43. నలుబదు మూడవ అధ్యాయము

గుణదోష నిరూపణము.

అవః సన్యాసంతో కూడిన మునిధర్మం మౌనం - దాన్ని గూర్చి ప్రశ్నిస్తున్నాడు.

ధృతరాష్ట్ర ఉవాచ
కస్యైష మౌనః కతరన్ను మౌనం,
ప్రబ్రూహి విద్వన్నిహ మౌనభావమ్।
మౌనేన విద్వానుత యాతి మౌనం,
కథం మునే మౌన మిహాచరంతి॥ 1
ధృతరాష్ట్రుడు ఇలా ప్రశ్నించాడు. మునీ! ఈ మౌనం ఏ ప్రయోజనం కోసం? 2. మౌనం అంటే మాట్లాడకపోవటమా? లేక నిదిధ్యాసనమా? ఈ రెండిలో ఏది? 3. మౌనం యొక్క లక్షణాలేవి? 4. మౌనం చేత నిర్వికల్పస్థితి కలుగుతుందా? 5. మౌనం ఎలా ఆచరిస్తారు? (1)
సనత్సుజాత ఉవాచ
యతో న వేదా మనసా సహైనం
అనుప్రవిశంతి తతోఽథ మౌనమ్।
యత్రోత్థితో వేదశబ్ద స్తథాఽయం
స తన్మయత్వేన విభాతి రాజన్॥ 2
సనత్సుజాతుడు ఇలా చెప్పాడు. రాజా! వేదాలు కానీ మనసుకానీ పరబ్రహ్మాన్ని ప్రవేశించలేవు. అందువల్ల ప్రబ్రహ్మయే మౌనం నుండియే వైదిక లౌకికశబ్దాలు వచ్చాయి. అందుచేత భూతాత్మ శబ్దస్వరూపంతో ప్రకాశిస్తుంది. (2)
వి॥సం॥ 1) వాక్కులకు, మనసుకు అందని స్థితిని పొందటం ప్రయోజనం.
2) వాక్కు మొదలయిన ఇంద్రియాలపనులను అరికట్టటమే మౌనం
3) బాహ్యాభ్యంతరప్రపంచాలు కనపడకపోవడమే మౌనలక్షణం
4) వాక్కులకు మనసుకు అందని పదం అందుకోవటం నిర్వికల్పస్థితి.
5) ఇక మౌనవిధానం - భావనాత్మ పరబ్రహ్మము నుండి వేదశబ్దం - ఓంకారం పుట్టింది. అనగా నామరూపాత్మకంగా బ్రహ్మ పదార్థం ఆవిర్భవించినట్లు భావించాలి. అహ్డి మౌనవిధానం. (నీల)
ధృతరాష్ట్ర ఉవాచ
ఋచో యజూంషి యో వేద సామవేదం చ వేద యః।
పాపాని కుర్వన్ పాపేన లిప్యతే కిం న లిప్యతే॥ 3
అపుడు ధృతరాష్ట్రుడు ఇలా ప్రశ్నించాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, తెలిసినవాడు పాపాలు చేస్తే వానికి దాని ఫలితం అంటుతుందా? అంటదా? (3)
సనత్సుజాత ఉవాచ
నైనం సామాన్యృచో వాపి న యజూంష్యవిచక్షణమ్।
త్రాయంతే కర్మణః పాపాద్ న తే మిథ్యా బ్రవీమ్యహమ్॥ 4
సనత్సుజాతుడు ఇలా చెప్పాడు. ఋగ్వేదమైనా, యజుర్వేదమయినా, సామవేదమయినా అవివేకిని కర్మఫలరూపమైన పాపం నుండి రక్షించలేవు. నీకు నేను అసత్యం చెప్పటంలేదు. (4)
న చ్ఛందాంసి వృజినాత్తారయంతి
మాయావినం మాయయా వర్తమానమ్।
నీడం శకుంతా ఇవ జాతపక్షాః
ఛందాంస్యేనం ప్రజహంత్యంతకాలే॥ 5
కపటమనస్సు, కపట చేష్టలు, కలవానిని వేదాలు పాపం నుండి రక్షించలేవు. రెక్కలు, వస్తే పక్షులు గూటిని వదలి వెళ్లి పోయినట్లు మరణ సమయంలో వేదాలు పాపకర్ముని వదలి వెళ్లిపోతాయి. అనగా వానిని స్ఫురించవు. (5)
ధృతరాష్ట్ర ఉవాచ
న చేద్వేదా వినా ధర్మం త్రాతుం శక్తా విచక్షణ।
అథ కస్మాత్ ప్రలాపోఽయం బ్రాహ్మణానాం సనాతనః॥ 6
ధృతరాష్ట్రుడపుడిలా ప్రశ్నించాడు. ధర్మం ఆచరింపకపోతే వేదాలు రక్షింపలేవని గదా అంటున్నావు. అపుడు అనాదిగా విప్రులు చెప్పే మాటలకు విలువ ఏమిటి? (6)
వి॥సం॥ "ఋగ్యజుస్సామభిః పూతో బ్రహ్మాలోకే మహీయతే," మొదలయిన మాటలకు అర్థం ఏమిటి? అని ప్రశ్న.
