23. ఇరువదిమూడవ అధ్యాయము
సంజయుడు యుధిష్ఠిరుని కలసి మాట్లాడుట.
వైశంపాయన ఉవాచ
రాజ్ఞస్తు వచనం శ్రుత్వా ధృతరాష్ట్రస్య సంజయః।
ఉపప్లవ్యం యయౌ ద్రష్టుం పాండవానమితౌజసః॥ 1
వైశంపాయనుడు పలికాడు. జనమేజయా! ధృతరాష్ట్రుని మాటను విని సంజయుడు అమిత బల పరాక్రమాలు గల పాండవులను చూడటానికి ఉపప్లవ్యానికి వెళ్లాడు. (1)
స తు రాజానమాసాద్య కుంతీపుత్రం యుధిష్ఠిరమ్।
అభివాద్య తతః పూర్వం సూతపుత్రోఽభ్యభాషత॥ 2
అతడు ముందుగ కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుని సమీపించి, నమస్కరించి ఇలా అన్నాడు. (2)
గావల్గణిః సంజయః సూతసూనుః
అజాతశత్రుమవదత్ ప్రతీతః।
దిష్ట్వా రాజంస్త్వామరోగం ప్రపశ్యే
సహాయవంతం చ మహేంద్రకల్పమ్॥ 3
గవల్గణ కుమారుడు, సూతపుత్రుడూ ఐన సంజయుడు వెళ్లి యుధిష్ఠిరునితో ప్రసన్నంగా ఇలా అన్నాడు - రాజా! మహేంద్రుని వంటి నిన్ను నీ సహాయకులతో బాటుగా క్షేమంగా ఉండగా నా భాగ్యవశాత్తు చూస్తున్నాను. (3)
అనామయం పృచ్ఛతి త్వాఽఽంబికేయో
వృద్ధో రాజా ధృతరాష్ట్రో మనీషీ।
కచ్చిద్ భీమః కుశలీ పాండవాగ్ర్యః
ధనంజయస్తౌ చ మాద్రీతనూజౌ॥ 4
వృద్ధుడు, బుద్ధిమంతుడు అంబికాతనయుడూ ఐన ధృతరాష్ట్రుడు నీక్షేమాన్ని గురించి అడుగుతున్నాడు. భీముడు, పాండవశ్రేష్ఠుడైన అర్జునుడూ, నకుల సహదేవులూ కుశలమే కదా! (4)
కచ్చిద్ భీమః కుశలీ పాండవాగ్ర్యః
ధనంజయస్తౌ చ మాద్రీతనూజౌ॥ 4
వృద్ధుడు, బుద్ధిమంతుడు, అంబికాతనయుడూ ఐన ధృతరాష్ట్రుడు నీక్షేమాన్ని గురించి అడుగుతున్నాడు. భీముడు, పాండవశ్రేష్ఠుడైన అర్జునుడూ, నకుల సహదేవులూ కుశలమే కదా! (4)
కచ్చిత్ కృష్ణా ద్రౌపదీ రాజపుత్రీ
సత్యవ్రతా వీరపత్నీ సపుత్రా।
మనస్వినీ యత్ర చా వాంఛసి త్వమ్
ఇష్టాన్ కామాన్ భారత స్వస్తికామః॥ 5
భారతా! సత్యవ్రత, వీరపత్ని, అభిమానవతి ఐన ద్రౌపది తన కుమారులతో కుశలమే కదా! నీకు ఇష్టులైన వారంతా తమతమ అభీష్టభోగాలతో కుశలమే కదా! (5)
యుధిష్ఠిర ఉవాచ-
గావల్గణే సంజయ స్వాగతం తే
ప్రీయామహే తే వయం దర్శనేన।
అనామయం ప్రతిజానే తవాహం
సహానుజైః కుశలీ చాస్మి విద్వన్॥ 6
యుధిష్ఠిరుడు పలికాడు. గవల్గణ కుమారా! సంజయా! నీకు స్వాగతం. నీ దర్శనం చేత మేము ఆనందిస్తున్నాము. నేను నా సోదరులతో కుశలంగా ఆరోగ్యంగా ఉన్నాను. (6)
చిరాదిదం కుశలం భారతస్య
శ్రుత్వా రాజ్ఞః కురువృద్ధస్య సూత।
మన్యే సాక్షాద్ దృష్టమహం నరేంద్రం
దృష్ట్వైవ త్వాం సంజయ ప్రీతియోగాత్॥ 7
సంజయా! చాలాకాలం తర్వాత కురువృద్ధుడైన ధృత రాష్ట్రమహారాజు కుశల సమాచారాన్ని విని, నీ ప్రేమవల్ల నిన్ను చూస్తూ ఉంటే సాక్షాత్తుగా ఆ ధృతరాష్ట్రునే చూసినట్లు అనిపిస్తోంది. (7)
