70. డెబ్బదియవ అధ్యాయము
(వైవాహిక పర్వము)
అర్జునుడు విరాటునకు ధర్మరాజును గూర్చి తెలుపుట.
వైశంపాయన ఉవాచ
తతస్తృతీయే దివసే భ్రాతరః పంచ పాండవాః।
స్నాతాః శుక్లాంబరధరాః సమయే చరితవ్రతాః॥ 1
యుధిష్ఠిరం పురస్కృత్య సర్వాభరణభూషితాః।
ద్వారి మత్తా యథా నాగాః భ్రాజమానా మహారథాః॥ 2
విరాటస్య సభాం గత్వా భూమిపాలాసనేష్వథ।
నిషేదుః పావకప్రఖ్యాః సర్వే ధిష్ణ్యేష్వివాగ్నయః॥ 3
వైశంపాయనుడు చెప్పాడు. జనమేజయా! తరువాత నియమితసమయం వరకు తమ ప్రతిజ్ఞను పాటించి అగ్నివలె తేజరిల్లే ఆ ఐదుగురు పాండవులు మూడవరోజున స్నానంచేసి, తెల్లని వస్త్రాలు ధరించి, రాజోచిత భూషణాలు ధరించి రాజసభలో ద్వారం వద్ద నిలచియుండే మదోన్మత్తగజరాజులవలె శోభిల్లారు. వారు యుధిష్ఠిరమహారాజును ముందుంచుకొని రాజసభలో ప్రవేశించి రాజులకోసం ఉంచబడిన సింహాసనాలమీద కూర్చున్నారు. అపుడు వారు వేరువేరు వేదికల మీద ప్రకాశిస్తున్న అగ్నుల వలె ప్రకాశించారు. (1-3)
తేషు తత్రోపవిష్టేషు విరాటః పృథివీపతిః।
ఆజగామ సభాం కర్తుం రాజకార్యాణి సర్వశః॥ 4
వారు అక్కడ అలా కూర్చుని ఉండగానే విరాటరాజు కొలువుతీరి రాజకార్యాలు నిర్వహించడానికి సభకు వచ్చాడు. (4)
శ్రీమతః పాండవాన్ దృష్ట్వా జ్వలతః పావకానివ।
ముహూర్తమివ చ ధ్యాత్వా సరోషః పృథివీపతిః॥ 5
అథ మత్స్యోఽబ్రవీత్ కంకం దేవరూపమివ స్థితమ్।
మరుద్గణైపాసీనం త్రిదశానామివేశ్వరమ్॥ 6
ప్రజ్వరిల్లుతున్న అగ్నులవలె తేజస్వులూ, శోభాసంపన్నులూ అయిన పాండవులను చూసి విరాట మహారాజు రెండుక్షణాలు మనసులో తబ్బిబ్బుపడ్డాడు. తరువాత కోపంతో దేవగణ పరివేష్టితుడైన దేవేంద్రుని వలె ప్రకాశిస్తున్న కంకునితో ఇలా అన్నాడు. (5,6)
స కిలాక్షాతివాపస్త్వం సభాస్తారో మయా కృతః।
అథ రాజాసనే కస్మాత్ ఉపవిష్టస్త్వలంకృతః॥ 7
"కంకా! నేను నిన్ను పాచికలాడే సభ్యునిగా నియమించాను గదా!. ఈ రోజు నీవు అలంకరించుకొని సింహాసనం మీద ఎలా కూర్చోగలిగావు?' (7)
వైశంపాయన ఉవాచ
పరిహాసేప్సయా వాక్యం విరాటస్య నిశమ్య తత్।
స్మయమానోఽర్జునో రాజన్ ఇదం వచనమబ్రవీత్॥ 8
వైశంపాయను డన్నాడు. జనమేజయా! పరిహాసానికి అన్నట్లుగా ఉన్న విరాటరాజు మాటలను విని అర్జునుడు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు. (8)
అర్జున ఉవాచ
ఇంద్రస్యార్ధాసనం రాజన్ అయమారోఢుమర్హతి।
బ్రహ్మణ్యః శ్రుతవాం స్త్యాగీ యజ్ఞశీలో దృఢవ్రతః॥ 9
అర్జునుడు అన్నాడు-' రాజా! నీ సింహాసనమే అన్నమాట ఏమిటి? ఇతడు ఇంద్రుని అర్ధాసనమెక్కటానికే అర్హుడు. ఈతడు బ్రాహ్మణభక్తుడు. శాస్త్రపండితుడు. త్యాగి. యజ్ఞశీలుడు. దృఢంగా తనవ్రతాన్ని కొన సాగించగలిగినవాడు. (9)
ఏష విగ్రహవాన్ ధర్మః ఏష వీర్యవతాం వరః।
