46. నలువది ఆరవ అధ్యాయము
పరమాత్మ స్వరూపము - సాక్షాత్కారము.
సనత్సుజాత ఉవాచ
యత్తచ్ఛుక్రం మహజ్జ్యోతిః దీప్యమానం మహద్యశః।
తద్వై దేవా ఉపాసతే తస్మాత్ సూర్యో విరాజతే।
యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనమ్॥ 1
సనత్సుజాతుడు కొనసాగిస్తున్నాడు. ఆ పరబ్రహ్మం శుక్రస్వరూపం. బీజరూపం. ఒక పెద్ద జ్యోతి చక్కగా వెలుగుతూ ఉంటుంది. దాన్ని వేదాలు మహద్యశమని పేర్కొన్నాయి. దాన్నే దేవతలు ఉపాసిస్తారు. దాని వల్లనే సూర్యుడు ప్రకాశిస్తాడు. ఆ వెలుగు సనాతనమైనది. అటువంటి భగవంతుని యోగులు చక్కగా దర్శిస్తారు. (1)
శుక్రాద్బ్రహ్మ ప్రభవతి బ్రహ్మ శుక్రేణ వర్ధతే।
తచ్ఛుక్రం జ్యోతిషాం మధ్యే అతప్తం తపతి తాపనమ్।
యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనమ్॥ 2
ఆ శుక్రం నుండి బ్రహ్మమేర్పడుతుంది. సర్వ సమర్థమవుతుంది. శుక్రం వల్లనే వృద్ధి పొందుతుంది. ఆ బ్రహ్మం సూర్యాదులయిన పెద్ద పెద్ద వెలుగుల మధ్య ఉంటుంది. అయినా తపించదు. సరిగదా తపింపజేస్తుంది. ఇతరాన్ని ప్రకాశింపజేస్తుంది. అటువంటి సనాతనమైన భగవంతుని యోగులే చక్కగా దర్శిస్తారు. (2)
అపోఽథ అద్భ్యః సలిలస్య మధ్యే
ఉభౌ దేవౌ శిశ్రియాతేఽంతరిక్షే।
అతంద్రితః సవితు ర్వివస్వాన్
ఉభౌ బిభర్తి పృథివీం దివం చ॥
యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనమ్॥ 3
జలముల(పరబ్రహ్మ) మధ్య పంచభూతాలతో(అద్భ్య) ఏర్పడిన దేహాన్ని ఆశ్రయించి జీవతత్త్వం, ఈశ్వర తత్త్వం ఉన్నాయి. సృష్టికర్తను కూడా కప్పివేయగలవాడు పరమాత్మ అతడు జీవునీ, ఈశ్వరునీ, భూమ్యా కాశాలను భరిస్తున్నాడు. నిలుపుతున్నాడు. అటువంటి సనాతనుడయిన భగవంతుని యోగులు చక్కగా దర్శిస్తారు. (3)
ఉభౌ చ దేవౌ పృథివీం దివం చ
దిశః శుక్రో భువనం బిభర్తి।
తస్మాద్దిశః సరితశ్చ స్రవంతి
తస్మాత్ సముద్రా విహితా మహాంతాః॥
యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనమ్॥ 4
ఆశుక్రం(పరమాత్మ) జీవేశ్వరులనూ, భూమ్యాకాశాలనూ, దిక్కులనూ, బ్రహ్మాండాన్ని భరిస్తోంది, నిలుపుతోంది. దిశలు, నదులు దానిలోంచే ప్రవహిస్తున్నాయి. అంతం లేని సముద్రాలు కూడా దాని నుండి ఏర్పడుతున్నాయి. ఆ సనాతనుడు అయిన భగవంతుని యోగులే దర్శిస్తారు. (4)
చక్రే రథస్య తిష్ఠంతః అధ్రువస్యావ్యయకర్మణః।
కేతుమంతం వహంత్యశ్వాః తం దివ్యమజరం దివి॥
యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనమ్॥ 5
శరీరం రథం వంటిది. శిథిలమయ్యే స్వభావం దానిది. కాని అది నశించినా అది చేసిన కర్మం మాత్రం నశించదు. ఆ కర్మం కారణంగా ప్రవర్తిస్తున్నాయి ఇంద్రియాలనే గుర్రాలు. అవి ప్రజ్ఞావంతుడయిన జీవుని హృదయమనే ఆకాశంలో దివ్యుడూ, వికారహితుడూ అయిన పరమాత్మ వైపు లాగుకొని పోతాయి. ఆ పరమాత్మను యోగులు దర్శిస్తారు. (5)
న సాదృశ్యే తిష్ఠతి రూపమస్య
న చక్షుషా పశ్యతి కశ్చిదేనమ్।
