98. తొంబది ఎనిమిదవ అధ్యాయము

మాతలి నారదునితో కలిసి వరుణలోకమున ఆశ్చర్యకర వస్తువులను చూచుట.

కణ్వ ఉవాచ
మాతలిస్తు వ్రజన్ మార్గే నారదేవ మహర్షిణా।
వరుణం గచ్ఛతా ద్రష్టుం సమాగచ్ఛద్ యదృచ్ఛయా॥ 1
కణ్వుడిలా అన్నాడు. మాతలి దారిలో నడుస్తూ అనుకోకుండా నారదమహర్షిని కలిశాడు. అప్పుడు నారదుడు వరుణుని దర్శనానికై వెళుతున్నాడు. (1)
నారదోఽథాబ్రవీదేనం క్వ భవాన్ గంతుముద్యతః।
స్వేన వా సూత కార్యేణ శాసనాద్ వా శతక్రతోః॥ 2
అపుడు నారదుడు "దేవసారథీ! ఎక్కడకు వెళ్తున్నావు? సొంతపని మీద వెళ్తున్నావా లేక ఇంద్రుని ఆదేశంతో వెళ్తున్నావా?" అని అడిగాడు. (2)
మాతలి ర్నారదేనైవం సంపృష్టః పథి గచ్ఛతా।
యథావత్ సర్వమాచష్ట స్వకార్యం నారదం ప్రతి॥ 3
దారిలో ప్రయాణిస్తున్న నారదుడు ఆ విధంగా అడగగా మాతలి తన పనిని గురించి పూర్తిగా ఉన్నదున్నట్లుగా నారదునికి చెప్పాడు. (3)
తమువాచాథ స మునిః గచ్ఛావః సహితవితి।
సలిలేశాదిదృక్షార్థమ్ అహమప్యుద్యతో దివః॥ 4
అప్పుడు నారదమహర్షి మాతలితో ఇలా అన్నాడు. కలిసివెళదాం. నేను కూడా వరుణ దర్శనంకోసం స్వర్గలోకం నుండి వస్తున్నాను. (4)
అహం తే సర్వమాఖ్యాస్యే దర్శయన్ వసుధాతలమ్।
దృష్ట్వా తత్ర వరం కంచిద్ రోచయిష్యావ మాతలే॥ 5
నేను నీకు భూలోకానికి క్రింద ఉన్న సమస్తలోకాలనూ చూపిస్తూ అక్కడున్న అన్నింటినీ పరిచయం చేస్తాను. మాతలీ! తగిన వరుని ఎవరినైనా చూచి ఎన్నుకొందాం. (5)
అవగాహ్య చ తౌ భూమిమ్ ఉభౌ మాతలినారదౌ।
దదృశాతే మహాత్మానౌ లోకపాలమపాంపతిమ్॥ 6
ఆ తరువాత మహాత్ములు ఆ నారద మాతలులిద్దరూ భూమి క్రిందకు పోయి లోకపాలకుడైన వరుణుని దర్శనం చేశారు. (6)
తత్ర దేవర్షిసదృశీం పూజాం స ప్రాప నారదః।
మహేంద్రసదృశీం చైవ మాతలిః ప్రత్యపద్యత॥ 7
అక్కడ దేవమునికి తగినట్లుగా నారదుడూ, దేవేంద్రునితో సమానంగా మాతలీ పూజా సత్కారాలను పొందారు. (7)
తావుభౌ ప్రీతమనసౌ కార్యవంతౌ నివేద్య హ।
వరుణేనాభ్యనుజ్ఞాతౌ నాగలోకం విచేరతుః॥ 8
ఆ మాతలినారదు లిద్దరూ ఆనందించి తమ పనిని ఆయనకు నివేదించి, ఆయన అనుమతితో నాగలోకంలో తిరుగసాగారు. (8)
నారదః సర్వభూతానామ్ అంతర్భూమినివాసినామ్।
జానంశ్చకార వ్యాఖ్యానం యంతుః సర్వమశేషతః॥ 9
నారదునకు పాతాళలోకంలో నివసిస్తున్న సర్వప్రాణులను గురించీ తెలుసు. ఆయన మాతలికి అక్కడి సమస్తవిషయాలనూ, సమగ్రంగా చెప్పనారంభించాడు. (9)
