154. నూట ఏబదినాల్గవ అధ్యాయము

కృష్ణుడు చెప్పిన కర్తవ్యము - అర్జునుని సమర్థన.

వైశంపాయన ఉవాచ
వాసుదేవస్య తద్వాక్యమ్ అనుస్మృత్య యుధిష్ఠిరః।
పునః పప్రచ్ఛ వార్ష్ణేయం కథం మందోఽబ్రవీదిదమ్॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు. శ్రీ కృష్ణుని మాటలు విని ధర్మరాజు శ్రీ కృష్ణునితో వాసుదేవా! బుద్ధిహీనుడైన ఆ దుర్యోధనుడు ఎందుకు(ఎలా) ఈ మాటలు పలికాడు? అని అడిగాడు. (1)
అస్మిన్నభ్యాగతే కాలే కించ నః క్షమమచ్యుత।
కథం చ వర్తమానా వై స్వధర్మాన్న చ్యవేమహి॥ 2
అచ్యుతా! ఈ పరిస్థితుల్లో మాకు ఏది ఉచితము? మేము ఏవిధంగా మసలుకోవాలి? ఎలా ప్రవరిస్తే మేము స్వధర్మంనుండి దిగజారకుండా ఉండగలం? (2)
దుర్యోధనన్య కర్ణస్య శకునేః సౌబలస్య చ।
వాసుదేవ మతజ్ఞోఽసి మమ సౌభ్రాతృకస్య చ॥ 3
వసుదేవనందనా! దుర్యోధన - కర్ణ - శకునుల గూర్చి సోదరులతో కూడిన నా అభిప్రాయముల గూర్చి నీవు తెలిసినవాడవు. (3)
విదురస్యాపి తద్వాక్యం శ్రుతం భీష్మస్య చోభయోః।
కుంత్యాశ్చ విపులప్రజ్ఞా! ప్రజ్ఞా కార్త్స్న్యేన తే శ్రుతా॥ 4
విదురుని వాక్యాలను భీష్ముని మాటలను నీవు విన్నావు. మహాబుద్ధిశాలీ! కుంతీమాత అభిప్రాయాలను కూడా నీవు సంపూర్ణంగా ఆలకించావు. (4)
సర్వమేతదతిక్రమ్య విచార్య చ పునః పునః।
క్షమం యన్నో మహోబాహో తత్ బ్రవీహ్యవిచారయన్॥ 5
మహాబాహూ! వీరందరి మాటలు అభిప్రాయాలు ప్రక్కగాఉంచి ఈ విషయంలో నీవే మళ్లీ మళ్లీ ఆలోచించి మాకు ఏది తగినదో దానిని నిస్సంకోచంగా చెప్పు. (5)
శ్రుత్వైతత్ ధర్మరాజస్య ధర్మార్థసహితం వచః।
మేఘదుందుభినిర్ఘోషః కృష్ణో వాక్యమథాబ్రవీత్॥ 6
ధర్మార్థాలతో కూడిన ధర్మనందనుని మాటలను ఆలకించిన శ్రీకృష్ణుడు మేఘదుందుభులతో సమానమైన స్వరంతో ఈ విధంగా పలుకసాగాడు. (6)
కృష్ణ ఉవాచ
ఉక్తవానస్మి యద్వాక్యం ధర్మార్థసహితం హితమ్।
న తు తన్నికృతిప్రజ్ఞే కౌరవ్యే ప్రతితిష్ఠతి॥ 7
శ్రీ కృష్ణుడు చెపుతున్నాడు. ధర్మార్థసహితా లయిన ఆమాటలు, కపటాలతో(లో) ఆరితేరిన ఆ దుర్యోధనుని మనస్సులో నాటుకొనలేదు. (7)
న చ భీష్మస్య దుర్మేధాః శృణోతి విదురస్య వా।
మమ వా భాషితం కించిత్ సర్వమేవాతివర్తతే॥ 8
దుర్మతి అయిన దుర్యోధనుడు భీష్ముని మాటలనుగాని, విదురుని మాటలను గాని, నా మాటలను గాని ఆలకించటంలేదు. వాడు ఎవ్వరి మాటలను లెక్కపెట్టలేదు. (8)
నైష కామయతే ధర్మం నైష కామయతే యశః।
జితం స మన్యతే సర్వం దురాత్మా కర్ణమాశ్రితః॥ 9
దురాత్ముడైన దుర్యోధనుడు కర్ణుని అండగా భావించి అన్నిటిని జయించినట్లు భావిస్తున్నాడు. అందువల్ల అతడు ధర్మాన్ని కాని, కీర్తిని కాని కోరటం లేదు. (9)
బంధమాజ్ఞాపయామాస మమ చాపి సుయోధనః।
