48. నలువదియెనిమిదవ అధ్యాయము
అర్జునుని మాటలు సంజయుడు కౌరవసభలో చెప్పుట.
ధృతరాష్ట్ర ఉవాచ
పృచ్ఛామి త్వాం సంజయ రాజమధ్యే
కిమబ్రవీద్వాక్య మదీనసత్త్వః।
ధనంజయస్తాత యుధాం ప్రణేతా
దురాత్మనాం జీవితశ్చ న్మహాత్మా॥ 1
సంజయా! రాజుల ఎదుట నిన్ను అడుగుతున్నాను. అర్జునుడేమన్నాడు? అతడు తరగని బలం గల యుద్ధ నాయకుడు. దురాత్ముల జీవితాలను త్రుంచగల మహాత్ముడతడు. (1)
సంజయ ఉవాచ
దుర్యోధనో వాచమిమాం శృణోతు
యదబ్రవీదర్జునో యోత్స్యమానః।
యుధిష్ఠిరస్యానుమతే మహాత్మా
ధనంజయః శృణ్వతః కేశవస్య॥ 2
సంజయుడు చెపుతున్నాడు. ధర్మరాజు అనుమతితో యుద్ధానికి సిద్ధపడే మహాత్ముడు అర్జునుడు, కృష్ణుడు వింటూ ఉండగా చెప్పిన యీ మాటల్ని దుర్యోధనుడు వినాలి. (2)
అన్వత్రస్తో బాహువీర్యం విదానః
ఉపహ్వరే వాసుదేవస్య ధీరః।
అవోచన్మాం యోత్స్యమానః కిరీటీ
మధ్యే బ్రూయా ధార్తరాష్ట్రం కురూణామ్॥ 3
తనభుజశక్తి ఎంతటిదో తెలిసిన అర్జునుడు నిర్భయంగా కృష్ణుని సమీపంలో ఉండి నాతో "ఈ మాటలు కౌరవ సభా మధ్యంలో దుర్యోధనునితో చెప్పాలి" అన్నాడు. ఆ మాటలివి. (3)
సంశృణ్వతస్తస్య దుర్భాషిణో వై
దురాత్మనః సూతపుత్రస్య సూత।
యో యోద్ధుమాశంసతి మాం సదైవ
మందప్రజ్ఞః కాలపక్వోఽతిమూఢః॥ 4
సంజయా! దుర్భాషి, దురాత్ముడు, నాతో ఎపుడూ యుద్ధానికి సిద్ధపడే మందబుద్ధి, కాలం దగ్గర పడిన మూఢుడు సూతపుత్రుడు(కర్ణుడు) వింటూ ఉండగా ఈ మాటలు దుర్యోధనునకు చెప్పాలి. (4)
యే వై రాజానః పాండవాయోధనాయ
సమానీతాః శృణ్వతాం చాపి తేషామ్।
యథా సమగ్రం వచనం మయోక్తం
సహామాత్యం శ్రావయేథా నృపం తత్॥ 5
పాండవులతో యుద్ధంచేయటానికి తీసుకు వచ్చిన రాజులంతా వింటూఉండగా నేను చెప్పిన దంతా అమాత్యులతో కూడిన ఆ రాజుకు వినిపించు. (5)
యథా నూనం దేవరాజస్య దేవాః
శుశ్రూషంతే వజ్రహస్తస్య సర్వే।
తథాఽశృణ్వన్ పాండవాః సృంజయాశ్చ
కిరీటినా వాచముక్తాం సమర్థామ్॥ 6
వజ్రహస్తుడైన యింద్రుని మాటలు దేవతలంతా శ్రద్ధతో విన్నట్లు అర్జునుడు చెప్పిన శక్తిమంతమయిన మాటల్ని పాండవులూ, సృంజయులూ విన్నారు. (6)
ఇత్యబ్రవీదర్జునో యోత్స్యమానః
గాండీవధన్వా లోహితపద్మనేత్రః।
న చేద్రాజ్యం ముంచతి ధార్తరాష్ట్రః
యుధిష్ఠిరస్యాజమీఢస్య రాజ్ఞః॥ 7
యుద్ధానికి సిద్ధపడుతూ ఎర్రని పద్మాలలాగా అయిన కన్నులతో గాండీవి ఇలా అన్నాడు. "అజమీఢ వంశీయుడయిన ధర్మరాజుకు ఆ దుర్యోధనుడు రాజ్యం ఇవ్వకపోతే...(7)
అస్తి నూనం కర్మ కృతం పురస్తాత్
అనిర్విష్టం పావకం ధార్తరాష్ట్రైః।
యేషాం యుద్ధం భీమసేనార్జునాభ్యాం
తథాశ్విభ్యాం వాసుదేవేన చైవ॥ 8
ఆ ధృతరాష్ట్ర పుత్రులు పూర్వం చేసిన పాపం ఇంకా వారు అనుభవించలేదు. వారికిపుడు భీమార్జునులతో, నకుల సహదేవులతో, శ్రీకృష్ణునితో యుద్ధం వస్తోంది. (8)
శైనేయేన ధ్రువ మాత్తాయుధేన
ధృష్టద్యుమ్నేనాథ శిఖండినా చ।
యుధిష్ఠిరేణేంద్రకల్పేన చైవ
యోఽపధ్యనాన్నిర్దహేద్గాం దివం చ॥ 9
ఆయుధం ధరించిన సాత్యకితో, ధృష్టద్యుమ్నునితో, శిఖండితో, ఇంద్ర సమానుడయిన ధర్మరాజుతో యుద్ధం వస్తోంది. ఆ ధర్మరాజుకు అపకారబుద్ధి కలిగితే చాలు భూమ్యాకాశాలు దహించుకొనిపోతాయి. (9)
తైశ్చేద్యోద్ధుం మన్యతే ధార్తరాష్ట్రః
నిర్వృత్తోర్థః సకలః పాండవానామ్।
మా తత్కార్షిః పాండవస్యార్థహేతోః
ఉపైహి యుద్ధం యది మన్యసే త్వమ్॥ 10
ఈ వీరితో యుద్ధం చేయాలని దుర్యోధనుడు అనుకొంటే పాండవుల ప్రయోజనం సిద్ధించినట్లే - పాండవులకు మేలు జరుగుతుందని మాత్రం రాజ్యభాగం ఇవ్వకు - (రాజ్యభాగం ఇవ్వకపోతేనే పాండవులకు పూర్తి మేలు). యుద్ధం మేలని నీకు తోస్తేనే చెయ్యి. (10)
యాం తాం వనే దుఃఖశయ్యామవాత్సీత్
ప్రవ్రాజితః పాండవో ధర్మచారీ।
ఆప్నోతు తాం దుఃఖతరా మనర్థామ్
అంత్యాం శయ్యాం ధార్తరాష్ట్రః పరాసుః॥ 11
ధర్మాచరణ శీలి అయిన ధర్మరాజు నిర్వాసితుడై అడవిలో దుఃఖశయ్యను ఎక్కాడు. అంతకంటె దుఃఖకరమయిన చివరి శయ్యను యుద్ధంలో చచ్చి ఎక్కుతాడు దుర్యోధనుడు. (11)
హ్రియా జ్ఞానేన తపసా దమేన
శౌర్యేణాథో ధర్మగుప్త్యా ధనేన।
అన్యాయవృత్తిః కురుపాండవేయాన్
అధ్యాతిష్ఠే ద్ధార్తరాష్ట్రో దురాత్మా॥ 12
అన్యాయప్రవృత్తితో దుష్టాత్ముడయిన దుర్యోధనుడు ఆక్రమించిన రాజ్యాన్ని వినయం, జ్ఞానం, తపస్సు, ఇంద్రియ నిగ్రహం, శౌర్యం, ధర్మరక్షణం, ధనం అనువాటితో ధర్మరాజుకు వశం చెయ్యి. (12)
మాయోపధః ప్రణిపాతార్జవాభ్యాం
తపోదమాభ్యాం ధర్మగుప్త్యా బలేన।
సత్యం బ్రువన్ ప్రతిపన్నో నృపో నః
తితిక్షమాణః క్లిశ్యమానోఽతివేలమ్॥ 14
మా మహారాజు వృద్ధసేవతోనూ, ఆర్జవంతోనూ, తపస్సు, నిగ్రహాలతోనూ, ధర్మరక్షణబలంతోనూ, సత్యం మాట్లాడుతూ ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నా(ఇతరుల) కపట చేష్టల్ని సహించాలనే భావిస్తున్నాడు. (13)
యదా జ్యేష్ఠః పాండవః సంశితాత్మా
క్రోధం యత్తం వర్షపూగాన్ సుఘోరమ్।
అవస్రష్టా కురుషూద్వ్యత్తచేతాః
తదా యుద్ధం ధార్తరాష్ట్రోఽన్వతప్స్యత్॥ 14