పితామహో నః స్థవిరో మనస్వీ
మహాప్రాజ్ఞః సర్వధర్మోపపన్నః।
స కౌరవ్యః కుశలీ తాత భీష్మః
యథా పూర్వం వృత్తిరస్త్వస్య కచ్చిత్॥ 8
నాయనా! సంజయా! మాకు పెద్ద దిక్కు. మనసు గలవాడు, సర్వధర్మాలూ తెలిసిన మా తాత భీష్ముడు కుశలమేనా! మా పట్ల వారి అభిమానం పూర్వం వలే ఉంది గదా! (8)
కచ్చిద్ రాజా ధృతరాష్ట్రః సపుత్రః
వైచిత్రవీర్యః కుశలీ మహాత్మా।
మహారాజో బాహ్లికః ప్రాతిపేయః
కచ్చిద్ విద్వాన్ కుశలీ సూతపుత్ర॥ 9
సంజయా! విచిత్రవీర్యకుమారుడైన ధృతరాష్ట్ర మహారాజు తన కుమారులతో బాటు కుశలమేనా! ప్రతీపుని కుమారుడు, విద్వాంసుడూ ఐన బాహ్లిక మహారాజు కుశలమేనా! (9)
స సోమదత్తః కుశలీ తాత కచ్చిద్
భూరిశ్రవాః సత్యసంధః శలశ్చ।
ద్రోణః సపుత్రశ్చ కృపశ్చ విప్రః
మహేష్వాసాః కచ్చిదేతే ఽప్యరోగాః॥ 10
నాయనా! సోమదత్తుడు, భూరిశ్రవసుడు, సత్య సంధుడైన శలుడు, పుత్రునితోబాటు ద్రోణాచార్యుడు, విప్రశ్రేష్ఠుడైన కృపాచార్యుడు - ఈ మహాధనుర్ధారు లంతా క్షేమమేనా! (10)
సర్వే కురుభ్యః స్పృహయంతి సంజయ
ధనుర్ధరా యే పృథివ్యాం ప్రధానాః।
మహాప్రాజ్ఞాః సర్వశాస్త్రావదాతాః
ధనుర్భృతాం ముఖ్యతమాః పృథివ్యామ్॥ 11
సంజయా! ఈ భూమండలంలోని ప్రధాన ధనుర్ధారులు, మిక్కిలి బుద్ధిమంతులు, సమస్త శాస్త్రజ్ఞానం కలవారూ, ధనుర్ధారులలో ముఖ్యతములూ ఐన వారంతా కౌరవనులతో స్నేహభావంతో ఉన్నారా? (11)
కచ్చిన్మానం తాత లభంత ఏతే
ధనుర్భృత కచ్చిదేతేఽప్యరోగాః।
యేషాం రాష్ట్రే నివసతి దర్శనీయః
మహేష్వాసః శీలవాన్ ద్రోణపుత్రః॥ 12
దర్శనీయుడు, శీలమంతుడు, మహాధానుష్కుడు, అయిన అశ్వత్థామ నివసించే దేశంలో తక్కిన విలుకాండ్రు గౌరవాన్ని పొందుతున్నారా? వారంతా కూడా క్షేమమే కదా. (12)
వైశ్యాపుత్రః కుశలీ తాత కచ్చిత్
మహాప్రాజ్ఞో రాజపుత్రో యుయుత్సుః।
కర్ణోఽమాత్యః కుశలీ తాత కచ్చిత్
సుయోధనో యస్య మందో విధేయః॥ 13
నాయనా! ధృతరాష్ట్రుని వైశ్యపత్నికి కుమారుడైన మహాజ్ఞాని యుయుత్సుడు కుశలమేనా! మూర్ఖుడైన దుర్యోధనుడు ఎవనికి విధేయుడో ఆ కర్ణుడు కుశలమేనా! (13)
స్త్రియో వృద్ధా భారతానాం జనన్యః
మహానస్యో దాసభార్యాశ్చ సూత।
వధ్వః పుత్రా భాగినేయా భగిన్యః
దౌదిత్రా వా కచ్చిదప్యవ్యలీకాః॥ 14
సంజయా! భరతవంశీయుల వృద్ధస్త్రీలు, తల్లులు, వంటకత్తెలు, దాస భార్యలు, కోడండ్రు, కొడుకులు, మేనళ్లుళ్లు. తోబుట్టువులు, దౌహిత్రులు కపటం లేకుండా సంచరిస్తున్నారా? (14)
కచ్చిద్ రాజా బ్రాహ్మణానాం యథావత్
ప్రవర్తతే పూర్వవత్ తాత వృత్తిమ్।
కచ్చిద్ దాయాన్ మామకాన్ ధార్తరాష్ట్రః
ద్విజాతీనాం సంజయ నోపహంతి॥ 15
