164. నూట అరువది నాల్గవ అధ్యాయము
పాండవసేన యుద్ధమున కేగుట.
సంజయ ఉవాచ
ఉలూకస్య వచః శ్రుత్వా కుంతీపుత్రో యుధిష్ఠిరః।
సేనాం నిర్యాపయామాస ధృష్టద్యుమ్నపురోగమమ్॥ 1
సృంజయుడిట్లు చెప్పాడు. ఉలూకుని మాటలు విని ధర్మరాజు ధృష్టద్యుమ్నుని ముందుంచుకొని సైన్యమును బయలుదేరదీశాడు. (1)
పదాతీనీం నాగవతీం రథినీమశ్వవృందినీమ్।
చతుర్విధబలాం భీమామ్ అకంపాం పృథివీమివ॥ 2
భీమసేనాదిభిర్గుప్తాం సార్జునైశ్చ మహారథైః।
ధృష్టద్యుమ్నవశాం దుర్గాం సాగరస్తిమితోపమామ్॥ 3
పదాతిదళాలు, ఏనుగులు, రథాలు, గుర్రాలు ఇలా చతుర్విధబలాలతో భయంకరమై కదల్చరాని భూమిలాగా ఉన్నది సైన్యం. అది భీమసేనుని రక్షణలో మహారథులయిన అర్జునుడు. ధృష్టద్యుమ్నుడు వీరికి వశమయి, స్తిమితంగా ఉన్న సముద్రంలా ఉంది. (2,3)
తస్యాస్త్వగ్రే మహేష్వాసః పాంచాల్యో యుద్ధదుర్మదః।
ద్రోణప్రేప్సురనీకాని ధృష్టద్యుమ్నో వ్యకర్షత॥ 4
దానిముందు ధనుర్విశారదుడు ధృష్టద్యుమ్నుడు ద్రోణుని వధ కోసం సేనలను నడిపిస్తున్నాడు. (4)
యథా బలం యథోత్సాహం రథినః సముపాదిశత్।
వారి వారి బలానికీ, ఉత్సాహానికీ తగినట్లు రథికులను ప్రోత్సహించాడు.
అర్జునం సూతపుత్రాయ భీమం దుర్యోధనాయ చ॥ 5
ధృష్టకేతుం చ శల్యాయ గౌతమాయోత్తమౌజసమ్।
అశ్వత్థామ్నే చ నకులం శైబ్యం చ కృతవర్మణే॥ 6
సైంధవాయ చ వార్ష్ణేయం యుయుధానం సమాదిశత్।
శిఖండినం చ భీష్మాయ ప్రముఖే సమకల్పయత్॥ 7
అర్జునుని కర్ణుడికోసం, భీముని దుర్యోధనుని కోసం, ధృష్టకేతుని శల్యుడికోసం, ఉత్తమౌజుని కృపుని కోసం, నకులుని అశ్వత్థామ కోసం, శైబ్యుని కృతవర్మ కోసం, సాత్యకిని, సైంధవునికోసం నిలబెట్టాడు. ప్రముఖుడయిన భీష్మునికోసం శిఖండిని నిలిపాడు. (5,6,7)
సహదేవం శకునయే చేకితానం శలాయ వై।
ద్రౌపదేయాంస్తథా పంచ త్రిగర్తేభ్యః సమాదిశత్॥ 8
శకునికోసం సహదేవుని, శలుని కోసం చేకితానుని, త్రిగర్తులకోసం, ఉపపాండవులయిదుగురినీ ఆజ్ఞాపించాడు. (8)
వృషసేనాయ సౌభద్రం శషాణాం చ మహీక్షితామ్।
స సమర్థం హి తం మేనే పార్థాదభ్యధికం రణే॥ 9
వృషసేనుడికోసం అభిమన్యుని నియమించాడు. శషులనే రాజులకోసం అతడు చాలు ననుకొన్నాడు ధృష్టద్యుమ్నుడు. అభిమన్యుడు యుద్ధంలో అర్జునునిమించిన వాడని ధృష్టద్యుమ్నుడు భావించాడు. (9)
ఏవం విభజ్య యోధాంస్తాన్ పృథక్చ సహచైవ హ।
జ్వాలావర్ణో మహేష్వాసః ద్రోణమంశమకల్పయత్॥ 10
యోధులందరినీ ఇలా వేర్వేరుగానూ సామూహికంగానూ నియమించి తనవంతు ద్రోణుడని ధృష్టద్యుమ్నుడు భావించాడు. (10)
ధృష్టద్యుమ్నో మహేష్వాసః సర్వసేనాపతిస్తతః।
విధివద్ వ్యూహ్య మేధావీ యుద్ధాయ ధృతమానసః॥ 11
యథోద్దిష్టాని సైన్యాని పాండవానామయోజయత్।
జయాయ పాండుపుత్రాణాం యత్తస్తస్థౌ రణాజిరే॥ 12
ధనుర్ధరుడూ, సర్వసేనాపతి అయిన ధృష్టద్యుమ్నుడు యథావిధిగా వ్యూహనిర్మాణం చేసి వారి వారి ప్రదేశాల్లో పాండవ సైన్యాలను నిలిపాడు. పాండవుల విజయం కోసం తాను సైన్యం ముందు నిలిచాడు. (11,12)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణీ ఉలూకదూతాగమన పర్వణి సేనాపతి నియోగే చతుఃషష్ట్యధిక శతతమోఽధ్యాయః ॥ 164 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున ఉలూకదూతాగమన పర్వమను ఉపపర్వమున సేనాపతినియోగమను నూట అరువది నాల్గవ ఆధ్యాయము. (164)