163. నూట అరువది మూడవ అధ్యాయము

దుర్యోధనుడు తన సైన్యమును యుద్ధమునకు ఆదేశించుట.

సంజయ ఉవాచ
దుర్యోధనస్య తద్వాక్యం నిశమ్య భరతర్షభ।
నేత్రాభ్యామతితామ్రాభ్యాం నిశమ్య సముదైక్షత॥ 1
సంజయుడు ఇట్లు అన్నాడు - అర్జునుడు దుర్యోధనుడన్న మాట గుర్తు తెచ్చుకొని కనులు ఎర్రనై పైకెత్తి ఉలూకుని చూశాడు. (1)
స కేశవమభిప్రేక్ష్య గుడాకేశో మహాయశాః।
అభ్యభాషత కైతవ్యం ప్రగృహ్య విపులం భుజమ్॥ 2
కీర్తిశాలి అయిన అర్జునుడు కృష్ణునివైపు చూసి చెయ్యి పైకెత్తి ఉలూకునితో ఇలా అన్నాడు. (2)
స్వవీర్యం యః సమాశ్రిత్య సమాహ్వయతి వై పరాన్।
అభీతో యుధ్యతే శత్రూన్ స వై పురుష ఉచ్యతే॥ 3
తన పరాక్రమాన్ని ఆశ్రయించుకొని శత్రువులను పిలిచి నిర్భయంగా యుద్ధం చేసేవాడే పురుషుడనిపించుకుంటాడు. (3)
పరవీర్యం సమాశ్రిత్య యః సమాహ్వయతే పరాన్।
క్షత్రబంధురశక్తత్వాత్ లోకే స పురుషాధమః॥ 4
ఇతరుల పరాక్రమాన్ని ఆశ్రయించి, శత్రువులను ఆహ్వానించేవాడు శక్తిహీనుడవడం వల్ల క్షత్రియాధముడు, పురుషాధముడు అనిపించుకుంటాడు. (4)
స త్వం పరేషాం వీర్యేణ మన్యసే వీర్యమాత్మనః।
స్వయం కాపురుషో మూఢ పరాంశ్చ క్షేప్తుమిచ్ఛసి॥ 5
అటువంటి నీవు ఇతరుల పరాక్రమాన్ని నీపరాక్రమం అనుకుంటున్నావు. మూఢా! నీవు స్వయంగా దుర్మార్గుడవు. నీచుడవు, పైగా ఇతరులను ఆక్షేపిస్తున్నావు. (5)
యస్త్వం వృద్ధం సర్వరాజ్ఞాం హితబుద్ధిం జితేంద్రియమ్।
మరణాయ మహాప్రాజ్ఞం దీక్షయిత్వ వికత్థసే॥ 6
రాజులందరికీ మేలు చేసేవాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడు, పెద్దవాడు అయిన భీష్మునికి "మరణదీక్ష" నిచ్చి ఇక్కడ గొప్పలు చెపుతున్నావు. (6)
భావస్తే విదితోఽస్మాభిః దుర్బుద్ధే కులపాంసన।
న హనిష్యంతి గాంగేయం పాండవా ఘృణయేతి హ॥ 7
దుర్మతీ! కులనాశకా! నీ భావం మాకు తెలిసింది. పాండవులు జాలితో తాతగారిని చంపరని అనుకొంటున్నావు. (7)
యస్య వీర్యం సమాశ్రిత్య ధార్తరాష్ట్ర వికత్థసే।
హంతాస్మి ప్రథమం భీష్మం మిషతాం సర్వధన్వినామ్॥ 8
ఆయన యొక్క పరాక్రమం చూసుకొనే నీవు ప్రగల్భాలు పలుకుతున్నావు. కాని విలుకాండ్రుందరూ చూస్తూ ఉండగానే మొట్టమొదట భీష్మునే పడగొడతాను. (8)
కైతవ్య గత్వా భరతాన్ సమేత్య
సుయోధనం ధార్తరాష్ట్రం వదస్వ।
తథేత్యువాచార్జునః సవ్యసాచీ
నిశావ్యపాయే భవితా విమర్దః॥ 9
ఉలూకా! నీవు వెళ్లి కౌరవులను కలిసి దుర్యోధనునితో చెప్పు - "సవ్యసాచి అయిన అర్జునుడు 'అలాగే' అన్నాడు - తెల్లెవారగానే యుద్ధం ప్రారంభం అవుతుంది" అని. (9)