సంజయా! దుర్యోధనుడు బ్రాహ్మణులపట్ల మునుపటిలా తగినవిధంగా ప్రవర్తిస్తున్నాడా! బ్రాహ్మణుల జీవనంకోసం నేనిచ్చిన గ్రామాదులను దుర్యోధనుడు లాగుకొన లేదుకదా! (15)
కచ్చిద్ రాజా ధృతరాష్ట్రః సపుత్రః
ఉపేక్షతే బ్రాహ్మణాతిక్రమాన్ వై।
స్వర్గస్య కచ్చిన్న తథా వర్త్మభూతామ్
ఉపేక్షతే తేషు సదైవ వృత్తిమ్॥ 16
పుత్రులతో బాటు ధృతరాష్ట్రుడు కూడ బ్రాహ్మణుల పట్ల జరిగిన అపరాధాలను ఉపేక్షించటం లేదు కదా! స్వర్గానికి మార్గం లాంటిది బ్రాహ్మణులకు వృత్తి కల్పించటం. దాన్ని రాజూ ఉపేక్షించడు కదా! (16)
ఏతజ్జ్యోతిశ్చోత్తమం జీవలోకే
శుక్లం ప్రజానాం విహితం విధాత్రా।
తే చేద్ దోషం న నియచ్ఛంతి మందాః
కృత్స్నో నాశో భవితా కౌరవాణామ్॥ 17
బ్రాహ్మణులకు జీవికను కల్పించడమనేది పరలోకాన్ని చూపే గొప్ప వెలుగు. బ్రహ్మ ప్రజలకోసం ఈ తెల్లని జ్యోతిని ఏర్పరచాడు. మూర్ఖులైన కౌరవుల్య్ బ్రాహ్మణులపట్ల జరిగే దోషాల్ని నియంత్రించకపోతే, కౌరవులకు సర్వనాశనమే అవుతుంది. (17)
కచ్చిద్ రాజా ధృతరాష్ట్రః సపుత్రః
బుభూషతే వృత్తిమమాత్యవర్గే।
కచ్చిన్న భేదేన జిజీవిషంతి
సుహృద్రూపా దుర్హృదైశ్చైకమత్యాత్॥ 18
పుత్రులతో కూడిన ధృతరాష్ట్రుడు మంత్రివర్గానికి తగిన విధంగా జీవించడానికి కావలసిన వృత్తిని కల్పిస్తున్నాడా! వారు శత్రువులతో కలిసి మిత్రులుగా ఉంటూనే రాజుకు వ్యతిరేకంగా జీవింపగోరటం లేదు కదా! (18)
కచ్చిన్న పాపం కథయంతి తాత
తే పాండవానాం కురవః సర్వ ఏవ।
ద్రోణః సపుత్రశ్చ కృపశ్చ వీరః
నాస్మాసు పాపాని వదంతి కచ్చిత్॥ 19
నాయనా! సంజయా! కౌరవులంతా కలిసి పాండవులపై దోషాన్ని చెప్పుకొనటం లేదుకదా! పుత్రునితో బాటు ద్రోణుడు, వీరుడైన కృపుడు మా విషయంలో దోషాలను చెప్పటం లేదుకదా! (19)
కచ్చిద్ రాజ్యే ధృతరాష్ట్రం సపుత్రం
సమేత్యాహుః కురవః సర్వ ఏవ।
కచ్చిద్ దృష్ట్వా దస్యుసంఘాన్ సమేతాన్
స్మరంతి పార్థస్య యుధాం ప్రణేతుః॥ 20
కురువంశీయులంతా వెళ్లి ఎప్పుడైనా దుర్యోధనుడితో ఉన్న ధృతరాష్ట్రునితో(మాకు రావలసిన) రాజ్యాన్ని గూర్చి మాట్లాడుతున్నారా! వారిప్పుడైనా రాజ్యంలోని దోపిడీ మూకల్ని చూసి యుద్ధ నిర్వాహకుడైన అర్జునుని స్మరిస్తున్నారా! (20)
మౌర్వీభుజాగ్రప్రహితాన్ స్మ తాత
దోధూయమానేన ధనుర్గుణేన।
గాండీవనున్నాన్ స్తనయిత్నుఘోషాన్
అజిహ్మగాన్ కచ్చిదనుస్మరంతి॥ 21
సంజయా! అల్లెత్రాడు భుజాల వరకు లాగే
ప్రయోగింపబడేవి అర్జునుని బాణాలు, వింటి నారిని కంపింపజేస్తూ, గాండీవం నుండి వెలువడి మేఘం వలె ధ్వనించే అర్జునుని ఆ బాణాలను వారు స్మరిస్తున్నారా! (21)
న చాపశ్యం కంచిదహం పృథివ్యాం
యోధం సమం వాధికమర్జునేన।
