72. డెబ్బది రెండవ అధ్యాయము
(భగవద్యానపర్వము)
ధర్మరాజు శ్రీకృష్ణుని దౌత్యము చేయుమని అర్థించుట.
వైశంపాయన ఉవాచ
సంజయే ప్రతియాతే తు ధర్మరాజో యుధిష్ఠిరః।
(అర్జునం భీమసేనం చ మాద్రీపుత్రౌ చ భారత।
విరాటద్రుపదౌ చైవ కేకయానాం మహారథాన్॥
అబ్రవీదుపసంగమ్య శంఖచక్రగదాధరమ్॥
అభియాదామహే గత్వా ప్రయాతుం కురుసంసదమ్।
వైశంపాయనుడిలా అన్నాడు. సంజయుడు వెళ్ళగానే ధర్మరజు అర్జున, భీమసేన, నకుల, సహదేవ, విరాట, ద్రుపద, కేకయరాజ మహారథులను కలసి "మనం శంఖచక్రదాధారి అయిన కృష్ణుని దగ్గరకుపోయి కౌరవ సభకు వెళ్ళిరమ్మని ఆయనను ప్రార్థించుదాం" అన్నాడు.
యథా భీష్మేణ ద్రోణేన బాహ్లీకేన చ ధీమతా।
అన్యైశ్చ కురుభిః సార్ధం న యుధ్యేమహి సంయుగే।
"భీష్ముడు ద్రోణుడు, ధీమంతుడైన బాహ్లీకాది ఇతర కురువీరులతో మనం యుద్ధం చేయవలసిన అవసరం రానట్లు (ఆయన ప్రయత్నిస్తారు).
ఏష నః ప్రథమః కల్పః ఏతన్నః శ్రేయ ఉత్తమమ్॥
ఏవముక్తా సుమనసః తేఽభిజగ్ముర్జనార్దనమ్।
ఇదే మొదటి మార్గం. ఇదే ఉత్తమమూ, మనకు శ్రేయోదాయకమూ కూడా. యుధిష్ఠిరుని ఆ మాటలు విని వారంతా శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళారు.
పాండవైః సహ రాజానః మరుత్వంతమివామరాః।
తదా చ దుఃసహాః సర్వే సదస్యాస్తే నరర్షభాః॥
అప్పుడు శత్రువులకు సహింపరానివారై సభాసదులైన రాజు లందరూ పాండవులతో కలిసి దేవతలు ఇంద్రుని దగ్గరకు వెళ్లినట్లు శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళారు.
జనార్దనం సమాసాద్య కుంతీపుత్రో యుధిష్ఠిరః॥)
అభ్యభాషత దాశార్హమ్ ఋషభం సర్వసాత్వతామ్॥ 1
కుంతీపుత్రుడైన ధర్మరాజు యదువంశ దశార్ణకుల నందనుడు ఐన జనార్దనుడి దగ్గరకు పోయి ఇలా అన్నాడు. (1)
అయం స కాలః సంప్రాప్తః మిత్రాణాం మిత్రవత్సలః।
న చ త్వదన్యం పశ్యామి యో న ఆపత్సు తారయేత్॥ 2
మిత్రవత్సలా! మిత్రుల సహాయం కోరవలసిన సమయం ఆసన్నమైనది. మమ్ములను ఆపదలనుండి గట్టెక్కించటానికి నీవు తప్ప మరెవ్వరూ కనిపించటం లేదు. (2)
త్వాం హి మాధనమాశ్రిత్య నిర్భయాః మోఘదర్పితమ్।
ధార్తరాష్ట్రం సహామాత్యం స్వయం సమనుయుఙ్ క్ష్మహే॥ 3
మాధవుడవైన నిన్ను ఆశ్రయించి నిర్భయులమై నిరుపయోగమైన గర్వాన్ని ప్రదర్శిస్తున్న సుయోధనుని, ఆయన మంత్రులనూ కూడా స్వయంగా అర్థిస్తాము. (3)
యతా హి సర్వాస్వాపత్సు పాపి వృష్ణీనరిందమ।
తథా తే పాండవా రక్ష్యాః పాహ్యస్మాన్ మహతో భయాత్॥ 4
శత్రుదమనా! వృష్ణివంశస్థులను అన్ని ఆపదల నుండి రక్షించినట్లే పాండవులను కూడా నీవు రక్షించాలి. మహాభయం నుండి మమ్ములను కాపాడు. (4)
శ్రీ భగవానువాచ
అయమస్మి మహాబాహో బ్రూహి యత్ తే వివక్షితమ్।
కరిష్యామి హి తత్ సర్వం యత్ త్వం వక్ష్యసి భారత॥ 5
శ్రీకృష్ణుడిలా అన్నాడు. మహాబాహూ! నేను సర్వదా సంసిద్ధుడనే. నీవు చెప్పదలచి చెప్పు. భారత! నీవు చెప్పిన దంతా నేను చేస్తాను. (5)
యుధిష్ఠిర ఉవాచ
శ్రుతం తే ధృతరాష్ట్రస్య సపుత్రస్య చికీర్షితమ్।
ఏతద్ధి సకలం కృష్ణ సంజయో మాం యదబ్రవీత్॥ 6
తన్మతం ధృతరాష్ట్రస్య సోఽస్యాత్మా వివృతాంతరః।
యథోక్తం దూత ఆచష్టే వధ్యః స్యాదన్యథాబ్రువన్॥ 7
యుధిష్ఠిరుడిలా అన్నాడు. కృష్ణా! కొడుకులతో కలిసి ధృతరాష్ట్రుడు చేయదలచిన పనిని నీవు కూడా విన్నావు. సంజయుడు నాతో చెప్పినదంతా ధృతరాష్ట్రుని అభిప్రాయమే. సంజయుడు ధృతరాష్ట్రుని ఆత్మ. ధృతరాష్ట్రుని మనస్సునే సంజయుడు బయటపెట్టాడు. దూత స్వామి చెప్పిన మాటలనే చెప్తాడు. దానికి భిన్నంగా మాట్లాడితే మరణశిక్షకు కూడా అర్హుడు అవుతాడు. (6,7)
అప్రదానేన రాజ్యస్య శాంతి మస్మాసు మార్గతి।
లుబ్ధః పాసేన మనసా చరన్నసమమాత్మనః॥ 8
