45. నలువది అయిదవ అధ్యాయము
గుణదోషముల లక్షణము - బ్రహ్మవిద్యానిరూపణము.
సనత్సుజాత ఉవాచ
శోకః క్రోధశ్చ లోభశ్చ కామో మానః పరాసుతా।
ఈర్ష్యా మోహో విధిత్సా చ కృపాసూయా జుగుప్సుతా॥ 1
ద్వాదశైతే మహాదోషాః మనుష్యప్రాణ నాశనాః।
సనత్సుజాతుడు ఇలా అన్నాడు. శోకం, క్రోధం, లోభం, కామం, మానం, (నిదుర) మత్తు, ఈర్ష్య, మోహం, స్వార్థం, కృప, అసూయ, జుగుప్స, ఈ పన్నెండూ మహాదోషాలు. మానవుల ప్రాణాలు తీస్తాయి. (1)
ఏకైక మేతే రాజేంద్ర మనుష్యాన్ పర్యుపాసతే।
యై రావిష్టో నరః పాపం మూఢసంజ్ఞో వ్యవస్యతి॥ 2
రాజేంద్రా! వీటిలో ఒక్కొక్కటి మానవులను బాధిస్తాయి. వీటికి వశమైతే ఆ మానవుడు పాపకృత్యాలు చేస్తూ మూఢుడవుతాడు. (2)
స్పృహయాలు రుగ్రః పరుషో వా వదాన్యః
క్రోధం బిభ్రన్ మనసా వై వికత్థీ।
నృశంసధర్మాః షడిమే జనా వై
ప్రాప్యాప్యర్థం నోత సభాజయంతే॥ 3
తీవ్రమైన కోరికలున్నవాడు, నిర్దయుడు, పరుషంగా మాట్లాడేవాడు, వాచాలుడు, మనసునిండా కోపం కలవాడు, ఆత్మస్తుతిపరుడు ఈ ఆరుగురూ క్రూరకర్ములు. వారు ఇతరుల నుండి ప్రయోజనం పొందికూడా వారిని గౌరవించరు. (3)
సంభోగ సంవిద్విషయోఽతిమానీ
దత్త్వా వికత్థీ కృపణో దుర్బలశ్చ।
బహుప్రశంసీ వనితాద్విట్ సదైవ
సప్తైవోక్తాః పాపశీలా నృశంసాః॥ 4
1. స్త్రీ సంగమమే పరమార్థం అనుకొనేవాడు, 2. అతిగర్వి, 3. దానం చేశాక బాధపడేవాడు, 4. పిసినారి, 5. బలవంతంగా పన్నులు లాక్కునేవాడు, 6. పాపంచేసి గొప్పగా చెప్పుకొనేవాడు. 7. పతివ్రతాస్త్రీలను ద్వేషించేవాడు - ఈ ఏడుగురు క్రూరులు. పూర్వస్లోకంలో ఆరుగురు ఈ శ్లోకంలో ఏడుగురు మొత్తం పదముగ్గురు. (4)
ధర్మశ్చ సత్యం చ తపో దమశ్చ
అమాత్సర్యం హ్రీ స్తితిక్షాఽనసూయా।
దానం శ్రుతం చైవ ధృతిః క్షమా చ
మహావ్రతా ద్వాదశ బ్రాహ్మణస్య॥ 5
అవః ఇక గుణాలు 12 ఇవి. 1. ధర్మం, 2. సత్యం, 3. దమం, 4. తపస్సు, 5. మాత్సర్యం లేకుండటం, 6. లజ్జ, 7. సహనం, 8. అసూయ లేకపోవడం, 9. యజ్ఞం, 10. దానం, 11. ధైర్యం, 12. క్షమ ఇవి బ్రహ్మజ్ఞానం పొందేవాని గుణాలు. (5)
యో నైతేభ్యః ప్రచ్యవే ద్ద్వాదశేభ్యః
సర్వామపీమాం పృథివీం సశిష్యాత్।
త్రిభిర్ద్వాభ్యా మేకతో వార్ర్థితో వా
నాస్య స్వమస్తీతి చ వేదితవ్యమ్॥ 6
ఈ పన్నెండు సద్గుణాలూ విడువని వాడు భూమినంతటినీ శాసించగలడు. కాని ఇందులో మూడో, రెండో, ఒకటో జారిపోతే ఇక వాడిదంటూ ఏదీ ఉండదని తెలుసుకో! (6)
దమస్త్యాగో ఽథాప్రమాదః ఇత్యేతేష్వమృతం స్థితమ్।
ఏతాని బ్రహ్మముఖ్యానాం బ్రాహ్మణానాం మనీషిణామ్॥ 7
దమం, త్యాగం, శ్రద్ధ ఈ మూడింటిలోనే మోక్షం ఉంది. బ్రహ్మజ్ఞానం పొందే బుద్ధిమంతులకు ఇవే చాలా దీక్షతో చేపట్టవలసిన వ్రతాలు. (7)