సనత్సుజాత ఉవాచ
తస్యైవ నామాదివిశేషరూపైః
ఇదం జగద్భాతి మహానుభావ।
నిర్దిశ్య సమ్యక్ప్రవదంతి వేదాః
తద్విశ్వవైరూప్యముదాహరంతి॥ 7
దానికి సమాధానం ఇలా చెప్పాడు. సనత్సుజాతుడు. మహానుభావా! ఆ పరమాత్మయొక్క నామరూపాత్మకంగానే యీ జగత్తు భాసిస్తుంది. వేదాలు ఈ విషయం నిరూపించి చెపుతాయి. అంతేకాదు. విశ్వంకంటే పరమాత్మ విలక్షణ మైనదని కూడా చెపుతాయి. (7)
తదర్థముక్తం తప ఏతదిజ్యా
తాభ్యామసౌ పుణ్యముపైతి విద్వాన్।
పుణ్యేన పాపం వినిహత్య పశ్చాత్
సంజాయతే జ్ఞాన విదీపితాత్మా॥ 8
ఆ బ్రహ్మమును పొందటానికి తపస్సు, యజ్ఞము రెండు సాధనాలు. వీటివల్ల విద్వాంసుడు పుణ్యం పొందుతాడు. దానితో ముందు పాపం నశిస్తుంది. తరువాత జ్ఞానంతో ఆత్మజ్యోతి వెలుగుతుంది. (8)
జ్ఞానేన చాత్మాన ముపైతి విద్వాన్
అథాన్యథా వర్గఫలానుకాంక్షీ।
అస్మిన్ కృతం తత్పరిగృహ్య సర్వం
అముత్ర భుంక్తే పునరేతి మార్గమ్॥ 9
విద్వాంసుడు జ్ఞానంతో పరమాత్మను పొందుతాడు. ఇతర మార్గం పట్టితే... కోరికతో చేసిన కర్మఫలం అంతటిని గ్రహించి పరలోకంలో అనుభవిస్తాడు. ఇంకా మిగిలిన దాని అనుభవం కోసం మళ్లీ ఈ మార్గం పడతాడు. (9)
అస్మింల్లోకే తపస్తప్తం ఫలమన్యత్ర భుజ్యతే।
బ్రాహ్మణానా మిమే లోకాః ఋద్ధే తపసి తిష్ఠతామ్॥ 10
జ్ఞానరహితులు ఈ లోకంలో చేసిన తపస్సు యొక్క ఫలితమ్ పరలోకంలో అనుభవిస్తారు. జ్ఞానంతో కర్తవ్యంగా చేసిన తపస్సు యొక్క ఫలితం ఈ లోకంలోనే అనుభవించబడుతుంది. (10)
ధృతరాష్ట్ర ఉవాచ
కథం సమృద్ధ మసమృద్ధం తపో భవతి కేవలమ్।
సనత్సుజాత తద్బ్రూహి యథా విద్యామ తద్ద్వయమ్॥ 1
ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు. సనత్సుజాతా! ఒకే తపస్సు ఒకరికి సమృద్ధమూ, మరొకరికి అసమృద్ధమూ ఎలా అవుతుంది? ఆ రెండూ నాకు తెలిసేటట్లు చెప్పుము. (11)
సనత్సుజాత ఉవాచ
నిష్కల్మషం తపస్త్వేతత్ కేవలం పరిచక్షతే।
ఏత త్సమృద్ధ మప్యృద్ధం తపో భవతి కేవలమ్॥ 12
సనత్సుజాతుడు చెప్పాడు. నిష్కల్మషమైన తపస్సును కేవలమంటారు. కల్మషమంటే కోరిక, కోరిక లేని తపస్సు కేవల తపస్సు. కోరికతో చేసే తపస్సు రెండు విధాలు. 1. సమృద్ధము 2. ఋద్ధము 1. ఏదయినాకోరికతో చేసేది సమృద్ధం 2.ఇతరుల మెప్పుకోసం గొప్ప కోసం ఆడంబరం కోసం చేసే తపస్సు ఋద్ధం. (12)
తపోమూల మిదం సర్వం యన్మాం పృచ్ఛసి క్షత్రియ।
తపసా వేద విద్వాంసః పరం త్వమృత మాప్నుయుః॥ 13
రాజా! నీవడిగేది అంతా అనగా ఈ లోకపుభోగాలన్నీ తపస్సు వల్లనే కలుగుతాయి. కాని వేదవేత్త లయిన జ్ఞానులు మాత్రం తపస్సుతో ముక్తిని పొందుతున్నారు. (13)
ధృతరాష్ట్ర ఉవాచ
కల్మషం తపసో బ్రూహి శ్రుతం నిష్కల్మషం తపః।
సనత్సుజాత యేనేదం విద్యాం గుహ్యం సనాతనమ్॥ 14
ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు. నిష్కల్మషమైన తపస్సు అంటే ఏమిటి? అసలు తపస్సుకు కల్మష మేమిటి? చెప్పు - అది వింటే సనాతన మయిన సత్యం తెలుస్తుంది. (14)
సనత్సుజాత ఉవాచ
క్రోధాదయో ద్వాదశ యస్య దోషాః
తదా నృశంసాని దశ త్రి రాజన్।
ధర్మాదయో ద్వాదశైతే పితౄణాం
శాస్త్రే గుణా యే విదితా ద్విజానమ్॥ 15
సనత్సుజాతుడు ఇలా చెప్పాడు. రాజా! తపస్సును చెరిచే క్రోధం మొ॥ దోషాలు పన్నెండు ఉన్నాయి. అలాగే పదమూడు క్రూరలక్షణాలూ ఉన్నాయి.(ఇవన్నీ కల్మషాలు) అలాగే మన్వాదులు చెప్పిన గుణాలూ శాస్త్రంలో ఉన్నాయి. అవి ధర్మం మొ॥నవి. (15)
క్రోధః కామో లోభమోహౌ విధిత్సా
కృపాసూయే మానశోకౌ స్పృహా చ।
ఈర్ష్యా జగుప్సా చ్ మనుష్యదోషాః
వర్జ్యాః సదా ద్వాదశైతే నరాణామ్॥ 16
దోషాలు పన్నెండు అవి. 1. క్రోధం, 2. కామం, 3. లోభం, 4. మోహం, 5. మితిమీరిన స్వార్థచింత, 6. నిర్దయ, 7. అసూయ, 8. మానం, 9. శోకం, 10. లౌకికవిషయవాంఛ. 11. ఈర్ష్య, 12. జుగుప్స. వీనిని మానవుడు సదా విదిలిపెట్టాలి. (16)
ఏకైకః పర్యుపాస్తే హ మనుష్యాన్ మనుజర్షభ।
లిప్సమానోఽంతరం తేషాం మృగాణామివ లుబ్ధకః॥ 17
ఈ దోషాల్లో ఏ ఒకటి ఉన్నా వేటకాడు మృగాలను హింసించినట్లు మానవుల బలహీనతలను పొంచిచూసి హింసిస్తాయి. ఇక అన్నీ ఉంటే వేరే చెప్పలా? (17)
వికత్థనః స్పృహయాళు ర్మనస్వీ
బిభ్రత్కోపశ్చపలో ఽరక్షణశ్చ।
ఏతాన్ పాపాః షణ్ణరాః పాపధర్మాన్
ప్రకుర్వతే నో త్రసంతః సుదుర్గే॥ 18
అవః ఇక క్రూరలక్షణాలు పదమూడు చెపుతున్నాడు. 1. గొప్పలు చెప్పేవాడు 2. చెడ్డకోరికలు కలవాడు. 3. దురభిమాని, 4. కోపి, 5. చపలుడు, 6. సమర్థుడై రక్షించనివాడు. వీరు ఆపత్సమయాల్లో కూడా పాపకార్యాలు చేస్తారు. (18)
సంభోగ సంవిద్విషమీఽతిమానీ
దత్తానుతాపీ కృపణో బలీయాన్।
వర్గ ప్రశంసీ వనితాసు ద్వేష్టా
ఏతే పరే సప్త నృశంస వర్గాః॥ 19
1. స్త్రీ సంగమమే పరమార్థం అనుకొనేవాడు, 2. అతిగర్వి, 3. దానం చేశాక బాధపడేవాడు, 4. పిసినారి, 5. బలవంతంగా పన్నులు లాక్కునేవడు, 6. పాపంచేసి గొప్పగా చెప్పుకొనేవాడు. 7. పతివ్రతాస్త్రీలను ద్వేషించేవాడు - ఈ ఏడుగురు క్రూరులు. పూర్వశ్లోకంలోని ఆరుగురు ఈ శ్లోకంలోని ఏడుగురు మొత్తం పదమూడు. (19)
ధర్మశ్చ సత్యం చ దమస్తవశ్చ
అమాత్సర్యం హ్రీస్తితిక్షాఽనసూయా।
యజ్ఞం చ దానం చ ధృతిః శ్రుతం చ
వ్రతాని వై ద్వాదశ బ్రాహ్మణస్య॥ 20
అవః ఇక గుణాలు, 12 ఇవి. 1. ధర్మం, 2. సత్యం, 3. దమం, 4. తపస్సు, 5. మాత్సర్యం లేకుండటం, 6. లజ్జ, 7. సహనం, 8. అసూయ లేకపోవడం, 9. యజ్ఞం, 10. దానం, 11. ధైర్యం, 12. వేదజ్ఞానం.ఇవి బ్రహ్మజ్ఞానం పొందేవాని గుణాలు. (20)
యస్త్వేతేభ్యః ప్రభవే ద్ద్వాదశభ్యః
సర్వామపీమాం పృథివీం స శిష్యాత్।
త్రిభిర్ద్వాభ్యా మేకతో వాఽర్థితో య
