96. తొంబది యారవ అధ్యాయము

పరశురాముడు దంభోద్భవుని వృత్తాంతము చెప్పుట

వైశంపాయన ఉవాచ
తస్మిన్నభిహితే వాక్యే కేశవేన మహాత్మనా।
స్తిమితా హృష్టరోమాణః ఆసన్ సర్వే సభాసదః॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. మహాత్ముడైన కేశవుడు ఆ మాట పలుకగానే అక్కడున్న సభాసదులందరూ చకితులై ఆనందంతో పులకించిపోయారు. (1)
కశ్చిదుత్తరమేతేషాం వక్తుం నోత్సహతే పుమాన్।
ఇతి సర్వే మనోభిస్తే చింతయంతి స్మ పార్థివాః॥ 2
ఈ శ్రీకృష్ణుని మాటలకు ఎవ్వరూ సమాధానం చెప్పలేరని రాజులందరూ మనస్సులలో అనుకొన్నారు. (2)
తథా తేషు చ సర్వేషు తూష్ణీం భూతేషు రాజసు।
జామదగ్న్య ఇదం వాక్యమ్ అబ్రవీత్ కురుసంసది॥ 3
ఆ రీతిగా రాజులందరూ మిన్నకుండగా జమదగ్ని కొడుకు పరశురాముడు కురుసభలో ఈ మాట అన్నాడు.(3)
ఇమాం మే సోపమాం వాచం శృణు సత్యామశంకితః।
తాం శ్రుత్వా శ్రేయ ఆదత్స్వ యది సాధ్వితి మన్యసే॥ 4
రాజా! నీవు సంశయించకుండా సోదాహరణంగా చెపుతునన్ నా మాట విను. ఆ మాట విని మంచిదని నీవు భావిస్తే దానిని స్వీకరించు. (4)
రాజా దంభోద్భవో నామ సార్వభౌమః పురాభవత్।
అఖిలాం బుభుజే సర్వాం పృథివీ మితి నః శ్రుతమ్॥ 5
ఒకప్పుడు దంభోద్భవుడనే సార్వభౌముడు ఉండేవాడు. ఆయన సమస్తపృథివిని అఖండంగా అనుభవించాడని మేము విన్నాం. (5)
స స్మ నిత్యం నిశాపాయే ప్రాతరుత్థాయ వీర్యవాన్।
బ్రాహ్మణాన్ క్షత్రియాంశ్పైవ పృచ్ఛన్నాస్తే మహారథః॥ 6
మహారథుడు, పరాక్రమశాలి అయిన ఆయన ప్రతి రోజూ ఉదయాననే లేచి బ్రాహ్మణులనూ, క్షత్రియులను ఇలా అడిగేవాడు. (6)
అస్తి కశ్చిద్ విశిష్టో వా మద్విధో వా భవేద్యుధి।
శూద్రో వైశ్యః క్షత్రియో వా బ్రాహ్మణో వా పి శస్త్రభృత్॥ 7
ఈ లోకంలో క్షత్రియుడయినా, వైశ్యుడయినా, శూద్రుడయినా, ఆయుధం చేతబట్టిన బ్రాహ్మణుడైనా యుద్ధంలో నా అంతవాడు కానీ నన్ను మించినవాడు కానీ ఉన్నాడా? (7)
ఇతి బ్రువన్నన్వచరత్ స రాజా పృథివీ మిమామ్।
దర్పేణ మహతా మత్తః కంచిదన్యమచింతయన్॥ 8
ఆ విధంగా మాట్లాడుతూ ఆ దంభోద్భవ మహారాజు మహాగర్వీన్మత్తుడై ఎవ్వరిని గురించీ ఏమీ ఆలోచించకుండా తిరుగసాగాడు. (8)
తం చ వైద్యా అకృపణా బ్రాహ్మణాః సర్వతోఽభయాః।
