141. నూట నలువది యొకటవ అధ్యాయము

తన అభిప్రాయమును కర్ణుడు కృష్ణునకు చెప్పుట.

కర్ణ ఉవాచ
అసంశయం సౌహృదాన్మే ప్రణయాచ్చాత్థ కేశవ।
సఖ్యేన చైవ వార్ష్ణేయ శ్రేయస్కామతయైవ చ॥ 1
కర్ణుడిలా సమాధానం చెప్పాడు - కేశవా! నా మీద సద్భావంతో, చనువుతో, స్నేహంతో, నా శ్రేయోభిలాషివై చెప్పావు - సందేహం లేదు. (1)
సర్వం చైవాభిజానామి పాండోః పుత్రోఽస్మి ధర్మతః।
నిశ్చయాద్ధర్మశాస్త్రాణాం యథా త్వం కృష్ణ మన్యసే॥ 2
కృష్ణా! అంతా నే నెరుగుదును - ధర్మాన్ని, ధర్మశాస్త్ర నిర్ణయాన్ని బట్టి నీవనుకున్నట్లే నేను పాండురాజు కొడుకునే అవుతాను. (2)
కన్యా గర్భం సమాధత్త భాస్కరాన్మాం జనార్దన।
ఆదిత్యవచనాచ్పైవ జాతం మాం సా వ్యసర్జయత్॥ 3
జనార్దనా! కన్యయైన కుంతి సూర్యుని వల్ల గర్భం దాల్చింది - సూర్యుని మాట వల్లనే పుట్టిన నన్ను ఆమె విడిచి పెట్టింది. (3)
సోఽస్మి కృష్ణ తథా జాతః పాండోః పుత్రోఽస్మి ధర్మతః।
కుంత్యా త్వహమపాకీర్ణః యథా న కుశలం తథా॥ 4
కృష్ణా! అలా పుట్టిన నేను ధర్మాన్ని బట్టి పాండుని పుత్రుడినే అవుతాను. కాని నా క్షేమం చూడకుండా కుంతి నన్ను విడిచిపెట్టింది. (4)
సూతో హి మామధిరథఆHఅ దృష్ట్వైవాభ్యానయద్ గృహాన్।
రాధాయాశ్పైవ మాం ప్రాదాత్ సౌహార్దాన్మధుసూదన॥ 5
సూతుడయిన అధిరథుడు నన్ను చూసి మంచి మనసుతో ఇంటికి తీసికొని వచ్చి రాధకు ఇచ్చాడు. (5)
మత్స్నేహాచ్పైవ రాధాయాం సద్యః క్షీర మవాతరత్।
సా మే మూత్రం పురీషం చ ప్రతిజగ్రాహ మాధవ॥ 6
మాధవా! నా పై ప్రేమతో రాధకు వెంటనే పాలు చేపుకువచ్చాయి - ఆమె నా మూత్రమూ, మలమూ ఎత్తింది. (6)
తస్యాః పిండవ్యపనయం కుర్యాదస్మద్విధః కథమ్।
ధర్మవిద్ ధర్మశాస్త్రాణాం శ్రవణే సతతం రథః॥ 7
ధర్మం తెలిసి ధర్మశాస్త్రాలు వినే ఆసక్తి కల నాబోటివాడు ఆమె ఋణం ఎలా తీర్చుకోవాలి? (7)
తథా మామభిజానాతి సూతశ్చాధిరథః సుతమ్।
పితరం చాభిజానామి తమహం సౌహృదాత్ సదా॥ 8
అలాగే సూతుడయిన అధిరథుడు కూడా నన్ను కొడుకుగా చూసుకున్నాడు - అతని ప్రేమ వల్ల నేను అతనినే తండ్రిగా భావిస్తున్నాను. (8)
స హి మే జాతకర్మాది కారయామాస మాధవ।
శాస్త్రదృష్టేన విధినా పుత్రప్రీత్యా జనార్దన॥ 9
నామ వై వసుషేణేతి కారయామాస వై ద్విజైః।
మాధవా! నాకు ఆ సూతుడే పుత్రప్రీతితో శాస్త్రోక్త విధానంగా జాతకర్మాది సంస్కారాలు చేయించి బ్రాహ్మణులతో వసుషేణుడని పేరు పెట్టించాడు - (నామకరణం చేయించాడు) (9 1/2)
భార్యాశ్చోఢా మమ ప్రాప్తే యౌవనే తత్పరిగ్రహాత్॥ 10
