99. తొంబది తొమ్మిదవ అధ్యాయము
నారద మహర్షి పాతాళలోకమును చూపుట.
నారద ఉవాచ
ఏతత్ తు నాగలోకస్య నాభిస్థానే స్థితం పురమ్।
పాతాళమితి విఖ్యాతం దైత్యదానవసేవితమ్॥ 1
ఇదమద్భిః సమం ప్రాప్తా యే కేచిద్ భువి జంగమాః।
ప్రవిశంతో మహానాదం నదంతి భయపీడితాః॥ 2
నారదుడిలా అన్నాడు - నాగలోకానికి నాభిస్థానంలో(మధ్య భాగంలో) ఉన్న ఈ నగరం పాతాళమన్న పేరుతో ప్రసిద్ధం. ఇక్కడ దైత్యులూ, దానవులూ నివసిస్తారు. భూలోకంలోని జంగమప్రాణులు నీటితోపాటు కొట్టుకొని వచ్చి ఈ నగరానికి చేరగానే భయపీడితులై పెద్దగా అరుస్తారు. (1,2)
అత్రాసురోఽగ్నిః సతతం దీప్యతే వారిభోజనః।
వ్యాపారేణ ధృతాత్మానం నిబద్ధం సమబుధ్యత॥ 3
నీటిని ఆహారంగా స్వీకరించే ఆసురాగ్ని ఇక్కడ ఎప్పుడూ మండుతుంటుంది. ప్రయత్నపూర్వకంగా అది హద్దులో నిలుపబడింది. దేవతలద్వారా నియంత్రింపబడిన ఆ అగ్ని ఎప్పుడూ వ్యాపించదు. (3)
అత్రామృతం సురైః పీత్వా నిహితం నిహతారిభిః।
అతః సోమస్య హానిశ్చ వృద్ధిశ్పైవ ప్రదృశ్యతే॥ 4
దేవతలు శత్రువులను సంహరించి అమృతాన్ని సేవించి మిగిలిన దానిని ఇక్కడ భద్రపరచుకొన్నారు. అందువలన అమృతమయమైన సోమం నశించినా మరలా పెరుగుతూ ఉంటుంది. (4)
అత్రాదిత్యో హయశిరాః కాలే పర్వణి పర్వణి।
ఉత్తిష్ఠతి సువర్ణాఖ్యః వాగ్భిరాపూరయన్ జగత్॥ 5
ఇక్కడ అదితినందనుడైన హయగ్రీవ విష్ణువు సువర్ణమయకాంతిధారియై ప్రతి పర్వమునందునూ వేదధ్వనులతో జగత్తును నింపుతూ పైకి లేస్తాడు. (5)
యస్మాదలం సమస్తాస్తాః పతంతి జలమూర్తయః।
తస్మాత్ పాతాళమిత్యేవ ఖ్యాయతే పురముత్తమమ్॥ 6
జలస్వరూపం గల సమస్తవస్తువులూ పూర్ణరూపంతో ఇక్కడ పడుతుంటాయి. అందుకే ఈ శ్రేష్ఠనగరానికి పాతాళమని పేరు. (6)
ఐరావణోఽస్మాత్ సలిలం గృహీత్వా జగతో హితః।
మేఘేష్వాముంచతే శీతం యన్మహేంద్రః ప్రవర్షతి॥ 7
లోకాలకు మేలు చేయటానికై సముద్రం నుండి పుట్టే వర్షాకాలపు గాలి ఇక్కడ నుండి చల్లని నీటిని కొనిపోయి మేఘాల్లో నిలుపుతుంది. దానిని దేవేంద్రుడు వర్షంగా కురిపిస్తాడు. (7)
అత్ర నానావిధాకారాః తిమయో నైకరూపిణః।
అప్సు సోమప్రభాం పీత్వా వసంతి జలచారిణః॥ 8
రకరకాల ఆకారాలు, అనేక రూపాలూ గల జలచరాలయిన తిమింగలాలు ఇక్కడ చంద్రకిరణాలను త్రాగి నీటిలో నివసిస్తుంటాయి. (8)
అత్ర సూర్యాంశుభిర్భిన్నాః పాతాలతలమాశ్రితాః।
మృతా హి దివసే సూత పునర్జీవంతి వై నిశి॥ 9
మాతలీ! ఈ పాతాళ వాసులయిన ప్రాణులు పగలు సూర్యకిరణతాపం వలన మృత ప్రాయాలవుతాయి. కాని రాత్రి అమృతమయమైన చంద్రకిరణాల స్పర్శవలన మరల లేస్తుంటాయి. (9)
ఉదయన్ నిత్యశశ్చాత్ర చంద్రమా రశ్మిబాహుభిః।
అమృతం స్పృశ్య సంస్పర్శాత్ సంజీవయతి దేహినః॥ 10
ఇక్కడ ప్రతిదినమూ ఉదయిస్తున్న చంద్రుడు తన కిరణాలనే బాహువులతో అమృతాన్ని తాకి, ఆకిరణ స్పర్శతో మృత్యుముఖంలో ఉన్న ప్రాణులను ఉజ్జీవింపజేస్తాడు. (10)
అత్ర తేఽధర్మనిరతాః బద్ధాః కాలేన పీడితాః।