మనీషయాఽథో మనసా హృదా చ
య ఏనం విదురమృతాస్తే భవంతి॥
యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనమ్॥ 6
ఆ పరమాత్మరూపం ఇలా ఉంటుంది. అని పోలిక చెప్పలేము. ఎవరూ చర్మచక్షువులతో(కళ్లతో) చూడలేరు. బుద్ధితో, మనసుతో, హృదయంతో చూస్తారు. వారు అమృతులవుతారు. అట్టి పరమాత్ముని యోగులే దర్శితారు. (6)
ద్వాదశపూగాం సరితం పిబంతో దేవరక్షితామ్।
మధ్వీక్షంతశ్చ తే తస్యాః సంచరం తీహ ఘోరామ్॥
యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనమ్॥ 7
అజ్ఞాన రూపమయినది ఈ సంసారం. అది పన్నెండింటి సముదాయం. అది దేవ(ఇంద్రియాలచే) రక్షితం. దాని మధువుకు (మధురఫలాలకు) ఆశపడి జీవులు అందులో క్రిందా మీదా పడుతూ ఉంటారు. యోగులు దాన్ని దర్శించగలరు. (7)
తదర్ధమాసం పిబతి సంచిత్య భ్రమరో మధు।
ఈశానః సర్వభూతేషు హవిర్భూత మకల్పయత్॥
యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనమ్॥ 8
తేనెటీగ 15 రోజులు తేనెను కూడబెట్టి 15 రోజులు త్రాగుతుంది. అలాగే తిరిగేవాడు జీవుడు. అతడు కూడబెట్టిన కర్మఫలంలో సగభాగం ఉత్తమ లోకంలో అనుభవిస్తాడు. మిగిలిన సగభాగం అనుభవించేందుకు మళ్లీ యీ లోకానికి వస్తాడు. అందుకే ఈశ్వరుడు సర్వభూతాల్లోనూ హవిర్భావం కల్పించాడు. (8)
హిరణ్యపక్షమశ్వత్థమ్ అభిపద్య హ్యపక్షకాః।
తే తత్ర పక్షిణో భూత్వా ప్రపతంతి యథాదిశమ్।
యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనమ్॥ 9
ఈశ్వరుడయిన జీవుడు బంగారు ఆకులున్న అశ్వత్థవృక్షాన్ని ఆశ్రయించాడు. రెక్కలు లేని జీవుడు అక్కడ రెక్కలు వచ్చి పక్షులుగా మారాడు. తరువాత తనకు తోచిన దిక్కుకు ఎగిరిపోతున్నాడు. (రెక్కలు వచ్చి ఎగిరిపోవడం అంటే ముక్తిని పొందడం. సనాతన రూపం పొందడం. అటువంటి సనాతనుడయిన భగవంతుని యోగులు దర్శిస్తారు.) (9)
పూర్ణాత్ పూర్ణాన్యుద్ధరంతి పూర్ణాత్ పూర్ణాని చక్రిరే।
హరంతి పూర్ణాత్ పూర్ణాని పూర్ణమేవావశిష్యతే।
యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనమ్॥ 10
పూర్ణమయిన పరమాత్మనుండి వేరయి(ప్రతిబింబాలుగా) పూర్ణములయిన జీవరూపాలు వచ్చాయి. పూర్ణం నుండి విడివడినా పూర్ణమే అవుతాయి.(ప్రతిబింబాలు కనుక). ఇలా(పూర్ణమై) సనాతనమయిన భగవంతుని యోగులు చక్కగా దర్శిస్తారు. (10)
తస్మాద్వై వాయు రాయాతః తస్మింశ్చ ప్రయతః సదా।
తస్మా దగ్నిశ్చ సోమశ్చ తస్మింశ్చ ప్రాణ ఆతతః॥ 11
సర్వమేవ తతో విద్యాత్ తత్తద్వక్తుం న శక్నుమః।
యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనమ్॥ 12
ఆ పరబ్రహ్మం నుండే వాయువు వచ్చింది. సర్వభూతాలూ కూడా దానిలోనే ఎల్లప్పుడూ పట్టుబడి ఉన్నాయి. దాని నుండే అగ్ని, చంద్రుడు, వచ్చారు. ప్రాణమూ దాన్నే వ్యాపించి ఉంది. (దేహమూ, ఇంద్రియాలూ) అన్నీ దానినుండే వచ్చాయి. దాన్ని 'తత్' అంటారు. దాన్ని గురించి చెప్పలేము. యోగులు ఆ పరమాత్మను చక్కగా దర్శిస్తారు. (11,12)
