42. నలువది రెండవ అధ్యాయము
ధృతరాష్ట్రుని ప్రశ్నలు - సనత్సుజాతుని సమాధానము.
వైశంపాయన ఉవాచ
తతో రాజా ధృతరాష్ట్రో మనీషీ
సంపూజ్య వాక్యం విదురేరితం తత్।
సనత్సుజాతం రహితే మహాత్మా
పప్రచ్ఛ బుద్ధిం పరమాం బుభూషన్॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు. వెంటనే మంచి తెలివి గల మహాత్ముడు ధృతరాష్ట్ర మహారాజు విదురుని మాటను గౌరవిస్తూ జ్ఞానకాంక్షతో ఏకాంతంగా సనత్సుజాతుని ఇలా అడిగాడు. (1)
ధృతరాష్ట్ర ఉవాచ
సనత్సుజాత యదిదం శృణోమి
న మృత్యు రస్తీతి తవ ప్రవాదమ్।
దేవాసురా హ్యాచరన్ బ్రహ్మచర్యం
అమృత్యవే తత్కతరన్ను సత్యమ్॥ 2
ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. సనత్సుజాతా! మీరు మృత్యువు అనేది లేదని చెపుతూ ఉంటారట. మరి అయితే దేవతలూ, రాక్షసులూ మృత్యువు రాకూడదని బ్రహ్మచర్యవ్రతం ఆచరించారట. ఈ రెండింటిలో ఏది నిజం? (2)
సనత్సుజాత ఉవాచ
అపృచ్ఛః కర్మణా యచ్చ మృత్యుర్నాస్తీతి చాపరమ్।
శృణు మే బ్రువతో రాజన్ యథైతన్మా విశంకిథాః॥ 3
సనత్సుజాతుడు ఇలా చెప్ప నారంభించాడు. రాజా! బ్రహ్మచర్యంతో మృత్యువు లేకుండా పోతుందా? లేక అసలు మృత్యువే లేదా? అని గదా నీ ప్రశ్న. ఇవి రెండూ విరుద్ధంగా ఉన్నాయని అనుకోకు. చెపుతా - విను. (3)
ఉభే సత్యే క్షత్రియైతస్య విద్ధి
మోహాన్మృత్యుః సంమతోఽయం కవీనామ్।
ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి
తథాఽప్రమాద మమృతత్వం బ్రవీమి॥ 4
రాజా! ఒకమనిషికే ఈ రెండూ - సత్యాలే అని తెలుసుకో. మోహం(అజ్ఞానం) వల్లనే మృత్యువు కలుగుతుందని ప్రజ్ఞకలవా రనుకొంటారు. కాని ప్రమాదమే మృత్యువని నే నంటాను. అలాగే జ్ఞానమే(వస్తుతత్త్వం సరిగా తెలియటమే జ్ఞానం) అమృతత్వం అని నా అభిప్రాయం.
