్ప తేజస్సు కలవాడు. అతడు ముసలివాడైనా నవయువకుల కంటె శ్రేష్ఠుడు. ఈ యుద్ధంలో ఇతడు తన గొప్ప పరాక్రమాన్ని చూపుతాడు. దీనిలో నాకు సంశయం లేదు. (12)
వి॥సం॥ యువభిః = యువభ్యః = యువకుల కంటె(అర్జు)
అస్త్రవేగానిలోద్ధూతః సేనా కక్షేంధనోత్థితః।
పాండుపుత్రస్య సైన్యాని ప్రధక్ష్యతి రణే ధృతః॥ 13
రథయూథపయూథానాం యూథపోఽయం నరర్షభః।
భారద్వాజాత్మజః కర్తా కర్మ తీవ్రం హితం తవ॥ 14
నరశ్రేష్ఠుడయిన ద్రోణాచార్యుడు రథయూథపతుల సముదాయానికి యూథపుడు. అతడు నీ హితం కోసం తీవ్ర పరాక్రమాన్ని చూపుతాడు. (14)
సర్వమూర్ధాభిషిక్తానాం ఆచార్యః స్థవిరో గురుః।
గచ్ఛే దస్తం సృంజయానాం ప్రియస్తస్య ధనంజయః॥ 15
పట్టాభిషిక్తులయిన రాజు లందరికీ ద్రోణాచార్యుడు వృద్ధ గురువు. ఈయన సృంజయుల వంశాన్ని నాశనం చేస్తాడు. కాని అర్జునుడు ఈయనకు ఎంతో ఇష్టుడు. (15)
నైష జాతు మహేష్వాసః పార్థమక్లిష్టకారిణమ్।
హన్యా దాచార్యకం దీప్తం సంస్మృత్య గుణనిర్జితమ్॥ 16
మహాధనుర్ధరుడయిన ద్రోణాచార్యుని ఆచార్యత్వం అర్జునుని సుగుణాలతో జయింపబడింది. అనాయాసంగా గొప్పకార్యాలను చేసే ద్రోణాచార్యుడు దాన్ని తలచుకొని అర్జునుని ఎప్పుడూ చంపడు. (16)
ఆచార్యకం = ఆచార్యత్వమును; ఆచార్యకర్మ ఆచార్యకం.
దీప్తమ్ = ప్రసిద్ధం
గుణనిర్జిత, = గుణముచే సంపాదింపబడినది. (అర్జు)
శ్లాఘతేఽయం సదా వీర పార్థస్య గుణవిస్తరైః।
పుత్రాదభ్యధికం చైనం భారద్వాజోఽను పశ్యతి॥ 17
హన్యా దేకరథైనైవ దేవగంధర్వమానుషాన్।
ఏకీభూతానపి రణే దివ్యైరస్త్రైః ప్రతాపవాన్॥ 18
ప్రతాపవంతుడయిన ద్రోణాచార్యుడు రణభూమిలో దేవతలూ, గంధర్వులూ, మనుష్యులూ కలిసికట్టుగా వచ్చినా వారిని ఒక్కడూ దివ్యాస్త్రాల ద్వారా నాశం చేయగలడు. (18)
పౌరవో రాజశార్దూలః తవ రాజన్ మహారథః।
మతో మమ రథోదారః పరవీరరథారుజః॥ 19
రాజా! మీ సైన్యంలో నృప శ్రేష్ఠుడు పౌరవుడు. అతడు నా అభిప్రాయంలో రథికులలో ఉదారుడయిన మహారథుడు. అతడు శత్రుసైన్యంలోని రథికులను పీడించడంలో సమర్థుడు. (19)
స్వేన సైన్యేన మహతా ప్రతపన్ శత్రువాహినీమ్।
ప్రధక్ష్యతి స పంచాలాన్ కక్షమగ్నిగతిర్యథా॥ 20
పౌరవరాజు తన విశాల సైన్యంతో శత్రుసైన్యాన్ని బాగా తపింజేస్తూ నిప్పు గడ్డిని కాల్చినట్లు పాంచాలురను భస్మం చేస్తాడు. (20)
సత్యశ్రవం రథస్త్వేకః రాజపుత్రో బృహద్బలః।
తవ రాజన్ రిపుబలే కాలవత్ ప్రచరిష్యతి॥ 21
రాజా! రాజకుమారుడయిన బృహద్బలుడు కూడా రథికుడు. అతని సత్యకీర్తి ప్రపంచంలో విస్తరించింది. అతడు మీ శత్రుసైన్యంలో కాలునితో సమానంగా సంచరిస్తాడు. (21)
