70. డెబ్బదియవ అధ్యాయము
కృష్ణుని వాసుదేవాది నామముల నిర్వచనము.
ధృతరాష్ట్ర ఉవాచ
భూయో మే పుండరీకాక్షం సంజయాచక్ష్వ పృచ్ఛతః।
నామ కర్మార్థవిత్ తాత ప్రాప్నుయాం పురుషోత్తమమ్॥ 1
ధృతరాష్ట్రుడిట్లడిగాడు. సంజయా! మళ్లీ పుండరీకాక్షుని గురించి అడుగుతున్నాను. చెప్పు. వాని పేర్లను గురించి, కర్మములను గురించి, వాని ప్రయోజనములను గురించి తెలిసికొని నేను పురుషోత్తముని పొందుతాను. (1)
సంజయ ఉవాచ
శ్రుతం మే వాసుదేవస్య నామ నిర్వచనం శుభమ్।
యావత్తత్రాభిజానేఽహం అప్రమేయో హి కేశవః॥ 2
సంజయుడు ఇలా చెపుతున్నాడు. శుభప్రదమైన వాసుదేవుని నామముల నిర్వచనం నేను విన్నాను. నాకు తెలిసినంత నేను చెపుతాను. నిజానికి కేశవుడు మన ఊహలకు అందడు. (2)
వ్యసనాత్ సర్వభూతానాం వసుత్వాత్ దేవయోనితః।
వాసుదేవస్తతో వేద్యః బృహత్వాద్విష్ణు రుచ్యతే॥ 3
(1) సర్వభూతాలను మాయతో ఆవరించి ఉంటాడు. దేవయోనుల నుండి ప్రకాశిస్తాడు. అందుచేత వాసుదేవుడని తెలుస్తున్నాడు. (2) అంతటా వ్యాపించి ఉండటం చేత విష్ణువని చెప్పబడుతున్నాడు. (3)
మౌనాత్ ధ్యానాచ్చ యోగాచ్చ విద్ధి భారత మాధవమ్।
సర్వతత్త్వమయత్వాచ్చ మధుహా మధుసూదనః॥ 4
(1) మౌనం, ధ్యానం, యోగం వీటి వల్ల మాధవుడని పేరు వచ్చింది. (2) సర్వతత్త్వాలూ అతనిలో ఉండటం వలన మధువును చంపడం వల్లను, మధుసూదనుడనీ అంటారు. (4)
కృషిర్భూవాచకశ్శబ్దః ణశ్చ నిర్వృతి వాచకః।
విష్ణుస్తద్భావయోగాశ్చ కృష్ణో భవతి సాత్త్వతః॥ 5
కృషి అంటే'ఉండుట' అని అర్థం. 'ణ' అనగా, నిర్వృతి - సుఖము. ఈ రెంటి భావాల కలయిక వల్ల విష్ణువు కృష్ణుడయ్యాడు. (5)
పుండరీకం పరం ధామ నిత్యమక్షయ మవ్యయమ్।
తద్భావాత్ పుండరీకాక్షః దస్యుత్రాసాజ్జనార్దనః॥ 6
(1) పుండరీకమనగా పరమస్థానం.అది నిత్యం, నశించనిది. తరగనిది. అందులో అక్షయంగా'క్షీణించకుండా ఉండేవాడు పుండరీకాక్షుడు.
(2) దస్యుజనులను భయపెడతాడు/హింసిస్తాడు కాబట్టి జనార్దనుడు. (6)
యతః సత్త్వాన్న చ్యవతే యచ్చ సత్త్వాన్న హీయతే।
సత్త్వతః సాత్వతస్తస్మాత్ ఆర్షభాద్ వృషభేస్క్షణః॥ 7
(1) సత్త్వగుణం నుండి ఎన్నడూ జారిపోడు. సత్త్వము నుండి తొలగని వాడు. అందుచేత సత్త్వతుడు, సాత్త్వతుడు అనే పేర్లు వచ్చాయి.
(2) (అ) ఆర్షభుడవడం చేత వృషభేక్షణుడు అని అంటారు. ఆర్ష మంటే వేదం. వేదంతో ప్రకాశించేవాడు. ఆర్షభుడు. అనగా ఉపనిషత్తులలో తెలియ చెప్పబడిన పురుషుడు వృషభేక్షణుడు.