స్తస్య స్వమస్తీతి స వేదితవ్యః॥ 21
ఈ పన్నెండు గుణాలు కలవాడు ఈ భూమినంతటినీ పరిపాలింపగలడు. ఇందులో కనీసం ఒకటో, రెండో, మూడో ఉన్న వాడు కూడా సంపన్నుడే అని తెలుసుకోవాలి. (21)
దమస్త్యాగోఽప్రమాదశ్చ ఏతే ష్వమృత మాహితమ్।
తాని సత్యముఖా న్యాహుఃబ్రాహ్మణా యే మనీషిణః॥ 22
దమం, త్యాగం, పొరబడకపోవటం అనేగుణాల్లో ముక్తి ఉంది. ఇవి సత్యప్రధానంగా లభిస్తాయని బ్రహ్మజ్ఞానులు చెపుతారు. (22)
దమోహ్యష్టాదశగుణః ప్రతికూలం కృతాకృతే।
అనృతం చాభ్యసూయా చ కామార్థే చ తథా స్పృహా॥ 23
క్రోధః శోకస్తథా తృష్ణా లోభః పైశున్యమేవ చ।
మత్సరశ్చ విహింసా చ పరితాప స్తథాఽరతిః॥ 24
అపస్మార శ్చాతివాదః తథా సంభావనాత్మని।
ఏతైర్విముక్తో దోషైర్యః స దాంతః సద్భిరుచ్యతే॥ 25
అవః ఈ దమం 18 దోషాలు లేనప్పుడే 18 గుణాలు కలదగును, అని చెపుతున్నాడు. ఆ 18 దోషాలు ఇవి. 1. వేదవిహితకర్మలపట్ల, ఉపవాసాదికములపట్ల వ్యతిరేకంగా ప్రవర్తించడం 2. అసత్యం 3. అసూయ 4. కామం 5. అర్థం 6. వాంఛ 7. క్రోధం 8. శోకం 9. అతివాంఛ 10. లోభం 11. చాడీలు చెప్పడం, 12. మాత్సర్యం 13. ఇతరులను పీడించడం 14. దుఃఖం 15. సత్కార్యప్రీతి లేకపోవడం 16. కర్తవ్యం మరచిపోవడం 17. పరనింద 18. తాను గొప్పవాడననుకోవడం. ఈ 18 దోషాలు లేనివాడే దాంతుడు(అనగా దమగుణం కలవాడు) (23-25)
మదోఽష్టాదశదోషః స్యాత్ త్యాగో భవతి షడ్విధః।
విపర్యయాః స్మృతా ఏతే మదదోషా ఉదాహృతాః॥ 26
ఈ 18 దోషాలు కలిగి ఉండటమే మదం. త్యాగం ఆరు రకాలు - దాని వ్యతిరేకగుణాలు ఆరు. ఆ పద్దెనిమిది ఈ ఆరూ మొత్తం ఇరవైనాలుగు మదదోషాలు. (26)
శ్రేయాంస్తు షడ్విధస్త్యాగః తృతీయో దుష్కరో భవేత్।
తేన దుఃఖం తరత్యేవ భిన్నం తస్మిన్ జితం కృతే॥ 27
త్యాగం ఆరు విధాలు - చాలామేలు కూర్చుతుంది త్యాగం. అందులో మూడవ గుణం దుష్కరం. ఆ మూడవ గుణం ఆచరిస్తే భేదభావం పోతుంది. దుఃఖం తరిస్తాడు. (27)
శ్రేయాంస్తు షడ్విధస్త్యాగః శ్రియం ప్రాప్య న హృష్యతి।
ఇష్టాపూర్తే ద్వితీయాం స్యాత్ నిత్య వైరాగ్య యోగతః॥ 28
కామత్యాగశ్చ రాజేంద్ర స తృతీయ ఇతి స్మృతః।
అప్యవాచ్యం వదత్యేతం స తృతీయో గుణః స్మృతః॥ 29
ఆరు రకాల త్యాగం చాలామేలైనది. 1. సంపద కలిగి కూడా పొంగి పోకుండా ఉండటం 2. నిత్యవైరాగ్యభావంతో ఇష్టం, పూర్తం అనే సత్కర్మ లాచరించడం, 3. నిత్యవైరాగ్యభావంతో కోరికలు విడిచిపెట్టడం, ఇది మూడవది, దీన్ని గొప్పగా చెప్పుకోరాదు. (28,29)
త్యక్తైర్ద్రవ్యై ర్యద్భవతి నోపయుక్తైశ్చ కామతః।
న చ ద్రవ్యై స్తద్భవతి నోపయుక్తైశ్చ కామతః॥ 30
నిష్కామత్వం అనేది విషయాలను పూర్తిగా వదలినపుడే కలుగుతుంది. అంతేకాని పూర్తిగా అనుభవించేసినంత మాత్రాన కలుగదు. (30)
వి॥ "న జాతు కామః కామానా ముపభోగేన శామ్యతి"
