61. అరువది యొకటవ అధ్యాయము
పాండవులకు దైవబలము లేదని తన బలమధికమని దుర్యోధనుడు చెప్పుట
వైశంపాయన ఉవాచ
పితురేతద్వచః శ్రుత్వా ధార్తరాష్ట్రోఽత్యమర్షణః।
ఆధాయ విపులం క్రోధం పునరేవేద మబ్రవీత్॥ 1
వైశంపాయనుడు ఇట్లు అన్నాడు. అసహనశీలి అయిన దుర్యోధనుడు తన తీవ్ర క్రోధాన్ని అణచుకొని ఇలా అన్నాడు. (1)
అశక్యా దేవసచివాః పార్థాః స్యురితి యద్భవాన్।
మన్యతే తద్భయం వ్యేతు భవతో రాజసత్తమ॥ 2
మహారాజా! పాండవులు దేవతల సహాయం కలవారనీ, జయింప శక్యం కానివారనీ నీవనుకొంటున్నావు. ఆ భయం విడిచి పెట్టు/ తొలగిపోవుగాక. (2)
అకామద్వేష సంయోగ లోబద్రోహాచ్చ భారత।
ఉపేక్షయా చ భావానాం దేవా దేవత్వమాప్నువన్॥ 3
కామం, ద్వేషం, స్నేహం, లోభం, ద్రోహం లేకుండాను, పట్టించుకోకుండాను ఉండటం చేతనే దేవతలకు దేవత్వం కలిగింది. (3)
ఇతి ద్వైపాయనో వ్యాసః నారదశ్చ మహాతపాః।
జామదగ్న్యశ్చ రామో నః కథా మకథయత్ పురా॥ 4
ఇలా అని ఎపుడో మాకు వ్యాసుడు, నారదుడు, పరశురాముడు మొ॥ మహాతపస్యులు చెప్పారు. (4)
నైవ మానుషవద్దేవాః ప్రవర్తంతే కదాచన।
కామాత్ క్రోధాత్ తథా లోభాద్ ద్వేషాచ్చ భరతర్షభ॥ 5
కామంతో, క్రోధంతో, లోభంతో, ద్వేషంతో ఎన్నటికీ దేవతలు మనుష్యుల వలె ప్రవర్తింపరు. (5)
యదా హ్యగ్నిశ్చ వాయుశ్చ ధర్మ ఇంద్రోఽశ్వినా వపి।
కామ యోగాత్ప్రవర్తేరన్ అపార్థా దుఃఖమాప్నుయుః॥ 6
అగ్ని, వాయువు, యమధర్మరాజు, ఇంద్రుడు, అశ్వినీ దేవతలు కూడా కామాదులతో ప్రవర్తించే వారయితే పాండవులకు ఈ దుఃఖం కలిగేదే కాదు. (6)
తస్మా న్నభవతా చింతా కార్యైషా స్యాత్ కథంచన।
దైవేష్వపేక్షకా హ్యేతే శశ్వద్భావేషు భారత॥ 7
అందుచేత ఈ విషయమై నీకు ఏ విధమయిన చింత అవసరంలేదు. ఎపుడయినా దేవతలు దైవభావాలనే అపేక్షిస్తారు. (7)
అథ చేత్ కామసంయోగాద్ ద్వేషో లోభశ్చ లక్ష్యతే।
దైవేషు దైవ ప్రామాణ్యాత్ నైషాం తద్విక్రమిష్యతి॥ 8
అలా కాక కామాదుల వల్ల దేవతల్లో ద్వేషం, లోభం కనపడితే వారికి ప్రామాణ్యం లేనట్లే - వారి సాయం పాండవులకు ఉపయోగపడదు. (8)
మయాభిమంత్రితః శశ్వత్ జాతవేదాః ప్రశామ్యతి।
దిధక్షుః సకలాన్ లోకాన్ పరిక్షిప్య సమంతతః॥ 9
చుట్టూరా కమ్ముకొని లోకాలన్నీ దహించి వేసే అగ్ని కూడా నేను మంత్రిస్తే చల్లబడిపోతుంది. (9)
యద్వా పరమకం తేజో యేన యుక్తా దివౌకసః।
మమాప్యనుపమం భూయః దేవేభ్యో విద్ధి భారత॥ 10
రాజా! దేవతల కున్న పరమ తేజస్సు నాకూ ఉందనీ తెలుసుకో. (10)
విదీర్యమాణాం వసుధాం గిరీణాం శిఖరాణి చ।
లోకస్య పశ్యతో రాజన్ స్థాపయామ్యభిమంత్రణాత్॥ 11
