73. డెబ్బది మూడవ అధ్యాయము

శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుని యుద్ధమునకు పురికొల్పుట.

శ్రీభగవానువాచ
సంజయస్య శ్రుతం వాక్యం భావతశ్చ శ్రుతం మయా।
సర్వం జానామ్యభిప్రాయం తేశ్హాం చ భవతశ్చ యః॥ 1
శ్రీకృష్ణుడిలా అన్నాడు - సంజయుని మాటలు విన్నాను. నీ మాటలూ విన్నాను. వారి అభిప్రాయాన్ని నీ అభిప్రాయం కూడా మొత్తం నేనెరుగుదును. (1)
తవ ధర్మాశ్రితా బుద్ధిః తేషాం వైరాశ్రయా మతిః।
యద్య యుద్ధేన లభ్యేత తత్ తే బహుమతం భవేత్॥ 2
నీబుద్ధి ధర్మాన్ని ఆశ్రయించి ఉంది. వారి బుద్ధి శత్రుత్వాన్ని ఆశ్రయించి ఉంది యుద్ధం లేకుండా పొందగలిగినదే నీకు బాగా ఇషటంగా కనిపిస్తోంది. (2)
న చైవం నైష్ఠికం కర్మ క్షత్రియస్య విశాంపతే।
ఆహురాశ్రమిణః సర్వే న భైక్షం క్షత్రియశ్చరేత్॥ 3
రాజా! ఇది క్షత్రియులకు స్వాభావికమైనదిగాదు. అన్ని ఆశ్రమాల(బ్రహ్మచర్యం మొదలగు ఆశ్రమాలు) లోని వారూ క్షత్రియులకు యాచన తగదనే అంటారు. (3)
జయో వధో వా సంగ్రామే ధాత్రా దిష్టః సనాతనః।
స్వధర్మః క్షత్రియస్యైషః కార్పణ్యం న ప్రశస్యతే॥ 4
యుద్ధంలో గెలుపో, మరణమో క్షత్రియునకు బ్రహ్మ నిర్దేశించిన సనాతన స్వధర్మం, క్షత్రియునకు దైన్యం పనికిరాదు. (4)
వి॥సం॥ కార్పణ్యమ్ = గ్రామాలు అయిదు ఇమ్ము అనే దీనమైన మాట(నీల)
న హి కార్పణ్యమాస్థాయ శక్యా వృత్తిర్యుధిష్ఠిర।
విక్రమస్వ మహబాహో జహి శాత్రూన్ పరంతప॥ 5
ధర్మరాజా! దైన్యంతో క్షత్రియుడు జీవించటం కష్టం. పరంతపా! మహాబాహూ! పరాక్రమించి శత్రువులను సంహరించు. (5)
అతిగృద్ధాః కృతస్నేహాః దీర్ఘకాలం సహోషితాః।
కృతమిత్రాః కృతబలాః ధార్తరాష్ట్రాః పరంతప॥ 6
పరంతపా! ధార్తరాష్ట్రులు చాలా లుబ్ధులు. ఎందరో రాజులతో జతకట్టి చాలాకాలంగా కలిసి జీవిస్తున్నారు. స్నేహాన్నీ బలాన్నీ సమకూర్చుకొని ఉన్నారు. (6)
న పర్యాయోఽస్తి యత్ సామ్యం త్వయి కుర్యుర్విశాంపతే।
బలవత్తాం హి మన్యంతే భీష్మద్రోణకృపాదిభిః॥ 7
రాజా! వారు నీతో సంధి చేసుకొనగల రనటానికి ఏ ఉపాయమూ/ అవకాశమూ కనిపించటం లేదు. భీష్మద్రోణ కృపాదులను చూచి వారు తమను బలవంతులుగా భావించుకొంటున్నారు. (7)
యావచ్చ మార్దవేనైతాన్ రాజన్నుపచరిష్యసి।
తావదేతే హరిష్యంతి తవ రాజ్యమరిందమ॥ 8
అరిందమా! రాజా! అటువంటివారితో నీవు మృదువుగా వ్యవహరించినంత కాలం వారు నీరాజ్యాన్ని అపహరించటానికే ప్రయత్నిస్తారు. (8)
