69. అరువది తొమ్మిదవ అధ్యాయము

వ్యాస సంజయుల బోధ.

ధృతరాష్ట్ర ఉవాచ
కథం త్వం మాధవం వేత్థ సర్వలోక మహేశ్వరమ్।
కథమేనం న వేదాహం తన్మమాచక్ష్వ సంజయ॥ 1
సంజయ ఉవాచ
శృణు రాజన్ న తే విద్యా మమ విద్యా న హీయతే।
విద్యాహీనస్తమోధ్వస్తః నాభిజానాతి కేశవమ్॥ 2
సంజయుడు చెపుతున్నాడు. రాజా! విను. నీకు విద్య లేదు. నా విద్య తరగదు. అజ్ఞానాంధకారంతో చెడిపోయిన విద్యా(తత్త్వజ్ఞాన) హీనుడు ఎరగడు. (2)
విద్యయా తాత జానామి త్రియుగం మధుసూదనమ్।
కర్తారమకృతం దేవం భూతానాం ప్రభవాప్యయమ్॥ 3
తండ్రీ! త్రియుగరూపుడయిన మధుసూదనుని నేను (ఆత్మ) విద్యచేత ఎరుగుదును. అతడు ప్రాణుల ఉత్పత్తికీ, వినాశానికీ కర్త. కాని అతనికి వేరే కర్త లేడు. (3)
వి॥సం॥ త్రియుగః = స్థూల, సూక్ష్మ, కారణశరీరాలకు అధిష్ఠానమైనవాడు; అజ్ఞాన కల్పితమైన అవస్థాత్రయం జ్ఞానంతో తొలిగిపోగా నిరుపాధి ప్రత్యగాత్మ స్వరూపుడు.(నీల)
త్రియుగః = మూడు జంటలు గలవాడు; తేజోబలాలు, వీర్యపరాక్రమాలు, ధర్మజ్ఞానాలు/సంధి విగ్రహాలు, యాన+ఆసనాలు, సంశ్రయ ద్వైధీ భావాలు(అర్జు)
త్రియుగః = మూడు యుగాల యందే ఆవిర్భవించువాడు - విష్ణు ధర్మోత్తరపురాణంలో "ప్రకృతే రూపధృగ్దేవో దృశ్యతే న కలౌహరిః। కృతాది ష్వేవ తేనైషః త్రియుగః పరిపద్యతే॥ అని ఉంది. కృత త్రేతా, ద్వాపరాలలో దేవుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు. కనుక త్రియుగుడు(సర్వ)
ధృతరాష్ట్ర ఉవాచ
గావల్గణేఽత్ర కా భక్తిః యా తే నిత్యా జనార్దనే।
యథా త్వమభిజానాసి త్రియుగం మధుసూదనమ్॥ 4
అపుడు ధృతరాష్ట్రుడు మళ్లీ ఇలా అడిగాడు. సంజయా! నీకు జనార్దనుని మీద నిత్యమైన భక్తి ఉంది. ఆ భక్తి ఎటువంటిది? దానితోనే కదా నీవు త్రియుగుడయిన మధుసూదనుని తెలుసుకున్నావు. (4)
వి॥సం॥ ఆరాధ్య రూపమయిన జ్ఞానమే భక్తి(నీల)
సంజయ ఉవాచ
మాయాం న సేవే భద్రం తే న వృథా ధర్మమాచరే।
శుద్ధభావం గతో భక్త్వా శాస్త్రాద్వేద్మి జనార్దనమ్॥ 5
సంజయుడు ఇలా సమాధానం చెప్పాడు. నేను మాయను సేవించను. భగవదర్పితం కాని వ్యర్థధర్మం ఆచరింపను. శుద్ధమయిన మనసును పొంది, భక్తితో శాస్త్రం వల్ల జనార్దనుని తెలుసుకున్నాను. (5)
ధృతరాష్ట్ర ఉవాచ
దుర్యోధన హృషీకేశం ప్రపద్యస్వ జనార్దనమ్।
ఆప్తో నః సంజయస్తాత శరణం గచ్ఛా కేశవమ్॥ 6
అపుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు. దుర్యోధనా! ఇంద్రియాలకు ప్రభువు అయిన జనార్దనుని శరణు పొందు. ఈ సంజయుడు మనకు ఆప్తుడు. అతడు చెప్పినట్లు కేశవుని శరణు పొందు. (6)
