165. నూట అరువది అయిదవ అధ్యాయము

(రథాతిరథ సంఖ్యాన పర్వము)

భీష్ముడు కౌరవసభలో రథాతిరథులను నిర్ణయించుట.

ధృతరాష్ట్ర ఉవాచ
ప్రతిజ్ఞాతే ఫాల్గునేన వధే భీష్మస్య సంయుగే।
కిమకుర్వత మే మందాః పుత్రా దుర్యోధనాదయః॥ 1
ధృతరాష్ట్రుడు అడిగాడు. సంజయా! అర్జునుడు యుద్ధభూమిలో భీష్ముని చంపుతానని ప్రతిజ్ఞ చేసినపుడు నా తెలివిమాలిన పుత్రులు దుర్యోధనాదులు ఏం చేశారు? (1)
హతమేవ హి పశ్యామి గాంగేయం పితరం రణే।
వాసుదేవసహాయేన పార్థేన దృఢధన్వనా॥ 2
అర్జునుడు మిక్కిలి దృఢమైన ధనుస్సు ధరించినవాడు. అతనికి భగవంతుడయిన వాసుదేవుడు సహాయకుడు, కాబట్టి తండ్రి భీష్ముడు అర్జునుని చేతిలో చనిపోతాడనుకొంటున్నాను. (2)
స చాపరిమితప్రజ్ఞః తచ్ఛ్రుత్వా పార్థభాషితమ్।
కిముక్తవాన్ మహేష్వాసః భీష్మః ప్రహరతాం వరః॥ 3
అర్జునుడు చేసిన ప్రతిజ్ఞను విని, అమిత బుద్ధిమంతుడు, యోధులలో శ్రేష్ఠుడు, మహాధనుర్ధరుడు అయిన భీష్ముడు ఏమన్నాడు? (3)
సైనాపత్యం చ సంప్రాప్య కౌరవాణాం ధురంధరః।
కి మచేష్టత గాంగేయః మహాబుద్ధిపరాక్రమః॥ 4
కౌరవ వంశభారాన్ని వహించే పరమ బుద్ధిమంతుడు, పరాక్రమవంతుడు అయిన భీష్ముడు సేనాపతి పదవి పొందిన తరువాత ఏంచేశాడు? (4)
వైశంపాయన ఉవాచ
తతస్తత్ సంజయ స్తస్మై సర్వమేవ న్యవేదయత్।
యథోక్తం కురువృద్ధేన భీష్మేణామితతేజసా॥ 5
వైశంపాయనుడు చెప్పాడు. జనమేజయా! తరువాత సంజయుడు అమిత తేజస్వీ, కురువృద్ధుడూ అయిన భీష్ముడు చెప్పిన విషయమంతా ధృతరాష్ట్రునకు చెప్పాడు. (5)
సంజయ ఉవాచ
సైనాపత్యమనుప్రాప్య భీష్మః శాంతనవో నృప।
దుర్యోధనమువాచేదం వచనం హర్షయన్నివ॥ 6
సంజయుడన్నాడు. నరేశ్వరా! సేనాపతి పదవిని పొందిన శంతమనునందనుడైన భీష్ముడు దుర్యోధనునికి సంతోషం కలిగించేటట్లు ఇలా అన్నాడు. (6)
వి॥ సంస్కృతంలో భీష్ముని తండ్రిని శాంతనుడు అని అంటారు. తెలుగులో శంతనుడనే అంటారు.
