153. నూట ఏబది మూడవ అధ్యాయము
కౌరవసేన యుద్ధయాత్రకు వెడలుట.
జనమేజయ ఉవాచ
యుధిష్ఠిరం సహానీకమ్ ఉపాయాంతం యుయుత్సయా।
సంనివిష్టం కురుక్షేత్రే వాసుదేవేన పాలితమ్॥ 1
విరాటద్రుపదాభ్యాం చ సపుత్రాభ్యాం సమన్వితమ్।
కేకయై ర్వృష్ణిశ్చైవ పార్థివైః శతశో వృతమ్॥ 2
మహేంద్రమివ చాదిత్యైః అభిగుప్తం మహారథైః।
శ్రుత్వా దుర్యోధనో రాజా కిం కార్యం ప్రత్యపద్యత॥ 3
జనమేజయుడు ఇలా అడుగుతున్నాడు. మహర్షీ! ధర్మనందనుడు యుద్ధం చేయుటానికి కృష్ణరక్షితమైన సేనతో కురుక్షేత్రానికి వచ్చి అక్కడ తనసైన్యాలను నిలిపాడనీ తన కుమారులతో విరాటుడు, కేకయ రాజకుమారులు, వృష్ణివంశ వీరులు, మిగిలిన వందలకొలదీ వీరులు మహారథులు దేవరాజైన ఇంద్రునివలె రక్షిస్తూ ఉన్నారని తెలిసిన దుర్యోధనుడు ఏమి చేశాడు? (1-3)
ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం విస్తరేణ మహామతే।
సంభ్రమే తుములే తస్మిన్ యదాసీత్ కురుజాంగలే॥ 4
ఆ కురుక్షేత్రసమారోహంలో ఏమి జరిగిందో దానిని సవిస్తరంగా వినాలని కోరుతున్నాను. (4)
ఆ కురుక్షేత్రసమారోహంలో ఏమి జరిగిందో దానిని సవిస్తరంగా వినాలని కోరుతున్నాను. (4)
వ్యథయేయురిమే దేవాన్ సేంద్రానపి సమాగమే।
పాండవా వాసుదేవశ్చ విరాటద్రుపదౌ తథా॥ 5
ధృష్టద్యుమ్నశ్చ పాంచాల్యః శిఖండీ చ మహారథః।
యుధామన్యుశ్చ విక్రాంతః దేవైరపి దురాసదః॥ 6
ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం విస్తరేణ తపోధన।
కురూణాం పాండవానాం చ యద్ యదాసీత్ విచేష్టితుమ్॥ 7
తపోధనా! పాండవులు, శ్రీకృష్ణుడు, విరాటుడు, ద్రుపదుడు, పాంచాల రాజకుమారుడు ధృష్టద్యుమ్నుడు, మహారథి శిఖండి, దేవతలకు కూడా జయించుటకు వీలుగాని మహాపరాక్రమశాలి యుధామన్యువు, వీరందరు మహాసంగ్రామంలో ఒకచోట చేరి కురుపాండవులు ఏమేమి ఆచరించారో దానినంతా విస్తారంగా వినవలెనని కోరుతున్నాను. (5,6,7)
వైశంపాయన ఉవాచ
ప్రతియాతే తు దాశార్హే రాజా దుర్యోధనస్తదా।
కర్ణం దుశ్శాసనం చైవ శకునిం చాబ్రవీదిదమ్॥ 8
వైశంపాయనుడిట్లన్నాడు. రాజా! శ్రీకృష్ణుడు తిరిగి వెళ్లాక దుర్యోధనుడు కర్ణునితోనూ, దుశ్శాసనునితోనూ, శకునితోనూ ఇలా అన్నాడు. (8)
అకృతేనైవ కార్యేణ గతః పార్థానధోక్షజః।
స ఏనాన్మన్యునావిష్టః ధ్రువం ధక్ష్యత్యసంశయమ్॥ 9
శ్రీకృష్ణుడు ఇక్కడ నుండి కార్యవైఫల్యంతో నిష్క్రమించాడు. కాబట్టి అతడు క్రోధపూరితుడై పాండవులందరిని నిశ్చయంగా యుద్ధానికి పురికొల్పక మానడు. (9)
ఇష్టో హి వాసుదేవస్య పాండవైర్మమ విగ్రహః।
