68. అరువది ఎనిమిదవ అధ్యాయము

ధృతరాష్ట్రుని ప్రశ్నకు సంజయుని సమాధానము.

సంజయ ఉవాచ
అర్జునో వాసుదేవశ్చ ధన్వినౌ పరమార్చితౌ।
కామాదన్యత్ర సంభూతౌ సర్వభావాయ సమ్మితౌ॥ 1
సంజయుడిలా చెప్పాడు. అర్జునుడూ, వాసుదేవుడూ ఇద్దరూ జగన్మాన్యులయిన ధనుర్ధారులు. (వారు సదా కలిసి ఉండే నరనారాయణులు అయినా) లోక కల్యాణ కాంక్షతో వేర్వేరుగా జన్మించారు. వారు ఏ పని చేయటానికైనా సమర్థులు. (1)
వి॥సం॥ 1. కామ పూర్వకమయిన కర్మ లేకుండా పుట్టినవారు. సూర్యుని వలె ఆవిర్భవించినవారు. ఇద్దరూ సాక్షాత్ బ్రహ్మ స్వరూపులు. (నీల)
2. కామాత్ = కోరిక వలన, అన్యత్ర = బదరికాశ్రమం కంటె ఇతరత్ర; సర్వభావాయ = సర్వక్షత్ర వినాశంకోసం; సంమితౌ = పురాణప్రసిద్ధులు. (దేవ, అర్జు)
వ్యామాంతరం సమాస్థాయ యథాముక్తం మనస్వినః।
చక్రం తద్వాసుదేవస్య మాయయా వర్తతే విభో॥ 2
కృష్ణుని చక్రం బారెడు వ్యాసం కలిగి ఉంటుంది. అతని మనసుకు అనుగుణంగా, మాయతో ప్రవర్తిస్తుంది. (2)
సాపహ్నవం కౌరవేషు పాండవానాం సుసమ్మతమ్।
సారాసారబలం జ్ఞాతుం తేజఃపుంజావభాసితమ్॥ 3
ఆ చక్రం కౌరవుల పట్ల గూఢంగా ఉంది. పాండవులంటే ఇష్టంగా ఉంది. బలం యొక్క సారాసారాలు తెలిసి ఒక తేజఃపుంజంలా కనపడుతోంది. (3)
వి॥సం॥ సాపహ్నవం = సంహారంతో కూడినది(నీల)
నరకం శంబరం చైవ కంసం చైద్యం చ మాధవః।
జితవాన్ ఘోరసంకాశాన్ క్రీడన్నివ మహాబలః॥ 4
ఘోరరూపులయిన నరకుని, శంబరుని, కంసుని, శిశుపాలుని మహాబలశాలి అయిన కృష్ణుడు ఆటలాడినట్లు చంపాడు. (4)
పృథివీం చాంతరిక్షం చ ద్యాం చైవ పురుషోత్తమః।
మనసైవ విశిష్టాత్మా నయత్యాత్మవశం వశీ॥ 5
ఆ పురుషోత్తముడు భూమినీ, ఆకాశాన్నీ, స్వర్గాన్నీ కేవలం మనసుతోనే తన వశం చేసుకొంటాడు. అంతటి విశిష్ట వ్యక్తి అతడు. అందుకే అతడు వశి అయినాడు. (5)
భూయో భూయో హి యద్రాజన్ పృచ్ఛసే పాండవాన్ ప్రతి।
సారాసారబలం జ్ఞాతుం తత్సమాసేన మే శృణు॥ 6
రాజా! పాండవుల గురించి సారాసార బలం గురించి మళ్లీ మళ్లీ అడుగుతున్నావు. సంక్షిప్తంగా చెపుతా విను. (6)
ఏకతో వా జగత్ కృత్స్నమ్ ఏకతో వా జనార్దనః।
సారతో జగతః కృత్స్నాత్ అతిరిక్తో జనార్దనః॥ 7
జగత్తు అంతా ఒక ప్రక్క జనార్దనుడు ఒక ప్రక్క ఉంటే సారాన్ని బట్టి జగత్తు అంతటికంటే జనార్దనుడే ఎక్కువ. (7)
భస్మ కుర్యా జ్జగదిదం మనసైవ జనార్దనః।
న తు కృత్స్నం జగచ్ఛక్తం భస్మ కర్తుం జనార్దనమ్॥ 8
జనార్దనుడు ఈ జగత్తునంతటిని కేవలం మనసుతోనే భస్మం చేయగలడు. కాని జగత్తు మొత్తం కూడినా జనార్దనుని భస్మం చేయలేదు. (8)