నమస్కృత్య కుమారాయ సేనాన్యే శక్తిపాణయే।
అహం సేనాపతి స్తేఽద్య భవిష్యామి న సంశయః॥ 7
రాజా! చేతితో శక్తి అనే ఆయుధాన్ని ధరించి దేవసేనాపతి అయిన కుమారస్వామికి నమస్కారం చేసి, ఇపుడు మీ సేనకు అధిపతి నవుతాను. దీనిలో సంశయం లేదు. (7)
సేనాకర్మ ణ్యభిజ్ఞోఽస్మి వ్యూహేషు వివిధేషు చ।
కర్మ కారయితుం చైవ భృతానప్యభృతాం స్తథా॥ 8
నాకు సేనకు సంబంధించిన జ్ఞానం ఉంది. నేను చాలా రకాల వ్యూహాల నిర్మాణంలో కుశలుడను. నీ సైన్యంలో జీతం తీసుకునేవారు, జీతం తీసుకొనని మిత్ర సైనికులు ఉన్నారు. వారందరి చేత వారికి యోగ్యమయిన పనిచేయించే కళ గూడా నాకు తెలుసు. (8)
వి॥ భృతులు = జీతం తీసుకునేవారు
అభృతులు = స్నేహంతో వచ్చినవారు
యాత్రాయానే చ యుద్ధే చ తథా ప్రశమనేషు చ।
భృశం వేద మహారాజ యథా వేద బృహస్పతిః॥ 9
మహారాజా! యుద్ధయాత్ర విషయంలో, యుద్ధ విషయంలో, శత్రువులు వేసిన అస్త్రాలకు ప్రతీకారం చేసే విషయంలో, ప్రయాణం, రథాదులు వీటి విషయంలోను బృహస్పతికి తెలిసినంత విషయం నాకూ తెలుసు. (9)
వి:- ప్రశమనేషు = లభించిన దేశాన్ని (దేశ ప్రజలను) ఓదార్చడం నాకు తెలుసునని, శత్రువులు స్వర్గాన్ని పొందినపుడు చేయవలసిన రీతి నేనెరుగుదునను, 'శృంగంవేద' అనే పాఠంలో శృంగమంటే ప్రాధాన్యం. (లక్షా)
వ్యూహానాం చ సమారంభాన్ దైవగాంధర్వమానుషాన్।
తైరహం మోహయిష్యామి పాండవాన్ వ్యేతు తే జ్వరః॥ 10
దేవతలు, గంధర్వులు, మానవులు చేసే వ్యూహరచనజ్ఞానం నాకు ఉంది. వాటితో నేను పాండవులను మోహింపచేస్తాను చింతించకు/పరితపించకు. (10)
సోఽహం యోత్స్యామి తత్త్వేన పాలయంస్తవ వాహినీమ్।
యథావచ్ఛాస్త్రతో రాజన్ వ్యేతు తే మానసో జ్వరః॥ 11
రాజా! నేను నీ సేనను రక్షిస్తాను. శాస్త్రీయ విధానాన్ననుసరించి యథార్థంగా పాండవులతో యుద్ధం చేస్తాను. కాబట్టి నీ మనోవ్యథ పోవుగాక. (11)
సం॥వి॥ తత్త్వేన = కపటం లేకుండా నీ సైన్యాన్ని రక్షిస్తానని (నీల)
దుర్యోధన ఉవాచ
విద్యతే మే న గాంగేయ భయం దేవాసురేష్వపి।
సమస్తేదు మహాబాహో సత్యమేతత్ బ్రవీమి తే॥ 12
దుర్యోధనుడు చెప్పాడు. మహాబాహూ! గంగా నందనా! నేను మీకి సత్యం చెపుతున్నాను. నాకు దేవతలు, అసురులు వీరెవరివల్ల భయం లేదు. (12)
కిం పునస్త్వయి దుర్ధర్షే సైనాపత్యే వ్యవస్థితే।
ద్రోణే చ పురుషవ్యాఘ్రే స్థితే యుద్ధాభినందిని॥ 13
