47. నలుబదియేడవ అధ్యాయము

(యానసంధి పర్వము)

కౌరవ సభలోనికి సంజయుడు ప్రవేశించుట.

వైశంపాయన ఉవాచ
ఏవం సనత్సుజాతేన విదురేణ చ ధీమతా।
సార్థం కథయతో రాజ్ఞః సా వ్యతీయాయ శర్వరీ॥ 1
వైశంపాయనుడు ఇలా అన్నాడు. ఇలా సనత్సుజాతునితోను ధీమంతుడయిన విదురునితోను కలిసి ప్రసంగిస్తున్న ధృతరాష్ట్రునికి ఆ రాత్రి గడిచి పోయింది. (1)
తస్యాం రజన్యాం వ్యుష్టాయాం రాజానః సర్వ ఏవ తే।
సభామావివిశుర్హృష్టాః సూతస్యోపదిదృక్షయా॥ 2
తెల్లవారిన తరువాత రాజులంతా సంజయుని చూడాలని ఉత్సాహంతో సభలోనికి ప్రవేశించారు. (2)
శుశ్రూషమాణాః పార్థానాం వాచో ధర్మార్థసంహితాః।
ధృతరాష్ట్రముఖాస్సర్వే యయూ రాజసభాం శుభామ్॥ 3
సుధావదాతాం విస్తీర్ణాం కనకాజిరభూషితామ్।
చంద్రప్రభాం సురుచిరాం సిక్తాం చందనవారిణా॥ 4
పాండవుల ధర్మార్థ సహితమయిన మాటలు వినాలని ధృతరాష్ట్రుడు మొదలయిన వారంతా శుభమైన రాజసభలోనికి చేరారు. ఆ సభ విశాలంగా సున్నపు తెల్ల దనంతో బంగారు ప్రాంగణంతో/ ముంగిలితో విరాజిల్లుతోంది. వెన్నెల విరిసినట్లు వెలిగిపోతోంది. సభ నంతటినీ మంచి గంధపు నీటితో తడిపి తుడిచారు. (3,4)
రుచిరైరాసనైస్తీర్ణాం కాంచనై ర్దారవైరపి।
అశ్మసారమయైర్దాంతైః స్వాస్తీర్ణైః సోత్తరచ్ఛదైః॥ 5
సభలో బంగారంతో, చెక్కతో, రత్నాలతో, దంతంతో చేసిన ఆసనాలు పరిచారు. వాటిమీద మెత్తని వస్త్రాలు పరిచారు. (5)
భీష్మో ద్రోణః కృపః శల్యః కృతవర్మా జయద్రథః।
అశ్వత్థామా వికర్ణశ్చ సోమదత్తశ్చ బాహ్లికః॥ 6
సర్వే చ సహితాః శూరాః యుయుత్సుశ్చ మహారథః।
ధృతరాష్ట్రం పురస్కృత్య వివిశుస్తాం సభాం శుభామ్॥ 7
రాజా! భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, శల్యుడు, కృతవర్మ, సైంధవుడు, అశ్వత్థామ, వికర్ణుడు, యుయుత్సుడు, మొదలయిన శూరులంతా ధృతరాష్ట్రునితో సహా శుభప్రదమయిన ఆ సభలో ప్రవేశించారు. (6,7)
దుశ్శాసనశ్చిత్రసేనః శకునిశ్చాపి సౌబలః॥ 8
దుర్ముఖో దుస్సహః కర్ణః ఉలూకోఽథ వివింశతిః।
కురురాజం పురస్కృత్య దుర్యోధనమమర్షణమ్॥9
వివిశుస్తాం సభాం రాజన్ సురాః శక్రసదో యథా।
దుశ్శాసనుడు, చిత్రసేనుడు, శకుని(సుబలుని కొడుకు), దుర్ముఖుడు, దుస్సహుడు, కర్ణుడు, ఉలూకుడు, వివింశతి అనువారు క్రోధనుడయిన దుర్యోధనుని పురస్కరించుకొని, దేవతలు ఇంద్రసభలోనికి ప్రవేశించినట్లు రాజసభలోనికి ప్రవేశించారు. (8,9 1/2)
ఆవిశద్భిస్తదా రాజన్ శూరైః పరిఘబాహుభిః॥ 10
శుశుభే సా సభా రాజన్ సింహైరివ గిరేర్గుహా।