యద్వాఽబ్రవీద్వాక్యమదీనసత్త్వా
మధ్యే కురూన్ హర్షయన్ సత్యసంధః।
"అహం హంతా సృంజయానామనీకం
శాల్వేయకాంశ్చేతి మమైష భారః॥ 10
మహాశక్తిశాలి, సత్యసంధుడూ అయిన భీష్ముడు కౌరవులకు సంతోషం కలిగిస్తూ చెప్పిన మాట ఉందిగదా!" సృంజయులను శాల్వేయులను చంపే భారం నాది. (సృంజయులు అనే మాట నుండి తరువాతి శ్లోకంలోని భయంలేదు అనేవరకూ భీష్ముడు పూర్వం దుర్యోధనునితో అన్నమాటలు). (10)
హన్యామహం ద్రోణమృతేఽపి లోకం
న తే భయం విద్యతే పాండవేభ్యః" ।
తతో హి తే లబ్ధతమం చ రాజ్యం
ఆపద్గతాః పాండవాశ్చేతి భావః॥ 11
ద్రోణుడు లేకపోయినా సరే లోకమంతటినీ నేనే సంహరించగలను - నీకు పాండవుల వల్ల భయంలేదు." అని భీష్ముడు అన్నాడుగా! ఆ మాట విని నీకు రాజ్యం వచ్చేసింది అనుకొంటున్నావు. పైగా పాండవులకు ఆపదలు పొందినట్లే అని అనుకొంటున్నావు. (11)
స దర్పపూర్ణో న సమీక్షసే త్వమ్
అనర్థమాత్మన్యపి వర్తనామానమ్।
తస్మాదహం తే ప్రథమం సమూహే
హంతా సమక్షం కురువృద్ధమేవ॥ 12
అందుచేత నీవు గర్వంతో నీలోనే దోషం ఉన్నా నిన్ను నీవు పరిశీలించుకోవటం లేదు. కాబట్టి నీముందే ఆ కురువృద్ధుని ముందుగా చంపుతాను. (12)
సూర్యోదయే యుక్తసేనః ప్రతీక్ష్య
ధ్వజీ రథీ రక్షత సత్యసంధమ్।
అహం హి వః పశ్యతాం ద్వీపమేనం
భీష్మమ్ రథాత్ పాతయిష్యామి బాణైః॥ 13
సూర్యోదయం అయ్యేసరికి సేనలతో ధ్వజాన్ని రథాన్ని చక్కజేసికొని ఆ భీష్ముని రక్షించుకొనేందుకు సిద్ధంగా ఉండు. మీ సేనా సముద్రానికి ద్వీపం లాంటి ఆ భీష్ముని మీరంతా చూస్తూ ఉండగా రథం నుండి పడగొడతాను. (13)
శ్వో భూతే కత్థనావాక్యం విజ్ఞాస్యతి సుయోధనః।
ఆచితం శరజాలేన మయా దృష్ట్వా పితామహమ్॥ 14
రేపు నా బాణాలతో నిండి ఉన్న భీష్ముని చూశాక దుర్యోధనుడికి తన ప్రాజ్ఞావాక్యాలు ఎంతటివో తెలుస్తాయి. (14)
యదుక్తశ్చ సభామధ్యే పురుషో హ్రస్వదర్శనః।
క్రుద్ధేన భీమసేనేన భ్రాతా దుఃశాసనస్తవ॥ 15
అధర్మజ్ఞో నిత్యవైరీ పాపబుద్ధిర్నృశంసవత్।
సత్యాం ప్రతిజ్ఞామచిరాద్ ద్రక్ష్యసే తాం సుయోధన॥ 16
తక్కువచూపు ఉన్న అధర్మపరుడు నిత్యవైరి పాపబుద్ధి అయిన నీ తమ్ముడు దుశ్శాసనుని గురించి భీముడు చేసిన ప్రతిజ్ఞ నిజమైందని త్వరలోనే తెలుసుకుంటావు. (15-16)
అభిమానస్య దర్పస్య క్రోధపారుష్యయోస్తథా।
నైష్ఠుర్యస్యావలేపస్య ఆత్మసంభావనస్య చ॥ 17
నృశంశతాయాస్తైక్ష్ణ్యస్య ధర్మవిద్వేషణస్య చ।