సద్వాఽసద్వా పరీవాదో బ్రాహ్మణస్య న శస్యతే।
నరకప్రతిష్ఠా వై స్యుః య ఏవం కురుతే జనాః॥ 8
అది సత్యమయినా, అసత్యమయినా ఇతరుల దోషాలను ఎత్తి చూపడం బ్రాహ్మణునికి మంచిదికాదు. అలా చేసేవారు నరకానికి పోతారు. (8)
మదోఽష్టాదశదోషః స స్యాత్పురా యోఽప్రకీర్తితః।
లోకద్వేష్యం ప్రాతికూల్యమ్ అభ్యసూయా మృషావచః॥ 9
కామక్రోధౌ పారతంత్ర్యం పరివాదోఽథ పైశునమ్।
అర్థహాని ర్వివాదశ్చ మాత్సర్యం ప్రాణిపీడనమ్॥ 10
ఈర్ష్యామోదోఽతివాదశ్చ సంజ్ఞానాశోఽభ్యసూయితా।
తస్మాత్ ప్రాజ్ఞో న మాద్యేత సదా హ్యేతద్విగర్హితమ్॥ 11
మదం పదునెనిమిది దోషాలు కలిగి ఉంటుంది. ఇంతకుముంది సరిగా చెప్పలేదు. ఇపుడు చెపుతున్నాను. 1. లోకనింద్యములయిన పనులు 2. ధర్మవ్యతిరేకత 3. అసూయ, 4. అబద్ధపుమాటలు 5. కామం, 6. క్రోధం, 7. మద్యపానాదులకు వశమవడం, 8. ఇతరులను నిందించడం, 9. కొండెములు చెప్పడం, 10. వ్యసనాల్లో డబ్బు పోగొట్టుకోవడం, 11. వివాదం, 12. వైరభావం, 13. ప్రాణిహింస, 14. ఓర్వలేనితనం, 15. గర్వం. 16. మర్యాద అతిక్రమించి మాట్లాడటం, 17. పేరు పోగొట్టుకోవడం, 18. ఇతరుల తప్పులు వెదకటం. ఈ పదునెనిమిదింటి పట్ల ఏమరుపాటు పనికిరాదు. వీనిని నిందించాలి. దరిచేరనీయరాదు. (9,10,11)
సౌహృదే వై షడ్గుణా వేదితవ్యాః
ప్రియే హృష్యత్యప్రియే చ వ్యథంతే।
స్యాదాత్మనః సుహితం యాచతే యః
దదాత్యయాచ్యమపి దేయం ఖలు స్యాత్।
ఇష్టాన్ పుత్రాన్ విభవాం స్వాంశ్చ దారాన్
అభ్యర్థిత శ్చార్హతి శుద్ధభావః॥ 12
అలాగే మంచితనంలో కూడా తెలుసుకోదగినవి ఆరు సద్గుణాలున్నాయి. అవి మిత్ర లక్షణాలు 1. ప్రియంకలిగితే సంతోషిస్తాడు. 2. అప్రియంకలిగితే దుఃఖిస్తాడు. 3. మిత్రుడు అడిగితే తనకు ఇష్టమైన పదార్థాలను కూడా పుత్రులయినా, సంపదలయినా, సరే ఇస్తాడు. (12)
త్యక్తద్రవ్యః సంవసేత్ నేహ కామాత్।
భుంక్తే కర్మ స్వాశిషం బాధతే చ॥ 13
4. "తన సొమ్ము మిత్రునికిచ్చి నావల్ల ఉపకారం పొందాడు" అనే భావంతో అతని దగ్గర నివసించడు. 5. స్వార్జిత మైనదాన్నే అనుభవిస్తాడు. 6. తనకు కోరదగినది అయినా మిత్రునకు బాధకలిగించే దయితే ఆపని చేయడు. (13)
ద్రవ్యవాన్ గుణవా నేవం త్యాగీ భవతి సాత్త్వికః।
పంచభూతాని పంచభ్యః నివర్తయతి తాదృశః॥ 14
ఇట్టి సద్గుణ సంపన్నుడు త్యాగియై సత్త్వగుణ ప్రధానుడయితే అతడు పంచేంద్రియాలను వాటి విషయాల నుండి మళ్లిస్తాడు. (అనగా తపస్సు చేస్తాడు) (14)
ఏవం సమృద్ధ మప్యూర్ధ్వం తపో భవతి కేవలమ్।
సత్త్వాత్ ప్రచ్యవమానానాం సంకల్పేన సమాహితమ్॥ 15