ధృతరాష్ట్రుడు లోభ పాపచింతనతో తనకు తగనిరీతిలో ప్రవర్తిస్తున్నాడు. మాకు రాజ్యభాగ మివ్వకుండానే మమ్ములను శాంతి పరిచే మార్గాన్ని వెతుకుతున్నాడు. (8)
యత్ తద్ ద్వాదశ వర్షాణి వనేషు హ్యుషితా వయమ్।
ఛద్మనా శరదం చైకాం ధృతరాష్ట్రస్య శాసనాత్॥ 9
స్థాతా నః సమయే తస్మిన్ ధృతరాష్ట్రస్య ఇతి ప్రభో।
నాహాస్మ సమయం కృష్ణ తద్ధి నో బ్రాహ్మణా విదుః॥ 10
ప్రభూ! కృష్ణా! మేము ధృతరాష్ట్రుని శాసనం మేరకు పండ్రెండు సంవత్సరాలు అరణ్యంలో నివసించాము. ఒక సంవత్సరం అజ్ఞాతంగా గడిపాము. ధృతరాష్ట్రుడు మాట మీద నిలుస్తాడన్న నమ్మకంతో మేము ప్రతిజ్ఞా భంగం చేయలేదు. ఈ విషయం మాతో ఉన్న బ్రాహ్మణుల కందరకూ తెలుసు. (9,10)
గృద్ధో రాజా ధృతరాష్ట్రః స్వధర్మం నామపశ్యతి।
వశ్యత్వాత్ పుత్రగృద్ధిత్వాత్ మందస్యాన్వేతి శాసనమ్॥ 11
ధృతరాష్ట్రుడు లోభి. స్వధర్మాన్ని గమనించటం లేదు. పుత్రవ్యామోహంతో వానికి లొంగిపోయి ఆ బుద్ధిహీనుడి సుయోధనుడి మాటనే అనుసరిస్తుంటాడు. (11)
సుయోధనమతే తిష్ఠన్ రాజాస్మాసు జనార్దన।
మిథ్యాచరతి లుబ్ధః సన్ చరన్ హి ప్రియమాత్మనః॥ 12
జనార్దనా! ధృతరాష్ట్రుడు లోభియై సుయోధనుడి ఆలోచనల్లోనే నిలుస్తాడు. ఆ రీతిగా తన కిష్టమైన బాటలోనే పయనిస్తూ మాతో కపటంగా వ్యవహరిస్తూ ఉంటాడు. (12)
ఇతో దుఃఖతరం కిం ను యదహం మాతరం తతః।
సంవిధాతుం న శక్నోమి మిత్రాణాం వా జనార్దన॥ 13
జనార్దనా! నేను నా తల్లిని, మిత్రులను కూడా సరిగా పోషించలేకపోతున్నాను. ఇంతకన్నా బాధాకరమైన విషయమేమి ఉంటుంది? (13)
కాశిభిశ్చేది పంచాలైః మత్స్యైశ్చ మధుసూదన।
భవతా చైవ నాథేన పంచగ్రామా వృతా మయా॥ 14
మధుసూదనా! కాశీ, చేది, పాంచాల మత్స్య దేశాల వీరులంతా నాకు సహాయపడుతున్నా. నీవు దిక్కై నడిపిస్తున్నా నేను అయిదుగ్రామాలను మాత్రమే కోరాను. (14)
అవిస్థలం వృకస్థలం మాకందీం వారణావతమ్।
అవసానం చ గోవింద కంచిదేవాత్ర పంచమమ్॥ 15
పంచ నస్తాత దీయంతాం గ్రామా వా నగరాణి వా।
వసేమ సహితా యేషు మా చ నో భరతా నశన్॥ 16
తండ్రీ! అవిస్థలం, వృకస్థలం, మాకంది, వారణావతం ఈ నాలుగూ నీ కిష్టమైన మరొక్కటి కలిసి అయిదు నగరాలను కానీ గ్రామాలను కానీ మాకిమ్ము. మేమంతా కలిసి అక్కడే నివసిస్తాం. మా కారణంగా కురువంశం నశించ కూడదు. అనే కదా నే నడిగింది. (15,16)
న చ తానపి దుష్టాత్మా ధార్తరాష్ట్రోఽను మన్యతే।
స్వామ్యమాత్మని మత్వాఽసౌ అతో దుఃఖరం ను కిమ్॥ 17
కానీ దుష్టమనస్కుడైన ఆ దుర్యోధనుడు దానికి కూడా అంగీకరించటం లేదు. సర్వాధికారాలూ తనవే అని భావిస్తున్నాడు. ఇంతకన్నా బాధాకరమైన దే ముంటుంది.? (17)
కులే జాతస్య వృద్ధస్య పరవిత్తేషు గృద్ధ్యతః।
లోభః ప్రజ్ఞాన మాహంతి ప్రజ్ఞా హంతి హతా హ్రియమ్॥ 18
ఉన్నతవంశంలో పుట్టినా వార్థకంలో అడుగు పెట్టినా పరుల సొమ్ములకు ఆశపడితే ఆ లోభం యుక్తాయుక్త వివేకాన్ని నశింపజేస్తుంది. నశించిన వివేకం సిగ్గును కూడా లేకుండా చేస్తుంది. (18)
హ్రీర్హతా బాధతే ధర్మం ధర్మో హంతి హతః శ్రియమ్।
శ్రీర్హతా పురుషం హంతి పురుషస్యాధనం వధః॥ 19
సిగ్గులేనితనం ధర్మాన్ని బాధిస్తుంది. ధర్మం నశించి సంపదలను నశింపజేస్తుంది. సంపదలు నశిస్తే మనుషుడు నశించినట్లే. ఎందుకంటే మనిషికి డబ్బు లేకపోవటమే మరణం(వధ). (19)
అధనాద్ధి నివర్తంతే జ్ఞాతయః సుహృదో ద్విజాః।
అపుష్పాదఫలాద్ వృక్షాద్ యథా కృష్ణ పతత్రిణః॥ 20
కృష్ణా! పూలూ, పండ్లూ లేని చెట్టుకు పక్షులు దూరమైనట్లు డబ్బులేని వాని నుండి దాయాదులు, మిత్రులు, బ్రాహ్మణులు మరలిపోతారు. (20)
ఏతచ్చ మరణం తాత యన్మత్తః పతితాదివ।
జ్ఞాతయో వినివర్తంతే ప్రేతసత్త్వాదివాసవః॥ 21
