162. నూట అరువది రెండవ అధ్యాయము
పాండవుల ప్రతిసందేశము.
సంజయ ఉవాచ
ఉలూకస్త్వర్జునం భూయః యథోక్తం వాక్యమబ్రవీత్।
అశీవిషమివ క్రుద్ధం తుదన్ వాక్యశలాకయా॥ 1
సంజయుడు ఇలా కొనసాగించాడు - మాటల ములుకులతో పొడుస్తూ ఉలూకుడు త్రాచుపాములా బుసకొట్టుతున్న అర్జునునితో ఇలా అన్నాడు. (1)
తస్య తద్వచనం శ్రుత్వా రుషితాః పాండవా భృశమ్।
ప్రాగేవ భృశసంక్రుద్ధాః కైతవ్యేనాపి ధర్షితాః॥ 2
ఆసనేషూదతిష్ఠంత బాహూంశ్పైవ ప్రచిక్షిపుః।
ఆశీవిషా ఇవ క్రుద్ధాః వీక్షాంచక్రుః పరస్పరమ్॥ 3
అప్పటికే ఆ మాటలు విని పాండవులందరికీ ఎంతో కోపం వచ్చింది. ఆ జనాల్లోంచి లేచి నిలుచుని చేతులు చాపుతూ బుసలు కొడుతూ ఒకరిమొగాలు ఒకరు చూసుకొంటున్నారు. (2-3)
అవాక్ శిరా భీమసేనః సముదైక్షత కేశవమ్।
నేత్రాభ్యాం లోహితాంతాభ్యామ్ ఆశీవిష ఇవ శ్వసన్॥ 4
ఒక్కసారిగా భీముడు తల అడ్డంగా తిప్పి కృష్ణుని వైపు చూశాడు. కనులతుదలలో ఎర్రజీరలు కనిపిస్తున్నాయి. పాములా బుసకొడుతున్నాడు భీముడు. (4)
ఆర్తం వాతాత్మజం దృష్ట్వా క్రోధేనాభిహతం భృశమ్।
ఉత్స్మయన్నివ దాశార్హః కైతవ్యం ప్రత్యభాషత॥ 5
అలా కోపం మూర్తీభవించి నిలిచిన భీముని చూసి ఉలూకుని పరిహసిస్తున్నట్లు కృష్ణుడు ఇలా అన్నాడు. (5)
ప్రయామి శీఘ్రం కైతవ్య బ్రూయాశ్పైవ సుయోధనమ్।
శ్రుతం వాక్యం గృహీతోఽర్థః మతం యత్తే తథాస్తు తత్॥ 6
ఉలూకా! త్వరగా వెళ్ళు. సుయోధనునితో ఇలా చెప్పు. నీవు చెప్పించిన మాటలు విన్నాం. అర్థం తెలిసింది. నీ యిష్టమే జరుగుతుంది" అని చెప్పు. (6)
ఏవముక్త్వా మహాబాహుః కేశవో రాజసత్తమ।
పునరేవ మహాప్రాజ్ఞం యుధిష్ఠిరముదైక్షత॥ 7
మహాభుజుడయిఅ కేశవుడు ఇలా అని మళ్లీ ఒకసారి మహామేధావి అయిన యుధిష్ఠిరుని వైపు చూశాడు. (7)
సృంజయానాం చ సర్వేషాం కృష్ణస్య చ యశస్వినః।
ద్రుపదస్య సపుత్రస్య విరాటస్య చ సన్నిధౌ॥ 8
భూమిపానాం చ సర్వేషాం మధ్యే వాక్యం జగాద హ।
ఉలూకోఽప్యర్జునం భూయః యథోక్తం వాక్యమబ్రవీత్॥ 9
ఆశీవిషమివక్రుద్ధం తుదన్ వాక్యశలాకయా।
కృష్ణాదీంశ్పైవ తాన్ సర్వాన్ యథోక్తం వాక్యమబ్రవీత్॥ 10