ధర్మరాజు మనసు నదుపు చేసికొని ఎన్నో ఏళ్లు ఉన్నాడు. అణచుకొన్న ఘోరమయిన క్రోధాన్ని వశం తప్పిన మనసుతో కౌరవుల మీద గుప్పిస్తే అప్పుడు దుర్యోధనుడు యుద్ధాన్ని గూర్చి పరితపిస్తాడు. (14)
కృష్ణవర్త్మేన జ్వలితః సమిద్ధో
యథా దహేత్ కక్షమగ్ని ర్నిదాఘే।
ఏవం దగ్ధా ధార్తరాష్ట్రస్య సేనాం
యుధిష్ఠిరః క్రోధదీప్తోఽన్వవేక్ష్య॥ 15
వేసవిలో అంటుకొని రాజుకొన్న అగ్ని అడవిని దహించివేసినట్లు, క్రోధాగ్నితో ధర్మరాజు దుర్యోధనుని సేనను చూసి దహించివేస్తాడు. (15)
యదా ద్రష్టా భీమసేనం రథస్థం
గదాహస్తం క్రోధవిషం వమంతమ్।
అమర్షణం పాండవం భీమవేగం
తదా యుద్ధం ధార్తరాష్ట్రోఽన్వతప్స్యత్॥ 16
భయంకరమైన వేగంతో, దీర్ఘద్వేషంతో క్రోధమనే విషం క్రక్కుతీ, గద చేపట్టి భీమసేనుడు రథం మీద కనపడితే... అప్పుడు దుర్యోధనుడు యుద్ధం గురించి పస్చాత్తాపం చెందుతాడు. (16)
సేనాగ్రగం దంశితం భీమసేనం
స్వాలక్షణం వీరహణం పరేషామ్।
ఘ్నంతం చమూమంతకసంనికాశం
తదా స్మర్తా వచనస్యాతిమానీ॥ 17
సేనకు ముందు కవచం ధరించి, ఎవరికీ చూడ శక్యం కానట్లుగా, యమునిలాగా శత్రుసేనను భీముడు చంపుతూ ఉంటే అప్పుడు ఆ దురభిమాని దుర్యోధనుడు నా మాటలు తలచుకొంటాడులే! (17)
యదా ద్రష్టా భీమసేనేన నాగాన్
నిపాతితాన్ గిరికూట ప్రకాశాన్।
కుంభైరివాసృగ్వమతో భిన్నకుంభాం
స్తదా యుద్ధం ధార్తరాష్ట్రోఽన్వతప్స్యత్॥ 18
కొండ శిఖరాల్లాగా ఉన్న ఏనుగులను భీముడు నేల గూల్చితే తలలు బ్రద్దలై నెత్తురు కక్కుతున్న ఆ ఏనుగుల్ని చూసి అప్పుడు ఆ ధృతరాష్ట్ర పుత్రుడు యుద్ధాన్ని గూర్చి పరితపిస్తాడు. (18)
మహాసింహో గావ ఇవ ప్రవిశ్య
గదాపాణిర్థార్తరాష్ట్రా నుపేత్య।
యదా భీమో భీమరూపో నిహంతా
తదా యుద్ధం ధార్తరాష్ట్రోఽన్వతప్స్యత్॥ 19
మహాసింహం పశువులలో ప్రవేశించినట్లు రుద్ర రూపుడయిన భీముడు గద దాల్చి కౌరవులను చావమోదుతుంటే.. అపుడు యుద్ధం గురించ్ దుర్యోధనుడు పశ్చాత్తాపం చెందుతాడు. (19)
మహాభయే వీతభయః కృతాస్త్రః
సమాగమే శత్రుబలావమర్దీ।
సకృద్రథేనాప్రతిమాన్ రథౌఘాన్
పదాతి సంఘాన్ గదయాభినిఘ్నన్॥ 20
శైక్యేన నాగాంస్తరసా విగృహ్ణన్
యదా ఛేత్తా ధార్తరాష్ట్రస్య సైన్యమ్।
ఛిందన్వనం పరశునేవ శూరః
తదా యుద్ధం ధార్తరాష్ట్రోఽన్వతప్స్యత్॥ 21
మహాభయంకరమయిన యుద్ధంలో నిర్భయుడు, అస్త్రవిశారదుడు, శత్రు సైన్యాన్ని నుగ్గు చేసే భీముడు ఒంటి రథంతో ఎన్నో రథసమూహాలనూ, గదతో పదాతిదళాలనూ చావమోదుతూ, ఖడ్గంతో ఏనుగులను శీఘ్రంగా నరుకుతూ, గండ్రగొడ్డలితో అడవిని నరికే శూరుని వలె కౌరవ సైన్యాన్ని నరుకుతుంటే... అపుడు ఆ దుర్యోధనుడు యుద్దం గురించి పశ్చాత్తాపం పొందుతాడు. (20,21)
తృణప్రాయం జ్వలనేనేవ దగ్ధం
గ్రామం యథా ధార్తరాష్ట్రాన్ సమీక్ష్య।
పక్వం సస్యం వైద్యుతేనేవ దగ్ధం
పరాసిక్తం విపులం స్వం బలౌఘమ్॥ 22
హతప్రవీరం విముఖం భయార్తం
పరాఙ్ముఖం ప్రాయశోఽధృష్టయోధమ్।
శస్త్రార్చిషా భీమసేనేన దగ్ధం
తదా యుద్ధం ధార్తరాష్ట్రోఽన్వతప్స్యత్॥ 23
పూరిళ్లు గల గ్రామం అగ్నితో దగ్ధమైనట్లుగా, పండిన చేను పిడుగుపడి మాడిపోయినట్లు, కురుసైన్యమంతా భీముని బాణాగ్నికి దగ్ధమైపోయి, చిందరవందరగా మిగిలిన వారంతా భయంతో పారిపోతుంటే... అపుడు తన సైన్యాన్ని చూసి యుద్ధం గురించి దుర్యోధనుడు పరితపిస్తాడు. (22,23)
ఉపాసంగా నాచరే ద్దక్షిణేన
వరాంగానాం నకుల శ్చిత్రయోధీ।
యదా రథాగ్ర్యో రథినః ప్రణేతా
తదా యుద్ధం ధార్తరాష్ట్రోఽన్వతప్స్యత్॥ 24
విచిత్రగతులతో పోరాడే, రథికశ్రేష్ఠుడు నకులుడు తూణీరాలను కుడిప్రక్కకు మార్చుకొని ఎడమ చేతితో కూడా బాణ ప్రయోగం చేస్తూ రథికుల తలలను గుట్టలుగా కూల్చితే అపుడు దుర్యోధనుడు యుద్ధం గురించి పరితపిస్తాడు. (24)
సుఖోచితో దుఃఖశయ్యాం వనేషు
దీర్ఘకాలం నకులో యామశేత।
ఆశీవిషః క్రుద్ధ ఇవోద్వమన్ విషం
తదా యుద్ధం ధార్తరాష్ట్రోఽన్వతప్స్యత్॥ 25
సుఖార్హుడయిన నకులుడు అడవుల్లో చాలాకాలం దుఃఖశయ్యపై పడుకొన్నాడు. అందుచేత అతడు బుసకొట్టే పాములాగా విషం కక్కుతీ ఉంటే... అపుడు దుర్యోధనుడు యుద్ధం గురించి విచారిస్తాడు. (25)
త్యక్తాత్మానః పార్థివా యోధనాయ
సమాదిష్టా ధర్మరాజేన సూత।
రథైః శుభ్రైః సైన్యమభిద్రవంతో
దృష్ట్వా పశ్చాత్ తప్స్యతే ధార్తరాష్ట్రః॥ 26
ధర్మరాజు ఆదేశంతో యుద్ధానికి వచ్చి నిర్భయంగా పోరాడే రాజులు శుభ్రమైన రథాలతో కురుసేనను తరుముతూ ఉంటే... ఆ దృశ్యం చూసి దుర్యోధనుడు పశ్చాత్తప్తు డవుతాడు. (26)
శిశూన్ కృతాస్త్రానశిశుప్రకాశాన్
యదా ద్రష్టా కౌరవః పంచశూరాన్।
త్యక్త్వా ప్రాణాన్ కౌరవానాద్రవంతః
తదా యుద్ధం ధార్తరాష్ట్రోఽన్వతప్స్యత్॥ 27
బాలురయినా మహావీరుల వలె విజృంభించే అస్త్రవేత్తలు ఉపపాండవులు ప్రాణాలకు తెగించి కౌరవులను తరుముతూ ఉంటే... ఆ దృశ్యం చూసి అపుడు యుద్ధం గురించి దుర్యోధనుడు పరితపిస్తాడు. (27)
యదా గతోద్వాహ మకూజనాక్షం
సువర్ణతారం రథముత్తమాశ్వైః।
దాంతైర్యుక్తం సహదేవోఽధిరూఢః
శిరాంసి రాజ్ఞాం క్షేప్స్యతే మార్గణౌఘైః॥ 28