రాజా! పరిఘల వంటి భుజాలు కల శూరులు ప్రవేశిస్తూ ఉంటే ఆ సభ సింహాలు ప్రవేశిస్తున్న గిరి గుహలాగా ప్రకాశించింది. (10 1/2)
తే ప్రవిశ్య మహేష్వాసాః సభాం సర్వే మహౌజసః॥ 11
ఆసనాని విచిత్రాణి భేజిరే సూర్యవర్చసః।
ధనుర్ధారులు, మహాబలులు, సూర్యతేజస్వులు అయిన రాజులంతా చిత్రవర్ణాలు కల ఆసనాలపై కూర్చున్నారు. (11 1/2)
ఆసనస్థేషు సర్వేషు తేషు రాజసు భారత॥ 12
అయం స నివేదయామాస సూతపుత్రముపస్థితమ్।
అయం స రథ ఆయాతి యోఽయాసీత్ పాండవాన్ ప్రతి॥ 13
దూతో వస్తూర్ణమాయాతః సైంధవైః సాధువాహిభిః।
రాజులంతా ఆసనాల మీద కూర్చున్న తరువాత సంజయుడు వచ్చినట్లు ద్వారపాలకుడు విన్నవించాడు. "పాండవుల దగ్గరకు వెళ్లిన సంజయుడు భద్రమైన గుర్రాలు గల రథంతో వేగంగా వచ్చాడు" అంటూ సంజయుని రాకను విన్నవించాడు. (12,13)
ఉపేయాయ స తు క్షిప్రం రథాత్ ప్రస్కంద్య కుండలీ।
ప్రవివేశ సభాం పూర్ణాం మహీపాలైర్మహాత్మభిః॥ 14
ఇంతలో ఆ సంజయుడు వేగంగా వచ్చి రథం దిగి మహాత్ము లయిన రాజులతో నిండిన ఆ కొలువులోనికి ప్రవేశించాడు. (14)
సంజయ ఉవాచ
ప్రాప్తోఽశ్మి పాండవాన్ గత్వా తం విజానీత కౌరవాః।
యథావయః కురూన్ సర్వాన్ ప్రతినందంతి పాండవాః॥ 15
సంజయుడు అన్నాడు. కౌరవులారా! పాండవుల దగ్గరకు వెళ్లి వచ్చాను. పాండవులు వారి వయసులకు తగినట్లు కౌరవులందరినీ ప్రత్యభినందించారు (కుశల మడిగారు0. (15)
అభివాదయంతి వృద్ధాంశ్చ వయస్యాంశ్చ వయస్యవత్।
యూనశ్చాభ్యవదన్ పార్థాః ప్రతిపూజ్య యథావయః॥ 16
పాండవులు వృద్ధులకు అభివాదం చేశారు. సమవయస్కులను స్నేహితుల వలె అభినందించారు. యువకులను వయసుల ననుసరించి అభినందించారు. (16)
యథాహం ధృతరాష్ట్రేణ శిష్టః పూర్వమితో గతః।
అబ్రువమ్ పాండవాన్ గత్వా తన్నిబోధత పార్థివాః॥ 17
(అబ్రూతాం తత్ర ధర్మేణ వాసుదేవధనంజయౌ)
ఇక్కడ నుండి ధృతరాష్ట్రుడు పంపితే వెళ్లి అతడు ఆజ్ఞాపించినట్లు నేను చెప్పినది చెప్పుతున్నాను - వినండి.
(శ్రీకృష్ణార్జునులు అక్కడ ధర్మ సహితంగా పలికిన మాటలు కూడా చెపుతున్నాను) (17)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి యానసంధి పర్వణి సంజయ ప్రత్యాగమనే సప్తచత్వారింశోఽధ్యాయ॥ 47 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున యానసంధి పర్వమను ఉపపర్వమున సంజయుడు తిరిగివచ్చుట అను నలుబది ఏడవ అధ్యాయము. (47)
(దాక్షిణాత్య ప్రతి అధికపాఠము 1/2 శ్లోకము కలిపి మొత్తం 17 1/2 శ్లోకాలు)