సృంజయులందరూ, యశస్వి అయిన కృష్ణుడూ, పుత్రసహితులయిన విరాటద్రుపదులూ, రాజులందరూ ఉండగా ఉలూకుడు మళ్లీ వాగ్బాణాలతో పొడుస్తూ, పాములా బుసకొడుతున్న అర్జునునితోనూ, కృష్ణాదులతోనూ దుర్యోధనుడు చెప్పినట్లు అన్నాడు. (8,9,10)
ఉలూకస్యతు తద్వాక్యం పాపం దారుణమీరితమ్।
శ్రుత్వా విచుక్షుభే పార్థః లలాటం చాప్యమార్జయత్॥ 11
దారుణమయిన ఉలూకుని మాట విని అర్జునుడు ఉడికిపోయి క్షోభించిపోయాడు. నుదుటి చెమట తుడుచుకొన్నాడు. (11)
తదవస్థం తదా దృష్ట్వా పార్థం సా సమితిర్నృప।
నామృష్యంత మహారాజ పాండవానాం మహారథాః॥ 12
మహారాజా! అర్జునుని ఆ అవస్థలోచూసి పాండవ మహారథుల సముదాయమంతా సహించలేకపోయింది. (12)
అధిక్షేపేణ కృష్ణస్య పార్థస్య చ మహాత్మనః।
శ్రుత్వా తే పురుషవ్యాఘ్రాః క్రోధాజ్జజ్వలురచ్యుతాః॥ 13
మహాత్ములయిన కృష్ణార్జునులను అధిక్షేపించడం విని అక్కడి పురుషశ్రేష్ఠులంతా క్రోధంతో మండిపోయారు.(13)
ధృష్టద్యుమ్నః శిఖండీ చ సాత్యకిశ్చ మహారథః।
కేకయా భ్రాతరః పంచ రాక్షసశ్చ ఘటోత్కచః॥ 14
ద్రౌపదేయాభిమన్యుశ్చ ధృష్టకేతుశ్చ మహారథౌ॥ 15
ఉత్పేతురాసనాత్ సర్వే క్రోధసాంరక్తలోచనాః।
బాహూన్ ప్రగృహ్య రుచిరాన్ రక్తచందనరూషితాన్॥ 16
దంతాన్ దంతేషు నిష్పిష్య సృక్విణీ పరిలేలిహన్।
ధృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి, కేకయ రాజులు అయిదుగురు, ఘటోత్కచుడు, ఉపపాండవులు అభిమన్యుడు, ధృష్టకేతుడు, భీమసేనుడు, నకుల సహదేవులు - వీరంతా జ్రోధంతో ఎరుపెక్కిన కళ్లతో ఆసనాల మీద నుండి లేచారు. చందన చర్చలు చేసుకొన్న చేతులెత్తి నిలిచారు. వారపుడు అంగదాలతో, కేయూరాలతో ప్రకాశిస్తూ (కోపంతో) పళ్లు పటపట కొరుకుతూ, సెలవులు నాకుతూ నిలిచారు. (14,15,16 1/2)
తేషా మాకారభావజ్ఞః కుంతీపుత్రో వృకోదరః॥ 17
ఉదతిష్ఠత్ సవేగేన క్రోధేన ప్రజ్వలన్నివ।
ఆ రాజుల ఆకారాలను, మనోభావాలనూ తెలిసిన భీముడు వెంటనే క్రోధంతో మండిపోతూ లేచి నిలిచాడు. (17 1/2)
ఉద్ధృత్య సహసా నేత్రే దంతాన్ కటకటాయ్య చ॥ 18
హస్తం హస్తేన నిష్పిష్య ఉలూకం వాక్యమబ్రవీత్।
కనులు పెద్దవిచేసి, దంతాలు పటపటా కొరుకుతూ, అరచేతులు పిండుతూ ఉలూకునితో ఇలా అన్నాడు భీముడు. (18 1/2)
అశక్తానామివాస్మాకం ప్రోత్సాహననిమిత్తకమ్॥ 19
శ్రుతం తే వచనం మూర్ఖ యత్త్వాం దుర్యోధనోఽబ్రవీత్।