మహాభయే సంప్రవృత్తే రథస్థం
వివర్తమానం సమరే కృతాస్త్రమ్।
సర్వా దిశః సంపతంతం సమీక్ష్య
తదా యుద్ధం ధార్తరాష్ట్రోఽన్వతప్స్యత్॥ 29
కుదుపు లేకుండా చప్పుడు కాని ఇరుసుతో, బంగారు త్రాడుతో, అదుపుగల గుర్రాలతో కూడిన రథం ఎక్కి సహదేవుడు బాణవర్షంతో రాజుల శిరస్సులను ఎగురకొడతాడు. అటువంటి మహాభయంకర యుద్ధంలో రథంమీదనుండి అస్త్రవేత్త సహదేవుడు అన్నిదిక్కులకూ వచ్చి మీద పడుతుంటే.. ఆ యుద్ధం చూసి అపుడు దుర్యోధనుడు పరితపిస్తాడు. (28,29)
హ్రీనిషేవో నిపుణః సత్యవాదీ
మహాబలః సర్వధర్మోపపన్నః।
గాంధారిమార్ఛంస్తుములే క్షిప్రకారీ
క్షేప్తా జనాన్ సహదేవస్తరస్వీ॥ 30
యదా ద్రష్టా ద్రౌపదీయాన్ మహేషూన్
శూరాన్ కృతాస్త్రాన్ రథయుద్దకోవిదాన్।
ఆశీవిషాన్ ఘోరవిషానివాయతః
తదా యుద్ధం ధార్తరాష్ట్రోఽన్వతప్స్యత్॥ 31
సహదేవుడు లజ్జా శీలి, నిపుణుడు, సత్యవాది, మహా బలవంతుడు. అన్ని ధర్మాలు తెలిసినవాడు. యుద్ధంలో చురుకైనవాడు. వేగంతో శకునిని తరుముతీ ప్రజలను చెదర గొట్టగలడు. (30)
ద్రౌపదీ పుత్రులు మహాధనుర్ధారులు, శూరులు, అస్త్రవేత్తలు, రథ యుద్ధంలో ఆరితేరినవారు. వారు విషసర్పాల లాగా వచ్చి శత్రువులపై పడుతూ ఉంటే... అపుడు దుర్యోధనుడు పశ్చాత్తాపం పొందుతాడు. (31)
యదాభిమన్యుః పరవీరఘాతీ
శరైః పరాన్ మేఘ ఇవాభివర్షన్।
విగాహితా కృష్ణసమః కృతాస్త్రః
తదా యుద్ధం ధార్తరాష్ట్రోఽన్వతప్స్యత్॥ 32
శత్రుమర్దనుడు, అస్త్రవేత్త, కృష్ణసమానుడు అయిన అభిమన్యుడు కురువీరులపై మేఘంలాగా బాణవర్షం కురిపిస్తూ ఉంటే... అపుడు దుర్యోధనుడు యుద్ధం గురించి పశ్చాత్తప్తుడవుతాడు. (32)
యదా ద్రష్టా బాల మబాలవీర్యం
ద్విషచ్చమూం మృత్యు మివోత్పతంతమ్।
సౌభద్రమింద్రప్రతిమం కృతాస్త్రం
తదా యుద్ధం ధార్తరాష్ట్రోఽన్వతప్స్యత్॥ 33
బాలుడయినా ప్రౌఢ పరాక్రమంతో కురుసేన మీద మృత్యువులా దూకుతున్న ఇంద్రసమానుడయిన అస్త్రవేత్త అభిమన్యుని చూస్తే... అప్పుడు దుర్యోధనుడు పశ్చాత్తాప పడతాడు. (33)
ప్రభద్రకా శీఘ్రతరా యువానః
విశారదాః సింహసమానవీర్యాః।
యదా క్షేప్తారో ధార్తరాష్ట్రాన్ ససైన్యాన్
తదా యుద్ధం ధార్తరాష్ట్రోఽన్వతప్స్యత్॥ 34
చురుకైన యువకులు, అస్త్రవిశారదులు, సింహంతో సమానమయిన పరాక్రమం కల ప్రభద్రకులు(యాదవులలో ఒక వర్గం) సైన్యంతో సహా కౌరవులను చెదరగొడుతూ ఉంటే... అపుడు యుద్ధం గురించి దుర్యోధనుడు పశ్చాత్తాపం పొందుతాడు. (34)
వృద్ధౌ విరాటద్రుపదౌ మహారథౌ
పృథక్ చమూభ్యామభివర్తమానౌ।
యదా ద్రష్టారౌ ధార్తరాష్ట్రాన్ ససైన్యాన్
తదా యుద్ధం ధార్తరాష్ట్రోఽన్వతప్స్యత్॥ 35
వృద్ధులూ, మహారథులూ అయిన విరాట, ద్రుపదులు వేర్వేరుగా తమ తమ సైన్యాలతో విహరిస్తూ కౌరవుల సైన్యంపై దృష్టిసారిస్తే అపుడు దుర్యోధనుడు యుద్ధం గురించి పరితపిస్తాడు. (35)
యదా కృతాస్త్రో ద్రుపదః ప్రచిన్వన్
శిరాంసి యూనాం సమరే రథస్థః।
క్రుద్ధః శరై శ్ఛేత్స్యతి చాపముక్తైః
తదా యుద్ధం ధార్తరాష్ట్రోఽన్వతప్స్యత్॥ 36
అస్త్రవేత్త అయిన ద్రుపదుడు యుద్ధంలో రథం ఎక్కి కోపంతో (తన వింటినుండి వదిలిన) బాణాలతో యువకుల తలలు తరుగుతూ ఉంటే.. అపుడు యుద్ధం గురించి దుర్యోధనుడు పరితపిస్తాడు. (36)
యదా విరాటః పరవీరఘాతీ
రణాంతరే శత్రుచమూం ప్రవేష్టా।
మత్స్యైః సార్ధమనృశంసరూపైః
తదా యుద్ధం ధార్తరాష్ట్రోఽన్వతప్స్యత్॥ 37
శత్రువీరులను సంహరించే కలిసి శత్రుసేనలో ప్రవేశిస్తూ ఉంటే... అపుడు యుద్ధం గురించి దుర్యోధనుడు పరితాపం చెందుతాడు. (37)
జ్యేష్ఠం మాత్స్యమనృశంసార్యరూపం
విరాటపుత్రం రథినం పురస్తాత్।
యదా ద్రష్టా దంశితం పాండవార్థే
తదా యుద్ధం ధార్తరాష్ట్రోఽన్వతప్స్యత్॥ 38
వినయం, మృదుస్వభావంకల విరాటుని పెద్దకొడుకు (శంఖుడు) పాండవులకోసం కవచం దాల్చి రథమెక్కి ఎదురు పడితే... అపుడు దుర్యోధనుడు పశ్చాత్తాపం చెందుతాడు. (38)
రణే హతే కౌరవాణాం ప్రవీరే
శిఖండినా సత్తమే శాంతనూజే।
న జాతు నః శత్రవో ధారయేయుః
అసంశయం సత్యమేతద్బ్రవీమి॥ 39
కౌరవ వీరసత్తముడు భీష్ముడు శిఖండి చేత యుద్ధభూమిలో పడిపోతే... ఇక మాకు శత్రువులుండరు. ఇందులో సందేహం లేదు. నిజం చెపుతున్నాను. (39)
యదా శిఖండీ రథినః ప్రచిన్వన్
భీష్మం రథేనాభియాతా వరూథీ।
దివ్యైర్హయైరవమృద్నన్ రథౌఘాన్
తదా యుద్ధం ధార్తరాష్ట్రోఽన్వతప్స్యత్॥ 40
శిఖండి దివ్యాశ్వాలు గల రథాన్ని ఎక్కి శత్రురథికులను ఏరిఏరి చంపుతూ, చితకగొట్టుతూ భీష్ముని ఆక్రమించినప్పుడు దుర్యోధనుడు యుద్ధాన్ని గురించి పశ్చాత్తాపడతాడు. (40)
యదా ద్రష్టా సృంజయానామనీకే
ధృష్టద్యుమ్నం ప్రముఖే రోచమానమ్।
అస్త్రం యస్మై గుహ్యమువాచ ధీమాన్
ద్రోణస్తదా తప్స్యతి ధార్తరాష్ట్రః॥ 41
సృంజయుల సేనలో ముందు భాగాన వెలుగొందే ధృష్టద్యుమ్నుని చూస్తే... దుర్యోధనుడు పరితపించక మానడు. ధీమంతుడయిన ద్రోణుడు అతనికి రహస్యమైన అస్త్రం చెప్పాడు. (41)
యదా స సేనాపతి రప్రమేయః
పరామృద్నన్నిషుభిర్ధార్తరాష్ట్రాన్।