అపానం గిరతి ప్రాణః ప్రాణం గిరతి చంద్రమాః।
ఆదిత్యో గిరతే చంద్రమ్ ఆదిత్యం గిరతే పరః।
యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనమ్॥ 13
అపానాన్ని ప్రాణం, ప్రాణాన్ని మనస్సు, మనస్సును బుద్ధి, బుద్ధిని పరమాత్మ తమలో లయం చేసుకొంటాయి. ఆ పరమాత్మను యోగులు స్పష్టంగా దర్శిస్తారు. (13)
ఏకం పాదం నోక్షిపతి సలిలాద్ధంస ఉచ్చరన్।
తం చే త్సంతత మూర్ధ్వాయ న మృత్యుర్నామృతం భవేత్॥
యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనమ్॥ 14
పరమాత్మ హంసరూపం దాల్చి వీళ్లలోంచి పైకి లేస్తూ ఒకపాదం మాత్రం పైకిలేపదు. (నీళ్లనగా గంభీరమయిన ప్రకృతి. ఈ హంసకు నాలుగు పాదాలు. మూడు పాదాలతో సంచరిస్తుంది.) కాని పైకి ఎప్పుడూ వ్యాపించి ఉంటుంది. దాన్ని దర్శించిన వానికి ఆ దశలో మృత్యువూ లేదు, అమృతత్వమూ లేదు. ఆ పరమాత్మను యోగులు దర్శిస్తారు. (14)
అంగుష్ఠమాత్రః పురుషోఽంతరాత్మా
లింగస్య యోగేన స యాతి నిత్యమ్।
తమీశ మీడ మనుకల్ప మాద్యం
పశ్యంతి మూఢా న విరాజమానమ్॥
యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనమ్॥ 15
అందరి హృదయాల్లోనూ పూర్ణరూపుడై ఆ పరమాత్మ బొటన వ్రేలంత రూపంతో ఉంటాడు. లింగశరీరసంబంధం చేత నిత్యుడై ఉంటాడు. నిత్యమూ ఇహ పరలోకాలకూ, జాగ్రత్స్యప్న దశలకూ తిరుగుతూ ఉంటాడు. అతడే ఈశ్వరుడు. స్తుతింపదగినవాడు. సమర్థుడు. మూలకారణుడై వెలిగిపోతూ ఉన్నా మూఢులు మాత్రం చూడలేకపోతున్నారు. వానిని యోగులు భగవంతునిగా దర్శిస్తారు. (15)
అసాధనా వాఽపి ససాధనా వా
సమాన మేత ద్దృశ్యతే మానుషేషు।
సమానమేత దమృతస్యేతరస్య
ముక్తాస్తత్ర మధ్వ ఉత్సం సమాపుః॥
యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనమ్॥ 16
దేహాభిమానం గల మనుష్యుల్లో కొందరు(శమ దమాది) సాధన సంపత్తి ఉన్నవారుంటారు. కొందరు ఆ సంపత్తి లేని వారుంటారు. కాని బ్రహ్మం మాత్రం అందరిలోనూ సమానంగానే ఉంటుంది. కాని ముక్తులు మాత్రమే బ్రహ్మానందాన్ని పొందుతారు. (16)
ఉభౌ లోకౌ వ్యాప్య యాతి
తదా హుతం చాహుత మగ్నిహోత్రమ్।
మా తే బ్రాహ్మీ లఘుతా మాదధీత
ప్రజ్ఞానం స్యాన్నామ ధీరా లభంతే॥
యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనమ్॥ 17
జ్ఞాని జ్ఞానంతో రెండులోకాల్లోనూ వ్యాపించి తిరగగలడు. అతడు హోమం చెయ్యకపోయినా చేసినట్లే. ఈ లక్షణాలు కల పరమాత్మను యోగులు దర్శిస్తారు. రాజా! నేను చెప్పిన యీ మాటల వల్ల నీకు తక్కువతనం రాకుండుగాక. ధీరులు పొందే జ్ఞాని అనే పేరునే పొందుదువు గాక. (17)
ఏవం రూపో మహాత్మా స పావకం పురుషో గిరన్।
యో వై తం పురుషం వేద తస్యేహార్థో న రిష్యతే॥
యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనమ్॥ 18
ఆ పరమాత్మే జీవుని జీవభావాన్ని పోగొడతాడు. ఆ పరమాత్మను తెలుసుకొన్నవానికి పురుషార్థం చెడదు. అటువంటి పరమాత్మను యోగులు దర్శిస్తారు. (18)