మూర్ఖా! మిమ్మల్ని అశక్తులనుకొని ప్రోత్సహిస్తున్నట్లు నీకు దుర్యోధనుడు చెప్పిన మాటలు విన్నామురా! (19 1/2)
తన్మే కథయతో మంద శృణు వాక్యం దురాసదమ్॥ 20
సర్వక్షత్రస్య మధ్యే త్వం యద్వక్ష్యసి సుయోధనమ్।
శృణ్వతః సూతపుత్రస్య పితుశ్చ త్వం దురాత్మనః॥ 21
మూర్ఖా! నేను చెపుతున్న మాటవిను - రాజులందరి మధ్య దాన్ని నీవు కర్ణుడూ, నీ తండ్రి శకునీ వింటూ ఉండగా సుయోధనుడితో చెప్పు. (20,21)
అస్మాభిః ప్రతికామైస్తు భ్రాతుర్జ్యేష్ఠస్య నిత్యశః।
మర్షితం తే దురాచార తత్త్వం న బహుమన్యసే॥ 22
దురాచరా! మా పెద్దన్నగారికి సదా ప్రీతి కలిగించాలని మేము నీపనులన్నీ సహించాం. అది నీవు తెలుసుకోలేకపోతున్నావు. (22)
ప్రేషితశ్చ హృషీకేశః శమాకాంక్షీ కురూన్ ప్రతి।
కులస్య హితకామేన ధర్మరాజేన ధీమతా॥ 23
బుద్ధిమంతుడైన ధర్మరాజు శాంతికోరుతూ, కులానికి హితం చేకూర్చాలని శ్రీకృష్ణుని కురుసభకు కూడా పంపాడు. (23)
త్వం కాలచోదితో నూనం గంతుకామో యమక్షయమ్।
గచ్ఛస్వాహవమస్మాభిః తచ్చ శ్వో భవితా ధ్రువమ్॥ 24
కాని నీవు నిజంగానే కాలచోదితుడవై యమపురికి పోవాలనుకుంటున్నావు. మాతో యుద్ధానికిరా! అదికూడా రేపే జరుగుతుంది. తప్పకుండా! (24)
మయాఽపి చ ప్రతిజ్ఞాతః వధః సభ్రాతృకస్య తే।
స తథా భవితా పాప నాత్ర కార్యా విచారణా॥ 25
పాపీ! నేను నిన్నూ, నీ తమ్ముళ్లనూ చంపుతానని ప్రతిజ్ఞ చేశా. అది అలాగే జరుగుతుంది. ఇక దాన్ని గురించి ఆలోచనే లేదు. (25)
వేలామతిక్రమేత్ సద్యః సాగరో వరుణాలయః।
పర్వతాశ్చ విశీర్యేయుః మయోక్తం న మృషా భవేత్॥ 26
నేను చెప్పినది జరగకపోతే సముద్రం చెలియలికట్ట దాటినట్లే. పర్వతాలు బ్రద్దలవుతాయి. (26)
సహాయస్తే యది యమః కుబేరో రుద్ర ఏవ వా।
యథాప్రతిజ్ఞం దుర్బుద్ధే ప్రకరిష్యంతి పాండవాః॥
దుశ్శాసనస్య రుధిరం పాతా చాస్మి యథేప్సితమ్॥ 27
దుర్మతీ! నీకు సహాయంగా యముడు వచ్చినా, కుబేరుడు వచ్చినా, రుద్రుడే వచ్చినా సరే పాండవులు వారి ప్రతిజ్ఞలు నెరవేర్చుకుంటారు - అనుకున్నట్లు దుశ్శాసనుని రక్తం త్రాగుతాను కూడా. (27)
యశ్చేహ ప్రతిసంరబ్ధః క్షత్రియో మాఽభియాస్యతి।
అపి భీష్మం పురస్కృత్య తం నేష్యామి యమక్షయమ్॥ 28
