60. అరువదియవ అధ్యాయము

ధృతరాష్ట్రుడు కౌరవ పాండవుల బలములను వివేచించుట.

వైశంపాయన ఉవాచ
సంజయస్య వచః శ్రుత్వా ప్రజ్ఞాచక్షుర్జనేశ్వరః।
తతః సంఖ్యాతుమారేభే తద్వచో గుణదోషతః॥ 1
వైశంపాయనుడు ఇట్లు చెప్పాడు. సంజయుని మాట విని ప్రజ్ఞాచక్షువైన ధృతరాష్ట్రుడు ఆమాటలలోని గుణదోషాలు లెక్కించడం మొదలు పెట్టాడు. (1)
ప్రసంఖ్యాయ చ సౌక్ష్మ్యేణ గుణదోషాన్ విచక్షణః।
యథావన్మతితత్త్వేన జయకామః సుతాన్ ప్రతి॥ 2
బలాబలం వినిశ్చిత్య యాతాతథ్యేన బుద్ధిమాన్।
(యదా తు మేనే భూయిష్ఠం తద్వచో గుణదోషతః।
పునరేవ కురూణాం చ పాండవానాం చ బుద్ధిమాన్॥)
శక్తిం సంఖ్యాతు మారేభే తదా వై మనుజాఢ్Hఇపః॥ 3
సూక్ష్మంగా గుణదోషాలు లెక్కించగల ధీమంతుడు ధృతరాష్ట్రుడు తన బుద్ధికి తోచినంతగా కొడుకుల జయం కోరి, బలాబలాలను నిశ్చయిస్తున్నాడు. (సంజయుని మాటలలోని గుణదోషాలను బట్టి మళ్లీ కౌరవ పాండవుల బలాబలాలను ధృతరాష్ట్రుడు భావించాడు) వారి శక్తి సామర్థ్యాలను లెక్కగట్ట నారంభించాడు దృతరాష్ట్రుడు.(2,3)
దేవమానుషయోః శక్త్యా తేజసా చైవ పాండవాన్।
కురూన్ శక్త్యాల్పతరయా దుర్యోధనమథాబ్రవీత్॥ 4
పాండవులు దేవమానుష శక్తుల చేతను, తేజస్సు చేతను అధికులనీ, కౌరవులు మిక్కిలి తక్కువ శక్తిగల వారనీ భావించి ధృతరాష్ట్రుడు దుర్యోధనునితో ఇలా అన్నాడు. (4)
దుర్యోధనేయం చింతా మే శశ్వన్న వ్యుపశామ్యతి।
సత్యం హ్యేతదహం మన్యే ప్రత్యక్షం నానుమానతః॥ 5
దుర్యోధనా! ఈ బాధ నాకు ఎప్పటికీ తగ్గటం లేదు. ఇది ప్రత్యక్ష సత్యం అని నా అభిప్రాయం. ఊహించి చెప్పటం లేదు. (5)
(ఈ దృశోఽభినివిష్టస్య పృథివీక్షయకారకే।
అధర్మే చాయశస్యే వా కార్యే మహతి దారుణే॥
పాండవై ర్విగ్రహస్తాత సర్వథా మే న రోచతే॥)
ఇపుడు భూమి నశించేటంత ధర్మవిరుద్ధమూ, అపకీర్తికరమూ అయిన దారుణపరిస్థితి ఏర్పడింది. ఇటువంటి అభినివేశం కల నాకు పాండవులతో విరోధం అన్ని విధాలా పనికిరాదని తోస్తోంది.