అధర్మస్యాతివాదస్య వృద్ధాతిక్రమణస్య చ॥ 18
దర్శనస్య చ వక్రస్య కృత్స్నస్యాపనయస్య చ।
ద్రక్ష్యసి త్వం ఫలం తీవ్రమ్ అచిరేణ సుయోధన॥ 19
దుర్యోధనా! నీ దురభిమానానికీ, గర్వానికీ, క్రోధానికీ, కాఠిన్యానికీ, నిష్ఠురత్వానికీ, అహంకారానికీ, ఆత్మస్తుతికీ, క్రూరత్వానికీ, తీక్ష్ణతకూ, ధర్మద్వేషానికీ, అధర్మానికీ, అతివాదానికీ, వృద్ధులను లెక్కచేయకపోవడానికీ, వక్రదృష్టికీ, అవినీతికీ.... అన్నిటికీ తగిన ఫలం త్వరలోనే అనుభవిస్తావు. (17,18,19)
వాసుదేవద్వితీయే హి మయి క్రుద్ధే నరాధమ।
ఆశా తే జీవితే మూఢ రాజ్యే వా కేన హేతునా॥ 20
నరాధమా! కృష్ణునితో కూడి నేను కోపిస్తే నీకింక జీవితాశే ఉండదు. రాజ్యం మీద ఆశ ఎందుకు ఉంటుంది? (20)
శాంతే భీష్మే తథా ద్రోణే సూతపుత్రే చ పాతితే।
నిరాశో జీవితే రాజ్యే పుత్రేషు చ భవిష్యతి॥ 21
భీష్ముడూ, ద్రోణుడూ, కర్ణుడూ పడిపోయాక జీవితం మీదా, రాజ్యం మీదా, పుత్రుల మీదా కూడా నిరాశే మిగులుతుంది. (21)
భ్రాతౄణాం నిధనం శ్రుత్వా పుత్రాణాం చ సుయోధన।
భీమసేనేన నిహతో దుష్కృతాని స్మరిష్యసి॥ 22
భీమసేనుడు నీ తమ్ముళ్లనూ, కొడుకులనూ చంపేశాడని విన్నాక నీ తప్పుడు పనులు గుర్తుకువస్తాయి. (22)
న ద్వితీయాం ప్రతిజ్ఞాం హి ప్రతిజానామి కైతవ।
సత్యం బ్రవీమ్యహం హ్యేతత్ సర్వం సత్యం భవిష్యసి॥ 23
ఉలూకా! మళ్లీ రెండో ప్రతిజ్ఞ చేయవలసిన పనిలేదు. నిజమే చెపుతున్నాను - ఇదంతా జరిగితీరుతుంది. (23)
యుధిష్ఠిరోఽపి కైతవ్యమ్ ఉలూకమిదమబ్రవీత్।
ఉలూక మద్వచో బ్రూహి గత్వా తాత సుయోధనమ్॥ 24
తరువాత ధర్మరాజు కూడా ఉలూకునితో ఇలా అన్నాడు. ఉలూకా! నీవు వెళ్లి దుర్యోధనునితో నా మాట చెప్పు. (24)
స్వేన వృత్తేన మే వృత్తం నాధిగంతుం త్వమర్హసి।
ఉభయోరంతం వేద సూనృతానృతయోరపి॥ 25
సుయోధనా! నీ ప్రవర్తనతో నా ప్రవర్తనను దాటలేవు. మన ఇద్దరికీ సత్యానికీ అసత్యానికీ ఉన్నంత దూరం ఉంది. ఇది నాకు తెలుసు. (25)
న చాహం కామయే పాపమ్ అపి కీటపిపీలయోః।
కిం పునర్ జ్ఞాతిషు వధమ్ కామయేయం కథంచన॥ 26
నేను పురుగులకూ, చీమలకూ కూడా కష్టం కలిగించాలని అనుకోను. అటువంటప్పుడు జ్ఞాతులను చంపుకుందామనుకుంటానా? (26)
ఏతదర్థం మయా తాత పంచగ్రామా వృతాః పురా।
కథం తవ సుదుర్భుద్ధే న ప్రేక్ష్యే వ్యసనం మహత్॥ 27
అందుకే నేను అయిదు గ్రామాలు అడిగాను - దానిలోని కష్టం ఏమిటో తెలుసుకోలేకపోతున్నావు. (27)