అపుడు భీష్ముని ముందుంచుకొని అయినా ఏ క్షత్రియుడు వచ్చినా వాడిని యమలోకానికి పంపుతాను. (28)
యచ్చైతదుక్తం వచనం మయా క్షత్రస్య సంసది।
యథైతద్భవితా సత్యం తథైవాత్మానమాలభే॥ 29
ఈ రాజుల సమక్షంలో నేను చెప్పిన దంతా జరిగితీరుతుంది. నా మీద ఒట్టు. (29)
భీమసేనవచః శ్రుత్వా సహదేవోఽప్యమర్షణః।
క్రోధసంరక్తనయనః తతో వాక్యమువాచ హ॥ 30
భీముని మాటలు విని సహదేవునికి కోపంతో కనులు ఎర్రబడ్డాయి. అపుడు ఇలా అన్నాడు. (30)
శౌటీర శూరసదృశమ్ అనీకజనసంసది।
శృణు పాప వచో మహ్యం యద్వాచ్యో హి పితా త్వయా॥ 31
పాపీ! సేనాసముదాయమున్న ఈ సభల వీరోచితమయిన మాటలు చెపుతున్నాను. ఆ మాటలు నీవు నీతండ్రితో చెప్పు. (31)
వాస్మాకం భవితా భేదః కదాచిత్ కురుభిః సహ।
ధృతరాష్ట్రస్య సంబంధః యది న స్యాత్త్వయా సహ॥ 32
ధృతరాష్ట్రుడితో నీకు సంబంధం లేకపోతే మాకు కౌరవులతో ఎన్నడూ భేదం వచ్చేదే కాదు. (32)
త్వం తు లోకవినాశాయ ధృతరాష్ట్రకులస్య చ।
ఉత్పన్నో వైరపురుషః స్వకులఘ్నశ్చ పాపకృత్॥ 33
నీవు ధృతరాష్ట్రుని వంశానికీ, లోకానికీ వినాశం కోసం పుట్టిన వైరపురుషుడివి, పాపివి. నీకులాన్ని కూడా నాశనం చేసుకుంటున్నావు. (33)
జన్మప్రభృతి చాస్మాకం పితా తే పాపపూరుషః।
అహితాని నృశంసాని నిత్యశః కర్తుమిచ్ఛతి॥ 34
తస్య వైరానుషంగస్య గంతాస్మ్యంతం సుదుర్గమమ్।
అహమాదౌ నిహత్య త్వాం శకునేః సంప్రపశ్యతః॥ 35
తతోఽస్మి శకునిం హంతా మిషతాం సర్వధన్వినామ్।
ముందుగా నీతండ్రి చూస్తూ ఉండగా నిన్నూ, విలుకాండ్రందరూ చూస్తూ ఉండగా నీతండ్రినీ చంపి ఈవైరానుబంధానికి అంతం చూస్తాను. (35 1/2)
భీమస్య వచనం శ్రుత్వా సహదేవస్య చోభయోః॥ 36
ఉవాచ ఫాల్గునో వాక్యం భీమసేనం స్మయన్నివ।
భీమసేన స తే సంతి యేషాం వైరం త్వయా సహ॥ 37
మందా గృహేషు సుఖినో మృత్యుపాశవశం గతాః।
భీమ, సహదేవుల మాటలు విని అర్జునుడు భీమునితో నవ్వుతున్నట్లు ఇలా అన్నాడు - "భీమసేనా! నీతో వైరం పెట్టుకొన్నవాళ్లు ఇళ్లలో సుఖంగా కూర్చున్నా మృత్యువుకు వశమై చచ్చిపోతారు. వారిక లేనట్లే. (36-37 1/2)
ఉలూకశ్చ న తే వాచ్యః పరుషం పురుషోత్తమ॥ 38
దూతాః కిమపరాధ్యంతే యథోక్తస్యానుభాషిణః।