ఏతస్య యోధా రాజేంద్ర విచిత్రకవచాయుధాః।
విచరిష్యంతి సంగ్రామే నిఘ్నంతః శాత్రవాంస్తవ॥ 22
రాజేంద్రా! అతని సైనికులు విచిత్రకవచాలు అస్త్రశస్త్రాలు ధరించి, మీ శత్రువులను సంహరిస్తూ రణరంగంలో విహరిస్తారు. (22)
వృషసేనో రథస్తేగ్ర్యః కర్ణపుత్రో మహారథః।
ప్రధక్ష్యతి రిపూణాం తే బలం తు బలినాం వరః॥ 23
కర్ణుని కుమారుడు వృషసేనుడు కూడా ఒక శ్రేష్ఠుడైన రథికుడు. ఇతణ్ణి మహారథుడని చెప్పగలం బలిష్ఠుడయిన వృషసేనుడు మీ శత్రువుల సైన్యాన్ని భస్మం చేస్తాడు. (23)
జలసంధో మహాతేజా రాజన్ రథవర స్తవ।
త్యక్ష్యతే సమరే ప్రాణాన్ మాధవః పరవీరహా॥ 24
రాజా! శత్రువీరులను సంహరించేవాడు, మధువంశంలో పుట్టిన, మహాతేజస్వి జలసంధుడు మీ సేనలో శ్రేష్ఠుడయిన రథికుడు. అతడు యుద్ధంలో నీ కోసం ప్రాణాలు ఇస్తాడు. (24)
ఏష యోత్స్యతి సంగ్రామే గజస్కంధవిశారదః।
రథేన వా మహాబాహుః క్షపయన్ శత్రువాహినీమ్॥ 25
మహాబాహువయిన జలసంధుడు రథంపై గాని, ఏనుగు అంబారీ మీద గాని ఉండి యుద్ధం చేయగల నిపుణుడు. ఇతడు రణరంగంలో శత్రుసైన్యాన్ని నాశంచేస్తూ యుద్ధం చేస్తాడు. (25)
రథ ఏష మహారాజ మతో మే రాజసత్తమ।
త్వదర్థే త్యక్ష్యతే ప్రాణాన్ సహసైన్యో మహారణే॥ 26
మహారాజ! నృపశ్రేష్ఠ! నా అభిప్రాయంలో ఇతడు రథికుడు. ఈ మహాయుద్ధంలో నీ కోసం తన సేనతో కూడ ప్రాణత్యాగం చేస్తాడు. (26)
ఏష విక్రాంతయోధీ చ చిత్రయోధీ చ సంగరే।
వీతభీ శ్చాపి తే రాజన్ శత్రుభిః సహ యోత్స్యతే॥ 27
రాజా! ఇతడు రణరంగంలో బాగా పరాక్రమిస్తాడు. విచిత్రంగా యుద్ధం చేస్తాడు. నీ శత్రువులతో నిర్భయంగా సమరం సాగిస్తాడు. (27)
బాహ్లీకోఽతిరథశ్చైవ సమరే చానివర్తనః।
మమ రాజన్ మతో యుద్ధే శూరో నైవస్వతోపమః॥ 28
బాహ్లీకుడు అతిరథుడైన వీరుడు. ఇతడు యుద్ధంలో ఎప్పుడూ వెనుదిరగడు. రాజా! రణరంగంలో ఇతడు యమధర్మరాజుతో సమానుడని భావిస్తాను. (28)
న హ్యేష సమరం ప్రాప్య నివర్తేత కథంచన।
యథా సతతగో రాజన్ స హి హన్యాత్ పరాన్ రణే॥ 29
ఇతడు యుద్ధానికి వచ్చాక ఎట్టి పరిస్థితుల్లోను వెనుదిరగడు. రాజా! వాయువుతో సమయమయిన వేగంతో ఇతడు రణరంగంలో శత్రువులను సంహరిస్తాడు. (29)
సేనాపతి ర్మహారాజ సత్యవంస్తే మహారథః।
రణేష్వద్భుతకర్మా చ రథీ పరరథారుజః॥ 30
మహారాజ! యుద్ధంలో రథం మీద అద్భుతంగా విక్రమించడం, శత్రుపక్షంలో రథికులను సంహరించడం చేయగల మీ సేనాపతి సత్యవంతుడు మహారథికుడు. (30)
ఏతస్య సమరం దృష్ట్వా న వ్యథాస్తి కథంచన।
ఉత్స్మయన్నుత్పతత్యేష పరాన్ రథపథే స్థితాన్॥ 31