స త్వం కామపరీతాత్మా మూఢభావాచ్చ కత్థసే।
తథైవ వాసుదేవస్య న గృహ్ణాసి హితం వచః॥ 28
అటువంటి నీవు కామంతో నిండిపోయి మూఢుడవై గొప్పలు చెప్పుకొంటున్నావు. నీకు హితం చెప్పిన కృష్ణుని మాటలు కూడా వినలేదు. (28)
కించేదానీం బహూక్తేన యుధ్యస్య సహబాంధవైః।
మమ విప్రియకర్తారమ్ కైతవ్య బ్రూహి కౌరవమ్॥ 29
ఇక (అన్నీ అయిపోయాక) ఇపుడు ఎన్నిమాటలు చెపితే మాత్రం ఏ ప్రయోజనం? బంధువులతో కలిసి పోరాడు. ఉలూకా! నాకు అప్రియం చేస్తున్న దుర్యోధనునితో ఇలా చెప్పు. (29)
శ్రుతం వాక్యం గృహీతోఽర్థః మతం యత్తే తథాస్తు తత్।
నీ మాటలు వినిపించాయి. అర్థం తెలిసింది. నీ యిష్టం ఏదయితే అదే జరుగుగాక! (29 1/2)
భీమసేనస్తతో వాక్యం భూయ ఆహ నృపాత్మజమ్॥ 30
తరువాత భీముడు ఉలూకునితో మళ్లీ ఇలా అన్నాడు. (30)
ఉలూక మద్వచో బ్రూహి దుర్మతిం పాపపూరుషమ్।
శఠం నైకృతికం పాపం దురాచారం సుయోధనమ్॥ 31
ఉలూకా! దుర్బుద్ధి, పాపి, మూర్ఖుడు, అపకారపరుడు, దురాచారుడూ అయిన దుర్యోధనునితో నా మాట చెప్పు. (31)
గృధ్రోదరే వా వస్తవ్యం పురే వా నాగసాహ్వయే।
ప్రతిజ్ఞాతం మయా తచ్చ సభామధ్యే నరాధమ॥ 32
కర్తాహం తద్వచః సత్యం సత్యేనైవ శపామి తే।
దుశ్శాసనస్య రుధిరం హత్వా పాస్యామ్యహం మృధే॥ 33
గ్రద్ద కడుపులో/(అడవిలోకి పారిపోయి) దాక్కున్నా హస్తినాపురంలో దాక్కున్నాసరే దుశ్శాసనుని లాక్కువచ్చి యుద్ధంలో చంపి రక్తం త్రాగుతానని చేసిన శపథం నిజమే అవుతుంది. సత్యం మీద ఒట్టువేసి చెపుతున్నాను. (32,33)
సక్థినీ తవ భంక్త్యైవ హత్వా హి తవ సోదరాన్।
సర్వేషాం ధార్తరాష్ట్రాణామ్ అహం మృత్యుః సుయోధన॥ 34
దుర్యోధనా! నీ తొడలు విరగగొట్టి చంపి, నీ సోదరులందరి పాలిట మృత్యువు నవుతాను. (34)
సర్వేషాం రాజపుత్రాణామ్ అభిమన్యురసంశయమ్।
కర్మణా తోషయిష్యామి భూయశ్పైవ వచః శృణూ॥ 35
కోపంతో నిండిన నేను రాజపుత్రులందరికీ సంతోషం చేకూరుస్తాను - ఇంకా నా మాట విను. (35)
హత్వా సుయోధన త్వాం వై సహితం సర్వసోదరైః।
ఆక్రమిస్తే పదా మూర్థ్ని ధర్మరాజస్య పశ్యతః॥ 36
దుర్యోధనా! నీ సోదరులందరితో నిన్ను చంపి, ధర్మరాజు చూస్తూ ఉండగా, నీ తలను కాలితో తన్నుతాను. (36)
నకులస్తు తతో వాక్యమ్ ఇదమాహ మహీపతే।
ఉలూక బ్రూహి కౌరవ్యం ధార్తరాష్ట్రం సుయోధనమ్॥ 37
రాజా! అపుడు నకులుడిలా అన్నాడు. ఉలూకా! సుయోధనుడికి ఈ మాట చెప్పు. (37)
శ్రుతం తే గదతో వాక్యం సర్వమేవ యథాతథమ్।
తథా కర్తాస్మి కౌరవ్య యథా త్వమనుశాసి మామ॥ 38