తాసు పుత్రాశ్చ పౌత్రాశ్చ మమ జాతా జనార్దన।
తాసు మే హృదయం కృష్ణ సంజాతం కామబంధనమ్॥ 11
యౌవనం వచ్చాక తన కుల కన్యలను వివాహం చేశాడు. వారి వల్ల నేను పుత్రులనూ, మనుమలనూ కూడా కన్నాను. వారిపై నా మనసు కామబంధంతో ముడిపడిపోయింది. (10,11)
న పృథివ్యా సకలయా న సువర్ణస్య రాశిభిః।
హర్షాద్భయాద్వా గోవింద మిథ్యా తదుత్సహే॥ 12
గోవిందా! భూమి అంతా వశమయినా, ఎన్నో బంగారు రాశులు లభించినా, సంతోషంతో కాని, భయంతో కాని ఆ బంధాన్ని చెరుపుకోలేను. (12)
ధృతరాష్ట్రకులే కృష్ణ దుర్యోధనసమాశ్రయాత్।
మయా త్రయోదశ సమాః భుక్తం రాజ్యమకంటకమ్॥ 13
దుర్యోధనుని ఆశ్రయం వల్ల ధృతరాష్ట్రుని దగ్గర పదమూడేళ్లు రాజ్యం నిష్కంటకంగా అనుభవించాను. (13)
ఇష్టం చ బహుభిర్యజ్ఞైః సహ సూతై ర్మయాఽసకృత్।
ఆవాహాశ్చ వివాహాశ్చ సహ సూతైర్మయా కృతాః॥ 14
సూతులతో కలిసి ఎన్నోసార్లు ఎన్నో యజ్ఞాలు చేశాను. ఆ సూతులతో కలిసే ఎన్నో కులధర్మాలూ, వివాహాలూ నిర్వహించాను. (14)
మాం చ కృష్ణ సమాసాద్య కృతః శస్త్రసముద్యమః।
దుర్యోధనేన వార్ష్ణేయ విగ్రహశ్చాపి పాండవైః॥ 15
కృష్ణా! దుర్యోధనుడు నన్ను చేరదీసియే యుద్ధానికి సిద్ధమయ్యాడు - అసలు నన్ను చేరదీశాకనే పాండవులతో విరోధం పెట్టుకొన్నాడు. (15)
తస్మాద్రణే ద్వైరథే మాం ప్రత్యుద్యాతారమచ్యుత।
వృతవాన్ పరమం కృష్ణ ప్రతీపం సవ్యసాచినః॥ 16
కృష్ణా! అర్జునునితో "ద్వైరథ యుద్ధం" చేయటానికి యుద్ధంలో నన్నే ఎన్నుకొన్నాడు దుర్యోధనుడు. (16)
వి॥ ద్వైరథం = రెండు రథాలపై నిలిచి, ఇతరుల సహాయం లేకుండా ఇద్దరే ఎదురెదురుగా పోరాడడం.
వధాత్ బంధాద్ భయాద్వాపి లోభాద్వాపి జనార్దన।
అనృతం నోత్సహే కర్తుం ధార్తరాష్ట్రస్య ధీమతః॥ 17
నేను చనిపోయినా, సరే, పేగు బంధం వల్లనైనా సరే, భయం చేతనైనా సరే, లోభమ్ చేతనైనా సరే దుర్యోధనునికి అన్యాయం చేయలేను. (17)
యది హ్యద్య న గచ్ఛేయం ద్వైరథం సవ్యసాచినా।
అకీర్తిః స్యాద్ధృషీకేశ మమ పార్థస్య చోభయోః॥ 18
ఇపుడు సవ్యసాచితో నేను ద్వైరథ యుద్ధం చేయకపోతే... కృష్ణా! అది నాకూ, అర్జునునికీ కూడా అపకీర్తి తెస్తుంది. (18)
అసంశయం హితార్థాయ బ్రూయాస్త్వం మధుసూదన।
సర్వం చ పాండవాః కుర్యుః త్వద్వశిత్వాన్న సంశయః॥ 19
మధుసూదనా! నిజంగా నీవు మేలు కోసమే ఇలా చెపుతున్నావు. నీ వశంలో ఉన్నారు పాండవులు-అందుచేత నీవు చెప్పినట్లు చేస్తారు. (19)
మంత్రస్య నియమం కుర్యాః త్వమత్ర మధుసూదన।
