139. నూటముప్పది తొమ్మిదవ అధ్యాయము
ద్రోణుడు శాంతికై దుర్యోధనుని మందలించుట.
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తు విమనాః తిర్యగ్దృష్టిరధోముఖః।
సంహత్య చ భ్రువోర్మధ్యం న కించిద్ వ్యాజహార హ॥ 1
వైశంపాయనుడు ఇట్లు అన్నాడు. వారిలా అనేసరికి దుర్యోధనుడు ప్రక్కచూపులూ, నేలచూపులూ చూస్తూ కనుబొమలు ముడిచేసుకుని ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. (1)
తం వై విమనసం దృష్ట్వా సంప్రేక్ష్యాన్యోన్యమంతికాత్।
పునరేవోత్తరం వాక్యమ్ ఉక్తవంతౌ నరర్షభౌ॥ 2
తాము చెప్పినదానికి దుర్యోధనుడు వ్యతిరేకభావంతో ఉన్నట్లు భీష్మద్రోణులు ఒకరినొకరు చూసుకొని మళ్లీ యిలా అన్నారు. (2)
భీష్మ ఉవాచ
శుశ్రూషుమనసూయం చ బ్రహ్మణ్యం సత్యవాదినమ్।
ప్రతియోత్స్యామహే పార్థమ్ అతో దుఃఖతరం ను కిమ్॥ 3
ముందు భీష్ముడు ఇలా అన్నాడు. అర్జునుడు పెద్దలమాట వింటాడు. అసూయపడడు. బ్రహ్మణ్యుడు. సత్యమే చెపుతాడు. అటువంటి వానికి ఎదురుగా ఇపుడు పోరాడుతున్నాం. ఇంతకు మించిన దుఃఖం ఏముంటుంది? (3)
ద్రోణ ఉవాచ
అశ్వత్థామ్ని యథా పుత్రే భూయో మమ ధనంజయే।
బహుమానః పరో రాజన్ సంనతిశ్చ కపిధ్వజే॥ 4
తరువాత ద్రోణుడిట్లు అన్నాడు. నా పుత్రుడు అశ్వత్థామ మీద ఎంత ఇష్టమో అర్జునుని మీద కూడ అంతే ఇష్టం - ఇంకా ఒకపాలు అర్జునుని మీదే ఎక్కువ. (4)
తం చ పుత్రాత్ ప్రియతమం ప్రతియోత్స్యే ధనంజయమ్।
క్షాత్రాం ధర్మమనుష్ఠాయ ధిగస్తు క్షత్రజీవికామ్॥ 5
పుత్రునికంటే ప్రియమయిన అర్జునుడితో క్షత్రియ ధర్మంతో యుద్ధం చేయవలసి వస్తోంది. ఛీ! క్షత్రియ జీవనం చాలా కష్టం. (5)
యస్య లోకే సమో నాస్తి కశ్చిదన్యో ధనుర్ధరః।
మత్ప్రసాదాత్ స బీభత్సుః శ్రేయానన్యైర్ధనుర్ధరైః॥ 6
లోకంలో అర్జునునితో సమానమైన విలుకాడు లేనేలేడు. నా అనుగ్రహంతో అర్జునుడు మిగిలిన విలుకాండ్రకంటె శ్రేష్ఠుడయ్యాడు. (6)
మిత్రధ్రుగ్ దుష్టభావశ్చ నాస్తికోఽథానృజుః శఠః।
న సత్సు లభతే పూజాం యజ్ఞే మూర్ఖ ఇవాగతః॥ 7
మిత్రద్రోహి, దుర్మార్గుడు, నాస్తికుడు, కుటిలుడు, మూర్ఖుడూ అయినవాడు సజ్జనులున్న యజ్ఞానికి వచ్చిన మూర్ఖునిలాగా గౌరవం పొందలేడు. (7)
వార్యమాణోఽపి పాపేభ్యః పాపాత్మా పాపమిచ్ఛతి।
చోద్యమానోఽపి పాపేన శుభాత్మా శుభమిచ్ఛతి॥ 8
పాపకృత్యాలు చేయవద్దని మిత్రులు నివారిస్తున్నా పాపి పాపాలే చేస్తాడు - అలాగే పుణ్యాత్ముడు పాపుల చేత పురికొల్పబడినా సరే పుణ్యమే చేస్తాడు. (8)
మిథ్యోపచరితా హ్యేతే వర్తమానా హ్యను ప్రియే।
అహితత్వాయ కల్పంతే దోషా భరతసత్తమ॥ 9
పాండవులను నీవు కపటప్రేమతో మోసగించావు. అయినా వారు నీపట్ల ప్రియంగానే ప్రవర్తిస్తున్నారు. నీ దోషాలు మాత్రం విరోధానికి దారితీస్తున్నాయి. (9)
త్వముక్తః కురువృద్ధేన మయా చ విదురేణ చ।
వాసుదేవేన చ తథా శ్రేయో నైవాభిమన్యసే॥ 10
భీష్ముడు, నేను, విదురుడు, వాసుదేవుడు నీకు హితం చెప్పాము. కాని దాన్ని నీవు శ్రేయస్సుగా భావించడంలేదు. (10)
అస్తి మే బలమిత్యేవ సహసా త్వం తితీర్షసి।
సగ్రాహనక్రమకరం గంగావేగమివోష్ణగే॥ 11
'నాకు బలం ఉంది' అనుకొని సాహసంతో వర్షాకాలం పొంగి పొరలే, మొసళ్లు తిమింగిలాలు కల గంగానదిని (పాండవసేనను)దాటాలని అనుకొంటున్నావు. (11)
