100. నూరవ అధ్యాయము

హిరణ్యపుర దర్శనము - వర్ణనము.

నారద ఉవాచ
హిరణ్యపురమిత్యేతత్ ఖ్యాతం పురవరం మహత్।
దైత్యానాం దానవానాం చ మాయాశతవిచారిణామ్॥ 1
నారదుడిలా అన్నాడు - వందలకొలదీ మాయలతో సంచరించే దైత్యదానవుల స్థానమిది, హిరణ్యపురం. ఇది విశాలమైన గొప్పనగరంగా ప్రసిద్ధి చెందింది. (1)
అనల్పేన ప్రయత్నేన నిర్మితం విశ్వకర్మణా।
మయేన మనసా సృష్టం పాతాలతలమాశ్రితమ్॥ 2
అసురుల విశ్వకర్మ అయిన మయుడు మనస్సంకల్పాన్ని అనుసరించి గట్టి ప్రయత్నంలో పాతాళలోకంలో ఈ నగరాన్ని నిర్మించాడు. (2)
అత్ర మాయా సహస్రాణి వికుర్వాణా మహౌజసః।
దానవా నివసంతి స్మ శూరా దత్తవరాః పురా॥ 3
వేలకొలదిగ మాయలను ప్రయోగించ గల బలపరాక్రమసంపన్నులు, శూరులూ అయిన దానవులు నివసిస్తున్నారు. వారికి చావులేకుండా ఉండే వరముంది. (3)
నైతే శక్రేణ నాన్యేన యమేన వరుణేన వా।
శక్యంతే వశమానేతుం తథైవ ధనదేవ చ॥ 4
ఇంద్రుడూ, యముడూ, వరుణుడూ, కుబేరుడూ మరెవ్వరు గానీ వీరిని లొంగదీసికొనజాలరు. (4)
అసురాః కాలఖంజాశ్చ తథా విష్ణుపదోద్భవాః।
నైరృతా యాతుధానాశ్చ బ్రహ్మపాదోద్భవాశ్చ యే॥ 5
దంష్ట్రిణో భీమవేగాశ్చ వాతవేగపరాక్రమాః।
మాయావీర్యోపసంపన్నాః నివసంత్యత్ర మాతలే॥ 6
మాతలీ! పూజ్యుడైన విష్ణువు పాదాల నుండి పుట్టిన కాలఖంజులనే రాక్షసులూ, బ్రహ్మపాదాల నుండి పుట్టిన నైరృత, యాతుధానులూ ఈ నగరంలో నివసిస్తారు. ఈ నైరృతయాతుధానులు పెద్దపెద్దకోరలు గలవారు. వాయువేగంతో పరాక్రమించగలవారూ, మాయాబలసంపన్నులూ. (5-6)
నివాతకవచా నామ దానవా యుద్ధదుర్మదాః।
జానాసి చ యథా శక్రః నైతాన్ శక్నోతి బాధితుమ్॥ 7
యుద్ధోన్మాదం గల నివాత కవచులనే దానవుల నివాసం ఇదే. ఇంద్రుడయినా వీరిని బాధించలేడు. నీకు తెలుసుగదా! (7)
బహుశో మాతలే త్వం చ తవ పుత్రశ్చ గోముఖః।
నిర్భగ్నో దేవరాజశ్చ సహపుత్రః శచీపతిః॥ 8
మాతలీ! నీవూ, నీ కుమారుడు గోముఖుడూ, శచీపతి అయిన ఇంద్రుడూ, ఆయన కొడుకూ ఎన్నోసార్లు నివాతకవచుల ముందు నిలువలేకపోయారు. (8)
పశ్య వేశ్మాని రౌక్మాణి మాతలే రాజతాని చ।
కర్మణా విధియుక్తేన యుక్తాన్యుపగతాని చ॥ 9
మాతలీ! ఈ బంగారు వెండిమేడల శోభను చూడు. ఇవన్నీ శాస్త్రీయ విధానంతో నిర్మింపబడి ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. (9)
వైడూర్యమణిచిత్రాణి ప్రవాలరుచిరాణి చ।
అర్కస్ఫటికశుభ్రాణి వజ్రసారోజ్జ్వలాని చ॥ 10
ఈ భవనాలు వైడూర్యమణులు పొదిగినవి. అందమైనవి, పగడాలను కూడా అలంకరించటంతో మరీ అందంగా ఉన్నాయి. జిల్లేడుపూలు, స్ఫటికమణుల లాగా స్వచ్ఛమైన వజ్రాలతో అలంకరింపబడి ప్రకాశిస్తున్నాయి. (10)
పార్థివానీవ చాభాంతి పద్మరాగమయాని చ।