నాయనా! ప్రేతశరీరం నుండి ప్రాణాలు వెళ్లి పోయినట్లు, పతితుని నుండి మనుష్యులు దూరమైనట్లు, నా దాయాదులు కూడా నా నుండి దూరమవుతారు. అదినాకు మరణంతో సమానం. (21)
నాతః పాపీయసీం కాంచిద్ అవస్థాం శంబరోఽబ్రవీత్।
యత్ర నైవాద్య న ప్రాతః భోజనం ప్రతిదృశ్యతే॥ 22
నేటికీ, మరునాడు ఉదయానికీ భోజనం లేకపోతే ఆ దారిద్ర్యం కన్న దుఃఖకరమైన అవస్థ లేదని శంబరుడు చెప్పాడు. (22)
ధనమాహుః పరం ధర్మం ధనే సర్వం ప్రతిష్ఠితమ్।
జీవంతి ధనినో లోకే మృతా యే త్వధనా నరాః॥ 23
ధనమే ఉత్తమ ధర్మసాధనమంటారు. అంతా ధనం లోనే ఉంది. లోకంలో ధనవంతులే బ్రతుకుతారు. ధన హీనులు మరణించిన వారిక్రిందే లెక్క. (23)
యే ధనాదపకర్షంతి నరం స్వబలమాస్థితాః।
తే ధర్మమర్థం కామం చ ప్రమథ్నంతి నరం చ తమ్॥ 24
తమ బలాన్ని తాము నిలుపుకొంటూ ఇతరుని ధనానికి దూరం చేసే మనుష్యులు ఇతరుని ధర్మాన్ని, అర్థాన్నీ, కామాన్నీ చివర ఆ మనుజుని కూడా నశింపజేస్తారు. (24)
ఏతామవస్థాం ప్రాప్యైకే మరణం వవ్రిరే జనాః।
గ్రామాయైకే వనాయైకే నాశాయైకే ప్రవవ్రజుః॥ 25
ఈ దారిద్ర్యమనే దుఃస్థితిని పొంది ఎందరో ఆత్మహత్యకు పాల్పడినారు. కొందరు గ్రామాన్ని వదలిపెట్టి వలసపోతుంటారు. మరికొందరు అరణ్యాలకు వెళ్తుంటారు. ఇంకాకొందరు ప్రాణత్యాగం చేయాలను ఇల్లు విడిచి పోతుంటారు. (25)
ఉన్మాద మేకే పుష్యంతి యాంత్యన్యే ద్విషతాం వశమ్।
దాస్యమేకే చ గచ్ఛంతి పరేషామర్థహేతునా॥ 26
కొందరు పిచ్చివారవుతుంటారు. మరికొందరు శత్రువులకు లొంగిపోతారు. కొందరు డబ్బుకోసం ఇతరులకు దాస్యం చేస్తుంటారు. (26)
ఆపదేవాస్య మరణాత్ పురుషస్య గరీయసీ।
శ్రియో వినాశస్త్ర ద్ధ్యస్య నిమిత్తం ధర్మకామయోః॥ 27
ధనహాని మనిషికి మరణాన్ని మించిన ఆపద. ఎందుకంటే ధర్మకామసిద్ధికి ధనమే కారణం గదా! (27)
యదస్య ధర్మ్యం మరణం శాశ్వతం లోకవర్త్మ తత్।
సమంతాత్ సర్వభూతానాం న తదత్యేతి కశ్చన॥ 28
మనిషికి ధర్మబద్ధమైన మరణమే పరలోకసిద్ధికి మార్గం. అది సనాతన భావం, సర్వప్రాణులలో ఏ ఒక్కటి అయినా మృత్యువును ఏవిధంగానూ అతిక్రమించలేదు. (28)
న తథా బాధ్యతే కృష్ణ ప్రకృత్యా నిర్ధనో జనః।
యథా భద్రాం శ్రియం ప్రాప్య తయా హీనః సుఖైధితః॥ 29
కృష్ణా! శుభప్రదమైన ఐశ్వర్యాన్ని పొంది, సుఖాలతో వృద్ధిచెంది, తరువాత దానిని కోల్పోయినవాడు పడే బాధను పుట్టుకతో దరిద్రుడైన వాడు ఎప్పుడూ పడడు. (29)
స తదాత్మాపరాధేన సంప్రాప్తో వ్యసనం మహత్।
సేంద్రాన్ గర్హయతే దేవాన్ నాత్మానం చ కథంచన॥ 30
స్వయంకృతాపరాధంతో కష్టం తెచ్చుకొన్న మానవుడు ఇంద్రాది దేవతలను తిట్టుతూ ఉంటాడు. కాని తాను చేసిన తప్పును మాత్రం తెలుసుకోడు. (30)
న చాస్య సర్వసాస్త్రాణి ప్రభవంతి నిబర్హణే।
సోఽభిక్రుధ్యతి భౄత్యానాం సుహృద శ్చాభ్యసూయతి॥ 31
సంపదల ననుభవించి దరిద్రుడైనవాడు పడే బాధనుండి తప్పించటానికి ఏ శాస్త్రము పనికి రాదు. అటువంటి వ్యక్తి సేవకులపై కోపాన్ని ప్రదర్శిస్తాడు. మిత్రులను దోషదృష్టితో చూస్తూ అసూయపడతాడు. (31)
తం తదా మన్యురే వైతి స భూయః సంప్రముహ్యతి।
స మోహవశమాపన్నః క్రూరమ్ కర్మ నిషేవతే॥ 32
ధనహీనుడిని కోపం ఆక్రమిస్తుంది. దానిత్ఫ్ మరల మోహంతో పడి వివేకాన్ని కోలుపోతాడు. మోహావేశంతో అతడు క్రూరకర్మలు చేయ నారంభిస్తాడు. (32)
పాపకర్మతయా చైవ సంకరం తేన పుష్యతి।
సంకరో నరకాయైవ సా కాష్ఠా పాపకర్మణామ్॥ 33
ఈ విధంగా పాపకర్మలకు లొంగిపోయిన వాడు వర్ణసంకరమైన సంతానాన్ని పొంది పోషిస్తాడు. సాంకర్యం నరకానికే దారితీస్తుంది. పాపిష్ఠమైన పనులకు చివరిగతి అదే గదా! (33)
న చేత్ ప్రబుధ్యతే కృష్ణ నరకాయైవ గచ్ఛతి।