ఆత్మజేషు పరం స్నేహం సర్వభూతాని కుర్వతే।
ప్రియాణి చైషాం కుర్వంతి యథాశక్తి హితాని చ॥ 6
ప్రాణులన్నీ తమ సంతానం మీద చాలా ప్రేమ పెట్టుకుంటాయి. తమశక్తి కొద్దీ వానికి ప్రియమూ, హితమూ చేస్తూ ఉంటాయి. (6)
ఏవమేవోప కర్తౄణాం ప్రాయశో లక్షయామహే।
ఇచ్ఛంతి బహులం సంతః ప్రతికర్తుం మహత్ ప్రియమ్॥ 7
అలాగే తమకుపకారం చేసినవారికి సజ్జనులు ఎంతో ప్రీతి, ప్రత్యుపకారం చేయాలని భావిస్తారు. ప్రయత్నిస్తారు. (7)
అగ్నిః సాచివ్యకర్తా స్యాత్ ఖాండవే తత్కృతం స్మరన్।
అర్జున స్యాపి భీమేఽస్మిన్ కురుపాండుసమాగమే॥ 8
ఖాండవ వన దహన సమయంలో అర్జునుడు చేసిన ఉపకారం స్మరిస్తూ, భయంకరమైన ఈ కురుపాండవ యుద్ధంలో అగ్ని అర్జునునికి సాహాయ్యం చేస్తాడు. (8)
జాతిగృద్ధ్యాభిపన్నాశ్చ పాండవానామనేకశః।
ధర్మాదయః సమేష్యంతి సమాహూతా దివౌకసః॥ 9
పాండవుల ఆహ్వానంతో ధర్మదేవత మొదలయిన దేవతలంతా పుత్రస్నేహంతో ఎన్నో విధాల సహాయ పడటానికి పాండవులను చేరుతారు. (9)
భీష్మద్రోణకృపాదీనాం భయాదశనిసన్నిభమ్।
రిరక్షిషంతః సంరంభం గమిష్యంతీతి మే మతమ్॥ 10
భీష్మద్రోణ కృపాదుల వల్ల భయపడకుండా రక్షిస్తూ ఆ దేవతలు వజ్ర సమానమయిన దృఢమైన కోపం పొందుతారని నా అభిప్రాయం. (10)
తే దేవైః సహితాః పార్థాః న శక్యాః ప్రతివీక్షితుమ్।
మానుషేణ నరవ్యాఘ్రాః వీర్యవంతోఽస్త్రపారగాః॥ 11
అసలే పాండవులు మానుషశక్తి కల నరోత్తములు - అస్త్రవేత్తలు, పరాక్రమం కలవారు. దేవతాసహాయం కూడా పొందితే ఇక వారిని తేరిపార చూడలేము. (11)
దురాసదం యస్య దివ్యం గాండీవం ధనురుత్తమమ్।
దారుణౌ చాక్షయౌ దివ్యౌ శరపూర్ణౌ మహేషుధీ॥ 12
వానరశ్చ ధ్వజే దివ్యః నిఃసంగో ధూమవద్గతిః।
రథశ్చ చతురంతాయాం యస్య నాస్తి సమః క్షితౌ॥ 13
మహామేఘనిభశ్చాపి నిర్ఘోషః శ్రూయతే జనైః।
మహాశనిసమః శబ్దః శాత్రవాణాం భయంకరః॥ 14
యం చాతిమానుషం వీర్యే కృత్స్నో లోకే వ్యవస్యతి।
దేవానామపి జేతారం యం విదుః పార్థివా రణే॥ 15
శతాని పంచ చైవేషూన్ యో గృహ్ణాన్ నైవ దృశ్యతే।
నిమేషాంతరమాత్రేణ ముంచన్ దూరం చ పాతయన్॥ 16
యమాహ భీష్మో ద్రోణశ్చ కృపో ద్రౌణి స్తథైవ చ।
మద్రరాజ స్తథాశల్యః మధ్యస్థా యే చ మానవాః॥ 17
యుద్ధాయావస్థితం పార్థం పార్థివై రతిమానుషైః।
అశక్యం నరశార్దూలం పరాజేతు మరిందమమ్॥ 18
క్షిపత్యేకేన వేగేన పంచబాణశతాని యః।
సదృశం బాహువీర్యేణ కార్తవీర్యస్య పాండవమ్॥ 19
తమర్జునం మహేష్వాసం మహేంద్రోపేంద్ర విక్రమమ్।