న చ కర్మస్వసిద్దేషు దుఃఖం తేన చ న గ్లపేత్।
సర్వైరేవ గుణైర్యుక్తః ద్రవ్యవానపి యో భవేత్॥ 31
సర్వ సద్గుణాలూ, సంపదలూ కలవానికి కూడా ఒక్కొక్కపుడు కార్యాలు సిద్ధించవు. అపుడు దుఃఖ పడరాదు. దానితో కుంగిపోరాదు. (31)
అప్రియే చ సముత్పన్నే వ్యథాం జాతు న గచ్ఛతి।
ఇష్టాన్ పుత్రాంశ్చ దారాంశ్చ న యాచేత కదాచన॥ 32
అప్రియం కలిగినా ఎన్నడూ వ్యథ చెందకూడదు. ఇష్టులయిన భార్యాపుత్రులను కూడా యాచింప కూడదు. (32)
అర్హతే యాచమానాయ ప్రదేయం తచ్ఛుభం భవేత్।
అప్రమాదీ భవేదేతైః స చాప్యష్టగుణో భవేత్॥ 33
తగినవాడైతన్ను అడిగినవానికి ఇవ్వడం శుభంకరమవుతుంది. ఇటువంటి గుణాలలో పొరబడరాదు. దీన్ని అప్రమాదం అంటారు. (33)
అవః ఈ అప్రమాదమ్ ఎనిమిది విధాలు
సత్యం ధ్యానం సమాధానం చోద్యం వైరాగ్యమేవ చ।
అస్తేయం బ్రహ్మచర్యం చ తథాఽసంగ్రహమేవ చ॥ 34
ఏవం దోషా మదస్యోక్తాః తాన్ దోషాన్ పరివర్జయేత్।
తథా త్యాగోఽప్రమాదశ్చ స చాప్యష్టగుణో మతః॥ 35
1. సత్యం, 2. ధ్యానం, 3. సమాధి, 4. తర్కం, 5. వైరాగ్యం, 6. దొంగతనం లేకపోవడం, 7. బ్రహ్మచర్యం, 8. సంపద కూడబెట్టకుండటం. ఇలాగే మదం యొక్క దోషాలు కూడా చెప్పారు. వాటిని వదలిపెట్టాలి. అలాగే త్యాగం, అప్రమాదం అనే వాని స్వరూపమూ చెప్పాను. అది ఎనిమిది గుణాలు కలది. (34,35)
అష్టౌ దోషాః ప్రమాదస్య తాన్ దోషాన్ పరివర్జయేత్।
ఇంద్రియేభ్యశ్చ పంచభ్యః మనసశ్చైవ భారత।
అతీతానాగతేభ్యశ్చ ముక్త్యుపేతః సుఖీ భవేత్॥ 36
ప్రమాదానికి(అశ్రద్ధ) ఎనిమిది దోషాలున్నాయి. వానిని విడిచిపెట్టాలి. అయిదు ఇంద్రియాల వల్ల అయిదు, మనసు వల్ల ఒకటి. ఇప్పటికే వచ్చినది ఒకటి ఇకముందు రాబోయేది ఒకటి ఇలా మొత్తం ఎనిమిది. వీనిని విడిచిపెడితే వాడు సుఖం పొందుతాడు. (36)
సత్యాత్మా భవ రాజేంద్ర సత్యే లోకాః ప్రతిష్ఠితాః।
తాంస్తు సత్యముఖానాహుః సత్యే హ్యమృత మాహితామ్॥ 37
అవః 22వ శ్లోకంలో దమ, త్యాగ, అప్రమాదాలు సత్యమూలాలని చెప్పాడు. దాని వివరణ ఇది.
రాజా! సత్యం మీద మనసు పెట్టు. సత్యంలోనే లోకాలు నిలుస్తున్నాయి. దమ, త్యాగ, అప్రమాదాలు సత్య ముఖాలని అందుకే అన్నారు. సత్యంలోనే మోక్షం ఉంది. (37)
నివృత్తేనైవ దోషేణ తపోవ్రతమిహాచరేత్।
ఏతద్ధాతృకృతం వృత్తం సత్యమేవ సతాం వ్రతమ్॥ 38
దోషాలు వదలి తపోవ్రతాన్ని ఆచరించాలి. ఇది విధి చేసిన నియమం. సజ్జనులకు సత్యమే వ్రతం. (38)
దోషై రేతై ర్విముక్తస్తు గుణై రేతైః సమన్వితః।
ఏతత్సమృద్ధ మత్యర్థం తపో భవతి కేవలమ్॥ 39
ఈ దోషాలు విడిచి, ఈ గుణాలతో కూడి చేసిన వాని తపస్సే సమృద్ధమై కైవల్యం చేకూరుతుంది. (39)
యన్మాం పృచ్ఛసి రాజేంద్ర సంక్షేపాత్ ప్రబ్రవీమి తే।
ఏతత్పాపహరం పుణ్యం జన్మమృత్యు జరాపహమ్॥ 40
