44. నలువది నాలుగవ అధ్యాయము
బ్రహ్మచర్యమును, బ్రాహ్మణుని నిరూపించుట.
ధృతరాష్ట్ర ఉవాచ
సనత్సుజాత యామిమాం పరాం త్వం
బ్రాహ్మం వాచం వదసే విశ్వరూపామ్।
పరాం హి కామేన సుదుర్లభాం కథాం
ప్రబ్రూహి మే వాక్యమిదం కుమార॥ 1
ధృతరాష్ట్రుడు ఇలా ప్రశ్నించాడు. సనత్సుజాతా! ఇపుడు చెప్పిన మాటల కంటె శ్రేష్ఠమైన బ్రహ్మప్రాప్తికరాలయిన మాటలు ఎరుగుదువు. విశ్వమంతటినీ అది ప్రకాశింపజేస్తుంది. తేలికగా లభించనిది. అయినా చెప్పుకోదగినది. అటువంటి వాక్కును నాకు ఉపదేశించు. (1)
సనత్సుజాత ఉవాచ
నైతద్బ్రహ్మ త్వరమాణేన లభ్యం
యన్మాం పృచ్ఛన్నతిహృష్యస్యతీవ।
బుద్ధౌ విలీనే మనసి ప్రచింత్యా
విద్యా హి సా బ్రహ్మచర్యేణ లభ్యా॥ 2
సనత్సుజాతుడు ఇలా చెప్పాడు. రాజా! నీవు చాలా సంతోషంతో అడుగుతున్న బ్రహ్మవిద్య అంత త్వరగా లభ్యంకాదు. ముందు మనస్సు బుద్ధిలో లీనమై పోయాక భావించవలసిన విద్య అది. అది కేవలం బ్రహ్మచర్యం చేతనే లభ్యమవుతుంది. (2)
ధృతరాష్ట్ర ఉవాచ
అత్యంత విద్యా మితి యత్సనాతనీం
బ్రవీషి త్వం బ్రహ్మచర్యేణ సిద్ధామ్।
అనారభ్యాం వసతీహ కార్యకాలే
కథం బ్రాహ్మణ్య మమృతత్వం లభేత॥ 3
ఆ మాటలు విని వెంటనే ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు. మహాత్మా బ్రహ్మవిద్య సనాతనమైనది. కదా. అంటే సర్వకాలాల్లోనూ ఉండేదే కదా! బ్రహ్మచర్యం చేత మాత్రమే తెలుస్తుంది అన్నావు గదా! అది వేరుగా ఇపుడు కలగవలసిన పనిలేదు. ఆరంభించవలసిన పనిలేదు. కార్యకాలంలో ఇక్కడే ఆత్మలోనే ఉంటుంది గదా! అపుడు బ్రహ్మజ్ఞానికి అమృతత్వం ఎలా లభిస్తుంది? దానికోసం బ్రహ్మచర్యాది ప్రయత్నాలెందుకు? (3)
సనత్సుజాత ఉవాచ
అవ్యక్త విద్యా మభిధాస్యే పురాణీం
బుద్ధ్యా చ తేషాం బ్రహ్మచర్యేణ సిద్ధామ్।
యాం ప్రాప్యైనం మర్త్యలోకం త్యజంతి
యా వై విద్యా గురువృద్ధేషు నిత్యా॥ 4
సనత్సుజాతుడు ఇలా సమాధానం చెపుతున్నాడు. రాజా! నీ వన్నట్లు ఆ విద్య సనాతనమే. అది అవ్యక్త విద్య(పూర్వం నుండి ఉన్నదే కాని వ్యక్తంగా లేదు). అనగా బ్రహ్మవిద్య బుద్ధితో, బ్రహ్మచర్యంతో సిద్ధిస్తుంది. దాన్ని చెపుతాను విను. (సామాన్యంగ) ఆ విద్య పొందినవారు ఈ మనుష్యలోకం వదిలేస్తారు. అయినా ఆ విద్య గురువృద్ధుల దగ్గఱ నితమూ ఉంటుంది. (4)
ధృతరాష్ట్ర ఉవాచ
బ్రహ్మచర్యేణ యా విద్యా శక్యా వేదితు మంజసా।
తత్కథం బ్రహ్మచర్యం స్యాత్ ఏతత్ బ్రహ్మన్ బ్రవీహి మే॥ 5
ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు. బ్రాహ్మణోత్తమా! బ్రహ్మచర్యంతో ఆ విద్య తెలుసుకోవడం శక్యమవుతుందన్నావు గదా! ఆ బ్రహ్మచర్యం ఎలా ఆచరించాలి? త్వరగా చెప్పు నాకు. (5)
సనత్సుజాత ఉవాచ
ఆచార్యయోని మిహ యే ప్రవిశ్య
భూత్వా గర్భే బ్రహ్మచర్యం చరంతి।
ఇహైవ తే శాస్త్రకారా భవంతి
ప్రహాయ దేహం పరమం యాంతి యోగమ్॥ 6
సనత్సుజాతుడు చెపుతున్నాడు. గురువుదగ్గరకు వెళ్లి, నిష్కపటప్రవర్తనతో బ్రహ్మచర్యం చేసేవారు ఇక్కడే శాస్త్రకారులవుతారు. దేహాన్ని విడిచి పరమాత్మతో ఐక్యాన్నీ పొందుతారు. (6)
అస్మింల్లోకే వై జయంతీహ కామాన్
బ్రాహ్మీం స్థితిం హ్యమతితిక్షమాణాః।
త ఆత్మానం నిర్హరంతీహ దేహాత్
ముంజాదిషీక మివ సత్త్వసంస్థాః॥ 7
అన్ని కష్టాలూ సహిస్తూ బ్రహ్మానుసంధానం చేసేవారు కామము లన్నిటినీ గెలుస్తారు. సత్త్వగుణప్రవర్తనతో ఉండి గడ్డిదుబ్బునుండి గడ్డి పరకను వేరుచేసినట్లు దేహం నుండి ఆత్మను వేరుపరుస్తారు. (7)
శరీరమేతౌ కురుతః పితా మాతా చ భారత।
ఆచార్య శాస్తా యా జాతిః సా పుణ్యా సాఽజరామరా॥ 8
భారతా! తల్లిదండ్రులు ఈ శరీరాన్ని ఇస్తున్నారు. ఆచార్యుడూ జన్మనిస్తున్నాడు. కాని ఆచార్యుడిచ్చే జన్మ పుణ్యప్రదం. దానికి జరామరణాలు లేవు. (8)
యః ప్రావృణోత్యవితథేన వర్ణా
నృతం కుర్వ న్నమృతం సంప్రయచ్ఛన్।
తం మన్యేత పితరం మాతరం చ
తస్మై న ద్రుహ్యేత్ కృతమస్య జానన్॥ 9
ఆచార్యుడు సత్యమయిన చిదాత్మను, బ్రహ్మమును, తన ఉపదేశంతో అనుభవానికి తెస్తాడు. అలా నాలుగు వర్ణాల వారికి మోక్షమిస్తాడు. అందుచేత అతనిని తల్లి, తండ్రి అని అనుకోవాలి. అతడు చేసిన మేలును మరువరాదు. అతనికి ద్రోహం చేయరాదు. (9)
గురుం శిష్యో నిత్యమభివాదయీత
స్వాధ్యాయ మిచ్ఛే చ్ఛుచి రప్రమత్తః।
మానం న కుర్యా న్నాదధీత రోష
మేష ప్రథమో బ్రహ్మచర్యస్య పాదః॥ 10
శిష్యుడు గురువుకు రోజూ పేరు, గోత్రం చెప్పుకొని నమస్కరించాలి. పరిశుద్ధుడై, ప్రమాదరహితుడై ప్రవర్తించాలి. గర్వం కాని కోపం కాని దగ్గరకు రానీయకూడదు. ఇది బ్రహ్మచర్యం యొక్క మొదటి పాదం. (10)
శిష్యవృత్తి క్రమేణైవ విద్యా మాప్నోతి యః శుచిః।
బ్రహ్మచర్యవ్రతస్యాస్య ప్రథమః పాద ఉచ్యతే॥ 11
శిష్యుడు శుచియై భిక్షాటనం చేస్తూ విద్యను నేర్వాలి. బ్రహ్మచర్యవ్రతంలో ఇది కూడా మొదటి పాదమే. (11)
ఆచార్యస్య ప్రియం కుర్యాత్ ప్రాణైరపి ధనైరపి।
కర్మణా మనసా వాచా ద్వితీయః పాద ఉచ్యతే॥ 12
ప్రాణాలతో, ధనంతో, క్రియతో, మనసుతో, వాక్కుతో గురువుకు ప్రీతి కలిగించాలి. ఇది బ్రహ్మచర్యంలో రెండో పాదం. (12)
