25. ఇరువది ఐదవ అధ్యాయము
సంజయుడు ధృతరాష్ట్రుని సందేశమును యుధిష్ఠిరుని వినిపించుట.
యుధిష్ఠిర ఉవాచ
సమాగతాః పాండవాః సృంజయాశ్చ
జనార్దనో యుయుధానో విరాటః।
యత్తే వాక్యం ధృతరాష్ట్రానుశిష్టం
గావల్గణే బ్రూహి తత్ సూతపుత్ర॥ 1
సూతపుత్రా! సంజయా! పాండవులు, సృంజయులు, శ్రీకృష్ణుడు, సాత్యకి, విరాటరాజూ..... అందరూ ఇక్కడ ఉన్నారు. ధృతరాష్ట్రమహారాజు నీచే పంపిన సందేశాన్ని వినిపించు. (1)
సమ్జయ ఉవాచ
అజాతశత్రుం చ వృకోదరం చ
ధనంజయం మాద్రవతీసుతౌ చ।
ఆమంత్రయే వాసుదేవం చ శౌరిం
యుయుధానం చేకితానం విరాటమ్॥ 2
పాంచాలానామధిపం చైవ వృద్ధం
ధృష్టద్యుమ్నం పార్షతం యాజ్ఞసేనిమ్।
సర్వే వాచం శృణుతేమాం మదీయాం
వక్ష్యామి యాం భూతిమిచ్ఛన్ కురూణామ్॥ 3
సంజయుడు పలికాడు. అజాతశత్రూ! భీమసేనా! అర్జునా! నకుల సహదేవులారా! వాసుదేవా! సాత్యకీ! చేకితానా! విరాటరాజా పాంచాలాధిపా ద్రుపదమహారాజా! ధృష్టద్యుమ్నా! ద్రౌపదీ! మిమ్మందరినీ ప్రార్థిస్తున్నాను. కురువంశీయుల క్షేమాన్ని కోరి నేను చెప్పే మాటలను మీరంతా వినండి. (2,3)
శమం రాజా ధృతరాష్ట్రోఽభినందన్
అయోజయత్ త్వరమాణో రథం మే।
సభ్రాతృపుత్ర స్వజనస్య రాజ్ఞః
తద్ రోచతాం పాండవానాం శమోఽస్తు॥ 4
ధృతరాష్ట్రమహారాజు శాంతిని కోరుతూ నన్ను అభినందించు, శీఘ్రంగా రథాన్ని ఏర్పాటు చేసి, ఇక్కడకు పంపాడు. సోదరులతో, పుత్రులతో, స్వజనులతో కూడియున్న ధృతరాష్ట్రుని ఈ శాంతి సందేశం పాండవులకు కూడా రుచిస్తే శాంతి ఏర్పడుతుంది. (4)
సర్వైర్ధర్మైః సముపేతాస్తు పార్థాః
సంస్థానేన మార్దవేనార్జవేన।
జాతాః కులే హ్యనృశంసా వదాన్యాః
హ్రీనిషేవాః కర్మణాం నిశ్చయజ్ఞాః॥ 5
కుంతీపుత్రులారా! మీరు మీ దివ్యమైన శరీరం చేత, మృదుస్వభావం చేత, ఋజువర్తనం చేత అన్ని ధర్మాలతో కూడి ఉన్నారు. ఉన్నత వంశంలో పుట్టిన మీరు దయాళురు, ఉదారులు, బిడియం కలవారు, కార్యనిశ్చయం తెలిసిన వారూను. (5)
న యుజ్యతే కర్మ యుష్మాసు హీనం
సత్వం హి వస్తాదృశం భీమసేనాః।
ఉద్భాసతే హ్యంజనబిందువత్ తద్
శుభ్రే వస్త్రే యద్ భవేత్ కిల్బిషం వః॥ 6
భయంకరమైన సేనలు గల పాండవులారా! నీచమైన పని మీకు యుక్తం కాదు. మీ యొక్క సత్వగుణం (బలం) అటువంటిది కదా! మీ యొక్క చిన్నదోషమైనా అది తెల్లని వస్త్రం మీద నల్లని మరకలా స్ఫుటంగా కనబడుతుంది. (6)
సర్వక్షయో దృశ్యతే యత్ర కృత్స్నః
పాపోదయో నిరయో ఽభావసంస్థః।
కస్తత్ కుర్యాజ్జాతు కర్మ ప్రజావన్
పరాజయో యత్ర సమో జయశ్చ॥ 7
యుద్ధం అందరికీ నాశనం కలిగిస్తుంది. పాపాన్ని కల్గిస్తుంది. చివరికి శూన్యాన్ని మిగులుస్తుంది. సుఖం లేనిది, గెలుపు, ఓటమీ కూడ సమానమైన యుద్ధాన్ని తెలిసి తెలిసి ఎవడు చేస్తాడు. (7)
తే వై ధన్యాః యైః కృతం జ్ఞాతికార్యం
తే వై పుత్రాః సుహృదో బాంధవాశ్చ।
ఉపక్రుష్టం జీవితం సంత్యజేయుః
యతః కురూణాం నియతో వైభవః స్యాత్॥ 8
జ్ఞాతులకు హితమైన పనిని చేసేవారే ధన్యులు వారే స్నేహితులు, బంధువులూను. కురువంశానికి తప్పనిసరిగా అభ్యుదయం కలగాలంటే, కురువంశీయులు నిందితమన జీవనాన్ని (తమలో తాము కలహించుకోవడం)