ప్రమాదాఅద్వై అసురాః పరాభవన్
అప్రమాదా ద్బ్రహ్మభూతా భవంతి।
నైవ మృత్యు ర్వ్యాఘ్ర ఇవాత్తి జంతూన్
న హ్యస్య రూప ముపలభ్యతే హి॥ 5
అసురులు ప్రమాదం వల్లనే మృత్యువుకు వశమయ్యారు. అప్రమాదం(జ్ఞానం) వల్ల బ్రహ్మమే అవుతారు. ఈ అజ్ఞానరూపమయిన మృత్యువు పెద్దపులిలాగా జంతువులను మ్రింగదు. ఆ మృత్యువుకు రూపమే లేదు గదా! (5)
యమం త్వేకే మృత్యుమతోఽన్యమాహుః
ఆత్మావసన్న మమృతం బ్రహ్మచర్యమ్।
పితృలోకే రాజ్య మనుశాస్తి దేవః
శివః శివానా మశివోఽశివానామ్॥ 6
కొంతమంది ఆత్మలో కల్పించుకొన్న యముని మృత్యువని అంటారు. బ్రహ్మచర్యమే నిజానికి మోక్షకారణం. యముడు పుణ్యం చేసుకొన్న వారికి శుభమూ, పాపం చేసుకొన్న వారికి అశుభమూ కలిగిస్తాడు. అతడు పితృలోకం పాలించే దేవుడు. (6)
అస్యాదేశా న్నిస్సరతే నరాణాం
క్రోధః ప్రమాదో లోభరూపశ్చ మృత్యుః।
అహంగతే నైవ చరన్విమార్గాన్
న చాత్మనో యోగముపైతి కశ్చిత్॥ 7
ఈ యముని ఆజ్ఞవల్లనే మానవుల్లో క్రోధమూ, పొరపాటు, లోభమూ అనే వాటితో బయటపడే మృత్యువు కలుగుతోంది. ఆ అహంకారంతో జీవుడు అపమార్గంలో తిరుగుతూ ఆత్మతో కలియటం లేదు. (7)
తే మోహితా స్తద్వశే వర్తమానాః
ఇతః ప్రేతా స్తత్ర పునః పతంతి॥7
తతస్తాన్ దేవా అనువిప్లవంతే
అతో మృత్యుర్మరణాఖ్యాముపైతి॥ 8
(ఆత్మతో కలియక పోతే ఏం? అనేదాని సమాధానం) అలా కలియక పోతే మానవులు మోహం పొందుతారు. మోహితులై క్రోధాదిరూమయిన మృత్యువుకు వశమై ఇక్కడ నుండి యమలోకానికి వెళ్లి అక్కడి నుండి ఇక్కడకు పడుతూ ఉంటారు. వాని ననుసరించే ఇంద్రియాలూ(దేవాః) ప్రవర్తిస్తాయి. అందుకే మృత్యువుకు మర్ణమనే పేరు ఏర్పడింది? (8)
కర్మోదయే కర్మఫలానురాగాః
తత్రాను తే యాంతి న తరంతి మృత్యుమ్।
సదర్థయోగానవగమాత్ సమంతాత్
ప్రవర్తతే భోగయోగేన దేహీ॥ 9
జీవికి పుట్టుకతోనే కర్మ పుడుతుంది. ఆ కర్మ ఫలాలు అనుభవించాలను అనురాగం పుడుతుంది. అది భోగవాసన. దానితో స్వర్గాదులకు పోతున్నారు మానవులు. కాని మృత్యువు నుండి తప్పించుకొనడం లేదు. పరబ్రహ్మ స్వరూపం తెలుసుకోవడానికి అవసరమయిన యోగం తెలియక దేహి భోగాసక్తితో అంతటా తిరుగుతున్నాడు. (9)
తద్వై మహామోహన మింద్రియాణాం
మిథ్యార్థ యోగస్య గతిర్హి నిత్యా।
మిథ్యాభియోగాభిహతాంతరాత్మా
స్మరన్నుపాస్తే విషయాన్ సమంతాత్॥ 10