యథాతథంగా చెప్పిన నీమాటలు విన్నాను. నీవు చెప్పినట్లే చేస్తాను. (38)
సహదేవోఽపి నృపతే ఇదమాహ వచోర్థవత్।
సుయోధన మతిర్యా తే వృథైష తే భవిష్యతి॥ 39
రాజా! అనంతరం సహదేవుడిలా అర్థవంతంగా అన్నాడు. దుర్యోధనా! నీవు తలచినది జరుగదులే. (39)
శోచిష్యసే మహారాజ సపుత్రజ్ఞాతిబాంధవః।
ఇమం చ క్లేశమస్మాకం హృష్ణో యత్త్వం వికత్థసే॥ 40
రాజా! కుమారులతో, జ్ఞాతులతో, బంధువులతో కలిసి చివరకు నీవే విచారిస్తావు. మా కష్టం చూసి సంతోషిస్తూ ప్రగల్భాలు పలుకుతున్నావుగా! (40)
విరాటద్రుపదౌ వృద్ధౌ ఉలూకమిదమూచతుః।
దాసభావం నియచ్ఛేవ సాధోరితి మతిః సదా॥
తౌ చ దాసావదాసౌ వా పౌరుషం యస్య యాదృశమ్॥ 41
అపుడు విరాట ద్రుపదులు ఉలూకునితో ఇలా అన్నారు. మేము సజ్జనులకు దాసులము. అదే మాశాశ్వత భావన - మేము దాసులమో కామో, ఎవరి పౌరుషం ఎటువంటిదో! (41)
శిఖండీ తు తతో వాక్యమ్ ఉలూకమిదమబ్రవీత్।
వక్తవ్యో భవతా రాజా పాపేష్వభిరతః సదా॥ 42
తరువాత శిఖండి ఉలూకునితో ఇలా అన్నాడు. పాపాసక్తుడయిన దుర్యోధనునికి ఇది చెప్పు. (42)
పశ్య త్వం మాం రణే రాజన్ కుర్వాణం కర్మ దారుణమ్।
యస్య వీర్యం సమాసాద్య మన్యసే విజయం యుధి॥ 43
తమహం పాతయిష్యామి రథాతతవ పితామహమ్।
రాజా! దారుణ కర్మ చేస్తున్న నన్ను యుద్ధంలో చూడు. అతడి పరాక్రమంతోనేగా నీవు విజయం కోరుకుంటున్నావు. ఆ పితామహుని నేనే పడగొడతాను. (43 1/2)
అహం భీష్మవధాత్ సృష్ణో నూనం ధాత్రా మహాత్మనా॥ 44
సోఽహం భీష్మం హనిష్యామి మిషతాం సర్వధన్వినామ్।
నిజంగా బ్రహ్మ నన్ను భీష్మవధకోసం సృష్టించాడు. అందుచేత అందరూ చూస్తూ ఉండగా నేనే భీష్ముని పడగొడతాను. (44 1/2)
ధృష్టద్యుమ్నోఽపి కైతవ్యమ్ ఉలూకమిదమబవ్రీత్॥ 45
సుయోధనో మమ వచః వక్తవ్యో నృపతేః సుతః।
అహం ద్రోణం హనిష్యామి సగణం సహబాంధవమ్॥ 46
ధృష్టద్యుమ్నుడు కూడా ఉలూకునితో ఇలా అన్నాడు. రాజకుమారుడు దుర్యోధనునితో నామాట చెప్పు. బంధు సేనాసమేతుడయిన ద్రోణుని నేను వధిస్తాను. (45,46)
అవశ్యం చ మయా కార్యం పూర్వేషాం చరితం మహత్।
కర్తా చాహం తథా కర్మ యథా నాన్యః కరిష్యతి॥ 47
పూర్వుల చరిత్రను అనుకరించేవాడిని నేను. ఇతరులెవరూ ఆచరించని రీతిలో నేను పనిచేస్తాను. (47)
తమబ్రవీద్ధర్మరాజః కారుణ్యార్థం వచో మహత్।
నాహం జ్ఞాతివధం రాజన్ కామయేయం కథంచన॥ 48
ఉలూకునితో ధర్మరాజ కారుణ్యబుద్ధితో మంచిమాటగా ఇలా అన్నాడు. రాజా! నేను ఎన్నడూ జ్ఞాతుల వధను కోరుకోను. (48)