యతస్సత్యం యతో ధర్మః యతో హ్రీరార్జవం యతః।
తతో భవతి గోవిందః యతః కృష్ణ స్తతో జయః॥ 9
సత్యం, ధర్మం, లజ్జ, త్రికరణ శుద్ధి ఎక్కడ్ ఉంటాయో అక్కడ గోవిందుడుంటాడు. ఎక్కడ కృష్ణుడుంటాడో అక్కడ జయం కలుగుతుంది. (9)
పృథివీం చాంతరిక్షం చ దివం చ పురుషోత్తమః।
విచేష్టయతి భుతాత్మా క్రీఢన్నివ జనార్దనః॥ 10
భూమిని, ఆకాశాన్ని, స్వర్గాన్ని పురుషోత్తముడు ఆటలాడుతున్నట్లు ఆవరిస్తాడు. అందుకే సర్వప్రాణులకు ఆత్మరూపుడయినాడు. (10)
స కృత్వా పాండవాన్ సత్రం లోకం సమ్మోహయన్నివ।
అధర్మనిరతాన్ మూఢాన్ దగ్ధుమిచ్ఛతి తే సుతాన్॥ 11
పాండవులను మిషగా చేసుకొని లోకాన్ని మోహింపజేస్తూ మూఢులై అధర్మనిరతులయిన నీ కొడుకుల్ని దహించి వేయాలనుకొంటున్నాడు. (11)
కాలచక్రం జగచ్చక్రం యుగచక్రం చ కేశవః।
ఆత్మయోగేన భగవాన్ పరివర్తయతేఽనిశమ్॥ 12
కాలచక్రాన్ని, జగచ్చక్రాన్ని,యుగచక్రాన్ని భగవంతుడయిన కృష్ణుడు ఆత్మబలంతో సదా త్రిప్పుతూ ఉంటాడు. (12)
వి॥సం॥ కాలచక్రం = సంవత్సరరూపం; జగచ్చక్రం = జన్మస్థితి ప్రలయ ప్రవాహరూపమైన జగత్తు; యుగచక్రం = కర్మచక్రం, కృతం = నాలుగు పాదాల ధర్మస్థితి, త్రేత = మూడుపాదాల ధర్మస్థితి; ద్వాపరం = ధర్మాధర్మాలు సగం, సగం; కలి = ఏకపాదంతో ధర్మం); ఈ కర్మ చక్రం మరల మరల జననమరణాలకు కారణ మవుతుంది. సంవత్సరాదికాలు ఆత్మయోగంతో చైతన్యం గలవే గానీ జడాలు గావు. (నీల)
కాలస్య చ హి మృత్యోశ్చ జంగమస్థావరస్య చ।
ఈశతే భగవానేకః సత్యమేతత్ బ్రవీమి తే॥ 13
కాలానికీ, మృత్యువుకూ, చరాచర ప్రపంచానికీ ప్రభువు భగవంతుడయిన కృష్ణుడొక్కడే. నీకు సత్యం చెపుతున్నాను. (13)
ఈశన్నపి మహాయోగీ సర్వస్య జగతో హరిః।
కర్మాణ్యారభతే కర్తుం కీనాశ ఇవ వర్ధనః॥ 14
మహాయోగి అయిన శ్రీహరి జగత్తు కంతటికీ ప్రభువు. అయినా ధాన్యాదులను వృద్ధి చేసే కర్షకుని వలె సత్కర్మలను ఆచరించటానికి పూనుకుంటాడు. (14)
వి॥సం॥ కీనాశ ఇవ = యమునివలె దేహాదులను ఛేదిస్తాడు అని కూడా చెప్పాడు నీలకంఠుడు
తేన వంచయతే లోకాన్ మాయాయోగేన కేశవః।
యే తమేవ ప్రపద్యంతే న తే ముహ్యంతి మానవాః॥ 15
ఆ మాయా ప్రభావంతోనే లోకాలను కేశవుడు మోసగిస్తున్నాడు. కాని అతనినే శరణు పొందిన మానవులు మాత్రం మోసపోరు. (15)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి యానసంధి పర్వణి సంజయవాక్యే అష్ట షష్టితమోఽధ్యాయ॥ 68 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున యానసంధి పర్వమను ఉపపర్వమున సంజయ వాక్యమను అరువది ఎనిమిదవ అధ్యాయము. (68)