ఏష బుద్ధ్యాధికో లోకే తపసాం చ పరాయణమ్॥ 10
ఏషోఽస్త్రం వివిధం వేత్తి త్రైలోక్యే సచరాచరే।
న చైవాన్యః పుమాన్ వేత్తి న వేత్స్యతి కదాచన॥ 11
ఇతడు మూర్తిభవించిన ధర్మం. పరాక్రమవంతు లైన పురుషులలో శ్రేష్ఠుడు. ఈ లోకంలో అందరికంటె బుద్ధిమంతుడు, తపస్సుకు ఆశ్రయమైనవాడు. ఇతనికి అనేకవిధాలైన అస్త్రాలు తెలుసును. వానిని ఈ చరా చరమైన ముల్లోకాలలో వేరొకరెవరూ తెలుసుకోలేదు, తెలుసుకోలేరు. (10,11)
న దేవా నాసురాః కేచిత్ న మనుష్యా న రాక్షసాః।
గంధర్వాయక్షప్రవరాః సకిన్నరమహోరగాః॥ 12
దేవతలకు, అసురులకు, మనుష్యులకు, రాక్షసులకు, గంధర్వులకు, యక్షులకు, కిన్నరులకు, మహానాగులకూ కూడా తెలియని అస్త్రాలు అన్నీ ఇతనికి తెలుసును. (12)
దీర్ఘదర్శీ మహాతేజాః పౌరజానపదప్రియః।
పాండవానామతిరథః యజ్ఞధర్మపరో వశీ॥ 13
ఇతడు దీర్ఘదర్శి. మహాతేజస్వి, పట్టణవాసులకు, పల్లెవాసులకు కూడా మిక్కిలి ఇష్టుడు. పాండవులలో అతిరథుడైన వీరుడు, యజ్ఞధర్మానుష్ఠానాలలో లగ్నమై ఉండేవాడు, మనసును, ఇంద్రియాలను వశంలో ఉంచుకునేవాడు. (13)
మహర్షికల్పో రాజర్షిః సర్వలోకేషు విశ్రుతః।
బలవాన్ ధృతివాన్ దక్షః సత్యవాదీ జితేంద్రియః।
ధనైశ్చ సంచయైశ్చైవ శక్రవైశ్రవణోపమః॥ 14
ఇతడు మహర్షితుల్యుడు, రాజర్షి, సర్వలోక విఖ్యాతుడు, బలవంతుడు, ధైర్యవంతుడు, చతురుడు, సత్యవాది, జితేంద్రియుడు, ధనభోగంలోను, సంగ్రహంలోను ఇంద్ర కుబేరులతో సమానుడు. (14)
యథా మనుర్మహాతేజాః లోకానాం పరిరక్షితా।
ఏవమేష మహాతేజాః ప్రజానుగ్రహకారకః॥ 15
మహాతేజస్వి అయిన మనువు సమస్తలోకాలను రక్షిస్తూ ఉన్నట్లు ఈ మహాతేజస్వి అయిన మహారాజు కూడా ప్రజలను అనుగ్రహిస్తూ ఉంటాడు. (15)
అయం కురూణామృషభః ధర్మరాజో యుధిష్ఠిరః।
అస్య కీర్తిః స్థితా లోకే సూర్యస్యేవోద్యతః ప్రభా॥ 16
ఇతడే కురువంశంలో సర్వశ్రేష్ఠుడయిన ధర్మరాజు యుధిష్ఠిరుడు. ఉదయించే సూర్యుని కాంతిలాగ ఇతని కీర్తి సుఖదాయకమై సమస్తలోకాలలో వ్యాపించింది. (16)
సంసరంతి దిశః సర్వాః యశసోఽస్య ఇవాంశవః।
ఉదితస్యేవ సూర్యస్య తేజసోఽనుగభస్తయః॥ 17
సూర్యుడు ఉదయించేటపుడు ఆ కాంతికిరణాలు అన్నిదిక్కులకు వ్యాపించినట్లుగా ఇతని సత్కీర్తితో పాటు ఆ సుధాధవళమైన కిరణాలు కూడా అన్నిదిక్కులలో వ్యాపిస్తున్నాయి. (17)
ఏవం దశసహస్రాణి కుంజరాణాం తరస్వినామ్।
అన్వయుః పృష్ఠతో రాజన్ యావదధ్యావసత్ కురూన్॥ 18
రాజా! ఈ మహారాజు కురుదేశాలలో నివసించే టపుడు వేగంగల పదివేల ఏనుగులు ఇతనిని అనుసరించేవి. (18)
త్రింశదేనం సహస్రాణి రథాః కాంచనమాలినః।
సదశ్వైరుపసంపన్నాః పృష్ఠతోఽనుయయుస్తదా॥ 19
అలాగే మంచి గుఱ్ఱాలు పూన్చిన సువర్ణమాలాలంకృతాలైన ముప్పదివేల రథాలు కూడా ఆ సమయంలో ఇతనిని అనుసరిస్తూ ఉండేవి. (19)