తస్య ప్రబోధః ప్రజ్ఞైన ప్రజ్ఞాచక్షుస్తరిష్యతి॥ 34
కృష్ణా! పాపకర్మల నుండి మరల కర్తవ్యజ్ఞానాన్ని పొందలేకపోతే నరకానికి పోవలసివస్తుంది. ప్రజ్ఞయే కర్తవ్యబోధను కలిగించగలది. ప్రజ్ఞానేత్రం గలవాడే తరించగలడు. (34)
ప్రజ్ఞాలాభే హి పురుషః శాస్త్రాణ్యేవాన్వవేక్షతే।
శాస్త్రనిష్ఠః పునర్ధర్మం తస్య హ్రీరంగముత్తమమ్॥ 35
హ్రీమాన్ హి పాపం ప్రద్వేష్టి తస్య శ్రీరభివర్ధతే।
శ్రీమాన్ స యావద్ భవతి తావద్ భవతి పూరుషః॥ 36
ప్రజ్ఞను పొందిన పురుషులు శాస్త్రవిషయాలను పరిశీలించగలుగుతారు. శాస్త్ర నిష్ఠగలవాడు ధర్మాన్ని పాటింపగలుగుతారు. ధర్మానికి ప్రధానాంశం సిగ్గు(బిడియం). సిగ్గుగలవాడు పాపకర్మలను ద్వేషిస్తాడు. అప్పుడు అతని సంపద వృద్ధిపొందుతుంది. ఎంత ఎక్కువగా సంపదలుంటే అంత గొప్పవాడుగా మనిషి లెక్కింపబడతాడు. (35,36)
ధర్మనిత్యః ప్రశాంతాత్మా కార్యయోగవహః సదా।
నాధర్మే కురుతే బుద్ధిం న చ పాపే ప్రవర్తతే॥ 37
ధర్మతత్పరుడై ప్రశాంత మనస్సు గలవాడు ఎల్లప్పుడూ సత్కర్మల యందు ఆసక్తుడవుతాడు. అధర్మం మీద మనసు పెట్టడు. పాపపు పని చెయ్యడు. (37)
అహ్రీకో వా విమూఢో వా నైవ స్త్రీ న పునః పుమాన్।
నాస్యాధికారో ధర్మేఽస్తి యథా శూద్రస్తథైవ సః॥ 38
సిగ్గులేక పోయినా, మూర్ఖత్వానికి లోనయినా ఆ వ్యక్తి మగవాడూ కాదు, ఆడదీ కాదు. అటువంటి వానికి ధర్మకర్మలపై అధికారముండదు. కేవలం శూద్రునితో సమానం. (38)
హ్రీమానవతి దేవాంశ్చ పితౄనాత్మానమేవ చ।
తేనామృతత్వం వ్రజతి సా కాష్ఠా పుణ్యకర్మణామ్॥ 39
సిగ్గుగలవాడు తననూ, పితరులనూ, దేవతలనూ కాపాడుకొంటాడు. దానితో అమృతత్వాన్ని పొందుతాడు. పుణ్యకర్మల పరమప్రయోజనం అదే. (39)
తదిదం మయి తే దృష్టం ప్రత్యక్షం మధుసూదన।
యథా రాజ్యాత్ పరిభ్రష్టః వసామి వసతీరిమాః॥ 40
మధుసూదనా! నేను ఏవిధంగా రాజ్యాన్ని కోలుపోయానో, రోజులు ఎంత కష్టంగా గడుపుతున్నానో ఇదంతా నీవు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నావు. (40)
తే వయం న శ్రియం హాతుమ్ అలం న్యాయేన కేవచిత్।
అత్ర నో యతమానానాం వధశ్చేదపి సాధు తత్॥ 41
అటువంటి మేము ఏ విధంగా చూసినా పైతృకమయిన సంపత్తిని విడిచిపెట్టడం యుక్తం గాదు. సాధించుకొనే ప్రయత్నంలో మేము మరణించినా అది తగినదే. (41)
తత్ర నః ప్రథమః కల్పః యద్ వయం తే చ మాధవ।
ప్రశాంతాః సమభూతాశ్చ శ్రియం తామశ్నువీమహి॥ 42
మాధవ! మేమూ, ధార్తరాష్ట్రులూ ప్రశాంతంగా ఆ సంపదను సమానంగా అనుభవించాలన్నదే మా మొదటి లక్ష్యం. (42)
తత్రైషా పరమా కాష్ఠా రౌద్ర కర్మక్షయోదయా।
యద్ వయం కౌరవాన్ హత్వా తాని రాష్ట్రాణ్యవాప్నుమః॥ 43
మేము కౌరవులను సంహరించి ఆ రాజ్యాన్ని చేజిక్కుంచుకోవటం అంతిమలక్ష్యం. అయితే అది క్రూరకర్మాచారం. వినాశనం ద్వారా మాత్రమే సిద్ధిస్తుంది. (43)
యే పునః స్యురసంబద్ధాః అనార్యాః కృష్ణ శత్రవః।
తేషామప్యవధః కార్యః కిం పునర్యే స్యురీదృశాః॥ 44
కృష్ణా! శత్రువులు నీచులైనా, ఏ సంబంధమూ లేని వారయినా కూడా చంపటం తగని పని. ఆ పరిస్థితిలో దాయాదులైన వారిని చంపజూడటం తగినపని అవుతుందా? (44)
జ్ఞాతయశ్పైవ భూయిష్ఠాః సహాయా గురవశ్చ నః।
తేషాం వధోఽతిపాపీయాన్ కిం నో యుద్ధేఽస్తి శోభనమ్॥ 45
జ్ఞాతులంతా మిక్కిలి పెద్దవాళ్ళు. వారికి సహాయకులు మా గురువులు - వారిని వధించటం ఎంతో పాపం. యుద్ధం వల్ల ఏం శుభం కలుగుతుంది మాకు? (45)
పాపః క్షత్రియధర్మోఽయం వయం చ క్షత్రబంధవః।
స నః స్వధర్మోఽధర్మో వా వృత్తి రన్యా విగర్హితా॥ 46
యుద్ధం చేయుట మనే క్షత్రియధర్మం పాపహేతువే కానీ మేము క్షత్రియులం. కాబట్టి అధర్మమైనా సరే క్షత్రియ ధర్మమే మాకు స్వధర్మమవుతుంది. దానిని వీడి మరొక వృత్తిని స్వీకరించటం నిందకు గురి అవుతుంది. (46)
