128. నూట ఇరువది యెనిమిదవ అధ్యాయము
శ్రీకృష్ణుడు దుర్యోధనుని నిందించుట.
వైశంపాయన ఉవాచ
తతః ప్రశమ్య దాశార్హః క్రోధపర్యాకులేక్షణః।
దుర్యోధనమిదం వాక్యమ్ అబ్రవీత్ కురుసంసది॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు - దుర్యోధనుని మాటలు విని శ్రీకృష్ణుని కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. ఆపై ప్రశాంతుడై శ్రీకృష్ణుడు కౌరవసభలో దుర్యోధనునితో ఇలా అన్నాడు. (1)
లప్స్యసే వీరశయనం కామమేతదవాప్స్యసి।
స్థిరో భవ సహామాత్యః విమర్దో భవితా మహాన్॥ 2
నీవు రణరంగంలో వీరశయ్యనే పొందగలవు. నీ ఈ కోరిక తీరగలదు. నీ మంత్రులతో కలిసి ధైర్యంగా ఉండు. తీవ్రంగా జనవినాశనం జరగబోతోంది. (2)
యచ్చైవం మన్యసే మూఢ న మే కశ్చిద్ వ్యతిక్రమః।
పాండవేష్వితి తత్సర్వమ్ నిబోధత నరాధిపాః॥ 3
మూర్ఖుడా! పాండవుల విషయంలో నీవు చేసిన అపరాధమేమీ లేదని అనుకొంటున్నావు. దాన్ని పూర్తిగా వివరిస్తాను. రాజులారా! తమరు కూడా సావధానులై వినండి. (3)
శ్రియా సంతప్యమానేన పాండవానాం మహాత్మనామ్।
త్వయా దుర్మంత్రితం ద్యూతం సౌబలేన చ భారత॥ 4
పాండవుల సంపదలను చూచి ఓర్వలేక శకునితో కలిసి పాండవులతో జూదమాడాలన్న కుట్ర చేశావు. (4)
కథం చ జ్ఞాతయస్తాత శ్రేయాంసః సాధుసమ్మతాః।
అథాన్యాయ్యముపస్థాతుం జిహ్మేనాజిహ్మచారిణః॥ 5
నాయనా! అలా కాకపోతే సరళ స్వభావులై, సాధుసమ్మాన్యులైన నీ శ్రేష్ఠ బంధువులు పాండవులు ఇక్కడ నీవంటి కపటితో అన్యాయమైన జూదాన్ని ఆడటానికి సిద్ధపడతారా? (5)
అక్షద్యూతం మహాప్రాజ్ఞ సతాం మతివినాశనమ్।
అసతాం తత్ర జాయంతే భేదాశ్చ వ్యసనాని చ॥ 6
మహాప్రాజ్ఞా! జూదం సజ్జనుల బుద్ధిని కూడా నాశనమ్ చేయగలది. ఇక దుర్జనులకయితే కలహాలూ, కలతలూ కలుగుతాయి. (6)
తదిదం వ్యసనం ఘోరం త్వయా ద్యూతముఖం కృతమ్।
అసమీక్ష్య సదాచారాన్ సార్ధం పాపానుబంధనైః॥ 7
నీవు సదాచారాన్ని గుర్తించక, పాపాత్ములతో కలిసి తీవ్రమయిన కలతలకు కారణమైన ఈ ద్యూతక్రీడను ఏర్పాటుచేశావు. (7)
కశ్చాన్యో భ్రాతృభార్యాం వై విప్రకర్తుం తథార్హతి।
ఆనీయ చ సభాం వ్యక్తం యథోక్తా ద్రౌపదీ త్వయా॥ 8
ద్రౌపదిని సభకు పిలిపించి ఆమెతో నీవు మాటాడిన రీతిగా, అన్న భార్యతో అనుచితాలు మాటాడేవాడు ఇంకెవడైనా ఉంటాడా? (8)
కులీనా శీలసంపన్నా ప్రాణేభ్యోఽపి గరీయసీ।