నానుక్రోశాన్న కార్పణ్యాత్ న చ ధర్మార్థకారణాత్।
అలం కర్తుం ధార్తరాష్ట్రాః తవ కామమరిందమ॥ 9
అరిందమా! రాజా! ధార్తరాష్ట్రులు దయతోనో, నీమీద జాలితోనో, ధర్మార్థాలను పాలించాలన్న దృష్టితోనో, నీ కోరికను తీరుస్తారని అనుకోవద్దు. (9)
ఏతదేవ నిమిత్తం తే పాండవాస్తు యథా త్వయి।
నాన్వతప్యంత కౌపీనం తావత్ కృత్వాపి దుష్కరమ్॥ 10
పాండవా! కౌరవులు సంధికి అంగీకరించ రనటానికి ఇదొక్క కారణం చాలును. ఏమిటంటే మీరు కౌపీనాళు ధరించి అరణ్యవాస క్లేశాలను అనుభవించినా వారికి ఏమాత్రం పశ్చాత్తాపం/ సానుభూతి కూడ కలుగలేదు. (10)
పితామహస్య ద్రోణస్య విదురస్య చ ధీమతః।
బ్రాహ్మణానాం చ సాధూనాం రాజ్ఞశ్చ నగరస్య చ॥ 11
పశ్యతాం కురుముఖ్యానాం సర్వేషామేవ తత్త్వతః।
దానశీలం మృదుం దాంతం ధర్మశీలమనువ్రత్మ్॥ 12
యత్ త్వాముపధినా రాజన్ ద్యూతే వంచితవాంస్తదా।
న చాపత్రపతే తేన నృశంసః స్వేన కర్మణా॥ 13
రాజా! నీవు దానశీలుడవు, కోమలుడవు, నిగ్రహం గలవాడవు ధర్మతత్పరుడవు, నిష్ఠగలవాడవు. అటువంటి నిన్ను కూడా భీష్మ్డుఉ, ద్రోణుడు, విదురుడు, సాధువులు, బ్రాహ్మణులు, మహారాజు ధృతరాష్ట్రుడూ, పుఅరజనులూ, కురుముఖ్యులు అందరూ చూస్తుండగానే కపట ద్యూతంతో (జూదం0 మోసగించారు. తాను చేసిన ఆ పనికి ఆ హీనుడు సిగ్గుపడడు కూడా! (11,12,13)
తథాశీలసమాచారే రాజన్ మా ప్రణయం కృథాః।
వధ్యాస్తే సర్వలోకస్య కిం పునస్తవ భారత॥ 14
రాజా! అటువంటి స్వభావమూ, ప్రవర్తన గల ఆ సుయోధనుడిపై ప్రేమను ప్రదర్శించవద్దు. భరతవంశీయా! ఆ ధార్తరాష్ట్రులు లోకులందరి చేతనూ చంపదగినవారే. ఇక నీవు చంపటంలో విశేషమేముంది? (14)
వాగ్భీస్త్వప్రతిరూపాభిః అతుదత్ త్వాం సహాణుజమ్।
శ్లాఘమానః ప్రహృష్టః సన్ భ్రాతృభిః సహ భాషతే॥ 15
ఏతావత్ పాండవానాం హి నాస్తి కించిదిహ స్వకమ్।
నామధేయం చ గోత్రం చ తదప్యేషాం న శిష్యతే॥ 16
అనుచితమైన మాటలతో, నీ తమ్ములతోబాటు నిన్ను ఆనాడు బాధించాడు, రెచ్చగొట్టాడు. ఇప్పుడు కూడా తనను పొగడుతుంటే సోదరులతో "ఇక పాండవులకు తమదంటూ ఏదీ ఈ భూమిపై లేదు. గోత్రాలూ, పేరులూ కూడా వారికి మొగలవు" అంటుంటాడట. (15,16)
కాలేన మహతా చైషాం భవిష్యతి పరాభవః।
ప్రకృతిం తే భజిష్యంతి నష్రప్రకృతయో మయి॥ 17
చాలాకాలం తర్వాత అయినా వారికి పరాభవం తప్పదు. స్వాభావికాలైన వీరత్వాదిగుణాలు నశించి వారు నాచెంత మరణించగలరు. (17)
