127. నూట ఇరువది ఏడవ అధ్యాయము
శ్రీకృష్ణునకు దుర్యోధనుడు సమాధానమిచ్చుట.
వైశంపాయన ఉవాచ
శ్రుత్వా దుర్యోధనో వాక్యమ్ అప్రియం కురుసంసది।
ప్రత్యువాచ మహాబాహుం వాసుదేవం యశస్వినమ్॥ 1
వైశంపాయనుడిల అన్నాడు - కౌరవసభలో తనకు నచ్చని మాటలను విని దుర్యోధనుడు యశస్వీ, మహాబాహువూ అయిన శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు. (1)
ప్రసమీక్ష్య భవానేతద్ వక్తుమర్హతి కేశవ।
మామేవ హి విశేషేణ విభాష్య పరిగర్హసే॥ 2
శ్రీకృష్ణా! ఇటువంటి విషయాలు చక్కగా పరిశీలించి మాటాడాలి. కానీ నీవు నన్ను ప్రత్యేకంగా దోషిని చేసి మాటాడుతున్నావు. (2)
భక్తివాదేవ పార్థానామ్ అకస్మాన్మధుసూదన।
భవాన్ గర్హయతే నిత్యం కిం సమీక్ష్య బలాబలమ్॥ 3
మధుసూదనా! నీవు పాండవుల భక్తిభావానికి విలువనిచ్చి నిష్కారణంగా మమ్ములను నిందిస్తున్నావు. ఇది మా బలాబలాలను సమీక్షించి చేస్తున్నావా? (3)
భవాన్ క్షత్తా చ రాజా వాప్యాచార్యో వా పితామహః।
మామేవ పరిగర్హంతే నాన్యం కంచన పార్థివమ్॥ 4
నీవూ, విదురుడూ, మహారాజూ(ధృతరాష్ట్రుడు), ద్రోణుడూ, భీష్ముడూ అందరూ నన్నే నిందిస్తున్నారు. మరే రాజునూ ఏమీ అనటం లేదు. (4)
న చాహం లక్షయే కంచిద్ వ్యభిచారమిహాత్మనః।
అథ సర్వే భవంతో మాం విద్విషంతి సరాజకాః॥ 5
కానీ నాలో ఏదోషమూ నాకు కనిపించటంలేదు. అయినా ధృతరాష్ట్రమహారాజుతో సహా మీరంతా నన్నే నిందిస్తున్నారు. (5)
న చాహం కంచిదత్యర్థమ్ అపరాధమరిందమ।
విచింతయన్ ప్రపశ్యామి సుసూక్ష్మమపి కేశవ॥ 6
అరిందమా! కేశవా! నేను ఎంతో ఆలోచించి చూస్తున్నాను. అయినా నాకు నాలో సూక్ష్మాతిసూక్ష్మయిన తప్పుకూడా కనిపించటం లేదు. (6)
ప్రియాభ్యుపగతే ద్యూతే పాండవా మధుసూదన।
జితాః శకునినా రాజ్యం తత్ర కిం మమ దుష్కృతమ్॥ 7
మధుసూదనా! పాండవులకు జూదం ఇష్టం. అందుకని ఆడారు. శకుని వాళ్ళ రాజ్యాన్ని గెలుచుకున్నాడు. ఇందులో నా తప్పేముంది? (7)
యత్ పునర్ద్రవిణం కించిత్ తత్రాజీయంత పాండవాః।
తేభ్య ఏవాభ్యనుజ్ఞాతం తత్ తదా మధుసూదన॥ 8
మధుసూదనా! పాండవులు జూదంలో పోగొట్టుకొన్న ధనాన్ని అంతా అప్పుడే వారికి తిరిగి ఇచ్చాము. (8)
అపరాధో న చాస్మాకం యత్ తే ద్యూతే పరాజితాః।
అజేయా జయతాం శ్రేష్ఠ పార్థాః ప్రవ్రాజితా వనమ్॥ 9