ప్రత్యషేధంత రాజానం శ్లాఘమానం పునఃపునః॥ 9
ఆ సమయంలో ఏవిధంగానూ భయంలేని వారై ఉదారులు, వేదవేత్తలయిన బ్రాహ్మణులు తనను తాను పొగడుకొంటున్న ఆ రాజును నిందించారు. (9)
నిషిధ్యమానోఽప్యసకృత్ పృచ్ఛత్యేవ స వై ద్విజాన్।
అతిమానం శ్రియా మత్తం తమూచుర్బ్రాహ్మణాస్తదా॥ 10
తపిస్వినో మహాత్మానః వేదప్రత్యయదర్శినః।
ఉదీర్యమాణం రాజానం క్రోధదీప్తా ద్విజాతయః॥ 11
బ్రాహ్మణులు నిషేధించినా మాటిమాటికీ ఆ విధంగానే అడిగేవాడు. ఆయనకు అహంకారం పెరిగింది. ఐశ్వర్యంతో మత్తుడయ్యాడు. రాజు పదే పదే అడుగుతూ ఉంటే వేదవేత్తలు, తపస్సంపన్నులు, మహాత్ములు అయిన బ్రాహ్మణులు కోపంతో మండిపడుతూ రాజుతో ఇలా అన్నారు. (10-11)
అనేకజయినౌ సంఖ్యే యౌ వై పురుషసత్తమౌ।
తయోస్త్వం న సమో రాజన్ భవితాసి కదాచన॥ 12
రాజా! యుద్ధంలో అనేకులను జయించిన పురుషశ్రేష్ఠులు ఇద్దరున్నారు. వారితో నీవు ఎప్పటికీ సమానుడవు కాలేవు. (12)
ఏవముక్తః స రాజా తు పునః పప్రచ్ఛ తాన్ ద్విజాన్।
క్వ తౌ వీరౌ క్వ జన్మానౌ కిం కర్మాణౌ చ కౌ చ తౌ॥ 13
ద్విజులు ఆ రీతిగా పలుకగానే ఆ దంభోద్భవుడు ఆ వీరు లెక్కడ? వారి జన్మస్థాన మెక్కడ? వారేం చేస్తుంటారు? వారి పేర్లేవి? అని మరల ఆ బ్రాహ్మణుల నడిగాడు. (13)
బ్రాహ్మణా ఊచుః
నరో నారాయణశ్పైవ తాపసావితి నః శ్రుతమ్।
ఆయాతౌ మానుషే లోకే తాభ్యాం యుధ్వస్వ పార్థివ॥ 14
బ్రాహ్మణులిలా అన్నారు. రాజా! వారు నరనారాయణులని పేరుగల తాపసులని విన్నాం. ప్రస్తుతం వారు మానవలోకానికే వచ్చి ఉన్నారు. వారితో యుద్ధం చేయి. (14)
శ్రూయతే తే మహాత్మానౌ నరనారాయణావుభౌ।
తపో ఘోరమనిర్దేశ్యం తప్యేతే గంధమాదనే॥ 15
నరనారాయణులను పేర్లుగల మహాత్ములిద్దరూ గంధమాదన పర్వతంపై మాటలకు అందనంత ఘోరమయిన తపస్సు చేస్తున్నారని విన్నాం. (15)
స రాజా మహతీం సేనాం యోజయిత్వా షడంగినీమ్।
అమృష్యమాణః సంప్రాయాద్ యత్ర తావపరాజితౌ॥ 16
ఆ మాటలను సహించలేని ఆ రాజు(దంభోద్భవుడు) షడంగాలతో(రథ, గజ, అశ్వ, పదాతి, శకట, ఉష్ట్ర సేనలు షడంగాలు) కూడిన గొప్ప సేనను సిద్ధం చేసికొని అపరాజితులయిన ఆ నరనారాయణులున్న చోటికి వెళ్ళాడు. (16)
స గత్వా విషమం ఘోరం పర్వతం గంధమాదనమ్।
మార్గమాణోఽన్వగచ్ఛత్ తౌ తాపసౌ వనమాశ్రితౌ॥ 17
