140. నూటనలుబదియవ అధ్యాయము
పాండవపక్షమున చేరుమని శ్రీకృష్ణుడు కర్ణుని ప్రలోభపెట్టుట.
ధృతరాష్ట్ర ఉవాచ
రాజపుత్రైః పరివృతః తథా భృత్యైశ్చ సంజయ।
ఉపారోప్య రథే కర్ణం నిర్యాతో మధుసూదనః॥ 1
కిమబ్రవీదమేయాత్మా రాధేయం పరవీరహా।
కాని సాంత్వాని గోవిందః సూతపుత్రే ప్రయుక్తవాన్॥ 2
ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు - సంజయా! రాజకుమారులు, సేవకులూ చుట్టూ వస్తూ ఉండగా కర్ణుడిని రథమెక్కించుకొని కృష్ణుడు వెళ్లాడు గదా! ఆ కర్ణునితో గోవిందుడు ఏం మాట్లాడాడు? కర్ణునితో ఏ అనునయ వాక్యాలు ప్రయోగించాడు.? (1,2)
ఉద్యన్మేఘస్వనః కాలే కృష్ణః కర్ణమథాబ్రవీత్।
మృదు వా యది వా తీక్ష్ణం తన్మమాచక్ష్వ సంజయ॥ 3
అపుడు కృష్ణుడు మేఘగంభీర స్వరంతో కర్ణునితో మాట్లాడాడు గదా! అది మృదువుగా మాట్లాడాడా? లేక తీవ్రంగా మాట్లాడాడా? నాకు చెప్పు సంజయా! (3)
సంజయ ఉవాచ
అనుపూర్వ్యేణ వాక్యాని తీక్ష్ణాని చ మృదూని చ।
ప్రియాణి ధర్మయుక్తాని సత్యాని చ హితాని చ॥ 4
హృదయగ్రహణీయాని రాధేయం మధుసూదనః।
యాన్యబ్రవీదమేయాత్మా తాని మే శృణు భారత॥ 5
సంజయుడు చెపుతున్నాడు - ఊహించటానికి కూడా శక్యంకాని మహిమ కలవాడు కృష్ణుడు. అతడు కర్ణునితో క్రమంగా కర్కశాలూ, మెత్తనివీ, ప్రియాలూ, ధర్మ సహితాలూ, సత్యాలూ, హితాలూ, హృదయంగమాలూ అయిన మాటలు చెప్పాడు - అవి చెపుతాను విను. (4,5)
వాసుదేవ ఉవాచ
ఉపాసితాస్తే రాధేయ బ్రాహ్మణా వేదపారగాః।
తత్త్వార్థం పరిపృష్టాశ్చ నియతేనానసూయయా॥ 6
వాసుదేవుడు ఇలా చెప్పాడు.
రాధేయా! నీవు వేదవేత్తలయిన బ్రాహ్మణులను సేవించావు - అసూయలేని నియమనిష్ఠలతో తత్త్వార్థాన్ని గురించి వారిని పరిప్రశ్న చేశావు. (6)
త్వమేవ కర్ణ జానాసి వేదవాదాన్ సనాతనాన్।
త్వమేవ ధర్మశాస్త్రేషు సూక్ష్మేషు పరినిష్ఠితః॥ 7
సనాతనలయిన వేదనాదాలు నీకే తెలుసు. ధర్మశాస్త్రాల్లోని సూక్ష్మాలు కూడా నీవెరుగుదువు. (7)
కనీనశ్చ సహోఢశ్చ కన్యాయాం యశ్చ జాయతే।
వోఢారం పితరం తస్య ప్రాహుః శాస్త్రవిదో జనాః॥ 8
కన్యకు పుట్టిన వానిని కానీనుడని, సహోఢుడనీ శాస్త్రవేత్తలు అంటారు. తల్లి భర్తయే వానికి తండ్రి అనీ చెపుతారు. (8)
సోఽసి కర్ణ తథా జాతః పాండోః పుత్రోఽసి ధర్మతః।
నిగ్రహాద్ధర్మశాస్త్రాణాం ఏహి రాజా భవిష్యసి॥ 9
కర్ణా! నీవు అలా పుట్టినవాడివి - ధర్మాన్ని బట్టి పాండురాజు పుత్రుడివి. ధర్మశాస్త్రాన్ని బట్టి నీవు రాజువు అవుతావు. రా. (9)