మహిషీ పాండుపుత్రాణాం తథా వినికృతా త్వయా॥ 9
ఉన్నతవంశంలో పుట్టి, శీలసంపద కలిగి పాండవుల పట్టమహీషియై, వారి ప్రాణాలకన్న మిన్న అయిన ద్రౌపదినే నీవు అంతగా పరాభవించావు. (9)
జానంతి కురవస్సర్వే యథోక్తాః కురుసంసది।
దుఃశాసనేన కౌంతేయాః ప్రవ్రజంతః పరంతపాః॥ 10
శత్రుసంహారం చేయగల ఆ పాండవులు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు కౌరవసభలో దుశ్శాసనుడు వారితో పలికిన కఠోర వచనాలు కౌరవులందరికీ తెలుసు. (10)
సమ్యగ్వృత్తేష్వలుబ్ధేషు సతతం ధర్మచారిషు।
స్వేషు బంధుషు కః సాధుః చరేదేవమసాంప్రతమ్॥ 11
ఎల్లప్పుడూ ధర్మాన్ని పాటిస్తూ, పేరాసకు లోనుగాక చక్కని నడవడిగలిగిన బంధువుల దగ్గర మంచివాడెవడైనా అనుచితంగా ప్రవర్తిస్తాడా? (11)
నృశంసానామనార్యాణాం పురుషాణాం చ భాషణమ్।
కర్ణదుఃశాసనాభ్యాం చ త్వయా వ బహుశః కృతమ్॥ 12
నీవూ, కర్ణుడూ, దుశ్శాసనుడూ కలిసి ఎన్నోసార్లు క్రూరులూ, అనాగరకులూ, మాటాడినట్టు(పాండవులను గూర్చి) మాటాడారు. (12)
సహ మాత్రా ప్రదగ్ధుం తాన్ బాలకాన్ వారణావతే।
ఆస్థితః పరమం యత్నం న సమృద్ధం చ తత్ తవ॥ 13
నీవు వారణావతంలో బాలకులైన పాండవులను తల్లితో సహా తగులబెట్టాలని ఎంతో ప్రయత్నించావు. కానీ నీ ప్రయత్నం ఫలించలేదు. (13)
ఊషుశ్చ సుచిరం కాలం ప్రచ్ఛన్నాః పాండవాస్తదా।
మాత్రా సహైకచక్రాయాం బ్రాహ్మణస్య నివేశనే॥ 14
అప్పట్లో పాండవులు చాలా కాలం తల్లితోపాటు ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుని ఇంటిలో దాగి ఉండవలసివచ్చింది. (14)
విషేణ సర్పబంధైశ్చ యతితాః పాండవాస్త్వయా।
సర్వోపాయైర్వినాశాయ న సమృద్ధం చ తత్ తవ॥ 15
నీవు(భీమునకు) విషం పెట్టి, పాములతో కరిపించి.... అన్ని ఉపాయాలను వినియోగించి పాండవులను నాశనంచేయాలని ప్రయత్నించావు. అయితే ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. (15)
ఏవం బుద్ధిః పాండవేషు మిథ్యావృత్తిః సదా భవాన్।
కథం తే నాపరాధోఽస్తి పాండవేషు మహాత్మసు॥ 16
ఈ విధంగా పాండవుల విషయంలో నీవెప్పుడూ కపటంగానే ప్రవర్తించావు. అయినా మహాత్ములయిన ఆ పాండవుల విషయంలో నీ తప్పేమీ లేదా? (16)
యచ్చైభ్యో యాచమానేభ్యః పిత్ర్యమంశం న దిత్ససి।
తచ్చ పాప ప్రదాతాసి భ్రష్టైశ్వర్యో నిపాతితః॥ 17