ఎదిరించడానికి వీలు కాని మీరు మాకు సేనాపతిగా ఉన్నారు. యుద్ధాన్ని అభినందించే పురుషశ్రేష్ఠుడు ద్రోణాచార్యుడు నా కోసం యుద్ధభూమి యందున్నాడు. ఇంకా నాకు భయమెలా కలుగుతుంది? (13)
భవద్భ్యాం పురుషాగ్ర్యాభ్యాం స్థితాభ్యాం విజయే మమ।
న దుర్లభం కురుశ్రేష్ఠ దేవరాజ్యమపి ధ్రువమ్॥ 14
పురుషశ్రేష్ఠులయిన మీరిద్దరు నా విజయం కోసం రణరంగంలో నిలబడి ఉండగా నాకు దేవరాజ్యం లభించడం కూడా దుర్లభం కాదు. కురుశ్రేష్ఠా! ఇది ధ్రువం. (14)
రథసంఖ్యాం తు కార్త్న్యేన పరేషామాత్మనస్తథా।
తథైవాతిరథానాం చ వేత్తుమిచ్ఛామి కౌరవ॥ 15
పితామహోఽపి కుశలః పరేషామాత్మనస్తథా।
శ్రోతుమిచ్ఛామ్యహం సర్వైః సహైభిర్వసుధాధిపైః॥ 16
కురునందనా! మీరు శత్రుపక్షంలోను, మన పక్షంలోను గల రథికుల, అతిరథుల సంఖ్యను పూర్తిగా ఎరుగుదురు. మీ నుండి ఈ విషయం తెలుసుకోవాలను కొంటున్నాను. మీరు స్వ పరపక్షాల అన్ని విషయాల జ్ఞానంలో నిపుణులు. నేను, ఈ రాజులందరూ మీ నోట ఈ విషయాలను వినాలని కోరుకొంటున్నాము. (15,16)
వి॥సం॥ రథసంఖ్యాం = రథులు, అత్యుత్కృష్టరథులు, ముఖ్యరథులు అనే పరిగణనను అని భావం, అతిరథుల సంఖ్య కూడా దీనిలోనికి అనువర్తిస్తుంది. (అర్జు)
భీష్మ ఉవాచ
గాంధారే శృణు రాజేంద్ర రథసంఖ్యాం స్వకే బలే।
యే రథాః పృథివీపాల తథైవాతిరథాశ్చ యే॥ 17
భీష్ముడన్నాడు. గాంధారీ కుమారా! మన సేనలో రథికులను, అతిరథులను వర్ణిస్తాను విను. (17)
బహూనీహ సహస్రాణి ప్రయుతాన్యర్బుదాని చ।
రథానాం తన సేనాయాం యథాముఖ్యం తు మే శృణు॥ 18
నీ సేనలో రథికులు వేలు, లక్షలు, కోట్లు ఉన్నారు. వారిలో ముఖ్యమయిన వారి పేర్లు విను. (18)
వి॥సం॥ పతీనాం తవసేనాయాం సహితా న్యర్బుదానిచ అనే పాఠంలో అర్బుదాని = చాలా సంఖ్యకలవి అని అర్థం చెప్పుకోవాలి.
భవానగ్రే రథోదారః సహ సర్వైః సహోదరైః।
దుశ్శాసనప్రభృతిభిః భ్రాతృభిశ్శతసమ్మితైః॥ 19
అందరికంటె ముందు దుశ్శాసనుడు మొదలయిన నూరుగురు సహోదరులతో కూడా నీవు గొప్ప ఉదారథికుడవు. (19)
వి॥సం॥ నీవు రథికులలో గొప్పవాడివి. మహారథుడివి కాదు. దుశ్శాసనాదులు కూడా అట్టి వారే అని(నీల) శతసంమితైః = నూరు సంఖ్య కలవారు(అర్జు)
సర్వే కృతప్రహరణాః ఛేదభేదవిశారదాః।
రథోపస్థే గజస్కంధే గదాప్రాసాసిచర్మణి॥ 20
మీరందరూ అస్త్ర విద్య నెరిగినవారు, ఛేద భేదనాల్లో నిపుణులు. రథం మీద, ఏనుగు మీద కూర్చుని యుద్ధం చేయగలరు. గద, ఈటె, కత్తి, డాలు ప్రయోగించడంలో నిపుణులు. (20)