ద్రోణం రణే శత్రుసహోఽభియాతా
తదా యుద్ధం ధార్తరాష్ట్రోఽన్వతప్స్యత్॥ 42
పాండవసేనాపతి ధృష్టద్యుమ్నుని బలం లెక్కింపరానిది. ఎంత శత్రువునయినా నిలబెట్టగల అతడు కౌరవులను బాణాలతో పిండిచేస్తూ ద్రోణునిపై పడినపుడు... ఆ దుర్యోధనుడు యుద్ధం గురించి పశ్చాత్తప్తుడవుతాడు. (42)
హ్రీమాన్ మనీషీ బలవాన్ మనస్వీ
స లక్ష్మీవాన్ సోమకానాం ప్రబర్హః।
న జాతు తం శత్రవోఽన్యే సహేరన్
యేషాం స స్యాదగ్రణీర్వృష్ణిసింహః॥ 43
లజ్జాశీలుడు, బుద్ధిమంతుడు, బలవంతుడు, మనసు గలవాడు, సంపన్నుడు అయిన ఆ సోమకవంశోత్తముని (ధృష్టద్యుమ్నుని) శత్రువులెవరూ నిలువరించలేరు. అతని ముందు భాగాన్ వృష్ణిసింహుడైన సాత్యకి ఉంటాడు. (43)
ఇదం చ బ్రూయా మా వృణీష్వేతి లోకే
యుద్ధేఽద్వితీయం సచివం రథస్థమ్।
శినే ర్నప్తారం ప్రవృణీమ సాత్యకిం
మహాబలం వీతభయం కృతాస్త్రమ్॥ 44
ఈమాట కూడ చెప్పాలి. "రాజ్యం ఆశపడకు" అని. ఎందుచేతనంటే లోకంలో కాని, యుద్ధంలోకాని రథ మెక్కితే సాటిలేనివాడు సాత్యకి - అతడు మాకు సహయుడు - భయమెరుగని బలశాలి. అస్త్రవిద్యలో నిపుణుడు. (44)
మహోరస్కో దీర్ఘబాహుః ప్రమాథీ
యుద్ధేఽద్వితీయః పరమాస్త్రవేదీ।
శినేర్నప్తా తాలమాత్రాయుధోఽయం
మహారథో వీతభయః కృతాస్త్రః॥ 45
విశాలమైన వక్షఃస్థలం, దీర్ఘ భుజాలు కలిగి దివ్యాస్త్రవేత్త అయిన సాత్యకి యుద్ధంలో సాటిలేనివాడు. తాటి చెట్టంత ఆయుధంతో శత్రు మర్దనం చేస్తాడు. ఆ మహారథుడు భయవిరహితుడు. (45)
యదా శినీనామధిపో మయోక్తః
శరైః పరన్ మేఘ ఇవ ప్రవర్షన్।
ప్రచ్ఛాదయిష్యత్యరిహా యోధముఖ్యాన్
తదా యుద్ధం ధార్తరాష్ట్రోఽన్వతప్స్యత్॥ 46
నేను చెప్పిన ఆ సాత్యకి మేఘం వర్షం కురిసినట్లు శత్రువులపై బాణాలు కురిపిస్తూ శత్రుయోధుల నందరిని కప్పివేస్తూ ఉంటే... అప్పుడు యుద్ధం గురించి దుర్యోధనుడు పరితపిస్తాడు. (46)
యదా ధృతిం కురుతే యోత్స్యమానః
స దీర్ఘబాహుర్దృఢధన్వా మహాత్మా।
సింహస్యేవ గంధ మాఘ్రాయ గావః
సంచేష్టంతే శత్రవోఽస్మాద్రణాగ్రే॥ 47
పొడవైన భుజాలు, దృఢమైన విల్లు కల ఆ మహాత్ముడు యుద్ధంలో కొద్ది ధైర్యం చూపితే చాలు, సింహం వాసన తగిలిన పశువుల్లాగా శత్రువులు యుద్ధంలో పరువులెత్తుతారు. (47)
స దీర్ఘబాహుర్దృఢధన్వా మహాత్మా
భింద్యాత్ గిరీన్ సంహరేత్ సర్వలోకాన్।
అస్త్రే కృతీ నిపుణః క్షిప్రహస్తః
దివి స్థితః సూర్య ఇవాభిభాతి॥ 48
ఆ సాత్యకి పర్వతాలను సయితం పిండి చేస్తాడు. లోకాలన్నిటినీ సంహరించగలడు. అస్త్రనిపుణుడు, హస్తలాఘవం కలవాడు. ఆకాశంలో సూర్యునిలా వెలిగిపోతూ ఉంటాడు. (48)
చిత్రః సూక్ష్మః సుకృతో యాదవస్య
అస్త్రే యోగో వృష్ణిసింహస్య భూయాన్।
యథావిధం యోగమాహుః ప్రశస్తం
సర్వైర్గుణైః సాత్యకిస్తైరుపేతః॥ 49
వృష్ణిసింహుని అస్త్రలాభం చిత్రం, సూక్ష్మం అయినది. ప్రశస్తమూ, నిపుణమూ అయినది, పర్శస్తమయిన యోగం ఎలా ఉండాలో అటువంటి సర్వగుణాలతోనూ కూడిన నైపుణ్యం కలవాడు సాత్యకి. (49)
హిరణ్మయం శ్వేతహయైశ్చతుర్భిః
యదా యుక్తం స్యందనం మాధవస్య।
ద్రష్టా యుద్ధే సాత్యకే ర్ధార్తరాష్ట్రాః
తదా తప్స్యత్యకృతాత్మా స మందః॥ 50
నాలుగు తెల్లని గుర్రాలు పూన్చిన బంగారు రథంలో ఉన్న సాత్యకితో యుద్ధంలో కౌరవులు తలపడితే అపుడా మందబుద్ధి అయిన దుర్యోధనుడు పరితపిస్తాడు. (50)
యదా రథం హేమమణి ప్రకాశం
శ్వేతాశ్వయుక్తం వానరకేతుముగ్రమ్।
దృష్ట్వా మమాప్యాస్థితం కేశవేన
తదా తప్స్యత్యకృతాత్మా స మందః॥ 51
బంగారంతో మణులతో ప్రకాశిస్తూ, శ్వేతాశ్వాలు కపిధ్వజం కల నా రథం మీద కృష్ణుడు కూడా ఉండగా చూసి మందబుద్ధి అయిన దుర్యోధనుడు పరితపించక తప్పదు. (51)
యదా మౌర్వ్యా స్తలనిష్పేషముగ్రం
మహాశబ్దం వజ్రనిష్పేషతుల్యమ్।
విఢూయమానస్య మహారణే మయా
స గాండివస్య శ్రోష్యతి మందబుద్ధిః॥ 52
యుద్ధంలో నేను వింటినారిని లాగితే పిడుగుపడినట్లు ధ్వని వస్తుంది. భయంకరమయిన నా గాండీవధ్వనిని ఆ మందబుద్ధి తప్పక వింటాడు. (52)
తదా మూఢో ధృతరాష్ట్రస్య పుత్రః
తప్తా యుద్ధే దుర్మతి ర్దుస్సహాయః।
దృష్ట్వా సైన్యం బాణవర్షాంధకారే
ప్రభజ్యంతం గోకులవద్రణాగ్రే॥ 53
రణాంగణం అంతా నా భాణవర్షంతో చీకటి అయిపోతే... ఆ చీకటిలో పశువుల మందలా తన సైన్యం విరిగిపోతూ ఉంటే... దుర్మార్గుడు ఆ ధృతరాష్ట్రపుత్రుడు పరితపిస్తాడు. (53)
బలాహకా దుచ్చరతః సుభీమాన్
విద్యుత్ స్ఫులింగానివ ఘోరరూపాన్।
సహస్రఘ్నాన్ ద్విషతాం సంగరేషు
అస్థిచ్ఛిదో మర్మభిదః సుపుంఖాన్॥ 54
యదా ద్రష్టా జ్యాముఖాద్ బాణసంఘాన్
గాండీవముక్తానాపతతః శితాగ్రాన్।
హయాన్ గజాన్ వర్మిణశ్చాదదానామ్
తదా యుద్ధం ధార్తరాష్ట్రోఽన్వతప్స్యత్॥ 55
నా బాణాలు మేఘం నుండి వెలువడే భయంకరమయిన పిడుగు రవ్వల వంటివి. యుద్ధంలో వేలకొద్దీ శత్రువులను చంపుతాయి. ఎముకలనూ, మర్మస్థానాలనూ ఛేదిస్తాయి. గజ, తురగ, పదాతి దళాలను మట్టుపెడతాయి. ఆ నా బాణాలు గాండీవం నుండి వెలువడినపుడు... ఆ దుర్యోధనుడు పరితపిస్తాడు. (54, 55)
యదా మందః పరబాణాన్ విముక్తాన్