యః సహస్రం సహస్రాణాం పక్షాన్ సంతత్య సంపతేత్।
మధ్యమే మధ్య ఆగచ్ఛేత్ అపి చే త్స్యాన్మనోజవః॥
యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనమ్॥ 19
వేల కొద్దీ రెక్కలు దాల్చి మనోవేగంతో ఎగిరిపోయేవాడు కూడా శరీరంలో హృదయంలోని పరమాత్మను చేరవలసిందే. జివుడు దూరంలో ఉన్నా హృదయస్థునికి సన్నిహితుడే. అటువంటి పరమాత్మను యోగులు దర్శిస్తారు. (19)
న దర్శనే తిష్ఠతి రూపమస్య
పశ్యంతి చైనం సవిశుద్ధసత్త్వాః।
హితో మనీషీ మనసా న తప్యతే
యే ప్రవ్రజేయు రమృతాస్తే భవంతి॥
యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనమ్॥ 20
ఆ పరమాత్మ రూపం కంటికి దొరకదు. (ఇంద్రియాలకు అందదు). స్వచ్ఛమయిన మనసు కలవారు మాత్రమే చూడగలరు. అందరిపట్ల హితమైన ప్రవర్తనతో, మనసునిలుపుకోగల శక్తిమంతుడు, మానసికంగా దుఃఖ పడనివాడూ, స్వచ్ఛసత్త్వుడవుతాడు. అలా సన్యాసం స్వీకరించినవారు అమృతులు, బ్రహ్మస్వరూపులవుతారు. అట్టి అమృతకారణమైన పరమాత్మను యోగులు దర్శిస్తారు. (20)
గూహంతి సర్పా ఇవ గహ్వరాణి
స్వశిక్షయా స్వేన వృత్తేన మర్త్యాః।
తేషు ప్రముహ్యంతి జన విమూఢాః
యథాఽధ్యానం మోహయంతే భయాయ॥
యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనమ్॥ 21
కొందరు మానవులు తన బోధవల్లనో, ప్రవర్తన వల్లనో పాపకృత్యాలు చేస్తూ అవి బయట పడకుండా పాముల్లాగా జాగత్తపడుతూ ఉంటారు. మోశగాళ్లు బాటసారుల్ని మోసగించినట్లు వీరు తెలివితక్కువ వారిని మోసగిస్తారు. (21)
నాహం సదాఽసత్కృతః స్యాం న మృత్యుః
న చామృత్యు రమృతం మే కుతః స్యాత్।
సత్యానృతే సత్యసమానబంధే
సతశ్చ యోని రసతశ్చైక ఏవ॥
యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనమ్॥ 22
నేను ఎన్నడూ అసత్తుతో ఏర్పడిన వాడిని కాదు. నాకు మృత్యువులేదు, జన్మలేదు. మోక్షం ఎక్కడిది? సత్యము, అసత్యమూ రెండూ సత్యసమానమయిన పరబ్రహ్మంలోనే ఉన్నాను. సత్తుకు, అసత్తుకూ జన్మ ఒక చోటనే కదా. (22)
న సాధునా నోత అసాధునా వా
అసమాన మేత ద్దృశ్యతే మానుషేషు।
సమానమేతదమృతస్య విద్యాద్
ఏవం యుక్తో మధు తద్వై పరీప్సేత్॥ 23
మానవుల్లోనే కర్మఫలాలు భిన్నంగా ఉంటాయి. పరబ్రహ్మ సత్కర్మతో గొప్పదైపోదు. అసత్కర్మతో తక్కువదైపోదు. ఈ బ్రహ్మం కైవల్యంతో సమానం. ఇలా యోగసాధన చేసినవాడు బ్రహ్మాన్ని పొందా లనుకోవాలి. (23)
నాస్యాతివాదా హృదయం తాపయంతి
నానధీతం నాహుత మగ్నిహోత్రమ్।
మనో బ్రాహ్మీ లఘుతా మాదధీత
ప్రజ్ఞాం చాస్మై నామ ధీరా లభంతే॥
యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనమ్॥ 24
ఇతరులు నిందిస్తే అవి అతనికి బాధకల్గించవు. అధ్యయనం చేయలేదని కాని, అగ్నిహోత్రం చేయలేదని కాని అతని మనసు పరితపించదు. ఈ బ్రహ్మ విద్య అటువంటివానికి చురుకుగా ప్రజ్ఞనిస్తుంది. ధ్యాననిష్ఠులు ఆ ప్రజ్ఞను పొందుతారు.
