142. నూటనలుబది రెండవ అధ్యాయము

పాండవుల విజయము తప్పదని కృష్ణుడు చెప్పుట.

సంజయ ఉవాచ
కర్ణస్య వచనం శ్రుత్వా కేశవః పరవీరహా।
ఉవాచ ప్రహసన్ వాక్యం స్మితపూర్వమిదం యథా॥ 1
సంజయుడు ఇలా కొనసాగిస్తున్నాడు. కర్ణుని మాటవిని కేశవుడు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు. (1)
శ్రీభగవానువాచ
అపి త్వాం న లభేత్ కర్ణ రాజ్యలంభోపపాదనమ్।
మయా దత్తాం హి పృథివీం న ప్రశాసితు మిచ్ఛసి॥ 2
శ్రీకృష్ణుడిలా అన్నారు. కర్ణా! రాజ్యం పొందే ఉపాయం నీ మనసుకు నచ్చటం/అందటం/లేదు. నేనిచ్చే భూమిని నీవెందుకు పాలించాలనుకోవటం లేదు? (2)
ధ్రువో జయః పాండవానామితీదం
న సంశయః కశ్చన విద్యతేఽత్ర।
జయధ్వజో దృశ్యతే పాండవస్య
సముచ్ఛ్రితో వానరరాజ ఉగ్రః॥ 3
పాండవులకు జయం తప్పదు. ఇందులో ఏ సందేహమూ లేదు. అర్జునుని కపిధ్వజం జయాన్ని సూచించే ధ్వజంగా పైభాగాన ఎత్తుగా కనిపిస్తోంది. (3)
దివ్యా మాయా విహితా భౌమనేన
సముచ్ఛ్రితా ఇంద్రకేతుప్రకాశా।
దివ్యాని భూతాని జయావహాని
దృశ్యంతి చైవాత్ర భయానకాని॥ 4
ఈ కపిధ్వజాన్ని విశ్వకర్మ దివ్యమైన మాయతో ఇంద్రుని జెండావలె ప్రకాశించేటట్లు చేశాడు. దేనిమీద ఉన్న దివ్యమైన భూతాలు పాండవులకు జయావహంగానూ కౌరవులకు భయావహంగానూ చూస్తున్నాయి. (4)
న సజ్జతే శైలవనస్పతిభ్యః
ఊర్ధ్వం తిర్యగ్యోజనమాత్రరూపః।
శ్రీమాన్ ధ్వజః కర్ణ ధనంజయస్య
సముచ్ఛ్రితః పావకతుల్యరూపః॥ 5
కర్ణా! అర్జునుని ధ్వజం ఎత్తుగా ఉంది. అగ్ని సమానమయిన రూపంతో నిలువుగానూ, అడ్డంగానూ కూడా యోజనం దూరం వ్యాపించి ఉంది. దానివల్ల అది కొండలకూ, చెట్లకూ తగుల్కొనటం లేదు. (5)
యదా ద్రక్ష్యసి సంగ్రామే శ్వేతాశ్వం కృష్ణసారథిమ్।
ఐంద్రమస్త్రం వికుర్వాణమ్ ఉభే చాప్యగ్నిమారుతే॥ 6
గాండీవస్య చ నిర్ఘోషం విస్ఫూర్జితమివాశనేః।
న తదా భవితా త్రేతా న కృతం ద్వాపరం న చ॥ 7
కృష్ణుడు సారథిగా కల అర్జునుడు ఐంద్రాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం ప్రయోగిస్తూ ఉంటే పిడుగులు పడుతున్నట్లు గాండీవ ధ్వని వినిపిస్తూ ఉంటే - ఆ దృశ్యం చూసినపుడు ఇక త్రేత లేదు - కృతం లేదు - ద్వాపరం లేదు. (6,7)
వి॥సం॥ 1) కృత యుగంలో అంతా కృతకృత్యులే - వారికి సాధింపవలసినదేదీ ఉండదు - అందుచేత ధర్మం, అర్థం, కామం వీటి అపేక్షయే లేదు.
2) త్రేతా యుగంలో ధర్మాన్ని ప్రధానంగా, దానికి సాధనాలుగా అర్థ, కామాలనూ ప్రజలు అభిలషిస్తున్నారు.