అసత్య విషయాల మీద ఆసక్తి నిత్యమూ ఉండటం అనేదే. ఇంద్రియాలకు పెద్ద మోహం కలిగిస్తుంది. ఈ ఆసక్తినే మిథ్యాభియోగం అంటారు. దీనితో మానవుని అంతరాత్మ దెబ్బతింటుంది. అపుడు మానవుడు ఆ విషయాలనే స్మరిస్తూ, సేవిస్తూ ఉంటాడు. (10)
అభిధ్యా వై ప్రథమం హంతి లోకాన్
కామక్రోధా వనుగృహ్యాశు పశ్చాత్।
ఏతే బాలాన్ మృత్యవే ప్రాపయంత
ధీరాస్తు ధైర్యేణ తరంతి మృత్యుమ్॥ 11
విషయస్మరణమంటే అభిధ్య - ఇదే ముందు లోకులను దెబ్బతీస్తుంది. తరువాత కామక్రోధాలు రెండూ పడగొడతాయి. ఇలా విషయస్మరణ, కామ, క్రోధాలూ మూడూ వివేకంలేని వారిని(బాలురను) మృత్యువుకు అప్పగిస్తాయి. ధీరులు(ధైర్యం, వివేకం, కలవారు) ధైర్యంతో మృత్యువును దాటిపోతారు. (11)
సోఽభిధ్యాయ న్నుత్పతితాన్నిహన్యాత్
అనాదరేణాప్రతిబుధ్యమానః।
నైనం మృత్యు ర్మృతు రివాత్తి భూత్వా
ఏవం విద్వా న్యో వినిహంతి కామాన్॥ 12
మృత్యువును తరించాలనుకొన్నవాడు ఆత్మపదార్థాన్ని ధ్యానిస్తూ ఉప్పొంగే కామాదులను ఆదరింపడు(సేవింపడు). వాటిని గుర్తింపక అనాదరంతో రూపుమాపుతాడు. ఇలా కామాదులను చంపేవానిని మృత్యువు వశం చేసుకోలేదు. ఇతరులను తిన్నట్లు వీనిని తినలేదు. కామం లేని వాడికి మృత్యుభయం లేదన్నమాట. (12)
కామాసుసారీ పురుషః కామానను వినశ్యతి।
కామాన్ వ్యుదస్య ధునుతే యత్కించిత్ పురుషో రజః॥ 13
కామాదుల వెంటపడే పురుషుడు కామాదులతో పాటు తానూ చనిపోతాడు. అలా కాక కామాదులను ముందు గెంటివేస్తే ఏమాత్రం దుఃఖం మిగిలినా దాన్ని కూడా వదిలించుకొంటాడు. (13)
తమోఽప్రకాశో భూతానాం నరకోఽయం ప్రదృశ్యతే।
ముహ్యంత ఇవ ధావంతి గచ్ఛంత శ్వభ్రవత్ సుఖమ్॥ 14
అసలీ కామం కారుచీకటి. ఇందులో ఏమాత్రం వెలుగు లేదు. ప్రాణులకు ఇది నరకంగా కనిపిస్తుంది. కాని త్రాగి మైకంలో ఉన్నవారు గుంటల్లో పడిపోయినట్లు సంసారం సుఖమనుకొని పరుగులు పెడుతున్నారు. (14)
అమూఢవృత్తేః పురుషస్యేహ కుర్యాత్
కిం వై మృత్యుస్తార్ణ ఇవాస్య వ్యాఘ్రః।
అమన్యమానః క్షత్రియ కించిదన్యత్
నాధీయీత నిర్ణుదన్నివాస్య చాయుః॥ 15
తెలివిగల మానవుడు కాముని ఆయువును చితకగొట్టాలి. సుఖాలనుకొనే వాటిని మనసులోకి రానివ్వ కూడదు. విషయాలను స్మరించరాదు. అలా అజ్ఞానం పోతే మృత్యువు ఇక గడ్డిపులి లాంటిదే. అదేమీ చేయదు గదా! (15)
స క్రోధలోభౌ మోహవానంతరాత్మా
స వై మృత్యు స్త్వచ్ఛరీరే య ఏషః।
ఏవం మృత్యుం జాయమానం విదిత్వా