మమేషుభిః హ్రియమాణాన్ ప్రతీపమ్।
తిర్యగ్విధ్యచ్ఛిద్యమానాన్ పృషత్కైః
తదా యుద్ధం ధార్తరాష్ట్రోఽన్వతప్స్యత్॥ 56
తన సైన్యం వదలిన బాణాలు నా బాణాలతో అడ్డం తిరిగి విరిగి పడుతూ ఉంటే.. చూసి ఆ దుర్యోధనుడు యుద్ధం గురించి పరితాపం చెందుతాడు. (56)
యదా విపాఠా మద్భుజవిప్రముక్తాః
ద్విజాః ఫలానీవ మహీరుహాగ్రాత్।
ప్రచేతార ఉత్తమాంగాని యూనాం
తదా యుద్ధం ధార్తరాష్ట్రోఽన్వతప్స్యత్॥ 57
నా భుజాల నుండి వెలువడిన బాణాలు, పస్క్హులు చెట్ల కొనకొమ్మల నుండి పళ్లను కొరుక్కుపోయినట్లుగా యువకుల శిరసులను త్రుంచి వేస్తూ ఉంటే... అపుడు ఆ దుర్యోధనుడు యుద్ధం గురించి పరితపిస్తాడు. (57)
యదా ద్రష్టా పతతః స్యందనేభ్యః
మహాగజేభ్యోఽశ్వగతాన్ సుయోధనాన్।
శరైర్హతాన్ పాతితాంశ్చైవ రంగే
తదా యుద్ధం ధార్తరాష్ట్రోఽన్వతప్స్యత్॥ 58
యుద్ధరంగంలో నా బాణాలు తగిలి రథాల నుండి, ఏనుగుల మీదనుండి, గుర్రాల మీద నుండి పడుతున్న యోధుల్ని చూస్తే... అపుడు ఆ దుర్యోధనుడు యుద్ధం గురించి పరితాపం చెందుతాడు. (58)
అసంప్రాప్తానస్త్రపథం పరస్య
యదా ద్రష్టా నశ్యతో ధార్తరాష్ట్రాన్।
అకుర్వతః కర్మ యుద్ధే సమంతాత్
తదా యుద్ధం ధార్తరాష్ట్రోఽన్వతప్స్యత్॥ 59
శత్రుబాణాల మార్గంలో పడకుండానే(శత్రు బాణం తగల కుండానే) చేష్టలుడిగి చచ్చిపోతున్న కౌరవులను చూచి అప్పుడు యుద్ధం గురించి దుర్యోధనుడు పరితపిస్తాడు. (59)
పదాతి సంఘాన్ రథ సంఘాన్ సమంతాత్
వ్యాత్తానసః కాల ఇవాతతేషుః।
ప్రణోత్స్యామి జ్వలితై ర్బాణవర్షైః
శత్రూంస్తదా తప్స్యతి మందబుద్ధిః॥ 60
నోరు తెరచుకొని వచ్చే యముని లాగా, విస్తృత బాణాలు కల నేను మండే బాణాలతో శత్రువుల పదాతి దళాలనూ, రథ సముదాయాలనూ సమగ్రంగా విసరికొడుతూ ఉంటే మందబుద్ధి అయిన దుర్యోధనుడు అపుడు పరితపిస్తాడు. (60)
సర్వా దిశః సంపతతా రథేన
రజోధ్వస్తం గాండివేన ప్రకృత్తమ్।
యదా ద్రష్టా స్వబలం సంప్రమూఢం
తదా పశ్చాత్తప్స్యతి మందబుద్ధిః॥ 61
రణరంగంలో లేచిన దుమ్ము అన్ని దిక్కులా వచ్చి పడుతూ ఉంటే... గాండివంతో కౌరవసైన్యం ముక్కలు ముక్కలవుతూ ఉంటే... తన సైన్యం మూర్ఛపోతూ ఉంటే... అపుడు మందబుద్ధి అయిన దుర్యోధనుడు పశ్చాత్తాప పడతాడు. (61)
కాందిగ్భూతం భిన్నగాత్రం విసంజ్ఞం
దుర్యోధనో ద్రక్ష్యతి సర్వసైన్యమ్।
హతాశ్వవీరాగ్ర్యనరేంద్రనాగం
పిపాసితం శ్రాంతపత్రం భయార్తమ్॥ 62
అర్తస్వరం హన్యమానం హతం చ
వికీర్ణకేశాస్థికపాలసంఘమ్।
ప్రజాపతేః కర్మ యథార్థనిశ్చితం
తదా దృష్ట్వా తప్స్యతి మందబుద్ధిః॥ 63
దుర్యోదనుని సేన చెల్లా చెదురుగా పారిపోతూ, అవయవాలు విరిగి, మూర్ఛపోయి ఉండగా తానూ చూస్తాడు. గుర్రాలు, యోధులు, రాజులు, ఏనుగులు చచ్చిపడి ఉంటే, సేన అంతా భయంతో దప్పితో ఉండి, వాహనాలు కదలలేని పరిస్థితిలో దుర్యోధనుడు చూస్తాడు. (62)
శోకారావాలతో చనిపోతున్నవారు కొందరు, చనిపోయినవారు కొందరు, చెల్లా చెదురుగా పడి వున్న కేశాలు, ఎముకలు, పుఱ్ఱెలు ఇవి అన్నీ బ్రహ్మ సృష్టికార్యానికి పూర్వం చేకూర్చుకొన్న అవయవ సముదాయంలా ఉంటాయి. ఆ పరిస్థితిని చూసి మందబుద్ధి అయిన దుర్యోధనుడు పరితపించక మానడు. (63)
యదా రథే గాండివం వాసుదేవం
దివ్యం శంఖం పాంచజన్యం హయాంశ్చ।
తూణావక్షయ్యౌ దేవదత్తం చ మాం చ
దృష్ట్వా యుద్ధే ధార్తరాష్ట్రోఽన్వతప్స్యత్॥ 64
రథం మీద నా గాండీవాన్ని కృష్ణుని దివ్యమైన పాంచజన్యశంఖాన్ని, తెల్లగుర్రాల్ని, అక్షయ తూణీరాలను నా దేవదత్తశంఖాన్ని నన్ను చూసి యుద్ధంలో దుర్యోధనుడు పరితపిస్తాడు. (64)
ఉద్వర్తయన్ దస్యుసంఘాన్ సమేతాన్
ప్రవర్తయన్ యుగమన్యద్యుగాంతే।
యదా ధక్ష్యామ్యగ్నివత్ కౌరవేయాన్
తదా తప్తా ధృతరాష్ట్రః సపుత్రః॥ 65
కూడి వచ్చిన దాయాదులను వెనుదిరిగేటట్లు చేస్తూ యుగాంతం అయ్యాక మరో యుగం ప్రవర్తింపజేస్తూ, అగ్నిలాగా కౌరవులను దహించి వేస్తూ ఉంటే ధృతరాష్ట్రుడు పుత్రులతో కలిసి పరితపిస్తాడు. (65)
సభ్రాతా వై సహసైన్యః సభృత్యః
భ్రష్టైశ్వర్యః క్రోధవసోఽల్ప చేతాః।
దర్పస్యాంతే విహతో వేపమానః
పశ్చాన్మందః తప్స్యతి ధర్తరాష్ట్రః॥ 66
తమ్ములతో, సైన్యంతో, సేవకులతో కూడి సంపద కోల్పోయి, క్రోధంతో మందబుద్ధి అయి, గర్వం చచ్చి, నేల మీద పడినపుడు ఆ దుర్యోధనుడు పశ్చాత్తప్తుడవుతాడు. (66)
పూర్వాహ్నే మాం కృతజప్యం కదాచిత్।
విప్రః ప్రోవాచోదకాంతే మనోజ్ఞమ్।
కర్తవ్యం తే దుష్కరం కర్మ పార్థ
యోద్ధవ్యం తే శత్రుభిః సవ్యసాచిన్॥ 67
ఇంద్రో వా తే హరిమాన్ వజ్రహస్తః
పురస్తాద్యాతు సమరేఽరీన్ వినిఘ్నన్।
సుగ్రీవయుక్తేన రథేన వ తే
పశ్చాత్ కృష్ణో రక్షతు వాసుదేవః॥ 68
ఒకరోజు ఉదయం నేను జపం ముగించి సంధ్యావందనం పూర్తి అయ్యాక ఒక విప్రుడు వచ్చి మనోహరంగా ఇలా అన్నాడు."సవ్యసాచీ! కష్టమైన కార్యం ఒకటి నీవు చేయాలి. శత్రువులతో యుద్ధం చేయాలి. ఉచ్పైః శ్రవాన్ని ఎక్కి వజ్రంతో శత్రు సంహారం చేస్తూ ఇంద్రుడు నీ ముందు నడుస్తాడు. లేదా సుగ్రీవం మొదలైన గుర్రాలు పూన్చిన రథమెక్కి కృష్ణుడు వెనుక ఉండి నిన్ను కాపాడుతాడు." (67,68)