శూద్రః కరోతి శుశ్రూషాం వైశ్యా వై పణ్యజీవికాః।
వయం వధేన జీవామః కపాలం బ్రాహ్మణైః వృతమ్॥ 47
శూద్రులు సేవచేస్తారు. వైశ్యులు వ్యాపారంతో జీవిస్తారు. బ్రాహ్మణులు భిక్షాపాత్రను చేపడతారు. మేము ఇతరులను చంపియే జీవిస్తాము. (47)
క్షత్రియః క్షత్రియం హంతి మత్స్యో మత్స్యేన జీవతి।
శ్వా శ్వానం హంతి దాశార్హ పశ్య ధర్మో యథాగతః॥ 48
కృష్ణా! క్షత్రియుడు క్షత్రియుణ్ణి చంపుతాడు. చేప చేపను చంపి బ్రతుకుతుంది. కుక్క కుక్కను తింటుంది. చూశావా! ఇది పరంపరంగా వస్తున్న ధర్మం. (48)
యుద్ధే కృష్ణ కలిర్నిత్యం ప్రాణాః సీదంతి సంయుగే।
బలం తు నీతి మాధాయ యుధ్యే జయపరాజయౌ॥ 49
కృష్ణా! యుద్ధం నిత్యకలహమే. దానితో యుద్ధ భూమిలో ప్రాణాలు ఎన్నో పోతాయి. నైతిక బలాన్ని ఆశ్రయించి యుద్ధం చేస్తాను. గెలుపో, ఓటమో దైవాధీనం. (49)
నాత్మచ్ఛందేన భూతానాం జీవితం మరణం తథా।
నాప్యకాలే సుఖం ప్రాప్యం దుఃఖం వాపి యదూత్తమ॥ 50
యాదవశ్రేష్ఠా! ప్రాణుల జీవన మరణాలు తమ ఇచ్చననుసరించి యుండవు. సుఖమైనా, దుఃఖమైనా పొందవలసిన సమయంలోనే సమకూడుతుంది. (50)
ఏకో హ్యపి బహూన్ హంతి ఘ్నంత్యైకం బహవోఽప్యుత।
శూరం కాపురుషో హంతి అయశస్వీ యశస్వినమ్॥ 51
యుద్ధంలో ఒకే వీరుడు చాలామందిని చంపవచ్చు. చాలా మంది కలసి ఒక్కడిని చంపవచ్చు. ఒక నీచుడు శూరుని సంహరించవచ్చు. పేరులేనివారు పేరుగన్నవానిని సంహరించవచ్చు. (51)
జయో నైవోభయో ర్దృష్టః నోభయోశ్చ పరాజయః।
తథైవాపచయో దృష్టః వ్యపయానే క్షయవ్యయౌ॥ 52
యుద్ధంలో ఇరుపక్షాలకూ గెలుపు దక్కదు. ఓటమి కూడా అంతే. హాని, సంపద నశించటం ఉభయ పక్షాలకూ సమానమే. ఒకవేళ రణరంగం నుండి వెనుకకు మరలినా జనక్షయం. ధనవ్యయం రెండూ తప్పవు. (52)
సర్వథా వృజినం యుద్ధం కో ఘ్నన్ న ప్రతిహన్యతే।
హతస్య చ హృషీకేశ సమౌ జయపరాజయౌ॥ 53
హృషీకేశా! యుద్ధం అన్నిరకాలా పాపహేతువే. ఇతరులను చంపినంత మాత్రాన తాను మరొకరి చేత చంపబడటాన్ని ఆపలేడు. యుద్ధంలో మరణించిన వాడికి జయమూ, అపజయమూ రెండూ సమానమే. (53)
పరాజయశ్చ మరణాత్ మన్యే నైవ విశిష్యతే।
యస్య స్యాద్ విజయః కృష్ణ తస్యాప్యపచయో ధ్రువమ్॥ 54
కృష్ణా! పరాజయం మరణం కంటె గొప్ప దేమీ కాదు. గెలిచిన వాడయినా జన ధన వినాశనం నుండి తప్పించుకోలేడన్నది నిశ్చయం. (54)
అంతతో దయితం ఘ్నంతి కేచిదప్యపరే జనాః।
తస్యాంగ బలహీనస్య పుత్రాన్ భ్రాతౄనపశ్యతః॥ 55
నిర్వేదో జీవితే కృష్ణ సర్వత శ్చోపజాయతే।
గెలిచినా సరే గెలుపు సిద్ధించేలోపు శత్రుసైనికులెందరో తమ ఆప్తుల నెందరినో చంపుతారు. అందువలన పుత్రులనూ, సోదరులనూ కోలుపోయి బలహీనుడైనవాడు అన్నింటిపై విరక్తిని పొంది తుదకు జీవితం మీద కూడా విరక్తుడవుతాడు. (55 1/2)
యే హ్యేవ ధీరా హ్రీమంతః ఆర్యాః కరుణవేదినః ॥ 56
త ఏవ యుద్ధే హన్యంతే యవీయాన్ ముచ్యతే జనః।
హత్వాప్యనుశయో నిత్యం పరానపి జనార్దన॥ 57
జనార్దనా! యుద్ధంలో సాధారణంగా ధీరులూ, సిగ్గుపడేవారూ, పూజ్యులూ, దయామయులూ అయిన వారే చంపబడతారు. సామాన్యుడు బ్రతికి బయట పడతాడు. శత్రువులను చంపి గెలిచిన తర్వాత కూడా ఎప్పుడూ పశ్చాత్తాపపడ వలసివస్తుంది. (56,57)
అనుబంధశ్చ పాపోఽత్ర శేషశ్చాప్యవశిష్యతే।
శేషో హి బలమాసాద్య న శేషమనుశేషయేత్॥ 58
సర్వోచ్ఛేదే చ యతతే వైరస్యాంతవిధిత్సయా।
పారిపోయే వారిని వెంటాడి చంపటం కూడా పాపమే. అలా పారిపోయిన శత్రువులలో ఎవరో ఒకరు మిగులుతారు. ఆ మిగిలినవాడు బలాన్ని పుంజుకొని విజేతలలో మిగ్లినవారిని చంపగోరుతాడు. శత్రువులను అంతమొందించాలన్న ఆలోచనతో సర్వనాశనం చేయటానికి ప్రయత్నిస్తాడు. (58 1/2)