భీమసేనార్జునౌ చైవ దాశార్హస్య మతే స్థితౌ॥ 10
నిజానికి పాండవులకు, నాకు యుద్ధం జరగాలనే శ్రీకృష్ణునికి ఇష్టం. భీమార్జును లిరువురూ శ్రీకృష్ణుని అభిప్రాయంతో ఏకీభవించే వారే! (10)
అజాతశత్రురత్యర్థం భీమసేనవశానుగః।
నికృతశ్చ మయా పూర్వం సహ సర్వైః సహోదరైః॥ 11
అజాతశత్రువైన ధర్మరాజు కూడా భీమసేనుని వశమయి ప్రవర్తిస్తాడు. నేను పూర్వం సోదరులందరితో కూడిన అతనిని అవమానించాను. (11)
విరాటద్రుపదౌ చైవ కృతవైరౌ మయా సహ।
తౌ చ సేనాప్రణేతారౌ వాసుదేవవశానుగౌ॥ 12
విరాటరాజు, ద్రుపదుడు నాతో పూర్వవైరం కలవారు. వారిద్దరూ వాసుదేవుని ఆజ్ఞప్రకారం పాండవ సేనాపతులుగ వ్యవహరిస్తున్నారు. (12)
భవితా విగ్రహః సోఽయం తుములో రోమహర్షణః।
తస్మాత్ సాంగ్రామికం సర్వం కారయధ్వమతంద్రితాః॥ 13
కాబట్టి మనకు పాండవులతో జరుగబోయే యుద్ధం మహా భయంకరంగా గగుర్పాటు కలిగిస్తుంది. కాబట్టి రాజులారా! మీరందరూ ఏ మాత్రమూ ఏమరుపాటులేక యుద్ధానికి సంసిద్ధం కావలసినది. (13)
శిబిరాణి కురుక్షేత్రే క్రియంతాం వసుధాధిపాః।
సుపర్యాప్తావకాశాని దురాదేయాని శత్రుభిః॥ 14
ఆసన్నజలకాష్ఠాని శతశోఽథ సహస్రశః।
అచ్ఛేద్యాహారమార్గాణి బంధోచ్ఛ్రయచితాని చ॥ 15
సమీపంలో సమృద్ధిగా నీరు, కట్టెలు, ఉండేటట్లుగా శత్రువులకు పాడుచేయ శక్యం కాని మార్గాలు, చక్కని కూర్పుగల శిబిరాలు వందలూ, వేలూ ఏర్పరచండి. (15)
వివిధాయుధపూర్ణాని పతాకాధ్వజవంతి చ।
సమాశ్చ తేషాం పంథానః క్రియంతాం నగరాత్ బహిః॥ 16
ఆ శిబిరాలను నానావిధ ఆయుధాలతో నింపండి. అవి ధ్వజ పతాకాలతో శోభిల్లుగాక! నగరం నుండి వాటి మార్గాలు సమతలములై శిబిరాలలోనికి ప్రవేశించుటకు వీలుగా ఏర్పరచండి. (16)
ప్రయాణం ఘుష్యతామద్య శ్వోభూత ఇతి మా చిరమ్।
తే తథేతి ప్రతిజ్ఞాయ శ్వోభూతే చక్రిరే తథా॥ 17
హృష్టరూపా మహాత్మానః నివాసాయ మహీక్షితామ్।
ఈ రోజే యుద్ధభేరి మ్రోగించి రేపటి ఉదయమే యుద్ధానికి ప్రయాణం సిద్ధంచేయండి. అశ్రద్ధ ఆలస్యం చేయకండి. ఈ ఘోషణను విన్న కర్ణాదివీరులు "చాలామంచిది, ఇదియే జరుగుగాక" అని ప్రతిజ్ఞ చేసి ప్రసన్నులై తెల్లవారుతూ ఉండగనే ఆ రాజుల వసతులకై శిబిరనిర్మాణాలు ఆరంభించారు. (17 1/2)
తతస్తే పార్థివాః సర్వే తచ్ఛ్రుత్వా రాజసాసనమ్॥ 18
ఆసనేభ్యో మహార్హేభ్యః ఉదతిష్ఠన్నమర్షితాః।
బాహూన్ పరిఘసంకాశాన్ సంస్పృశంతః శనైః శనైః॥ 19
కాంచనాంగదదీప్తాంశ్చ చందనాగురుభూషితాన్।