వవ్రే చాహం వజ్రహస్తా న్మహేంద్రాత్
అస్మిన్ యుద్ధే వాసుదేవం సహాయమ్।
స మే లబ్ధో దస్యువధాయ కృష్ణః
మన్యే చైతద్విహితం దైవతైర్మే॥ 69
వజ్రహస్తుడయిన ఇంద్రుని వదలి నేను ఈ యుద్ధంలో కృష్ణుని సహాయంగా కోరుకొన్నాను. ఈ దొంగలను చంపటానికి కృష్ణుడు నాకు సహాయంగా లభించాడు. ఇది అంతా నాకు దైవ విహితమని భావిస్తున్నాను. (69)
అయుధ్యమానో మనసాఽపి యస్య
జయం కృష్ణః పురుషస్యాభినందేత్।
ఏవం సర్వాన్ స వ్యతీయా దమిత్రాన్
సేంద్రాన్ దేవాన్ మానుషే నాస్తి చింతా॥ 70
యుద్ధం చేయకపోయినా కృష్ణుడు ఏ పురుషుని జయాన్ని మనసా కోరుకొంటాడో అతడు శత్రువులను - వారు ఇంద్రాది దేవతలయినా - జయిస్తాడు. మనుష్యులయితే ఆలోచించనక్కరలేదు. (70)
స బాహుభ్యాం సాగర ముత్తితీర్షేత్
మహోదరం సలిల స్యాప్రమేయమ్।
తేజస్వినం కృష్ణమత్యంతశూరం
యుద్ధేన యో వాసుదేవం జిగీషేత్॥ 71
తేజస్వి, శూరుడు అయిన వాసుదేవుని యుద్ధంలో జయించా లనుకొనేవాడు, అంతులేని జలాలతో నిండిన సాగరాన్ని కేవలం చేతులతో ఈది దాటాలనుకొన్నవాడే అవుతాడు.(తప్పక నశిస్తాడు) (71)
గిరిం య ఇచ్ఛేత్తు తలేన భేత్తుం
శిలోచ్చయం శ్వేతమతిప్రమాణమ్।
తస్యైవ పాణిః సనఖో విశీర్యేత్
న చాపి కించిత్ స గిరేస్తు కుర్యాత్॥ 72
అరచేతిలో వెండికొండను బ్రద్దలు చేయాలనుకొంటే వాని చేయి గోళ్లతో సహ పిండి పిండి అవుతుంది తప్ప వాడు ఆ కొండను ఏమీ చేయలేడు. (72)
అగ్నిం సమిద్ధం శమయేద్భుజాభ్యాం
చంద్రం చ సూర్యం చ నివారయేత్।
హరేర్దేవానామమృతం ప్రసహ్య
యుద్ధేన యో వాసుదేవం జిగీషేత్॥ 73
యుద్ధంలో వాసుదేవుని జయించాలనుకొనేవాడు మండే అగ్నిని చేతులు కప్పి ఆర్పాలి అనుకొనేవాడు, సూర్య చంద్రుల గతులను ఆపాలి అనుకొనేవాడు, దేవతల అమృతాన్ని బలవంతాన అపహరించాలి అనుకొనేవాడు.(73)
యో రుక్మిణీమేకరథేన భోజాన్
ఉత్సాద్య రాజ్ఞః సమరే ప్రసహ్య।
ఉవాహ భార్యాం యశసా జ్వలంతీం
యస్యాం జజ్ఞే రౌక్మిణేయో మహాత్మా॥ 74
ఆ కృష్ణుడు కేవలం ఒక్క రథమాత్ర సహాయంతో భోజవంశీయులందరినీ బలంతో తరిమివేసి, సౌందర్యంతో వెలుగుతున్న రుక్మిణిని భార్యగా గ్రహించాడు. ఆమె యందే ఆ మహాత్ముడు ప్రద్యుమ్నుని కన్నాడు గదా! (74)
అయం గాంధారాంస్తరసా సంప్రమథ్య
జిత్వా పుత్రాన్నగ్నజితః సమగ్రాన్।
బద్ధం ముమోచ వినదంతం ప్రసహ్య
సుదర్శనం వై దేవతానాం లలామమ్॥ 75
దేవతలకు రత్నం లాంటి సుదర్శనమహారాజును నగ్నజిత్తు పుత్రులు బంధించినపుడు, అతడు మొరపెడుతూ ఉంటే కృష్ణుడు ఆ నగ్నజిత్తు కొడుకుల నందరినీ జయించి సుదర్శనుని విడిపించాడు. (75)
అయం కపాటేన జఘాన పాండ్యం
తథా కళింగాన్ దంతకూరే మమర్ద।
అనేన దగ్ధా వర్షపూగాన్ వినాథా
వారాణసీ నగరీ సంబభూవ॥ 76
ఇతడు పాండ్యరాజును పిడికిలి గ్రుద్దుతో రొమ్ముమీద కొట్టి చంపాడు. అలాగే కళింగులను యుద్ధంలో చంపాడు. కృష్ణుని వలననే కాశీపట్టణం చాలా సంవత్సరాలు అనాథ అయింది. (76)
అయం స్మ యుద్ధే మన్యతేఽన్యైరజేయం
తమేకలవ్యం నామ నిషాదరాజమ్।
వేగేనైవ శైలమభిహత్య జంభః
శేతే స కృష్ణేన హతః పరాసుః॥ 77
ఏకలవ్యుడనే నిషాదరాజు యుద్ధంలో అజేయుడని కృష్ణుడే అనుకొనేవాడు. ఆ ఏకలవ్యుడు కొండను తాకినట్లు కృష్ణుని ఎదిరించాడు. చివరకు జంభాసురున్ వలె ప్రాణాలు విడిచి పడ్డాడు. (77)
తతోగ్రసేనస్య సుతం సుదుష్టం
వృష్ణ్యంధకానాం మధ్యగతం సభాస్థమ్।
అపాతయద్బలదేవద్వితీయో
హత్వా దదౌ చోగ్రసేనాయ రాజ్యమ్॥ 78
కంసుడు ఉగ్రసేనుని కొడుకు - దుష్టుడు, అతడు వృష్ణి, అంధక వంశస్థుల సభలో ఉండగా, బలరామునితో కలిసి వెళ్లి కృష్ణుడు కంసుని చంపి, రాజ్యం ఉగ్రసేనునికిచ్చాడు. (78)
అయం సౌభం యోధయామాస ఖస్థం
విభీషణం మాయయా శాల్వరాజమ్।
సౌభద్వారి ప్రత్యగృహ్ణాచ్ఛతఘ్నీం
దోర్భ్యాం క ఏనం విషహేత మర్త్యః॥ 79
ఈ కృష్ణుడు భయంకరమైన సౌభుని(సాల్వరాజును)
ఆకాశంలో మాయతో పోరాడనిచ్చాడు. పట్టణ ద్వారం దగ్గర అతడు ప్రయోగించిన శతఘ్నిని బంతిలాగా చేతులతో పట్టుకొన్నాడు. ఏ మానవుడు ఇంక ఇతనిని సహించగలడు? (79)
ప్రాగ్జ్వోతిషం నామ బభూవ దుర్గం
పురం ఘోరమసురాణామసహ్యమ్।
మహాబలో నరకస్తత్ర భౌమః
జహారాదిత్యా మణికుండలే శుభే॥ 80
ప్రాగ్జ్యోతిషం అసురుల దుర్గపురం - ఎవరికీ అది వశంకాదు. దాని రాజు నరకుడు. భూమి కుమారుడు - బలశాలి - అదితి మణికుండలాలు రెండూ అతడు అపహరించాడు. (80)
న తం దేవాః సహశక్రేణ శేకుః
సమాగతా యుధి మృత్యోరభీతాః।
దృష్ట్వా చ తం విక్రమం కేశవస్య
బలం తథైవాస్త్రమవారణీయమ్॥ 81
జానంతోఽస్య ప్రకృతిం కేశవస్య
న్యయోజయన్ దస్యువధాయ కృష్ణమ్।
స తత్కర్మ ప్రతిశుశ్రావ దుష్కరమ్
ఐశ్వర్యవాన్ సిద్ధిషు వాసుదేవః॥ 82
మృత్యువుకు కూడ జంకని ఇంద్రునితో సహా దేవతలంతా కలిసి వాడిని జయించలేకపోయారు - కృష్ణుని బలం, పరాక్రమం తెలిసి దేవతలు ఆ దొంగను వధించుమని ఏర్పరిచారు. దుష్కర కృత్యాలు కూడా సిద్ధింప జేసుకోగల శక్తితో వారికి కృష్ణుడు మాట యిచ్చాడు. (81,82)