జ్ఞానే తిష్ఠన్న బిభేతీహ మృత్యోః।
వినశ్యతే విషయే తస్య మృత్యుః
మృత్యోర్యథా విషయం ప్రాప్య మర్త్యః॥ 16
నీ శరీరంలో మోహవశమై క్రోధలోభరూపంతో ఉన్న అంతరాత్మయే మృత్యువు. ఇలా యముడు మనసులోనే పుడుతున్నాడనే జ్ఞానమెరిగినవాడు యమునికి భయపడడు. ఎలా అంటే లోకంలో మృత్యువుకు వశమయిన శరీరం నశించిపోతోంది. అలాగే జ్ఞానం కలగగానే అజ్ఞానం అనే మృత్యువు కూడా నశించి పోతుంది. (16)
ధృతరాష్ట్ర ఉవాచ
యానేవాహు రిజ్యయా సాధు లోకాన్
ద్విజాతీనాం పుణ్యతమాన్ సనాతనాన్।
తేషాం పరార్థం కథయంతీహ వేదాః
ఏతద్విద్వాన్నోపైతి కథమ్ ను కర్మ॥ 17
అపుడు - ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు. ద్విజులకు యజ్ఞయాగాది కర్మల ద్వారా శాశ్వత పుణ్య లోకాలు కలుగుతాయంటారు. అవి శ్రేష్ఠమని వేదాలూ చెపుతున్నాయి. ఈ విషయం తెలిసినవాడు కర్మమార్గం ఎందుకు పొందడు. (17)
సనత్సుజాత ఉవాచ
ఏవం హ్యవిద్వా నుపయాతి తత్ర
తత్రార్థజాతం చ వదంతి వేదాః।
అనీహ ఆయాతి పరం పరాత్మా
ప్రయాతి మార్గేణ నిహత్య మార్గాన్॥ 18
దానికి సనత్సుజాతుడు ఇలా చెప్పాడు. నీ వన్నట్లు విద్వాంసుడు కానివాడు అక్కడకు చేరుతాడు. భోగమోక్షం అనేదాన్ని వేదాలూ చెపుతున్నాయి. జీవుడు నిష్కాముడై నిర్గుణ పరమాత్మను చేరుతాడు. మిగిలిన మార్గాలను తొలగించుకొని సుషుమ్నా మార్గం ద్వారా (నిర్గుణ) మోక్షాన్ని పొందుతాడు. (18)
ధృతరాష్ట్ర ఉవాచ
కోఽసయ్ నియుంక్తే తమజం పురాణం
స చేదిదం సర్వమనుక్రమేణ।
కిం వాఽస్య కార్య మథవా సుఖం చ
తన్మే విద్వన్ బ్రూహి సర్వం యథావత్॥ 19
అపుడు ధృతరాష్ట్రుడు మళ్లీ ఇలా అడిగాడు మహాత్మా! చావూ పుట్టుకా లేని పురాణపురుషుడయిన పరమాత్మను ఎవరు నడుపుతారు? ఎవరూ లేరు, అతడే అన్నింటినీ ప్రవర్తింపజేస్తూన్నాడంటే అసలు అతనికి ఈ పని ఎందుకు? దీనివల్ల అతనికి కలిగే సుఖం ఏమిటో ఉన్నదున్నట్లు చెప్పండి. (19)
సనత్సుజాత ఉవాచ
దొషో మహానత్ర విభేద యోగే
హ్యనాది యోగేన భవంతి నిత్యాః।
తథాస్య నాధిక్య మపైతి కించిద్
అనాది యోగేన భవంతి పుంసః॥ 20
దానికి సనత్సుజాతుడిలా చెప్పాడు. జీవాత్మ పరమాత్మల మధ్య భేదకల్పనం దోషం. అనాది అయిన మాయతో సంబంధం వలన జివునకు కామసుఖాదులతో సంబంధ మేర్పడుతుంది. అంతమాత్రం చేత పరమాత్మ ఆధిక్యానికి నష్టం లేదు. అనాది అయిన మాయ వలన జీవులు మరల ఏర్పడుతున్నాయి. (20)