జయో వైరం ప్రసృజతి దుఃఖమాస్తే పరాజితః।
సుఖం ప్రశాంతః స్వపిటి హిత్వా జయపరాజయౌ।
గెలుపుకూడా వైరాన్నే సృష్టిస్తుంది. ఓడినవాడు దుఃఖంతో కాలం గడుపుతాడు. కాబట్టి జఆపజయాలను విడిచి ప్రశాంతంగా ఉన్నవాడే సుఖంగా నిద్రించ గలుగుతాడు. (59 1/2)
జాతవైరశ్చ పురుషః దుఃఖం స్వపితి నిత్యదా॥ 60
అనివృత్తేన మనసా ససర్ప ఇవ వేశ్మని।
ఎవరితో నయినా శత్రుత్వం ఏర్పడినవాడు ఇంటిలో పాముతో సహజీవనం చేయవలసినట్లు ఎప్పుడూ ఉద్విగ్న మనస్సుతో, కలత నిదుర మాత్రమే పొందుతాడు. (60 1/2)
ఉత్పాదయతి యః సర్వం యశసా స విముచ్యతే॥ 61
అకీర్తిం సర్వభూతేషు శాశ్వతీం సోఽధిగచ్ఛతి।
శత్రుపక్షంలోని అందరినీ నాశనం చేసిన వాడుకూడా కీర్తిని పొందజాలడు. సర్వప్రాణులలోనూ శాశ్వతమయిన అపకీర్తినే తాను పొందుతాడు. (61 1/2)
న హి వైరాణి శామ్యంతి దీర్ఘకాలదృతాన్యపి॥ 62
ఆఖ్యాతారశ్చ విద్యంతే పుమాంశ్చేద్ విద్యతే కులే।
శత్రుత్వాన్ని చిరకాలం మనస్సులో నిలుపుకొన్నా అది ఉపశమించదు. ఏ ఒక్కరో వంశంలో మిగిలినా అతనికి గతాన్ని గుర్తుచేస్తూ మాట్లాడే ప్రజలు చాలా మంది ఉంటారు. (62 1/2)
న హి వైరాణి శామ్యంతి దీర్ఘకాలధృతాన్యపి॥ 62
ఆఖ్యాతారశ్చ విద్యంతే పుమాంశ్చేద్ విద్యతే కులే।
శత్రుత్వాన్ని చిరకాలం మనస్సులో నిలుపుకొన్నా అది ఉపశమించదు. ఏ ఒక్కరో వంశంలో మిగిలినా అతనికి గతాన్ని గుర్తుచేస్తూ మాట్లాడే ప్రజలు చాలా మంది ఉంటారు. (62 1/2)
న చాపి వైరం వైరేణ కేశవ వ్యుపశామ్యతి॥ 63
హవిషాగ్నిర్యథా కృష్ణ భూయ ఏవాభివర్ధతే।
కృష్ణా! మండుతున్న అగ్నిలో ఆహుతులను వేస్తే అది మరీ ప్రజ్వరిల్లి నట్లు శత్రుత్వంతో శత్రుత్వం పెరుగుతుందే కానీ ఉపశమించదు. (63 1/2)
అతోఽన్యథా నాస్తి శాంతిః నిత్యమంతరమంతతః॥ 64
అంతరం లిప్సమానానామ్ అయం దోషో నిరంతరః।
కాబట్టి ఉభయ పక్షాలలో ఏదో ఒకటి పూర్తిగా నశించేదాకా స్థిరమైన శాంతి లభించదు. తప్పులు వెతికేవారికి ఈ పరిస్థితి ఎప్పుడూ తప్పదు. (64 1/2)
పౌరుషే యో హి బలవాన్ ఆధిర్హృదయబాధనః।
తస్య త్యాగేన వా శాంతిః మరణేనాపి వా భవేత్॥ 65
పౌరుషంలో మనస్సును కలత పెట్టే చింత ఎల్లప్పుడూ ఉంటుంది. వైరాగ్యంతో దానిని(చింతను) విడిచిపెట్టటం లేదా మరణించటం మాత్రమే దానికి పరిష్కారం. (65)
అథవా మూలఘాతేన ద్విషతాం మధుసూదన।
ఫలనిర్వృత్తిరిద్ధా స్యాత్ తన్నృశంసతరం భవేత్॥ 66
కృష్ణా! అలా కాకపోతే శత్రువులను మొదలంటు నాశనం చేయగలగటం ద్వారా ఇష్టఫలసిద్ధిని పొందవచ్చు. కానీ అది మరీ క్రూరమైన పని. (66)
యాతు త్యాగేన శాంతిః స్యాత్ తదృతే వధ ఏవ సః।
సంశయాచ్చ సముచ్ఛేదాద్ ద్విషతామాత్మనస్తథా॥ 67
రాజ్యపరిత్యాగం ద్వారా(రాజ్యానికి దూరమై)పొందే శాంతి కూడా మరణంతో సమానమే. అది శత్రువులకు నిత్యమూ అనుమానాలను కల్పిస్తూనే ఉంటుంది. తాను ఐశ్వర్యాన్ని కోలుపోవడం చేత ఎప్పుడైనా నశించిపోవచ్చు. (67)
న చ త్యక్తుం తదిచ్ఛామః న చేచ్ఛామః కులక్షయమ్।
అత్ర యా ప్రణిపాతేన శాంతిః సైవ గరీయసీ॥ 68
రాజ్యాన్ని వదలుకోవటం కానీ వంశం నాశనం కావటం కానీ మాకిష్టం లేదు. వినమ్రతతో పొండగల శాంతియే అన్నింటికన్న గొప్పది. (68)
సర్వథా యతమానానామ్ అయుద్ధమభికాంక్షతామ్।
సాంత్వే ప్రతిహతే యుద్ధం ప్రసిద్ధం నాపరాక్రమః॥ 69
మేము యుద్ధాన్ని కోరుకోవటంలేదు. సామదాన భేదోపాయాలతోనే రాజ్యాన్ని పొందాలని ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ మా విన్నపాలు విఫలమయితే యుద్ధం చేయకతప్పదు. పరాక్రమాన్ని పరిత్యజించటం మా అభిమతం కాదు. (69)
ప్రతిఘాతేన సాన్త్వస్య దారుణం సంప్రవర్తతే।
