152. నూట ఏబది రెండవ అధ్యాయము
కురుక్షేత్రములో పాండవసేనలు - శిబిరనిర్మాణములు.
వైశంపాయన ఉవాచ
తతో దేశే సమే స్నిగ్ధే ప్రభూథయవసేంధనే।
నివేశయామాస తదా సేనాం రాజా యుధిష్ఠిరః॥ 1
వైశంపాయనుడిట్లు అన్నాడు. జనమేజయా! పిమ్మట ధర్మరాజు తనసైన్య మంతటినీ సమతలంగా ఉండి దట్టంగా ఏపుగా గడ్డి ఇంధనాలు పెరిగి ఉన్న ప్రదేశంలో నిలిపాడు. (1)
పరిహృత్య శ్మశానాని దేవతాయతనాని చ।
ఆశ్రమాంశ్చ మహర్షీణాం తీర్థాన్యాయతనాని చ॥ 2
మధురానూషరే దేశే శుచౌ పుణ్యే మహామతిః।
నివేశం కారయామాస కుంతీపుత్రో యుధిష్ఠిరః॥ 3
శ్మశానాలను, దేవమందిరాలను, మహర్షుల పుణ్యాశ్రమాలను, తీర్థములను, సిద్ధక్షేత్రాలను వదిలిపెట్టి దూరంగా, సుక్షేత్రంగా మనోహరంగా, శుచిగా పవిత్రంగా ఉండే భూమిని ఎంచుకొని కుంతీకుమారుడైన ఆ యుధిష్ఠిరుడు తనసైన్యాన్ని నిలిపాడు. (2,3)
తతశ్చ పునరుత్థాయ సుఖీ విశ్రాంతవాహనః।
ప్రయయౌ పృథివీపాలైః వృతః శతసహస్రశః॥ 4
విద్రావ్య శతశో గుల్మాన్ ధార్తరాష్ట్రస్య సైనికాన్।
పర్యక్రామత్ సమంతాచ్చ పార్థేన సహ కేశవః॥ 5
వాహనాలన్నిటికీ విశ్రాంతి నిచ్చి తానుకూడా విస్రాంతిసుఖం పొంది శ్రీ కృష్ణభగవానుడు లేచి భూపాలురతో కుంతీసుతుడైన అర్జునునితో కలిసి ముందుకు నడువసాగాడు. వారందరూ చుట్టూరాఉన్న దుర్యోధనసైనుకులకు దూరంగా వెళ్లి అక్కడ ఎన్నో విధాల ఆలోచించారు. (4-5)
శిబిరం మాపయామాస ధృష్టద్యుమ్నశ్చ పార్షతః।
సాత్యకిశ్చ రథోదారః యుయుధానః ప్రతాపవాన్॥ 6
ధృష్టద్యుమ్నుడు, ద్రుపదుడు, ప్రతాపవంతుడూ ఉదారరథికుడూ అయినసాత్యకి శిబిరాన్ని వేయించారు. (6)
ఆసాద్య సరితం పుణ్యాం కురుక్షేత్రే హిరణ్వతీమ్।
సూపతీర్థాం శుచిజలాం శర్కరాపంకవర్జితామ్॥ 7
ఖానయామాస పరిఖాం కేశవస్తత్ర భారత।
గుప్త్యర్థమపి చాదిశ్య బలం తత్ర న్యవేశయత్॥ 8
విధిర్యః శిబిరస్యాసీత్ పాండవానాం మహాత్మనామ్।
తద్విధాని నరేంద్రాణాం కారయామాస కేశవ॥9
జనమేజయా! కురుక్షేత్రంలో "హిరణ్వతి" అనే పవిత్రనది ఉన్నది. అది చాలా నిర్మలమై, విశుద్ధమైన జలంతో నిండి ఉంటుంది. ఆనదీతీరంలో అనేక సుందరమైన స్నాన ఘట్టాలు ఉన్నవి. అక్కడ రాళ్ళు లేవు. బురద లేదు. ఆనదికి దగ్గరగా శ్రీ కృష్ణభగవానుడు పరిఖను త్రవ్వించి, కాపలాగా కొందరిని నియమించాడు. పాండవుల కోసం నిర్మించినట్లే మిగిలిన రాజులకు కూడా శిబిరాలు వేయించాడు. (7-9)
ప్రభూతతరకాష్ఠాని దురాధర్షతరాణి చ।
భక్ష్యభోజ్యాన్నపానాని శతశోఽథ సహస్రశః॥ 10
శిబిరాణి మహార్హాణి రాజ్ఞాం తత్ర పృథక్ పృథక్।
విమానానీవ రాజేంద్ర నివిష్టాని మహీతలే॥ 11