సమా గురౌ యథావృత్తిః గురుపత్న్యాం తథాఽఽచరేత్।
తత్పుత్రే చ తథా కుర్వన్ ద్వితీయః పాద ఉచ్యతే॥ 13
గురువు పట్ల ప్రవర్తించినట్లే గురుపత్నియందు, గురుపుత్రుని యందు కూడా ప్రవర్తించాలి. ఇది కూడా బ్రహ్మచర్యం యొక్క రెండో పాదమే. (13)
ఆచార్యేణాత్మకృతం విజానన్
జ్ఞాత్వాచార్థం భావితోఽస్మీత్యనేన।
యం మన్యతే తంప్రతి హృష్టబుద్ధిః
స వై తృతీయో బ్రహ్మచర్యస్య పాదః॥ 14
తనకు ఆచార్యుడు చేసిన మేలును తెలుసుకోవాలి. అర్థం తెలుసుకోవాలి. ఇంతమేలు వీనివల్ల కలిగిందని భావించాలి. ఆచార్యుని పట్ల సంతోషంతో ప్రవర్తించాలి. ఇది బ్రహ్మచర్యం యొక్క మూడవ పాదం. (14)
నాచార్యస్యానపాకృత్య ప్రవాసం
ప్రాజ్ఞః కుర్వీత నైతదహం కరోమి।
ఇతీవ మన్యేత న భాషయేత్
స వై చతుర్థో బ్రహ్మచర్యస్య పాదః॥ 15
గురుదక్షిణ ఇవ్వకుండా వేరే చోటికి పోరాదు. గురుదక్షిణ ఇచ్చాక "నేను ఇచ్చాను." అనుకోరాదు. ఎక్కడ చెప్పకూడదు. ఇది బ్రహ్మచర్యం యొక్క నాలుగవ పాదం. (15)
కాలేన పాదం లభతే తథాఽర్థం
తతశ్చ పాదం గురుయోగతశ్చ।
ఉత్సాహయోగేన చ పాద మృచ్ఛేత్
శాస్త్రేణ పాదం చ తతోఽభియాతి॥ 16
విద్య నాలుగు విధాల సిద్ధిస్తుంది. కాలపరిపాకాన్ని బట్టి (అనుభవాన్ని) ఒక పాదం(1/4), మరొక పాదం గురూపదేశం వల్ల, మరోపాదం తన బుద్ధిబలాన్ని బట్టి, మిగిలినది శాస్త్ర విచారం చేత లభిస్తుంది విద్య. (16)
ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్యః స్వమేధయా।
పాదం సబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణ చ॥
ధర్మాదయో ద్వాదశ యస్య రూపం
అన్యాని చాంగాని తథా బలం చ।
ఆచార్య యోగే ఫలతీతి చాహుః
బ్రహ్మార్థయోగేన చ బ్రహ్మచర్యమ్॥ 17
ఈ బ్రహ్మచర్యం వేదతత్త్వభావన చేత గురువు యొక్క సంబంధంతో ఫలిస్తుందని చెపుతారు. దీనికి ధర్మం మొదలయిన 12 స్వరూపాలు ఆసన ప్రాణాయామాదులు అంగాలు. నిశ్చల మయిన యోగమే బలం. (17)
ఏవం ప్రవృత్తో యదుపాలభేత వై
ధన మాచార్యాయ తదను ప్రయచ్ఛేత్।
సతాం వృత్తిం బహుగుణా మేవ మేతి
గురోః పుత్రే భవతి చ వృత్తి రేషా॥ 18
ఇలా ప్రవర్తిస్తూ బ్రహ్మవిద్యను సాధించాలి. తరువాత శిష్యుడు తన శక్తికొలది ధనాన్ని గురువుకు ఇవ్వాలి. దానివల్ల శిష్యుడు బహుసద్గుణాలు కల సజ్జనప్రవృత్తిని పొందుతాడు. గురుపుత్రుడు కూడా ఇలాగే ప్రవర్తించాలి. (తండ్రి అనుకోరాదు - తండ్రిని గురువుగా భావించాలి). (18)
ఏవం వసన్ సర్వతో వర్ధతీహ