తవైవ దోషాత్ దుర్బుద్ధే స త్వమేతత్త్వనావృతమ్।
సగచ్ఛ మా చిరం తాత ఉలూక యది మన్యసే॥ 49
ఇహ వా తిష్ఠ భద్రం తే వయం హి తవ బాంధవాః।
దుర్మతీ! ఇదంతా నీ దోషం వల్లనే జరుగుతోంది అనేది స్పష్టం. నాయనా ఉలూకా! ఆలస్యం చేయకు. ఉండాలంటే ఇక్కడ ఉండు. నీకు మేమూ బంధువులమే. నీకు శుభం కలుగుగాక. (49 1/2)
ఉలూకస్తు తతో రాజన్ ధర్మపుత్రం యుధిష్ఠిరమ్॥ 50
ఆమంత్ర్య ప్రయయౌ తత్ర యత్ర రాజా సుయోధనః।
రాజా! తరువాత ఉలూకుడు ధర్మరాజును వీడ్కొని దుర్యోధనుడున్న చోటికి వెళ్లాడు. (50 1/2)
ఉలూకస్తత ఆగమ్య దుర్యోధనమమర్షణమ్॥ 51
అర్జునస్య సమావేశం యథోక్తం సర్వమబ్రవీత్।
ఉలూకుడు వచ్చి క్రోధి అయిన దుర్యోధనునితో అర్జునుడన్నమాటలు ఉన్న వున్నట్లు అన్నీ చెప్పాడు. (51 1/2)
వాసుదేవస్య భీమస్య ధర్మరాజస్య పౌరుషమ్।
నకులస్య విరాటస్య ద్రుపదస్య చ భారత।
సహదేవస్య చ వచః ధృష్టద్యుమ్నశిఖండివోః।
కేశవార్జునయోర్వాక్యం యథోక్తం సర్వమబ్రవీత్॥ 53
వాసుదేవుడు, భీముడు, ధర్మరాజు పలికిన పౌరుషవాక్కులూ, నకులుడు, విరాటుడు, ద్రుపదుడు, సహదేవుడు, ధృష్టద్యుమ్న శిఖండలు, కేశవార్జునులు వీరి మాటలూ అన్నీ యథాతథంగా చెప్పాడు. (52,53)
కైతవ్యస్య తు తద్వాక్యం నిశమ్య భరతర్షభ।
దుఃశాసనం చ కర్ణం చ శకునిం చాపి భారత॥ 54
ఆజ్ఞాపయత రాజ్ఞశ్చ బలం మిత్రబలం తథా।
యథా ప్రాగుదయాత్ సర్వే యుక్తాస్తిష్ఠంత్వనీకినః॥ 55
ఉలూకుడు చెప్పిన మాటలు విని దుర్యోధనుడు దుశ్శాసనునికి, కర్ణునికి, శకునికి, ఇతరరాజులకు, తెల్లవారేలోపులో సేనల మోహరింపును గురించి ఆజ్ఞాపించాడు. (54,55)
తతః కర్ణసమాదిష్టా దూతాః సంత్వరితా రథైః।
ఉష్ట్రగామీభిరప్యన్యే సదశ్వైశ్చ మహాజవైః॥ 56
తూర్ణం పరియయుః సేనాం కృత్స్నాం కర్ణస్య శాసనాత్।
ఆజ్ఞాపయంతో రాజ్ఞశ్చ యోగః ప్రాగుదయాదితి॥ 57
కర్ణుని ఆదేశంతో దూతలు రథాలమీద ఒంటెల మీద, గుర్రాల మీద సేనలను చుట్టివచ్చారు. తెల్లవారకముందే యుద్ధానికి సేనలన్నీ సిద్ధంగా ఉండాలని రాజులందరికీ రాజుగారి ఆజ్ఞను కర్ణశాసనాన్నీ తెలియజేశారు. (56-57)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణీ ఉలూకదూతాగమన పర్వణి ఉలూకాపయానే త్రిషష్ట్యధిక శతతమోఽధ్యాయః ॥ 163 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున ఉలూకదూతాగమన పర్వమను ఉపపర్వమున ఉలూకుడు తిరిగివచ్చుట అను నూట అరువది మూడవ ఆధ్యాయము. (163)