వాససైవ యథా హి త్వం ప్రావృణ్వానోఽభిమన్యసే।
ప్రజం త్యక్తామివ ప్రాప్య లోభాద్ యౌధిష్ఠిరీం శ్రియమ్॥ 12
ఇతరులు కట్టుకొన్న వస్త్రాన్ని ఒంటిమీద కప్పుకొని నాదే అని మురుస్తున్నావు. ఇతరులు పెట్టుకొని తీసి పారేసిన పూలమాలవలె ధర్మజుని సంపదను లోభంతో పొంది నాదే అనుకొంటున్నావు. (12)
ద్రౌపదీసహితం పార్థమ్ సాయుధైర్భ్రాతృభిర్వృతమ్।
వనస్థమపి రాజ్యస్థః పాండవం కో విజేష్యతి॥ 13
చుట్టూరా ఆయుధాలు ధరించిన తమ్ముళ్లతో ద్రౌపదీ సహితంగా నిలిచిన ధర్మరాజును అడవిలో ఉన్నా, రాజపదవిలో ఉన్నా సరే ఎవరు జయించగలరు? (13)
నిదేశే యస్య రాజానః సర్వే తిష్ఠంతి కింకరాః।
తమైలబిలమాసాద్య ధర్మరాజో వ్యరాజత॥ 14
రాజులంతా ఆతని ఆజ్ఞను సేవకుల వలె పాటిస్తారు. ఆ ధర్మరాజు కుబేరుని కూడ జయించి ప్రకాశిస్తున్నాడు. (14)
కుబేరసదనం ప్రాప్య తతో రత్నాన్యవాప్య చ।
స్ఫీతమాక్రమ్యతే రాష్ట్రం రాజ్యమిచ్ఛంతి పాండవాః॥ 15
పాండవులు కుబేరుని భవనం ప్రవేశించి రత్నాలు పొంది, నీ రాష్ట్రమంతా ఆక్రమించి రాజ్యం ఆక్రమిస్తారు. (15)
దత్తం హుతమధీతం చ బ్రాహ్మణాస్తర్పితా ధనైః।
ఆవయోర్గతమాయుశ్చ కృతకృత్యౌ చ విద్ధి నౌ॥ 16
మే మిద్దరమూ తగినంత దానం చేశాము - హోమాలూ చేశాం - చదువుకున్నాం - సంపదలతో బ్రాహ్మణులను తృప్తిపరచాము - మా ఆయువు చాలా అయిపోయింది - కృతకృత్యుల మయ్యాము - తెలుసుకో - (16)
త్వం తు హిత్వా సుఖం రాజ్యం మిత్రాణి చ ధనాని చ।
విగ్రహం పాండవైః కృత్వా మహద్వ్యసనమాప్స్యసి॥ 17
నీవయితే పాండవులతో వైరం పెట్టుకొన్నావు. సుఖం, రాజ్యం, స్నేహితులూ, సంపదలూ విడిచి చాలా కష్టం పొందబోతున్నావు. (17)
ద్రౌపదీ యస్య చాశాస్తే విజయం సత్యవాదినీ।
తపోఘోరవ్రతా దేవీ కథం జేష్యసి పాండవమ్॥ 18
ఆ ద్రౌపది సత్యవాదిని - తపమూ వ్రతమూ దీక్షతో చేసినది. ఆమె పాండవుల విజయం కోరుతోంది. ఇక నీవెట్లా జయిస్తావు? (18)
మంత్రీ జనార్దనో యస్య భ్రాతా యస్య ధనంజయః।
సర్వశస్త్రభృతాం శ్రేష్ఠః కథం జేష్యసి పాండవమ్॥ 19
ఆ ధర్మరాజుకు మంత్రి కృష్ణుడు. తమ్ముడు సర్వశస్త్రవిద్యాపారంగతుడైన అర్జునుడు. నీవెట్లా ఆ ధర్మరాజును జయించగలవు? (19)
సహాయా బ్రాహ్మణా యస్య ధృతిమంతో జితేంద్రియాః।
తముగ్రతపసం వీరం కథం జేష్యసి పాండవమ్॥ 20
ధర్మరాజుకు ధీరులు, జితేంద్రియులూ అయిన బ్రాహ్మణులు సహాయులు - అంతటి తపస్సంపన్నుని, వీరుడయిన ధర్మరాజును ఎలా జయిస్తావు? (20)
పునరుక్తం చ వక్ష్యామి యత్కార్యం భూతిమిచ్ఛతా।
సుహృదా మజ్జమానేషు సుహృత్సు వ్యసనార్ణవే॥ 21
స్నేహితుడు కష్టసముద్రంలో మునిగిపోతున్నపుడు వాని అభివృద్ధికోరే మిత్రుడు పునరుక్తి అయినా సరే మళ్లీ మళ్లీ చెప్పాలి - అందుకు చెపుతున్నా. (21)
అలం యుద్ధేన తైర్వీరైః శామ్య త్వం కురువృద్ధయే।
మా గమః ససుతామాత్యః సబలశ్చ పరాభవమ్॥ 22
వీరులయిన పాండవులతో యుద్ధం వద్దు - కురువంశ వృద్ధికోసం శాంతించు - పుత్రులతో, మంత్రులతో బలగంతో పరాభవం పొందకు. (22)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి భీష్మద్రోణ వాక్యే ఏకోన చత్వారింశదధిక శతతమోఽధ్యాయః॥ 139 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున భీష్మద్రోణవాక్యమను నూటముప్పది తొమ్మిదవ అధ్యాయము. (139)