పాపాత్ముడా! పాండవులు యాచిస్తుంటే పైతృకమయిన వారి రాజ్యభాగాన్ని వరికివ్వటానికి నిరాకరిస్తున్నావు. కానీ యుద్ధభూమిలో పడిపోయి. అధికారభ్రష్టుడవైనప్పుడు వారి భాగాన్నే వారికివ్వవలసివస్తుంది. (17)
కృత్వా బహూన్యకార్యాణి పాండవేషు నృశంసవత్।
మిథ్యావృత్తిరనార్యస్సన్ అద్య విప్రతిపద్యసే॥ 18
పాండవుల విషయంలో క్రూరుడిలాగా ఎన్నో అకార్యాలు చేసి నీ కపటతను, అనాగరకతనూ ప్రదర్శించి కూడా ఇప్పుడు ఆ తప్పులేవీ తెలియనట్టు మాటాడుతున్నావు. (18)
మాతాపితృభ్యాం భీష్మేణ ద్రోణేన విదురేణ చ।
శామ్యేతి ముహురుక్తోఽసి న చ శామ్యసి పార్థివ॥ 19
రాజా! నీ తల్లి, తండ్రి, భీష్ముడూ, ద్రోణుడూ, విదురుడు సంధి చేసికొమ్మని పదేపదే చెపుతున్నా నీవు సంధికి సిద్ధపడటం లేదు. (19)
శమే హి సుమహాన్ లాభః తవ పార్థస్య చోభయోః।
న చ రోచయసే రాజన్ కిమన్యద్ బుద్ధిలాఘవాత్॥ 20
రాజా! శాంతి వలన నీకూ, యుధిష్ఠిరునకూ - ఉభయపక్షాలకూ ఎంతో లాభముంటుంది. కానీ నీవు దాని నిష్టపడటం లేదు. అది నీ తెలివితక్కువతనమ్ కాక మరేమనగలం? (20)
న శర్మ ప్రాప్స్యసే రాజన్ ఉత్క్రమ్య సుహృదాం వచః।
అధర్మ్యమయశస్యం చ క్రియతే పార్థివ త్వయా॥ 21
రాజా! శ్రేయోభిలాషులయిన మిత్రుల మాటలను కాదని సుఖపడలేవు. నీవు ధర్మవిరుద్ధంగా అపకీర్తి కలిగేటట్టుగా ప్రవర్తిస్తున్నావు. (21)
వైశంపాయన ఉవాచ
ఏవం బ్రువతి దాశార్హే దుర్యోధనమమర్షణమ్।
దుఃశాసన ఇదం వాక్యమ్ అబ్రవీత్ కురుసంసది॥ 22
వైశంపాయనుడిలా అన్నాడు - అసహనశీలి అయిన దుర్యోధనునితో శ్రీకృష్ణుడు ఇలా అంటున్న సమయంలోనే కౌరవసభలో దుశ్శాసనుడు ఈ విధంగా పలికాడు. (22)
న చేత్ సంధాస్యసే రాజన్ స్వేన కామేన పాండవైః।
బద్ధ్వా కిల త్వాం దాస్యంతి కుంతీపుత్రాయ కౌరవాః॥ 23
రాజా! నీ అంతట నీవుగా పాండవులతో సంధిచేసికొనకపోతే కౌరవులే నిన్ను బంధించి యుధిష్ఠిరుని చేతిలో పెడతారేమో అనిపిస్తోంది. (23)
వైకర్తనం త్వాం చ మాం చ త్రీనేతాన్ మనుజర్షభ।
పాండవేభ్యః ప్రదాస్యంతి భీష్మో ద్రోణః పితా చ॥ 24
మనుజశ్రేష్ఠా! భీష్మపితామహుడూ, ద్రోణాచార్యుడూ, మన తండ్రి కలిసి కర్ణుడినీ, నిన్నూ, నన్నూ, ముగ్గురినీ పాండవుల వశం చేసేస్తారు. (24)
భ్రాతురేతద్వచః శ్రుత్వా ధార్తరాష్ట్రః సుయోధనః।
క్రుద్ధః ప్రాతిష్ఠతోత్థాయ మహానాగ ఇవ శ్వసన్॥ 25
విదురం ధృతరాష్ట్రం చ మహారాజం చ బాహ్లికమ్।
కృపం చ సోమదత్తం చ భీష్మం ద్రోణం జనార్దనమ్॥ 26