ఆ దంభోద్భవుడు వారిని వెదుకుతీ దుర్గమమయిన గంధమాదన పర్వతాన్ని ఎక్కి, అరణ్యంలో ఉన్న ఆ తాపసుల దగ్గరకు చేరాడు. (17)
తౌ దృష్ట్వా క్షుత్పిపాసాభ్యాం కృశౌ ధమనిసంతతౌ।
శీతవాతాతపైశ్చైవ కర్శితౌ పురుషోత్తమౌ॥ 18
ఆ పురుషశ్రేష్ఠులిద్దరూ ఆకలిదప్పుల వలన కృశించిఉన్నారు. నరాలు పైకి కనిపిస్తున్నాయి. చలిగాలి, ఎండలవలన వారు బక్కచిక్కి ఉన్నారు. (18)
అభిగమ్యోపసంగృహ్య పర్యపృచ్ఛదనామయమ్।
తమర్చిత్వా మూలఫలైః ఆసనేనోదకేన చ॥ 19
న్యమంత్రయేతాం రాజానం కిం కార్యం క్రియతామితి।
తతస్తామానుపూర్వీం సఆHఅ పునరేవాన్వకీర్తయత్॥ 20
దంభోద్భవుడు వారి దగ్గరకు చేరి పాదాలకు నమస్కరించి కుశల ప్రశ్నలు వేశాడు. వారునూ ఆ రాజును అర్చించి, ఆసీనుని చేసి భోజనార్థం దుంపలను, పండ్లనూ, నీటిని, ఇచ్చి అప్పుడు "తమకేమి చేయగల" మని ప్రశ్నించారు. అప్పుడు దంభోద్భవుడు జరిగిన విషయాన్నంతా వారికి వివరించాడు. (19-20)
బాహుభ్యాం మే జితా భూమిః నిహతాః సర్వశత్రవః।
భవద్భ్యాం యుద్ధమాకాంక్షన్ ఉపయాతోఽస్మి పర్వతమ్॥ 21
ఆతిథ్యం దీయతామేతత్ కాంక్షితం మే చిరం ప్రతి।
నేను భుజబలంతో సమస్త భూమండలాన్ని జయించాను. సర్వశత్రువులనూ సంహరించాను. మీతో యుద్ధం చేయాలన్న కోరికతో ఈ పర్వతానికి వచ్చాను. ఇదే నా చిరకాలవాంఛ. ఆతిథ్యరూపంతో మీరు నాతో యుద్ధం చేయండి. (21 1/2)
నరనారాయణా వూచతుః
అపేతక్రోధలోభోఽయమ్ ఆశ్రమో రాజసత్తమ॥ 22
న హ్యస్మి న్నాశ్రమే యుద్ధం కుతఆHఅ శస్త్రం కుతోఽనృజుః।
అన్యత్ర యుద్ధమాకాంక్ష బహవః క్షత్రియాః క్షితౌ॥ 23
నరనారాయణులు ఇలా అన్నారు. రాజశ్రేష్ఠా! ఈ ఆశ్రమం క్రోధ లోభాలకు దూరమైనది. ఈ ఆశ్రమంలో యుద్ధానికి కానీ శస్త్రాస్త్రాలకు కనీ కుటిలత్వంతో కూడిన వారికి కానీ తావులేదు. ఈ భూమిలో క్షత్రియులెందరో ఉన్నారు. అక్కడకుపోయి వారితో యుద్ధాన్ని కోరుకో. (22-23)
రామ ఉవాచ
ఉచ్యమానస్తథాపి స్మ భూయ ఏవాభ్యభాషత।
పునః పునః క్షమ్యమాణః సాంత్వ్యమానశ్చ భారత॥ 24
దంభోద్భవో యుద్ధమిచ్ఛన్ ఆహ్వయత్యేవ తాపసౌ।
పరశురాముడిలా అన్నాడు. నరనారాయణులు పదేపదే అదే విషయాన్ని చెప్పి. క్షమాపణను కోరి, ఆయనను అనునయించారు. అయినాకూడా దంభోద్భవుడు యుద్ధాన్నే కోరుతూ ఆ తాపసులను యుద్ధానికే ఆహ్వానించసాగాడు. (24 1/2)