బ్రద్దలయ్యే భూమిని, గిరిశిఖరాలను అందరూ చూస్తూ ఉండగా మంత్రించి బ్రద్దలు కాకుండా ఆపగలను. (11)
చేతనాచేతనస్యాస్య జంగమస్థావరస్య చ।
వినాశాయ సముత్పన్నమ్ అహం ఘోరం మహాస్వనమ్॥ 12
అశ్మవర్షం చ వాయుం చ శమయామీహ నిత్యశః।
జగతః పశ్యతోఽభీక్ష్ణం భూతానామనుకంపయా॥ 13
చైతన్యం ఉన్నవికొన్ని లేనివి కొన్ని, కదిలేవి కొన్ని కదలనివి కొన్ని - ఇలా ఉన్న వీటి నాశనం కోసం భయంకర శబ్దంతో కురిసే రాళ్లవానను, గాలినీ కూడా అందరూ చూస్తూ ఉండగా భూతదయతో శమింపచేయగలను/తగ్గింప జేయగలను. (12,13)
స్తంభితాస్వప్సు గచ్ఛంతి మయా రథపదాతయః।
దేవాసురాణాం భావానామ్ అహమేకః ప్రవర్తితా॥ 14
నీళ్లను స్తంభింపజేసి వాటిమీద రథాలను సైనికులను నడిపిస్తాను. దేవదానవుల భావాలన్నిటినీ తెలిసి నేను ఆచరణలో పెట్టగలను. (దివ్యశక్తులు, రాక్షసశక్తులు నేనొక్కడనే చెయ్యగలను) (14)
అక్షౌహిణీభిర్యాన్ దేశాన్ యామి కార్యేణ కేనచిత్।
తత్రాశ్వా మే ప్రవర్తంతే యత్ర యత్రాభికామయే॥ 15
ఏదైనా కార్యవశాత్తు అక్షౌహిణులతో ఏదేశాలకు వెళ్లినా (కొత్త చోటుల్లో కూడా) అక్కడ నాయిష్టం వచ్చినట్లు గుర్రాలు నడుస్తాయి. (అట్లా నేను గుర్రాలను నడిపించగలను). (15)
భయానకాని విషయే వ్యాళాదీని న సంతి మే।
మంత్రగుప్తాని భూతాని న హింసంతి భయంకరాః॥ 16
నా దేశంలో పాములు మొదలయినవి భయానకాలు కావు - మంత్రంతో రక్షితములయిన ప్రాణులను భయంకర ప్రాణులు హింసించవు. (16)
నికామవర్షీ పర్జన్యో రాజన్ విషయవాసినామ్।
ధర్మిష్ఠాశ్చ ప్రజాః సర్వా ఈతయశ్చ న సంతి మే॥ 17
రాజా! నాదేశ ప్రజలకు పర్జన్యుడు కోరినట్లు వర్షిస్తాడు. ప్రజలంతా ధర్మవర్తనులు - ఈతి బాధలే లేవు. (17)
అశ్వినావథ వాయ్వగ్నీ మరుద్భిః సహ వృత్రహా।
ధర్మశ్పైవ మయా ద్విష్టాన్ నోత్సహంతేఽభిరక్షితుమ్॥ 18
ఆశ్వినీ దేవతలు, వాయువు, అగ్ని దేవతలతోఆటు ఇంద్రుడు, ధర్మదేవత వీరంతా నేను ద్వేషించేవారిని రక్షించటానికి ఉత్సాహం చూపరు. (18)
యది హ్యేతే సమర్థాః స్యుః మద్ద్విస్త్రాతుమంజసా।
న స్మ త్రయోదశసమాః పార్థా దుఃఖమవాప్నుయుః॥ 19
వీరు నాశత్రువులను రక్షింపగలిగితే పాండవులు పదుమూడు సంవత్సరాలు దుఃఖం అనుభవించే వారు కాదు. (19)
నైవ దేవా న గంధర్వాః నాసురాః న చ రాక్షసాః।
శక్తా స్త్రాతుం మయా ద్విష్టం సత్యమేతద్బ్రవీమి తే॥ 20
నేను ద్వేషించిన వానిని రక్షించటానికి దేవతలు కాని, గంధర్వులు కాని, అసురులు కాని, రాక్షసులు కాని సమర్థులు కారు - నీకు నిజం చెపుతున్నాను. (20)
యదభిధ్యామ్యహం శశ్వత్ శుభం వా యదివాఽశుభమ్।