సర్వానేతాననాదృత్య దుర్మతిర్నిరపత్రపః।
అశిష్టవదమర్యాదః మానీ మాన్యావమానితా॥ 27
సోదరుడు పలికిన ఈ మాటలను విని ధార్తరాష్ట్రుడైన సుయోధనుడు కోపించి, పెనుపామువలె దీర్ఘనిశ్వాసాలను విడుస్తూ లేచి అక్కడనుండి బయలుదేరాడు. బుద్ధిహీనుడూ, లజ్జాహీనుడూ, పెద్దలను పరాభవించేవాడూ, మర్యాదలెరుగనివాడు, అభిమాని అయిన సుయోధనుడు అనాగరకునివలె విదుర, ధృతరాష్ట్ర, బాహ్లికమహారాక, కృప,సోమదత్త, భీష్మ, ద్రోణ, కృష్ణులను తృణీకరించి అక్కడనుండి వెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాడు. (25-27)
తం ప్రస్థితమభిప్రేక్ష్య భ్రాతరో మనుజర్షభమ్।
అనుజగ్ముః సహామాత్యాః రాజానశ్చాపి సర్వశః॥ 28
సుయోధనుడు నిష్క్రమించటాన్ని చూచి సోదరులూ, మంత్రులూ, రాజులూ అందరూ లేచి సుయోధనుణ్ణి అనుసరించారు. (28)
సభాయాముత్థితం క్రుద్ధం ప్రస్థితం భ్రాతృభిః సహ।
దుర్యోధనమభిప్రేక్ష్య భీష్మః శాంతనవోఽబ్రవీత్॥ 29
సభలో కోపంగా లేచి, సోదరులతో కూడా వెళ్ళిపోవటానికి బయలుదేరిన దుర్యోధనుని చూచి శంతనునందనుడైన భీష్ముడిలా అన్నాడు. (29)
ధర్మార్థావభిసంత్యజ్య సంరంభం యోఽనుమన్యతే।
హసంతి వ్యసనే తస్య దుర్హృదో న చిరాదివ॥ 30
ధర్మార్థాలను విడనాడి కోపాన్ని అనుసరించినవ్యక్తి అచిరకాలంలోనే కష్టాల పాలవుతాడు. అది చూచి శత్రువులంతా పరిహసిస్తారు. (30)
దురాత్మా రాజపుత్రోఽయం ధార్తరాష్ట్రో నుపాయకృత్।
మిథ్యాభిమానీ రాజ్యస్య క్రోధలోభవశానుగః॥ 31
ధృతరాష్ట్రుని కొడుకు ఈ దుర్యోధనుడు దురాత్ముడు. కానిదారిలో కార్యసిద్ధికి ప్రయత్నించేవాడు. క్రోధలోభాలకు లొంగినవాడు. తానే రాజు కావాలని నిరర్థకమైన అభిమానానికి లోనయినవాడు. (31)
కాలపక్వమిదం మన్యే సర్వం క్షత్రం జనార్దన।
సర్వే హ్యనుసృతా మోహాత్ పార్థివాః సహమంత్రిభిః॥ 32
జనార్దనా! క్షత్రియగణమంతా పండిన పండ్లవలె మృత్యు ముఖంలో పడబోతున్నారు. అందువలననే అందరూ తమ తమ మంత్రులతో సహా దుర్యోధనుని అనుసరిస్తున్నారు. (32)
భీష్మస్యాథ వచః శ్రుత్వా దాశార్హః పుష్కరేక్షణః।
భీష్మద్రోణముఖాన్ సర్వాన్ అభ్యభాషత వీర్యవాన్॥ 33
భీష్ముని మాటలను విని, పరాక్రమశాలి, పుండరీక నేత్రుడయిన శ్రీకృష్ణుడు భీష్మద్రోణాదులందరితో ఇలా అన్నాడు. (33)
సర్వేషాం కురువృద్ధానాం మహానయమతిక్రమః।