తతో నరస్త్విషీకాణాం ముష్టిమాదాయ భారత॥ 25
అబ్రవీదేహి యుద్ధ్యస్వ యుద్ధకాముక క్షత్రియ।
సర్వశస్త్రాణి చాదత్స్వ యోజయస్వ చ వాహినీమ్॥ 26
(సంనహ్యస్వ చ వర్మాణి యాని చాన్యాని సంతి తే)
అహం హి తే విశేష్యామి యుద్ధశ్రద్ధామితః పరమ్।
(యదాహ్వయసి దర్పేణ బ్రాహ్మణప్రముఖాన్ జనాన్)
భారతా! అప్పుడు నరుడు పిడికెడు గడ్డి పోచలను తీసికొని యుద్ధ కాముకా! క్షత్రియా! రా! యుద్ధం చేయి. నీ ఆయుధాలను అన్నింటినీ తీసికో! సేననంతా సమకూర్చుకో కవచాలను ధరించు, నీకున్న ఇతర సాధనాల నన్నింటినీ తెచ్చుకో. ఎంతో పొగరుతో నీవు బ్రాహ్మణులు మొదలగు వారినందరినీ యుద్ధానికి ఆహ్వానిస్తున్నావు. నేటి నుండీ నీ యుద్ధాసక్తిని నేను పోగొడతాను. (25-26 1/2)
దంభోద్భవ ఉవాచ
యద్యేతదస్త్రమస్మాసు యుక్తం తాపస మన్యసే॥ 27
ఏతేనాపి త్వయా యోత్స్యే యుద్ధార్థీ హ్యహమాగతః।
దంభోద్భవుడులా అన్నాడు. తాపసా! మీరు ఈ అస్త్రాన్నే నాతో పోరాడటానికి తగినదని భావించినా నేను మీతో యుద్ధం చేస్తాను. నేను యుద్ధం కోసమే గదా వచ్చింది. (27 1/2)
రామ ఉవాచ
ఇత్యుక్త్వా శరవర్షేణ సర్వతః సమవాకిరత్॥ 28
దంభోద్భవస్తాపసం తం జిఘాంసుః సహసైనికః।
పరశురాముడిలా అన్నాడు. ఆవిధంగా పలికి సైనికులతో కలిసి దంభోద్భవుడు నరుని చంపాలని సంకల్పించి అన్నివైపుల నుండి బాణవర్షాన్ని కురిపించ నారంభించాడు. (28 1/2)
తస్య తానస్యతో ఘోరాన్ ఇషూన్ పరతనుచ్ఛిదః॥ 29
కదర్థీకృత్య స మునిః ఇషీకాభిః సమార్పయత్।
శత్రువుల శరీరాలను ఛేదించగల ఆ దంభోద్భవుని బాణాలను లెక్కచేయకుండా ఆ ముని నరుడు గడ్డిపోచలతో వాటిని ఛేదించాడు. (29 1/2)
తతోఽస్మై ప్రాసృజత్ ఘోరమ్ ఐషీకమపరాజితః॥ 30
అస్త్రమప్రతిసంధేయం తదద్భుతమివాభవత్।
అపుడు ఓటమి నెరుగని ఆ మహర్షి నరుడు భయంకరమైన ఐషీకాస్త్రాన్ని ప్రయోగించాడు. అది తిరుగులేనిది. ఆ సంఘటన అద్భుతంగా కనిపించింది. (30 1/2)
తేషామక్షీణి కర్ణాంశ్చ నాసికాశ్పైవ మాయయా॥ 31
నిమిత్తవేధీ స మునిః ఇషీకాభిః సమార్పయత్।
ఈవిధంగా గురిచూచి కొట్టగల ఆ నరుడు మాయతో గడ్డిపోచలతోనే ఆ దంభోద్భవుని సేనల కళ్లనూ, చెవులనూ, ముక్కులనూ కూడా ఛేదించాడు. (31 1/2)