దుర్యోధన ఉవాచ
భగవాన్ దేవకీపుత్రః లోకాంశ్చేన్నిహనిష్యతి।
ప్రవదన్నర్జునే సఖ్యం నాహం గచ్ఛేఽద్య కేశవమ్॥7
అపుడు దుర్యోధనుడిలా అన్నాడు. భగవంతుడయిన దేవకీపుత్రుడు లోకాలన్నిటినీ సంహరించవచ్చు. కాని అర్జునునితో స్నేహం ప్రకటించే కేశవుని నేనిపుడు శరణు కోరను. (7)
ధృతరాష్ట్ర ఉవాచ
అవాక్ గాంధారి పుత్రస్తే గచ్ఛాత్యేష సుదుర్మతిః।
ఈర్షు ర్దురాత్మా మానీ చ శ్రేయసాం వచనాతిగః॥ 8
దుర్యోధనుని మాటలకు ధృతరాష్ట్రుడిలా అన్నాడు. గాంధారీ! నీ కొడుకు దుర్మతియై నరకానికి పోతున్నాడు. వీడు అసూయాపరుడు. దురాత్ముడు. దురభిమాని, శ్రేయోభిలాషుల మాటలను అతిక్రమిస్తున్నాడు. (8)
గాంధార్యువాచ
ఐశ్వర్యకామ దుష్టాత్మన్ వృద్ధానాం శాసనాతిగ।
ఐశ్వర్యజీవితే హిత్వా పితరం మాం చ బాలిశ॥ 9
వర్ధయన్ దుర్హృదాం ప్రీతిం మాం చ శోకేన వర్ధయన్।
నిహతో భీమసేనేన స్మర్తాసి వచనం పితుః॥ 10
అపుడు గాంధారి ఇలా అంది. 'దుష్టాత్మా! ఐశ్వర్యం మాత్రం కోరి పెద్దల మాట వినకున్నావు. నన్నూ, ంఈ తండ్రినీ వదలి, ఐశ్వర్యాన్ని జీవితాన్ని వదలుకొంటున్నావు. దుర్మార్గులకు ప్రీతి కలిగిస్తూ నాకు దుఃఖం పెంచుతున్నావు. భీముని చేత పడినపుడు తండ్రి మాటలు స్మరిస్తావు. (9,10)
వ్యాస ఉవాచ
ప్రియోఽసి రాజన్ కృష్ణస్య ధృతరాష్ట్ర నిబోధ మే।
యస్య తే సంజయో దూతః యస్త్వాం శ్రేయసి యోక్ష్యతే॥ 11
వ్యాసుడిట్లనినాడు. రాజా! ధృతరాష్ట్రా! నీవు కృష్ణునికి ప్రియుడవు. నా మాట తెలుసుకో. నీకు సంజయుడు దూత. ఇతడు నీకు శ్రేయస్సు కలిగిస్తాడు. (11)
జానాత్యేష హృషీకేశం పురాణాం యచ్చ వై పరమ్।
శుశ్రూషమాణమైకాగ్ర్యం మోక్ష్యతే మహతో భయాత్॥ 12
సనాతనుడు, పరమాత్ముడు అయిన హృషీకేశుని ఈ సంజయ డెరుగును. ఏకాగ్రతతో సేవించేవారికి కృష్ణుడు మహాభయం నుండి మోక్షం కలిగిస్తాడు. (12)
వైచిత్రవీర్య పురుషాః క్రోధ హర్ష సమావృతాః।
సితా బహువిధైః పాశైః యే న తుష్టాః స్వకైర్ధనైః॥ 13
యమస్య వశమాయాంతి కామమూఢాః పునః పునః।
అంధనేత్రా యథైవాంధాః నీయమానాః స్వకర్మభిః॥ 14
ధృతరాష్ట్రా! క్రోధ శోకాలతో కూడిన పురుషులు, తమకున్న సంపదలతో తృప్తి పడక ఎన్నో పాశాలతో కట్టుబడి పోతారు. అటువంటివారు, కామ మూఢులై నిత్యమూ తమ కర్మలతో లాగబడుతూ ఉంటారు. గ్రుడ్డివాని చేత లాగబడే గ్రుడ్డివారిలాగా పోతూ చివరకు యముని వశమవుతారు. (13,14)