జయశీలా! అజేయులయిన పాండవులు జూదంలో ఓడి పోయి అరణ్యాలకు వెళ్ళవలసివస్తే అందులో మా తప్పేమున్నది. (9)
కేన వాప్యపరాధేన విరుధ్యంత్యరిభిః సహ।
అశక్తాః పాండవాః కృష్ణ ప్రహృష్టాః ప్రత్యమిత్రవత్॥ 10
కృష్ణా! మేము ఏం తప్పు చేశామని అశక్తులయిన ఆ పాండవులు శత్రువులతో కలిసి మమ్ము ద్వేషిస్తున్నారు. పైపెచ్చు సహజశత్రువులవలె ఆనందంగా ఉన్నారు. (10)
కిమస్మాభిః కృతం తేషాం కస్మిన్ వా పునరాగసి।
ధార్తరాష్ట్రాన్ జిఘాంసంతి పాండవాః సృంజయైస్సహ॥ 11
మేము వారికేం అపకారం చేశాం? మేము ఏ తప్పు చేశామని ఆ పాండవులు సృంజయులతో కలిసి మమ్ము చంపాలనుకొంటున్నారు? (11)
న చాపి వయముగ్రేణ కర్మణా వచనేన వా।
ప్రభ్రష్టాః ప్రణమామేహ భయాదపి శతక్రతుమ్॥ 12
తీక్ష్ణమయిన మాటలకో చేతలకో భయపడి మేము క్షత్రధర్మాన్ని వీడి సాక్షాత్తూ ఇంద్రుని దగ్గర అయినా తలవంచలేము. (12)
న చ తం కృష్ణ పశ్యామి క్షత్రధర్మమమష్ఠితమ్।
ఉత్సహేత యుధా జేతుం యో నః శత్రునిబర్హణ॥ 13
శత్రుసంహారా! శ్రీకృష్ణా! యుద్ధంలో మమ్ములనందరినీ జయించాలని సాహసం చేసే క్షత్రియవీరుడు నాకింతవరకు కనిపించలేదు. (13)
న హి భీష్మకృపద్రోణాః సకర్ణా మధుసూదన।
దేవైరపి యుధా జేతుం శక్యాః కిముత పాండవైః॥ 14
మధుసూదనా! భీష్మకృపద్రోణకర్ణులను యుద్ధంలో గెలవటం దేవతలకు కూడా శక్యంకాదు. ఇక పాండవుల విషయంలో చెప్పేదేముంటుంది. (14)
స్వధర్మమనుపశ్యంతః యది మాధవ సంయుగే।
అస్త్రేణ నిధనం కాలే ప్రాప్స్యామః స్వర్గ్యమేవ తత్॥ 15
మాధవా! స్వధర్మంమీధనే దృష్టి నుంచి యుద్ధంలో ఏదో సమయంలో ఆయుధాల దెబ్బలకు ఒకవేళ మేము మరణించవచ్చు. అప్పుడయినా స్వర్గప్రాప్తి కలుగుతుంది. (15)
ముఖ్య శ్పైవైష నో ధర్మః క్షత్రియాణాం జనార్దన।
యచ్ఛయీమహే సంగ్రామే శరతల్పగతా వయమ్॥ 16
జనార్దనా! రణరంగంలో మేము ఒకవేళ అంపశయ్యపై పడుకొన వలసివచ్చినా అది క్షత్రియులమైన మాకు ప్రధానధర్మమే. (16)
తే వయం వీరశయనం ప్రాప్స్యామో యది సంయుగే।
అప్రణమ్యైవ శత్రూణాం న న స్తప్స్యంతి మాధవ॥ 17
మాధవా! ఒకవేళ మేము యుద్ధంలో శత్రువులకు లొంగక వీరమరణాన్ని పొందినా మావాళ్ళెవ్వరూ బాధపడరు. (17)
కశ్చ జాతు కులే జాతః క్షత్రధర్మేణ వర్తయన్।
భయాద్ వృత్తిం సమీక్ష్యైవం ప్రణమేదిహ కర్హిచిత్॥ 18
ఉత్తమవంశంలో పుట్టి క్షత్రియధర్మాన్ని అనుసరిస్తూ ఈ విధంగా భయపడి ఎక్కడైనా, ఎప్పుడైనా శత్రువులకు తలవంచే వీరు డుంటాడా? (18)