స దృష్ట్వా శ్వేతమాకాశమ్ ఇషీకాభిః సమాచితమ్॥ 32
పాదయోర్న్యపతద్ రాజా స్వస్తిమేఽస్త్వితి చాబ్రవీత్।
గడ్డిపోచలతో నిండి తెల్లగా కనిపిస్తున్నా ఆకాశాన్ని చూచి దంభోద్భవుడు ఆ మునిపాదాలపై పడి నాకు మేలు చేయండి అని ప్రార్థించాడు. (32 1/2)
తమబ్రవీత్ నరో రాజన్ శరణ్యః శరణైషిణామ్॥ 33
బ్రహ్మణ్యో భవ ధర్మాత్మా మా చ స్మైవం పునః కృథాః।
రాజా! శరణన్న వారికి శరణాన్ని ఇచ్చే ఆ నరుడు ఆ రాజుతో ఇలా అన్నాడు. నేటినుండి బ్రాహ్మణశ్రేయోభిలాషివై, ధర్మాత్ముడవై ఉండు. మరల ఇటువంటి సాహసం చేయవద్దు. (33 1/2)
నైతాదృక్ పురుషో రాజన్ క్షత్రధర్మమనుస్మరన్॥ 34
మనసా నృపశార్దూల భవేత్ పరపురంజయః।
రాజశ్రేష్ఠా! శత్రునగరాలను జయించిన వీరులయినా క్షాత్రధర్మాన్ని స్మరిస్తూ మనసులో కూడా నీవలె ప్రవర్తించరు. (34 1/2)
మా చ దర్పసమావిష్టః క్షేప్సీః కాంశ్చిత్ కథంచన॥ 35
అల్పీయాంసం విశిష్టం వా తత్ తే రాజన్ సమాహితమ్।
ఇంకెప్పుడూ కూడా గర్వంతో నీకన్న తక్కువ వారిని కానీ, నిన్ను మించిన వారిని కానీ ఆక్షేపించవద్దు. ఈ విషయాన్నే నీవు సావధానంగా గ్రహించాలి. (35 1/2)
కృతప్రజ్ఞో వీతలోభః నిరహంకార ఆత్మవాన్॥ 36
దాంతః క్షాంతో మృదుః సౌమ్యః ప్రజాః పాలయ పార్థివ।
మా స్మ భూయః క్షిపేః కంచిద్ అవిదిత్వా బలాబలమ్॥ 37
రాజా! నీవు వినీతబుద్ధివై, లోభాన్ని అహంకారాన్ని వదిలి, అభిమానవంతుడవై, ప్రజలను పరిపాలించు. బలాబలాలను గ్రహించకుండా ఎవ్వరినీ ఆక్షేపించవద్దు. (36-37)
అనుజ్ఞాతః స్వస్తి గచ్ఛ మైవం భూయః సమాచరేః।
కుశలం బ్రాహ్మణాన్ పృచ్ఛేః ఆవయోర్వచనాద్ భృశమ్॥ 38
నీకు మేలు కలుగుతుంది. అనుమతిస్తున్నాను. వెళ్ళు, ఇంకెప్పుడూ ఇలా ప్రవర్తించవద్దు. మామాటగా నీవు బ్రాహ్మణుల క్షేమాన్ని అడుగుతూ ఉండు. (38)
తతో రాజా తయోః పాదౌ అభివాద్య మహాత్మనోః।
ప్రత్యాజగామ స్వపురం ధర్మం చైవాచరద్ భృశమ్॥ 39
అపుడు ఆ రాజు - దంభోద్భవుడు ఆ మహాత్ముల పాదాలకు నమస్కరించి తన నగరానికి మరలి వచ్చాడు. విశేషంగా ధర్మాన్ని అనుసరించ సాగాడు. (39)
సుమహచ్చాపి తత్కర్మ తన్నరేణ కృతం పురా।
తతో గుణైః సుబహుభిః శ్రేష్ఠో నారాయణోఽభవత్॥ 40