నిర్మోచనే షట్ సహస్రాణి హత్వా
సంఛిద్య పాశాన్ సహసా క్షురాంతాన్।
మురం హత్వా వినిహత్యౌఘరక్షః
నిర్మోచనం చాపి జగామ వీరః॥ 83
నిర్మోచన మనే నగరం దగ్గర ఆరువేలమందిని చంపి, చురకత్తులు కట్టిన పాశాలను ఒక్క దెబ్బతో ఛేదించి, మురాసురుని, ఓఘాసురుని చంపి కృష్ణుడు నిర్మోచన నగరం ప్రవేశించాడు. (83)
తత్రైవ తేనాస్య బభూవ యుద్ధం
మహాబలే నాతిబలస్య విష్ణోః।
శేతే స కృష్ణేన హతః పరాసుః
వాతేనేవ మథితః కర్ణికారః॥ 84
అక్కడే మహాబలుడైన నరకునితో అతిబలుడయిన కృష్ణునికి యుద్ధం జరిగింది. పెద్దగాలి దెబ్బకు పడిపోయిన కొండగోగు పువ్వులాగా కృష్ణుని దెబ్బకు నరకుడు క్రిందపడి ప్రాణాలు విడిచాడు. (84)
ఆహృత్య కృష్ణో మణికుండలౌ తే
హత్వా చ భీమం నరకం మురం చ।
శ్రియా వృతో యశసా చైవ విద్వాన్
ప్రత్యాజగామాప్రతిమప్రభావః॥ 85
అలా నరకుని, మురుని చంపి, మణికుండలాలు తీసుకొని, కీర్తి సంపదలు సంపాదించి, సాటిలేని మహిమతో కృష్ణుడు తిరిగివచ్చాడు. (85)
అస్మై వరాణ్యాదదంస్తత్ర దేవాః
దృష్ట్వా భీమం కర్మ కృతం రణే తత్।
శ్రమశ్చ తే యుధ్యమానస్య న స్యాత్
ఆకాశే చాప్సు చ తే క్రమః స్యాత్॥ 86
శస్త్రాణి గాత్రే న చ తే క్రమేరన్
ఇత్యేవ కృష్ణశ్చ తతః కృతార్థః।
ఏవం రూపే వాసుదేవేఽ ప్రమేయే
మహాబలే గుణసంపత్సదైవ॥ 87
యుద్ధంలో అతడు చేసిన భయంకరకృత్యం చూసి దేవతలు "యుద్ధం చేసే నీకు శ్రమలేకుండు గాక" "ఆకాశంలోనూ, నీటిలోనూ నీవు ప్రవేశించుదువుగాక" "నీ శరీరంలో బాణాలు గ్రుచ్చుకొనకుండును గాక" అంటూ వరాలిచ్చారు. దానితో కృష్ణుడు చరితార్థుడయ్యాడు. మహాబలుడు, అప్రమేయుడు అయిన వాసుదేవునితో ఎప్పుడూ సద్గుణసంపద అవిచ్ఛిన్నంగా ఉంటుంది. (86,87)
తమసహ్యం విష్ణుమనంతవీర్యమ్
ఆశంసతే ధార్తరాష్ట్రో విజేతుమ్।
సదా హ్యేనం తర్కయతే దురాత్మా
తచ్చాప్యయం సహతేఽస్మాన్ సమీక్ష్య॥ 88
అంత భరింపరాని పరాక్రమం కల కృష్ణుని కూడ ఈ దుర్యోధనుడు జయించాలనుకొంటున్నాడు. దురాత్ముడయిన దుర్యోధనుడు సదా ఇదే ఆలోచిస్తాడు. దీన్ని కూడా కృష్ణుడు మమ్మల్ని చూసి సహిస్తున్నాడు. (88)
పర్యాగతం మమ కృష్ణస్య చైవ
యో మన్యతే కలహం సంప్రసహ్య।
శక్యం హర్తుం పాండవానాం మమత్వం
తద్వేదితా సంయుగం తత్ర గత్వా॥ 89
నాకూ, కృష్ణుడికీ కలహం వచ్చేసినట్లే భావిస్తూ ఉంటాడు దుర్యోధనుడు. కృష్ణుడికి పాండవుల మీద ఉన్న మమకారం ఆ కలహంతో పోతుందని అనుకొంటాడు. అదేమిటో ఆ కురుక్షేత్ర యుద్ధంలో తెలుస్తుంది పాపం! (89)
నమస్కృత్వా శాంతనవాయ రాజ్ఞే
ద్రోణాయాథో సహపుత్రాయ చైవ।
శారద్వతాయాప్రతిద్వంద్వినే చ
యోత్స్యామ్యహం రాజ్యమభీప్సమానః॥ 90
భీష్మునికీ, ద్రోణాశ్వత్థానులకూ, ఎదురులేని కృపునికీ నమస్కరించి రాజ్యం కోరి యుద్ధం చేస్తాను. (90)
ధర్మేణాప్తం నిధనం తస్య మన్యే
యో యోత్స్యతే పాండవైః పాపబుద్ధిః।
మిథ్యాగ్లహే నిర్జితా వై నృశంసైః
సంవత్సరాన్ వై ద్వాదశ రాజపుత్రాః॥ 91
పాపబుద్ధి కలిగి ఎవడయినా పాండవులలో యుద్ధం చేస్తే వాడికి చావు తప్పదని నా భావం. ఆ క్రూరులు కపట ద్యూతంలో పన్నేండేళ్లపాటు ఈ రాజపుత్రులను జయించారు. (91)
వాసః కృచ్ఛ్రో విహితశ్చాప్యరణ్యే
దీర్ఘం కాలం చైకమజ్ఞాతవర్షమ్।
తే హి కస్మాజ్జీవతాం పాండవానాం
నందిష్యంతే ధార్తరాష్ట్రాః పదస్థాః॥92
అడవుల్లో చాలా కాలం కష్టాల పాలయ్యాము. ఒక సంవత్సరం అజ్ఞాతవాసమూ చేశాం. ఇక ఈ పాండవులు బ్రతికి ఉండగా ఆ ధృతరాష్ట్ర పుత్రులు ఎలా పదవుల్లో నిలిచి ఆనందిస్తారు? (92)
తే చేదస్మాన్ యుధ్యమానాన్ జయేయుః
దేవైర్మహేంద్రప్రముఖైః సహాయైః।
ధర్మాదధర్మశ్చరితో గరీయాన్
తతో ధ్రువం నాస్తి కృతం చ సాధు॥ 93
ఇంద్రాది దేవతలు తోడుగా వారు మమ్ము జయిస్తే ధర్మం కంటె అధర్మమే గొప్పదని తేలుతుంది. ఈ లోకంలో మంచిపని అనేది ఉండదు. (93)
న చేదిమం పురుషం కర్మబద్ధం
న చేదస్మాన్ మన్యతేఽసౌ విశిష్టాన్।
ఆశంసేఽహం వాసుదేవద్వితీయః
దుయోధనం సానుబంధం నిహంతుమ్॥ 94
మానవుడు కర్మానికి బుద్ధుడు. మా కష్టాలకు కారణం కర్మమే అని మేము అనుకొంటున్నాం. ఈ విషయం దుర్యోధనుడు తెలుసుకోలేకపోతే కృష్ణునితో కలిసి నేను సహచరులతో సహా దుర్యోధనుని చంపుతాను. (94)
న చేదిమం కర్మ నరేంద్ర వంధ్యం
న చేద్భవేత్సుకృతం నిష్ఫలం వా।
ఇదం చ తచ్చాభిసమీక్ష్య నూనం
పరాజయో ధార్తరాష్ట్రస్య సాధుః॥ 95
రాజా! ఇప్పటికర్మ నిష్ఫలం కాకపోయినా (రాజ్యం ఇవ్వకపోవడం) పూర్వం చేసిన (రాజ్యం నుండి మమ్మల్ని వెడలగొట్టడం) కర్మ నిష్ఫలం కాకపోయినా ఇప్పటి కర్మలూ, పూర్వపు కర్మలు సమీక్షించి చూస్తే దుర్యోధనునికి పరాజయమే మంచిది. (95)
ప్రత్యక్షం వః కురవో యద్బ్రవీమి
యుధ్యమానా ధార్తరాష్ట్రా న సంతి।
అన్యత్ర యుద్ధాత్ కురవో యది స్యుః
న యుద్ధే వై శేష ఇహాస్తి కశ్చిత్॥ 96
కౌరవులారా! ప్రత్యక్షంగా చెపుతున్నాను - ధృతరాష్ట్ర పుత్రులు యుద్ధం చేస్తే మిగలరు - యుద్ధం కాకపోతే మిగిలితే మిగలవచ్చు అంతే కాని యుద్ధంలో మాత్రం మిగలదు.(96)
హత్వా త్వహం ధార్తరాష్ట్రాన్ సకర్ణాన్