ఏతదత్ర హితం మన్యే సర్వం యాదవనందన॥ 20
కృష్ణా! ఈ విషయంలో మన ఆలోచనలన్నీ రహస్యంగా ఉంచు - ఇదే మేలని అనుకొంటున్నాను. (20)
యది జానాతి మాం రాజా ధర్మాత్మా సంయతేంద్రియః।
కుంత్యాః ప్రథమజం పుత్రం న స రాజ్యం గ్రహీష్యతి॥ 21
ధర్మాత్ముడూ, జితేంద్రియుడూ అయిన ధర్మరాజుకు నేను కుంతి యొక్క మొదటి కొడుకు నని తెలిస్తే అతడు రాజ్యం స్వీకరించడు. (21)
ప్రాప్య చాపి మహద్రాజ్యమ్ తదహం మధుసూదన।
స్ఫీతం దుర్యోధనాయైవ సంప్రదద్యామరిందమ॥ 22
ఒకవేళ నాకే ఈ రాజ్యమంతా లభిస్తే దానినంతా దుర్యోధనునికే ఇవ్వాలి. (22)
స ఏవ రాజా ధర్మాత్మా శాశ్వతోఽస్తు యుధిష్ఠిరః।
వేతా యస్య హృషీకేశః యోద్ధా యస్య ధనంజయః॥ 23
ధర్మాత్ముడయిన యుధిష్ఠిరుడే శాశ్వతంగా రాజు కావాలి. (ఎందుకంటే) అతనిని నడిపేవాడు హృషీకేశుడు, అతనికోసం యుద్ధం చేసేవాడు ధనంజయుడూ కనుక. (23)
పృథివీ తస్య రాష్ట్రం చ యస్య భీమో మహారథః।
నకులః సహదేవశ్చ ద్రౌపదేయాశ్చ మాధవ॥ 24
ధృష్టద్యుమ్నశ్చ పాంచాల్యః సాత్యకిశ్చ మహారథః।
ఉత్తమౌజా యుధామన్యుః సత్యధర్మా చ సామకిః॥ 25
చైద్యశ్చ చేకితానశ్చ శిఖండీ చాపరాజితః।
ఇంద్రగోపకవర్ణాశ్చ కేకయా భ్రాతరస్తథా।
ఇంద్రాయుధసవర్ణశ్చ కుంతిభోజో మహామనాః॥ 26
మాతులో భీమసేనస్య శ్యేనజిచ్చ మహారథః।
శంఖః పుత్రో విరాటస్య నిధిస్త్వం చ జనార్దన॥ 27
మహానయం కృష్ణ కృతః క్షత్రస్య సముదానయః।
రాజ్యం ప్రాప్తమిదం దీప్తమ్ ప్రథితం సర్వరాజసు॥ 28
మహారథుడయిన భీముడు, నకులుడు, సహదేవుడు, ఉపపాండవులు, ధృష్టద్యుమ్నుడు, ద్రుపదుడు, సాత్యకి, ఉత్తమౌజుడు, యుధామన్యువు, సత్యధర్ముడు, చేకితానుడు, శిఖండి, (ఆర్ద్రపురుగుల్లాంటి రంగులతో మెరిసే) కేకయ సోదరులు, (ఇంద్రధనుస్సులా ఉండే) కుంతిభోజుడు, భీముని మేనమామ శ్యేనజిత్తు, శంఖుడు, అందరికీ పెన్నిధివి నీవు - ఇలా రాజులంతా ఒకచోటికి చేరారు. ఈ రాజులందరితో కూడిన భూమి అంతా ధర్మరాజుదే కావాలి - అవుతుంది. (24,25,26,27,28)
ధార్తరాష్ట్రస్య వార్ష్ణేయ శస్త్రయజ్ఞో భవిష్యతి।
అస్య యజ్ఞస్య వేత్తా త్వం భవిష్యసి జనార్దన॥ 29
కృష్ణా! దుర్యోధనునికి ఆయుధయజ్ఞం జరుగ బోతోంది. ఈ యజ్ఞానికి నీవే ఉపద్రష్టవు అవుతావు. (29)
ఆధ్వర్యనం చ తే కృష్ణ క్రతావస్మిన్ భవిష్యతి।
హోతా చైవాత్ర బీభత్సుః సన్నద్ధః స కపిధ్వజః॥ 30
ఈ యజ్ఞంలో నీదే ఆధ్వర్యవం - సన్నద్ధుడైన అర్జునుడు హోత. (30)
వి॥ ఈ యజ్ఞానికి ఉపద్రష్ట. అధ్వర్యుడూ రెండూ కృష్ణుడే.