తచ్ఛునామివ సంపాతే పండితై రుపలక్షితమ్॥ 70
శాంతికై చేసిన విన్నపాలు విఫలమయితే దారుణమైన యుద్ధం సంభవిస్తుంది. యుద్ధాన్ని కుక్కల కొట్లాటగా పండితులు భావిస్తారు. (70)
లాంగూలచాలనం క్ష్వేడా ప్రతివాచో వివర్తనమ్।
దంతదర్శన మారావః తతో యుద్ధం ప్రవర్తతే॥ 71
తోకనూపటం, గుర్రుపెట్టటం, బదులు అరవటం, ఒకదాని చుట్టూ మరొకటి తిరగటం, దంతాలు చూపించటం, మొరగటం, ఆపై కలియబడటం, ఇది కుక్కల ఘర్షణ పద్ధతి. (71)
తత్ర యో బలవాన్ కృష్ణ జిత్వా సోఽత్తి తదామిషమ్।
ఏవమేవ మనుష్యేషు విశేషో నాస్తి కశ్చన॥ 72
వాటిలో ఎక్కువ బలం కలది గెలిచి ఆ మాంసాన్ని తింటుంది. మనుష్యులలో కూడా ఇదే స్థితి. విశేషమేమీ లేదు. (72)
సర్వథా త్వేత దుచితం దుర్బలేషు బలీయసామ్।
అనాదరోఽవిరోధశ్చ ప్రణిపాతీ హి దుర్బలః॥ 73
బలవంతులకు బలహీనులపై ఆదరం లేకపోవటం ఎటుచూసినా తగినదే. వారు బలహీనులతో శత్రుత్వాన్ని కూడా పెట్టుకోరు. లొంగిపోవటానికి సిద్ధపడేవాడు దుర్బలుడు. దుర్బలుడు ఎప్పుడూ ఒదిగియే ఉంటాడు. (73)
పితా రాజా చ వృద్ధశ్చ సర్వథా మానమర్హతి।
తస్మాన్మాన్యశ్చ పూజ్యశ్చ ధృతరాష్ట్రో జనార్దన॥ 74
జనార్దనా! తండ్రి, రాజు, వృద్ధుడు సర్వ విధాల పూజనీయులే. కాబట్టి ధృతరాష్ట్రుడు మాకు మాననీయుడు, పూజనీయుడు కూడా! (74)
పుత్రస్నేహశ్చ బలవాన్ ధృతరాష్ట్రస్య మాధవ।
స పుత్రవశమాపన్నః ప్రణిపాతం ప్రహాస్యతి॥ 75
మాధవ! ధృతరాష్ట్రునకు పుత్రప్రేమ ఎక్కువ. కొడుకును వశమై పోయిన ఆయన మా ప్రార్థనను పరిహసిస్తాడు. (75)
తత్ర కిం మన్యసే కృష్ణ ప్రాప్తకాల మనంతరమ్।
కథమర్థాచ్చ ధర్మాచ్చ న హీయేమహి మాధవ॥ 76
కృష్ణా! మాధవా! ఈ స్థితిలో ఏంచేస్తే బావుంటుందని నీవు అనుకొంటున్నావు? మేము ధర్మార్థాలను కోలుపోకుండా నిలువగల మార్గమేది? (76)
ఈదృశేఽత్యర్థ కృచ్ఛ్రేఽస్మిన్ కమన్యం మధుసూదన।
ఉపసంప్రష్టుమార్హామి త్వామృతే పురుషోత్తమ॥ 77
మధుసూదనా! పురుషోత్తమా! ఇటువంటి తీవ్ర సంకట స్థితిలో నీతోగాక మరెవ్వరితో నేను సంప్రదించగలను? (77)
ప్రియశ్చ ప్రియకామశ్చ గతిజ్ఞః సర్వకర్మణామ్।
కోహి కృష్ణాస్తి నస్త్వాదృక్ సర్వనిశ్చయవిత్ సుహృత్॥ 78
కృష్ణా! మాకు ఇష్టుడవు. శ్రేయోభిలాషివి. సర్వకార్యాల పరిణామాలు తెలిసినవాడవు. సమస్తవిషయాలలో నిశ్చిత బుద్ధి గలవాడవు. నీవంటి మిత్రుడు మాకు మరెవ్వరున్నారు? (78)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తః ప్రత్యువాచ ధర్మరాజం జనార్దనః।
ఉభయోరేవ వామర్థే యాస్యామి కురుసంసదమ్॥ 79
వైశంపాయనుడిలా అంటున్నాడు. ధర్మరాజు మాటలు వినిన జనార్దనుడు ధర్మరాజుతో ఇలా అంటున్నాడు. నేను మీ ఉభయపక్షాల క్షేమంకోసం కురురాజ సభకు వెళ్తున్నాను. (79)
శమం తత్ర లభేయం చేద్ యుష్మదర్థ మహాపయన్।
పుణ్యం యే సుమహద్ రాజన్ చరితం స్యాన్మహాఫలమ్॥ 80
రాజా! అక్కడకుపోయి మీ ప్రయోజనాలకు దెబ్బ తగలనీయకుండా సంధిని చేయగలిగితే నేనెంతో గొప్ప ఫలితాన్ని సాధించినట్టు. మహాపుణ్యకార్యాన్ని చేసినట్టు కూడా అవుతుంది. (80)
మోచయేయం మృత్యుపాశాత్ సంరబ్దాన్ కురుస్ఱ్ఱింజయాన్।
పాండవాణ్ ధార్తరాష్ట్రాంశ్చ సర్వాం చ పృథివీమిమామ్॥ 81
సంధి చేయగలిగితే పరస్పర విద్వేషంగల కురు - సృంజయ, పాండవ - ధార్తరాష్ట్రులను సమస్త భూమండలాన్ని కూడా మృత్యుపాశం నుండి విడిపించగలిగినట్లే. (81)
యుధిష్ఠిర ఉవాచ
న మమైతన్మతం కృష్ణ యత్ త్వం యాయాః కురూన్ ప్రతి।
సుయోధనః సూక్తమపి న కరిష్యతి తే వచః॥ 82
ధర్మరాజు ఇలా అన్నాడు. కృష్ణా! నీవు కౌరవుల దగ్గరకు వెళ్లాలన్నది నా అభిమతం గాదు. నీవెంత మంచి మాటలు చెప్పినా సుయోధనుడు వాటిని వినడు/ఆచరించడు. (82)