రాజా! నీ వడిగిన దాన్ని నీకు సంక్షేపంగా చెప్పాను. ఇది పాపం హరించి పుణ్యం కలిగిస్తుంది. అంతేకాదు. జనన మరణాలు, ముసలితనమూ లేకుండా చేస్తుంది. (40)
ధృతరాష్ట్ర ఉవాచ
ఆఖ్యావ పంచమై ర్వేదైః భూయిష్ఠం కథ్యతే జనః।
తథా చాన్యే చతుర్వేదాః త్రివేదాశ్చ తథా పరే॥ 41
అపుడు ధృతరాష్ట్రుడు ఇలా ప్రశ్నించాడు. ఇతిహాస పురాణాలతో కలసిన నాలుగు వేదాలూ చెప్పే పరబ్రహ్మం అంటే జగత్తే అని కొందరంటారు. అసలు కొందరు నాలుగు వేదాలంటారు. మరికొందరు మూడువేదాలు అంటారు. (41)
ద్వివేదాశ్చైకవేదాశ్చ అప్యనృచశ్చ తథాపరే।
తేషాంతు కతరః సః స్యాద్ యమహం వేద వై ద్విజమ్॥ 42
కొందరు ద్వివేదులు. మరికొందరు ఏకవేదులు. అసలు ఋక్కు అనేదే లేదనే వారు కొందరు. వీరిలో ఎవరు బ్రహ్మవేత్త అని నేను భావించాలి? (42)
సనత్సుజాత ఉవాచ
ఏకస్య వేదస్యాజ్ఞానాద్ వేదాస్తే బహవః కృతాః।
సత్యస్యైకస్య రాజేంద్ర సత్యే సత్యే కశ్చిదవస్థితః॥ 43
సనత్సుజాతుడు ఇలా చెప్పాడు. రాజా! తెలుసుకోవలసినది ఒకటే. అది సత్యమయిన బ్రహ్మము. ఒక్క సత్యం కోసం ఎన్నో వేదాలు తయారయ్యాయి. సత్యము నందు నిలిచే వాడొకడే. బ్రహ్మమును పొందడం కష్టం అని భావం. (43)
ఏవం వేద మవిజ్ఞాయ ప్రాజ్ఞోఽహ మితి మన్యతే।
దాన్ మధ్యయనం యజ్ఞః లోభాదేతత్ ప్రవర్తతే॥ 44
ఇలా పరబ్రహ్మస్వరూపం తెలియకుండానే నేను తెలివిగల వాడ ననుకొంటాడు. మానవుడు(బాహ్యసుఖ) లోభంతో దానం, అధ్యయనం, యజ్ఞం ఆచరిస్తున్నాడు మానవుడు. (44)
సత్యాత్ ప్రచ్యవమానానాం సంకల్పశ్చ తథా భవేత్।
తతో యజ్ఞః ప్రతాయేత సత్యస్యైవావధారణాత్॥ 45
సత్యంనుండి జారిపోతున్న వారికి(ఊహలు) సంకల్పాలు కూడా అటువంటివే(జారుపాటు ఊహలే) కలుగుతాయి. (45)
ఇచట సత్యస్యానవధారణాత్ అని పాఠమున్నది. దీనిని బట్టి శంకరాచార్యులు 'బ్రహ్మపదార్థము తెలియకపోవుటచే యజ్ఞము విస్తరింపబడుతోంది, అని వ్యాఖ్యానించారు.
సత్యస్య ఏవ అవధారణాత్ అనుపాఠము నంగీకరించి నీకకంఠుడు సత్యమనగా వేదవచన మనియు అవేదవచనమును మాత్రమే ప్రమాణముగా గొనుటచే యజ్ఞములు పెంపొందును అనియు వ్యాఖ్యానించాడు.
"జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత" ఇటువంటివి వేదవచనాలు 'స్వర్గం కావాలనుకొన్నవాడు జ్యోతిష్టోమ యాగం చెయ్యాలి' అని దీని అర్థం.
మనసాన్యస్య భవతి వాచాన్యస్యాథ కర్మణా।
సంకల్పసిద్ధః పురుషః సంకల్పానధితిష్ఠతి॥ 46
ఒకనికి మనసు చేతనే యజ్ఞం ఏర్పడుతుంది. మరొకనికి వాక్కు చేత. ఇంకొకనికి కర్మచేత యజ్ఞం సిద్ధిస్తుంది. సంకల్ప సిద్ధుడయిన పురుషుడు సంకల్పాలను పొందుతాడు. (46)
వి॥ ఇందులో మొదటిది మానసయజ్ఞం. రెండవది వాగ్యజ్ఞం. మూడవది కర్మయజ్ఞం - వీనిలో మొదటిది శ్రేష్ఠం - దాని కంటె రెండవది, రెండవదాని కంటే మూడవది తక్కువవి.
