97. తొంబది యేడవ అధ్యాయము
కణ్వముని మాతలి ఉపాఖ్యానమును ఆరంభించుట.
వైశంపాయన ఉవాచ
జామధగ్న్యవచః శ్రుత్వా కణ్వోఽపి భగవానృషిః।
దుర్యోధనమిదం వాక్యమ్ అబ్రవీత్ కురుసంసది॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. పరశురాముని మాటలు విని పూజ్యుడైన కణ్వమహర్షి కూడా కౌరవసభలో దుర్యోధనుని కిలా చెప్పాడు. (1)
కణ్వ ఉవాచ
అక్షయశ్చావ్యయశ్పైవ బ్రహ్మా లోకపితామహః।
తథైవ భగవంతౌ తౌ నరనారాయణావృషీ॥ 2
కణ్వుడిలా అన్నాడు. లోకపితామహుడైన బ్రహ్మ అక్షయుడు, అవ్యయుడు అయినట్లే పూజ్యులయిన నరనారాయణ మహర్షులు కూడా అక్షయులూ, అవ్యయులూ. (2)
ఆదిత్యానాం హి సర్వేషాం విష్ణురేకః సనాతనః।
అజయ్యశ్చావ్యయశ్పైవ శాశ్వతః ప్రభురీశ్వరః॥ 3
అదితిపుత్రుడు లందరిలో విష్ణువు ఒక్కడే గెలువరానివాడు. అవ్యయుడు, శాశ్వతుడు, సర్వసమర్థుడైన సనాతన పరమేశ్వరుడూ. (3)
నిమిత్తమరణాశ్చాన్యే చంద్రసూర్యౌ మహీ జలమ్।
వాయురగ్నిస్తథాకాశం గ్రహాస్తారాగణాస్తథా॥ 4
మిగిలిన వారందరూ - చంద్రుడూ, సూర్యుడూ, భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం, గ్రహాలు, నక్షత్రసమూహాలూ ఏదో కారణంగా నశించేవారే. (4)
తే చ క్షయాంతే జగతః హిత్వా లోకత్రయం సదా।
క్షయం గచ్ఛంతి వై సర్వే సృజ్యంతే చ పునః పునః॥ 5
జగత్తు నశించినపుడు సూర్యచంద్రాదు లన్నీ మూడులోకాలనూ పరిత్యజించి నశిస్తాయి. సృష్టికాలంలో మరల అన్నీ సృష్టింపబడతాయి. (5)
ముహూర్తమరణాశ్చాన్యే మానుషా మృహపక్షిణః।
తైర్యగ్యోన్యాశ్చ యే చాన్యే జీవలోకచరాస్తథా॥ 6
మిగిలిన మనుష్యులు, జంతువులూ, పక్షులూ జీవలోకంలో చరిస్తున్న మిగిలిన జంతుజాతులూ అవన్నీ స్వల్పకాలంలోనే నశించిపోయేవి. (6)
భూయిష్ఠేన తు రాజానః శ్రియం భుక్త్వా యుషః క్షయే।
తరుణాః ప్రతిపద్యంతే భోక్తుం సుకృతదుష్కృతే॥ 7
ఎందరో రాజులు కూడా రాజ్యసౌఖ్యాల ననుభవించి ఆయువు నశించి మరణించిన తరువాత తమ తమ పుణ్యపాపఫలాలను అనుభవించటానికి మరలా జన్మిస్తుంటారు. (7)
స భవాన్ ధర్మపుత్రేణ శమం కర్తు మిహార్హసి।
పాండవాః కురవశ్పైవ పాలయంతు వసుంధరామ్॥ 8
రాజా! నీవు ధర్మపుత్రుడయిన యుధిష్ఠిరునితో సంధి చేసికొనటం మంచిది. పాండవులూ, కౌరవులూ కలిసి భూమిని పరిపాలించుదురు గాక! (8)
బలవానహమిత్యేవ న మంతవ్యం సుయోధన।
బలవంతో బలిభ్యో హి దృశ్యంతే పురుషర్షభ॥ 9
పురుషశ్రేష్ఠా! సుయోధనా! నేనే బలవంతుడనని భావించ రాదు. ఎందుకంటె బలవంతులకన్నా బలవంతులు లోకంలో కనిపిస్తుంటారు. (9)
న బలం బలినాం మధ్యే బలం భవతి కౌరవ।
బలవంతో హి తే సర్వే పాండవా దేవవిక్రమాః॥ 10
కౌరవా! బలవంతుల మధ్య సైనికబలం బలంగా భావింపబడదు. పాండవులందరూ దేవతలతో సమానమైన బలం గలవారు కాబట్టి నీకన్న బలవంతులు. (10)
అత్రాప్యుదాహరంతీమమ్ ఇతిహాసం పురాతనమ్।
మాతలేర్దాతుకామస్య కన్యాం మృగయతో వరమ్॥ 11