పితృపక్షే చ తే పార్థాః మాతృపక్షే చ వృష్ణయః।
ద్వౌ పక్షావభిజానీహి త్వమేతౌ పురుషర్షభ॥ 10
పురుష పుంగవా! నీకు ఆ కౌంతేయులు తండ్రి వైపు చుట్టాలు. వృష్ణి వంశస్థులు(మేము) తల్లి వైపు చుట్టాలు. ఈ రెండు పక్షాలూ నీవు గ్రహించు. (10)
మయా సార్దమితో యాతమ్ అద్య త్వాం తాత పాండవాః।
అభిజానంతు కౌంతేయం పూర్వజాతం యుధిష్ఠిరాత్॥ 11
మాతో కలిసి వచ్చే నిన్నిపుడు పాండవులు కుంతి కొడుకుగా, ధర్మరాజుకు అన్నగా గుర్తిస్తారు. (11)
పాదౌ తవ గ్రహీష్యంతి భ్రాతరః పంచపాండవాః।
ద్రౌపదేయాస్తథా పంచ సౌభద్రశ్చాపరాజితః॥ 12
ఆ అయిదుగురు పాండవులూ, ఉపపాండవులూ, అభిమన్యుడూ నీ పాదాలు పట్టుకొంటారు. (నీకు పాదాభివందనం చేస్తారు) (12)
రాజానో రాజపుత్రాశ్చ పాండవార్థే సమాగతాః।
పాదౌ తవ గ్రహీష్యంతి సర్వే చాంధకవృష్ణయః॥ 13
పాండవులకోసం ఇక్కడ చేరిన అంధక, వృష్ణి వంశస్థులు రాజులూ, రాజకుమారులూ అంతా నీ పాదాలు పట్టుకుంటారు. (13)
హిరణ్మయాంశ్చ తే కుంభాన్ రాజతాన్ పార్థివాంస్తథా।
ఓషధ్యః సర్వబీజాని సర్వరత్నాని వీరుధః॥ 14
రాజన్యా రాజకన్యాశ్చాప్యానయంత్వాభిషేచనమ్।
రాజకుమారులూ, రాజకన్యలూ, నవధాన్యాలూ, రత్నాలూ, పూలమొక్కలు కల బంగారు కుండీలూ, వెండికుండలూ పట్టుకొని నీకు పట్టాభిషేక మంగళ ద్రవ్యాలు తెస్తారు. (14 1/2)
షష్ఠే త్వాం చ తథా కాలే ద్రౌపద్యుపగమిష్యతి॥ 15
ఆ సమయంలో ద్రౌపది నిన్నూ ఆరవవానిగా పొందుతుంది/చేరుతుంది. (15)
అగ్నిం జుహోతు వై ధౌమ్యః సంశితాత్మా ద్విజోత్తమః।
అద్య త్వామభిషించంతు చాతుర్వైద్యా ద్విజాతయః॥ 16
చక్కని బ్రాహ్మణోత్తముడు ధౌమ్యుడు అగ్నికార్యం నిర్వర్తిస్తాడు. నాలుగు వేదాలూ చదివిన బ్రాహ్మణులు నిన్ను ఈనాడే అభిషేకిస్తారు. (16)
పురోహితః పాండవానాం బ్రహ్మకర్మణ్యవస్థితః।
తదైవ భ్రాతరః పంచ పాండవాః పురుషర్షభాః॥ 17
ద్రౌపదేయాస్తథా పంచ పంచాలాశ్చేదయస్తథా।
అహం చ త్వాభిషేక్ష్యామి రాజానం పృథివీపతిమ్॥ 18
యువరాజోఽస్తుతే రాజా ధర్మపుత్రో యుధిష్ఠిరః।
గృహీత్వా వ్యజనం శ్వేతం ధర్మాత్మా సంశితవ్రతః॥ 19
ఉపాన్వారోహతు రథం కుంతీపుత్రో యుధిష్ఠిరః।
ఛత్రం చ తే మహాశ్వేతం భీమసేనో మహాబలః।
అభిషిక్తస్య కౌంతేయో ధారయిష్యతి మూర్ధని॥ 20
బ్రహ్మకర్మలు చేసే పాండవుల పురోహితుడు ధౌమ్యుడూ, పంచ పాండవులూ, ఉపపాండవులూ, పాంచాలురూ, చేదిరాజులూ, నేనూ నిన్ను రాజుగా అభిషేకిస్తాము. నీకు ధర్మరాజు యువరాజు అవుతాడు. అతడు నీకు వింజామర పడతాడు. నీవు రథం ఎక్కిన తరువాతనే ధర్మరాజు నీవెంట రథం ఎక్కుతాడు. మహాబలు డయిన భీముడు నీ తలమీద గొడుగు పడతాడు. (17-20)