యుద్ధాన్ని చూడడంవల్ల ఏవిధంగాను ఇతనికి భయంకాని దుఃఖం కాని కలుగవు. రథమార్గంలో ఉండే శత్రువులపై నవ్వుతూ దూకుతీ డితడు. (31)
ఏష చారిషు విక్రాంతః కర్మ సత్పురుషోచితమ్।
కర్తా విమర్దే సుమహత్ త్వదర్థే పురుషోత్తమః॥ 32
పురుష శ్రేష్ఠుడయిన సత్యవంతుడు శత్రువులపై గొప్పగా పరాక్రమిస్తాడు. అతడు యుద్ధంలో నీ కోసం సత్ పురుషులకు తగిన ఘనకార్యం చేస్తాడు. (32)
అకంబుషో రాక్షసేంద్ర్రః క్రూరకర్మా మహారథః।
హనిష్యతి పరాన్ రాజన్ పూర్వవైరమనుస్మరన్॥ 33
క్రూరకర్ముడయిన రాక్షసరాజు అలంబుషుడు కూడా మహారథుడు. రాజా! ఇతడు పూర్వవైరాన్ని గుర్తుంచుకొని శత్రు సంహారం చేస్తాడు. (33)
వి॥సం॥ ఇతడు హిడింబాదులకు జ్ఞాతి. కనుక అతనిని చంపిన భీమసేనునిపై పూర్వం నుండి వైరంతో ఉన్నాడు. ఆ వైరాన్ని గుర్తుంచుకున్నాడని భావం. (అర్జు)
ఏష రాక్షససైన్యానాం సర్వేషాం రథసత్తమః।
మాయావీ దృఢవైరశ్చ సమరే విచరిష్యతి॥ 34
రథికులందరిలో శ్రేష్ఠుడయిన ఇతడు మాయావి. దృఢమయిన వైరం కల ఇతడు రణరంగంలో నిర్భయంగా సంచరిస్తాడు. (34)
ప్రాగ్జ్యోతిషాధిపో వీరః భగదత్తః ప్రతాపవాన్।
గజాంకుశధరశ్రేష్ఠః రథే చైవ విశారదః॥ 35
ప్రాగ్జ్యోతిషపురానికి రాజయిన భగదత్తుడు గొప్పవీరుడు, ప్రతాపవంతుడు. చేతితో అంకుశం పట్టుకుని ఏనుగును నడిపే వారి అందరిలో శ్రేష్ఠుడు. ఇతడు రథయుద్ధంలో కూడా నేర్పరి. (35)
వి॥సం॥ గజాకుంశధరః = గజాంకుశాకారంగా పరిణమించిన నారాయణాస్త్రాన్ని ధరించినవాడు(అర్జు)
ఏతేన యుద్ధమభవత్ పురా గాండీవధన్వనః।
దివసాన్ సుబహూన్ రాజన్ ఉభయో ర్జయగృద్ధినోః॥ 36
రాజా! పూర్వం ఇతనితో గాండీవధారి అయిన అర్జునునకు యుద్ధం జరిగింది. ఆ రణంలో ఇరువురు తమకు విజయం కోరుతూ చాలా రోజులు యుద్ధం చేశారు. (36)
తతః సఖాయం గాంధారే మానయన్ పాకశాసనమ్।
అకరోత్ సంవిదం తేన పాండవేన మహాత్మనా॥ 37
గాంధారీ కుమారా! కొన్ని దినాల తరువాత భగదత్తుడు తన స్నేహితుడయిన ఇంద్రుని గౌరవిస్తూ మహాత్ముడు, పాండునందనుడు అయిన అర్జునునితో సంధి చేసుకున్నాడు. (37)
ఏష యోత్స్యతి సంగ్రామే గజస్కంధవిశారదః।
ఐరావతగతో రాజా దేవానామివ వాసవః॥ 38
భగదత్తుడు ఏనుగు అంబారీ మీద నుండి యుద్ధం చేయడంలో నిపుణుడు. అతడు ఐరావతం మీది ఇంద్రునితో సమానంగా రణరంగంలో నీ శత్రువులతో యుద్ధం చేస్తాడు. (38)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణీ రథాతిరథసంఖ్యాన పర్వణి సప్త షష్ట్యధిక శతతమోఽధ్యాయః ॥ 167 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున రథాతిరథ సంఖ్యానపర్వమను ఉపపర్వమున నూట అరువది యేడవ ఆధ్యాయము. (167)