వి॥సం॥ కృతప్రహరణాః = అస్త్రములను అభ్యసించినవారు(అర్జు) కృతప్రహరణాః = యుద్ధములు చేసినవారు(సర్వ)
సంయంతారః ప్రహర్తారః కృతాస్త్రా భారసాధనాః।
ఇష్వస్త్రే ద్రోణశిష్యాశ్చ కృపస్య చ శరద్వతః॥ 21
మీరు రథాన్ని నిపుణంగా నడపగలరు. అస్త్రాలతో వేధించగలరు. అస్త్ర విద్య నెరిగినవారు, కార్యభారంలో సమర్థులు. ధనుర్విద్యలో మీరు ద్రోణాచార్యునికి, కృపాచార్యునికి యోగ్యులయిన శిష్యులు. (21)
వి॥సం॥ సంహర్తారః అనే పాఠంలో అస్త్రముల ఉపసంహార మెరిగినవారు(సర్వ)
ఏతే హనిష్యంతి రణే పంచాలాన్ యుద్ధదుర్మదాన్।
కృతకిల్బిషాః పాండవేయైః ధార్తరాష్ట్రా మనస్వినః॥ 22
మనస్వులు అయిన ధృతరాష్ట్రకుమారులు పాండవులతో వైరం పెట్టుకుని ఉన్నారు. యుద్ధంలో ఉన్మత్తులయిన వీరు పోరాడే పాంచాలయోధులను రణభూమిలో చంపుతారు. (22)
తథాహం భరతశ్రేష్ఠ సర్వసేనాపతి స్తవ।
శత్రూన్ విధ్వంసయిష్యామి కదర్థీకృత్య పాండవాన్॥ 23
భరతవంశోత్తమా! నేను నీ సేనకు ప్రధానసేనా నాయకుడను. కాబట్టి పాండవులకు కష్టం కలిగించి శత్రువులను సంహరిస్తాను. (23)
వి॥సం॥ కదర్థీ కృత్య = కష్టం కలిగించి (అర్జు)
న త్వాత్మనో గుణాన్ వక్తుమ్ అర్హామి విదితోఽస్మి తే।
కృతవర్మా త్వతిరథో భోజః శస్త్రభృతాం వరః॥ 24
నేను నా ముఖంతో నా సుగుణాలను చెప్పుకోవడం ఉచితం కాదు. నీవు నెన్నెరుగుదువు. శస్త్రధరులలో శ్రేష్ఠుడు భోజవంశంవాడైన కృతవర్మ మీ సైన్యంలో అతిరథుడు. (24)
వి॥సం॥ నత్వాత్మనః అనే పాదంచే తన పరాక్రమం అతి రథాది శబ్దాలచేత కొలవడానికి శక్యంకానిదని సూచింపబడింది. (నీల)
రథికుని కంటె గొప్పవాడు అతిరథుడు(అర్జు)
అర్థసిద్ధిం తవ రణే కరిష్యతి న సంశయః।
శస్త్రవిద్భిరనాధృష్యః దూరపాతీ దృఢాయుధః॥ 25
హనిష్యతి చమూం తేషాం మహేంద్రో దానవానివ।
ఇతడు యుద్ధంలో నీ అభీష్టార్థాన్ని సిద్ధింపజేస్తాడు. దీనిలో సంశయం లేదు. గొప్ప గొప్ప శస్త్రవేత్తలు కూడా ఇతని నోడించలేరు. ఇతని ఆయుధాలు మిక్కిలి దృఢమైనవి. ఇతడు దూరంలోని లక్ష్యాన్ని కొట్టడంలో సమర్థుడు. దేవరాజయిన ఇంద్రుడు దానవులను సంహరించినట్లు ఇతడు పాండవులసేనను వినాశం చేస్తాడు. (25 1/2)
వి॥సం॥ అర్థ సిద్ధి = ప్రయోజనసిద్ధి
మద్రరాజో మహేష్వాసః శల్యో మేఽతిరథో మతః॥ 26
స్పర్థతే వాసుదేవేన నిత్యం యో వై రణే రణే।
మహాధనుర్ధరుడైన ముద్రరాజు శల్యుడు కూడా అతిరథుడే. ఆయన ప్రతి యుద్ధంలో భగవంతుడైన శ్రీఖృష్ణునితో పోటీపడుతూ ఉంటాడు. (26 1/2)