ఈ సందర్భంలో మాతలి కన్యాదానం చేయాలని కోరుతీ వరునికై అన్వేషిస్తున్న ప్రాచీన కథను ఉదహరిస్తారు. (11)
మతస్త్రైలోక్య రాజస్య మాతలిర్నామ సారథిః।
తస్యైకైవ కులే కన్యా రూపతో లోకవిశ్రుతా॥ 12
త్రిలోకాధిపతి అయిన ఇంద్రునకు మాతలి అను సారథి ఉన్నాడు. ఆయనకు ఒక్కతే కుమార్తె. ఆమె తన అందం వలన లోక ప్రసిద్ధిని పొందింది. (12)
గుణకేశీతి విఖ్యాతా నామ్నా సా దేవరూపిణీ।
శ్రియా చ వపుషా చైవ స్త్రియోఽన్యాః సాతిరిచ్యతే॥ 13
దివ్యరూపంగల ఆ కాంత పేరు గుణకేశి. ఆమె తన శరీర సౌందర్యం చేత రూపం చేత అప్పటి స్త్రీల నందరినీ మించింది. (13)
తస్యాః ప్రదానసమయం మాతలిః సహ భార్యయా।
జ్ఞాత్వా విమమృశే రాజన్ తత్పరః పరిచింతయన్॥ 14
రాజా! ఆమె వెళ్ళిపోయాడు సమీపించిందని గ్రహించిన మాతలి ఆ విషయం మీదనే దృష్టిపెట్టి ఆలోచిస్తూ భార్యతో చర్చిస్తూ ఉండేవాడు. (14)
ధిక్ ఖల్వలఘుశీలానామ్ ఉచ్ఛ్రితానాం యశస్వినామ్।
నరాణాం మృదు సత్త్వానాం కులే కన్యాప్రరోహణమ్॥ 15
గొప్ప శీలస్వభావాలు గలిగి, కీర్తి గలదై, కోమల మనస్తత్వం గల ఉన్నత వంశంలో ఆడపిల్ల పుట్టడం ఇబ్బందిని కలిగిస్తుంది. (15)
మాతుః కులం పితృకులం యత్ర చైవ ప్రదీయతే।
కులత్రయం సంశయితం కురుతే కన్యకా సతామ్॥ 16
కన్య మాతృ వంశాన్నీ, పితృవంశాన్నీ, మెట్టినింటిలోని సత్పురుషులనూకూడా సందేహంలో పడవేస్తుంది. (16)
దేవ మానుషలోకౌ ద్వౌ మానుషేణైవ చక్షుషా।
అవగాహ్యైవ విచితౌ న చ మే రోచతే వరః॥ 17
నేను మానవదృష్టి ననుసరించి దేవలోకంలోనూ, మానవ లోకంలోనూ అంతా తిరిగి వెతికాను. కానీ ఏ ఒక్క వరుడూ నాకు నచ్చలేదు. (17)
కణ్వ ఉవాచ
న దేవాన్ నైవ దితిజాన్ న గంధర్వాన్ న మానుషాన్।
అరోచయద్ వరకృతే తథైవ బహుళాన్ ఋషీన్॥ 18
మాతలి వరునికోసం దేవతలలో, రాక్షసులలో, గంధర్వులలో, మనుష్యులలో, మహర్షులలో ఎంతో వెదికాడు. కానీ ఎవరూ నచ్చలేదు. (18)
భార్యయాను స సంమంత్ర్య సహ రాత్రౌ సుధర్మయా।
మాతలిర్నాగలోకాయ చకార గమనే మతిమ్॥ 19
అప్పుడొక రాత్రి మాతలి తన భార్య అయిన సుధర్మతో చర్చించి నాగలోకానికి వెళ్ళాలని భావించాడు. (19)
న మే దేవమనుష్యేషు గుణకేశ్యా సమో వరః।
రూపతో దృశ్యతే కశ్చిత్ నాగేషు భవితా ధ్రువమ్॥ 20
దేవతలలో గానీ మానవులలో గాని గుణకేశికి తగిన రూపవంతుడయిన వరుడు కనబడలేదు. నాగలోకంలో తగిన వరుడు తప్పక ఉండవచ్చు. (20)
ఇత్యామంత్ర్య సుధర్మాం స కృత్వా చాభిప్రదక్షిణమ్।
కన్యాం శిరస్యుపాఘ్రాయ ప్రవివేశ మహీతలమ్॥ 21
సుధర్మతో ఆ విధంగా చర్చింది మాతలి ఇష్ట దేవతలకు ప్రదక్షిణంచేసి, కూతురి శిరస్సును ఆఘ్రాణించి భూతలంలో ప్రవేశించాడు. (21)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగ పర్వణి భగవద్యాన పర్వణి మాతలివరాన్వేషణే సప్తనవతితమోఽధ్యాయః॥ 97 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున మాతలి వరాన్వేషణ మను తొంబదియేడవ అధ్యాయము. (97)