కింకిణీశతనిర్ఘోషం వైయాఘ్రపరివారణమ్।
రథం శ్వేతహయైర్యుక్తం అర్జునో వాహయిష్యతి॥ 21
అభిమన్యుశ్చ తే నిత్యం ప్రత్యాసన్నో భవిష్యతి॥ 22
వందల మువ్వల సవ్వడితో, పులితోలు కప్పి తెల్లని గుర్రాలతో కూడిన నీ రథం అర్జునుడు తోలుతాడు - అభిమన్యుడు కూడా సర్వదా నీ దగ్గరే కనిపెట్టుకొని ఉంటాడు. (21,22)
నకులః సహదేవశ్చ ద్రౌపదేయాశ్చ పంచ యే।
పంచాలాశ్చానుయాస్యంతి శిఖండీ చ మహారథః॥ 23
నకుల సహదేవులూ, ఉపపాండవులు అయిదుగురూ, పాంచాలురూ, మహారథి శిఖండి నీ వెంట వస్తారు. (23)
అహమ్ చ త్వానుయాస్యామి సర్వే చాంధకవృష్ణయః।
దాశార్హాః పరివారాస్తే దాశార్ణాశ్చ విశాంపతే॥ 24
రాజా! నేనూ; అంధక; వృష్ణి వంశస్థులూ; దాశార్హులూ; దశార్ణదేశ రాజులు - అందరమూ నీ పరివారంగా నీ వెంట వస్తాము. (24)
భుంక్ష్వ రాజ్యం మహాబాహో భ్రాతృభిః సహ పాండవైః।
జపైర్హోమైశ్చ సంయుక్తః మంగళైశ్చ పృథగ్విధైః॥ 25
నీ తమ్ములు పాండవులతో కలిసి, జపాలతో హోమాలతో, వివిధ శుభాలతో రాజ్యమంతా అనుభవించు. (25)
పురోగమాశ్చ తే సంతు ద్రవిడాః సహ కుంతలైః।
ఆంధ్రాస్తాలచరాశ్పైవ చూచుపా వేణుపాస్తథా॥ 26
ద్రావిడులు, కుంతల దేశీయులు, ఆంధ్రులు, తాలచరులు, చూచుపులు, వేణుపులు అంతా నీముందు నడుస్తూ వస్తారు. (26)
స్తువంతు త్వాం చ బహుభిః స్తుతిభిః సూతమాగధాః।
విజయం వసుషేణస్య ఘోషయంతు చ పాండవాః॥ 27
సూతులూ, మాగధులూ నిన్ను అనేకవిధాల స్తుతులతో స్తుతిస్తారు. పాండవులు వసుషేణుని విజయాన్ని చాటిస్తారు. (27)
స త్వం పరివృతః పార్థైః నక్షత్రైరివ చంద్రమాః।
ప్రశాధి రాజ్యం కౌంతేయ కుంతీం చ ప్రతినందయ॥ 28
నక్షత్రాలతో కూడిన చంద్రునిలాగా కౌంతేయులతో కలిసి రాజ్యం పాలించు - కుంతిని సంతోషపెట్టు. (28)
మిత్రాణి తే ప్రహృష్యంతు వ్యథంతు రిపవస్తథా।
సౌభ్రాత్రం చైవ తేఽద్యాస్తు భ్రాతృభిః సహ పాండవైః॥ 29
నీ మిత్రులు సంతోషింతురుగాక! శత్రువులు వ్యథ చెందుదురు గాక! సోదరులైన పాండవులతో నీ సౌభ్రాత్రం ఇపుడు ప్రవర్తిల్లునుగాక! (29)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి శ్రీకృష్ణ వాక్యే చత్వారింశదధిక శతతమోఽధ్యాయః॥ 140 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున శ్రీకృష్ణవాక్యమను నూటనలువదియవ అధ్యాయము. (140)