న చ తం లబ్ధవాన్ కామం దురాత్మా పాపనిశ్చయః॥ 10
పాపనిశ్చయుడూ, దురాత్ముడూ అయిన ఆ దుర్యోధనుడు నన్ను బంధించటానికి ఆజ్ఞాపించాడు. కాని వాడు తన కోరికను తీర్చుకొనలేకపోయాడు. (10)
న చ భీష్మో న చ ద్రోణః యుక్తం తత్రాహతుర్వచ।
సర్వే తమనువర్తంతే ఋతే విదురమచ్యుత॥ 11
నాశరహితుడా! అక్కడ వాని కొలువులో భీష్ముడు గాని ద్రోణుడు గాని ఏమీ పలుక లేదు. ఆ సభలో విదురుడు తప్ప మిగిలిన వారందరూ దుర్యోధనునే అనుసరిస్తున్నారు. (11)
శకునిః సౌబలశ్పైవ కర్ణదుశ్శాసనావపి।
త్వయ్యయుక్తాన్యభాషంత మూఢాః మూఢమమర్షణమ్॥ 12
శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు ఈ ముగ్గురు మూర్ఖులు. మూఢుడు, అసూయాపరుడూ అయిన దుర్యోధనుని చెంతజేరి నీ విషయంలో అనుచితంగా ఎన్నో అన్నారు. (12)
కిం చ తేన మయోక్తేన యాన్యభాషత కౌరవః।
సంక్షేపేణ దురాత్మాఽసౌ న యుక్తం త్వయి వర్తతే॥ 13
ఆ సభలో వారు పలికిన మాటలను మరల నేను ఇక్కడ చెప్పి లాభమేమిటి? ఒక చిన్నమాటలో గ్రహించు. ఆ దుష్టుడు మీ విషయంలో తగినట్లు వ్యవహరించలేదు. (13)
పార్థినేషు న సర్వేషు య ఇమే తవ సైనికాః।
యత్సాపం యన్న కల్యాణం సర్వం తస్మిన్ ప్రతిష్ఠితమ్॥ 14
నీ పక్షాన యుద్ధం చెయ్యాలని వచ్చిన రాజు లెవరిలోనూ లేని పాపబుద్ధి, అశుభప్రవర్తన అంతా ఆ దుర్యోధనునిలో ఉన్నాయి. (14)
నా చాపి వయమత్యర్థం పరిత్యాగేన కర్హిచిత్।
కౌరవైః శమమిచ్ఛామః తత్ర యుద్ధమనంతరమ్॥ 15
మనం సర్వస్వాన్ని త్యాగం చేసుకొని ఎన్నటికీ ఏదశలో గానీ కౌరవులతో సంధిచేసుకోవాలని కోరుకోలేము. కాబట్టి ఇకపై యుద్ధమే తగినది. (15)
వైశంపాయన ఉవాచ
తచ్ఛ్రుత్వా పార్థివా స్సర్వే వాసుదేవస్య భాషితమ్।
అబ్రువంతో ముఖం రాజ్ఞః సముదైక్షత భారత॥ 16
వైశంపాయనుడిట్లన్నాడు. భరతనందనా! శ్రీ కృష్ణుడు పలికిన ఈ మాటలను విన్న రాజులందరూ మారుమాటాడక ధర్మరాజు ముఖం వంక తదేకంగా చూశారు. (16)
యుధిష్ఠిరస్త్వభిప్రాయమ్ అభిలక్ష్య మహీక్షితామ్।
యోగమాజ్ఞాపయామాస భీమార్జునయమైస్సహ॥ 17
ధర్మరాజు రాజుల అభిప్రాయాలను తెలుసుకొని భీమార్జున నకుల సహదేవులతో కూడి వారందరిని యుద్ధానికి సిద్ధపడవలసినదిగా ఆదేశించారు. (17)
వి॥సం॥ 'యోగం' యుద్ధోద్యోగం, యోగ మనగా యుద్ధోద్యోగం యుద్ధయత్నం. (నీల)
తతః కిలకిలాభూతమ్ అనీకం పాండవస్య హ।
ఆజ్ఞాపితే తదా యోగే సమహృష్యంత సైనికాః॥ 18
ఆసమయంలో యుద్ధానికి సిద్ధపడవలసినది అనే ఆజ్ఞ సమస్త వీరులలో హర్షాన్ని కలిగించినది. పాండవుల సైనికులందరూ కిలకిలలాడారు. (18)
అవధ్యానాం వధం పశ్యన్ ధర్మరాజో యుధిష్ఠిరః।
నిః శ్వసన్ భీమసేనం చ విజయం చేదమబ్రవీత్॥ 19