నైతద్విపన్న పూర్వం మే మిత్రేష్వరిషు చోభయోః॥ 21
ఎపుడయినా నేను మిత్రులకు శుభంకాని, శత్రువులకు అశుభం కాని తలపెట్టితే అది ఇంతవరకు చెడిపోలేదు. (21)
భవిష్యతీదమితి వా యద్బ్రవీమి పరంతప।
నాన్యథా భూతపూర్వం చ సత్యవాగితి మాం విదుః॥ 22
"ఇది ఇలా జరుగుతుంది" అని నేను చెపితే అది మరోలా పూర్వం ఎప్పుడూ జరగలేదు. నన్ను "సత్యవాక్కు" అని అంటారు. (22)
లోకసాక్షిక మేతన్మే మాహాత్మ్యం దిక్షు విశ్రుతమ్।
ఆశ్వాసనార్థం భవతః ప్రోక్తం న శ్లాఘయా నృప॥ 23
నా గొప్పదనం అన్ని దిక్కులా లోకులందరికీ తెలుసు. రాజా! ఇది నిన్ను ఊరడించటానికి చెప్పానుకాని ప్రశంస కోసం కాదు. (23)
న హ్యహం శ్లాఘనో రాజన్ భూతపూర్వః కదాచన।
అసదాచరితం హ్యేతత్ యదాత్మానం ప్రశంసతి॥ 24
రాజా! నేనెప్పుడూ ఆత్మస్తుతి చేసుకోలేదు. తన్నుతాను ప్రశంసించుకోవడం దుర్జనులు చేస్తారు. (24)
పాండవాం శ్పైవ మత్స్యాంశ్చ పాంచాలన్ కేకయైః సహ।
సాత్యకిం వాసుదేవం చ శ్రోతాఽసి విజితాన్ మయా॥ 25
పాండవులు, మత్స్యదేశస్థులు, పాంచాలురు, కేకయులు, సాత్యకి, కృష్ణుడు - అంతా నాచేతిలో ఓడిపోయారని నీవు వింటావు గదా! (25)
సరితః సాగరం ప్రాప్య యథా నశ్యంతి సర్వశః।
తథైవ తే వినక్ష్యంతి మామాసాద్య సహాన్వయాః॥ 26
నదులు సముద్రంలో పడి అన్నివిధాలా రూపుమాపి పోయినట్లే నన్ను చేరిన వారంతా నాలో లీనమైపోతారు. (26)
పరావృద్ధిః పరం తేజః వీర్యం చ పరమం మమ।
పరా విద్యా పరా యోగః మమ తేభ్యో విశాంపతే॥ 27
రాజా! నాకు వారి(పాండవుల) కంటె వృద్ధియెక్కువ. తేజ మెక్కువ. అలాగే వీర్యమూ, విద్య, యోగమూ కూడా ఎక్కువే. (27)
పితామహశ్చ ద్రోణశ్చ కృపః శల్యః శలస్తథా।
అస్త్రేషు యత్ప్రజానంతి సర్వం తన్మయి విద్యతే॥ 28
భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, శల్యుడు, శలుడు వీరంతా అస్త్ర విషయంలో ఎరిగినదంతా నేనూ ఎరుగుదును. (28)
ఇత్యుక్తే సంజయం భూయః పర్యపృచ్ఛత భారతః।
జ్ఞాత్వా యుయుత్సోః కార్యాణి ప్రాప్తకాల మరిందమ॥ 29
శత్రువులను అణచే స్వభావం కల జనమేజయా! దుర్యోధనుడు ఇలా చెప్పాక ధృతరాష్ట్రుడు యుద్ధాన్ని కోరుతున్న (తన కొడుకు) పనులు తెలిసికొని మళ్లీ ఆ సమయానికి తగిన కృత్యాల గురించి సంజయుని అడిగాడు. (29)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి యానసంధి పర్వణి దుర్యోధన వాక్యే ఏకషష్టితమోఽధ్యాయ॥ 61 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున యానసంధి పర్వమను ఉపపర్వమున దుర్యోధన వాక్యమను అరువది ఒకటవ అధ్యాయము. (61)