71. డెబ్బది ఒకటవ అధ్యాయము
ధృతరాష్ట్రుని వచనములు.
ధృతరాష్ట్ర ఉవాచ
చక్షుష్మతాం వై స్పృహయామి సంజయ
ద్రక్ష్యంతి యే వాసుదేవం సమీపే।
విభ్రాజమానం వపుషా పరేణ
ప్రకాశయంతం ప్రదిశో దిశశ్చ॥ 1
ధృతరాష్ట్రుడిట్లన్నాడు. సంజయా! కన్నులున్నవారు అదృష్టవంతులు. వారు జ్ఞాన శరీరంతో ప్రకాశిస్తూ దిక్కుల్నీ, మూలల్నీ వెలిగించే కృష్ణుని దగ్గరగా ఉండి చూడగలుగుతున్నారు. (1)
ఈరయంతం భారతీం భారతానాం
అభ్యర్చనీయాం శంకరీం సృంజయానామ్।
బుభూషద్భిర్గ్రహణీయామనింద్యాం
పరాసూనా మగ్రహణీయ రూపామ్॥ 2
శ్రీ కృష్ణుడు భరత వంశీయుల మాటలు మాట్లాడుతాడు. ఆ మాటలు పూజార్హములు. సృంజయులకు శుభప్రదాలు. ఐశ్వర్యకాములు గ్రహింపదగినవి. నిందింపరానివి. కాలం చెల్లిపోయిన వారికి గ్రహింపదగినట్లు తోస్తాయి. (2)
సముద్యంతం సాత్వతమేకవీరం
ప్రణేతారం ఋషభం యాదవానామ్।
నిహంతారం క్షోభణం శాత్రవాణాం
ముంచంతం చ ద్వుషతాం వై యశాంసి॥ 3
కృష్ణుడు సాత్వతుడు. ప్రధానవీరుడు, యాదవులకు నాయకుడయిన వీరుడు. శత్రువుల నెదిరించి సంహరిస్తాడు. పగవారి కీర్తిని తొలగిస్తాడు. (3)
ద్రష్టారో హి కురవస్తం సమేతా
మహాత్మానం శత్రుహణం వరేణ్యమ్।
బ్రువంతం నాచమనృశంసరూపాం
వృష్ణిశ్రేష్ఠం మోహయంతం మదీయాన్॥ 4
కృష్ణుడు మహాత్ముడు - శత్రు నాశకుడు. కోరదగినవాడు. కరుణతో మాట్లాడుతాడు. నా వారిని మోహింపజేస్తాడు. అటువంటి కృష్ణుని కౌరవులంతా చూస్తారు. (4)
ఋషిం సనాతనతమం విపశ్చితం
వాచః సముద్రం కలశం యతీనామ్।
అరిష్టనేమిం గరుడం సుపర్ణం
హరిం ప్రజానాం భువనస్య ధామ॥ 5
సహస్ర శీర్షం పురుషం పురాణమ్
అనాదిమధ్యాంత మనంత కీర్తిమ్।
శుక్రస్య ధాతార మజం చ నిత్యం
పరం పరేషాం శరణం ప్రపద్యే॥ 6
అతడు సనాతనుడయిన ఋషి ఆత్మతత్త్వం తెలిసిన పండితుడు. చక్కని మాటలకు సముద్రం లాంటివాడు. యతులకు కలశం వంటివాడు. పక్షులలో గరుత్మంతుని వంటి వేగం కలవాడు. మర్యాద నెరిగినవాడు. ప్రజలకు హరి. లోకాలకు ఆశ్రయం. అనేక శిరస్సులున్న పురాణ పురుషుడు. ఆది మధ్య - అంతములు లేనివాడు. అంతులేని కీర్తి కలవాడు. బీజసృష్టి చేస్తాడు. అజుడు, నిత్యుడు. పరాత్పరుడు. అటువంటి కృష్ణుని శరణు వేడుతాను. (5,6)
త్రైలోక్య నిర్మాణకరం జనిత్రం
దేవాసురాణా మథ నారరక్షసామ్।
నరాధిపానాం విదుషాం ప్రధానమ్
ఇంద్రానుజం తం శరణం ప్రపద్యే॥ 7
మూడు లోకాలూ నిర్మించేవాడు. దేవతలు, అసురులు, రాక్షసులు, నాగులు. వీరి పుట్టుకకు కారణం - విద్వాంసులయిన రాజులలో ప్రధానుడు. ఇంద్రుని తమ్ముడయిన ఆ కృష్ణుని శరణు వేడుకొంటున్నాను. (7)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి యానసంధి పర్వణి ధృతరాష్ట్ర వాక్యే ఏకసప్తతి తమోఽధ్యాయ॥ 71 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున యానసంధి పర్వమను ఉపపర్వమున ధృతరాష్ట్రవాక్యమను డెబ్బది యొకటవ అధ్యాయము. (71)