పురుషోత్తమా! ఈ ఉలూకుడితో కఠినంగా మాట్లాడకు - దూతలు ఏమి తప్పు చేస్తారు? వాళ్ళు చెప్పినట్లు చెపుతారు. అంతేకదా! (38 1/2)
ఏవముక్త్వా మహాబాహుః భీమం భీమపరాక్రమమ్॥ 39
ధృష్టద్యుమ్నముఖాన్ వీరాన్ సుహృదః సమభాషత।
ఆజానుబాహువయిన అర్జునుడు భీమునితో ఇలా అని ధృష్టద్యుమ్నాదులయిన వీర స్నేహితులతో ఇలా అన్నాడు. (39 1/2)
శ్రుతం వస్తస్య పాపస్య ధార్తరాష్ట్రస్య భాషితమ్॥ 40
కుత్సవం వాసుదేవస్య మమ చైవ విశేషతః।
శ్రుత్వా భవంతః సంరబ్ధాః అస్మాకం హితకామ్యయా॥ 41
పాపి అయిన దుర్యోధనుని మాటలు మీరు విన్నారుగా - ముఖ్యంగా నన్నూ కృష్ణునీ నిందించటం విని మీరంతా మాకు హితం చేయాలని సన్నద్ధులయ్యారు కదా! (40-41)
ప్రభావాద్వాసుదేవస్య భవతాం చ ప్రయత్నతః।
సమగ్రం పార్థివం క్షత్రం సర్వం న గణయామ్యహమ్॥ 42
కృష్ణుని ప్రభావం చేతనూ, మీ అందరి ప్రయత్నం చేతనూ నేను లోకంలోని రాజులెవరినీ కూడా లెక్కచెయ్యను. (42)
భవద్భిః సమనుజ్ఞాతః వాక్యమస్య యదుత్తరమ్।
ఉలూకే ప్రాపయిష్యామి యద్వక్ష్యతి సుయోధనమ్॥ 43
మీ అనుమతితో ఉలూకునికీ వాని ద్వారా సుయోధనునికీ చెప్పవలసిన సమాధానమూ చెపుతాను. (43)
శ్వోభూతే కత్థితస్యాస్య ప్రతివాక్యం చమూముఖే।
గాండీవేనాభిధాస్యామి క్లీబా హి వచనోత్తరాః॥ 44
వీడు పేలిన మాటలకు సమాధానం తెల్లవారేసరికి సేనాముఖంలో గాండీవంతో చెపుతాను - వట్టిమాటలు చెపితే నపుంసకులక్రింద లెక్క. (44)
తతస్తే పార్థివాస్సర్వే ప్రశశంసుర్థనంజయమ్।
తేన వాక్యోపచారేణ విస్మితా రాజసత్తమా॥ 43
రాజులంతా ఆ మాటలతీరు విని అర్జునుని ప్రశంసించారు. అంతేకాదు ఆ సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. (45)
అనునీయ చ తాన్ సర్వాన్ యథామాన్యం యథావయః।
ధర్మరాజః తదా వాక్యం తత్ప్రాప్యం ప్రత్యభాషత॥ 46
తరువాత ధర్మరాజు వారినందరినీ వారివారి గౌరవాలకూ, వయసులకూ తగినట్లు శాంతపరచి దుర్యోధనుని కివ్వదగిన సందేశం ఇలా చెప్పాడు. (46)
ఆత్మానమవమన్వానః న హి స్యాత్ పార్థివోత్తమః।
తత్రోత్తరం ప్రవక్ష్యామి తవ శుశ్రూషణే రతః॥ 47
రాజు తనను తాను తక్కువ చేసుకోకూడదు. అందుచేత నీ సత్కారంలో మనసుంచి సమాధానం చెపుతున్నాను. (47)
ఉలూకం భరతశ్రేష్ఠ సామపూర్వమథోర్జితమ్।