దైతేయా నివసంతి స్మ వాసవేన హృతశ్రియః॥ 11
అధర్మపరాయణులయిన దైత్యులు తమ సంపదలను దేవేంద్రునిచేత కోలుపోయి, కాలానికి లొంగి, బాధలుపడుతూ ఈ పాతాళంలోనే నివసిస్తుంటారు. (11)
అత్ర భూతపతిర్నామ సర్వభూతమహేశ్వరః।
భూతయే సర్వభూతానామ్ అచరత్ తప ఉత్తమమ్॥ 12
సర్వభూతమహేశ్వరుడయిన భూతనాథుడు సమస్తప్రాణుల సమృద్ధికై ఇక్కడ ఘోరమైన తపస్సు చేశాడు. (12)
అత్ర గోవ్రతినో విప్రాః స్వాధ్యాయామ్నాయకర్శితాః।
త్యక్తప్రాణా జితస్వర్గాః నివసంతి మహర్షయః॥ 13
వేదాధ్యయనం చేత కృశించి, ప్రాణాలను కూడా లెక్కచేయకుండా స్వర్గలోకాన్ని జయించిన బ్రాహ్మణమహర్షిగణం గోవ్రతాన్ని స్వీకరించి ఇక్కడే నివసిస్తుంటుంది. (13)
యత్ర తత్ర శయో నిత్యం యేన కేవచిదాశితః।
యేన కేనచిదాచ్ఛన్నః స గోవ్రత ఇహోచ్యతే॥ 14
ఎక్కడ అవకాశముంటే అక్కడ నిదురించటం, ఏది దొరికితే దానినే తినటం, ఎటువంటి వస్త్రాలు లభిస్తే వాటినే ధరించటం - ఇది గోవ్రత స్వరూపం. (14)
ఐరావణో నాగరాజః వామనః కుముదోఽంజనః।
ప్రసూతాః సుప్రతీకస్య వంశే వారణసత్తమాః॥ 15
గజరాజయిన ఐరావతమూ, వామనమూ, కుముదమూ, అంజనమూ అనుపేర్లతో ప్రసిద్ధికెక్కిన గొప్పగొప్ప ఏనుగులు, సుప్రతీక వంశంలో పుట్టినవి, ఇక్కడ ఉన్నాయి. (15)
పశ్య యద్యత్ర తే కశ్చిద్ రోచతే గుణతో వరః।
వరయిష్యామి తం గత్వా యత్నమాస్థాయ మాతలే॥ 16
మాతలీ! చూడు, ఇక్కడ గుణవంతుడైన వరుడుగా నీకెవరయినా నచ్చితే ప్రయత్నపూర్వకంగా నేను పోయి వరించి తెస్తాను. (16)
అండమేతజ్జలే న్యస్తం దీప్యమానమివ శ్రియా।
ఆప్రజానాం నిసర్గాన్ వై నోద్భిద్యతి న సర్పతి॥ 17
చూడు. ఇక్కడ నీటిలో ఒక గ్రుడ్డు ఉంది. అది తన కాంతితో ప్రకాశిస్తోంది. సృష్టి ప్రారంభం నుండి ఇది ఇక్కడ ఇలాగే ఉంది. బ్రద్దలు కాదు, కదలదు. (17)
నాస్య జాతిం నిసర్గం వా కథ్యమానం శృణోమి వై।
పితరం మాతరం చాపి నాస్య జానాతి కశ్చన॥ 18
దీని జాతిని గురించి కానీ, స్వభావాన్ని గురించి కానీ ఎవ్వరూ చెప్పగా నేను వినలేదు. దీని తల్లిదండ్రులను గురించి కూడా ఎవరికీ, ఏమీ తెలియదు. (18)
అతః కిల మహానగ్నిః అంతకాలే సముత్థితః।
ధక్ష్యతే మాతలే సర్వం త్రైలోక్యం సచరాచరమ్॥ 19
మాతలీ! ప్రళయకాలంలో ఈ గ్రుడ్డు నుండి మహాగ్ని పుట్టి చరాచర ప్రాణులతో సహా మూడులోకాలనూ దహించి వేస్తుందని అంటుంటారు. (19)
మాతలిస్త్వబ్రవీత్ శ్రుత్వా నారదస్యాథ భాషితమ్।
న మేఽత్ర రోచతే కశ్చిద్ అన్యతో వ్రజ మాచిరమ్॥ 20
నారదుని మాటలు విని మాతలి ఇలా అన్నాడు - ఇక్కడ నాకు ఒక్కడూ నచ్చలేదు. వెంటనే మరెక్కడకయినా పద. (20)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగ పర్వణి భగవద్యానపర్వణి మాతలి వరాన్వేషణే ఏకోనశతతమోఽధ్యాయః॥ 99 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యానపర్వమను ఉపపర్వమున మాతలివరాన్వేషణమను తొంబది తొమ్మిదవ అధ్యాయము. (99)