విడిచిపట్టాలి. (8)
తే చేత్ కురూనమశిష్యాథ పార్థాః
నిర్ణీయ సర్వాన్ ద్విషత్ నిగృహ్య।
సమం వస్తజ్జీవితం మృత్యునా స్యాద్
యజ్జీవధ్వం జ్ఞాతివధే న సాధు॥ 9
పృథానందనులారా! మీరు శత్రువులైన కురువంశీయులను శాసించి యుద్ధమే నిశ్చయించుకొని వారిని బంధించినా, వధించినా, ఆ తరువాత మీ జీవితం మరణంతో సమానమే. జ్ఞాతివధ చేస్తే మీరు జీవింతురుగాక! కాని అది మంచిది కాదు. (9)
కో హ్యేవ యుష్మాన్ సహ కేశవేన
సచేకితానాద్ పార్షతబాహుగుప్తాన్।
ససాత్యకీన్ విషహేత ప్రజేతుం
లబ్ధ్వాపి దేవాన్ సచివాన్ సహేంద్రాన్॥ 10
ధృష్టద్యుమ్నుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉండగా, భగవంతుడైన శ్రీకృష్ణుడు, చేకితానుడు, సాత్యకి, సహాయకులుగా ఉండగా, ఇంద్రునితో బాటు దేవతలంతా దండెత్తినా మిమ్మల్ని ఎవడూ నిలపలేడు. (10)
కో వా కురూన్ ద్రోణభీష్మాభిగుప్తాన్
అశ్వత్థామ్నా శల్యకృపాదిభిశ్చ।
రణే విజేతుం విషహేత రాజన్
రాధేయగుప్తాన్ సహ భూమిపాలైః॥ 11
రాజా! అదే విధంగా యుద్ధంలో ద్రోణుడు, భీష్ముడు, అశ్వత్థామ, శల్యుడు, కృపుడు, కర్ణుడు, మున్నగు వారిచే రక్షింపబడుతూ ఉన్న కౌరవులను ఎవడు జయింపగలడు? (11)
మహద్ బలం ధార్తరాష్ట్రస్య రాజ్ఞః
కో వై శక్తో హంతుమక్షీయమాణః।
సోఽహం జయే చైవ పరాజయే చ
నిఃశ్రేయసం నాధిగచ్ఛామి కించిద్॥ 12
దుర్యోధనుని వద్ద చాలపెద్ద సైన్యం ఉంది. తాను తరిగిపోకుండాఎవడూ దాన్ని నశింపజేయలేడు. కాబట్టి జయమైనా, అపజయమైనా నాకేమీ మంచి కనబడటం లేదు. (12)
కథం హి నీచా ఇవ దౌష్కులేయాః
నిర్ధర్మార్థం కర్మ కుర్యుశ్చ పార్థాః।
సోఽహం ప్రసాద్య ప్రణతో వాసుదేవం
పాంచాలానామధిపం చైవ వృద్ధమ్॥ 13
కృతాంజలిః శరణం వః ప్రపద్యే
కథం స్వస్తి స్యాత్ కురు సృంజయానామ్।
న హ్యేవమేవం వచనం వాసుదేవః
ధనంజయో వా జాతు కించిన్న కుర్యాత్॥ 14
పాండవులారా! చెడువంశంలో పుట్టిన నీచుల వలె పాండవులు ధర్మరహితమైన పనిని ఎలా చేస్తారు? వాసుదేవునకు ద్రుపదునకూ నమస్కరించి, కురుసృంజయ వంశీయులకు క్షేమం ఎలా కలుగుతుందో చూడమని చేతులు జోడించి మిమ్మల్ని శరణువేడుతున్నాను. వాసుదేవుడు, అర్జునుడు నా మాటను లక్ష్యపెట్టరని నేననుకోవడం లేదు. (13,14)
ప్రాణాన్ దద్యాద్ యాచమానః కుతోఽవ్యద్
ఏతద్ విద్వన్ సాధనార్థం బ్రవీమి।
ఏతద్ రాజ్ఞో భీష్మపురోగమస్య
మతం యద్ వః శాంతిరిహోత్తమా స్యాత్॥ 15
ఇంతే కాదు నేనడిగితే అర్జునుడు ప్రాణాలైనా ఇవ్వగలడు. ఇక ఇతర విషయాల సంగతి చెప్పడమెందుకు? విద్వాంసుడవైన ధర్మరాజా! కార్యం సాధించడంకోసం ఇదంతా చెపుతున్నాను. భీష్మ ధృతరాష్ట్రుల అభిమతం కూడా ఇదే. దీనివల్ల మీ అందరికి గొప్ప శాంతి లభిస్తుంది. (15)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సంజయయాన పర్వణి సంజయవాక్యే పంచవింశోఽధ్యాయః॥ 25 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సంజయయానపర్వమను ఉపపర్వమున సంజయవాక్యమను ఇరువది ఐదవ అధ్యాయము. (25)