తాపమెరుగని విద్వాంసునితో అభిన్నుడయిన పరమాత్మను యోగులు దర్శిస్తారు. (24)
ఏవం యస్సర్వభూతేషు ఆత్మాన మనుపశ్యతి।
అన్యత్రాన్యత్ర యుక్తేషు కిం స శోచేత్తతఃపరమ్॥ 25
ఇలా సర్వభూతములందూ ఆత్మనే దర్శించే జ్ఞానికి దుఃఖం కలగదు. సంసారాసక్తులయిన ఇతరులను చూసినా వారి కోసం అతనికి దుఃఖం కలగదు. ఆత్మ కంటె ఇతరంగా దేన్నీ అతడు చూడడు. (25)
యథోదపానే మహతి సర్వతః సంప్లుతోదకే।
ఏవం సర్వేషు వేదేషు ఆత్మాన మనుజానతః॥ 26
దప్పికతో ఉన్నవాడు పొంగిపొర్లే మంచినీటి చెరువులో పడితే వానికి అంతటా నీరే కనిపిస్తుంది. కాని ఇతరమేదీ కనిపించదు. అలాగే అంతటా ఆత్మను చూసేవానికి సర్వవేదాల్లోనూ పరమాత్మే కనిపిస్తాడు. (26)
అంగుష్ఠమాత్రః పురుషో మహాత్మా
న దృశ్యతే సౌహృది సంనివిష్టః।
అజశ్చరో దివారాత్ర మతంద్రితశ్చ
స తం మత్వా కవిరాస్తే ప్రసన్నః॥ 27
పరమాత్మ వ్రేలెడంత హృదయంలోనూ ఉంటాడు. విశ్వమంతటా వ్యాపించీ ఉంటాడు. కనపడడు. జన్మలేదు. రాత్రింబవళ్లు జ్ఞానరూపుడై తిరుగుతూ ఉంటాడు. అలా పరమాత్మను తెలిసినవాడు ప్రసన్నుడై, కవియై, నిష్క్రియుడై ఉంటాడు. (27)
అహమేవ స్మృతో మాతా పితా పుత్రోఽస్మ్యహం పునః।
ఆత్మాహమపి సర్వస్య యచ్చ నాస్తి యదస్తి చ॥ 28
ఈ విశ్వానికంతటికీ నేనే తల్లిని, తండ్రిని కొడుకునూ నేనే. నేనే ఆత్మను. రానున్నదీ, ఉన్నదీ కూడా నేనే. (28)
పితామహోఽస్మి స్థవిరః పితా పుత్రశ్చ భారత।
మమైవ యూయమాత్మస్థాః న మే యూయం న వో వయమ్॥ 29
వృద్ధుడయిన తాతను నేనే, తండ్రిని నేనే, కొడుకును నేనే. మీరంత నా ఆత్మీయులే. అయినా మీరు నాకేం కారు. మేమూ మీ వారము కాము. (29)
ఆత్మైవ స్థానం మమ జన్మ చాత్మా
ఓతప్రోతోఽహ మజరప్రతిష్ఠః।
అజశ్చరో దివారాత్ర మతంద్ర్రితోఽహమ్
మాం విజ్ఞాయ కవిరాస్తే ప్రసన్నః॥ 30
నా స్థానమే ఆత్మ, ఆత్మ నుండే నేను పుట్టాను. పడుగుపేకల్లాగా అంతా ఆత్మయే. నాకు ఏ వికారాలు లేవు. స్థిరుణ్ణి. నిత్యమూ చైతన్యంతో సంచరిస్తాను. ఇలా నన్ను తెలిసిన వాడు కవి అవుతాడు. ప్రసన్నతను పొందుతాడు. (30)
అణోరణీయాన్ సమనాః సర్వభూతేషు జాగ్రతి।
పితరం సర్వభూతేషు పుష్కరే నిహితం విదుః॥ 31
పరమాత్మ అణువుకంటె సూక్ష్మమయినది, దివ్య దర్శనం కలది. సర్వభూతాల్లోనూ ఉంటుంది. సర్వభూతాలు దాని నుండే పుట్టాయి. సర్వుల హృదయాల్లోనూ ఉంటుంది. అవి బ్రమవేత్తలు ఎరుగుదురు. (31)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగ పర్వణి సనత్సుజాత పర్వణి షట్చత్వారింశోఽధ్యాయః॥ 46 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగ పర్వమున సనత్సుజాత పర్వమను ఉపపర్వమున నలుబది ఆరవ అధ్యాయము. (46)