గాండీవం స్రుక్ తథా చాజ్యం వీర్యం పుంసాం భవిష్యతి।
ఐంద్రం పాశుపతం బ్రాహ్మం స్థూణాకర్ణం చ మాధవ।
మంత్రాస్తత్ర భవిష్యంతి ప్రయుక్తాః సవ్యసాచినా॥ 31
గాండీవం స్రుక్కు - వీరుల వీర్యం నెయ్యి, ఐంద్రాస్త్రం, పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం, స్థూణాకర్ణాస్త్రం, అనేవి సవ్యసాచి ప్రయోగించే మంత్రాలు. (31)
అనుయాతశ్చ పితరమ్ అధికో వా పరాక్రమే।
గీతం స్తోత్రం స సౌభద్రః సమ్యక్ తత్ర భవిష్యతి॥ 32
అభిమన్యుడు పరాక్రమంలో అర్జునుని అనుసరిస్తాడు. ఒక విధంగా అతడే అధికుడు కూడా. ఈ శస్త్ర యజ్ఞంలో అతడు ఉద్గాతృకర్మను నిర్వహిస్తాడు. (32)
ఉద్గాతాత్ర పునర్భీమః ప్రస్తోతా సుమహాబలః।
వినదన్ స నరవ్యాఘ్రః నాగానీకాంతకృద్రణే॥ 33
ఏనుగుల సమూహాలను సంహరిస్తూ, పెద్దగా ధ్వనిస్తూ, సామగానాలు చేసే మహాబలుడు దీనికి ఉద్గాత. (33)
వి॥ యజ్ఞంలో సామగానం చేసేవాడు 'ఉద్గాత'
స చైవ తత్ర ధర్మాత్మా శశ్వద్రాజా యుధిష్ఠిరః।
జపైర్హోమైశ్చ సంయుక్తః బ్రహ్మత్వం కారయిష్యతి॥ 34
ధర్మాత్ముడయిన యుధిష్ఠిరుడు జప, హోమాలు చేస్తూ బ్రహ్మ పదవిని కూడా నిర్వహిస్తాడు. (34)
శంఖశబ్దాః సమురజాః భేర్యశ్చ మధుసూదన।
ఉత్కృష్టసింహనాదాశ్చ సుబ్రహ్మణ్యో భవిష్యతి॥ 35
శంఖధ్వనులూ, మద్దెలల మ్రోతలు, భేరీ నాదాలు, సింహనాదాలు - ఇవన్నీ సుబ్రహ్మణ్య స్థానం వహిస్తాయి. (35)
వి॥ యజ్ఞంలో కాలస్వరూపుడైన దైవాన్ని ఆవాహనం చేసేవాడు సుబ్రహ్మణ్యుడు.
నకులః సహదేవశ్చ మాద్రీపుత్రౌ యశస్వినౌ।
శామిత్రం తౌ మహావీర్యౌ సమ్యక్ తత్ర భవిష్యతః॥ 36
మాద్రీపుత్రులు నకుల సహదేవులు యజ్ఞ పశువును చంపే కార్యం నిర్వర్తిస్తారు. (36)
వి॥శామిత్రమ్ = క్షత్రియ పశువులను చంపే పని.