దుఃశాసనేన పాపేన తదా ద్యూతే ప్రవర్తితే।
అనాథవత్ తదా దేవీ ద్రౌపదీ సుదురాత్మనా॥ 18
ఆకృష్య కేశే రుదతీ సభాయాం రాజసంసది।
భీష్మద్రోణప్రముఖతః గౌరితి వ్యాహృతా ముహుః॥ 19
మాయాద్యూతం జరిగినరోజు దుర్మార్గుడు, పాపాత్ముడు అయిన దుశ్శాసనుడు ద్రౌపది జుట్టుపట్టుకొని దిక్కుతోచక ఆమె విలపిస్తున్నా, రాజసభకు ఈడ్చుకొని వచ్చి, భీష్ముడు ద్రోణుడు మొదలయిన పెద్దల సమక్షంలోనే ఆమెను పరిహసించాడు. పదేపదే(పాడవులను) ఎద్దు (గోవు) అంటూ పిలిచాడు. (18,19)
భవతా వారితాః సర్వే భ్రాతరో భీమవిక్రమాః।
ధర్మపాశనిబద్ధాశ్చ న కించిత్ ప్రతిపేదిరే॥ 20
నీ సోదరులు భీకర పరాక్రమశాలులు అయి కూడా నీవు వారించినందువలన ధర్మపాశానికి కట్టుబడి ఎటువంటి ప్రతీకారాన్ని చేయలేదు. (20)
ఏతాశ్చాన్యాశ్చ పరుషా వాచః స సముదీరయన్।
శ్లాఘతే జ్ఞాతిమధ్యే స్మ త్వయి ప్రవ్రజితే వనమ్॥ 21
అంతేకాదు. నీవు అరణ్యాలకు బయలుదేరినప్పుడు కూడా దాయాదుల మధ్య నిలిచి పరుష వాక్యాలు పలుకుతూ తన్ను తాను ప్రశంసించుకొన్నాడు. (21)
యే తత్రాసన్ సమానీతాః తే దృష్ట్వా త్వామనాగసమ్।
అశ్రుకంఠా రుదంతశ్చ స్భాయామాసతే తదా॥ 22
అక్కడ అతిథులుగా ఉన్నవారంతా నిర్దోషివైన నిన్ను చూచి కంటతడిపెట్టుకొని ఏడుస్తూ సభలో మిన్నకుండి పోయారు. (22)
న చైవమభ్యనందంస్తే రాజానో బ్రాహ్మణైః సహ।
సర్వే దుర్యోధనం తత్ర నిందంతి స్మ సభాసదః॥ 23
అక్కడున్న రాజులుగానీ బ్రాహ్మణులు గానీ ఎవ్వరూ ఆ సుయోధనుని అభినందించలేదు. సభాసదులు అందరూ ఆ దుర్యోధనుని నిందిస్తూనే ఉన్నారు. (23)
కులీనస్య చ యా నిందా వధో వామిత్రకర్శన।
మహాగుణో వధో రాజన్! న తు నిందా కుజీవికా॥ 24
శత్రుసూదనా! మహారాజా! ఉత్తమవంశస్థులకు మాటపడటం, మరణించటం - రెండింటిలో మరణించటమే మంచిది. మాటపడటం జీవితాన్ని దయనీయం చేస్తుంది. (24)
తదైవ నిహతో రాజన్ యదైవ నిరపత్రపః।
నిందితశ్చ మహారాజ పృథివ్యాం సర్వరాజభిః॥ 25
మహారాజా! లోకంలోని రాజులంతా సుయోధనుని సిగ్గులేని తనాన్ని నిందించిన ఆ రోజే ఆ సుయోధనుడు మరణించినట్లు. (25)
ఈషత్ కార్యో వధస్తస్య యస్య చారిత్ర ఈదృశమ్।
ప్రస్కందేన ప్రతిస్తబ్ధః ఛిన్నమూల ఇవ ద్రుమః॥ 26
ఇంతగా పతనమైన చరిత్రగల ఆ సుయోధనుని చంపటం చాలా సామాన్య విషయం. వ్రేళ్ళు నరికిన తర్వాత మొదలుపై ఆధారపడి నిలిచి ఉన్న చెట్టును పడద్రోయటం వంటిది. (26)