ఇలా ఇంద్రియనిగ్రహం ఏర్పడినా ధైర్యం జారిపోతే వారితపస్సు సంకల్పంతో ఏర్పడినది కాబట్టి ఊర్ధ్వగతి మాత్రం ఏర్పడుతుంది. అంతమాత్రపు తపస్సే అవుతుందది. (15)
యతో యజ్ఞాః ప్రవర్ధంతే సత్యస్యైవావరోధనాత్।
మనసాన్యస్య భవతి వాచాఽన్యస్యాథ కర్మణా॥ 16
సంకల్పంవల్లనే యజ్ఞాలు అభివృద్ధి చెందుతున్నాయి. సంకల్పం నిలబడాలి. పోషింపబడాలి. అపుడే సాధకుడు యోగి అవుతాడు. ఒక్కొక్కనికి మనసు వల్లనే యజ్ఞం సిద్ధిస్తుంది. ఇంకొకనికి వాక్కుతో సిద్ధిస్తుంది. మరొకనికి కర్మతో సిద్ధిస్తుంది. (ఇందు మానసయజ్ఞం ఉత్ట్నమం) (16)
సంకల్పసిద్ధం పురుషమ్ అసంకల్పోఽధితిష్ఠతి।
బ్రాహ్మణస్య విశేషేణ కించాన్యదపి మే శృణు॥ 17
సంకల్పంసిద్ధించిన పురుషుని(అసంకల్పం) జ్ఞానం ఆక్రమిస్తుంది. అందులో ముఖ్యంగా బ్రహ్మజిజ్ఞాస కలవానిని మరింత ఆక్రమిస్తుంది. ఇంకో విషయం చెపుతా విను. (17)
అధ్యాపయే న్మహదేత ద్యశస్యం
వాచో వికారాః కవయో వదంతి।
అస్మిన్ యోగే సర్వమిదం ప్రతిష్ఠితం
యేతద్విదు రమృతాస్తే భవంతి॥ 18
బ్రహ్మను చేర్చే/పొందించే ఈ యోగశాస్త్రాన్నే జ్ఞానులు శిష్యులకు చెప్పాలి. మిగిలిన బోధలన్నీ వాగ్వికారాలే అని కవులు చెపుతున్నారు. ఈ యోగంలోనే సర్వమూ ఉన్నది. దీన్ని తెలుసుకొన్నవారు ముక్తులవుతారు. (18)
న కర్మణా సుకృతే నైవ రాజన్
సత్యం జయే జ్జుహుయాద్వా యజేద్వా।
నైతేన బాలోఽమృత్యు మభ్యేతి రాజన్
రతిం చాసౌ న లభ త్యంతకాలే॥ 19
హోమాలు చేయవచ్చు. యజ్ఞాలు చేయవచ్చు. ఎంత శ్రద్ధగా చేసినా కర్మతో బ్రహ్మమును పొందలేడు. ఆ కర్మాదులు మోక్షం ఇవ్వలేవు. జ్ఞానంలేనివాడు చివరకు మోక్షం పొందడు. (19)
తూష్ణీమేక ఉపాసీత చేష్టేత మనసాపి న।
తథా సంస్తుతి నిందాభ్యాం ప్రీతిరోషౌ వివర్జయేత్॥ 20
అన్ని పనులూ విడిచి ఒంటరిగా బ్రహ్మానుసంధానం చెయ్యాలి. మనసుతో కూడా ఏపనీ చేయరాదు. అంతేకాదు. ఇతరులు స్తుతిస్తే పొంగిపోరాదు. నిందిస్తే కుంగిపోరాదు. రెండూ - ప్రీతినీ, రోషాన్నీ విడిచిపెట్టాలి. (20)
అత్రైవ తిష్ఠన్ క్షత్రియ బ్రహ్మవిశతి పశ్యతి।
వేదేషు చానుపూర్వ్యేణ ఏతద్విద్వన్ బ్రవీమి తే॥ 21
రాజా! ఒక క్రమంలో ఈ మార్గంలో స్థిరంగా నడిచినవాడు ఈ దేహంతోనే బ్రహ్మమును దర్శిస్తాడు. దర్శించడమేమిటి? తానే బ్రహ్మమవుతాడు. వేద విచార ఫలితంగా నేనెరిగిన దానిని నీకు చెపుతున్నాను. (21)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగ పర్వణి సనత్సుజాత పర్వణి సనత్సుజాతవాక్యే పంచ చత్వారింశోఽధ్యాయః॥ 45 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగ పర్వమున సనత్సుజాత పర్వమను ఉపపర్వమున
సనత్సుజా వాక్యమను నలువది అయిదవ అధ్యాయము. (45)