ప్రసహ్య మందమైశ్వర్యే న నియచ్ఛత యన్నృపమ్॥ 34
బుద్ధిహీనుడైన దుర్యోధనుని రాజును చేసి ఇప్పుడు బలవంతంగా అయినా అతనిని నియంత్రించలేకపోవటం కురువృద్ధులు అందరూ చేస్తున్న పెద్ద పొరపాటు. (34)
తత్ర కార్యమహం మన్యే కాలప్రాప్తమరిందమాః।
క్రియమానే భవేచ్ఛ్రేయః తత్ సర్వం శృణుతానఘాః॥ 35
అరిందములారా! అనఘులారా! దీనికి తగిన సమయోచిత మయిన కర్తవ్యాన్ని నేను ఆలోచిస్తున్నాను, నా మాటమేరకు చేస్తే అందరికీ మంచిది. వివరంగా చెప్తాను వినండి. (35)
ప్రత్యక్షమేతద్భవతాం యద్ వక్ష్యామి హితం వచః।
భవతామానుకూల్యేన యది రోచేత భారతాః॥ 36
భరతవంశస్థులారా! అంతా మీరు చూస్తూనే ఉన్నారు. హితవచనాన్ని చెప్పబోతున్నాను. అది అనుకూలంగా ఉన్నదని మీకనిపిస్తే నచ్చితే దానిని పాటించవచ్చు. (36)
భోజరాజస్య వృద్ధస్య దురాచారో హ్యనాత్మవాన్।
జీవతః పితురైశ్వర్యం హృత్వా మృత్యువశం గతః॥ 37
భోజరాజు ఉగ్రసేనుడు, ఆయన కొడుకు కంసుడు దురాచారుడు, నిగ్రహం లేనివాడు. తండ్రి వృద్ధుడై జీవించి ఉండగానే ఆయన అధికారాన్ని హరించి రాజయ్యాడు. తత్ఫలితంగా మరణించాడు. (37)
ఉగ్రసేనసుతః కంసః పరిత్యక్తః స బాంధవైః।
జ్ఞాతీనాం హితకామేన మయా శస్తో మహామృథే॥ 38
ఉగ్రసేనుని కొడుకయిన కంసుని బంధువులంతా విడిచిపెట్టారు. ఆ బంధువుల హితాన్ని కోరి నేను ఘోరయుద్ధంలో ఆ కంసుని సంహరించాను. (38)
ఆహుకః పునరస్మాభిః జ్ఞాతిభిశ్చాపి సత్కృతః।
ఉగ్రసేనః కృతో రాజా భోజరాజన్యవర్ధనః॥ 39
ఆ తరువాత జ్ఞాతులమయిన మేమంతా భోజవంశరాజుల ఔన్నత్యాన్ని వర్ధిల్లజేయగల ఆహుక ఉగ్రసేనుని సత్కారపూర్వకంగా రాజును చేశాం. (39)
కంసమేకం పరిత్యజ్య కులార్థే సర్వయాదవాః।
సంభూయ సుఖమేధంతే భారతాంధకవృష్ణయః॥ 40
భరతనందనా! వంశ సంరక్షణకై కంసుని ఒక్కని పరిత్యజించి అంధకవృష్ణివంశస్థులైన సర్వయాదవులూ ఒక్కటై సుఖంగా వృద్ధిపొందుతున్నారు. (40)
అపి చాప్యవదద్ రాజన్ పరమేష్ఠీ ప్రజాపతిః।
వ్యూఢే దేవాసురే యుద్ధేఽభ్యుద్యతేష్వాయుధేషు చ॥ 41
ద్వైధీభూతేషు లోకేషు వినశ్యత్సు చ భారత।
అబ్రవీత్ సృష్టిమాన్ దేవః దైతేయా దానవైస్సహ।
ఆదిత్యా వసవో రుద్రా భవిష్యంతి దివౌకసః॥ 43
దేవాసురమనుష్యాశ్చ గంధర్వోరగరాక్షసాః।
అస్మిన్ యుద్ధే సుసంక్రుద్ధా హనుష్యంతి పరస్పరమ్॥ 44