(ఆ) వృషమంటే ధర్మం. దాన్ని భాసింపజేసేది వేదం అది వృషభం. వేదం(వృషభం) కన్నుగా కలవాడు. వృషభేస్క్హణుడు. (నీల) (7)
న జాయతే జనిత్రాయం అజస్తస్మాదనీకజిత్।
దేవానాం స్వప్రకాశత్వాత్; దమాద్దామోదరో విభుః॥ 8
పుట్టని వాడు కాబట్టి అజుడయ్యాడు. దేవతలలో స్వయంప్రవేశుడు కాబట్టి అనేకజిత్తు. దమం అధికంగా కలవాడు దామోదరుడు. (8)
హర్షాత్ సుఖాత్ సుఖైశ్వర్యాత్ హృషీకేశత్వ మశ్నుతే।
బాహుభ్యాం రోదసీ బిభ్రన్ మహాబాహు రితి స్మృతః॥ 9
హర్ష సుఖాలూ, ఈశత్వమూ కలవాడు హృషీకేశుడు బాహువులతో భూమ్యాకాశములను మోయువాడు మహాబాహువు. (9)
అధో న క్షీయతే జాతు యస్మాత్తస్మాదధోక్షజాHఆ।
నరాణానయనాచ్చాపి తతో నారాయణః స్మృతః॥ 10
ఎన్నడూ సంసారంలో పడనివాడు అధోక్షజుడు. నరుల సముదాయం అయనం(స్థానం) గా కలవాడు నారాయణుడు. (10)
అవః 1. అధోక్షజః = ఎన్నడూ క్రిందికి జారనివాడు. సంసారంలో పడనివాడు - అధో న క్షీయతే జాతు అనే విగ్రహవ్యాక్యంలో ఉత్తరపదావయవం లోపించడం చేత అధోక్షజః
పూరణాత్ సదనాచ్చాపి తతోఽసౌ పురుషోత్తమః।
అసతశ్చ సతశ్పైవ సర్వస్య ప్రభవాప్యయాత్॥ 11
అవః ఇందులో పురుషోత్తమ శబ్దము వివరింపబడుతోంది. అన్నిటినీ పూరించడం. నింపడం వల్లనూ, అన్నిటిలోనూ ఉండటం వల్లనూ, పురుషుడు అయినాడు. (పూరణం = సృష్టి; సదనం ప్రలయం = అర్జు) అసత్తుకు, సత్తుకూ సర్వానికి సృష్టి సంహారాలకూ కారణమై ఉత్తముడయినాడు. అందుచే పురుషోత్తముడు. (11)
సర్వస్య చ సదా జ్ఞానాత్ సర్వమేతం ప్రచక్షతే।
అవః ఇందులో సర్వ శబ్దానికి అర్థం చెపుతున్నాడు. ఎల్లపుడూ అందరికీ జ్ఞానము నిచ్చేవాడు కనుక సర్వుడు అయినాడు. (11 1/2)
సత్యే ప్రతిష్ఠితః కృష్ణః సత్యమత్ర ప్రతిష్ఠితమ్॥ 12
సత్యాత్ సత్యం తు గోవిందః తస్మాత్ సత్యోఽపి నామతః।
సత్యుడు (1) కృష్ణుడు సత్యం మీద నిలిచి ఉంటాడు. సత్యం కృష్ణునిలో నిలుస్తుంది. సత్యం కంటె పరమ సత్యం గోవిందుడు. అందువల్ల అతనికి సత్యమునిపేరు. (12 1/2)
విష్ణు ర్విక్రమణాద్దేవః జయనాజ్జిష్ణురుచ్యతే॥ 13
శాశ్వతత్వాదనంతశ్చ గోవిందో వేదనాత్ గవామ్।
1. విష్ణువు = అన్నింటినీ ఆక్రమించే దేవుడు. 2. అన్నీ జయించడం చేత జిష్ణుడు. 3.శాశ్వతంగా నిలిచేవాడు కాబట్టి అనంతుడు. 4. గోవులను పొందడం/ప్రకాశింపజేసే వాడు గోవిందుడు. (13 1/2)
అతత్త్వం కురుతే తత్త్వం తేన మోహయతే ప్రజాః॥ 14
తత్త్వం కాని దానిని కూడ తత్త్వం చేసి లోకాన్ని మోహిమ్పజేస్తాడు.(తత్త్వం కానిది జగత్తు) (14)
ఏవంవిధో ధర్మనిత్యః భగవాన్ మధుసూదనః।
ఆగంతా హి మహాబాహుః ఆనృశంస్యార్థ మచ్యుతః॥ 15
ఇంతటి మహానుభావుడు భగవంతుడయిన మధుసూదనుడు. అతడు సదా ధర్మానికి ఆశ్రయుడు. ఆ మహాబాహుడు ఆ నృశంస్యం కోసం మన దగ్గరికి వస్తున్నాడు. (15)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి యానసంధి పర్వణి సంజయవాక్యే సప్తతి తమోఽధ్యాయ॥ 70 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున యానసంధి పర్వమను ఉపపర్వమున సంజయవాక్యమను అరువది డెబ్బదియవ అధ్యాయము. (70)