వధ్యః సర్ప ఇవానార్యః సర్వలోకస్య దుర్మతిః।
జహ్యేనం త్వమమిత్రఘ్న మా రాజన్ విచికిత్సిథాః॥ 27
శత్రుసూధనా! పాములా కుటిలత్వమూ, దుష్టబుద్ధీగల ఆ సుయోధనుని సంహరించు. (27)
సర్వథా త్వత్ క్షమం చైతద్ రోచతే చ మమానఘ।
యత్ త్వం పితరి భీష్మే చ ప్రణిపాతం సమాచరేః॥ 28
అనఘా! నీవు ధృతరాష్ట్రునిపై, భీష్మునిపై వినయాన్ని ప్రదర్శించటం అన్ని విధాలా నీకు తగినదే. అది నాకు కూడా నచ్చింది. (28)
అహం తు సర్వలోకస్య గత్వా ఛేత్స్యామి సంశయమ్।
యేషామస్తి ద్విధాభావః రాజన్ దుర్యోధనం ప్రతి॥ 29
మహారాజా! దుర్యోధనుని విషయంలో ఇంకా అటు ఇటుగా ఉన్న వారందరి అనుమానాలను నేను వెళ్ళి తొలగిస్తాను. (29)
మధ్యే రాజ్ఞామహం తత్ర ప్రాతిపౌరుషికాన్ గుణాన్।
తవ సంకీర్తయిష్యామి యే చ తస్య వ్యతిక్రమః॥ 30
కౌరవ సభలో రాజుల సమక్షంలో నేను నీలోని సర్వసాధారణ గుణాలను ప్రశంసిస్తాణు. ఆ సుయోధనుడిలోని దోషాలను ఎత్తిచూపుతాను. (30)
బ్రువతస్తత్ర మే వాక్యం ధర్మార్థసహితం హితమ్।
నిశమ్య పార్థివాః సర్వే నానాజనపదేశ్వరాః॥ 31
త్వయి సంప్రతిపత్స్యన్తే ధర్మాత్మా సత్యవాగితి।
తస్మింశ్చాధిగమిష్యంతి యథా లోభాదవర్తత॥ 32
ధర్మార్థహితమై, హితకరమైన నా మాటవిని వివిధజనపదాల పాలకులందరూ అక్కడ నిన్ను ధర్మాత్ముడవు, సత్యవాదివి అని గ్రహిస్తారు. దుర్యోధనుడు లోభంతో వ్యవహరించాడని కూడా అర్థం చేసుకొంటారు. (31,32)
గర్హయిష్యామి చైవైనం పౌరజానపదేష్వసి।
వృద్ధబాలానుపాదాయ చాతుర్వర్ణ్యే సమాగతే॥ 33
అక్కడ చేరిన పురజనులు, జానపదులలో చాతుర్వర్ణ్యాలలోని పెద్దలు, పిల్లల సమక్షంలో సుయోధనుని దోషాలను ఎత్తిచూపుతాను. (33)
శమం వై యాచామానస్త్వం నాధర్మం తత్ర లప్స్యసే।
కురూన్ విగర్హయిష్యంతి ధృతరాష్ట్రం చ పార్థివాః॥ 34
అక్కడ అందరి సమక్షంలో శాంతినే కోరుకొంటున్న నిన్నెవ్వరూ తప్పుపట్టరు. రాజులు ధృతరాష్ట్రుని, ఆయన కొడుకులనే(కౌరవులనే) నిందిస్తారు. (34)
తస్మిన్ లోకపరిత్యక్తే కిం కార్యమవశిష్యతే।
హతే దుర్యోధనే రాజన్ యదన్యత్ క్రియతామితి॥ 35
అందరూ దుర్యోధనుని వీడిపోతారు. ఆ విధంగా దుర్యోధనుడు లోకానికి దూరమై నశిస్తే ఆపై నీవు చేయవలసినదేముంటుంది? (35)
యాత్వా చాహం కురూన్ సర్వాన్ యుష్మదర్థమహాపయన్।
యతిష్యే ప్రశమం కర్తుం లక్షయిష్యే చ్ అచేష్టితమ్॥ 36