ఉద్యచ్ఛేదేవ న నమేద్ ఉద్యమో హ్యేవ పౌరుషమ్।
అప్యపర్వణి భజ్యేత న నమేదిహ కర్హిచిత్॥ 19
వీరుడు ఉద్యమించాలే కానీ లొంగిపోకూడదు. ఉద్యమమే పౌరుషం. మంచిరోజు కానప్పుడు నష్టపోవచ్చు. కానీ ఎప్పుడూ శత్రువులకు తలవంచకూడదు. (19)
ఇతి మాతంగవచనం పరీప్సంతి హితేప్సవః।
ధర్మాయ చైవ ప్రణమేద్ బ్రాహ్మణేభ్యశ్చ మద్విధః॥ 20
తమ శ్రేయస్సును కోరుకొనే వారెవరైనా ఈ మాతంగముని వచనాన్నే పాటిస్తారు. నావంటివాడు ధర్మం దగ్గర బ్రాహ్మణులదగ్గర మాత్రమే తలవంచుతాడు. (20)
అచింతయన్ కంచిదన్యం యావజ్జీవం తథాఽఽచరేత్।
ఏష ధర్మః క్షత్రియాణాం మతమేతచ్చ మే సదా॥ 21
మరో ఆలోచన లేకుండా జీవితాంతమూ ఇటువంటి ఆలోచనతోనే(ఉద్యమంతోనే) ఉండాలి. అదే క్షత్రియధర్మం. నా అభిప్రాయం కూడా అదే. (21)
రాజ్యాంశశ్చాభ్యనుజ్ఞాతః యో మే పిత్రా పురాభవత్।
న స లభ్యః పునర్జాతు మయి జీవతి కేశవ॥ 22
కేశవ! మా తండ్రి గతంలో నాకిచ్చిన రాజ్యభాగాన్ని నేను జీవించివుండగా మరెవ్వరూ పొందలేరు. (22)
యావచ్చ రాజా ధ్రియతే ధృతరాష్ట్రో జనార్దన।
న్యస్తశస్త్రా వయం తే వాప్యుపజీవామ మాధవ।
అప్రదేయం పురా దత్తం రాజ్యం పరవతో మమ॥ 23
అజ్ఞానాద్ వా భయాద్ వాపి మయి బాలే జనార్దన।
న తదద్య పునర్లభ్యం పాండవైర్వృష్ణినందన॥ 24
జనార్దనా! ధృతరాష్ట్రమహారాజు జీవించినంతకాలం మేమైనా, వారైనా కత్తులు దూయక ప్రశాంతంగా జీవించాలి. వృష్ణినందనా! మొట్టమొదట పాండవులకు రాజ్యభాగమిచ్చారు. ఆనాడే అది తగని పని. కానీ నేనప్పటికి బాలుణ్ణి పరాధీనుణ్ణి. అజ్ఞానం వలననో, భయంవల్లనో నాడు మా తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని మరల ఈనాడు పాండవులకు ఇవ్వడం దుర్లభం. (23-24)
ధ్రియమాణే మహాబాహౌ మయి సంప్రతి కేశవ।
యావద్ధి తీక్ష్ణయా సూచ్యా విధ్యేదగ్రేణ కేశవ।
తావదప్యపరిత్యాజ్యం భూమేర్నః పాండవాన్ ప్రతి॥ 25
కేశవా! ఇప్పుడు మహాబాహుడనైన నేను జీవించి ఉండగా వాడిసూదిమొన మోపినంత భూభాగాన్ని కూడా పాండవులకు వదలను. (25)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి దుర్యోధనవాక్యే సప్తవింశత్యధికశతతమోఽధ్యాయః॥ 127 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున దుర్యోధన వాక్యమను నూట ఇరువది యేడవ అధ్యాయము. (127)