ఏష ఏకాయనః పంథా యేన యాంతి మనీషిణః।
తం దృష్ట్వా మృత్యుమత్యేతి మహాంస్తత్ర న సజ్జతి॥ 15
ఈ జ్ఞాన మార్గం పరమాత్మను చేరుస్తుంది. చాలా మంది బుద్ధిమంతులు ఈ మార్గంలో వెళ్లారు. ఈ మార్గం చూసినవారు మృత్యువును తరిస్తారు. కాని(సంసారమున) తగుల్కొనరు. (15)
ధృతరాష్ట్ర ఉవాచ
అంగ సంజయ మే శంస పంథానమకుతోభయమ్।
యేన గత్వా హృషీకేశం ప్రాప్నుయాం సిద్ధిముత్తమామ్॥ 16
అపుడు ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు. సంజయా! నిర్భయమైన ఆ మార్గం నాకు చెప్పు. ఆ మార్గాన వెళ్లి శ్రీ కృష్ణుని చేరి ఉత్తమమైన సిద్ధి పొందుతాను. (16)
సంజయ ఉవాచ
నాకృతాత్మా కృతాత్మానం జాతు విద్యా జ్జనార్దనమ్।
ఆత్మనస్తు క్రియోపాయః నాన్యత్రేంద్రియ నిగ్రహాత్॥ 17
సంఅజయుడు చెప్పాడు. మనసును వశపరచుకొనలేనివాడు నిత్య సిద్ధుడయిన కృష్ణుని ఎన్నడూ తెలుసుకోలేడు. ఇంద్రియ నిగ్రహం తప్ప పరమాత్మ ప్రాప్తికి మరో ఉపాయం కనపడదు. (17)
ఇంద్రియాణాముదీర్ణానాం కామత్యాగోఽప్రమాదతః।
అప్రమాద్ఽవిహింసా చ జ్ఞానయోని రసంశయమ్॥ 18
విజృంభించే ఇంద్రియాలను కోరికల నుండి మళించడం, పొరబడకపోవడం, అహింస ఈ మూడూ నిస్సందేహంగా జ్ఞానం కలిగిస్తాయి. (18)
ఇంద్రియాణాం యమే యత్తః భవ రాజన్నతంద్రితః।
బుద్ధిశ్చ తే మా చ్యవతు నియచ్ఛైనాం యతస్తతః॥ 19
అందుచేత రాజా! ఏమరకుండా ఇంద్రియాలను అదుపు చేయడంలో ప్రయత్నం చెయ్యి. నీ బుద్ధిని జారిపోనీకు. దాన్ని విషయాల నుండి మళ్లించు.(19)
ఏతద్ జ్ఞానం విదుర్విప్రాః ధ్రువ మింద్రియధారణమ్।
ఏతద్ జ్ఞానం చ పంథాశ్చ యేన యాంతి మనీషిణః॥ 20
ఈ ఇంద్రియ నిగ్రహాన్నే విప్రులు జ్ఞానమన్నారు. ఈ మార్గం పట్టుకొనే బుద్ధిమంతులు పయనించారు. (20)
అప్రాప్యః కేశవో రాజన్ ఇంద్రియైరజితైర్నృభిః।
ఆగమాధిగమాత్ యోగాత్ వశీ తత్త్వే ప్రసీదతి॥ 21
రాజా! ఇంద్రియ నిగ్రహం లేని మానవులకు కేశవుడు దొరకడు. వేదాలు చదివి, యోగాభ్యాసం చేసి వశపరచు కొన్నవానికి ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. వానికే తత్త్వం ప్రసన్నమవుతుంది. (21)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి యానసంధి పర్వణి సంజయ వాక్యే ఏకోన సప్తతి తమోఽధ్యాయ॥ 69 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున యానసంధి పర్వమను ఉపపర్వమున సంజయవాక్యమను అరువది తొమ్మిదవ అధ్యాయము. (69)