భాగినేయాన్ నిజాం స్త్యక్త్వా శల్య స్తేఽతిరథో మతః।
ఏష యోత్స్యతి సంగ్రామే పాండవాంశ్చ మహారథాన్॥ 27
సాగరోర్మిసమైర్బాణైః ప్లావయన్నివ శాత్రవాన్।
అతడు తన మేనల్లుళ్ళయిన నకుల సహదేవులను విడవి మిగిలిన పాండవ మహారథికులందరితోను రణరంగంలో యుద్ధం చేస్తాడు. అతడు సముద్రతరంగాల వంటి తన బాణాలతో శత్రుసైనికులను ముంచివేస్తూ యుద్ధం చేస్తాడు. అతడు నీ సైన్యంలో అతిరథుడని నా అభిప్రాయం. (27 1/2)
భూరిశ్రవాః కృతాస్త్రశ్చ తవ చాపి హితః సుహృత్॥ 28
సౌమదత్తి ర్మహేష్వాసః రథయూథపయూథపః।
బలక్షయమమిత్రాణాం సుమహాంతం కరిష్యతి॥ 29
సోమదత్తుని కుమారుడు మహాధనుర్ధరు డయిన భూరిశ్రవుడు కూడా అస్త్రవిద్యలో పండితుడు. మీ హితాన్ని కోరే సుహృత్తు. అతడు రథికులలో యూథపతులలో కూడా యూథపతి. నీ శత్రుసైన్యాన్ని సంహారం చేస్తాడు. (28,29)
వి॥సం॥ రథయూథపులు మహారథులు. వారి యూథపుడు అతిరథుడు(నీల)
సింధురాజో మహారాజ మతో మే ద్విగుణో రథః।
యోత్స్యతే సమరే రాజన్ విక్రాంతో రథసత్తమః॥ 30
మహారాజా! సింధురాజయిన జయద్రథుడు ఇద్దరు రథికులతో సమానమైన వాడని భావిస్తున్నాను. అతడు గొప్ప పరాక్రమవంతుడు, రథికుడు. రాజా! అతడు కూడా విక్రమించి యుద్ధం చేస్తాడు. (30)
వి॥సం॥ సింధురాజు జయద్రథుడు ద్విరథుడు. (నీలకంఠ)
ద్రౌపదీహరణే రాజన్ పరిక్లిష్టశ్చ పాండవైః।
సంస్మరంస్తం పరిక్లేశం యోత్స్యతే పరవీరహా॥ 31
రాజా! ద్రౌపదీహరణ సమయంలో పాండవుల వల్ల ఇతడు చాలా క్లేశాన్ని పొందాడు. శత్రుసంహారకుడయిన జయద్రథుడు ఆ కష్టాన్ని తలచుకొని పాండవులతో యుద్ధం చేస్తాడు. (31)
ఏతేన హి తదా రాజన్ తప ఆస్థాయ దారుణమ్।
సుదుర్లభో వరో లబ్ధః పాండవాన్ యోద్ధుమాహవే॥ 32
రాజా! ఆ సమయంలో అతడు కఠిన తపస్సు చేసి, పాండవులలో యుద్ధం చేయడానికి మిక్కిలి దుర్లభమయిన వరాన్ని పొందాడు. (32)
స ఏష రథశార్దూలః తద్ వైరం సంస్మరన్ రణే।
యోత్స్యతే పాండవైస్తాత ప్రాణాం స్త్యక్త్వా సుదుస్త్వజాన్॥ 33
నాయనా! రథికులలో శ్రేష్ఠుడయిన జయద్రథుడు ఆ పాత వైరాన్ని గుర్తుంచుకొని విడవరాని ప్రాణాలను గూడా విడుచుటకు సిద్ధపడి పాండవులతో యుద్ధం చేస్తాడు. (33)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణీ రథాతిరథ సంఖ్యాన పర్వణి పంచ షష్ట్యధిక శతతమోఽధ్యాయః ॥ 165 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున రథాతిరథ సంఖ్యాన పర్వమను ఉపపర్వమున నూట అరువదిఅయిదవ ఆధ్యాయము. (165)