బహూన్ పుత్రాన్ లభతే చ ప్రతిష్ఠామ్।
వర్షంతి చాస్మై ప్రదిశో దిశశ్చ
వసంత్యస్మిన్ బ్రహ్మచర్యే జనాశ్చ॥ 19
ఇలా బ్రహ్మచర్యం ఆచరించేవాడు అన్ని విధాల అభివృద్ధి చెందుతాడు. చాలామంది పుత్రులను కీర్తిప్రతిష్ఠలను పొందుతాడు. అతనికి అన్ని దిక్కులూ ధనం వర్షిస్తాయి. వానిని ఆదర్శంగా ప్రజలు భావించి బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. (19)
ఏతేన బ్రహ్మచర్యేణ దేవా దేవత్వ మాప్నువన్।
ఋషయశ్చ మహాభాగా బ్రహ్మలోకం మనీషిణః॥ 20
ఈ బ్రహ్మచర్యం తోనే దేవతలు దేవత్వం పొందారు. పుణ్యాత్ములు, వివేకులు అయిన మహర్షులు బ్రహ్మ సాక్షాత్కారం పొందారు. (20)
గంధర్వాణా మనేనైన రూప మప్సరసా మభూత్।
ఏతేన బ్రహ్మచర్యేణ సూర్యోఽప్యహ్నాయ జాయతే॥ 21
ఈ బ్రహ్మచర్యం వల్లనే గంధర్వులక్Y, అప్సరసలకూ రూపమూ; సూర్యునకు తేజస్సూ కలిగాయి. (21)
ఆకాంక్షార్థస్య సంయోగాద్ రసభేదార్థినామివ।
ఏవం హ్యేతే సమాజ్ఞాయ తాదృగ్భావం గతా ఇమే॥ 22
బ్రహ్మచర్యం చింతామణి లాగా కోరిన వారి కోరికలన్నీ తీరుస్తుంది. వారి వారి ఇష్టాలనుబట్టి దేవతలు మొదలగువారు దేవత్వం మొదలయినవి పొందారు. (22)
య ఆశ్రయేత్ పావయే చ్చాపి రాజన్
సర్వం శరీరం తపసా తప్యమానః।
ఏతేన వై బాల్య మభ్యేతి విద్వాన్
మృత్యుం తథా స జయత్యంతకాలే॥ 23
రాజా! ఇలా నాలుగు పాదాల్ బ్రహ్మచర్యం ఆచరించినవాడే తపస్సుతో శరీరాన్ని పవిత్రం చేసుకుంటాడు. ఆ విజ్ఞాని బ్రహ్మచర్యంతో బాల్యాన్ని(నిర్మలత్వాన్ని, విద్యార్థిత్వాన్ని) పొందుతాడు. చివరికి మృత్యువును జయిస్తాడు. (23)
అంతవంతః క్షత్రియ తే జయంతి
లోకాన్ జనాః కర్మణా నిర్మలేన।
బ్రహ్మైవ విద్వాంస్తేన చాభ్యేతి సర్వం
నాన్యః పంథా అయనాయ విద్యతే॥ 24
జనులు నిర్మలమైన కర్మ మార్గంతో నశించిపోయే స్వర్గాది లోకాలను పొందుతారు. జ్ఞాని బ్రహ్మచర్యంతో అక్షయమైన బ్రహ్మమును పొందుతాడు. మోక్షానికి దీన్ని మించిన మార్గం లేదు. (24)
ధృతరాష్ట్ర ఉవాచ
ఆభాతి శుక్లమివ లోహిత మివాథో
కృష్ణ మథాంజనం కాద్రవం వా।
సద్బ్రహ్మణః పశ్యతి యోఽత్ర విద్వాన్
కథం రూపం తదమృత మక్షరం పదమ్॥ 25
ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు. జ్ఞాని బ్రహ్మం యొక్క రూపాన్ని చూస్తున్నాడు గదా! అది తెల్లనిదా! ఎఱ్ఱనిదా? కాటుకవలె నల్లనిదా? నల్లని పొగరంగుదా? (25)
సనత్సుజాత ఉవాచ
ఆభాతి శుక్లమివ లోహిత మివాథో
కృష్ణమాయస మర్కవర్ణమ్।
న పృథివ్యాం తిష్ఠతి నాంతరిక్షే