య ఏత ద్వా భగవాన్ స నిత్యః
వికారయోగేన కరోతి విశ్వమ్।
తథా చ తచ్ఛక్తి రితి స్మ మన్యతే
తథార్థయోగే చ భవంతి వేదాః॥ 21
కనిపించే యీ జగత్తు ఆ పరమాత్మయే. అతడు నిత్యుడు. అతడే మాయతో విశ్వాన్ని చేస్తున్నాడు. ఆ మాయయే పరమాత్మశక్తి అని వేదాలు భావిస్తున్నాయు. అల శక్తికీ, శక్తిమంతునికీ అభేదాన్ని వేదాలే చెపుతున్నాయి. (21)
ధృతరాష్ట్ర ఉవాచ
యేఽస్మిన్ ధర్మా న్నాచరంతీహ కేచిత్
తథా ధర్మాన్ కేచిదిహాచరంతి।
ధర్మః పాపేన ప్రతిహన్యతే స్విత్
ఉతాహో ధర్మః ప్రతిహంతి పాపమ్॥ 22
అపుడు ధృతరాష్ట్రుడు ఇలా ప్రశ్నించాడు. ఈ మోక్షం కోసం కొంతమంది ఇక్కడ ధర్మాలను ఆచరించరు. అలాగే కొందరు ధర్మాలను ఆచరిస్తారు. అటువంటపుడు ధర్మం పాపంచేత నశిస్తుందా? లేక పాపం ధర్మంచేత నశిస్తుందా? (22)
సనత్సుజాత ఉవాచ
ఉభయ మేవ తత్రోప యుజ్యతే।
ఫలం ధర్మస్యైవేతరస్య చ॥ 23
సనత్సుజాతుడు ఇలా చెప్పాడు. మోక్షానికి రెండు మార్గాలూ ఉపకరిస్తాయి. ధర్మానికీ, పాపానికీ ఫలం తప్పకుండా వస్తుంది. (23)
తస్మిన్ స్థితే వాప్యుభయం హి నిత్యం
జ్ఞానేన విద్వాన్ ప్రతిహంతి సిద్ధమ్।
తథాన్యథా పుణ్యముపైతి దేహీ
తథాగతం పాపముపైతి సిద్ధమ్॥ 24
మోక్ష విషయంలో సన్యాసం, కర్మం రెండూ నిత్యాలే. విద్వాంసుడు జ్ఞానంతో సిద్ధమైన మోక్షం పొందుతాడు. కర్మలతో పుణ్యాన్ని పొందవచ్చు. అలాగే పాపాన్ని పొందవచ్చు.
(సన్యాసంచేత మోక్షం తప్పక లభిస్తుంది. కర్మలచేత దేవత్వం, తద్ద్వారా మోక్షం పొందవచ్చు. లేదా భ్రష్టుడు కావచ్చు. అందుచేత జ్ఞానం మంచిది.) (24)
గత్వోభయం కర్మణా యుజ్యతే స్థిరం
శుభస్య పాపస్య స చాపి కర్మణా।
ధర్మేణ పాపం ప్రణుదతీహ విద్వాన్
ధర్మో బలీయానితి తస్య సిద్ధిః॥ 25
కర్మఫలం అనుభవంతో నశిస్తుంది. అంటే శుభకర్మ ఫలితమూ, దుష్కర్మ ఫలితమూ రెండూ నశిస్తాయి. తరువాత కూడా జీవుడు అలవాటుగా మళ్లీ కర్మలాచరిస్తాడు. కాని విద్వాంసుడయితే ధర్మంతో పాపం పోగొట్టుకుంటాడు. అంటే ధర్మం కర్మ కంటే బలీయమైనది. అందుకే కాలక్రమేణ కర్మయోగికి కూడ సిద్ధి కలుగుతుంది. (25)
ధృతరాష్ట్ర ఉవాచ
యానిహాహుః స్వస్య ధర్మస్య లోకాన్
ద్విజాతీనాం పుణ్యకృతాన్ సనాతనాన్।
తేషాం క్రమాన్ కథయ తతోఽపి చాన్యాన్
నైతద్విద్వన్ వేత్తుమిచ్ఛామి కర్మ॥ 26
ధృతరాష్ట్రుడు మళ్లీ ఇలా ప్రశ్నించాడు.
