67. సంజయ ఏడవ అధ్యాయము

వ్యాసగాంధారుల రాక.

వైశంపాయన ఉవాచ
దుర్యోధనే ధార్తరాష్ట్రే తద్వచో నాభినందతి।
తూష్ణీంభూతేషు సర్వేషు సముత్తస్థు ర్నరర్షభాః॥ 1
వైశంపాయనుడు ఇట్లన్నాడు. దుర్యోధనునికి ఆ మాట రుచించలేదు. అందరూ మౌనం వహించారు. అపుడు రాజులు లేచి నిలిచారు. (1)
ఉత్థితేషు మహారాజ పృథివ్యాం సర్వరాజసు।
రహితే సంజయం రాజా పరిప్రష్టుం ప్రచక్రమే॥ 2
ఆశంసమానో విజయం తేషాం పుత్రవశానుగః।
ఆత్మనశ్చ పరేషాం చ పాండవానాం చ నిశ్చయమ్॥ 3
వచ్చిన రాజులంతా లేచి వెళ్లిపోయక ఏకాంతంలో రాజు సంజయుని ఇలా అడగడం ప్రారంభించాడు. పుత్రవశమై బడచే ధృతరాష్ట్రుడు తన కొడుకుల విజయం కోరుతూ, తన కర్తవ్యం, పరుల(తటస్థుల) నిశ్చయం, పాండవుల నిశ్చయం గురించి అడగ నారంభించాడు. (2,3)
ధృతరాష్ట్ర ఉవాచ
గావల్గణే బ్రూహి నః సారఫల్గు
స్వసేనాయాం యావదిహాస్తి కించిత్।
త్వం పాండవానాం నిపుణం వేత్థ సర్వం
కిమేషాం జ్యాయః కిము తేషాం కనీయః॥ 4
ధృతరాష్ట్రుడు అడిగాడు. సంజయా! మన సైన్యంలో సారం ఏది? అసారం ఏది? పాండవుల సేన గురించి కూడా నీకు సర్వమూ తెలుసును. ఈ రెంటిలో ఏది గొప్పది? ఏది తక్కువది? (4)
త్వమేతయోః సారవిత్ సర్వదర్శీ
ధర్మార్థయోర్నిపుణో నిశ్చయజ్ఞః।
స మే పృష్టః సంజయ బ్రూహి సర్వం
యుధ్యమానాః కతరేఽస్మి న్న సంతి॥ 5
ఈ రెండు సేనల్లో నీవు సారమెరిగి అన్నీ తెలిసినవాడవు. ధర్మమూ, అర్థమూ నేర్పుగా నిశ్చయింప గల సమర్థుడవు. అడుగుతున్నాను. అంతా చెప్పు, ఉదాసీను లెవ రెవరు? (5)
సంజయ ఉవాచ
న త్వాం బ్రూయాం రహితే జాతు కించిత్
అసూయా హి త్వాం ప్రవివేశ రాజన్।
ఆనయస్వ పితరం మహావ్రతం
గాంధారీం చ మహిషీమాజమీఢ॥ 6
సంజయుడు ఇలా చెప్పాడు. రాజా! ఒంటరిగా ఉంటే నీకు ఏమీ చెప్పను. నీలో అసూయ కలుగుతుంది. మహావ్రతుడయిన నీ తండ్రి, వ్యాసుని, పట్టపురాణి గాంధారిని రప్పించు. (6)
తౌ తేఽసూయాం వినయేతాం నరేంద్ర
ధర్మజ్ఞౌ తౌ నిపుణౌ నిశ్చయజ్ఞౌ।
తయోస్తు త్వాం సన్నిధౌ తద్వదేయం
కృత్స్నం మతం కేశవపార్థయోర్యత్॥ 7
వారిద్దరూ నీ అసూయను నివారించగలరు. ధర్మం తెలిసినవారు, నేర్పరులు, నిశ్చయం చేయగలవారు. వారి ముందు కృష్ణార్జునుల అభిప్రాయం అంతా నీకు చెపుతాను. (7)
వైశంపాయన ఉవాచ
ఇత్యుక్తేన చ గాంధారీ వ్యాసశ్చాత్రాజగామ హ।
ఆనీతౌ విదురేణేహ సభాం శీఘ్రం ప్రవేశితౌ॥ 8
వైశంపాయనుడు చెప్పాడు. ఇలా అనగానే గాంధారి. వ్యాసుడూ అక్కడకు వచ్చారు. వెంటనే వారిని విదురుడు సభలోనికి ప్రవేశపెట్టాడు. (8)
తతస్తన్మతమాజ్ఞాయ సంజయస్యాతజస్య చ।
అభ్యుపేతో మహాప్రాజ్ఞః కృష్ణదవిపాయనోఽబ్రవీత్॥ 9
సంజయ, ధృతరాష్ట్రుల అభిప్రాయం తెలిసి వచ్చిన మహాబుద్ధిగల కృష్ణద్వైపాయనుడు ఇలా అన్నాడు. (9)
వ్యాస ఉవాచ
సంపృచ్ఛతే ధృతరాష్ట్రాయ సంజయ
ఆచక్ష్వ సర్వం యావదేషోఽనుయుంక్తే।
సర్వం యావద్వేత్థ తస్మిన్ యథావత్
యాథాతథ్యం వాసుదేవేఽర్జునే చ॥ 10
వ్యాసుడిట్లు చెప్పాడు. ధృతరాష్ట్రుడు నిన్ను అడిగే విషయమంతా చెప్పు. ఈ పక్షంలోనూ ఆ పక్షంలోని వాసుదేవార్జునులలోను ఉన్నది ఏమిటో/ ఉన్నదున్నట్లు చెప్పు. నీకు తెలిసినంత చెప్పు. (10)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి యానసంధి పర్వణి వ్యాసగాంధార్యాగమనే సప్త షష్టితమోఽధ్యాయ॥ 67 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున యానసంధి పర్వమను ఉపపర్వమున వ్యాసగాంధారుల ఆగమనమను అరువది ఏడవ అధ్యాయము. (67)