సమేతం పార్థివం క్షత్రం దుర్యోధనవశానుగమ్।
తేషాం మధ్యావతరణం తవ కృష్ణ న రోచయే॥ 83
కృష్ణా! అంతేగాక దుర్యోధనుని అధీనమైన సమస్తరాజలోకం ప్రస్తుతం అక్కడ చేరింది. వార మధ్యకు నీవు వెళ్ళటం నాకు ఇష్టం లేదు. (83)
న హి నః ప్రీణయేద్ ద్రవ్యం న దేవత్వం కుతః సుఖమ్।
న చ సర్వామరైశ్వర్యం తవ ద్రోహేణ మాధవ॥ 84
మాధవ! దుర్యోధనుని కారణంగా నీకేమైనా ద్రోహం గలిగేటట్లయితే ధనమూ, దివ్యత్వమూ, సుఖమూ, సకల దేవతల ఐశ్వర్యమయినా సరే మాకవసరం లేదు. (84)
శ్రీ భగవానువాచ
జానా మ్యేతాం మహారాజ ధార్తరాష్ట్రస్య పాపతామ్।
అవాచ్యాస్తు భవిష్యామః సర్వలోకే మహీక్షితామ్॥ 85
శ్రీకృష్ణుడిలా అన్నాడు. మహారాజ! ధార్తరాష్ట్రుడైన సుయోధనుడు ఎంత దుర్మార్గుడో నాకు తెలుసు. కానీ సంధికి ప్రయత్నిస్తే లోకంలోని ఏ రాజుకు కూడా మనలను తప్పు పట్టే అవకాశముండదు. (85)
న చాపి మమ పర్యాప్తాః సహితాః సర్వపార్థివాః।
క్రుద్ధస్య సంయుగే స్థాతుం సింహస్యేవేతరే మృగాః॥ 86
అయినా కూడా సింహం ముందు ఇతర జంతువులు నిలువలేనట్లు నాకు కోపాన్నీ కల్గించిన తర్వాత రాజులందరూ ఒకటై ఎదురు నిలిచినా సరిపోరు. (86)
అథ చేత్ తే ప్రవర్తంతే మయి కించి దసాంప్రతమ్।
నిర్దహేయం కురూన్ సర్వాన్ ఇతి మే ధీయతే మతిః॥ 87
ఒక వేళ కౌరవులు నాతో ఏరీతిగా అయినా అనుచితంగా ప్రవర్తిస్తే వారినందరినీ బూడిదచేస్తాను. ఇది నా నిర్ణయం. (87)
న జాతు గమనం పార్థ భవేత్ తత్ర నిరర్థకమ్।
అర్థప్రాప్తిః కదాచిత్ స్యాత్ అంతతో వాప్యవాచ్యతా॥ 88
కౌంతేయా! నేను సంధికై అక్కడకు వెళ్ళటం ఏ విధంగానూ నిష్ప్రయోజనం గాదు. కార్యసిద్ధి కలగవచ్చు. కార్యభంగమైనా మనలను వ్రేలెత్తిచూసే అవకాశం అప్పుడు ఇతరుల కుండదు. (88)
యత్ తుభ్యం రోచతే కృష్ణ స్వస్తి ప్రాప్నుహి కౌరవాన్।
కృతార్థం స్వస్తిమంతం త్వాం ద్రక్ష్యామి పునరాగతమ్॥ 89
కృష్ణా! నీ కేది ఇష్టమైతే అదే చేయి. నీకు శుభం కలగాలి. కౌరవుల దగ్గరకు బయలుదేరు. క్షేమంగా, లాభంగా మరలివచ్చిన నిన్ను నేను చూడగలగాలి. (89)
విష్వక్సేన కురూన్ గత్వా భరతాన్ శమయ ప్రభో।
యథా సర్వే సుమనసః సహ స్యామ సుచేతసః॥ 90
విస్వక్సేన! నీవు కౌరవుల దగ్గరకు పోయి భరతవంశానికి ఏర్పడిన సంకట స్థితిని పోగొట్టు. మా అందరి మనస్సులలోని కలతలు తొలగిపోయి మేమంతా మంచిగా కలిసి జీవించేటట్లు చూడు. (90)
భ్రాతా చాసి సఖా చాసి బీభోత్సర్మమ చ ప్రియః।
సౌహృదేనావిశంక్యోఽసి స్వస్తి ప్రాప్నుహి భూతయే॥ 91
మాకు సోదరుడవు, మిత్రుడవు. అర్జునునకు నాకూ ఇష్టమైన వాడవు. మంచితనంలో శంకింపదగని వాడవు. ఉభయపక్షాల క్షేమం కోసం వెళ్ళిరా, నీకు శుభం జరగాలి. (91)
అస్మాన్ వేత్థ పరాన్ వేత్థ వేత్థార్థాన్ వేత్థ భాషితమ్।
యద్ యదస్మద్ధితం కృష్ణ తత్ తద్ వాచ్యః సుయోధనః॥ 92
కృష్ణా! మమ్ములను ఎరుగుదువు. శత్రువులనూ ఎరుగుదువు. అర్థసిద్ధినీ ఎరుగుదువు. మాటాడటం ఎరుగుదువు. ఏయే మాటల వల్ల మాకు మేలు జరుగుతుందో ఆయా మాటలనే సుయోధనుడికి చెప్పు. (92)
యద్ యద్ ధర్మేణ సంయుక్తమ్ ఉపపద్యేద్ధితం వచః।
తత్ తత్ కేశవ భాషేథాః సాంత్వ వా యది వేతరత్॥ 93
కేశవా! లలితమైనా, కఠినమైనా సరే ధర్మబద్ధమై హితకరమైన పలుకులనే తప్పక మాట్లాడు. (93)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి యుధిష్ఠిర కృత కృష్ణప్రేరణే ద్విసప్తతితమోఽధ్యాయ॥72 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యానపర్వమను ఉపపర్వమున యుధిష్ఠిరుడు కృష్ణుని పంపించుట అను డెబ్బది రెండవ అధ్యాయము. (72)
(దాక్షిణాత్య ప్రతి అధికపాఠము 5 1/2 శ్లోకము కలిపి మొత్తం 98 1/2 శ్లోకాలు)