అనైభృత్యేన చైతస్య దీక్షిత వ్రత మాచరేత్।
నామైతద్ధాతు నిర్వృత్తం సత్యమేవ సతాం పరమ్॥ 47
పరబ్రహ్మం మీద ఈ సంకల్పం దృఢంగా నిశ్చలంగా నిలవదు. దానికోసం దీక్ష. వ్రతమూ పూనాలి. (దీక్ష వ్రతాదేశే అని ధాతువు. ఆ ధాతువునుండి దీక్ష ఏర్పడింది.) అందుచేత సన్మార్గులకు సత్యమే శ్రేష్ఠం. (47)
వి॥సం॥ దీక్షితములంటే బిచ్చమెత్తుట, మౌనం పాటించడం మొదలయినవి (నీల)
జ్ఞానం వై నామ ప్రత్యక్షం పరోక్షం జాయతే తపః।
విద్యాద్ బహుపఠన్తం తు ద్విజం వై బహుపాఠినమ్॥ 48
జ్ఞానఫలం ప్రత్యక్షంగా కలుగుతుంది. తపఃఫలం పరోక్షంగా కలుగుతుంది. ఎక్కువగా వేదాలు చదవడం మాత్రమే చేసే ద్విజుడు 'బహుపాఠి' అనబడతాడు కాని జ్ఞానికాడు. (48)
తస్మాత్ క్షత్రియ మా మంస్థా జల్పితేనైవ వై ద్విజమ్।
య ఏవ సత్యాన్నాపైతి స జ్ఞేయో బ్రాహ్మణస్త్వయా॥ 49
రాజా! కేవలం వేదాలు వల్లించి నంత మాత్రాన ద్విజుడని అనుకోకు. సత్యం నుండి తొలగని వాడే బ్రాహ్మణుడని తెలుసుకో. (49)
ఛందాంసి నామ క్షత్రియ తాన్యథర్వా
పురా జగౌ మహర్షిసంఘ ఏషః।
ఛందోవిదస్తే య ఉత నాధీత వేదా
న వేదవేద్యస్య విదుర్హి తత్త్వమ్॥ 50
రాజా! అథర్వమహర్షి పూర్వం వేదాలు కీర్తించాడు. తరువాత ఋషులసముదాయం గానం చేశారు. పఠించి అర్థం తెలిసినంతమాత్రాన వారిని ఛందోవేత్తలనలేము. వేద వేద్యమయిన పరమాత్మ యొక్క తత్త్వం తెలిస్తేనే వేదం తెలిసినట్లు - వారే వేదవేత్తలు. (50)
ఛందాంసి నామ ద్విపదాం వరిష్ఠ
స్వచ్ఛంద యోగేన భవంతి తత్ర।
ఛందో విదస్తేన చ తానధీత్య
గతా న వేదస్య న వేద్య మార్యాః॥ 51
మానవోత్తమా! పరమాత్మ విషయంలో వేదాలు స్వతంత్రంగా ప్రవరిస్తాయి అందువలన కేవలం వేదంవల్లనే ఆత్మ తత్త్వాన్ని పొందరనేదీ లేదు. (51)
న వేదానాం వేదితా కశ్చిదస్తి
కశ్చి త్త్వేతాన్ బుధ్యతే వాఽపి రాజన్।
యో వేద వేదా న్న స వేద వేద్యం
సత్యే స్థితో యస్తు స వేదవేద్యమ్॥ 52
వేదరహస్యం అందరికీ తెలియదు. వేదాలతత్త్వం ఒకానొకనికి తెలుస్తుంది. కేవలం వేదాలు వల్లించితే తత్త్వం తెలిసినట్లుకాదు. సత్యమెరిగిన వారికే పరతత్త్వం తెలుస్తుంది. (52)
న వేదానాం వేదితా కశ్చిదస్తి
వేద్యేన వేదం న విదుర్న వేద్యమ్।
యో వేద వేదం స చ వేద వేద్యం
యో వేద వేద్యం న స వేద సత్యమ్॥ 53
మనస్సు మొదలయినవి మనం తెలుసుకోవలసివే కాని అవి వేటిని తెలుసుకోలేవు. అనగా వేద్యములు. మనసుతో ఆత్మను ఎవరూ తెలసుకోలేరు. ఆత్మకంటె ఇతరమయిన జగత్తూ వారికి తెలియదు. కేవలం ఆత్మ నెరిగిన వారికే తద్భిన్నమయినదీ తెలుస్తుంది. అనాత్మను మాత్రమే తెలుసుకొన్నవారికి పరతత్త్వం తెలియదు. (53)
యో వేద వేదాన్ స చ వేద వేద్యం
న తం విదుర్వేదవిదో న వేదాః।
తథాపి వేదే న విదంతి వేదం
యే బ్రాహ్మణా వేదవిదో భవంతి॥ 54
ప్రమాణాలన్నీ తెలిసినది చిదాత్మ - దానికే పరతత్త్వం తెలుస్తుంది. ఆ చిదాత్మను ప్రమాణాలు తెలుసుకోలేవు. అయినా ఒకమార్గం ఉంది. వేద రహస్యాలు తెలిసి, అంతః కరణసుద్ధితో బ్రహ్మజ్ఞానులు మాత్రం తెలుసుకుంటారు. అదికూడా ఆ వేదవాక్యంతోనే. (54)
ధామాంశభాగస్య తథా హి వేదా
యథా హి శాఖా హి మహీరుహస్య।
సంవేదనే చైవ యథాఽఽమనంతి
తస్మిన్ హి సత్యే పరమాత్మనోఽర్థే॥ 55
చంద్రరేఖను చూడటానికి చెట్టుకొమ్మ సూచక మవుతుంది. (అనగా చెట్టుకొమ్మను ముంచుచూచి దాని ప్రక్కనే ఉంది చంద్రరేఖ చూడమంటారు. అపుడు చంద్రరేఖకు చెట్టుకొమ్మ సూచకమంటారు) అలాగే వేదాలు పరమాత్మ విషయంలో సూచకములవుతాయి. (55)
అవః గురువు లక్షణాలు చెపుతున్నాడు.