ధర్మాచరణం చేసేవారికి పుణ్యంవల్ల సనాతనలోకాలు కలుగుతాయని వేదశాస్త్రాలు చెపుతున్నాయి గదా! వాటిక్రమాన్నీ, అవికాకుండా ఇతరమైన మోక్షమార్గాన్ని చెప్పండి. నాకీ కర్మను గురించి తెలుసుకోవాలని లేదు. (26)
సనత్సుజాత ఉవాచ
యేషాం వ్రతేఽథ విస్పర్ధా బలే బలవతామివ।
తే బ్రాహ్మణా ఇతః ప్రేత్య బ్రహ్మలోకప్రకాశకాః॥ 27
సనత్సుజాతుడు ఇలా సమాధానం చెప్పాడు. బలం విషయంలో బలవంతులకు స్పర్ధ ఉంటుంది. అలాగే బ్రహ్మవేత్తలలోకూడ. వారు చనిపోయాక బ్రహ్మలోకం చేరి ప్రకాశిస్తారు. (27)
యేషాం ధర్మే చ విస్పర్థా తేషాం తద్ జ్ఞాన సాధనమ్।
తే బ్రాహ్మణా ఇతొ ముక్తాః స్వర్గం యాంతి త్రివిష్టపమ్॥ 28
యజ్ఞాది ధర్మాల్లో దీక్ష కలవారికి ఆదీక్షయే జ్ఞానమిస్తుంది. అట్టి వారు స్వర్గాన్ని చేరుతారు. (28)
తస్య సమ్యక్ సమాచారమ్ ఆహు ర్వేదవిదో జనాః।
నైనం మన్యేత భూయిష్ఠం బాహ్యమాభ్యంతరం జనమ్॥ 29
కొందరు వేదవేత్తలు ఆ ధర్మాచరణం చక్కగా చేస్తారు. అదే మంచిదని చేస్తారు. అలా బహిర్గతంగా, అంతర్ముఖంగా అనుకొనే వారిని గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదు. (29)
యత్ర మన్యేత భూయిష్ఠం ప్రావృషీవ తృణోపలమ్।
అన్నం పానం బ్రాహ్మణస్య తజ్జీవేన్నానుసంజ్వరేత్॥ 30
వర్షాకాలంలో ఎక్కువగా గడ్డి మొలుస్తుంది. అలాగే అన్నపానాలు పుష్కలంగా ఉన్నయింటిని ఆశ్రయించి బ్రహ్మజ్ఞాని జీవించాలి. అంతేకాని ఆకలితో ఆత్మను బాధింపరాదు. (30)
యత్రాకథయమానస్య ప్రయచ్ఛత్యశివం భయమ్।
అతిరిక్తమివాకుర్వన్ స శ్రేయా న్నేతరో జనః॥ 31
బ్రహ్మవేత్త తాను అశుభంకరమయిన దేశంలో ఉన్నా, భయంకర ప్రదేశంలో ఉన్నా దాన్ని గురించి గొప్పగా చెప్పుకోరాదు. తనకు సామర్థ్యం ఉన్నా ఆగొప్పతనం ప్రకటించుకోరాదు. అతడే శ్రేష్ఠుడు. (31)
యో వా కథయమానస్య హ్యాత్మానమ్ నానుసంజ్వరేత్।
బ్రహ్మస్వం నోపయుంజీత తదన్నం సంమతం సతామ్॥ 32
ఒకవేళ ఎవరయినా అలా చెప్పుకొన్నా గృహస్థుడు పరితాపం చెందకూడదు. అసూయ పడకూడదు. బ్రహ్మస్వాన్ని ఉపయోగించని అటువంటి గృహస్థుని భోజనాన్ని స్వీకరించటమే సన్యాసికి తగినది. (32)
యథా స్వం వాన్తమశ్నాతి శ్వా వై నిత్యమభూతయే।
ఏవం తే వాంత మశ్నంతి స్వ వీర్యస్యోపసేవనాత్॥ 33
