24. ఇరువది నాల్గవ అధ్యాయము
యుధిష్ఠిరుని ప్రశ్నలకు సంజయుడు సమాధానమిచ్చుట.
సంజయ ఉవాచ
యథాఽఽత్థ మే పాండవ తత్ తథైవ
కురూన్ కురుశ్రేష్ఠ జనం చ పృచ్ఛసి।
అనామయాస్తాత మనస్వినస్తే
కురుశ్రేష్ఠాన్ పృచ్ఛసి పార్థ యాంస్త్వమ్॥ 1
సంజయుడు పలికాడు. కురుశ్రేష్ఠా! నీవు నన్ను అడిగినట్లుగా అక్కడంతా అలాగే ఉన్నారు. కౌరవులూ, జనులూ కూడ కుశలంగా ఉన్నారు. అభిమానవంతులైన కురుశ్రేష్ఠులంతా నీవడిగినట్లుగా కుశలంగా ఉన్నారు. (1)
సంత్యేన వృద్ధాః సాధవో ధార్తరాష్ట్రే
సంత్యేవ పాపాః పాండవ తస్య విద్ధి।
దద్యాద్ ర్పుభ్యోఽపి హి ధార్తరాష్ట్రః
కుతో దాయాన్ లోపయేద్ బ్రాహ్మణానామ్॥ 2
దుర్యోధనుని దగ్గర సత్పురుషులైన వృద్ధులూ ఉన్నారు. పాపాత్ములైన వారూ ఉన్నారు. దుర్యోధనుడు శత్రువులకైనా దానం చేస్తాడు. ఇక బ్రాహ్మణుల మాన్యాలను ఎలా హరిస్తాడు. (2)
యద్ యుష్మాకం వర్తతే సౌనధర్మ్యమ్
అద్రుగ్ధేషు ద్రుగ్ధవత్ తన్న సాధు।
మిత్రధ్రుక్ స్యాద్ ధృతరాష్ట్రః సపుత్రః
యుష్మాన్ ద్విషన్ సాధువృత్తానసాధుః॥ 3
దుర్యోధనుడు పట్ల ఎప్పుడూ ద్రోహం చెయ్యని మీ పట్ల ధృతరాష్ట్రుడు ద్రోహచింతన చేస్తే అది వానికే మంచిది కాదు. మీవంటి మంచినడవడిక కలవారిని ద్వేషిస్తే ధృతరాష్ట్రుడు మిత్రద్రోహి, చెడ్డవాడు కాగలడు. (3)
న చానుజానాతి భృశం చ తప్యతే
శోచత్యంతః స్థవిరో ఽజాతశత్రో।
శృణోతి హి బ్రాహ్మణానాం సమేత్య
మిత్రద్రోహః పాతకేభ్యో గరీయాన్॥ 4
అజాతశత్రూ! ధృతరాష్ట్రుడు తనకొడుకుల్ని మీ పట్ల ద్రోహం చెయ్యడానికి అనుమతించటంలేదు. పైగా మీపట్ల వారి ద్రోహచింతనకు మనస్సులో మిక్కిలి బాధ పడుతున్నాడు. మిత్రద్రోహం అన్ని పాతకాలకంటే పెద్దది అని చెపుతున్న బ్రాహ్మణుల మాటలను శ్రద్ధగా వింటున్నాడు. (4)
స్మరంతి తుభ్యం నరదేవ సంయుగే
యుద్ధే చ జిష్ణోశ్చ యుధాం ప్రణేతుః।
సముత్కృష్టే దుందుభిశంఖశబ్దే
గదాపాణిం భీమసేనం స్మరంతి॥ 5
రాజా! కౌరవులు యుద్ధ ప్రసంగంలో మీ గురించి, వీరాగ్రేసరుడైన అర్జునుని గురించి స్మరిస్తున్నారు. యుద్ధ సమయంలోని దుందుభి, శంఖధ్వనులు వినబడుతూ ఉన్నపుడు గదాపాణి భీమసేనుడు గుర్తుకు వస్తాడు. (5)
మాద్రీసుతౌ చాపి రణాజిమధ్యే
సర్వా దిశః సంపతంతౌ స్మరంతి।
సేనాం వర్షంతౌ శరవర్షరజస్రం
మహారథౌ సమరే దుష్ప్రకంపౌ॥ 6
శత్రువులు దండెత్తినపుడు మహారథులు, చలింప శక్యంకాని వారూ ఎడతెగకుంఢా బాణవర్షం కురిపిస్తూ అన్ని దిక్కులకూ సంచరిస్తూ ఉండేవారు. వారిని కౌరవులు స్మరిస్తున్నారు. (6)
న త్వేన మన్యే పురుషస్య రాజన్
అనాగతం జ్ఞాయతే యద్ భవిష్యమ్।
త్వం చేత్ తథా సర్వధర్మోపపన్నః
ప్రాప్తః క్లేశం పాండవ కృచ్ఛ్రరూపమ్॥
త్వమేవైతత్ కృచ్ఛ్రగతశ్చ భూయః
సమీకుర్యాః ప్రజ్ఞయాజాతశత్రో॥ 7
అజాతశత్రూ! అన్నిధర్మాలూ తెలిసిన నీవు కూడా ఇంతటి కఠినమైన కష్టాన్ని పొందావంటే, మానవునికి భవిష్యత్తులో జరుగబోయేది ఏమీ తెలియదనుకొంటున్నాను. పాండునందనా! ఇంతటి కష్టంలో ఉన్నప్పటికీ నీవే నీ ప్రతిభతో శాంతికి ఉపాయాన్ని ఆలోచించాలి. (7)
న కామార్థం సంత్యజేయుర్హి ధర్మం
పాండోః సుతాః సర్వ ఏవేంద్రకల్పాః।
త్వమేవైతత్ ప్రజ్ఞయాజాతశత్రో
సమీకుర్యా యేన శర్మాప్నుయుస్తే॥ 8
ధార్తరాష్ట్రాః పాండవాః సృంజయాశ్చ
యే చాప్యన్యే సంనివిష్టా నరేంద్రాః।
అజాతశత్రూ! ఇంద్రునితో సమానమైన పాండవులు తమ కోరికలకోసం ధర్మాన్ని ఎన్నడూ విడిచిపెట్టరు. కౌరవులు, పాండవులు, సృంజయులు ఇంకా ఇక్కడ ఉన్న రాజన్యులు అంతా క్షేమంగా ఉండే విధంగా నీ ప్రతిభతో నీవే ఈ సమస్యను పరిష్కరించాలి. (8 1/2)
యన్మాబ్రవీద్ ధృతరాష్ట్రో నిశాయామ్
అజాతశత్రో వచనం పితా తే॥ 9
సహామాత్యః సహపుత్రశ్చ రాజన్
సమేత్య తాం వాచమిమాం నిబోధ॥ 10
అజాతశత్రూ! నీ తండ్రి ధృతరాష్ట్రుడు రాత్రి నాతో చెప్పిన ఈ మాటలను నీవు నీ మంత్రులకు, సోదరులకు, పుత్రులకు తెలియజెప్పు. (9,10)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సంజయయానపర్వణి సంజయవాక్యే చతుర్వింశోఽధ్యాయః॥ 24 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సంజయ యానపర్వమను ఉపపర్వమున సంజయవాక్యమను ఇరువది నాల్గవ అధ్యాయము. (24)