నారద ఉవాచ
దృష్టస్తే వరుణః సూత పుత్రపౌత్రసమావృతః।
పశ్యోదకపతేః స్థానం సర్వతో భద్రమృద్ధిమత్॥ 10
నారదుడిలా అన్నాడు. సారథీ! పుత్రులూ, పౌత్రులూ చుట్టు ముట్టి ఉన్న వరుణుని చూశావు కదా! చూడు ఇది సర్వసంపత్సమేత మయిన వరుణుని నివాసస్థానం. దీనిపేరు సర్వతోభద్రం. (10)
ఏష పుత్రో మహాప్రజ్ఞః వరుణస్యేహ గోపతేః।
ఏష వై శీలవృత్తేన శౌచేన చ విశిష్యతే॥ 11
ఈయన గోపతి అయిన వరుణుని కొడుకు. మహాప్రాజ్ఞావంతుడు. తన శీలం, తన నడవడి, తన పవిత్రత కారణంగా విశిష్టస్థానాన్ని పొందినవాడు. (11)
ఏషోఽస్య పుత్రోఽభిమతః పుష్కరః పుష్కరేక్షణః।
రూపవాన్ దర్శనీయశ్చ సోమపుత్ర్యా వృతః పతిః॥ 12
ఈతడు వరుణదేవుని ప్రియపుత్రుడు, థామరపూలవంటి కన్నులు కలవాడు, అందగాడు, చూడముచ్చటయిన వాడు. పేరు పుష్కరుడు, సోముని కుమార్తె ఈయనను భర్తగా వరించింది. (12)
జ్యోత్స్నాకాలీతి యామాహుః ద్వితీయాం రూపతః శ్రియమ్।
అదిత్యాశ్పైవ యః పుత్ర జ్యేష్ఠః కృతః స్మృతః॥ 13
సోముని రెండవ కూతురు జ్యోత్స్నాకాలి. రూపంలో మరొక లక్ష్మివంటిది. అదితి పెద్ద కొడుకైన సూర్యుని భర్తగా స్వీకరించింది. (13)
భవనం వారుణం పశ్య యదేతత్ సర్వకాంచనమ్।
యత్ ప్రాప్య సురతాం ప్రాప్తాః సురాః సురపతేః సఖే॥ 14
ఇంద్రుని చెలికాడా! మొత్తం బంగారుతో నిర్మించబడిన ఈ వరుణదేవుని భవనాన్ని చూడు. దేవతలు ఇక్కడకు వచ్చిన తరువాతనే నిజంగా దేవతలు అవుతారు. (14)
ఏతాని హృతరాజ్యానాం దైతేయానాం స్మ మాతలే।
దీప్యమానాని దృశ్యంతే సర్వప్రహరణాన్యుత॥ 15
మాతలీ! వరుణునికి ఓడిపోయి రాజ్యాలు పోగొట్టుకొన్న దైతేయుల సమస్తాయుధాలూ ఇటు కన్పిస్తున్నాయి చూడు. (15)
అక్షయాణి కిలైతాని వివర్తంతే స్మ మాతలే।
అనుభావప్రయుక్తాని సురైరవజితాని హ॥ 16
మాతలీ! ఈ శస్త్రాస్త్రాలన్నీ అక్షయాలు. ప్రయోగించిన తరువాత శత్రువును చంపి మరల యజమాని దగ్గరకే చేరుతాయి. మొదట దైత్యులచే ప్రయోగింపబడిన వీటిని ఇప్పుడు దేవతలు తమ ప్రాపులో ఉంచుకొన్నారు. (16)
అత్ర రాక్షసజాత్యశ్చ దైత్యజాత్యశ్చ మాతలే।
దివ్యప్రహరణాశ్చాసన్ పూర్వదైవతనిర్మితాః॥ 17
మాతలీ! ఈ ప్రాంతంలో రాక్షసజాతులూ, దైత్య జాతులూ నివసిస్తుంటారు. దైత్యులు తయారు చేసిన గొప్ప గొప్ప అస్త్రాలు ఇక్కడున్నాయి.(17)
అగ్నిరేష మహార్చిష్మాన్ జాగర్తి వారుణే హ్రదే।