పూర్వం మహాత్ముడైన నరుడు ఆ గొప్పకార్యాన్ని సాధించాడు. అనేక గుణాలతో నారాయణుడు అతనిని మించినవాడు. (40)
తస్మాద్ యావద్ ధనుః శ్రేష్ఠే గాండీవేఽస్త్రం న యుజ్యతే।
తావత్ త్వాం మానముత్సృజ్య గచ్ఛ రాజన్ ధనంజయమ్॥ 41
కాబట్టి రాజా! అర్జునుడు గాండీవాన్ని ఎక్కుపెట్టకముందే నీవు అభిమానాన్ని వీడి అర్జునునితో చేరు. (41)
కాకుదీకం శుకం నాకమ్ అక్షిసంతర్జనం తథా।
సంతానం నర్తకం ఘోరమ్ ఆస్యమోదకమష్టమమ్॥ 42
(అర్జునుని దగ్గర) కాకుదీకం, శుకం, నాకం, అక్షిసంతర్జనం, సంతానం, నర్తకం, ఘోరం, ఆస్యమోదక మనే ఎనిమిది అస్త్రాలున్నాయి. (42)
వి॥సం॥ ఇందులో ఎనిమిది రకాల అస్త్రములు వాని ఫలితాలు చెపుతున్నాడు. ఫలితాలు (43 లో) చేష్టలు(44, 45 లలో) కూడా చెపుతున్నాడు.
వి॥సం॥ అస్త్రం - ఫలితం - చేష్ట
1. కాకుదీకం - కామం - నిద్రలో మునుగుట
2. శుకము - క్రోధము - ఒడలెరుగుకుండుట
3. నాకము - లోభము - నవ్వుట
4. అక్షిసంతర్జనము - మోహము - మూత్రవిసర్జనము
5. సంతానము - మదము - కక్కుకొనుట
6. నర్తనము - మానము - గంతులు వేయుట
7. ఘోరము - మాత్సర్యము - పిచ్చిపట్టుట
8. ఆస్యమోదకము - అహంకారము - ఏడ్చుట(నీల)
కొందరు ఈ ఎనిమిది అస్త్రములకు ఎనిమిది మందిని వరుసగా ప్రయోక్తలుగా చెపుతారు. 1. యుధిష్ఠిరుడు, 2. నకులుడు, 3. సహదేవుడు, 4. కృష్ణుడు, 5. అభిమన్యుడు, 6. అర్జునుడు, 7. ఘటోత్కచుడు, 8. భీముడు.(సర్వ)
ఏతైర్విద్ధాః సర్వ ఏవ మరణం యాంతి మానవాః।
కామక్రోధౌ లోభ మోహౌ మదమానౌ తథైవ చ॥ 43
మాత్సర్యాహంకృతీ చైవ క్రమాదేవ ఉదాహృతాః।
ఈ అస్త్రాలు తగిలితే ఎవరైనా మరణించవలసిందే ఈ ఎనిమిది అస్త్రాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాన మాత్సర్య, అహంకారాలకు ప్రతీకలు. (43 1/2)
ఉన్మత్తాశ్చ విచేష్టంతే నష్టసంజ్ఞా విచేతసః॥ 44
స్వపంతి చ ప్లవంతే చ ఛర్దయంతి చ మానవాః।
మూత్రయంతే చ సతతం రుదంతి చ హసంతి చ॥ 45
ఈ అస్త్రాల ప్రయోగానికి ఎరయైన వారు కొందరు ఉన్నత్తులై పిచ్చిగా ప్రవర్తిస్తారు. కొందరు చైతన్యాన్ని కోల్పోయి నిశ్చేష్టులవుతారు. కొందరు నిదురపోతారు. కొందరు ఎగురుతారు. కొందరు కుంటుతారు. కొందరు మలమూత్రాలు విసర్జిస్తారు. కొందరు నవ్వుతూ ఏడుస్తూ ఉంటారు. (44-45)