రాజేంద్రా! వేర్వేరుగా రాజులందరి కోసం వేలాదిగా పటిష్ఠమై బహుమూల్యములైన గుడారాలు సిద్ధమ్ చేశారు. ఆ గుడారాల్లో వంటెచెరకు మిక్కుటంగా ఉంచారు. భక్ష్య - భోజ్య - అన్నపానాదివ్యవస్థకై ఎంతో సామగ్రి సమకూర్చబడింది. ఆ శిబిరాలన్నీ భూతలంపై విస్తరించిన విమానాలవలె ప్రకాశిస్తున్నాయి. (10-11)
తత్రాసన్ శిల్పినః ప్రాజ్ఞాః శతశో దత్తవేతనాః।
సర్వోపకరణైర్యుక్తాః వైద్యాః శాస్త్రవిశారదాః॥ 12
ఆ సైన్యాలలో శిల్పులనూ, విద్వాంసులనూ, వైద్యులనూ వేతనాలిచ్చి నియమించారు. వారంతా అవసరమైన అన్ని ఉపకరణాలతో సిద్ధంగా ఉన్నారు. (12)
జ్యాధనుర్వర్మశస్త్రాణాం తథైవ మధుసర్పిషోః।
ససర్జరసపాంసూనాం రాశయః పర్వతోపమాః॥ 13
ప్రతిశిబిరంలోనూ అల్లెత్రాళ్లు, ధనుస్సులు, కవచాలు, అస్త్రశస్త్రాలు, తేనె, నేయి, యక్ష ధూపపు పొడులు వీటి రాసులు పర్వతాలవలె కనపడుతున్నాయి. (13)
బహూదకం సుయవసం తుషాంగారసమన్వితమ్।
శిబిరే శిబిరే రాజా సంచకార యుధిష్ఠిరః॥ 14
ధర్మరాజు ప్రతీశిబిరంలో పుష్కలంగా నీరు, గడ్డి, ఊక, బొగ్గులు అనువుగా సిద్ధం చేయించాడు. (14)
మహాయంత్రాణి నారాచాః తోమరాణి పరశ్వథాః।
ధనూంషి కవచాదీని ఋష్టయస్తూణసంయుతాః॥ 15
ఆశిబిరాలలో పెద్దపెద్ద యంత్రాలు, బాణాలు, తోమరాలు, గొడ్డళ్ళు, ధనుస్సులు, కవచాలు, రెండువైపులా పదునుగా ఉండే ఖడ్గాలు, అమ్ముల పొదులు ఉంచబడినవి. (15)
గజాః కంటక సంనాహాః లోహవర్మోత్తరచ్ఛదాః।
దృశ్యంతే తత్ర గిర్యాభాః సహస్రశతయోధినః॥ 16
సైనికులతోపాటు ముళ్లకవచాలతో పర్వతాలవలె విశాలమైన దేహాలతో ప్రకాశించే ఏనుగులు ఇనుప కవచాల వంటి ఉత్తరీయాలతో కనపడుతున్నాయి. (16)
నివిష్టాన్ పాండవాంస్తత్ర జ్ఞాత్వా మిత్రాణి భారత।
అభిసస్రుర్యథాదేశం సబలాః సహవాహనాః॥ 17
భారతా! పాండవులు ఈవిధంగా కురుక్షేత్రాన్ని సమీపించి తమ తమ సైన్యాలను నిలిపారు. ఈ విషయాన్ని తెలుసుకొని పాండవులతో స్నేహాన్ని కోరే రాజులు తమతమ సైన్యాలను తీసుకొని అక్కడికి చేరుకున్నారు. (17)
చరితబ్రహ్మచర్యాస్తే సోమపా భూరిదక్షిణాః।
జయాయ పాండుపుత్రాణాం సమాజగ్ముర్మహీక్షితః॥ 18
బ్రహ్మచర్యవ్రతాన్ని ఆచరిస్తూ భూరిదక్షిణలిచ్చి యజ్ఞాలు చేసిన రాజులు పాండవుల విజయం కోరుతూ కురుక్షేత్రానికి విచ్చేశారు. (18)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి శిబిరాది నిర్మాణే ద్విపంచాశదధిక శతతమోఽధ్యాయః॥ 152 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సైన్యనిర్యాణపర్వమను ఉపపర్వమున శిబిర నిర్మాణములనెడి నూటయేబది రెండవ అధ్యాయము. (152)