ధర్మనందనుడైన ఆ యుధిష్ఠిరుడు, సైనికుల హర్షధ్వానాలను విని యుద్ధం ప్రారంభిస్తే చంపగూడని వారిని గూడా చంపవలసి వస్తుందనే బాధతో దీర్ఘంగా నిట్టూర్చి భీమార్జునులతో ఇలా అన్నాడు. (19)
యదర్థం వనవాసశ్చ ప్రాప్తం దుఃఖం చ యన్మయా।
సోఽయమస్మానుపైత్యేన పరోఽనర్థః ప్రయత్నతః॥ 20
దేనిని తప్పించాలని వనవాస కష్టాన్ని స్వీకరించి నానా విధాలైన దుఃఖాలను సహించానో ఆ అనర్థం నా ప్రయత్నం వల్ల ఆగటం, లేదు. అది మనపై వచ్చిపడుతోంది. (20)
తస్మిన్ యత్నః కృతోఽస్మాభిః స నో హీనః ప్రయత్నతః।
అకృతే తు ప్రయత్నేఽస్మాన్ ఉపావృత్తః కలిర్మహాన్॥ 21
మనం భయంకటయుద్ధాన్ని ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా యుద్ధాన్ని నివారించలేకపోయాం. అయితే ఏమాత్రం ప్రయత్నం చేయకున్నా ఆ మహాకలి కలహం తనంత తానుగా వచ్చి మీదపడింది. (21)
కథం హ్యనధ్యైః సంగ్రామః కార్యః సహ భవిష్యతి।
కథం హత్వా గురూన్ వృద్ధాన్ విజయో నో భవిష్యతి॥ 22
వధార్హులు కాని వారితో యుద్ధం చేయటం ఎలా ఉచితమౌతుంది? వృద్ధులను గురుజనులను వధించి మనం ఎలా విజయాన్ని సాధించిన వారమౌతాము? (22)
తచ్ఛ్రుత్వా ధర్మరాజస్య సవ్యసాచీ పరంతపః।
యదుక్తం వాసుదేవేన శ్రావయామాస తద్వచః॥ 23
ధర్మరాజు మాటలను విని శత్రువులను తపింపజేసే అర్జునుడు శ్రీకృష్ణుని మాటలను వినిపించసాగాడు. (23)
ఉక్తవాన్ దేవకీపుత్రః కుంత్యాశ్చ విదురస్య చ।
వచనం తత్ త్వయా రాజన్ నిఖిలేనావధారితమ్॥ 24
రాజా! దేవకీనందనుడు శ్రీకృష్ణుడు కుంతీ మాతతో విదురునితో పలికిన మాటలను మీరు పూర్తిగా విని ఉంటారు. (24)
న చ తౌ వక్ష్యతో ఽ ధర్మమ్ ఇతి మే నైష్ఠికీ మతిః।
నాసి యుక్తం చ కౌంతేయ వివర్తితుమయుధ్యతః॥ 25
ధర్మనందనా! నా నిర్ణయం ప్రకారం వారిద్దరూ అధర్మవచనాలను పలుకరు. కాబట్టి మనం యుద్ధం నుండి విరమించడం యుక్తం కాదు. (25)
తచ్ఛ్రుత్వా వాసుదేవోఽపి సవ్యసాచివచస్తదా।
స్మయమానోఽబ్రవీద్వాక్యం పార్థమేవమితి బ్రువన్॥ 26
అర్జునుని మాటలను విని శ్రీకృష్ణుడు ధర్మరాజు వంక ఆశ్చర్యంగా చూసి "అవును అర్జునుడు చక్కగా చెప్పాడు" అన్నాడు. (26)
తతస్తే ధృతసంకల్పాః యుద్ధాయ సహసైనికాః।
పాండవేయా మహారాజ! తాం రాత్రిం సుఖమావసన్॥ 27
జనమేజయ మహారాజా! అనంతరం సైనికులందరితో కలిసి పాండవులు యుద్ధం చేయడానికి నిశ్చయించుకొని ఆ రాత్రి అక్కడ సుఖంగా నివసించారు. (27)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణీ సైన్యనిర్యాణపర్వణి యుధిష్ఠిరార్జున సంవాదే చతుష్పంచాశదధిక శతతమోఽధ్యాయః ॥ 154 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున సైన్యనిర్యాణ పర్వమను ఉపపర్వమున
యుధిష్ఠిర అర్జున సంవాద మను నూట ఏబదినాల్గవ ఆధ్యాయము. (154)