రాజా! ఇంతేకాదు. ఒకప్పుడు ప్రజాపతి అయిన బ్రహ్మ చెప్పిన దానినే చెప్తున్నాను. దేవాసురులు యుద్ధానికి సిద్ధపడి ఉన్నారు. ఆయుధాలనెత్తి పట్టారు. లోకమంతా రెండు ముక్కలుగా చీలి వినాశానికి సిద్ధమైంది. అప్పుడు సృష్టికర్త, లోకభావసుడైన బ్రహ్మ ఇలా అన్నారు. - ఈ యుద్ధంలో అసురదైత్యదానవులు ఓడిపోతారు. ఆదిత్యులు, వసువులు, రుద్రులు, మొదలయిన దేవతలు గెలుస్తారు. దేవతలు, అసురులు, మనుష్యులూ, గంధర్వులూ, నాగులు, రాక్షసులూ, ఒకరినొకరు చంపుకొంటారు. (41-44)
ఇతి మత్వాబ్రవీద్ ధర్మం పరమేష్ఠీ ప్రజాపతిః।
వరుణాయ ప్రయచ్ఛైతాన్ బద్ధ్వా దైతేయదానవాన్॥ 45
అని భావించిన పరమేష్ఠీ. ప్రజాపతి "ఈ దైతేయదానవులను బంధించి వరుణ దేవుని అధీనంలో ఉంచు" అని(యమ) ధర్మరాజును ఆదేశించాడు. (45)
ఏవముక్తస్తతో ధర్మః నియోగాత్ పరమేష్ఠినః।
వరుణాయ దదౌ సర్వాన్ బద్ధ్వా దైతేయదానవాన్॥ 46
బ్రహ్మ ఆ విధంగా ఆజ్ఞాపించిన తరువాత ధర్మరాజు పితామహునొ ఆజ్ఞననుసరించి దైతేయదానవుల నందరినీ బంధించి వరుణునికి అధీనం చేశాడు. (46)
తాన్ బద్ధ్వా ధర్మపాలశ్చ స్వైశ్చ పాశైర్జలేశ్వరః।
వరుణః సాగరే యత్తః నిత్యం రక్షతి దానవాన్॥ 47
జలాధిపతి అయిన వరుణుడు ధర్మపాశాలతోనూ, వరుణపాశాలతోనూ వారిని బంధించి సాగరంలో అనునిత్యమూ సావధానుడై దనవులను హద్దులలోనే నిలుపుతున్నాడు.(47)
తథా దుర్యోధనం కర్ణం శకునిం చాపి సౌబలమ్।
బద్ధ్వా దుఃశాసనం చాపి పాండవేభ్యః ప్రయచ్ఛథ॥ 48
అదే విధంగా దుర్యోధనునీ, కర్ణునీ, సౌబలుడైన శకునినీ, దుశ్శాసనునీ బంధించి పాండవుల వశం చేయండి. (48)
త్యజేత్ కులార్థే పురుషం గ్రామస్యార్థే కులం త్యజేత్।
గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్॥ 49
వంశంకోసం వ్యక్తినీ, గ్రామంకోశం వంశాన్నీ జనపదం కోసం గ్రామాన్నీ, తనకోసం భూమండలాన్ని అయినా వదిలివేయాలి. (49)
రాజన్ దుర్యోధనం బద్ధ్వా తతః సంశామ్య పాండవైః।
త్వత్కృతే న వినశ్యేయుః క్షత్రియాః పురుషర్షభ॥ 50
రాజా! దుర్యోధనుని బంధించి ఆ తర్వాత పాండవులతో సంధి చేసికో. పురుషశ్రేష్ఠా! నీ కారణంగా క్షత్రియులు నశించరాదు. (50)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి కృష్ణవాక్యే అష్టావింశత్యధికశతతమోఽధ్యాయః॥ 128 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున శ్రీకృష్ణవాక్యమను నూట ఇరువది యెనిమిదవ అధ్యాయము. (128)