నైతత్సముద్రే సలిలం బిభర్తి॥ 26
సనత్సుజాతుడు ఇలా చెప్పాడు. ఆ బ్రహ్మపదార్థం తెల్లెగానూ, ఎర్రగానూ, నల్లగానూ, సూర్యతేజస్సులాగానూ కనిపిస్తుంది. కాని దానిరూపం నేలమీద కాని ఆకాశంలోగాని ఉండదు. సముద్రంలో నీటిలాగాను ఉండదు. (అనగా పంచభూతాలకు సంబంధంలేదని భావం) (26)
న తారకాసు న చ విద్యుదాశ్రితం
న చాభ్రేషు దృశ్యతే రూపమస్య।
న చాపి వాయౌ న చ దేవతాసు
నైతచ్చంద్రే దృశ్యతే నోత సూర్యే॥ 27
పరమాత్మ రూపం నక్షత్రాల్లో కాని, మెరుపుల్లోకాని, మేఘాల్లో కాని, గాలిలో కాని, దేవతల్లో కాని, చంద్రసూర్యుల్లో కాని కన్పడదు. అనగా ఆత్మకు స్వరూపాదులు లేవని భావం. (27)
నైవక్ష్రు తన్న యజుష్షు నాప్యథర్వసు
న దృశ్యతే వై విమలేషు సామసు।
రథంతరే బార్హద్రథే వాపి రాజన్
మహావ్రతే నైవ దృశ్యతే ధ్రువం తత్॥ 28
రాజా! ఆ పరబ్రహ్మ ఋగ్యజుస్సామాథర్వణ వేదల్లో కనపడదు. రథంతర బార్హద్రథ సామాల్లో కన్పడదు. మహావ్రతంలో కనపడదు. ఇది నిశ్చయం. (28)
అపారణీయం తమసః పరస్తాత్
తదంతకోప్యేతి వినాశకాలే।
అణీయో రూపం క్షుర ధారయో సమం
మహచ్చ రూపం తద్వైః పర్వతేభ్యః॥ 29
ఆ పరబ్రహ్మం దాటరానిది. అజ్ఞానాంధకారానికి అవతలిది. యముడు కూడా ప్రళయ కాలంలో అక్కడికే చేరుతాడు. దానిరూపం చాలా(అణువువలె) సూక్ష్మం, చురకత్తి అంచులాంటిది. కాని పర్వతాలకంటే గొప్పది. 'అణోరణీయాన్ మహతో మహీయాన్' అనిభావం. (29)
సా ప్రతిష్ఠా తదమృతం లోకా స్తద్బ్రహ్మ తద్యశః।
భూతాని జజ్ఞిరే తస్మాత్ ప్రలయం యాంతి తత్ర హి॥ 30
అది అన్నిటికీ ఆధారం. దానికి మార్పులు లేవు. లోకాలన్నీ దానిరూపమే. అదే బ్రహ్మపదార్థం. యశస్సు. దానినుండే భూతాలన్నీ పుడతాయి. తిరిగి దానిలోనే లీనమవుతాయి. (30)
అనామయం తన్మహ దుద్యతం యశః
వాచో వికారం కవయో వదంతి।
యస్మిన్ జగత్ సర్వమిదం ప్రతిష్ఠితం
యే తద్విదు రమృతాస్తే భవంతి॥ 31
ఆ పరబ్రహ్మమునకు సుఖంకాని దుఃఖంకాని ఉండదు. అది చాలా గొప్పది. జగత్తుగా ఉద్భవించింది. అందమైనది. వాగ్రూపంగా ఉద్భవించిందని(శబ్దబ్రహ్మం) కవులంటారు. దానిలోనే జగత్తు నిలిచి ఉంది. దీన్ని తెలుసుకొన్న వారే ముక్తులు. మోక్షం పొందినవారు. (31)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగ పర్వణి సనత్సుజాత పర్వణి సనత్సుజాత వాక్యే చతుశ్చత్వారింశోఽధ్యాయః॥ 44 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగ పర్వమున సనత్సుజాత పర్వమను ఉపపర్వమున
సనత్సుజాత వాక్యమను నలుబది నాల్గవ అధ్యాయము. (44)