యస్యైకషష్టిర్నిశితాస్త్రీక్ష్ణధారాః
సువాససః సమ్మతో హస్తవాపః॥ 22
ఒక్కసారిగా మంచిపిడులు గల అరవైయొక్క తీక్ష్ణబాణాలను ప్రయోగింపగల అర్జునుడితో సమానుడిని కాని, అంతకంటె గొప్ప యోధుని గాని ఈ భూమిమీద నేను చూడలేదు. వాని చేతి నేర్పు ప్రశంసనీయం. (22)
గదాపాణిర్భీమసేన స్తరస్వీ
ప్రవేపయన్ శత్రుసంఘాననీకే।
నాగః ప్రభిన్న ఇవ నడ్వలేషు
చంక్రమ్యతే కచ్చిదేనం స్మరంతి॥ 23
దట్టమైన అడవుల్లో నిర్భయంగా సంచరించే మదపుటేనుగులా యుద్ధరంగంలో శత్రుమూకలను వణికిస్తూ చేతిలో గదతో వేగంగా తిరిగే భీమసేనుని స్మరిస్తున్నారా! (23)
మాద్రీపుత్రః సహదేవః కలింగాన్
సమాగతానజయద్ దంతకూరే।
వామేనాస్యన్ దక్షిణేనైవ యో వై
మహాబలం కచ్చిదేనం స్మరంతి॥ 24
యుద్ధంలో కుడి, యెడమ చేతులతో బాణాలను విసురుతూ తనకెదురైన కళింగ రాజులను జయించిన సహదేవుని స్మరిస్తున్నారా! (24)
పురా జేతుం నకులః ప్రేషితోఽయమ్
శిబీంస్త్రిగర్తాన్ సంజయ పశ్యతస్తే।
దిశం ప్రతీచీం వశమానయన్మే
మాద్రీసుతం కచ్చిదేనం స్మరంతి॥ 25
మునుపు రాజసూయయాగ సందర్భంలో శిబిని, త్రిగర్త దేశరాజులను జయించడానికి వెళ్లిన నకులుడు పశ్చిమ దిక్కునంతా నా అధీనంలోకి తెచ్చాడు. అతనిని స్మరిస్తున్నారా! (25)
పరాభవో ద్వైతవనే య ఆసీద్
దుర్మంత్రితే ఘోషయాత్రాగతానామ్।
యత్ర మందాన్ శత్రువశం ప్రయాతాన్
అమోచయద్ భీమసేనో జయశ్చ॥ 26
దురాలోచనతో ద్వైతవనంలోకి ఘోషయాత్రకు వచ్చిన ధృతరాష్ట్రకుమారులు పరాభవం పొందారు. శత్రువుల అధీనం అయిపోతున్న మందబుద్ధులను భీమార్జునులు బంధవిముక్తుల్ని చేశారు. ఆ సంగతిని స్మరిస్తున్నారా! (26)
అహం పశ్చాదర్జునమభ్యరక్షం
మాద్రీపుత్రౌ భీమసేనో ఽప్యరక్షత్।
గాండీవధన్వా శత్రుసంఘానుదస్య
స్వస్త్యాగమత్ కచ్చిదేనం స్మరంతి॥ 27
అప్పుడు నేను యజ్ఞం ద్వారా వెనుకనుండి అర్జునుని రక్షించాను. భీమసేనుడు నకుల సహదేవులను రక్షించాడు. గాండీవధారి అర్జునుడు శత్రువులను పారద్రోలి క్షేమంగా తిరిగి వచ్చాడు. ఈ విషయాన్ని కౌరవులు స్మరిస్తున్నారా! (27)
న కర్మణా సాధునైకేన నూనం
సుఖం శక్యం వై భవతీహ సంజయ।
సర్వాత్మనా పరిజేతుం వయం చేత్
న శక్నుమో ధృతరాష్ట్రస్య పుత్రమ్॥ 28
సంజయా! మేము దుర్యోధనుని దాన, భేద, దండాలనే ఉపాయాలతో జయింపలేకపోతే, సామోపాయంచేత అతనిని అసలే జయింపలేము, ఇది నిశ్చయం. (28)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సంజయయాన పర్వణి యుధిష్ఠిరప్రశ్నే త్రయోవింశోఽధ్యాయః॥ 23 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సంజయ యానపర్వమను ఉపపర్వమున యుధిష్ఠిర ప్రశ్నమను ఇరువది మూడవ అధ్యాయము. (23)