దుర్యోధనస్య తద్వాక్యం నిశమ్య భరతర్షభః॥ 48
అతిలోహితనేత్రాభ్యామ్ ఆశీవిష ఇవ శ్వసన్।
స్మయమాన ఇవ క్రోధాత్ సృక్విణీ పరిసంలిహన్॥ 49
జనార్దనమభిప్రేక్ష్య భ్రాతౄంశ్చైవేదమబ్రవీత్।
అభ్యభాషత కైతవ్యం ప్రగృహ్య విపులం భూజమ్॥ 50
ధృతరాష్ట్రమహారాజా! ధర్మరాజు ఉలూకుని మొదట ఇలా మృదువుగా పలికి తరువాత తీవ్రంగా ప్రారంభించాడు. దుర్యోధనుని మాటలు వినేసరికి ధర్మరాజు కనులు ఎర్రబడ్డాయి. నాగుపాములా బుసలుకొడుతూ క్రోధంతో పెదవులు నాకి కొరుకుతూ కృష్ణునీ, తమ్ములనూ చూస్తూ చేతి నెత్తి ఉలూకునితో ఇలా అన్నాడు. (48, 49, 50)
ఉలూక గచ్ఛ కైతవ్య బ్రూహి తాత సుయోధనమ్।
కృతఘ్నం వైరపురుషం దుర్మతిం కులపాంసనమ్॥ 51
ఉలూకా! వెళ్ళు - వెళ్లి కృతఘ్నుడూ, వైరపురుషుడూ, దుర్మతీ, కులనాశకుడూ అయిన దుర్యోధనునితో చెప్పు. (51)
పాండవేషు సదా పాపః నిత్యం జిహ్మం ప్రవర్తతే।
స్వవీర్యాద్యః పరాక్రమ్య పాప ఆహ్వాయతే పరాన్।
అభీతః పూరయన్ వాక్యమ్ ఏష వై క్షత్రియః పుమాన్॥ 52
ఆ పాపి ఎల్లప్పుడూ పాండవులతో కుటిలంగానే ప్రవర్తిస్తాడు. తన శౌర్యంతో విక్రమించి శత్రువులను ఆహ్వానించేవాడు నిర్భయంగా మాట నిలుపుకుంటాడు. వాడే క్షత్రియపురుషుడు. (52)
స పాపః క్షత్రియో భూత్వా అస్మానాహూయ సంయుగే।
మాన్యామాన్యాన్ పురస్కృత్య యుద్ధం మా గాః కులాధమ॥ 53
కులాధమా! క్షత్రియుడవై పాపివయిన నీవు మమ్మల్నీ యుద్ధానికి ఆహ్వానిస్తూ మాన్యులను, అమాన్యులనూ ముందుంచుకొని యుద్ధానికి రాకు! (53)
ఆత్మవీర్యం సమాశ్రిత్య భృత్యవీర్యం చ కౌరవ।
ఆహ్వయస్వ రణే పార్థాన్ సర్వథా క్షత్రియో భవ॥ 54
నీ పరాక్రమాన్ని ఆధారం చేసుకొని, సేవకుల పరాక్రమం కూడా ఆధారం చేసుకొని పాండవులను యుద్ధానికి ఆహ్వానించు. సర్వథా క్షత్రియుడవగుము! (54)
పరవీర్యం సమాశ్రిత్య యః సమాహ్వయతే పరాన్।
అశక్తః స్వయమాదాతుమ్ ఏతదేవ నపుంసకమ్॥ 55
ఇతరుల పరాక్రమాన్ని ఆశ్రయించుకొని శత్రువులను యుద్ధానికి పిలిచేవాడు స్వయంగా శత్రువులను లొంగదీసుకోలేడు, నపుంసకత్వం అంటే అదే! (55)
స త్వం పరేషాం వీర్యేణ ఆత్మానం బహుమన్యసే।
కథమేవమశక్తస్త్వమ్ అస్మాన్ సమభిగర్జసి॥ 56
