101. నూటోకటవ అధ్యాయము

గరుడలోకమును, గరుడసంతానమును వర్ణించుట.

నారద ఉవాచ
అయం లోకః సుపర్ణానాం పక్షిణాం పన్నగాశినామ్।
విక్రమే గమనే భారే నైషామస్తి పరిశ్రమః॥ 1
నారదుడిలా అన్నాడు - ఇది పాములను ఆహారంగా స్వీకరించే గరుడపక్షుల లోకం, పరాక్రమించటంలో, ఎంత దూరమయినా ఎగరటంలో, ఎంత బరువైనా మోయటంలో వీటికి కొంచెంకూడా శ్రమ ఉండదు. (1)
వైనతేయసుతైః సూత షడ్భిస్తతమిదం కులమ్।
సుముఖేన సునామ్నా చ సునేత్రేణ సువర్చసా॥ 2
సురుచా పక్షిరాజేన సుబలేన చ మాతలే।
వర్ధితాని ప్రసృత్యా వై వినతాకులకర్తృభిః॥ 3
పక్షిరాజాభిజాత్యానాం సహస్రాణి శతాని చ।
కశ్యపస్య తతో వంశే జాతైర్భూతివివర్ధనైః॥ 4
మాతలీ! సుముఖుడు, సునాముడు, సునేత్రుడు, సువర్చస్కుడు, సురుచుడు, సుబలుడు అనే పేర్లుగల ఆరుగురు గరుత్మంతుని కుమారులు ఇక్కడ తమ వంశాలను విస్తరించి ఉన్నారు. వినతావంశవర్ధనులు, కశ్యపకుల సంజాతులు, సంపత్సంవర్ధకులు అయిన ఈ ఆరుగురు గరుడజాతిని వందలు, వేలు శాఖలుగా విస్తరింపజేసి ఉన్నారు. (2-4)
సర్వేప్యేతే శ్రియా యుక్తాః సర్వే శ్రీవత్సలక్షణాః।
సర్వే శ్రియమభీప్సంతః ధారయంతి బలాన్యుత॥ 5
వీరందరూ, లక్ష్మీసంపన్నులు, శ్రీవత్సలాంఛనం గలవారు. ఐశ్వర్యాన్ని కోరుతూ ఎంతో బలాన్ని ధరించి ఉన్నవారు. (5)
కర్మణా క్షత్రియాశ్పైతే నిర్ఘృణా భోగిభోజినః।
జ్ఞాతిసంక్షయకర్తృత్వాద్ బ్రాహ్మణ్యం న లభంతి వై॥ 6
బ్రాహ్మణవంశంలో పుట్టినవారైనా వీరు క్షత్రియకర్మను పాటించేవారు. వీరు దయాహీనులూ, సర్ప భక్షకులూ. ఈ విధంగా తమ దాయాదులయిన సర్పాలను నాశనంచేసినందువలన వీరికి బ్రాహ్మణత్వం లభించలేదు. (6)
నామాని చైషాం వక్ష్యామి యథా ప్రాధాన్యతః శృణు।
మాతలే శ్లాఘ్యమేతద్ధి కులం విష్ణుపరిగ్రహమ్॥ 7
మాతలీ! నేనిప్పుడు వీరిలో ప్రాధాన్యాన్ని అనుసరించి కొందరి పేర్లను చెప్తాను విను. విష్ణుమూర్తి పరివారంలో చేరి ఈ వంశం ప్రశంసనీయమయింది. (7)
దైవతం విష్ణురేతేషాం విష్ణురేవ పరాయణమ్।
హృది చైషాం సదా విష్ణుః విష్ణురేవ సదా గతిః॥ 8
వీరికి విష్ణువే దేవుడు, విష్ణువే పరమాశ్రయం. వీరి మనస్సులలో ఎప్పుడూ విష్ణువు ఉంటారు. వీరికి ఎల్లప్పుడూ విష్ణువే గతి. (8)
సువర్ణచూడో నాగాశీ దారుణ శ్చండతుండకః।
అనిలశ్చానలశ్పైవ విశాలాక్షోథ కుండలీ॥ 9
పంకజిద్ వజ్రవిష్కంభః వైనతేయోఽథ వామనః।
వాతవేగో దిశాచక్షుః నిమేషో ఽనిమిషస్తథా॥ 10
త్రిరావః సప్తరావశ్చ వాల్మీకి ర్ద్వీపకస్తథా।
దైత్యద్వీపః సరిద్ ద్వీపః సారసః పద్మకేతనః॥ 11
సుముఖశ్చిత్రకేతుశ్చ చిత్రబర్హ స్తథానఘః।
మేషహృత్ కుముదో దక్షః సర్పాంతః సహభోజనః॥ 12
గురుభారః కపోతశ్చ సూర్యనేత్ర శ్చిరాంతకః।
విష్ణుధర్మా కుమారాశ్చ పరిబర్హో హరిస్తథా॥ 13
సుస్వరో మధుపర్కశ్చ హేమవర్ణస్తథైవ చ।
మాలయో మాతరిశ్వా చ నిశాకర దివాకరౌ॥ 14
ఏతే ప్రదేశమాత్రేణ మయోక్తా గరుడాత్మజాః।
ప్రాధాన్యతస్తే యశసా కీర్తితాః ప్రాణినశ్చ యే॥ 15
సువర్ణచూడుడు, నాగాశి, దారుణుడు, చండతుండకుడు, అనిలుడు, అనలుడు, విశాలాక్షుడు, కుండలి, పంకజిత్తు, వజ్రవిష్కంభుడు, వైనతేయుడు, వామనుడు, వాతవేగుడు, దిశాచక్షువు, నిమేషుడు, అనిమిషుడు, త్రిరావుడు, సప్తరావుడు, వాల్మీకి, ద్వీపకుడు, దైత్యద్వీపుడు, సరిద్ ద్వీపుడు, సారసుడు, పద్మకేతనుడు, సుముఖుడు, చిత్రకేతువు, చిత్రకేతువు, చిత్రబర్హుడు, అనఘుడు, మేషహృత్తు, కుముదుడు, దక్షుడు, సర్పాంతుడు, సహభోజనుడు, గురుభారుడు, కపోతుడు, సూర్యనేత్రుడు, చిరాంతకుడు, విష్ణుధర్ముడు, కుమారుడు, పరిబర్హుడు, హరి, సుస్వరుడు, మధుపర్కుడు, హేమవర్ణుడు, మాలయుడు, మాతరిశ్వుడు, నిశాకరుడు, దివాకరుడు - ఈ విధంగా సంక్షేపంగా నేను గరుడ సంతతిని వర్ణించాను. వీరంతా కీర్తిసంపన్నులూ, మహాబలులు. (9-15)
యద్యత్ర న రుచిః కాచిద్ ఏహి గచ్ఛావ మాతలే।
తం నయిష్యామి దేశం త్వాం వరం యత్రోపలప్స్యసే॥ 16
మాతలీ! వీరిలో ఎవ్వరూ నచ్చకపోతే రా, పోదాం. తప్పక ఎవరో ఒకరు నీకునచ్చే ప్రదేశానికి నిన్ను తీసికొనిపోతా.(16)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి మాతలివరాన్వేషణే ఏకాధికశతతమోఽధ్యాయః॥ 101 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున మాతలి వరాన్వేషణ మను నూటొకటవ అధ్యాయము. (101)