శైలానీవ చ దృశ్యంతే దారవాణీవ చాప్యుత॥ 11
కొన్ని ఇళ్ళు మట్టితో కట్టినట్లున్నాయి. కొన్ని పద్మరాగనిర్మితాలు. కొన్ని కొండరాళ్ళతోనూ, మరికొన్ని కొయ్యతోనూ నిర్మింపబడినవి. (11)
సూర్యరూపాణి చాభాంతి దీప్తాగ్నిసదృశాని చ।
మణిజాలవిచిత్రాణి ప్రాంశూని నిబిడాని చ॥ 12
కొన్ని ఇళ్ళు సూర్యుడిలాగా, మరికొన్ని జ్వలించే అగ్నిలాగా కనిపిస్తున్నాయి. మణుల తోరణాలతో విచిత్రకాంతి గలిగిన ఇవి చాలా ఎత్తుగా దట్టంగా కనిపిస్తున్నాయి. (12)
నైతాని శక్యం నిర్దేష్టుం రూపతో ద్రవ్యతస్తథా।
గుణతశ్పైవ సిద్ధాని ప్రమాణగుణవంతి చ॥ 13
ఈ భవనాలు ఎంత అందమైనవో, ఏ పదార్థాలతో నిర్మింపబడినవో చెప్పటం చాలా కష్టం. తమ స్థాయిని బట్టి ఇవి ప్రసిద్ధమయినవి. నిర్మాణ ప్రమాణాలను బట్టి కూడా ఇవి ప్రశంసాపాత్రమైనవి. (13)
ఆ క్రీడాన్ పశ్య దైత్యానాం తథైవ శయనామ్యత।
రత్నవంతి మహార్హాణి భాజనాన్యాసనాని చ॥ 14
ఈ దైత్యులు ఉద్యానాలు, క్రీడాస్థలాలూ చాలా అందమైనచి. శయ్యలు కూడా తదనుగుణమైనవే. వీరు వాడే పాత్రలూ, ఆసనాలూ కూడా రత్నమయూలై గొప్పవిలువ గలవి. (14)
జలదాభాంస్తథా శైలాన్ తోయప్రస్రవణాని చ।
కామపుష్పఫలాంశ్చాపి పాదపాన్ కామచారిణః॥ 15
ఇక్కడి పర్వతాలు మేఘసముదాయంలా కనిపిస్తున్నాయి. వాటుపైనుండి సెలయేళ్ళు పడుతున్నాయి. ఇక్కడి చెట్లను చూడు. అవి కోరుకొన్న పూలనూ, పండ్లనూ ఇస్తాయి. స్వేచ్ఛగా చరిస్తాయి. (15)
మాతలే కశ్చిదత్రాపి రుచిరస్తే వరో భవేత్।
అథవాన్యాం దిశం భూమేః గచ్ఛావ యది మన్యసే॥ 16
మాతలీ! ఇక్కడ కూడా నీకు నచ్చే వరుడెవరైనా ఉండవచ్చు. నీవు కావాలంటే ఈ ప్రదేశంలోనే మరో దిక్కుకు పోదాం. (16)
మాతలిస్త్వబ్రవీదేనం భాషమాణం తథావిధమ్।
దేవర్షే నైవ మే కార్యమ్ విప్రియం త్రిదివౌకసామ్॥ 17
అలా మాటాడుతున్న నారదుని మాటలు విని మాతలి ఇలా అన్నాడు - దేవర్షీ! దేవతలకు నచ్చని పని ఏదీ నేను చేయను. (17)
నిత్యానుషక్తవైరా హి భ్రాతరో దేవదానవాః।
పరపక్షేణ సంబంధం రోచయిష్యామ్యహం కథమ్॥ 18
సోదరులయిన దేవతలూ, దానవులూ ఎప్పుడూ శత్రుత్వాన్ని వహించి ఉండేవారు. శత్రుపక్షంలో వియ్యమందటం నాకెలా నచ్చుతుంది? (18)
అన్యత్ర సాధు గచ్ఛావః ద్రష్టుం నార్హామి దానవాన్।
జానామి తవ చాత్మానం హింసాత్మకమనం తథా॥ 19
మరో తావునకు వెళ్ళటమే మంచిది. దానవులను చూడాలనిపించటం లేదు. ఏదో గొడవకు దారి తీయటానికి నీ మనస్సు కోరుకొంటోందని కూడా నాకు తెలుసు. (19)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి మాతలివరాన్వేషణే శతతమోఽధ్యాయః॥ 100 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున మాతలి వరాన్వేషణ మను నూరవ అధ్యాయము. (100)