3) ద్వాపర యుగంలో అర్థకామాలు ప్రధానంగానూ వానికి అంగములుగా ధర్మాన్ని ప్రజలు కోరుతారు - ఇలా "కృతం భవితా" అంటే మోక్షం లేదని భావం. 'నత్రేతా' అంటే ధర్మం కూడా లేదని భావం. ఇక 'ద్వాపరం న చ' అంటే -- యుద్ధంలో ఎలాగూ చావు తప్పదు - అనగా అర్థకామాలు కూడా లభించవు అని భావం - (నీల)
యదా ద్రక్ష్యసి సంగ్రామే కుంతీపుత్రం యుధిష్ఠిరమ్।
జనహోమసమాయుక్తం స్వాం రక్షంతం మహాచమూమ్॥ 8
ఆదిత్యమివ దుర్ధర్షం తపంతం శత్రువాహినీమ్।
న తదా భవితా త్రేతా న కృతం ద్వాపరం న చ॥ 9
యుద్ధంలో ధర్మరాజు జనహోమాలతో తన సేనను రక్షించుకొంటూ చూడ శక్యంగాని సూర్యునివలె శత్రుసేనను మాడ్చివేస్తూ ఉంటే... ఆ దృశ్యం నీవు చూస్తే ఇక కృతం లేదు - త్రేత లేదు - ద్వాపరం లేదు. (8,9)
యదా ద్రక్ష్యసి సంగ్రామే భీమసేనం మహాబలమ్।
దుశ్శాసనస్య రుధిరం పీత్వా నృత్యంతమాహవే॥ 10
ప్రభిన్నమివ మాతంగం ప్రతిద్విరదఘాతినమ్।
న తదా భవితా త్రేతా న కృతం ద్వాపరం న చ॥ 11
యుద్ధంలో భీమసేనుడు దుశ్శాసనుని రక్తం త్రాగి నృత్యం చేస్తూ మదపుటేనుగును మరో ఏనుగును చీల్చి చెండాడుతున్నట్లు కనిపిస్తే అపుడిక కృతం లేదు, త్రేత లేదు, ద్వాపరం లేదు. (10,11)
యదా ద్రక్ష్యసి సంగ్రామే ద్రోణం శాంతనవం కృపమ్।
సుయోధనం చ రాజానం సైంధవం చ జయద్రథమ్॥ 12
యుద్ధాయాపతతస్తూర్ణం వారితాన్ సవ్యసాచినా।
న తదా భవితా త్రేతా న కృతం ద్వాపరం న చ॥ 13
సంగ్రామంలో మీదపడుతున్న ద్రోణునీ, భీష్మునీ, కృపునీ, దుర్యోధనునీ, సైంధవునీ ఒక్క క్షణంలో అర్జునుడు ఆపి వేసిన దృశ్యం నీవు చూస్తే ఇక అపుడు త్రేత లేదు. కృతం లేదు, ద్వాపరం లేదు. (12,13)
యదా ద్రక్ష్యసి సంగ్రామే మాద్రీపుత్రౌ మహాబలౌ।
వాహినీం ధార్తరాష్ట్రాణాం క్షోభయంతౌ గజావివ॥ 14
విగాఢే శస్త్రసంపాతే పరవీరరథారుజౌ।
న తదా భవితా త్రేతా న కృతం ద్వాపరం న చ॥ 15
యుద్ధంలో మహాబలులైన నకుల సహదేవులు కౌరవ సైన్యాలను ఏనుగుల్లా కలచి వేస్తూ, దట్టంగా బాణాలు వేస్తూ శత్రు రథాల్ని విరగగొట్టుతూ ఉంటే... ఆ దృశ్యం నీవు చూస్తే... ఇక అపుడు త్రేత లేదు కృతం లేదు ద్వాపరం లేదు. (14,15)
బ్రూయాః కర్ణ ఇతో గత్వా ద్రోణం శాంతనవం కృపమ్।
సౌమ్యోఽయం వర్తతే మాసః సుప్రాపయవసేంధనః॥ 16
సర్వౌషధివనస్ఫీతః ఫలవానల్పమక్షికః।
నిష్పంకో రసవత్తోయః నాత్యుష్ణశిశిరః సుఖః॥ 17
కర్ణా! ఇక్కడ నుండి వెళ్లి ద్రోణునికీ, భీష్మునికీ, కృపునికీ ఇలా చెప్పు - ఈ మాసం సౌమ్యంగా ఉంది - గడ్డి, కట్టెలు బాగా దొరుకుతాయి. ఓషధులన్నీ బాగా ఉండి అడవులు సమృద్ధిగా ఉన్నాయి. పండ్లు బాగా ఉన్నాయి. ఈగలు తగ్గిపోయాయి. బురద అణగి పోయింది. రసవంతమయిన నీరు దొరుకుతుంది. ఈ కాలం ఎక్కువ వేడీ కాదు చల్లనిదీ కాదు - సుఖ కరమయిన కాలం. (16,17)
వి॥సం॥ సౌమ్యః = వెన్నెలతో అందమయినది(నీల)
సప్తమాచ్చాపి దివసాత్ అమావాస్యా భవిష్యతి।
సంగ్రామో యుజ్యతాం తస్యాం తామాహుః శక్రదేవతామ్॥ 18
ఇప్పటికీ ఏడు రోజుల తరువాత అమావాస్య అవుతుంది. ఆ రోజుకు ఇంద్రుడు అధిదేవత - ఆ రోజున యుద్ధం జరగాలి. (18)
వి॥తె॥ "ఏడినిమిది దినంబులకు నమావాస్య వచ్చునది పుణ్యదినంబు, నాడు భండనంబు గావలయును. ఉద్యో-4-49
తథా రాజ్ఞో వదేః సర్వాన్ యే యుద్ధాయాభ్యుపాగతాః।
యద్వా మనీషితం తద్వై సర్వం సంపాదయామ్యహమ్॥ 19
అలాగే యుద్ధానికి వచ్చిన రాజులందరికీ ఇలా చెప్పు. "మీరు కోరిన దాన్ని సంపూర్ణంగా తీరుస్తాను" అని చెప్పు. (19)
రాజానో రాజపుత్రాశ్చ దుర్యోధనవశానుగాః।
ప్రాప్య శస్త్రేణ నిధనం ప్రాప్స్యంతి గతిముత్తమామ్॥ 20
దుర్యోధనుని వశవర్తులయిన రాజులూ, రాజకుమారులూ శస్త్రమరణం పొంది ఉత్తమగతి పొందుతారు. (20)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి కర్ణోపనివాదే భగవద్వాక్యే ద్విచత్వారింశదధిక శతతమోఽధ్యాయః॥ 142 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున కర్ణునితో కృష్ణుని మంతనములు అను నూట నలువది రెండవ అధ్యాయము. (142)