అక్కడకు వచ్చిన రాజులు రాజశాసనాన్ని విని ఆవేశపూర్ణులై చందనాగురు సుగంధ ద్రవ్యాలు పూసుకున్న గడియలవంటి భుజాలతో బంగారు భుజకీర్తులతో ప్రకాశించే భుజాలను చరుచుకొంటూ తమ తమ ఆసనాలనుండి లేచి నిలబడ్డారు. (18-19 1/2)
ఉష్ణీషాణి నియచ్ఛంతః పుండరీకనిభైః కరైః।
అంతరీయోత్తరీయాణి భూషణాని చ సర్వశః॥ 20
ఆ వీరులు తమ కరకమలాలతో శిరస్సులపై తలపాగాలను, ధోవతులను, ఉత్తరీయాలను, ఆభరణాలను ధరించారు. (20)
తే రథాన్ రథినః శ్రేష్ఠాః హయాంశ్వ హయకోవిదాః।
సజ్జయంతి స్మ నాగాంశ్చ నాగశిక్షాస్వనుష్ఠితాః॥ 21
శ్రేష్ఠులైన రథికులు తమరథాలను, అశ్వసంచాలకులు అశ్వాలను, గజరక్షణ విద్యలో నిపుణులైన సైనికులు ఏనుగులను సిద్ధంచేశారు. (21)
అథ వర్మాణి చిత్రాణి కాంచనాని బహూని చ।
వివిధాని చ శస్త్రాణి చక్రుః సర్వాణి సర్వశః॥ 22
పదాతయశ్చ పురుషాః శస్త్రాణి వివిధాని చ।
ఉపాజహ్రుః శరీరేషు హేమచిత్రాణ్యనేకశః॥ 23
పదాతిదళయోధులు తమ శరీరానికి బంగారు కవచాలను, అనేక శస్త్రాలను ధరించ సాగారు. (23)
తదుత్సవ ఇవోదగ్రం సంప్రహృష్టనరావృతమ్।
నగరం ధార్తరాష్ట్రస్య భారతాసీత్ సమాకులమ్॥ 24
జనమేజయా! దుర్యోధనుని హస్తినాపురంలో ఏదో పెద్ద ఉత్సవం జరుగుతున్నట్లు ఉంది. కోలాహలంగా ఉరకలు వేసే ఉత్సాహంగల మనుజులతో నిండిన ఆ నగరమంతా హడావిడిగా ఉంది. (24)
జనౌఘసలిలావర్తః రథనాగాశ్చమీనవాన్।
శంఖదుందుభినిర్ఘోషః కోశసంచయరత్నవాన్॥ 25
చిత్రాభరణవర్మోర్మిః శస్త్రనిర్మలఫేనవాన్।
ప్రాసాదమాలాద్రివృతః రథ్యాపణమహాహ్రదః॥ 26
యోధచంద్రోదయోద్భూతః కురురాజమహార్ణవః।
వ్యదృశ్యత తదా రాజన్ చంద్రొదయ ఇవోదధిః॥ 27
రాజా! చంద్రోదయంతో సముద్రం ఎలా తన కెరటాలతో ఎగసెగసి పడుతుందో అలాగే యోధులతో కురురాజైన దుర్యోధన రూపమహాసముద్రం ఉప్పొంగసాగింది. అంతటా సంచరించే జననసమూహం నీటి సుడులవలె ఉంది. రథాలు - ఏనుగులు, గుఱ్ఱాలు ఆ నీటిలో సంచరించే చేపల్లాగా కనిపించాయి. శంఖదుందుభి ధ్వనులు సముద్ర ఘోషలు, దుర్యోధనుని కోశాగారం రత్నరాశులు, యోధులు ధరించిన విచిత్ర ఆభరణాలు కవచాలు తరంగాలు, శస్త్రాలు సముద్రం లోని నురుగులు, రాజప్రాసాద పంక్తులే పర్వతాలు వీధులలో ఉండే దుకాణాలు మడుగులవలె ఉన్నాయి. (25,26,27)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సైన్యవిర్యాణపర్వణి దుర్యోధన సైన్య సజ్జీకరణే త్రిపంచాశధధిక శతతమోఽధ్యాయః॥ 153 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సైన్యనిర్యాణపర్వమను ఉపపర్వమున దుర్యోధనసైన్యము సిద్ధమగుట అను నూట ఏబది మూడవ అధ్యాయము. (153)