అటువంటి నీవు పరుల పరాక్రమంతో నిన్ను గొప్పగా భావించుకుంటున్నావు. అశక్తుడవైన నీవు మామీద ఎలా గర్జిస్తావు? విరుచుకుపడతావు? (56)
కృష్ణ ఉవాచ
మద్వచశ్చాపి భూయస్తే వక్తవ్యః స సుయోధనః।
శ్వ ఇదానీం ప్రపద్యేథాః పురుషో భవ దుర్మతే॥ 57
కృష్ణుడు ఇట్లన్నాడు. - "నామాట కూడా మళ్లీ ఆ దుర్యోధనునికి చెప్పు. రేపే యుద్ధానికి రా! దుర్మతీ! పురుషుడవై ప్రవర్తించు." (57)
మన్యసే యచ్చ మూఢ త్వం న యోత్స్యతి జనార్దనః।
సారథ్యేన వృతః పార్థైః ఇతి త్వం న బిభేషి చ॥ 58
మూఢా! కృష్ణుడు యుద్ధం చేయడు. పాండవులు అతడిని సారథ్యం చెయ్యమన్నారు. అంతే. అని నీవు భయపడకుండా ఉన్నావు. (58)
జఘన్యకాలమప్యేతత్ న భవేత్ సర్వపార్థివాన్।
నిర్దహేయమహం క్రోధాత్ తృణానీవ హుతాశనః॥ 59
ఇది పిదపకాలమే కాకపోతే గడ్డిపరకల్ని అగ్నిహోత్రుడు దహించివేసినట్లు నేను ఈ రాజులనందరినీ క్రోధంతో భస్మంచేసి పారేస్తాను. (59)
యుధిష్ఠిరనియోగాత్తు ఫాల్గునస్య మహాత్మనః।
కరిష్యే యుధ్యమానస్య సారథ్యం విజితాత్మనః॥ 60
ధర్మరాజు యొక్క ఆజ్ఞ వలననే యుద్ధం చేసే మహాత్ముడు అర్జునుడికి సారథ్యం చేస్తున్నానంతే. (60)
యద్యుత్పతసి లోకాంస్త్రీన్ యద్యావిశసి భూతలమ్।
తత్ర తత్రార్జునరథం ప్రభాతే ద్రక్ష్యసే పునః॥ 61
నీవు ముల్లోకాలకూ ఎగిరిపోయినా, భూమిలోకి దూరిపోయినా సరే తెల్లవారేసరికి నీ ఎదుటనే అర్జునుని రథాన్ని చూసి తీరుతావు. (61)
యచ్చాపి భీమసేనస్య మన్యసే మోఘభాషితమ్।
దుశ్శాసనస్య రుధిరం పీతమద్యావధారయ॥ 62
దుశ్శాసనుని రక్తం త్రాగుతానని భీముడన్న మాట జరుగదనుకొంటున్నావు కాని - ఇప్పటికే ఆపని జరిగిపోయిందనుకో. (62)
న త్వాం సమీక్షతే పార్థః నాపి రాజా యుధిష్ఠిరః।
న భీమసేనో న యమౌ ప్రతికూలప్రభాషిణమ్॥ 63
ఇలా ప్రతికూలంగా మాట్లాడే నిన్ను అర్జునుడు కాని, ధర్మరాజుకాని, భీముడుకాని, కపలు కాని లెక్కచేయటం లేదు. (63)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణీ ఉలూకదూతాగమన పర్వణి కృష్ణాది వాక్యే ద్విషష్ట్యధిక శతతమోఽధ్యాయః ॥ 162 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున ఉలూకదూతాగమన పర్వమను ఉపపర్వమున
కృష్ణాదుల వాక్యమను నూట అరువది రెండవ ఆధ్యాయము. (162)