కల్మాషదండా గోవింద విమలా రథపంక్తయః।
యూపాః సముపకల్పంతాం అస్మిన్ యజ్ఞే జనార్దన॥ 37
చిత్రవర్ణాల ధ్వజాలు కల రథాల వరుసలు ఈ యజ్ఞంలో యూపస్తంభాలు అవుతాయి. (37)
కర్ణినాళీకనారాచాః వత్సదంతోపబృంహణాః।
తోమరాః సోమకలశాః పవిత్రాణి ధనూంషి చ॥ 38
కర్ణి, నాళీకం, నారాచం, వత్సదంతం అనే పేర్లు గల బాణాలు సోమద్రవ్యం చల్లే పాత్రలవుతాయి - తోమరాలు సోమరసం నింపిన పాత్రలవుతాయి - ధనుస్సులు పవిత్రాలు అవుతాయి. (38)
అసయోఽత్ర కపాలాని పురోడాశాః శిరాంసి చ।
హవిస్తు రుధిరం కృష్ణ తస్మిన్ యజ్ఞే భవిష్యతి॥ 39
కృష్ణా! ఆ యజ్ఞంలో కత్తులు కపాలాలు అవుతాయి - తలలు పురోడాశాలు అవుతాయి. నెత్తురే హవిస్సు అవుతుంది. (39)
ఇధ్మాః పరిధయశ్పైవ శక్తయో విమలా గదాః।
సదస్యా ద్రోణశిష్యాశ్చ కృపస్య చ శరద్వతః॥ 40
శక్తులు, సమిధ లవుతాయి - గదలు పరిధులవుతాయి - కృప, ద్రోణుల శిష్యులు సదస్యులవుతారు. (40)
ఇషవోఽత్ర పరిషోమాః ముక్తా గాండీవధన్వనా।
మహారథప్రయుక్తాశ్చ ద్రోణద్రౌణిప్రచోదితాః॥ 41
అర్జునుడూ, ద్రోణుడూ, అశ్వత్థామా మొదలయిన మహారథులు ప్రయోగించిన బాణాలు ఈ యజ్ఞంలో పరిస్తోమాలు అవుతాయి. (41)
ప్రతిప్రాస్థానికం కర్మ సాత్యకిస్తు కరిష్యతి।
దీక్షితో ధార్తరాష్ట్రోఽత్ర పత్నీ చాస్య మహాచమూః॥ 42
అధ్వర్యుని వెంటనుండి ప్రతిప్రస్థాన కర్మ చేసేవాడు సాత్యకి - ఇక్కడ యజ్ఞ దీక్షితుడు దుర్యోధనుడు. అతని భార్య మహాసైన్యం. (42)
ఘటోత్కచోఽత్ర శామిత్రం కరిష్యతి మహాబలః।
అతిరాత్రే మహాబాహో వితతే యజ్ఞకర్మణి॥ 43
దక్షిణా త్వస్య యజ్ఞస్య ధృష్టద్యుమ్నః ప్రతాపవాన్।
వైతానికే కర్మముఖే జాతో యత్కృష్ణ పావకాత్॥ 44
వైతానిక మనే శ్రౌత యజ్ఞంలో కర్మముఖంలో అగ్ని నుండి పుట్టిన ధృష్టద్యుమ్నుడే ఈ యజ్ఞానికి దక్షిణ. (44)
యదబ్రువమహం కృష్ణ కటుకాని స్మ పాండవాన్।
ప్రియార్థమ్ ధార్తరాష్ట్రస్య తేన తప్యే హ్యకర్మణా॥ 45
కృష్ణా! దుర్యోధనుని ప్రీతికోసం పాండవులను పరుషంగా మాట్లాడాను. ఆ తప్పు పనికి పరితపిస్తున్నాను. (45)
వి॥సం॥ పాండవులపై నిగూఢంగా కర్ణునికి ప్రేమ ఉందని దీనివల్ల తెలుస్తోంది(నీల)
యదా ద్రక్ష్యసి మాం కృష్ణ విహతం సవ్యసాచినా।
పునశ్చిత్తిస్తదా చాస్య యజ్ఞస్యాథ భవిష్యతి॥ 46
కృష్ణా! అర్జునుని చేత చనిపోయిన నన్ను చూసినపుడు అదే ఈ యుద్ధానికి 'పునశ్చిత్తి' అవుతుంది. (46)
వి॥సం॥ పునశ్చిత్తి = యజ్ఞం పూర్తి అయ్యాక చేసి "చయనా రంభం" అనే కార్యం.
దుశ్శాసనస్య రుధిరం యదా పాస్యతి పాండవః।
ఆనర్దం సర్దతః సమ్యక్ తదా సూయం భవిష్యతి॥ 47
ఆర్తనాదం చేస్తున్న దుశ్శాసనుని రక్తాన్ని భీముడు త్రాగుతూ ఉంటే అపుడు 'సూయ' మనే కార్యం జరిగినట్లు అవుతుంది. (47)
వి॥సం॥ సూయమ్ = సోమాన్ని త్రాగడం - ఇక్కడ సుత్యమని పాఠం ఉంది.