అభిజానామి బ్రాహ్మణం వ్యాఖ్యాతారం విచక్షణమ్।
యశ్ఛిన్నవిచికిత్సః స వ్యాచష్టే సర్వసంశయాన్॥ 56
సందేహాలు నశించి, ఇతరుల సందేహాలు తీర్చగలవాడు, వ్యాఖ్యానం చేయగల నిపుణుడై, వివేకం కలవాడు బ్రహ్మవేత్త అని నేను భావిస్తాను. (56)
నాస్య పర్యేషణం గచ్ఛేత్ ప్రాచీనం నోత దక్షిణమ్।
నార్వాచీనం కుతస్తిర్యక్ నాదిశం తు కథంచన॥ 57
ఆ పరమాత్మకోసం తూర్పు, దక్షిణం, మూలలకు వెళ్లవలసిన పనిలేదు. ప్రక్కలకూ వెదకవలసినపనిలేదు. అతడు అంతటా ఉన్నవాడు. (57)
తస్య పర్యేషణం గచ్ఛేత్ ప్రత్యర్థిషు కథంచన।
అవిచిన్వన్నిమం వేదే తపః పశ్యతి తం ప్రభుమ్॥ 58
చూడాలని తపనతో వెదకితే పరమాత్మను వ్యతిరేక ప్రదేశాల్లో చూడాలి. వేదాల్లో పట్టుబడని ఆ పరమాత్మను తపస్సు చూస్తుంది. (అనగా తపస్వి చూడగలుగుతాడు). (58)
తూష్ణీం భూత ఉపాసీత న చేష్టేన్మనసాపి చ।
ఉపావర్తస్వ తద్బ్రహ్మ అంతరాత్మని విశ్రుతమ్॥ 59
శరీరాన్ని, వాక్కును, మనస్సును పని చేయనీయకుండా కూర్చుని హృదయంలో ప్రసిద్ధుడయిన ఆ పరబ్రహ్మను చేరాలి. (59)
మౌనాన్న స మునిర్భవతి నారణ్యవసనాన్మునిః।
స్వలక్షణంతు యో వేద స మునిః శ్రేష్ఠ ఉచ్యతే॥ 60
మౌనంతో మానవుడు ముని కాలేడు. అడవిలో ఉన్నంతమాత్రాన ముని కాడు. ఆత్మలక్షణం తెలిసినవాడే మునిశ్రేష్ఠు డనిపించుకొంటాడు. (60)
సర్వార్థానాం వ్యాకరణాద్ వైయాకరణ ఉచ్యతే।
తన్మూలతో వ్యాకరణం వ్యాకరోతీతి తత్తథా॥ 61
సర్వార్థాలను విడమరిచి చెప్పడం వల్ల బ్రహ్మజ్ఞానికి వైయాకరణుడని కూడ పేరు. మూల కారణమయిన పరబ్రహ్మను పొంది అతడు సర్వమునూ వ్యాకరిస్తున్నాడు. (61)
వి॥సం॥ వ్యాకరణమంటే విడమరచి చెప్పడం. ఆత్మను అనాత్మను విడమరచి చెపుతాడు బ్రహ్మజ్ఞాని. అందుకే అతడు వైయాకరణుడు చేసేపని చేస్తున్నాడు. (నీల)
ప్రత్యక్షదర్శీ లోకానాం సర్వదర్శీ భవేన్నరః।
సత్యే వై బ్రాహ్మణస్తిష్ఠన్ త ద్విద్వాన్ సర్వవిద్భవేత్॥ 62
లోకాలన్నీ తిరిగి చూడగలిగిన మానవుని సర్వదర్శి అంటారు. అలాగే సత్యమందే నిలిచి బ్రహ్మజ్ఞానం పొందిన విద్వాంసుడు సర్వజ్ఞుడవుతాడు. (62)
ధర్మాదిషు స్థితోఽప్యేవం క్షత్రియ బ్రహ్మ పశ్యతి।
వేదానాం చాణుపూర్వ్యేణ ఏతద్బుద్ధ్యా బ్రవీమి తే॥ 63
రాజా! ధర్మాదులలో నిలిచిన వాడూ, వేదాలను క్రమంగా అధ్యయనం చేసిన వాడూ పరమాత్మ దర్శనం చేయగలుగుతారు. నేను నిశ్చయించుకొన్న ఈ అంశాన్ని నీకు తెలియజేస్తున్నాను.(63)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగ పర్వణి సనత్సుజాత పర్వణి సనత్సుజాత వాక్యే త్రిచత్వారింశోఽధ్యాయః॥ 43॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగ పర్వమున సనత్సుజాత పర్వమను ఉపపర్వమున
సనత్సుజాత వాక్యమను నలువది మూడవ అధ్యాయము. (43)