ఏనమష్టశతాః సూతాః సుమృష్టమణికుండలాః।
అబ్రువన్ మాగధైః సార్ధం పురా శక్రమివర్షయః॥ 20
మహర్షి గణాలు ఇంద్రుని స్తుతించినట్లుగా, విశుద్ధమైన మణిమయకుండలాలు ధరించిన ఎనిమిదివందలమంది సూతులు, మాగధులు ఇతని గుణగణాలను మునుపు గానం చేసేవారు. (20)
ఏవం నిత్యముపాసంత కురవః కింకరా యథా।
సర్వే చ రాజన్ రాజానః ధనేశ్వరమివామరాః॥ 21
దేవగణాలు ధనాధ్యక్షుడైన కుబేరుని కొలిచినట్లు సమస్తరాజులు, కౌరవులు కింకరులవలె ఇతనిని నిత్యం సేవిస్తూ ఉండేవారు. (21)
ఏష సర్వాన్ మహీపాలాన్ కరదాన్ సమకారయత్।
వైశ్యానివ మహాభాగః వివశాన్ స్వవశానపి॥ 22
అష్టాశీతి సహస్రాణి స్నాతకానాం మహాత్మనామ్।
ఉపజీవంతి రాజానమ్ ఏనం సుచరితవ్రతమ్॥ 23
ఈ మహాభాగుడైన నరేశుడు ఈ దేశంలోని సమస్తరాజులను, వైశ్యులవలె వశ్యులను చేసికొని కప్పం కట్టించుకొన్నాడు. ఉత్తమమైన వ్రతాన్ని పాటించే ఈ రాజు దగ్గర ప్రతిదినం ఎనభైవేల మంది బుద్ధిమంతులైన స్నాతకులు ఆశ్రమం పొందేవారు. (22,23)
ఏష వృద్ధాననాథాంశ్చ పంగూనంధాంశ్చ మానవాన్।
పుత్రవత్ పాలయామాస ప్రజాధర్మేణ వై విభుః॥ 24
ఇతడు వృద్ధులను, అనాథలను, కుంటివారిని, గ్రుడ్డివారిని కూడా మిక్కిలి స్నేహంతో పోషిస్తూ ఉండేవాడు. ఈ మహారాజు తనప్రజలను ధర్మబద్ధంగా పుత్రులవలె రక్షిస్తూ ఉండేవాడు. (24)
ఏష ధర్మే దమే చైవ క్రోధే చాపి జితవ్రతః।
మహాప్రసాదో బ్రహ్మణ్యః సత్యవాదీ చ పార్థివః॥ 25
ఈ రాజు ధర్మమునందు, ఇంద్రియ నిగ్రహము నందు తత్పరుడు. క్రోధాన్ని వశంలో ఉంచుకునే దౄఢప్రతిజ్ఞ పూనినవాడు. మిక్కిలి దయాళువు. బ్రాహ్మణభక్తి కలవాడు. సత్యవాది. (25)
శీఘ్రం తాపేన చైతస్య తప్యతే స సుయోధనః।
సగణః సహ కర్ణేన సౌబలేనాపి వా విభుః॥ 26
దుర్యోధనుడు శక్తిశాలి అయినా కర్ణుడు, శకుని మొదలయిన గణాలతో కూడినా ఇతని ప్రతాపంతో అతడు తీవ్రంగా పరితపించే వాడు. (26)
న శక్యంతే హ్యస్యగుణాః ప్రసంఖ్యాతుం నరేశ్వరః।
ఏష ధర్మపరో నిత్యమ్ ఆనృశంసశ్చ పాండవః॥ 27
ఏవం యుక్తో మహారాజః పాండవః పార్థివర్షభః।
కథం నార్హతి రాజార్హమ్ ఆసనం పృథివీపతే॥ 28
నరేశ్వరా! ఇతని సద్గుణాలు ఎన్నశక్యం కాదు. ఈ పాండునందనుడు నిత్యధర్మపరాయణుడు. దయాస్వభావుడు. రాజా! సమస్తరాజులకు తలమానికమైన పాండునందనుడు మహారాజు యుధిష్ఠిరుడు. ఇన్ని సర్వోత్తమ గుణాలు కలిగినవాడు రాజోచితమైన ఆసనానికి అర్హుడు ఎందుకు కాడు? (27,28)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి వైవాహికపర్వణి పాండవప్రకాశే సప్తతితమోఽధ్యాయః॥ 70 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున వైవాహిక పర్వమను ఉపపర్వమున
పాండవులు వెల్లడి అగుట అను డెబ్బదియవ అధ్యాయము. (70)