యదా ద్రోణం చ భీష్మం చ పాంచాల్యౌ పాతయిష్యతః।
తదా యజ్ఞావసానం తద్ భవిష్యతి జనార్దన॥ 48
ధృష్టద్యుమ్నుడు ద్రోణునీ, శిఖండి భీష్మునీ పడగొట్టినపుడు అది యజ్ఞావసానం అవుతుంది. (48)
దుర్యోధనం యదా హంతా భీమసేనో మహాబలః।
తదా సమాప్స్యతే యజ్ఞో ధార్తరాష్ట్రస్య మాధవ॥ 49
మహాబలుడయిన భీముడు దుర్యోధనుని చంపి నపుడు ఈ ధార్తరాష్ట్రయజ్ఞం పరిసమాప్తమవుతుంది. (49)
స్నుషాశ్చ ప్రస్నుషాశ్పైవ ధృతరాష్ట్రస్య సంగతాః।
హతేశ్వరా నష్టపుత్రాః హతనాథాశ్చ కేశవ॥ 50
రుదంత్యః సహ గాంధార్యా శ్వగృధ్రకురరాకులే।
స యజ్ఞే ఽస్మిన్నవబృథః భవిష్యతి జనార్దన॥ 51
ధృతరాష్ట్రుని కోడళ్లు, కొడుకుల కోడళ్లు భర్తలు, కొడుకులూ చనిపోగా ఒకచోట చేరి గాంధారితో పాటు కుక్కలూ, గద్దలూ, గోరువంకలూ తిరుగుతూ ఉంటే - వారందరి ఏడుపులే ఈ యజ్ఞానికి అవభృథస్నానం అవుతుంది. (50,51)
విద్యావృద్ధా వయోవృద్ధాః క్షత్రియాః క్షత్రియర్షభ।
వృథా మృత్యుం న కుర్వీరన్ త్వత్కృతే మధుసూదన॥ 52
విద్యావృద్ధులూ, వయోవృద్ధులూ అయిన క్షత్రియులు నీవల్ల వ్యర్థమయిన మరణం పొందకుందురుగాక. (52)
శస్త్రేణ నిధనం గచ్ఛేద్ సమృద్ధం క్షత్రమండలమ్।
కురుక్షేత్రే పుణ్యతమే త్రైలోక్యస్యాపి కేశవ॥ 53
మూడులోకాల్లోనూ పుఞక్షేత్రమయిన కురుక్షేత్రంలో నిండిన ఈ రాజలోకమంతా ఆయుధమరణం పొందుదురుగాక. (53)
వి॥క్షత్రియునికి శస్త్రమరణం శ్రేష్ఠమయినది - ఇంట్లో రోగంతో చనిపోరాదు.
తదత్ర పుండరీకాక్ష విధత్స్వ యదభీప్సితమ్।
యథా కార్త్స్న్యేన వార్ష్ణేయ క్షత్రం స్వర్గమవాప్నుయాత్॥ 54
కృష్ణా! ఈ రాజుల సమూహం అంతా ఒక్కసారిగా స్వర్గం పొందే ఏర్పాటు చూడు - అదే అందరికీ కావలసినది. (54)
యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ జనార్దన।
తావత్ కీర్తిభవః శబ్దః శాశ్వతోఽయం భవిష్యతి॥ 55
పర్వతాలూ, నదులూ నిలిచినంత కాలం ఈ కీర్తి ధ్వని శాశ్వతంగా నిలుస్తుంది. (55)
బ్రాహ్మణాః కథయిష్యంతి మహాభారతమాహవమ్।
సమాగమేషు వార్ష్ణేయ క్షత్రియాణాం యశోధనమ్॥ 56
క్షత్రియుల కీర్తి ధనం సంపాదించిన మహాభారత యుద్ధాన్ని బ్రాహ్మణులు సమావేశాల్లో/సభల్లో చెప్పుదురు గాక. (56)
సముపానయ కౌంతేయం యుద్ధాయ మమ కేశవ।
మంత్రసంవరణం కుర్వన్ నిత్యమేవ పరంతప॥ 57
కేశవా! ఈ రహస్యాన్ని ఎప్పుడూ బయట పెట్టకుండా అర్జునుని మాత్రం నాతో యుద్ధానికి తీసుకు రా. (57)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి కర్ణోపనివాదే ఏకచత్వారింశదధిక శతతమోఽధ్యాయః॥ 141 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున కర్ణుని అభిప్రాయ నివేదనమను నూటనలుబది యొకటవ అధ్యాయము. (141)