కుక్క తాను కక్కిన కూటినే మళ్లీ తింటుంది. అది దానిని అనర్థమే కలిగిస్తుంది. అలాగే సన్యాసి తన సామర్థ్యాన్ని పాండిత్యాన్ని ప్రదర్శించి బ్రతకకూడదు. అలా ప్రదర్శిస్తే కక్కిన కూడు తిన్నట్లే. పాండిత్యం ప్రదర్శించి భిక్ష స్వీకరించరాదని భావం. (33)
నిత్యమజ్ఞాత చర్యా మే ఇతి మన్యేత బ్రాహ్మణః।
జ్ఞాతీనాం తు వసన్ మధ్యే తం విదుర్బ్రాహ్మణం బుధాః॥ 34
జ్ఞాతుల మధ్య ఉన్నా సన్యాసి తాను అజ్ఞాతంగానే (తనయోగశక్తి చెప్పుకోకుండా) ప్రవర్తించాలి. అపుడే పండితులతనిని బ్రహ్మవేత్త అని అంటారు. (34)
కోహ్యనంతర మాత్మానం బ్రాహ్మణో హంతు మర్హతి।
నిర్లింగ మచలం శుద్ధం సర్వద్వైతవివర్జితమ్॥ 35
ఈ సత్ప్రవర్తన లేకపోతే ఏ బ్రాహ్మణుడూ పరమాత్మను పొందలేడు. ఆ పామాత్మ అడ్డుగోడలు లేనివాడు. అనుమానాది ప్రమాణాలకు లొంగనివాడు. అంతటా స్థిరంగా ఉన్నవాడు. పరిసుద్ధుడు. ద్వైతభావాలేవీ లేనివాడు. (35)
తస్మాద్ధి క్షత్రియస్యాపి బ్రహ్మా వసతి పశ్యతి॥ 36
ఆ సత్ప్రవర్తన లేని బ్రాహ్మణుని కంటె ఉత్తమ క్షత్రియుడు మేలు. అతడిని కూడ పరబ్రహ్మము తన ప్రకాశంతో నింపుతుంది. దర్శిస్తుంది. అనగా అజ్ఞాత చర్యారూపమయిన సత్ప్రవర్తన ముఖ్యమన్నమాట. (36)
యోఽన్యథా సంత మాత్మానం అన్యథా ప్రతిపద్యతే।
కిం తేన న కృతం పాపం చౌరేణాత్మాపహరిణా॥ 37
దేహాదుల కంటే వేరయిన ఆత్మను దేహాది రూపాలతో భావించేవాడు ఆత్మను అపహరించే దొంగ అవుతాడు. వాడు అన్ని పాపాలూ చేసినట్లే. (37)
అశ్రాంతః స్యా దనాదాతా సంమతో నిరుపద్రవః।
శిష్టో న శిష్టవత్సస్యాద్ బ్రాహ్మణో బ్రహ్మవిత్కవిః॥ 38
బ్రహ్మతత్త్వం తెలుసుకోవాలనుకొన్నవాడు అలసట ఎరుగకుండ ప్రయత్నించాలి. ఎవరి నుండీ ఏమీ స్వీకరింపరాదు. అందరికీ ఇష్టుడై ఉండాలి. ఏ కష్టమూ తాను పడకూడదు. ఇతరులకు కలిగింపకూడదు. సత్ప్రవర్తన కలిగి ఉండాలి. కాని ప్రకటించుకోరాదు. అపుడే క్రాంతదర్శియై బ్రహ్మజ్ఞాని అవుతాడు. (38)
అనాఢ్యా మానుషే విత్తే ఆఢ్యా దైవే తథా క్రతౌ।
తే దుర్ధర్షా దుష్ప్రకంప్యాఃతాన్ విద్యాద్ బ్రహ్మణ స్తమమ్॥ 40
ఆ బ్రహ్మజ్ఞానులు లౌకిక మయిన ధనం లేనివారు. దైవసంబంధమయిన ధనం విషయంలో ఉన్నవారు. అలాగే ఉపాసన విషయంలో కూడా ధనవంతులు. ఎవరూ వారిని వశపరచుకోలేరు. కదపలేరు. వారు బ్రహ్మస్వరూపులని తెలుసుకోవాలి. (39)
సర్వాన్ స్విష్టకృతో దేవాన్ విద్యాద్య ఇహ కశ్చన।