రాజ్యం కురూణామవజేతా సమగ్రమ్।
యద్వః కార్యం తత్కురుధ్వం యథాస్వమ్
ఇష్టాన్ దారానాత్మభోగాన్ భజధ్వమ్॥ 97
నేనయితే కర్ణుడితో సహా ధార్తరాష్ట్రుల నందరినీ చంపి రాజ్యం పూర్తిగా జయిస్తాను. మీమీ వైభవాలకు తగినట్లు చేయవలసిన పనులు చేసుకోండి. ప్రియ భార్యలతో భోగించండి. (97)
అప్యేవం నో బ్రాహ్మణాః సంతి వృద్ధాః
బహుశ్రుతాః శీలవంతః కులీనాః।
సాంవత్సరా జ్యోతిషి చాభియుక్తా
నక్షత్రయోగేషు చ నిశ్చయజ్ఞాః॥ 98
అంతేకాదు - మాకు వృద్ధులు, పండితులు, సత్ప్రవర్తనులు, సద్వంశజులు, సంవత్సరాలు లెక్కకట్టగలవారు, జ్యోతిశ్శాస్త్ర మెరిగినవారు, నక్షత్రాల కలయికల ఫలితాలు చెప్పగల పంచాంగకర్తలు అయిన బ్రాహ్మణులున్నారు. (98)
ఉచ్చావచం దైవయుక్తం రహస్యం
దివ్యాః ప్రశ్నా మృగచక్రా ముహూర్తాః।
క్షయం మహాంతం కురుసృంజయానాం
నివేదయంతే పాండవానాం జయం చ॥ 99
వారు రహస్యమైన దైవనిశ్చయమైన ఔన్నత్య పతనాలు చెపుతున్నారు. దివ్యప్రశ్నలు, మృగచక్రాలు, ముహూర్తాలు వీటన్నిటిని బట్టి కౌరవులకు సృంజయులకు పెద్ద వినాశం దాపురించిందనీ, పాండవులకు జయం కలుగుతుందనీ చెపుతున్నారు. (99)
యథా హి నో మన్యతేఽ జాతశత్రుః
సంసిద్ధార్థో ద్విషతాం నిగ్రహాయ।
జనార్దనశ్చాప్యపరోక్షవిద్యః
న సంశయం పశ్యతి వృష్ణిసింహః॥ 100
శత్రుసంహారం కోసం అజాతశత్రువు ఏర్పాట్లు చేసికొని సంసిద్ధుడు కాకముందే, వృష్ణివీరుడై, దివ్యదృష్టి కల జనార్దనుడు జయాన్ని నిస్సందేహంగా చూస్తున్నాడు. (100)
అహం తథైవ ఖలు భావిరూపం
పశ్యామి బుద్ధ్యా స్వయమప్రమత్తః।
దృష్టిశ్చ మే న వ్యథతే పురాణీ
సంయుధ్యమానా ధార్తరాష్ట్రా న సంతి॥ 101
నేను కూడా అలాగే వికాసబుద్ధితో భవిష్యత్తుని చూస్తున్నాను. నా దృష్టి ఏ మాత్రం చలించటం లేదు. యుద్ధం చేస్తే ధార్తరాష్ట్రు లిక లేరు. (101)
అనాలబ్ధం జృంభతి గాండివం ధనుః
అనాహతా కంపతి మే ధనుర్జ్యా।
బాణాశ్చ మే తూణముఖాద్విసృత్య
ముహుర్ముహుర్గంతుముశంతి చైవ॥ 102
పట్టుకోకుండానే గాండీవం గంతులు వేస్తోంది. మీట కుండానే నారి కంపిస్తోంది. నా అమ్ముల పొదిలోంచి బాణాలు పైకి వచ్చి మాటిమాటికీ ముందుకు దూకుతున్నాయి. (102)
ఖడ్గః కోశా న్నిఃసరతి ప్రసన్నః
హిత్వేవ జీర్ణామురగస్త్వచం స్వామ్।
ధ్వజే వాచో రౌద్ర రూపా భవంతి
కదా రథో యోక్ష్యతే తే కిరీటిన్॥ 103
పాము కుబుసాన్ని వదిలినట్లు ప్రేరణ లేకుండానే నా కత్తి ఒరలోంచి బయటికి వస్తోంది. ధ్వజంమీద "కిరీటీ! నీరథం ఎప్పుడు సన్నద్ధం చేస్తున్నావు?" అనే రౌద్ర వాక్కులు వినబడుతున్నాయి. (103)
గోమాయు సంఘాశ్చ నదంతి రాత్రౌ
రక్షాంస్యథో నిష్పతంత్యంతరిక్షాత్।
మృగాః శృగాలాః శితికంఠాశ్చ కాకాః
గృధ్రా బకాశ్పైవ తరక్షవశ్చ॥ 104
రాత్రిపూట నక్కల మూకలు అరుస్తున్నాయి. ఆకాశం నుండి పిశాచాలు నేల కురుకుతున్నాయి. మృగాలు, నక్కలు, నెమళ్లు, కాకులు, గ్రద్దలు, కొంగలు, సివంగులు అరుస్తున్నాయి.(104)
సువర్ణపత్రాశ్చ పతంతి పశ్చాత్
దృష్ట్వా రథం శ్వేతహయప్రయుక్తమ్।
అహం హ్యేకః పార్థివాన్ సర్వయోధాన్
శరాన్ వర్షన్ మృత్యులోకం నయేయమ్॥ 105
తెల్లని గుర్రాలు కట్టిన నా రథం చూసి బంగరు రెక్కల పక్షులు వెంటపడుతున్నాయి. నేను ఒక్కడినే అందరు రాజులనూ, యోధులనూ మృత్యు లోకానికి పంపుతాను. (105)
సమాదదానః పృథగస్త్ర మార్గాన్
యథాగ్నిరిద్ధో గహనం నిదాఘే।
స్థూణాకర్ణం పాశుపతం మహాస్త్రం
బ్రాహ్మం చాస్త్రం యచ్చ శక్రోఽప్యదాన్మే॥ 106
వధే ధృతో వేగవతః ప్రముంచన్
నాహం ప్రజాః కించిదిహావశిష్యే।
శాంతిం లప్స్యే పరమో హ్యేష భావః
స్థిరో మమ బ్రూహి గావల్గణే తాన్॥ 107
వేర్వేరు మార్గాల్లో వెళ్లే స్థూణాకర్ణం, పాశుపతం, బ్రహ్మాస్త్రం, ఇంద్రుడిచ్చిన ఐంద్రాస్త్రం మొదలయిన అస్త్రాలు గ్రహించి, వేసవిలో అడవిని అగ్ని దహించి వేసినట్లు బాణాలు ప్రయోగిస్తూ, వారి చావుకోసం నిలిచి, ఎవరినీ మిగలనివ్వను. సంజయా! అలా అందరూ చచ్చాకనే నాకు శాంతి. ఇది నాస్థిర నిశ్చయం. వారికి చెప్పు. (106,107)
యే వై జయ్యాః సమరే సూత లబ్ధ్వా
దేవానపీంద్రప్రముఖాన్ సమేతాన్।
తైర్మన్యతే కలహం సంప్రసహ్య
స ధార్తరాష్ట్రః పశ్యత మోహమస్య॥ 108
ఇంద్రాది దేవతలు ఎదురయినా సరే ఎవరు జయిస్తారో వారితో మూర్ఖంగా కలహం కోరుతున్నాడు దుర్యోధనుడు. వాని మోహం ఎంతటిదో చూడు సంజయా! (108)
వృద్ధో భీష్మః శాంతనవః కృపశ్చ
ద్రోణః సపుత్రో విదురశ్చ ధీమాన్।
ఏతే సర్వే యద్వదంతే తదస్తు
ఆయుష్మంతః కురవః సంతు సర్వే॥ 109
వృద్ధుడయిన భీష్ముడు, కృపుడు, ద్రోణుడు, అశ్వత్థామ, ధీశాలి విదురుడు, వీరంతా ఏమంటారో అదే అగుగాక - కురువంశస్థులంతా ఆయుష్మంతులగుదురు గాక. (109)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి యానసంధి పర్వణి అర్జునవాక్య నివేదనే అష్టచత్వారింశోఽధ్యాయ॥ 48 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున యానసంధి పర్వమను ఉపపర్వమున అర్జునవాక్య నివేదన మను నలుబది యెనిమిదవ అధ్యాయము. (48)