నేను అక్కడకు పోయి మీ కార్యసిద్ధికి భంగం కలగని రీతిగా సంధి చేయటానికి ప్రయత్నిస్తాను. వారి ప్రవర్తనను కూడా గమనిస్తాను. (36)
కౌరవాణాం ప్రవృత్తిం చ గత్వా యుద్ధాధికారికామ్।
నిశమ్య వినివర్తిష్యే జయాయ తవ భారత॥ 37
భారతా! వెళ్ళి, యుద్ధానికి సిద్ధపడుతున్న కౌరవుల ప్రవృత్తిని కూడా విని, నీ గెలుపు కోసం మరలి వస్తాను. (37)
సర్వథా యుద్ధమేవాహమ్ ఆశంసామి పరైః సహ।
నిమిత్తాని హి సర్వాణి తథా ప్రాదుర్భవంతి మే॥ 38
ఏ విధంగా అయినా, శత్రువులతో యుద్ధం తప్పదనే నేను అనుకొంటున్నాను. నాకు కనిపిస్తున్న శకునాలన్నీ కూడా ఆ విధంగానే ఉన్నాయి. (38)
మృగాః శకుంతాశ్చ పదంతి ఘోరం
హస్త్యశ్వముఖ్యేషు నిశాముఖేషు।
ఘోరాణి రూపాణి తథైవ చాగ్నిః
వర్ణాన్ బహూన్ పుష్యతి ఘోరరూపాన్॥ 39
జంతువులూ, పక్షులూ భయంకరంగా అరుస్తున్నాయి. సంధ్యాకాలంలో ఏనుగులు, గుర్రాల గుంపులలో భయంకరరూపాలు కనిపిస్తున్నాయి. అగ్ని కూడా భయంకరాలైన రకరకాల రంగులను ధరిస్తున్నాడు. (39)
మనుష్యలోకక్షయకృత్ సుఘోరః
నో చేదనుప్రాప్త ఇహాంతకః స్యాత్।
శస్త్రాణి యంత్రం కవచాన్ రథాంశ్చ
నాగాన్ హయాంశ్చ ప్రతిపాదయిత్వా ॥ 40
యోధాశ్చ సర్వే కృతనిశ్చయాస్తే
భవంతు హస్త్యశ్వరథేషు యత్తాః।
సాంగ్రామికం తే యదుపార్జనీయం
సర్వం సమగ్రం కురు తన్నరేంద్ర॥ 41
రాజా! మనుష్యలోకాన్ని నశింపజేయాలని భీకరమృత్యువు సన్నిహితమైతే తప్ప ఇటువంటి పరిస్థితి కనిపించదు. ఆయుధాలను, యంత్రాలను, కవచాలను, రథాలను, ఏనుగులను, గుఱ్ఱాలను సిద్ధం చేసుకో. అట్లే ఆ ఏనుగులను గుఱ్ఱాలను, రథాలను పూన్చి యుద్ధం చేసే సైనికులను యుద్ధానికి సిద్ధం కమ్మను. యుద్ధంకోసం నీవు సంపాదించి పెట్టవలసిన సమస్త వస్తువులను పూర్తిగా సంగ్రహించుకో. (40,41)
దుర్యోధనీ న హ్యలమద్య దాతుం
జీవం స్తవైతన్నృపతే కథంచిత్।
యత్ తే పురస్తాదభవత్ సమృద్ధం
ద్యూతే హృతం పాండవముఖ్య రాజ్యమ్॥ 42
పాండవశ్రేష్ఠా! రాజా! జూదానికి ముందు నీదగ్గర ఉండగా జూదంలో అపహరించిన ఆ సమృద్ధమైన రాజ్యాన్ని దుర్యోధనుడు బ్రతికిఉండగా ఏవిధంగానూ నీకివ్వలేడు. (42)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి కృష్ణ వాక్యే త్రిసప్తతితమోఽధ్యాయ॥ 73 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యానపర్వమను ఉపపర్వమున కృష్ణవాక్యమను డెబ్బది మూడవ అధ్యాయము. (73)