న సమానో బ్రాహ్మణస్య తస్మిన్ ప్రయతతే స్వయమ్॥ 41
స్విష్టకృత్తులయిన దేవతలను తెలిసికొన్నవాడు కూడ బ్రహ్మజ్ఞానితో సమానుడు కాడు. ఎందుచేత నంటే అతడు స్విష్టం కోసం స్వయంగా ప్రయత్నిస్తాడు. కాని జ్ఞానఫలమయిన మోక్షం స్వతఃసిద్ధమయినదీ, నిత్యమూ. (40)
య మప్రయతమానం తు మానయంతి స మానితః।
న మాన్యమానో మన్యేత న మాన్యమభిసంజ్వరేత్॥ 41
ప్రయత్నం లేకుండానే మన్నన పొందేవాడే మాన్యుడు. అతడు మన్నన పొందినా తన్ను మాన్యుడని భావింపడు. అవమానం పొందినా బాధపడడు. (41)
లోకః స్వభావవృత్తిర్హి నిమేషోన్మేషవత్సదా।
విద్వాంసో మానయంతీహ ఇతి మన్యేత మానితః॥ 42
లోకం మన్నించినపుడు అది విద్వాంసుల స్వభావం అనుకొంటాడు. బ్రహ్మజ్ఞాని. కనులు మూతపడటం, తెరచుకోవడం లాంటి లోకస్వభావం అనుకొంటాడు. అంటే సమ్మానానికి పొంగిపోడు. అవమానానికి కుంగిపోడు. (42)
అధర్మనిపుణా మూఢాః లోకే మాయావిశారదాః।
న మాన్యం మానయిష్యంతి మాన్యానామవమానినః॥ 43
మూర్ఖులు అధర్మంలోనూ, మోసంలోనూ అరితేరి మాన్యులను కూడా మన్నించరు. సరిగదా అవమానిస్తారు. (43)
న వై మానం చ మౌనం చ సహితే వసతః సదా।
అయం హి లోకో మానస్య అసౌ మౌనస్య తద్విదుః॥ 44
మానమూ(అహంకారం), మౌనమూ ఎప్పుడూ కలిసి ఉండవు. ఎందుచేతనంటే.... అహంకారానికీ ఈ లోకం నివాసం. మౌనానికి పరలోకం నివాసం. (44)
శ్రీః సుఖస్యేహ సంవాసః సా చాపి పరిపంథినీ।
బ్రాహ్మీ సుదుర్లభా శ్రీర్హి ప్రజ్ఞాహీనేన క్షత్రియ॥ 45
రాజా! లోకంలో సంపద సుఖానికి నిలయం. కాని అది పరలోకానికీ, తత్త్వజ్ఞానానికీ శత్రువు. బ్రహ్మజ్ఞాన సంపద ప్రజ్ఞారహితునికి లభించదు. (45)
ద్వారాణి తస్యేహ పదంతి సంతః
బహుప్రకారాణి దురాధరాణి।
సత్యార్జనే హ్రీర్దమశౌచవిద్యాః
యథా న మోహప్రతిబోధనాని॥ 46
ఈ బ్రహ్మజ్ఞాన సంపదకు చాలా సాధనాలు ఉన్నాయి. అవి చాలా జాగ్రత్తగా రక్షించుకోవాలి. అవి ఇవి. 1. సత్యం, 2. ఆర్జవం, 3. తప్పుపనులకు సిగ్గుపడటం, 4. దమం 5. శౌచము 6. విద్య. ఇవి మోహం కలిగించవు. అనగా అజ్ఞానం అనే మృత్యువును కలిగించవు. (46)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగ పర్వణి సనత్సుజాత పర్వణి ద్విచత్వారింశోఽధ్యాయః॥ 42 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగ పర్వమున సనత్సుజాత పర్వమను ఉపపర్వమున నలుబది రెండవ అధ్యాయము. (42)