వైష్ణవం చక్రమావిద్ధం విధూమేన హవిష్మతా॥ 18
మహాతేజస్విఅయిన ఈ అగ్నిదేవుడు వరుణుని సరోవరంలో ప్రకాశిస్తుంటారు. పొగ లేని ఈ అగ్ని విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని సయితం అడ్డగించాడు. (18)
ఏష గాండీమయశ్చాపః లోకసంహారసంభృతః।
రక్ష్యతే దైవర్నిత్యం యతస్తద్ గాండివం ధనుః॥ 19
ఈ చాపం గాండీమయమైనది. అందుకే ఇది గాండీవం (వజ్రాయుధపు కణుపులకు 'గాండి' అని పేరు). జగత్సంహారం కోసం ఇది నిర్మించబడినది. దేవతలు దీనిని ఎప్పుడూ రక్షిస్తుంటారు. (19)
ఏష కృత్యే సముత్పన్నే తత్తద్ ధారయతే బలమ్।
సహస్రశతసంఖ్యేన ప్రాణేన సతతం ధ్రువః॥ 20
ఈ ధనుస్సు అవసరమయినపుడు తన శక్తిని లక్షరెట్లు ఎక్కువ చేసుకొంటుంది. ఎప్పుడూ తిరుగులేని దిది. (20)
అశాస్యానపి శాస్త్యేషః రక్షోబంధుషు రాజసు।
సృష్టః ప్రథమతశ్చండః బ్రహ్మణా బ్రహ్మవాదినా॥ 21
బ్రహ్మవాది అయిన బ్రహ్మదేవుడు దీనిని మొదట నిర్మించాడు. రాక్షసులవంటి రాజులలో అయినా అలవికాని వారిని ఇది అణచివేస్తుంది. (21)
ఏతచ్ఛస్త్రం నరేంద్రాణాం మహాచక్రేణ భాసితమ్।
పుత్రాః సలిలరాజస్య ధారయంతి మహోదయమ్॥ 22
ఈ ధనుస్సు రాజులకు గొప్ప ఆయుధం. చక్రంవలె ప్రకాశిస్తుంటుంది. మహాభ్యుదయకారి అయిన దీనిని వరుణుని కుమారులు ధరిస్తుంటారు. (22)
ఏతత్ సలిలరాజస్య ఛత్రం ఛత్రగృహే స్థితమ్।
సర్వతః సలిలం శీతం జీమూత ఇవ వర్షతి॥ 23
ఛత్రగృహంలో వరుణదేవుని ఛత్రం ఒకటుంది. అది మేఘంలాగా అన్ని వైపులనుండి చల్లని నీటిని చిమ్ముతూ ఉంటుంది. (23)
ఏతచ్ఛత్రాత్ పరిభ్రష్టం సలిలం సోమనిర్మలమ్।
తమసా మూర్ఛితం భాతి యేన నార్చ్ఛతి దర్శనమ్॥ 24
ఈ గొడుగునుండి జారిపడేనీరు చంద్రుని వలె నిర్మల మయినది. చీకటితో కప్పబడి ఉంటుంది. కాబట్టి అది కనిపించదు. (24)
బహూన్యద్భుత రూపాణి ద్రష్టవ్యానీహ మాతలే।
తవ కార్యావరోధస్తు తస్మాద్ గచ్ఛావ మా చిరమ్॥ 25
మాతలీ! ఈ వరుణలోకంలో చూడదగిన అద్భుతవస్తువులు చాలా ఉన్నాయి. కానీ నీ పనికి ఆటంకం కలుగుతుంది. కాబట్టి మనం త్వరగా నాగలోకానికి వెళదాం. (25)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగ పర్వణి భగవద్యానపర్వణి మాతలి వరాన్వేషణే అష్టనవతితమోఽధ్యాయః॥ 98 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యానపర్వమను ఉపపర్వమున మాతలి వరాన్వేషణ మను తొంబది యెనిమిదవ అధ్యాయము. (98)