నిఘ్నంత మివ పశ్యామి విమర్దేఽస్మిన్ మహాహవే॥ 20
అర్జునుని విల్లు ఉత్తమమయిన గాండీవం - అది దివ్యమయినది. దాన్ని ఎవరూ ఎత్తి పట్టలేరు/ఎక్కు పెట్టలేరు. అలాగే అతని అమ్ముల పొదులు రెండూ దివ్యములే - అవి బాణాలతో ఎల్లప్పుడూ నిండుగానే ఉంటాయి. అవి అక్షయ తూణీరాలు. వాని ధ్వజం కూడా దివ్యమైనదే. దానిమీద హనుమంతుడు ఉంటాడు. సముద్రాల దాకా ఆ రథం చరిస్తుంది. పొగలాగా దాని గమనానికి అడ్డులేదు. అందుకే అర్జునునితో ఎవరూ సాటిరారు. ఆ రథఘోష పెద్ద పిడుగు పడినట్లు వినపడుతుంది. శత్రువులకు భయం కలిగిస్తుంది. లోకమంతా అతనిది మానవాతీత పరాక్రమం అంటుంది. అర్జునుడు దేవతలనైనా జయిస్తాడని రాజులందరికీ తెలుసు. అతడు ఒక్కసారిగా అయిదు వందల బాణాలను ఱెప్పపాటు కాలంలో చాలా దురానికి వేస్తూ ఉంటే వానిని చూడలేము.భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, మద్రదేశపు రాజు శల్యుడు, వీరే కాకుండా మధ్యస్థులంతా "యుద్ధానికి నిలిచిన నరోత్తముడయిన అర్జునుని జయించడం మానవాతీతులకు కూడా శక్యం కా"దని చెపుతూ ఉంటారు. అర్జునుడు ఒకేసారి ఒకే వేగంతో అయిదువందల బాణాలు వేయగలడు. అతడు భుజశక్తితో కార్తవీర్యార్జునునితో సమానుడు. ధనుర్ధారి అయిన ఇంద్రుడో, విష్ణువో అన్న్ట్లు యుద్ధంలో అందరినీ చంపుతున్నట్లు కనపడుతున్నాడు. (12-20)
ఇత్యేవం చింతయన్ కృత్స్నమ్ అహో రాత్రాణి భారత।
అనిద్రో నిఃసుఖశ్చాస్మి కురూణాం శమచింతయా॥ 21
కురువంశస్థులకు శాంతి ఎలా కలుగుతుందా? అని రాత్రింబవళ్లు చింతిస్తూ నిద్రలేక దుఃఖిస్తూ ఉన్నాను. (21)
క్షయోదయోఽయం సుమహాన్ కురూణాం ప్రత్యుపస్థితః।
అస్య చేత్ కలహస్యాంతః శమాదన్యో న విద్యతే॥ 22
కౌరవులకు ఇపుడు పెద్ద వినాశకాలం దాపురించింది. ఈ కలహానికి అంతం ఉంటే అది శాంతి తప్ప మరొకటి లేదు. (22)
శమో మే రోచతే నిత్యం పార్థైస్తాత న విగ్రహః।
కురుభ్యో హి సదా మన్యే పాండవాన్ శక్తిమత్తరాన్॥ 23
నాయనా! పాండవులతో శాంతియే నాకు సదా ఇష్టం. యుద్ధం కాదు - ఎపుడయినా కౌరవులకంటె పాండవులే బలవంతులని నా అభిప్రాయం. (23)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి యానసంధి పర్వణి ధృతరాష్ట్ర వివేచనే షష్టితమోఽధ్యాయ॥ 60 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున యాన సంధి పర్వమను ఉపపర్వమున ధృతరాష్ట్ర వివేచనమను అరువదియవ అధ్యాయము. (60)
(దాక్షిణాత్య ప్రతి అధికపాఠము 2 1/2 శ్లోకములతో కలిపి మొత్తం 25 1/2 శ్లోకాలు)