నిర్మాతా సర్వలోకానామ్ ఈశ్వరః సర్వకర్మవిత్।
యస్య నారాయణో బంధుః అర్జునో దుస్సహో యుధి॥ 46
రాజా! సర్వలోకసృష్టి కర్త, సర్వకర్మవేత్త అయిన నారాయణుని బంధువు అయిన ఆ అర్జునుని యుద్ధంలో ఎదిరించడం అసాధ్యం. (46)
కస్తముత్సహతే జేతుం త్రిషు లోకేషు భారత।
వీరం కపిధ్వజం జిష్ణుం యస్య నాస్తి సమో యుధి॥ 47
భారతా! యుద్ధంలో అసమానుడై కపిధ్వజుడై జయశీలుడైన వీరుడు అర్జునుడు. అర్జునుని ఎదిరించటానికి మూడులోకాలలో ఎవ్వరూ సాహసించరు. (47)
అసంఖ్యేయా గుణాః పార్థే తద్విశిష్టో జనార్దనః।
త్వమేవ భూయో జానాసి కుంతీపుత్రం ధనంజయమ్॥ 48
నరనారాయణౌ యౌ తౌ తావేవార్జునకేశవౌ।
విజానీహి మహారాజ ప్రవీరౌ పురుషోత్తమౌ॥ 49
అర్జునుడు లెక్కలేనన్ని సద్గుణాలు గలవాడు. జనార్దనుడు ఆయనను మించినవాడు. అర్జునుని గురించి నీకు కూడా బాగా తెలుసు. నరనారాయణులుగా ప్రఖ్యాతు లయిన వారే అర్జున శ్రీకృష్ణులు. మహారాజా! వారిద్దరూ గొప్ప వీరులూ, పురుషోత్తములూ అని గ్రహించు. (48-49)
యద్యేతదేవం జానాసి న మామభిశంకసే।
ఆర్యాం మతిం సమాస్థాయ శామ్య భారత పాండవైః॥ 50
భారతా! నీకు ఈ విషయం సరిగా అర్థమయితే నాపై సందేహం లేకపోతే గొప్ప మనస్సును ఆశ్రయించి పాండవులతో సంధి చేసుకో. (50)
అథ చేన్మన్యసే శ్రేయో న మే భేదో భవేదితి।
ప్రశామ్య భరతశ్రేష్ఠ మా చ యుద్ధే మనః కృథాః॥ 51
భరతశ్రేష్ఠా! మనం విడిపోకూడదని నీవు భావిస్తే, శ్రేయస్కరమని నీ కనిపిస్తే సంధినే చేసికో, యుద్ధం వైపు మనస్సును మరలనివ్వవద్దు. (51)
భవతాం చ కురుశ్రేష్ఠ కులం బహుమతం భువి।
తత్ తథైవాస్తు భద్రం తే స్వార్థమేవోపచింతయ॥ 52
కురుశ్రేష్ఠా! మీ వంశం ఈ లోకంలో ప్రతిష్ఠ గలది. ఆ ప్రతిష్ఠను అలాగే నిలుపు. నీకు మేలు కలుగుతుంది. స్వప్రయోజనాన్ని గురించియే ఆలోచించుకో. (52)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి దంభోద్భవోపాఖ్యానే షణ్ణవతితమోఽధ్యాయః॥ 96 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున దంభోద్భవోపాఖ్యానమను తొంబది యారవ అధ్యాయము. (96)
(దాక్షిణాత్య అధికపాఠము 1 1/2 శ్లోకములు కలిపి మొత్తం 53 1/2 శ్లోకములు)